కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విధేయత చూపించే వారిని యెహోవా ఆశీర్వదించి కాపాడతాడు

విధేయత చూపించే వారిని యెహోవా ఆశీర్వదించి కాపాడతాడు

విధేయత చూపించే వారిని యెహోవా ఆశీర్వదించి కాపాడతాడు

“నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.”​—⁠సామెతలు 1:⁠33.

1, 2. దేవునికి విధేయత చూపడం ఎందుకు ప్రాముఖ్యం? ఉపమాన సహితంగా వివరించండి.

పసుపురంగులో బొద్దుగా కనిపిస్తున్న ఆ కోడిపిల్లలు హడావిడిగా పచ్చగడ్డిలో తమ ముక్కులతో పొడుస్తూ ఏదో తింటున్నాయి, వాటికి పైన గిరికీలు కొడుతున్న డేగ గురించి వాటికి ఏమాత్రం తెలీదు. హఠాత్తుగా, వాటి తల్లి భయంకరమైన హెచ్చరికా పిలుపు వెలువరించి తన రెక్కలు చాచింది. కళ్ళు మూసి తెరిచేంతలో కోడిపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి రెక్కల మాటున సురక్షితంగా దాక్కున్నాయి. డేగ తన దాడిని ఉపసంహరించుకుంది. * ఇందులో నేర్చుకునే పాఠం ఏమిటి? విధేయత ప్రాణాలను కాపాడుతుంది!

2 ఆ పాఠం నేడు ప్రత్యేకంగా క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే సాతాను దేవుని ప్రజలపై సర్వవినాశక దాడిని చేస్తున్నాడు. (ప్రకటన 12:​9, 12, 17) మన ఆధ్యాత్మికతను నాశనం చేయడమే వాడి లక్ష్యం, అలా చేస్తేనే మనం యెహోవా అనుగ్రహాన్నీ నిత్యజీవ నిరీక్షణనూ కోల్పోతామన్నది వాడి పన్నాగం. (1 పేతురు 5:⁠8) కానీ, మనం దేవునికి సన్నిహితంగా ఉండి, ఆయన వాక్యం ద్వారా ఆయన సంస్థ ద్వారా మనకు లభించే నడిపింపును సత్వరమే అమలులో పెడితే ఆయన సంరక్షక కాపుదల మనకు తప్పక లభిస్తుందని నిశ్చయతను కలిగివుండగలము. “ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును” అని వ్రాశాడు కీర్తనకర్త.​—⁠కీర్తన 91:⁠4.

అవిధేయ జనాంగం దాడికి లొంగిపోతుంది

3. అనేకసార్లు అవిధేయత చూపించినందుకు ఇశ్రాయేలుకు ఎలాంటి ఫలితం లభించింది?

3 ఇశ్రాయేలు జనాంగం యెహోవాకు విధేయంగా ఉన్నప్పుడు అది ఆయన సంరక్షక కాపుదల నుండి క్రమంగా ప్రయోజనం పొందింది. అయితే, ఆ ప్రజలు అనేకసార్లు తమ సృష్టికర్తను విడిచిపెట్టి చెక్క దేవుళ్ళను రాతి దేవుళ్ళను అనుసరించారు​—⁠“ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను” అనుసరించారు. (1 సమూయేలు 12:​21) అలా శతాబ్దాలపాటు తిరుగుబాటు చేసిన తర్వాత, అది ఒక జనాంగముగా ఇక సరిదిద్దలేని రీతిలో భ్రష్టత్వంలో కూరుకుపోయింది. అందుకే యేసు ఇలా విలపించాడు: “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.”​—⁠మత్తయి 23:37, 38.

4. యెహోవా యెరూషలేమును విడిచిపెట్టేశాడన్న విషయం సా.శ. 70 లో ఎలా స్పష్టమైంది?

4 మతభ్రష్ట ఇశ్రాయేలును యెహోవా విడిచిపెట్టేశాడన్న విషయం సా.శ. 70 లో చాలా విషాదకరమైన రీతిలో స్పష్టమైంది. ఆ సంవత్సరంలో రోమా సైన్యం, గ్రద్ద చిహ్నం ఉన్న తమ జెండాలను గాలిలో ఊపుకుంటూ డేగలా దూసుకువచ్చి యెరూషలేమును ఊచకోత కోసింది. ఆ సమయంలో ఆ నగరం పస్కా పండుగను ఆచరిస్తున్నవారితో కిక్కిరిసిపోయి ఉంది. వారు అర్పించిన ఎన్నెన్నో బలులు వారికి దైవానుగ్రహాన్ని సంపాదించిపెట్టలేకపోయాయి. అది, అవిధేయ రాజైన సౌలుతో సమూయేలు పలికిన మాటల విషాదభరిత జ్ఞాపికగా ఉంది: “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.”​—⁠1 సమూయేలు 15:⁠22.

5. యెహోవా ఎలాంటి విధేయతను కోరుతున్నాడు, అలాంటి విధేయత సాధ్యమేనని మనకు ఎలా తెలుసు?

5 విధేయత చూపాలని యెహోవా ఖండితంగా కోరుతున్నప్పటికీ అపరిపూర్ణ మానవుల పరిమితులు ఆయనకు బాగా తెలుసు. (కీర్తన 130:​3, 4) ఆయన కోరేవి హృదయ నిష్కల్మషత్వం, విశ్వాస ప్రేమలపై ఆధారపడిన విధేయత, తనను అప్రీతిపరచడానికి ఉండే ఆరోగ్యకరమైన భయము. (ద్వితీయోపదేశకాండము 10:​12, 13; సామెతలు 16:⁠6; యెషయా 43:​10; మీకా 6:⁠8; రోమీయులు 6:​17) భయంకరమైన పరీక్షలను, చివరికి మృత్యువును కూడా ఎదుర్కొని యథార్థతతో నిలిచిన ‘క్రైస్తవపూర్వ సాక్షుల గొప్ప మేఘము’ అలాంటి విధేయత సాధ్యమేనని ప్రదర్శించి చూపింది. (హెబ్రీయులు 11:​36, 37; 12:​1, 2) వారు యెహోవా హృదయాన్ని ఎంతగా సంతోషపెట్టారో కదా! (సామెతలు 27:​11) అయితే ఇతరులు మొదట్లో విశ్వసనీయంగానే ఉన్నా విధేయ మార్గంలో కొనసాగడంలో విఫలమయ్యారు. వారిలో ఒకరు ప్రాచీన యూదా రాజైన యోవాషు.

తప్పుడు సహవాసాల మూలంగా నాశనమైపోయిన ఒక రాజు

6, 7. యెహోయాదా సజీవంగా ఉన్నప్పుడు యోవాషు ఎలాంటి రాజుగా ఉన్నాడు?

6 రాజైన యోవాషు శిశువుగా ఉన్నప్పుడే తనపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. ఆయన ఏడేండ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు ప్రధానయాజకుడైన యెహోయాదా రహస్యంగా జీవిస్తున్న ఆయన్ను ఎంతో ధైర్యంగా బయటికి తీసుకువచ్చి రాజుగా చేశాడు. దైవభయం ఉన్న యెహోయాదా యోవాషుకు తండ్రిగా సలహాదారుడిగా ఉన్నందునే యౌవనస్థుడైన ఆ పరిపాలకుడు “యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు . . . యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.”​—⁠2 దినవృత్తాంతములు 22:10-23:​1, 11; 24:​1, 2.

7 యోవాషు చేసిన మంచి పనుల్లో యెహోవా దేవాలయాన్ని పునరుద్ధరించడం ఒకటి​—⁠ఇది “యోవాషు హృదయాభిలాష.” ఆయన మరమ్మతు పనులకు ఆర్థిక మద్దతునివ్వడానికిగాను “మోషే నిర్ణయించిన” దేవాలయ పన్ను యూదావారి నుండి యెరూషలేమువారి నుండి వసూలు చేయాల్సిన అవసరాన్ని గురించి ప్రధాన యాజకుడైన యెహోయాదాకు గుర్తుచేశాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి దానికి విధేయత చూపాలని యౌవనస్థుడైన ఈ రాజును ప్రోత్సహించడంలో యెహోయాదా సఫలీకృతుడయ్యాడని స్పష్టమవుతోంది. తత్ఫలితంగా, దేవాలయము అందులోని ఉపకరణాల సంబంధంగా పని త్వరితగతిన పూర్తయ్యింది.​—⁠2 దినవృత్తాంతములు 24:​4, 6, 7, NW, 14; ద్వితీయోపదేశకాండము 17:⁠18.

8. (ఎ) యోవాషు ఆధ్యాత్మిక మరణానికి ప్రాధమికంగా దారితీసింది ఏమిటి? (బి) రాజు అవిధేయత చివరికి ఆయన ఏమి చేసేలా నడిపించింది?

8 విచారకరంగా, యెహోవాపట్ల యోవాషు విధేయత శాశ్వతకాలం లేదు. కారణమేమిటి? దేవుని వాక్యం మనకిలా చెబుతోంది: “యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు చేసిన యీ యపరాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.” యూదా అధిపతుల చెడు ప్రభావం దేవుని ప్రవక్తల మాటలను రాజు పెడచెవినబెట్టేలా కూడా చేసింది. ఆ ప్రవక్తల్లో ఒకరైన యెహోయాదా కుమారుడైన జెకర్యా యోవాషును ప్రజలను వారి అవిధేయతనుబట్టి వారిని ధైర్యంగా గద్దించాడు. పశ్చాత్తాపపడడానికి బదులుగా యోవాషు జెకర్యాను రాళ్ళతో కొట్టించి చంపించాడు. యోవాషు ఎంత నిర్దయుడిగా అవిధేయుడిగా మారాడు​—⁠ఇదంతా కేవలం ఆయన దుష్టసాంగత్య ప్రభావానికి లొంగిపోవడం మూలంగానే!​—⁠2 దినవృత్తాంతములు 24:​17-22; 1 కొరింథీయులు 15:​33.

9. అవిధేయత ఘోరమైన పొరపాటని నొక్కిచెప్పే ఎలాంటి ఫలితం చివరికి యోవాషుకు, అతని అధిపతులకు లభించింది?

9 యెహోవాను విడిచిపెట్టిన తర్వాత యోవాషుకు దుష్ట అధిపతులైన ఆయన సహవాసులకు ఏమి జరిగింది? సిరియనుల సైన్యం​—⁠కేవలం ఒక “చిన్న దండు”​—⁠యూదాపైకి వచ్చి “శేషములేకుండ జనుల అధిపతుల నందరిని హతము” చేసింది. ఆ ఆక్రమణదారులు, రాజు తన స్వంత ఆస్తులను, దేవాలయములోని వెండి బంగారాలను తమ వశంచేసేలా బలవంతంచేశారు. యోవాషు బ్రతికిపోయినా చాలా బలహీనుడైపోయి రోగగ్రస్థుడయ్యాడు, చివరికి తన స్వంత సేవకులలో కుట్రదారులు ఆయనను హత్యచేశారు. (2 దినవృత్తాంతములు 24:​23-25; 2 రాజులు 12:​17, 18) యెహోవా ఇశ్రాయేలుతో పలికిన మాటలు ఎంత సత్యం: “సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల . . . శాపములన్నియు నీకు సంభవించును.”​—⁠ద్వితీయోపదేశకాండము 28:⁠15.

విధేయత మూలంగా రక్షించబడిన ఒక కార్యదర్శి

10, 11. (ఎ) యెహోవా బారూకుకు ఇచ్చిన సలహా గురించి జాగ్రత్తగా ఆలోచించడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది? (బి) యెహోవా బారూకుకు ఏమని సలహా ఇచ్చాడు?

10 మీ క్రైస్తవ పరిచర్యలో మీరు కలిసే ప్రజల్లో చాలామంది సువార్త విషయంలో ఆసక్తిని చూపించట్లేదని కొన్నిసార్లు మీరు నిరుత్సాహానికి గురవుతున్నారా? డబ్బున్నవాళ్ళు భోగవిలాసాల్లో తేలియాడుతున్నారని వారిని చూసీ వారి విలాసాలను చూసీ మీరు అప్పుడప్పుడు కొంచెమన్నా అసూయపడుతుంటారా? అలాగైతే, యిర్మీయా వద్ద లేఖికుడిగా ఉన్న బారూకు గురించి, ఆయనకు యెహోవా ఇచ్చిన ప్రేమపూర్వక సలహా గురించి జాగ్రత్తగా ఆలోచించండి.

11 బారూకు ఒక ప్రవచనాత్మక సందేశాన్ని వ్రాసే పనిలో ఉండగా ఆయనపై యెహోవా తన అవధానాన్ని కేంద్రీకరించాడు. ఎందుకు? ఎందుకంటే, బారూకు తన జీవితంలోని పరిస్థితుల గురించి వ్యథ చెందడం ప్రారంభించాడు, ఆయన దేవుని సేవ అనే తన ప్రత్యేక ఆధిక్యతకన్నా తనకోసం మరి శ్రేష్ఠమైనదానిని వాంఛించడం ప్రారంభించాడు. బారూకు వైఖరిలో వచ్చిన ఈ మార్పును గమనించిన యెహోవా ఆయనకు స్పష్టమైన దయాపూర్వకమైన సలహా ఇచ్చాడు: “నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను.”​—⁠యిర్మీయా 36:⁠4; 45:⁠5.

12. ప్రస్తుత విధానంలో మనకోసం “గొప్పవాటిని” ఎందుకు వెదకకూడదు?

12 యెహోవా బారూకుతో పలికిన మాటల్లో, యిర్మీయాతోపాటు విశ్వాసంగా ధైర్యంగా తన సేవ చేసిన ఆ మంచి మనిషి పట్ల ఆయనకున్న ప్రగాఢమైన చింతను మీరు గ్రహించగలుగుతున్నారా? అదేవిధంగా ఈ విధానంలో, సిరిసంపదలు సంపాదించే అవకాశాలని భావించి ఆ మార్గాలను వెంబడించే శోధనలో పడిపోయేవారి విషయంలో నేడు కూడా యెహోవా చాలా ప్రగాఢ చింతను వ్యక్తంచేస్తున్నాడు. అలాంటివారు అనేకమంది, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ఆధ్యాత్మిక సహోదరులు ప్రేమపూర్వకంగా అందించిన దిద్దుబాటుకు బారూకులా ప్రతిస్పందించడం సంతోషకరమైన విషయం. (లూకా 15:​4-7) అవును, ఈ విధానంలో తమకోసం “గొప్పవాటిని” వెదికే వారికి ఎలాంటి భవిష్యత్తూ లేదని మనమందరం గ్రహిద్దాము. అలాంటివారు నిజమైన సంతోషాన్ని పొందలేరు, అంతకన్నా ఘోరమైనదేమిటంటే, వారు ఈ లోకమూ దాని స్వార్థపూరిత ఆశలతోపాటు త్వరలోనే గతించిపోతారు.​—⁠మత్తయి 6:​19, 20; 1 యోహాను 2:15-17.

13. బారూకు గురించిన వృత్తాంతం నమ్రత విషయంలో ఎలాంటి పాఠాన్ని నేర్పిస్తుంది?

13 బారూకు గురించిన వృత్తాంతం మనకు నమ్రత విషయంలో కూడా చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. యెహోవా బారూకుకు సూటిగా సలహా ఇవ్వకుండా యిర్మీయా ద్వారా మాట్లాడాడని గమనించండి. యిర్మీయాలోని అపరిపూర్ణతలూ ఆయనలోని కాస్త వింతగా కనిపించే అలవాట్లూ బారూకుకు బహుశ చాలా బాగా తెలిసివుండవచ్చు. (యిర్మీయా 45:​1, 2) అయినా బారూకు గర్వంగా ప్రతిస్పందించలేదు; ఆయన నమ్రతగా ఆ సలహాకు అసలు మూలం యెహోవా అని గ్రహించాడు. (2 దినవృత్తాంతములు 26:​3, 4, 16; సామెతలు 18:​12; 19:​20) కాబట్టి మనం “ఏ తప్పితములోనైనను చిక్కుకొని” దేవుని వాక్యం నుండి ఆవశ్యకమైన సలహాను పొందితే, బారూకు పరిణతిని ఆధ్యాత్మిక వివేచనను నమ్రతను అనుకరిద్దాము.​—⁠గలతీయులు 6:⁠1.

14. మన పైని నాయకులుగా ఉన్నవారికి విధేయత చూపించడం మనకు ఎందుకు మంచిది?

14 మనం అలా నమ్రతాపూర్వక వైఖరిని కలిగివుంటే అది, మనకు సలహా ఇచ్చే వారికి కూడా సహాయకరంగా ఉంటుంది. హెబ్రీయులు 13:⁠17 ఇలా అంటోంది: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.” పెద్దలు తమ కాపరి పనిలో ఎంతో కష్టతరమైన ఈ అంశాన్ని నిర్వర్తించడానికి ధైర్యాన్ని, జ్ఞానాన్ని, యుక్తిని దయచేయమని ఎంత తరచుగా యెహోవా ఎదుట తమ హృదయాలను కుమ్మరించి ప్రార్థిస్తారో కదా! మనం ‘అట్టివారిని సన్మానిద్దాం.’​—⁠1 కొరింథీయులు 16:​17, 18.

15. (ఎ) బారూకుపట్ల తన నమ్మకాన్ని యిర్మీయా ఎలా ప్రదర్శించాడు? (బి) నమ్రతగా విధేయత చూపించినందుకు బారూకు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాడు?

15 బారూకు తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాడన్న విషయం స్పష్టమవుతోంది; ఎందుకంటే యిర్మీయా ఆ తర్వాత ఆయనకు అత్యంత కష్టతరమైన నియామకాన్ని ఇచ్చాడు​—⁠అదేమిటంటే, దేవాలయానికి వెళ్ళి స్వయంగా తానే వ్రాసిన, యిర్మీయా పలికిన తీర్పు సందేశాన్ని బిగ్గరగా చదివి వినిపించాలి. బారూకు విధేయత చూపించాడా? అవును చూపించాడు, ఆయన “ప్రవక్తయైన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్లు” సమస్తాన్ని చేశాడు. నిజానికి, ఆయన అదే సందేశాన్ని యెరూషలేము అధిపతులకు కూడా చదివి వినిపించాడు, అందుకు ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకోవలసి వచ్చివుంటుందనడంలో సందేహం లేదు. (యిర్మీయా 36:​1-6, 8, 14, 15) దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఆ నగరం బబులోనీయుల చేతుల్లో పడినప్పుడు, తాను యెహోవా హెచ్చరికను అనుసరించి తనకోసం “గొప్పవాటిని” వెదకడం మానుకున్నందున బ్రతికి బట్టకట్టినందుకు బారూకు యెహోవాకు తాను ఎంత కృతజ్ఞుడినని భావించి ఉంటాడో కదా!​—⁠యిర్మీయా 39:​1, 2, 11, 12; 43:​5, 6.

విధేయత ముట్టడి సమయంలో ప్రాణాలు కాపాడింది

16. సా.శ.పూ. 607 లో బబులోను ముట్టడి వేస్తుండగా యెహోవా యెరూషలేములోని యూదుల పట్ల కనికరాన్ని ఎలా ప్రదర్శించాడు?

16 సా.శ.పూ. 607 లో యెరూషలేముకి అంతం వచ్చినప్పుడు విధేయత చూపించిన వారిపట్ల యెహోవా కనికరం మళ్ళీ ప్రదర్శితమైంది. ముట్టడి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నప్పుడు యెహోవా యూదులకు ఇలా చెప్పాడు: “జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను. ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, . . . బయటకు వెళ్లి మిమ్మును ముట్టడివేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.” (యిర్మీయా 21:​8, 9) యెరూషలేము నివాసులు వినాశనానికి అర్హులే అయినప్పటికీ, అంత విషమపరిస్థితుల్లోనూ చివరి నిమిషంలో కూడా యెహోవా తనకు విధేయత చూపే వారిపట్ల కనికరాన్ని ప్రదర్శించాడు. *

17. (ఎ) ‘కల్దీయుల పక్షముగా ఉండమని’ ముట్టడివేయబడిన యూదులకు చెప్పమని యెహోవా తనకు నిర్దేశించినప్పుడు యిర్మీయా విధేయత ఏ రెండు మార్గాల్లో పరీక్షించబడింది? (బి) ధైర్యంగా విధేయత చూపిన యిర్మీయా మాదిరి నుండి మనం ఎలా ప్రయోజనం పొందగలము?

17 లొంగిపొమ్మని యూదులకు చెప్పడం యిర్మీయా విధేయతను కూడా పరీక్షించిందనడంలో సందేహం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన దేవుని నామం విషయంలో ఎంతో ఆసక్తిని కలిగివున్నాడు. తమ విజయాన్ని నిర్జీవమైన విగ్రహాలకు ఆపాదించే శత్రువులు దానిని అవమానించడం ఆయనకు ఇష్టంలేదు. (యిర్మీయా 50:​2, 11; విలాపవాక్యములు 2:​16) అంతేగాక, లొంగిపొమ్మని ప్రజలకు చెప్పడం ద్వారా తన ప్రాణాలను కూడా పెద్ద ప్రమాదంలో పడవేసుకుంటున్నాడని యిర్మీయాకు తెలుసు, ఎందుకంటే తన మాటలు రాజద్రోహంతో కూడినవని అనేకులు వర్ణించవచ్చు. అయినా, ఆయన భీతిచెందలేదు, విధేయతతో యెహోవా ప్రకటనలను గురించి మాట్లాడాడు. (యిర్మీయా 38:​3, 4, 17, 18) యిర్మీయాలా మనం కూడా ప్రజలకు అంతగా రుచించని సందేశాన్నే వినిపిస్తున్నాము. యేసు తృణీకరించబడినది ఆ సందేశం మూలంగానే. (యెషయా 53:⁠3; మత్తయి 24:⁠9) కాబట్టి మనం మనుష్యులకు ‘భయపడక,’ యిర్మీయాలా ధైర్యంగా యెహోవాకు విధేయత చూపిద్దాం, ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచుదాం.​—⁠సామెతలు 29:⁠25.

గోగు దాడిచేసినప్పుడు విధేయత

18. యెహోవా సేవకులు భవిష్యత్తులో ఏ విధేయతా పరీక్షలు ఎదుర్కొంటారు?

18 త్వరలోనే, చరిత్రలో మునుపెన్నడూ చూడనటువంటి “మహా శ్రమ”లో సాతాను దుష్ట విధానం సమస్తం నాశనం చేయబడుతుంది. (మత్తయి 24:​20, 21) ఆ సమయం రాకముందూ ఆ సమయంలోనూ దేవుని ప్రజలు తమ విశ్వాసం విధేయతల విషయంలో గొప్ప పరీక్షలు ఎదుర్కొంటారనడంలో సందేహం లేదు. ఉదాహరణకు, సాతాను “మాగోగు దేశపువాడగు గోగు” పాత్రలో యెహోవా సేవకులపై సర్వవినాశక దాడి చేస్తాడనీ, “మేఘము భూమిని కమ్మినట్లు” “బహు విస్తారమైన సైన్యముగా” వర్ణించబడుతోన్న సైన్యాలను సంసిద్ధం చేస్తాడనీ బైబిలు చెబుతోంది. (యెహెజ్కేలు 38:​2, 14-16) వారి సంఖ్యతో ఏమాత్రం సరితూగనివారిగా, నిరాయుధులుగా ఉన్న యెహోవా దేవుని ప్రజలు, విధేయులను కాపాడడానికి ఆయన జాపిన “రెక్కల” మాటున ఆశ్రయాన్ని పొందుతారు.

19, 20. (ఎ) ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రం వద్ద ఉన్నప్పుడు వారు విధేయత చూపడం ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది? (బి) ఎఱ్ఱ సముద్ర వృత్తాంతం గురించి ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం నేడు మనకు ఎలా ప్రయోజనకరంగా ఉండగలదు?

19 ఈ పరిస్థితి మనకు ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి నిర్గమించిన సందర్భాన్ని గుర్తుకుతెస్తుంది. వినాశకరమైన పది తెగుళ్ళతో ఐగుప్తీయులను మొత్తిన తర్వాత యెహోవా తన ప్రజలను వాగ్దాన దేశం వైపు వెళ్ళే అతి దగ్గరి మార్గం గుండా కాక ఎఱ్ఱ సముద్రము వైపుకి నడిపించాడు; అక్కడ వారిని చుట్టుముట్టి వారిపై సులభంగా దాడి చేయగలిగే అవకాశం ఉంది. సైనిక వ్యూహం ప్రకారం చూస్తే అది చాలా వినాశకరమైన ఎత్తుగా కనిపిస్తుంది. మీరు గనుక అక్కడ ఉండివుంటే, మోషే ద్వారా యెహోవా పలికిన మాటలకు విధేయత చూపించివుండేవారా? వాగ్దాన దేశం వేరే దిశలో ఉందని తెలిసివున్నా పూర్తి నమ్మకంతో ఎఱ్ఱ సముద్రంవైపు నడిచివుండేవారా?​—⁠నిర్గమకాండము 14:1-4.

20 నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా, యెహోవా తన ప్రజలను ఎంతటి మహాద్భుతమైన శక్తి ప్రదర్శనతో విడిపించాడో గ్రహిస్తాము. అలాంటి వృత్తాంతాలను అధ్యయనం చేయడానికి వాటిని గురించి ధ్యానించడానికి మనం సమయాన్ని తీసుకుంటే అవి మన విశ్వాసాన్ని ఎంతగా బలపరచగలవో కదా! (2 పేతురు 2:⁠9, 10) ఆ బలమైన విశ్వాసం, ఆయన కోరుతున్నవి మానవ తర్కానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్న సమయాల్లో సహితం మనం యెహోవాకు విధేయత చూపేందుకు మనల్ని దృఢపరుస్తుంది. (సామెతలు 3:​5, 6) కాబట్టి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘శ్రద్ధతో బైబిలు అధ్యయనం, ప్రార్థన, ధ్యానం వంటివి చేస్తూ అదే సమయంలో దేవుని ప్రజలతో క్రమంగా సహవసిస్తూ నా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి నేను కృషిచేస్తున్నానా?’​—⁠హెబ్రీయులు 10:​24, 25; 12:1-3.

విధేయత నిరీక్షణనిస్తుంది

21. యెహోవాకు విధేయత చూపేవారికి నేడూ భవిష్యత్తులోనూ ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

21 యెహోవాకు విధేయత చూపించడాన్ని తమ జీవిత విధానంగా చేసుకునేవారు ఇప్పుడు కూడా సామెతలు 1:⁠33వ వచనం నెరవేర్పును అనుభవిస్తారు, అక్కడిలా ఉంది: “[విధేయతతో] నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.” ఓదార్పుకరమైన ఈ మాటలు రాబోయే యెహోవా పగతీర్చుకునే దినంలో ఎంత అద్భుతరీతిలో అన్వయించబడతాయో కదా! నిజానికి, యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: ‘ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.’ (లూకా 21:​28) స్పష్టంగా, దేవునికి విధేయులుగా ఉన్నవారికి మాత్రమే ఈ మాటలను పాటించే నమ్మకం ఉంటుంది.​—⁠మత్తయి 7:⁠21.

22. (ఎ) యెహోవా ప్రజలు నమ్మకం ఉంచడానికి ఏ కారణం ఉంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ విషయాలు చర్చించబడతాయి?

22 నమ్మకం కలిగివుండడానికి మరో కారణం ఏమిటంటే, “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.” (ఆమోసు 3:⁠7) గతంలో ప్రవక్తలకు తన ఆత్మ ప్రేరేపణనిచ్చినట్లు నేడు యెహోవా ప్రేరేపణనివ్వడు, బదులుగా ఆయన తన ఇంటివారికి సమయానుకూలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని దయచేయడానికి నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడి తరగతిని నియమించాడు. (మత్తయి 24:​45-47) కాబట్టి, మనం ఆ ‘దాసుడి’ పట్ల విధేయతాపూర్వక వైఖరిని కలిగివుండడం ఎంత ప్రాముఖ్యం! తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తున్నట్లుగా, అలాంటి విధేయత ‘దాసుడి’ యజమానియైన యేసు పట్ల మన వైఖరిని కూడా స్పష్టం చేస్తుంది. “ప్రజలు . . . విధేయులై” ఉండవలసింది ఆయనకే.​—⁠ఆదికాండము 49:​10.

[అధస్సూచీలు]

^ పేరా 1 తరచూ పిరికిదానిగా చిత్రించబడినా, “ఒక తల్లికోడి తన పిల్లల్ని అపాయం నుండి రక్షించుకోవడానికి తన ప్రాణాలకు తెగించి పోరాడుతుంది” అని జంతురక్షక సంఘం ప్రచురించిన ఒక పుస్తకం తెలియజేస్తోంది.

^ పేరా 16 అనేకమంది యూదులు కల్దీయుల ‘పక్షం’ వహించారని, అందుకు వారి ప్రాణాలు దక్కాయి గానీ చెరలోకి మాత్రం వెళ్ళాల్సివచ్చిందని యిర్మీయా 38:⁠19 వెల్లడిచేస్తోంది. యిర్మీయా మాటలకు ప్రతిస్పందనగానే వారు అలా లొంగిపోయారా లేదా అన్నది మనకు చెప్పబడలేదు. ఏదేమైనా వారు బ్రతకడం యిర్మీయా ప్రవక్త మాటలను రూఢిపరుస్తోంది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• ఇశ్రాయేలు పదేపదే అవిధేయులైనందుకు వారికి లభించిన ప్రతిఫలం ఏమిటి?

• రాజైన యోవాషు తన సహవాసుల మూలంగా తన జీవితం ప్రారంభంలోనూ అటు తర్వాతా ఎలా ప్రభావితుడయ్యాడు?

• బారూకు నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు?

• ప్రస్తుత విధానం అంతమవుతుండగా విధేయులైన యెహోవా ప్రజలకు భయపడడానికి ఎలాంటి కారణమూ ఎందుకు లేదు?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

యెహోయాదా నడిపింపులో యౌవనస్థుడైన యోవాషు యెహోవాకు విధేయుడిగా ఉన్నాడు

[15వ పేజీలోని చిత్రం]

దుష్టసాంగత్యము యోవాషు దేవుని ప్రవక్తను చంపేలా అతనిని ప్రభావితం చేసింది

[16వ పేజీలోని చిత్రం]

మీరు యెహోవాకు విధేయత చూపించి, అత్యద్భుతమైన ఆయన సంరక్షక శక్తిని కళ్ళారా చూసివుండేవారా?