కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మీపట్ల శ్రద్ధ కలిగివున్నాడు

యెహోవా మీపట్ల శ్రద్ధ కలిగివున్నాడు

యెహోవా మీపట్ల శ్రద్ధ కలిగివున్నాడు

“[దేవుడు] మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”​1 పేతురు 5:⁠7.

1. ఏ ప్రాముఖ్యమైన మార్గంలో యెహోవా సాతాను ఇరువురు పూర్తిగా విభిన్నంగా ఉన్నారు?

యెహోవా మరియు సాతాను ఇద్దరూ పూర్తిగా వ్యతిరేక స్వభావం గలవారు. యెహోవా పట్ల ఆకర్షితుడైన వ్యక్తి అపవాదికి దూరం కాగలడు. ఈ విభిన్నత ఒక ప్రామాణిక సంప్రదింపు గ్రంథంలో పేర్కొనబడింది. బైబిలు పుస్తకమైన యోబులో పేర్కొనబడిన సాతాను కార్యకలాపాల గురించి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (1970) ఇలా చెబుతోంది: ‘సాతాను పనల్లా భూమంతా కలియతిరిగి నిందారోపణలు చేయడానికి పనికివచ్చే పనులను గురించి మనుష్యులను గురించి వెదకడమే; అతని పని, భూమంతా చూస్తూ మంచినంతటినీ బలపరుస్తూ ఉండే “యెహోవా కనుదృష్టి”కి వ్యతిరేకంగా ఉంది. (2 దిన. 16:⁠9) నిస్వార్థంగా మంచిని తలపెట్టే మానవుల విషయంలో సాతాను రంధ్రాన్వేషిగా ఉంటాడు, దేవుని అధికార నియంత్రణల క్రింద దేవుడు ఏర్పరచిన హద్దుల్లోపల ఆ మంచితనాన్ని పరీక్షించడానికి అతడు అనుమతించబడ్డాడు.’ అవును, ఇద్దరికీ ఎంత తేడా!​—⁠యోబు 1:​6-12; 2:1-7.

2, 3. (ఎ) “అపవాది” అనే పదానికిగల అర్థం యోబుకు సంభవించిన దాన్నిబట్టి ఎలా స్పష్టం చేయబడింది? (బి) భూమ్మీద ఉన్న యెహోవా సేవకులను సాతాను నిందిస్తూనే ఉన్నాడని బైబిలు ఎలా చూపిస్తోంది?

2 “అపవాది” అని అనువదించబడిన గ్రీకు పదానికి “బూటకపు నిందారోపకుడు” “కొండెములు చెప్పేవాడు” అని అర్థం. సాతాను, “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?” అని అంటూ యెహోవాకు విశ్వసనీయుడిగా ఉన్న యోబు స్వార్థపర కారణాలతో ఆయన్ను సేవిస్తున్నాడని నిందారోపణ చేశాడని యోబు గ్రంథం వెల్లడిచేస్తోంది. (యోబు 1:⁠9) యోబు గ్రంథంలోని వృత్తాంతం యోబు పరీక్షలను శ్రమలను ఎదుర్కొన్నా ఆయన అంతకంతకూ యెహోవాకు సన్నిహితం అయ్యాడని చూపిస్తుంది. (యోబు 10:​9, 12; 12:​9, 10; 19:​25; 27:⁠5; 28:​28) తను అనుభవించిన విషమ పరీక్షల తర్వాత ఆయన దేవునితో ఇలా అన్నాడు: “వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.”​—⁠యోబు 42:⁠5.

3 యోబు కాలం తర్వాత నుండి సాతాను దేవుని విశ్వసనీయులైన సేవకులను నిందించడం మానుకున్నాడా? లేదు. ఈ అంత్యదినాల్లో సాతాను క్రీస్తు యొక్క అభిషిక్త సహోదరులను అలాగే విశ్వసనీయులైన వారి సహచరులను నిందిస్తూనే ఉన్నాడని ప్రకటన పుస్తకం తెలియజేస్తోంది. (2 తిమోతి 3:​12; ప్రకటన 12:​10, 17) కాబట్టి, నిజ క్రైస్తవులుగా మనం మనపై శ్రద్ధగల యెహోవాను ప్రగాఢమైన ప్రేమతో సేవిస్తూ తద్వారా సాతాను నిందలు అబద్ధాలని రుజువుచేస్తూ దేవుడైన యెహోవాకు మనల్ని మనం లోబరచుకొంటూ ఉండాల్సిన అగత్యం ఉంది. అలా చేసినప్పుడు మనం యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తాము.​—⁠సామెతలు 27:⁠11.

యెహోవా మనకు సహాయం చేసే మార్గాల కోసం వెదుకుతున్నాడు

4, 5. (ఎ) సాతానుకు విరుద్ధంగా యెహోవా భూమ్మీద దేనికోసం వెదుకుతున్నాడు? (బి) మనం యెహోవా అనుగ్రహాన్ని పొందాలనుకుంటే మనవైపు నుండి ఏమి అవసరమవుతుంది?

4 అపవాది ఎవరినో ఒకరిని నిందించడానికి మ్రింగివేయడానికి అవకాశాలు లభిస్తాయేమోనని భూమంతా కలియతిరుగుతూ వెదుకుతున్నాడు. (యోబు 1:​7, 9; 1 పేతురు 5:⁠8) దానికి విరుద్ధంగా యెహోవా, తన బలం అవసరమున్నవారికి సహాయం చేసే మార్గాల కోసం వెదుకుతున్నాడు. ప్రవక్తయైన హనానీ రాజైన ఆసాతో ఇలా అన్నాడు: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:⁠9) విద్వేషపూరితమైన సాతాను పరిశీలనకూ ప్రేమపూర్వకమైన యెహోవా శ్రద్ధకూ ఎంత తేడా ఉందో కదా!

5 మనలోని ప్రతి తప్పిదాన్ని ప్రతి వైఫల్యాన్ని పట్టుకోవడానికి యెహోవా మనపైన గూఢచర్యం చేయడంలేదు. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:⁠3) దానికి జవాబు అందులోనే ఉంది: ఎవరూ నిలువజాలరు. (ప్రసంగి 7:​20) సంపూర్ణ హృదయాలతో మనం యెహోవాకు సన్నిహితం అయితే, ఆయన కనుదృష్టి మనపై ఉంటుంది, అయితే మనల్ని నిందించడానికి మాత్రం కాదు, బదులుగా మన ప్రయత్నాల్ని గమనిస్తూ మన ప్రార్థనలకు జవాబిస్తూ క్షమాపణను అందించడానికే. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.”​—⁠1 పేతురు 3:⁠12.

6. దావీదు ఉదాహరణ మనకు అటు ఓదార్పుకరంగాను ఇటు హెచ్చరికగాను ఎలా ఉంది?

6 దావీదు అపరిపూర్ణుడు, ఆయన ఘోరమైన పాపం చేశాడు. (2 సమూయేలు 12:​7-9) కానీ ఆయన తన హృదయాన్ని యెహోవా ఎదుట కుమ్మరించి, గాఢావేశంతో కూడిన ప్రార్థనలో ఆయనకు సన్నిహితం అయ్యాడు. (కీర్తన 51:​1-12, పైవిలాసం) యెహోవా దావీదు ప్రార్థన విని ఆయనను క్షమించాడు, అయితే తన పాపం యొక్క చేదైన పర్యవసానాలను మాత్రం ఆయన అనుభవించక తప్పలేదు. (2 సమూయేలు 12:​10-15) ఇది మనకు ఓదార్పును అలాగే ఒక హెచ్చరికను కూడా అందివ్వాలి. మనం నిజంగా పశ్చాత్తాపపడితే యెహోవా మన పాపాలను క్షమించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసుకోవడం ఓదార్పుకరంగా ఉంటుంది, కానీ పాపాల మూలంగా తరచు గంభీరమైన పర్యవసానాలు ఏర్పడతాయని గ్రహించడం చాలా ప్రాముఖ్యం. (గలతీయులు 6:​7-9) మనం యెహోవాకు సన్నిహితమవ్వాలనుకుంటే ఆయనను అప్రీతిపరచే దేనికైనా సాధ్యమైనంత దూరంగా ఉండాలి.​—⁠కీర్తన 97:⁠10.

యెహోవా తన ప్రజలను తనవైపుకు ఆకర్షించుకుంటాడు

7. యెహోవా ఎలాంటి ప్రజల కోసం చూస్తున్నాడు, ఆయన వారిని తనవైపుకి ఎలా ఆకర్షించుకుంటాడు?

7 దావీదు తన కీర్తనల్లో ఒకదానిలో ఇలా వ్రాశాడు: “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును; ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.” (కీర్తన 138:⁠6) అదే రీతిలో మరో కీర్తన ఇలా చెబుతోంది: “ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు. . . . ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు.” (కీర్తన 113:​5-8) అవును, మహోన్నతుడైన విశ్వ సృష్టికర్త భూమిని వంగిచూస్తున్నాడు, “[జరుగుతున్న] హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న” “దీనులను” “దరిద్రులను” ఆయన కన్నులు చూస్తున్నాయి. (యెహెజ్కేలు 9:⁠4) అలాంటివారిని ఆయన తన కుమారుడి ద్వారా తనవైపుకి ఆకర్షించుకుంటాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఇలా అన్నాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; . . . తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలే[డు].”​—⁠యోహాను 6:44, 65.

8, 9. (ఎ) మనందరం యేసు దగ్గరికి రావాల్సిన అవసరం ఎందుకు ఉంది? (బి) విమోచన క్రయధన ఏర్పాటులో ఎంతో గమనార్హమైనది ఏమిటి?

8 మానవులందరూ యేసు దగ్గరికి వచ్చి విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచాలి, ఎందుకంటే వారు పుట్టుకతోనే దేవునికి దూరమైన పాపులు. (యోహాను 3:​36) వారు దేవునితో సమాధానపడాల్సిన అవసరం ఉంది. (2 కొరింథీయులు 5:​20) తనతో సమాధానపడేందుకు ఏదైనా మార్గాన్ని ఏర్పాటు చేయమని పాపులు తనకు విజ్ఞప్తిచేసుకునేంతవరకూ దేవుడు వేచిచూడలేదు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. . . . ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.”​—⁠రోమీయులు 5:8, 10.

9 దేవుడు మానవులను తనతో సమాధానపరచుకుంటున్నాడన్న ఉదాత్తమైన సత్యాన్ని అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాస్తూ ధృవీకరించాడు: “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” (1 యోహాను 4:​9, 10) చొరవ తీసుకున్నది దేవుడే, మానవుడు కాదు. “పాపులమై” ఉన్న మనపట్ల, అదీ “శత్రువులమై” ఉన్న మనపట్ల అంత ప్రేమను కనపర్చిన దేవుని వైపుకి మీరు ఆకర్షించబడుతున్నట్లు మీరు భావించడం లేదా?​—⁠యోహాను 3:⁠16.

యెహోవాను వెదకాల్సిన అవసరం

10, 11. (ఎ) యెహోవాను వెదకడానికి మనం ఏమి చేయాలి? (బి) సాతాను దుష్ట విధానాన్ని మనం ఎలా దృష్టించాలి?

10 మనం తన దగ్గరికి రావాలని యెహోవా మనల్ని బలవంతం చేయడన్నది మనకు తెలుసు. మనం ఆయనను వెదకాలి, ‘ఆయన కోసం తడవులాడి కనుగొనాలి’ అయితే “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:​26, 27) మనం తనకు లోబడి ఉండాలని కోరడం ఆయన హక్కు అని మనం గుర్తించాలి. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.” (యాకోబు 4:​7, 8) అపవాదికి విరుద్ధంగా యెహోవా పక్షాన స్థిరంగా స్థానం వహించడానికి మనం సంకోచించకూడదు.

11 అంటే దానర్థం సాతాను దుష్ట విధానానికి దూరంగా ఉండడం అని. యాకోబు ఇలా కూడా వ్రాశాడు: “యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:⁠4) దీనికి భిన్నంగా, మనం యెహోవా స్నేహితులుగా ఉండాలనుకుంటే సాతాను లోకం మనల్ని ద్వేషిస్తుందని మనం గుర్తించాలి.​—⁠యోహాను 15:​19; 1 యోహాను 3:⁠13.

12. (ఎ) దావీదు ఏ ఓదార్పుకరమైన మాటలను వ్రాశాడు? (బి) ప్రవక్తయైన అజర్యా ద్వారా యెహోవా ఏ హెచ్చరికను చేశాడు?

12 సాతాను లోకం మనల్ని ఏదైనా ఒక నిర్దిష్టమైన విధానంలో వ్యతిరేకిస్తున్నట్లైతే మనం ప్రత్యేకంగా ప్రార్థనలో యెహోవా సహాయాన్ని అర్థిస్తూ ఆయనను సమీపించాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు యెహోవా బలమైన రక్షణ హస్తాన్ని చవిచూసిన దావీదు మన ఓదార్పుకై ఇలా వ్రాశాడు: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును.” (కీర్తన 145:​18-20) మనం ఒక్కొక్కరిగా పరీక్షించబడినప్పుడు యెహోవా మనల్ని రక్షించగలడని, తన ప్రజలను ఒక సమూహముగా కూడా ఆయన “మహాశ్రమలనుండి” రక్షిస్తాడని ఈ కీర్తన చూపిస్తోంది. (ప్రకటన 7:​14) మనం యెహోవాకు సన్నిహితంగా ఉంటే ఆయన మనకు సన్నిహితంగా ఉంటాడు. “దేవుని ఆత్మ”చే నడిపించబడిన ప్రవక్తయైన అజర్యా, విస్తృతమైన అన్వయింపుగల ఒక సత్యాన్ని పేర్కొన్నాడు: “మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును.”​—⁠2 దినవృత్తాంతములు 15:1, 2.

యెహోవా మనకు వాస్తవికమైన వ్యక్తిగా ఉండాలి

13. యెహోవా మనకు వాస్తవికమైన వ్యక్తిగా ఉన్నాడని మనమెలా చూపించగలము?

13 “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” నడిచాడని అపొస్తలుడైన పౌలు మోషే గురించి వ్రాశాడు. (హెబ్రీయులు 11:​27) నిజమే, మోషే ఎన్నడూ యెహోవాను చూడలేదు. (నిర్గమకాండము 33:​20) కానీ యెహోవా ఆయనకు ఎంత వాస్తవికమైన వ్యక్తిగా ఉన్నాడంటే ఆయన యెహోవాను చూసినట్లే భావించాడు. అదే విధంగా, విశ్వసనీయులైన సేవకులు శ్రమలు అనుభవించేందుకు అనుమతించినా వారిని ఎన్నడూ విడనాడని దేవుడని యోబు తన శ్రమల తర్వాత తన విశ్వాస నేత్రాలతో యెహోవాను మరింత స్పష్టంగా చూశాడు. (యోబు 42:⁠5) హనోకు నోవహులు ‘దేవునితో నడిచారని’ చెప్పబడింది. దేవుణ్ణి ప్రీతిపరుస్తూ ఆయనకు లోబడుతూ వారలా చేశారు. (ఆదికాండము 5:​22-24; 6:​9, 22; హెబ్రీయులు 11:​5, 7) యెహోవా హనోకు, నోవహు, యోబు, మోషేలకు ఎంత వాస్తవికమైన వ్యక్తిగా ఉన్నాడో మనకూ అలాగే ఉంటే మనం మన మార్గాలన్నిటిలో ‘ఆయన అధికారమునకు ఒప్పుకొంటాము,’ అప్పుడు ‘ఆయన మన త్రోవలను సరాళము చేస్తాడు.’​—⁠సామెతలు 3:5, 6.

14. యెహోవాను “హత్తుకొని” ఉండడం అంటే ఏమిటి?

14 ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలోకి ప్రవేశించబోతుండగా మోషే వారికి ఇలా సలహా ఇచ్చాడు: “మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను.” (ద్వితీయోపదేశకాండము 13:⁠4) వారు యెహోవాను అనుసరించి, ఆయనకు భయపడాలి, లోబడాలి, ఆయనను హత్తుకొని ఉండాలి. “హత్తుకొని” అని అనువదించబడిన పదం గురించి మాట్లాడుతూ “ఇక్కడి భాష చాలా సన్నిహితమైన చాలా ఆంతరంగికమైన సంబంధాన్ని సూచిస్తోంది” అని ఒక బైబిలు విద్వాంసుడు పేర్కొంటున్నాడు. కీర్తనకర్త ఇలా చెబుతున్నాడు: “ప్రభువునకు భయపడువారు అతనికి సన్నిహితులగుదురు.” (కీర్తన 25:⁠14 పవిత్ర గ్రంథం, క్యాతలిక్‌ అనువాదము) యెహోవా మనకు వాస్తవికమైన వ్యక్తిగా ఉంటే, ఆయనను ఏవిధంగా అప్రీతిపరచాలన్నా భయపడేంత ప్రేమ ఉంటే యెహోవాతో ఇలాంటి అమూల్యమైన సన్నిహితమైన సంబంధం మనకు సాధ్యమవుతుంది.​—⁠కీర్తన 19:9-14.

యెహోవా శ్రద్ధ మీకు తెలుస్తోందా?

15, 16. (ఎ) కీర్తన 34, యెహోవా మనపట్ల శ్రద్ధ వహిస్తున్నాడని ఎలా చూపిస్తోంది? (బి) యెహోవా మనకు చేసిన మేలులను గుర్తు చేసుకోవడం కష్టంగా ఉంటున్నట్లైతే మనం ఏమి చేయాలి?

15 సాతాను జిత్తుల్లో ఒకటి ఏమిటంటే మన దేవుడైన యెహోవా విశ్వసనీయులైన తన సేవకుల పట్ల నిరంతరం శ్రద్ధ వహిస్తున్నాడన్న వాస్తవాన్ని మనం మర్చిపోయేలా చేయడమే. ఇశ్రాయేలు రాజైన దావీదు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సహితం ఆయనకు యెహోవా రక్షణ హస్తం గురించి తెలుసు. ఆయన గాతు రాజైన ఆకీషు ఎదుట వెఱ్ఱివాడిలా నటించాల్సి వచ్చినప్పుడు ఒక గీతాన్ని కూర్చాడు, ఎంతో రమణీయమైన కీర్తన అది; అందులో ఈ విశ్వాస వ్యక్తీకరణలున్నాయి: “నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.”​—⁠కీర్తన 34:3, 4, 7, 8, 18, 19; 1 సమూయేలు 21:10-15.

16 మీరు యెహోవా రక్షణా శక్తిని గురించి ఒప్పించబడ్డారా? ఆయన దేవదూతల కాపుదల గురించి మీకు తెలుసా? మీరు వ్యక్తిగతంగా యెహోవా ఉత్తముడని రుచిచూసి తెలుసుకున్నారా? క్రితంసారి యెహోవా మీకు చేసిన మేలు మీకు బాగా గుర్తున్న సందర్భమేది? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అది, మీరు పరిచర్య చేస్తుండగా మీరిక కొనసాగలేరని మీరు భావిస్తుండగా చివరి గృహాన్ని సందర్శిస్తున్నప్పుడు జరిగిందా? బహుశ అప్పుడు మీరు గృహయజమానితో అద్భుతమైన సంభాషణను జరిపివుండవచ్చు. మీకు కావలసిన బలాధిక్యాన్ని అందజేసినందుకు, మిమ్మల్ని ఆశీర్వదించినందుకు మీరు మరచిపోకుండా యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుకున్నారా? (2 కొరింథీయులు 4:⁠7) మరోవైపు చూస్తే, బహుశ యెహోవా మీ విషయంలో చేసిన ఒక నిర్దిష్టమైన మేలును జ్ఞాపకం చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. మీరు బహుశ ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, లేదా ఇంకా ఎక్కువ కాలం క్రితం గురించి ఆలోచించాల్సివుండవచ్చు. అలా జరిగినట్లైతే, యెహోవాకు సన్నిహితం అవ్వడానికి గట్టి కృషిచేసి, ఆయన మిమ్మల్ని ఎలా నడిపించి నిర్దేశిస్తున్నాడో చూడడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను ఇలా ఉద్బోధించాడు: “దేవు[ని] . . . బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” (1 పేతురు 5:​6, 7) ఆయన మీపట్ల ఎంత శ్రద్ధ కలిగివున్నాడో చూసి మీరు నిజానికి ఆశ్చర్యపోతారు!​—⁠కీర్తన 73:⁠28.

యెహోవాను వెదకుతూనే ఉండండి

17. మనం యెహోవాను వెదుకుతూ ఉండాలంటే ఏమి అవసరం?

17 యెహోవాతో సంబంధం నిరంతరం పెంపొందించుకోవలసిన అవసరం ఉండే సంబంధం. యేసు తన తండ్రికి చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) యెహోవాను గురించి ఆయన కుమారుని గురించి పరిజ్ఞానాన్ని పొందడానికి నిరంతర కృషి అవసరం. మనం “దేవుని మర్మములను” గ్రహించడానికి ప్రార్థన సహాయము పరిశుద్ధాత్మ సహాయము మనకు అవసరం. (1 కొరింథీయులు 2:​10; లూకా 11:​13) “తగినవేళ” ఇవ్వబడుతున్న ఆధ్యాత్మిక ఆహారంతో మన మనస్సులను నింపుకునేందుకు మనకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” నడిపింపు కూడా అవసరం. (మత్తయి 24:​45) మనం తన వాక్యాన్ని అనుదినం చదవాలని, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావాలని, “రాజ్య సువార్త” ప్రకటించడంలో హృదయపూర్వకంగా భాగం వహించాలని యెహోవా ఆ మాధ్యమం ద్వారా మనకు సలహా ఇచ్చాడు. (మత్తయి 24:​14) అలా చేయడం ద్వారా మనం శ్రద్ధగల మన దేవుడైన యెహోవాను వెదుకుతూ ఉంటాము.

18, 19. (ఎ) మనం ఏమి చేయాలని కృతనిశ్చయంతో ఉండాలి? (బి) మనం అపవాదికి విరుద్ధంగా స్థిరమైన స్థానాన్ని వహించి, యెహోవాను వెదుకుతూ ఉంటే ఎలా ఆశీర్వదించబడతాము?

18 యెహోవా ప్రజలపై అన్ని వైపుల నుండి హింసను, వ్యతిరేకతను, ఒత్తిడిని తెచ్చేందుకు సాతాను తన శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నాడు. మన శాంతిని విచ్ఛిన్నం చేసి మన దేవునితో మనకున్న మంచి స్థానాన్ని నాశనం చేసేందుకు అతడు ప్రయత్నిస్తాడు. మనం యథార్థహృదయులను కనుగొని, వారు విశ్వసర్వాధిపత్యమనే వివాదంలో యెహోవా పక్షానికి వచ్చేలా వారికి సహాయం చేసే పనిని కొనసాగించకూడదని వాడు కోరుకుంటున్నాడు. కానీ యెహోవా మనల్ని దుష్టునినుండి తప్పిస్తాడనే నమ్మకంతో ఆయనకు విశ్వసనీయంగా నిలిచివుండాలని కృతనిశ్చయంతో ఉండాలి. దేవుని వాక్యం మనల్ని నడిపించేందుకు అనుమతిస్తూ, ఆయన దృశ్య సంస్థతో క్రియాత్మకంగా పనిచేస్తూ ఆయన మనకు మద్దతునివ్వడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాడన్న నమ్మకంతో మనం ఉండగలము.​—⁠యెషయా 41:8-13.

19 కాబట్టి, మనందరం అపవాదికి వాడి జిత్తులకు విరుద్ధంగా స్థిరమైన స్థానం కలిగివుండి, మనల్ని ‘స్థిరపరచి బలపరచడంలో’ విఫలం కాని మన ప్రియమైన దేవుడైన యెహోవాను ఎల్లప్పుడు వెదుకుతూ ఉందాము. (1 పేతురు 5:​8-11) ఆ విధంగా మనం “నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుం[దాము].”​—⁠యూదా 20, 21.

మీరెలా జవాబిస్తారు?

• “అపవాది” అన్న పదానికి అర్థం ఏమిటి, ఆ అర్థానికి అనుగుణంగా అపవాది ఎలా ఉన్నాడు?

• భూనివాసులను గమనించడంలో యెహోవా అపవాదికి ఎలా భిన్నంగా ఉన్నాడు?

• యెహోవాను సమీపించడానికి ఒక వ్యక్తి విమోచన క్రయధనాన్ని ఎందుకు స్వీకరించాలి?

• యెహోవాను “హత్తుకొని” ఉండడం అంటే అర్థం ఏమిటి, మనం ఆయనను ఎలా వెదుకుతూ ఉండగలము?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

ఎన్నో శ్రమలు ఉన్నా యోబు యెహోవా తనపట్ల శ్రద్ధవహించాడని అర్థం చేసుకున్నాడు

[16, 17వ పేజీలోని చిత్రాలు]

అనుదినం బైబిలు చదవడం, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావడం, ప్రకటనా పనిలో ఆసక్తితో పాల్గొనడం యెహోవా మనపట్ల శ్రద్ధవహిస్తాడని మనకు గుర్తు చేస్తాయి