కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంక్షోభ సమయాల్లో ఓదార్పు

సంక్షోభ సమయాల్లో ఓదార్పు

సంక్షోభ సమయాల్లో ఓదార్పు

ఈరోజుల్లో వార్తలు ఏమాత్రం ఓదార్పునివ్వడం లేదు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “ప్రస్తుత పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటున్నాయంటే ఆరు గంటల వార్తలు వినేంత ధైర్యం చేయగలమా లేదా అనేది తరచూ తేల్చుకోలేకపోతున్నాము.” యుద్ధాలు, ఉగ్రవాద చర్యలు, వేదనలు, నేరాలు, రోగాలు ఈ లోకంపైకి వెల్లువలా వచ్చిపడుతున్నాయి​—⁠ఈ కీడులన్నీ ఇంతవరకూ మనపై సూటిగా ప్రభావం చూపించకపోయుంటే ఇక ముందు చూపించవచ్చు.

ఈ పరిస్థితుల గురించి బైబిలు ముందే ఖచ్చితంగా తెలియజేసింది. యేసు మన కాలాలను వర్ణిస్తూ గొప్ప యుద్ధాలు, తెగుళ్ళు, కరవులు, భూకంపాలు సంభవిస్తాయని చెప్పాడు. (లూకా 21:​10, 11) అలాగే, ప్రజలు క్రూరులుగా, ధనాపేక్షులుగా, సజ్జనద్వేషులుగా ఉండే “అపాయకరమైన కాలముల” గురించి అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ఆయన ఆ సమయాన్ని “అంత్యదినము”లని పేర్కొన్నాడు.​—⁠2 తిమోతి 3:​1-5.

కాబట్టి, ప్రపంచ పరిస్థితులను వర్ణించడంలో, వార్తలకూ బైబిలు ముందుగానే తెలియజేసినదానికీ కొంత సారూప్యత ఉంది. అయితే ఆ సారూప్యత అంత వరకే. వార్తలు ఇవ్వని ఒక దృక్కోణాన్ని బైబిలు ఇస్తుంది. దుష్టత్వం ఎందుకింత ఉందనే విషయాన్నే గాక భవిష్యత్తు ఏమై ఉంటుందనే విషయాన్ని కూడా మనం దేవుని ప్రేరేపిత వాక్యం నుండి అర్థం చేసుకోవచ్చు.

దేవుడు దుష్టత్వాన్నెలా దృష్టిస్తాడు?

మన కాలంలోని వేదనభరితమైన పరిస్థితులను దేవుడు ఎలా దృష్టిస్తాడో బైబిలు వివరిస్తుంది. ప్రస్తుతమున్న కష్టాలను ఆయన ముందుగానే గ్రహించినప్పటికీ, ఆయన వాటిని ఆమోదించనూ ఆమోదించడు, అవి నిరంతరం కొనసాగడానికీ అనుమతించడు కూడా. ఎందుకంటే అపొస్తలుడైన యోహాను “దేవుడు ప్రేమాస్వరూపి” అని వ్రాశాడు. (1 యోహాను 4:⁠8) యెహోవాకు ప్రజలమీద ఎంతో శ్రద్ధ ఉంది, ఆయన సమస్త చెడుతనాన్నీ ద్వేషిస్తున్నాడు. కాబట్టి మనం ఓదార్పు కోసం దేవునివైపు తిరగడం సముచితమైనదే. ఎందుకంటే ఆయన మంచివాడు, వాత్సల్యంగలవాడు, భూమిమీది నుండి దుష్టత్వాన్ని నిర్మూలించే శక్తీ నిర్మూలించాలన్న కోరికా రెండూ ఆయనకున్నాయి. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: ‘[దేవుడు నియమించిన పరలోక రాజు] దరిద్రులు మొఱ్ఱపెట్టగా వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును, కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.’​—⁠కీర్తన 72:​12-14.

వేదనలను అనుభవిస్తున్నవారిపై మీరు జాలిపడతారా? బహుశా జాలిపడుతుండవచ్చు. తదనుభూతి అనే లక్షణాన్ని యెహోవాయే మనలో ఉంచాడు, ఎందుకంటే మనం ఆయన పోలికగా సృష్టించబడ్డాము. (ఆదికాండము 1:​26, 27) కాబట్టి, మానవులు పడుతున్న బాధలను యెహోవా అర్థం చేసుకోగలడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. యెహోవాను వేరే ఎవరికన్నా సన్నిహితంగా ఎరిగివున్న యేసు, యెహోవాకు మన పట్ల ఎంతో ఆసక్తి ఉందనీ, ఆయన ఎంతో వాత్సల్యం గలవాడనీ బోధించాడు.​—⁠మత్తయి 10:​29-31.

దేవుడు మానవజాతి విషయమై శ్రద్ధ కలిగివున్నాడని సృష్టి సహితం సాక్ష్యమిస్తోంది. ఆయన “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు” అని యేసు చెప్పాడు. (మత్తయి 5:​45) దేవుడు “ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని” అపొస్తలుడైన పౌలు లుస్త్ర పట్టణస్థులకు చెప్పాడు.​—⁠అపొస్తలుల కార్యములు 14:​17.

ఎవరు బాధ్యులు?

దేవుడు “గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను” అని కూడా పౌలు లుస్త్రలోని ప్రజలకు చెప్పాడన్నది గమనించదగిన విషయం. కాబట్టి, నేడు తామున్న దుర్భరమైన పరిస్థితులకు చాలామేరకు దేశాలు లేదా ప్రజలే బాధ్యులు గానీ దేవుడు నిందార్హుడు కాడు.​—⁠అపొస్తలుల కార్యములు 14:​16.

మరైతే చెడ్డ విషయాలు జరగడానికి యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడు? దీని గురించి ఆయన ఎప్పటికైనా ఏదైనా చర్య తీసుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కేవలం ఆయన వాక్యంలోనే లభిస్తాయి. ఎందుకంటే ఆ సమాధానాలు మరో ఆత్మ ప్రాణితోనూ అదృశ్య ఆత్మ సామ్రాజ్యంలో అతడు లేవదీసిన ఒక వివాదాంశంతోనూ ముడిపడి ఉన్నాయి.

[4వ పేజీలోని చిత్రాలు]

మానవులకు తదనుభూతి ఉంది. మరి మానవులు అనుభవిస్తున్న బాధలకు దేవుడు మాత్రం ప్రతిస్పందించడా?

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

కవర్‌: యుద్ధ ట్యాంక్‌:UN PHOTO 158181/J. Isaac; భూకంపం:San Hong R-C Picture Company

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

పైన ఎడమవైపు, క్రొయెషియా: UN PHOTO 159208/S. వైట్‌హౌస్‌; ఆకలితో అలమటిస్తున్న బిడ్డ: UN PHOTO 146150 BY O. MONSEN