దుష్టశక్తులు పనిచేస్తున్నాయా?
దుష్టశక్తులు పనిచేస్తున్నాయా?
“అలంకారికంగా చెప్పాలంటే, క్షుద్ర శక్తులు ఒక పథకం ప్రకారం అన్ని అత్యవసర ద్వారాలను మూసివేస్తున్నాయన్నట్లు ఈ లోకం అల్లకల్లోలానికి గురవుతోంది.”—ఝాన్-క్లోడ్ సూలేరీ, విలేకరి.
‘ఒక వ్యక్తిలోని నిస్సహాయ భావాలు ఏదో ఘోరమైన దుష్టశక్తి కార్యాచరణలో ఉందని ఆయన భావించేలా చేస్తున్నాయి.’—జోసెఫ్ బార్టన్, చరిత్రకారుడు.
ఉగ్రవాదులు 2001, సెప్టెంబరు 11న జరిపిన అతి భయానకమైన దాడుల దరిమిలా అనేకమంది గంభీరంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంగ్లాండ్‌లోని ఫైనాన్షియల్ టైమ్స్‌కు వ్రాస్తూ మైఖేల్ ప్రౌస్ ఇలా అన్నాడు: “అంత పాశవికంగా ఏ జంతువూ ప్రవర్తించదు, ప్రవర్తించలేదు.” న్యూయార్క్ టైమ్స్‌లోని ఒక సంపాదకీయం, ఆ దాడికి అవసరమైన పథకాన్ని గురించి మాత్రమే కాక “ఆ పథకాన్ని అమలుచేసేలా పురికొల్పిన అత్యంత తీవ్రమైన ద్వేషం గురించి కూడా ఆలోచించడం ప్రాముఖ్యం. యుద్ధాల్లో సాధారణంగా కనబడే విద్వేషభావాలను అది మించిపోతోంది, దానికి హద్దుల్లేవు, ఎలాంటి ఒప్పందాలకూ తలొగ్గలేదు” అని వ్యాఖ్యానించింది.
వేర్వేరు విశ్వాసాలుగల వ్యక్తులు ఏదో భయంకరమైన శక్తి పనిచేసే సాధ్యతను గురించి గంభీరంగా ఆలోచించారు. సారాయెవోలోని ఒక వ్యాపారవేత్త, జాతి విద్వేషాల ఫలితంగా బోస్నియాలో జరిగిన అకృత్యాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇలా పేర్కొన్నాడు: “బోస్నియాలో ఒక సంవత్సరం యుద్ధాన్ని చూశాక దీనంతటి వెనుక ఉన్నది సాతానేనని నేను నమ్ముతున్నాను. అది వట్టి ఉన్మాదం కాక మరేదీ కాదు.”
తాను సాతానుని నమ్ముతున్నాడా లేదా అని అడిగినప్పుడు చరిత్రకారుడైన ఝాన్ డెల్యూమో ఇలా జవాబిచ్చాడు: “నేను పుట్టినప్పటి నుంచి జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను చూసి కూడా దుష్టశక్తికున్న ప్రభావాన్ని నేనెలా కాదనగలను? మచ్చుకి కొన్ని: నాలుగు కోట్లకు పైగా ప్రజలు బలైన రెండవ ప్రపంచ యుద్ధం; ఆష్విట్జ్ మరియు మృత్యు శిబిరాలు; కంబోడియాలోని జాతిప్రక్షాళనం; సౌసెస్కూ హయాంలో రక్తపాతంతో కూడిన నిరంకుశత్వం; ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో హింసలే ప్రభుత్వ విధానంగా సాగిన రీతి. ఈ అకృత్యాలకు అంతులేదు. . . . అందుకే, ఇలాంటి చర్యలను ‘పైశాచికం’ అని పిలవడం న్యాయమేనని నేను నమ్ముతున్నాను, అంటే అవి తలపై కొమ్ములు, చీలిన గిట్టల్లాంటి పాదాలు ఉన్న ఏదో పిశాచం ప్రేరేపణ మూలంగా జరిగాయని కాదు, కానీ లోకంలో పనిచేస్తున్న దుష్టశక్తి ప్రభావానికి సంకేతంగా ఉన్న సాతానుచేత ప్రేరేపించబడ్డాయని నేను నమ్ముతున్నాను.”
ఝాన్ డెల్యూమోలానే చాలామంది నేడు కుటుంబ స్థాయి నుండి అంతర్జాతీయ సంఘటనల స్థాయి వరకు మానవ సమాజంలో జరుగుతున్న భయంకరమైన విషయాలను “పైశాచికం” అనే వర్ణిస్తారు. కానీ దీనంతటికీ అర్థం ఏమిటి? అలాంటి అకృత్యాలను అమూర్తమైన దుష్టశక్తులకు మాత్రమే ఆపాదించాలా, లేక మానవులు సాధారణంగా చేసే చెడు పనులను మించిపోయే భయానకమైన నేరాలు చేసేలా వారిని పురికొల్పే కొన్ని దుష్టశక్తులు ఉన్నాయా? అలాంటి శక్తులు దుష్టత్వానికే రారాజైన అపవాదియైన సాతాను అదుపాజ్ఞల్లో మెలుగుతున్నాయా?
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
పిల్లలు: U.S. Coast Guard photo