కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు అసూయాపరులుగా ఉండాలా?

క్రైస్తవులు అసూయాపరులుగా ఉండాలా?

క్రైస్తవులు అసూయాపరులుగా ఉండాలా?

అసూయ​⁠క్రైస్తవులు అలవర్చుకోవలసిన లక్షణమా? క్రైస్తవులుగా మనం ‘ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడాలి’ అని ప్రోత్సహించబడ్డాము, అలాగే ‘ప్రేమకు అసూయ లేదు’ అని మనకు చెప్పబడింది. (1 కొరింతువారికి [కొరింథీయులు] 13:​4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యానసహితం; 14:⁠1) మరోవైపు యెహోవా “అసూయాపరుడైన దేవుడు” అని కూడా మనకు చెప్పబడుతోంది, అంతేగాక ‘దేవునిపోలి నడుచుకోవాలని’ మనకు ఆజ్ఞాపించబడింది. (నిర్గమకాండము 34:​14, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము; ఎఫెసీయులు 5:⁠1) ఇవి పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు ఎందుకు కనబడుతున్నాయి.

బైబిలులో “అసూయ” అని అనువదించబడిన హీబ్రూ మరియు గ్రీకు పదాలకు అనేక రకాల అర్థాలున్నాయి. అవి ఉపయోగించబడిన పద్ధతిపై ఆధారపడి వాటికి అటు అనుకూల భావమో ఇటు ప్రతికూల భావమో ఉంటుంది. ఉదాహరణకు, “అసూయ” అని అనువదించబడిన హీబ్రూ పదం “అనితర భక్తిని మాత్రమే కోరు; పోటీని సహించలేకపోవడం; ఆసక్తి; గాఢమైన భావావేశం; అసూయ [నీతియుక్తమైనదైనా లేక పాపభరితమైనదైనా]; ఈర్ష్య” అని అర్థమివ్వగలదు. తత్సమాన గ్రీకు పదానికి కూడా అవే అర్థాలున్నాయి. ఈ పదాలు, తనకు పోటీదారుడిగా తయారుకాగల వ్యక్తిపట్ల లేక అనుకూల పరిస్థితిని అనుభవిస్తున్నవాడి పట్ల వక్రమైన, పక్షపాతమైన భావోద్వేగాన్ని సూచించవచ్చు. (సామెతలు 14:​30, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) అవి, ఒక ప్రియమైన వ్యక్తిని ప్రమాదం నుండి కాపాడాలన్న కోరికతో ప్రదర్శించే ఒక దైవిక లక్షణాన్ని కూడా సూచించగలవు.​—⁠2 కొరింథీయులు 11:​2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

అత్యుత్కృష్టమైన మాదిరి

యుక్తమైన అసూయను ప్రదర్శించడంలో యెహోవా అత్యుత్కృష్టమైన మాదిరిని ఉంచుతున్నాడు. ఆయన ఉద్దేశాలు అత్యంత నిర్మలమైనవి, శుద్ధమైనవి, అవి తన ప్రజలను ఆధ్యాత్మిక, నైతిక భ్రష్టత్వం నుండి కాపాడాలన్న కోరికతో ప్రేరేపించబడతాయి. సూచనార్థకంగా సీయోను అని పిలువబడిన తన ప్రాచీన ప్రజల విషయంలో ఆయనిలా అన్నాడు: “మిగుల ఆసక్తితో [“అసూయతో,” NW] నేను సీయోను విషయమందు రోషము [“అసూయ,” NW] వహించియున్నాను. బహు రౌద్రముగలవాడనై దాని విషయమందు నేను రోషము [“అసూయ,” NW] వహించియున్నాను.” (జెకర్యా 8:⁠2) ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలను అపాయం నుండి కాపాడడానికి ఎలాగైతే ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటాడో అలా యెహోవా తన సేవకులను శారీరక, ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి కాపాడడానికి అప్రమత్తంగా ఉంటాడు.

తన ప్రజలను కాపాడడానికి యెహోవా తన వాక్యమైన బైబిలును అందించాడు. అందులో జ్ఞానయుక్తంగా నడుచుకోమని ఎంతో ప్రోత్సాహం ఇవ్వబడింది, అంతేగాక అలా నడుచుకున్నవారి మాదిరులు దానిలో సమృద్ధిగా ఉన్నాయి. యెషయా 48:17 లో మనం ఇలా చదువుతాము: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” మనపట్ల శ్రద్ధ వహించడానికీ మనల్ని కనిపెట్టుకుని ఉండడానికీ ఆయనను అసూయ కదిలిస్తోందని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉందో కదా! ఇలా ఆయన అసూయను సరైన రీతిలో కలిగివుండకపోతే మనం మన అనుభవశూన్యతచేత అన్ని రకాల ఆపదల్లోను పడిపోతాము. యెహోవా యొక్క అసూయా వ్యక్తీకరణలు ఎంత మాత్రం స్వార్థపూరితమైనవి కావు.

దీన్ని బట్టి చూస్తే, దైవిక అసూయకు అనుచితమైన అసూయకు తేడా ఏమిటి? జవాబు కోసం మనం మిర్యాము మరియు ఫీనెహాసుల ఉదాహరణలను పరిశీలిద్దాము. వారి చర్యలను పురికొల్పినదేమిటో గమనించండి.

మిర్యాము మరియు ఫీనెహాసు

మిర్యాము, ఇశ్రాయేలీయుల నిర్గమన కాలంలో వారికి నాయకులుగా ఉన్న మోషే, అహరోనుల అక్క. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు మిర్యాముకు తన తమ్ముడైన మోషేపై అసూయపుట్టింది. బైబిలు వృత్తాంతం ఇలా చెబుతోంది: “మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లిచేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు​—⁠మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పుకొ[న్నారు].” మోషేకు విరుద్ధంగా తీసుకోబడిన ఈ చర్యకు మిర్యాము నాయకత్వం వహించినట్లు కనిపిస్తోంది, ఎందుకంటే యెహోవా అహరోనును కాక అగౌరవంతో కూడిన ఆమె ప్రవర్తనకు మిర్యామును ఒక వారంపాటు నిలిచిన కుష్ఠువ్యాధితో శిక్షించాడు.​—⁠సంఖ్యాకాండము 12:1-15.

మోషేకు విరుద్ధంగా ప్రవర్తించేందుకు మిర్యామును ప్రేరేపించినది ఏమిటి? సత్యారాధన పట్ల చింతా, తోటి ఇశ్రాయేలీయులను అపాయం నుండి రక్షించాలన్న కోరికా? అవి రెండూ కావని స్పష్టమవుతోంది. మరింత హోదా మరింత అధికారం కోసం ఆమె హృదయం వాంఛించేందుకు ఆమె అనుమతించినట్లు కనిపిస్తోంది. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త్రినిగా ఆమె ప్రజల నుండి, ప్రత్యేకంగా స్త్రీల నుండి ఎంతో గౌరవాన్ని పొందింది. ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రం వద్ద అద్భుతరీతిన రక్షణపొందినప్పుడు ఆమె గాననృత్యాల్లో వారి ముందుండి నడిపించింది. అయితే ఇప్పుడు, మరో పోటీదారుగా కనిపిస్తోన్న మోషే భార్య తన ఉన్నత స్థానాన్ని ఆక్రమించేస్తుందేమోనన్న అనుచితమైన చింత మిర్యామును పట్టుకుంది. స్వార్థపూరితమైన అసూయతో ఆమె యెహోవా నియమించిన మోషేకు విరుద్ధంగా కలహాన్ని రేపింది.​—⁠నిర్గమకాండము 15:1, 20, 21.

మరోవైపు ఫీనెహాసు తీసుకున్న చర్యలకుగల ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. వాగ్దత్త దేశంలోకి ప్రవేశించడానికి కొంచెం ముందు ఇశ్రాయేలీయులు మోయాబు మైదానాల్లో దిగినప్పుడు, మోయాబు మరియు మిద్యాను స్త్రీలు ఇశ్రాయేలీయుల్లో అనేకమంది పురుషులను అనైతికతకు విగ్రహారాధనకు పాల్పడేలా ప్రలోభపెట్టారు. పాళెమును శుద్ధీకరించి యెహోవా మహోగ్రజ్వాలను నిమ్మళింపజేయడానికి ఇశ్రాయేలులోని న్యాయాధిపతులు, ఆ రీతిలో దారితప్పి ప్రవర్తించిన పురుషులందరినీ హతం చేయాలని ఆజ్ఞాపించబడ్డారు. “షిమ్యోనీయులలో” ప్రధానియైన జిమ్రీ అనైతిక కార్యకలాపాల నిమిత్తం మిద్యాను స్త్రీయైన కొజ్బీని “ఇశ్రాయేలీయుల సర్వసమాజముయొక్క కన్నులయెదుట” పాళెములోకి ధిక్కారపూర్వకంగా తీసుకువచ్చాడు. ఫీనెహాసు నిర్ణాయకంగా చర్యతీసుకున్నాడు. అసూయా భావాలతోను, అంటే యెహోవా ఆరాధనపట్ల అత్యాసక్తితోను పాళెము యొక్క పరిశుద్ధతను కాపాడాలన్న కోరితోను ఆయన ఆ వ్యభిచారులను వారి గుడారములోనే హతం చేశాడు. ఆయన యెహోవా “విషయమందు ఆసక్తిగలవాడై” ప్రదర్శించిన “అసూయా ఉగ్రత” నిమిత్తం ప్రశంసించబడ్డాడు. అప్పటికే 24,000 మంది ప్రాణాలను బలిగొన్న తెగులును ఫీనెహాసు తీసుకున్న సత్వర చర్య నిలిపివేసింది, యాజకత్వం నిరంతరం ఆయన వంశావళిలోనే నిలిచివుంటుందని నిబంధన చేసి యెహోవా ఆయనను ఆశీర్వదించాడు.​—⁠సంఖ్యాకాండము 25:​4-13, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌.

ఈ రెండు అసూయా వ్యక్తీకరణలకు తేడా ఏమిటి? మిర్యాము స్వార్థపూరితమైన అసూయతో తన సోదరుడికి వ్యతిరేకంగా చర్యతీసుకుంది. మరోవైపు ఫీనెహాసు దైవిక అసూయపై ఆధారపడి తీర్పును అమలుచేశాడు. ఫీనెహాసులా మన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా వెలిబుచ్చాల్సివచ్చే సందర్భాలు, లేదా యెహోవా నామము, ఆయన ఆరాధన, ఆయన ప్రజల పక్షాన ఏదైనా చర్య తీసుకోవలసివచ్చే సందర్భాలు ఉంటాయి.

తప్పుదారిపట్టిన అసూయ

అయితే అసూయా భావాలు తప్పుదారి పట్టే అవకాశం ఉందా? ఉంది. మొదటి శతాబ్దంలోని యూదుల్లో ఇది సర్వసాధారణమైనదిగా ఉంది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని దాని సంప్రదాయాలను వారు అసూయతో కాపాడారు. ధర్మశాస్త్రాన్ని కాపాడాలన్న వారి ప్రయత్నాల్లో వారు ప్రజలపై పెనుభారంగా తయారైన అసంఖ్యాకమైన వివరణాత్మకమైన కట్టుబాట్లను ఆంక్షలను విధించారు. (మత్తయి 23:⁠4) దేవుడు మోషే ధర్మశాస్త్రాన్ని తీసివేసి దాని స్థానంలో అది సూచించిన నిజస్వరూపాన్ని ఉంచాడని గుర్తించలేని లేదా గుర్తించేందుకు ఇష్టపడని వారు యేసుక్రీస్తు అనుచరులపై అనియంత్రితమైన ఆగ్రహాన్ని వెళ్ళగ్రక్కేందుకు అసూయ వారిని తప్పుగా ప్రేరేపించింది. తప్పుదారి పట్టిన భావోద్రేకాలతో ఒకప్పుడు ధర్మశాస్త్రంపట్ల అసూయతో విశ్వాసంగా ఉన్న అపొస్తలుడైన పౌలు, ధర్మశాస్త్రాన్ని సమర్థిస్తున్న ప్రజలు ‘జ్ఞానానుసారము కాని రీతిలో దేవుని యందు ఆసక్తిగలవారని [అసూయగలవారని]’ పేర్కొన్నాడు.​—⁠రోమీయులు 10:⁠2; గలతీయులు 1:⁠14.

క్రైస్తవులుగా మారిన అనేకమంది యూదులు సహితం ధర్మశాస్త్రం పట్ల తమకున్న అయుక్తమైన ఆసక్తిని వదిలించుకోవడం చాలా కష్టంగా ఉన్నట్లు కనుగొన్నారు. తన మూడవ మిషనరీ యాత్ర తర్వాత పౌలు, అన్యజనములు క్రైస్తవులుగా మారడాన్ని గురించి మొదటి శతాబ్దంలోని పరిపాలక సభకు ఒక నివేదికను సమర్పించాడు. ఆ సమయంలో, క్రైస్తవులైన వేలాదిమంది యూదులు “ధర్మశాస్త్రమందు ఆసక్తిగల”వారిగా ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 21:​20) ఇది, క్రైస్తవులైన అన్యులు సున్నతిపొందాల్సిన అవసరం లేదని పరిపాలక సభ తీర్మానించిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాతి సంగతి. ధర్మశాస్త్రాన్ని పాటించడానికి సంబంధించిన వివాదాంశాలు సంఘంలో విభేదాల్ని రేపుతూనే ఉన్నాయి. (అపొస్తలుల కార్యములు 15:​1, 2, 28, 29; గలతీయులు 4:​9, 10; 5:​7-12) అప్పట్లో యెహోవా తన ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నాడో పూర్తిగా గ్రహించలేక కొందరు క్రైస్తవులైన యూదులు తమ స్వంత దృక్కోణాలను నొక్కిచెబుతూ ఇతరులను విమర్శించారు.​—⁠కొలొస్సయులు 2:​17; హెబ్రీయులు 10:⁠1.

కాబట్టి దేవుని వాక్యంపై దృఢంగా ఆధారపడి లేకపోయినప్పటికీ, మనం అపురూపంగా ఎంచుతున్న మన తలంపులను మార్గాలను సమర్థించుకోవడానికి అసూయతో ప్రయత్నిస్తూ ఉండడమనే ఉచ్చును నివారించుకోవాలి. యెహోవా నేడు ఉపయోగిస్తున్న మాధ్యమం ద్వారా తన వాక్యంపై ప్రసరింపజేస్తున్న తాజా వెలుగును స్వీకరించడం మనకే శ్రేయస్కరం.

యెహోవాపట్ల అసూయను కలిగివుండండి

దైవిక అసూయకు సత్యారాధనలో దాని స్థానం దానికి ఉంది. మనం మన స్వంత కీర్తి గురించి స్వంత హక్కుల గురించి అనుచితంగా చింతించడానికి మొగ్గుచూపుతున్నప్పుడు దైవిక అసూయ మన అవధానాన్ని యెహోవా వైపుకి మరలుస్తుంది. అది ఆయన గురించిన సత్యాన్ని ప్రకటించేందుకూ, ఆయన విధానాలను ఆయన ప్రజలను సమర్థించేందుకూ మార్గాలను అన్వేషించేలా మనల్ని కదిలిస్తుంది.

రక్తం విషయంలో దేవుని నియమాన్ని గురించి కొన్ని అపోహలు ఉన్న ఒక ఇంటి యజమానురాలు యెహోవాసాక్షుల పూర్తికాల సేవకురాలైన ఆకీకోను తీవ్రంగా విమర్శించింది. ఆకీకో దేవుని వాక్యాన్ని యుక్తిగా సమర్థించింది, ఆమె రక్తమార్పిడులకు సంబంధించి వైద్యపరంగా ఏర్పడే క్లిష్టపరిస్థితుల గురించి సమస్యల గురించి కూడా పేర్కొన్నది. యెహోవా గురించి మాట్లాడాలన్న ప్రగాఢమైన కోరికతో కదిలించబడి, ఆ స్త్రీ అభ్యంతరాలకు అసలు కారణం ఒక సృష్టికర్త ఉన్నాడని ఆమె నమ్మలేకపోవడమేనని గ్రహించి, ఆకీకో సంభాషణను ఆ విషయంవైపుకు మరల్చింది. ఈ సృష్టి ఒక సృష్టికర్త ఉన్నాడన్న నమ్మకాన్ని ఎలా బలపరుస్తుందో వివరిస్తూ ఆకీకో ఆ స్త్రీతో తర్కించింది. అలా ఆకీకో ధైర్యంగా సమర్థించడం, నిరాధారమైన అపోహలను తొలగించడమే కాక ఆ స్త్రీతో గృహ బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించేందుకు తోడ్పడింది. మునుపు ఆగ్రహంతో చిందులు తొక్కిన ఆ ఇంటి యజమానురాలు నేడు యెహోవా ఆరాధకురాలు.

సత్యారాధనపట్ల సరైన అసూయ, లేదా ఆసక్తి మన పనిస్థలంలోను, స్కూల్లోను, దుకాణాల్లోను, ప్రయాణాల్లోను మన విశ్వాసాన్ని గురించి మాట్లాడే అవకాశాలను ఉపయోగించుకునేందుకు అప్రమత్తంగా ఉండేలా మనల్ని బలవంతం చేస్తుంది. ఉదాహరణకు మీడోరి తన విశ్వాసాన్ని గురించి తన సహోద్యోగులతో మాట్లాడాలని కృతనిశ్చయంతో ఉంటుంది. నలభయ్యవ పడిలో ఉన్న ఒక సహోద్యోగిని తనకు యెహోవాసాక్షుల విషయంలో ఏమాత్రం ఆసక్తిలేదని చెప్పింది. తర్వాత మీడోరి మరోసారి ఆమెతో సంభాషిస్తున్నప్పుడు, తన కూతురిలో అవాంఛనీయమైన వైఖరులు పొడచూపుతున్నాయని ఆ స్త్రీ ఫిర్యాదు చేసింది. మీడోరి ఆమెకు యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు * (ఆంగ్లం) పుస్తకాన్ని చూపించి, ఆ పుస్తకం ఆధారంగా ఆమె కూతురితో అధ్యయనం చేసే ఏర్పాటు చేస్తానని చెప్పింది. అధ్యయనం ప్రారంభమైంది, కానీ ఆ చర్చలో తల్లి కూర్చోలేదు. ఆమెకు యెహోవాసాక్షులు​—⁠ఆ పేరు వెనుకనున్న సంస్థ* (ఆంగ్లం) వీడియోను చూపించాలని మీడోరి నిర్ణయించుకుంది. దీంతో ఆమెలో ఉన్న అనేక అపోహలు పటాపంచలయ్యాయి. తాను చూసినదాన్ని బట్టి కదిలించబడి ఆమె ఇలా అన్నది: “నాకు యెహోవాసాక్షుల్లా అవ్వాలని ఉంది.” ఆమె ఇప్పుడు తన కూతురితోపాటు బైబిలు అధ్యయనంలో కూర్చుంటోంది.

క్రైస్తవ సంఘంలో కూడా సరైన అసూయకు స్థానం ఉంది. అది ప్రేమ స్ఫూర్తిని ఒకరినొకరు పట్టించుకునే స్ఫూర్తిని అభివృద్ధిచేస్తుంది. అలాగే అది, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, మతభ్రష్టత్వంతో కూడిన ఆలోచనలు వంటి మన ఆధ్యాత్మిక సహోదరులకు హాని తలపెట్టే విచ్ఛిన్నకర ప్రభావాలను నిరోధించేలా మనల్ని కదిలిస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్పిదస్థులను గద్దించాల్సిన అవసరం ఉన్నదని భావించే పెద్దల నిర్ణయాలకు మద్దతునిచ్చేందుకు కూడా దైవిక అసూయ మనల్ని కదిలిస్తుంది. (1 కొరింథీయులు 5:​11-13; 1 తిమోతి 5:​20) కొరింథు సంఘంలోని తన తోటి విశ్వాసులపట్ల తను కలిగివున్న అసూయా భావాలను గురించి వ్రాస్తూ పౌలు ఇలా అన్నాడు: “మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా అయనకు బహూకరించాలని అనుకున్నాను.” (2 కొరింథీయులు 11:​2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి, మన అసూయ సంఘంలోని ప్రతి ఒక్కరికి సంబంధించి సిద్ధాంతపరమైన, ఆధ్యాత్మికపరమైన, నైతికపరమైన శుద్ధతను కాపాడేందుకు మనకు సాధ్యమైనదంతా చేసేందుకు మనల్ని కదిలిస్తుంది.

అవును, సరైన రీతిలో ప్రేరేపించబడిన అసూయ, అంటే దైవిక అసూయ ఇతరులపై ఆరోగ్యకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది యెహోవా ఆమోదాన్ని తీసుకువస్తుంది, నేడు క్రైస్తవుల్లో గమనించతగ్గ లక్షణాల్లో అది ఒకటై ఉండాలి.​—⁠యోహాను 2:⁠17.

[అధస్సూచి]

^ పేరా 20 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[29వ పేజీలోని చిత్రాలు]

ఫీనెహాసు చర్యలు దైవిక అసూయపై ఆధారపడినవి

[30వ పేజీలోని చిత్రాలు]

దారితప్పిన అసూయ అనే ఉచ్చును తప్పించుకోండి

[31వ పేజీలోని చిత్రాలు]

దైవిక అసూయ మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకునేలా మన సహోదరత్వాన్ని అపురూపంగా ఎంచేలా మనల్ని కదిలిస్తుంది