‘భవిష్యత్తులో జ్ఞానము గలవారవ్వండి’
‘భవిష్యత్తులో జ్ఞానము గలవారవ్వండి’
“మానవుల్లోని అధికశాతం తమ జీవితంలోని తొలి దశను, తమ చివరి దశ వేదనభరితమయ్యేలా చేసుకునేందుకు వెచ్చిస్తారు.” ఇవి 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ వ్యాస రచయిత అయిన ఝాన్ డె ల బ్రుయెరి మాటలు. వాస్తవానికి సందిగ్ధావస్థలో ఉండే యౌవనస్థుడు అసంతృప్తి చెందుతూ వ్యాకులపడుతూ తన ఎదుట ఉన్నవాటిని ఎంపిక చేసుకోవడంలో అటు ఇటు ఊగిసలాడవచ్చు. మరోవైపున, మొండితనం గల యౌవనస్థుడు తన మలి జీవితంలో ఆనందాన్ని హరించి వేయగలిగే మూర్ఖపు విధానంలోనే కొనసాగాలని మొండి పట్టుదలతో ఉండవచ్చు. ఏ విధంగానైనా సరే, సరైనది చేయకపోయినా, తప్పు చేసినా కూడా చెప్పుకోదగినంత వేదనకే అది దారితీయవచ్చు.
అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఎలా నివారించవచ్చు? యౌవనస్థులకుండే అనిశ్చయ స్థితిని గురించి హెచ్చరిస్తూ దేవుని వాక్యం యౌవనస్థులకు ఇలా ఉపదేశిస్తోంది: “దుర్దినములు రాకముందే—ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.” (ప్రసంగి 12:1, 2) మీరు యౌవనస్థులైతే, యౌవన దశలో ఉండగానే ‘మీ సృష్టికర్త’ గురించి తెలుసుకోవడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోండి.
యౌవనస్థులు సాధారణంగా చేసే పొరపాట్లను నివారించడానికి బైబిలు యౌవనస్థులకు ఎలా సహాయం చేస్తుంది? అదిలా చెబుతోంది: ‘భవిష్యత్తులో జ్ఞానము గలవారయ్యేలా ఉపదేశమును విని క్రమశిక్షణను అంగీకరించండి.’ (సామెతలు 19:20, NW) యౌవనంలోనే గానీ ఏ వయస్సులోనైనా గానీ నిర్లక్ష్యం మూలంగానో తిరుగుబాటు చేసో దైవిక జ్ఞానాన్ని నిరాకరించేవారు బాధాకరమైన పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుందని కూడా బైబిలు స్పష్టంగా చూపిస్తుంది. (సామెతలు 13:18) దానికి భిన్నంగా, దైవిక నిర్దేశాలను లక్ష్యపెడితే ‘దీర్ఘాయువు, శాంతి,’ సంతృప్తికరమైన ఆనందభరితమైన జీవితం లభిస్తాయి.—సామెతలు 3:2.