కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“అపవాదిని ఎదిరించుడి”

“అపవాదిని ఎదిరించుడి”

“అపవాదిని ఎదిరించుడి”

“అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”​—⁠యాకోబు 4:⁠7.

1. నేటి లోకాన్ని ఎలా వర్ణించవచ్చు, అభిషిక్తులు వారి సహవాసులు జాగరూకులై ఎందుకు ఉండాలి?

“దేవుడు మాయమైపోయాడు, గానీ దయ్యం ఇంకా ఉంది.” ఫ్రెంచి రచయిత ఆండ్రే మాల్రాక్స్‌ వ్రాసిన ఆ మాటలు నేడు మనం జీవిస్తున్న లోక పరిస్థితులకు చక్కగా అన్వయించవచ్చు. ఎందుకంటే, మానవులు చేసే పనులు దేవుని చిత్తాని కన్నా సాతాను దౌష్ట్యాలను ఎక్కువగా ప్రతిబింబిస్తున్నాయి. “సమస్తబలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న” మానవులను సాతాను తప్పుదారి పట్టిస్తున్నాడు. (2 థెస్సలొనీకయులు 2:​9, 10) అయితే ఈ “అంత్య దినములలో” సాతాను తన ప్రయత్నాలను మాత్రం, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన” దేవుని సేవకులపై కేంద్రీకరిస్తూ, అభిషిక్త క్రైస్తవులపై యుద్ధం చేస్తున్నాడు. (2 తిమోతి 3:⁠1; ప్రకటన 12:​9, 17) ఈ సాక్షులూ, భూ నిరీక్షణగల వారి సహవాసులూ జాగరూకులై ఉండాలి.

2. సాతాను హవ్వను ఎలా ప్రలోభంలో పడేశాడు, అపొస్తలుడైన పౌలు ఎలాంటి భయాన్ని వ్యక్తం చేశాడు?

2 సాతాను మోసం చేయడంలో మహా నిపుణుడు. సర్పాన్ని అడ్డుగా పెట్టుకుని వాడు, హవ్వ తాను దేవుని నుండి స్వతంత్రంగా ఉండడం ద్వారా ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండగలదన్న ఆలోచనలో పడిపోయేలా ఆమెను మోసం చేశాడు. (ఆదికాండము 3:​1-6) దాదాపు నాలుగు వేల సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు కొరింథులోని అభిషిక్త క్రైస్తవులు సాతాను జిత్తులకు బలౌతారేమోనని భయాన్ని వ్యక్తంచేశాడు. పౌలు ఇలా వ్రాశాడు: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.” (2 కొరింథీయులు 11:⁠3) సాతాను ప్రజల మనస్సులను భ్రష్టపరిచి వారి ఆలోచనా విధానాన్ని వక్రీకరిస్తాడు. హవ్వను ప్రలోభంలో పడేసినట్లే అతడు, క్రైస్తవులు తప్పుగా తర్కించుకునేలా చేయగలడు. యెహోవా ఆయన కుమారుడూ తిరస్కరించే పనుల్లోనే తమ ఆనందం దాగివుందని వారు ఊహించుకునేలా చేయగలడు.

3. అపవాది నుండి యెహోవా ఎలాంటి కాపుదలను అందజేస్తున్నాడు?

3 ఏమరుపాటుగా ఉన్న పక్షుల్ని పట్టుకోవడానికి వలలు పన్నే పిట్టలోడితో సాతానుని పోల్చవచ్చు. సాతాను వలల్ని తప్పించుకోవడానికి మనం “మహోన్నతుని చాటున నివసించ” వలసి ఉంటుంది, అంటే తమ పనుల ద్వారా యెహోవా విశ్వసర్వాధిపత్యాన్ని గుర్తించేవారికి ఆయన అందించే సూచనార్థక కాపుదల స్థలంలో నివసించవలసి ఉంటుంది. (కీర్తన 91:​1-3) మనం “అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు,” దేవుడు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, సంస్థ ద్వారా అందజేసే కాపుదల సమస్తం మనకు కావాలి. (ఎఫెసీయులు 6:​11) ‘తంత్రములు’ అని అనువదించబడిన గ్రీకు పదాన్ని “జిత్తులు” లేదా “మోసాలు” అని అనువదించవచ్చు. నిస్సందేహంగా అపవాది యెహోవా సేవకులను ప్రలోభపెట్టడానికి చేసే ప్రయత్నాల్లో ఎన్నో జిత్తులు, మోసాలు ఉపయోగిస్తాడు.

సాతాను తొలి క్రైస్తవుల కోసం పన్నిన వలలు

4. తొలి క్రైస్తవులు ఎలాంటి వాతావరణంలో జీవించారు?

4 సా.శ. మొదటి రెండు శతాబ్దాల్లో రోమా సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరుకున్న సమయంలో క్రైస్తవులు జీవించారు. పాక్స్‌ రోమానా (రోమా శాంతి) విధానం మూలంగా వాణిజ్యం వర్ధిల్లుతోంది. దీంతో పరిపాలక వర్గాల వారికి ఎంతో విరామ సమయం లభించింది, ప్రజానీకం తిరుగుబాటు చేయకుండా ఉండేలా వారికి వినోదం సమృద్ధిగా లభించే ఏర్పాట్లు పాలకులు చేశారు. కొన్ని సమయాల్లోనైతే సెలవు దినాల సంఖ్య పని దినాల సంఖ్యతో సమానంగా ఉండేది. నాయకులు ప్రజల సొమ్మునే ఉపయోగించి వారికి ఆహారాన్ని సర్కస్‌ వినోదాలను అందించారు. దాంతో అటు ప్రజల కడుపులు నిండుగా ఉండేవి, ఇటు వారి మనస్సులు ఎటో ఒకవైపు మళ్ళించబడుతుండేవి.

5, 6. (ఎ) క్రైస్తవులు రోమన్ల థియేటర్లకు యాంఫీథియేటర్లకు అలవాటుగా వెళ్ళడం ఎందుకు సముచితం కాదు? (బి) సాతాను ఎలాంటి తంత్రాన్ని ఉపయోగించాడు, క్రైస్తవులు దాన్నుండి ఎలా తప్పించుకోగలిగారు?

5 ఈ పరిస్థితి తొలి క్రైస్తవులకు ప్రమాదాన్ని వాటిల్లజేసిందా? అపొస్తలుల కాలం తర్వాత జీవించిన టెర్టూలియన్‌ వంటి రచయితల రచనల్లో కనబడే హెచ్చరికలను పరిశీలిస్తే, అప్పటి కాలాల్లో విరామ సమయాల్లో ప్రజలు చేసే పనుల్లో చాలామట్టుకు నిజ క్రైస్తవులకు ఆధ్యాత్మిక నైతిక ప్రమాదాలను వాటిల్లజేసే వాటితో నిండివున్నాయి. ఉదాహరణకు, పండుగలు క్రీడల్లో అత్యధికం అన్య దేవతల గౌరవార్థం జరుపబడేవి. (2 కొరింథీయులు 6:​14-18) రంగస్థలాల్లో ప్రదర్శించబడే ఎన్నో సాంప్రదాయిక నాటకాలు సహితం ఘోరమైన అనైతికతతో నిండివుండేవి లేదా అత్యంత హింసాత్మకంగా ఉండేవి. కాలం గడిచే కొద్దీ సాంప్రదాయిక నాటకాల మీద ప్రజలకున్న అభిరుచి తగ్గిపోయి, వాటి స్థానంలో అశ్లీలభరితమైన ఏకపాత్రాభినయాలు వచ్చాయి. ప్రాచీన రోములో దైనందిన జీవితం (ఆంగ్లం) అనే తన పుస్తకంలో చరిత్రకారుడైన ఝారోమ్‌ కార్కోపీనో ఇలా అంటున్నాడు: “ఈ నాటికల్లో నటీమణులు పూర్తిగా వివస్త్రలు అయ్యేందుకు అనుమతించబడేవారు . . . రక్తపాతం విపరీతంగా జరిగేది. . . . నాటికలు వక్రబుద్ధికి పరాకాష్ఠ ఏమిటో ప్రదర్శిస్తూ రాజధానిలోని ప్రజలను గుప్పిట్లో పెట్టుకున్నాయి. అలాంటి ప్రదర్శనలు చూసి వారు అసహ్యపడలేదు, ఎందుకంటే యాంఫీథియేటరులోని భయంకరమైన ఊచకోతలు ఎంతోకాలం ముందే వారి భావాలను భావరహితం చేసి వారి సహజప్రవృత్తులను స్తబ్దుగా చేసేశాయి.”​—⁠మత్తయి 5:​27, 28.

6 యాంఫీథియేటర్లలో గ్లాడియేటర్లు ఒకరినొకరు చంపుకునేవారు, లేదా వారు క్రూర మృగాలతో పోరాడుతూ వాటిని చంపడమో వాటి చేతుల్లో చావడమో జరిగేది. మొదట్లో శిక్షవిధించబడిన నేరస్థులూ ఆ తర్వాత అనేకమంది క్రైస్తవులూ భయంకరమైన మృగాలకు ఆహారంగా వేయబడేవారు. ఆ తొలికాలాల్లో సహితం, అనైతికత పట్ల హింస పట్ల ప్రజలకు ఉండే ఏహ్యభావం మొద్దుబారేలాచేసి అవి సర్వసాధారణమన్నట్లు దృష్టించేలా వారి మనస్సులను స్తబ్దుగా చేసి, వారు వాటి వెంటపడేలా చేయడమే సాతాను తంత్రంగా ఉంది. ఆ వలలో చిక్కుకోకుండా ఉండడానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే, థియేటర్లకు యాంఫీథియేటర్లకు దూరంగా ఉండడమే.​—⁠1 కొరింథీయులు 15:32, 33.

7, 8. (ఎ) రథాల పందేలకు హాజరవడం ఒక క్రైస్తవుడికి ఎందుకు జ్ఞానయుక్తం కాదు? (బి) క్రైస్తవులను వలలోకి లాగడానికి సాతాను రోమన్‌ స్నానశాలలను ఎలా ఉపయోగించి ఉండగలిగేవాడు?

7 కోడిగుడ్డు ఆకారంలోని విస్తారమైన ఎరీనాల్లో జరిగే రథాల పందేలు చాలా ఉత్తేజభరితంగా ఉండేవనడంలో సందేహం లేదు, కానీ అవి క్రైస్తవులకు అంగీకారం కాదు ఎందుకంటే అక్కడ హాజరైన ప్రజలు హింసాత్మకంగా మారేవారు. వీక్షకుల్లో కొందరు తమలోతాము ఘర్షణపడేవారని మూడవ శతాబ్దంలోని ఒక రచయిత నివేదించాడు, ఆ ఎరీనాలోనే బయటివైపు ఉన్న దుకాణాల్లో “జ్యోతిష్కులు, వేశ్యలు తమ వ్యాపారాలను కొనసాగించేవారు” అని కార్కోపీనో పేర్కొంటున్నాడు. స్పష్టంగా రోమన్‌ ఎరీనా క్రైస్తవులు వెళ్ళదగిన స్థలం కాదు.​—⁠1 కొరింథీయులు 6:9, 10.

8 ప్రసిద్ధిగాంచిన రోమన్‌ స్నానశాలల సంగతేమిటి? స్నానం చేసి పరిశుభ్రంగా ఉండడంలో నిశ్చయంగా తప్పేమీ లేదు. కానీ రోమన్‌ స్నానశాలలు పెద్ద పెద్ద కట్టడాల్లో ఉండేవి, వాటిలో మసాజ్‌ రూమ్‌లు, జిమ్నాసియమ్‌లు, జూదగృహాలు, తినడానికి తాగడానికి ఏర్పాటుచేయబడిన గదులు ఉండేవి. స్నానాల గదులను ఉపయోగించుకోవడానికి మగవారికి ఆడవారికి వేర్వేరు సమయాలు కేటాయించబడినా ఆడా మగా కలిసి స్నానాలు చేయడం తరచు అంగీకరించబడేది. అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్‌ ఇలా వ్రాశాడు: “స్నానశాలలు స్త్రీపురుషులు విచ్ఛలవిడిగా ఉపయోగించేందుకు అనువుగా ఉండేవి; అక్కడ వారు వివస్త్రలై కామాతురతతో యథేచ్ఛగా ప్రవర్తించేవారు.” ఆ విధంగా ప్రజా వ్యవస్థగా ఏర్పాటు చేయబడిన కట్టడాన్ని చాలా సుళువుగా సాతాను క్రైస్తవులకు వలగా ఉపయోగించగలిగి ఉండేవాడు. జ్ఞానవంతులు దానికి దూరంగా ఉన్నారు.

9. తొలి క్రైస్తవులు ఏ ఉచ్చులను నివారించుకోవలసి వచ్చింది?

9 రోమా సామ్రాజ్యం అత్యుచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు జూదం ప్రజలకు ప్రియమైన వ్యాపకంగా ఉండేది. రథాల పందేల్లో డబ్బు కాయడం నుండి దూరంగా ఉండడానికి తొలి క్రైస్తవులు ఆ ఎరీనాల దరిదాపులకు పోకుండా ఉంటే సరిపోతుంది. చట్టవిరుద్ధంగా చిన్న తరహా జూదం హోటళ్ళకు పూటకూళ్ళ ఇండ్లకు వెనుకవైపున బయటికి కనిపించకుండా ఉండే గదుల్లో జరిగేది. జూదగాళ్ళు ఎదుటివాడి చేతిలోని గులకరాళ్లు లేక కణుపు ఎముకలు బేసి సంఖ్యలో ఉన్నాయో సరి సంఖ్యలో ఉన్నాయో పందెం కాసేవారు. జూదం ప్రజల జీవితాల్లో ఉత్తేజాన్ని నింపేది, ఎందుకంటే అది ఎక్కువ శ్రమించకుండానే డబ్బు సంపాదించవచ్చనే ఆశను వారిలో రేకెత్తించేది. (ఎఫెసీయులు 5:⁠5) అంతేగాక, అలాంటి తాగుడు ఉండే స్థలాల్లో మద్యం పోసే స్త్రీలుగా తరచు వేశ్యలు పనిచేసేవారు, దీంతో లైంగిక అనైతికతలో పడిపోయే ప్రమాదం కూడా ఉండేది. రోమా సామ్రాజ్యంలోని నగరాల్లో జీవించిన క్రైస్తవుల కోసం సాతాను పన్నిన ఉచ్చుల్లో ఇవి కొన్ని. పరిస్థితులు నేడు ఏమైనా వేరుగా ఉన్నాయా?

నేడు సాతాను పన్నిన ఉచ్చులు

10. నేటి పరిస్థితులు రోమా సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితులను ఎలా పోలివున్నాయి?

10 సాతాను తంత్రాలు ఈ శతాబ్దాలన్నింట్లో చాలామట్టుకు మారలేదు. భ్రష్ట నగరమైన కొరింథులో జీవిస్తున్న క్రైస్తవులను “సాతాను . . . మోసపరచకుండునట్లు” అపొస్తలుడైన పౌలు వారికి గట్టి సలహాను ఇచ్చాడు. ఆయనిలా అన్నాడు: “సాతాను తంత్రములను మనము ఎరుగనివారముకాము.” (2 కొరింథీయులు 2:​11) రోమా సామ్రాజ్యం అత్యుచ్ఛస్థాయిలో ఉన్నప్పుడు అందులో ఉన్న పరిస్థితిని పోలిన పరిస్థితే నేడు అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఉంది. అనేకమందికి ఇంతకు మునుపటి కన్నా ఎక్కువగా ఖాళీ సమయం ఉంటోంది. ప్రభుత్వ లాటరీలు బీదవారికి సహితం ఆశాకిరణాలను అందిస్తున్నాయి. ప్రజల మనస్సులను దోచుకోవడానికి నాసిరకం వినోదం సమృద్ధిగా ఉంది. క్రీడా స్టేడియంలు కిక్కిరిసిపోయి ఉన్నాయి, ప్రజలు జూదం ఆడుతున్నారు, గుంపులు కొన్నిసార్లు హింసాత్మకంగా మారతాయి, క్రీడాకారులు కూడా తరచు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. నీచాతినీచమైన సంగీతం ప్రజలకు వీనులవిందుగా ఉంటోంది, అసభ్యకరమైన ప్రదర్శనలు రంగస్థలంపైన సినిమా తెరలపైన టీవీ తెరలపైన ప్రదర్శించబడుతున్నాయి. కొన్ని దేశాల్లో ఆడవాళ్లు మగవాళ్ళు కలిసి స్నానం చేసే ఆవిరిస్నానశాలలు, వేడినీటి బుగ్గలు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి, ఇక కొన్ని సముద్రతీరాల్లో నగ్న స్నానాల సంగతి చెప్పనక్కరలేదు. క్రైస్తవత్వపు తొలి శతాబ్దాల్లో చేసినట్లుగానే సాతాను దేవుని సేవకులను విరామ సమయాల్లో పాల్గొనే ఇహలోక కార్యకలాపాల ద్వారా ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

11. రిలాక్సేషన్‌ పొందాలన్న కోరికలో ఎలాంటి ఉచ్చులు ఉన్నాయి?

11 ఒత్తిడి సర్వత్రా వ్యాపించివున్న లోకంలో కాస్త రిలాక్సయి ఆటవిడుపు కార్యకలాపాల్లో పాల్గొనాలనుకోవడం సహజం. అయితే రోమన్ల స్నానశాలల్లో తొలి క్రైస్తవులకు ప్రమాదకరంగా ఉండగల అంశాలు ఉన్నట్లే, ఆధునిక క్రైస్తవులను అనైతికతలోకి అతి త్రాగుడులోకి లాగడానికి కొన్ని వెకేషన్‌ ఫెసిలిటీలు, రిసార్ట్‌లు సాతాను ఉపయోగించుకునే ఉచ్చులుగా తయారయ్యాయి. పౌలు కొరింథులోని క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు.”​—⁠1 కొరింథీయులు 15:33, 34.

12. నేడు యెహోవా సేవకులను ఉచ్చులోకి లాగేందుకు సాతాను ఉపయోగించే కొన్ని తంత్రాలు ఏమిటి?

12 హవ్వ విషయంలో ఆమె ఆలోచనలను భ్రష్టు పట్టించడానికి సాతాను కుయుక్తిని ఎలా ఉపయోగించాడో మనం చూశాము. (2 కొరింథీయులు 11:⁠3) నేడు సాతాను ఉపయోగిస్తున్న ఒక ఉచ్చు ఏమిటంటే, యెహోవాసాక్షులు ఇతర ప్రజల్లాంటివారేనని చూపించే ప్రయత్నంలో సాధ్యమైనంతగా లౌకిక విధానాలను అవలంబిస్తే, తాము కొందరిని క్రైస్తవ సత్యం వైపు ఆకర్షించవచ్చనే ఆలోచనలో క్రైస్తవులు పడిపోయేలా చేయడమే. కొన్నిసార్లు వారు మరీ దూరం వెళ్తారు, అందుకు వ్యతిరేక ఫలితం లభిస్తుంది. (హగ్గయి 2:​12-14) సాతాను ఉపయోగించే తంత్రాల్లో మరొకటి, సమర్పిత క్రైస్తవుల్లోని యౌవనస్థులనూ పెద్దవారినీ ద్వంద్వ జీవితాలను జీవిస్తూ ‘దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచేలా’ ప్రేరేపించడమే. (ఎఫెసీయులు 4:​30) కొందరు ఈ ఉచ్చులోకి ఇంటర్నెట్‌ను దుర్వినియోగపరచడం ద్వారా పడిపోయారు.

13. అపవాది కుయుక్తులలో నిరపాయకరమైనదిగా కనిపించే ఒక ఉచ్చు ఏమిటి, ఇక్కడ సామెతలులోని ఏ సలహా ఉచితమైనది?

13 సాతాను ఉపయోగించే మరో ఉచ్చు నిరపాయకరమైనదిగా కనిపించే క్షుద్రవిద్య. ఏ నిజ క్రైస్తవుడూ ఉద్దేశపూర్వకంగా సాతానువాదంలోను లేక క్షుద్రవిద్యల్లోను పాల్గొనడు. అయితే, కొందరు సినిమాలు, టీవీ ధారావాహికలు, వీడియో గేమ్‌లు, చివరికి చిన్నపిల్లల పుస్తకాలు బొమ్మల పుస్తకాలు వంటి వాటికి సంబంధించి కూడా ఏమరుపాటుగా ఉండి నిర్లక్ష్యాన్ని చూపించారు. క్షుద్రవిద్యలతో కాస్త సంబంధం ఉన్న ఎటువంటి దానికైనా దూరంగా ఉండాలి. జ్ఞానవంతమైన సామెత ఇలా అంటోంది: “ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి; తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును.” (సామెతలు 22:⁠5) సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత” గనుక బాగా ప్రజాదరణ పొందిన దేనిలోనైనా వాడి ఉచ్చుల్లో ఒకటి దాగివుంటుంది.​—⁠2 కొరింథీయులు 4:⁠4; 1 యోహాను 2:15, 16.

యేసు అపవాదిని ఎదిరించాడు

14. యేసు అపవాది పెట్టిన మొదటి శోధనను ఎలా నిరోధించాడు?

14 అపవాదిని ఎదిరించి వాడు పారిపోయేలా చేయడంలో యేసు చక్కని మాదిరిని ఉంచాడు. యేసు బాప్తిస్మం తీసుకుని 40 రోజులపాటు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన సాతానుచేత శోధించబడ్డాడు. (మత్తయి 4:​1-11) యేసు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలివేసింది, మొదటి శోధన ఆ సహజసిద్ధమైన ఆకలిని ఉపయోగించుకున్నాడు. ఒక శారీరక అవసరాన్ని తృప్తిపరచుకోవడానికి తన మొట్టమొదటి అద్భుతాన్ని చేయమని సాతాను యేసును ప్రోత్సహించాడు. యేసు ద్వితీయోపదేశకాండము 8:3 ఎత్తిచెబుతూ తన శక్తులను స్వప్రయోజనార్థం ఉపయోగించడానికి నిరాకరించాడు, ఆయన భౌతిక ఆహారం కన్నా ఆధ్యాత్మిక ఆహారానికి ఎక్కువ విలువనిచ్చాడు.

15. (ఎ) యేసును శోధించడానికి సాతాను ఏ సహజమైన కోరికను ఉపయోగించుకున్నాడు? (బి) నేడు దేవుని సేవకులకు విరుద్ధంగా అపవాది ఉపయోగించే ప్రధానమైన కుతంత్రం ఏమిటి, కానీ మనం వాడిని ఎలా ఎదిరించవచ్చు?

15 ఈ శోధనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యేసును ఒక లైంగిక పాపాన్ని చేయమని అపవాది చెప్పలేదు. ఆహారం కావాలన్న కోరికను సహజంగా కలిగించే ఆకలి ఈ సందర్భంలో యేసును శోధించడానికి అత్యంత బలమైన శారీరక వాంఛగా కనిపించింది. నేడు దేవుని ప్రజలను ప్రలోభపెట్టడానికి సాతాను ఉపయోగించే శోధనలు ఏమిటి? అవి చాలా ఉన్నాయి, వైవిధ్యభరితంగా కూడా ఉన్నాయి, కానీ ఆయన యెహోవా ప్రజల యథార్థతను విచ్ఛిన్నం చేయడానికైన ప్రయత్నంలో లైంగిక శోధనలను ఒక ప్రధానమైన కుతంత్రంగా ఉపయోగిస్తున్నాడు. యేసును అనుకరించడం ద్వారా మనం అపవాదిని ఎదిరించి శోధనలు నిరోధించగలము. తనను ఒప్పించడానికి సాతాను చేసిన ప్రయత్నాలను యేసు సరైన లేఖనాలను గుర్తుతెచ్చుకోవడం ద్వారా త్రిప్పికొట్టినట్లే మనకు శోధనలు ఎదురైనప్పుడు మనం ఆదికాండము 39:​9, 1 కొరింథీయులు 6:​18 వంటి లేఖనాలను గుర్తుతెచ్చుకోవచ్చు.

16. (ఎ) సాతాను యేసును రెండవసారి ఎలా శోధించాడు? (బి) మనం యెహోవాను పరీక్షించేలా మనల్ని శోధించేందుకు సాతాను ఏ మార్గాల్లో ప్రయత్నించవచ్చు?

16 తర్వాత అపవాది, యేసు దేవాలయం గోడ మీదినుండి దూకి దేవదూతల ద్వారా రక్షించే దేవుని సామర్థ్యాన్ని పరీక్షించమని సవాలు చేశాడు. ద్వితీయోపదేశకాండము 6:​16 ఎత్తిచెబుతూ యేసు తన తండ్రిని శోధించడానికి నిరాకరించాడు. సాతాను ఏదో దేవాలయం మీది నుండి దూకమని మనల్ని శోధించకపోవచ్చు, కానీ మనం యెహోవాను పరీక్షించేలా మనల్ని శోధించగలడు. మన వస్త్రధారణలోను కేశాలంకరణలోను లోకంలోని వేలంవెర్రి ఫ్యాషన్‌లను అనుకరిస్తూ ఎంత దూరం వెళ్తే పెద్దలు మనకు సలహా ఇవ్వకుండా ఉంటారో చూసేలా శోధించబడుతున్నామా? ప్రశ్నించదగిన విధమైన వినోదం విషయంలో మనం శోధించబడుతున్నామా? అలాగైతే మనం యెహోవాను శోధిస్తుండవచ్చు. మనం అలాంటి విషయాలవైపు మొగ్గుచూపుతుంటే సాతాను మననుండి పారిపోవడానికి బదులుగా మన దగ్గరే తచ్చట్లాడుతుంటాడు, తన పక్షానికి వచ్చేలా మనల్ని ప్రలోభపెట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటాడు.

17. (ఎ) అపవాది యేసును మూడవసారి ఎలా శోధించాడు? (బి) యాకోబు 4:7 మన విషయంలో ఎలా నిజం కాగలదు?

17 సాతాను ఒక్కసారి సాగిలపడి నమస్కారము చేసినందుకు ఈ లోక రాజ్యాలన్నింటినీ యేసుకు ఇవ్వజూపినప్పుడు యేసు మళ్ళీ లేఖనాలు ఎత్తిచెబుతూ వాడిని ఎదిరించాడు. ఆయన తన తండ్రిని అనితర భక్తితో సేవించే పక్షాన స్థిరంగా స్థానం వహించాడు. (ద్వితీయోపదేశకాండము 5:⁠9; 6:​13; 10:​20) సాతాను మనకు లోక రాజ్యాలను ఇవ్వజూపకపోవచ్చు, కానీ వాడు వస్తుసంపదల వెలుగు జిలుగులను ఎల్లప్పుడు మన ముందుంచి శోధిస్తాడు, చివరికి మనకంటూ ఒక చిన్ని వ్యక్తిగత రాజ్యం ఉంటుందన్న ఆశలు కూడా కల్పిస్తాడు. మనం యెహోవాకు అనితర భక్తిని ప్రదర్శిస్తూ యేసు ప్రతిస్పందించినట్లే ప్రతిస్పందిస్తామా? అలాగైతే యేసు విషయంలో జరిగిందే మనకూ జరుగుతుంది. మత్తయిలోని వృత్తాంతం ఇలా చెబుతోంది: “అంతట అపవాది ఆయనను విడిచిపో[యెను].” (మత్తయి 4:​11) మనం సరైన బైబిలు సూత్రాలను గుర్తుంచుకుని వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా సాతానుకు విరుద్ధంగా స్థిరంగా నిలబడితే వాడు మనల్ని విడిచివెళ్ళిపోతాడు. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.” (యాకోబు 4:⁠7) ఫ్రాన్స్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఒక క్రైస్తవుడు ఇలా వ్రాశాడు: “సాతాను నిజంగా చాలా జిత్తులమారి. నాలో ఎన్ని సదుద్దేశాలు ఉన్నా నా భావాలపైన నా కోరికలపైనా ఆధిపత్యం సాధించడం నాకు చాలా కష్టంగా ఉంటోంది. అయినా సరే, ధైర్యంతో ఓర్పుతో అన్నింటికీ మించి యెహోవా సహాయంతో నేను నా యథార్థతను కాపాడుకుని సత్యానికి అంటిపెట్టుకుని ఉండగలిగాను.”

అపవాదిని ఎదిరించేందుకు పూర్తిగా సన్నద్ధులం

18. మనం అపవాదిని ఎదిరించడానికి ఏ ఆధ్యాత్మిక కవచం మనల్ని సన్నద్ధులను చేస్తుంది?

18 మనం “అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు” యెహోవా మనకు పూర్తి ఆధ్యాత్మిక కవచాన్ని అందించాడు. (ఎఫెసీయులు 6:​11-18) సత్యం పట్ల మనకున్న ప్రేమ మన నడుముకు దట్టిలా ఉంటుంది, అంటే మనల్ని క్రైస్తవ కార్యకలాపాల నిమిత్తం సన్నద్ధులను చేస్తుంది. యెహోవా యొక్క నీతి ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండాలన్న మన కృత నిశ్చయం మన హృదయాన్ని కాపాడే మైమరువులా ఉంటుంది. మన పాదాలకు సువార్త అనే జోళ్ళు తొడుగుకుంటే అవి మనల్ని క్రమంగా ప్రకటనా పనికి తీసుకెళ్తాయి, ఇది మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచి కాపాడుతుంది. మన దృఢమైన విశ్వాసం పెద్ద డాలులా ఉండి, మనల్ని “దుష్టుని అగ్నిబాణములన్నిటి” నుండి, అంటే వాడి కుతంత్రాల నుండి శోధనల నుండి కాపాడుతుంది. యెహోవా వాగ్దానాలు నెరవేరతాయన్న నిశ్చితమైన మన నిరీక్షణ మన ఆలోచనా సామర్థ్యాలను కాపాడే శిరస్త్రాణములా ఉండి మనకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. (ఫిలిప్పీయులు 4:⁠7) మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించడంలో నైపుణ్యం సాధించినవారిగా తయారైతే అది ప్రజలు సాతానుకు ఆధ్యాత్మిక బానిసలుగా ఉండడం నుండి వారిని విడిపించడానికి మనకు పనికివచ్చే ఒక ఖడ్గంలా ఉంటుంది. యేసు శోధించబడినప్పుడు చేసినట్లే మనం దాన్ని మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా ఝళిపించవచ్చు.

19. ‘అపవాదిని ఎదిరించడానికి’ తోడు మనం ఇంకా ఏమి చేయాలి?

19 “దేవుడిచ్చు సర్వాంగకవచమును” ధరించుకుని ఉండడం ద్వారా, నిర్విరామంగా ప్రార్థించడం ద్వారా, సాతాను మనపై దాడిచేసినప్పుడు మనకు యెహోవా కాపుదల ఉంటుందన్న నమ్మకాన్ని కలిగివుండవచ్చు. (యోహాను 17:​15; 1 కొరింథీయులు 10:​13) కానీ ‘సాతానును ఎదిరించడం’ మాత్రమే సరిపోదని యాకోబు చూపించాడు. అన్నింటికీ మించి మనం మనపట్ల శ్రద్ధవహించే ‘దేవునికి లోబడివుండాలి.’ (యాకోబు 4:​7, 8) మనం అలా ఎలా చేయగలమో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడుతుంది.

మీరెలా జవాబిస్తారు?

• తొలి క్రైస్తవులు సాతాను పెట్టిన ఎలాంటి ఉచ్చులను తప్పించుకోవలసివచ్చింది?

• సాతాను నేడు యెహోవా సేవకులను ప్రలోభపెట్టడానికి ఎలాంటి కుయుక్తులను ఉపయోగిస్తాడు?

• యేసు సాతాను శోధనలను ఎలా ఎదిరించాడు?

• మనం సాతానును ఎదిరించడానికి ఎలాంటి ఆధ్యాత్మిక కవచం సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[8, 9వ పేజీలోని చిత్రం]

యేసు అపవాదిని స్థిరంగా ఎదిరించాడు

[10వ పేజీలోని చిత్రాలు]

తొలి శతాబ్దపు క్రైస్తవులు హింసాత్మకమైన, అనైతికమైన వినోదాన్ని తిరస్కరించారు

[చిత్రసౌజన్యం]

The Complete Encyclopedia of Illustration/J. G. Heck