సాతాను కల్పిత వ్యక్తా లేక నిజంగా ఉనికిలో ఉన్న దుష్ట ప్రాణా?
సాతాను కల్పిత వ్యక్తా లేక నిజంగా ఉనికిలో ఉన్న దుష్ట ప్రాణా?
దుష్టత్వం ఉద్భవం, ఎంతో ప్రాచీన కాలాలకు చెందిన ఆలోచనాపరుల్లోనే కుతూహలం రేకెత్తించింది. జేమ్స్ హేస్టింగ్స్ వ్రాసిన ఎ డిక్షనరీ ఆఫ్ ద బైబిల్ ఇలా చెబుతోంది: “మానవుడికి స్పృహ ప్రారంభమైనప్పటి నుండే తాను అదుపు చేయలేని శక్తులను, హానికరమైన వినాశకరమైన ప్రభావాన్ని చూపించిన శక్తులను ఎదుర్కోవలసి వస్తున్నట్లు గ్రహించాడు.” అదే పుస్తకం ఇంకా ఇలా అంటోంది: “తొలి మానవజాతి సహజసిద్ధ జ్ఞానంతో కారణాల కోసం వెదికింది, ప్రకృతి శక్తులను మరితర ప్రకృతి అంశాలను వ్యక్తులకు సంబంధించినవన్నట్లు అర్థంచేసుకుంది.”
చరిత్రకారుల ప్రకారం రాక్షసులు దుష్టాత్మలు వంటివాటిలో ఉన్న నమ్మకాల జాడలు మెసపొటేమియా తొలి చరిత్రలో సహితం కనిపిస్తాయి. పాతాళంలో, అంటే “తిరిగిరాని లోకం”లో “కాల్చే వాడు” అనే పేరుగల నెర్గలు అనే హింసాత్మక దేవుడు అధ్యక్షత వహిస్తాడని ప్రాచీన బబులోనీయులు నమ్మేవారు. వారు దయ్యాలకు కూడా భయపడి, మంత్రాలు జపిస్తూ వాటిని శాంతింపజేయడానికి ప్రయత్నించేవారు. ఈజిప్టు మిథ్యాకథల్లో దుష్టత్వానికి దేవుడైన సెట్, “సన్నని వంపు తిరిగిన ముట్టెతో, సరళ చతురస్రాకారంలోని చెవులతో, దృఢంగా ఉండి చీలికగల తోకతో భయంకరమైన ఆకృతిగల మృగంగా చిత్రించబడేవాడు.”—లారూస్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ మిథాలజీ.
గ్రీకులకు రోమన్లకు అటు మంచి దేవుళ్ళు ఇటు చెడ్డ దేవుళ్ళు ఉన్నా ప్రముఖుడైన దుష్ట దేవుడు మాత్రం వారికి లేడు. రెండు పరస్పర వ్యతిరేకమైన సూత్రాలు ఉన్నాయని వారి తత్వజ్ఞానులు బోధించారు. ఎంపెడక్లీస్ అభిప్రాయం ప్రకారం అవి ప్రేమ మరియు అసమ్మతి. ప్లేటో అభిప్రాయం ప్రకారం లోకంలో రెండు “ఆత్మలు” ఉన్నాయి, ఒకటి మంచిని చేసేది మరొకటి దుష్టత్వానికి కారణమయ్యేది. ల డ్యాబ్లా (అపవాది) అనే తన పుస్తకంలో ఝార్జ్ మీన్వా పేర్కొన్నట్లుగా, “ప్రామాణికయుగపు [గ్రీకుల రోమన్ల] అన్యమతం అపవాది ఉనికిని అంగీకరించలేదు”
అహూరా మజ్దా లేక ఓర్‌మజ్ద్ అనే అత్యున్నత దేవుడు అంగ్రా మైన్యూ లేక ఆరిమన్‌ను సృష్టించాడనీ, ఇతడు దుష్టత్వం చేయడాన్ని ఎంపికచేసుకున్నాడనీ, అలా అతను వినాశకరమైన ఆత్మ, లేక వినాశకుడు అయ్యాడనీ ఇరాన్‌లోని జొరాష్ట్రియనిజం బోధించింది.
యూదా మతంలో దేవునికి వ్యతిరేకుడిగా పాపాన్ని ప్రవేశపెట్టినవాడిగా సాతానును గురించిన చిత్రణ ఉంది. కానీ అనేక శతాబ్దాల తర్వాత ఆ చిత్రీకరణ అన్య మతాల తలంపులతో వక్రీకరించబడింది. ఎన్‌సైక్లోపీడియా జుడైకా ఇలా అంటోంది: “సా.శ.పూ. చివరి శతాబ్దాలకల్లా . . . ఒక గొప్ప మార్పు సంభవించింది. ఆ కాలంలో [యూదా] మతం . . . ద్విత్వ సిద్ధాంతంలోని అనేక లక్షణాలను స్వీకరించింది. ఈ సిద్ధాంతంలో పరలోకంలోనూ భూమిమీదా ఎంతో బలశాలురైన దుష్టశక్తులు మోసకరమైన శక్తులు దేవుడికి, మంచి మరియు సత్యం యొక్క శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతుంటాయి. ఇది పర్షియా మతం ప్రభావం కావచ్చు.” ద కన్‌సైస్ జ్యూయిష్ ఎన్‌సైక్లోపీడియా ఇలా ప్రకటిస్తోంది: “దయ్యాలకు విరుద్ధంగా రక్షణ, ఆజ్ఞలను పాటించడం ద్వారా తాయెత్తులు ఉపయోగించడం ద్వారా లభిస్తుంది.”
మతభ్రష్ట క్రైస్తవత్వపు దైవశాస్త్రం
యూదా మతం సాతాను గురించి దయ్యాల గురించి బైబిలేతర తలంపులను స్వీకరించినట్లే మతభ్రష్ట క్రైస్తవులు లేఖనాధారితం కాని తలంపులను పెంపొందించారు. ది యాంకర్ బైబిల్ డిక్షనరీ ఇలా పేర్కొంటోంది: “ప్రాచీన దైవశాస్త్ర తలంపులలో మరీ అతివాదంతో కూడినదేమిటంటే, దేవుడు సాతానుకు ఒక నిర్దిష్ట మూల్యాన్ని ముట్టజెప్పి తన ప్రజలను విడిపించుకున్నాడన్నదే.” ఈ తలంపును ఐరీనియస్ (సా.శ. రెండవ శతాబ్దం) ప్రతిపాదించాడు. దీన్ని ఆ తర్వాత ఆరిజెన్ (సా.శ. మూడవ శతాబ్దం) అభివృద్ధిచేశాడు. “అపవాది తాను మనుషులకు చట్టబద్ధంగా యజమానినని వాదించాడని” ఆయన అన్నాడు. “క్రీస్తు మరణం అనేది . . . అపవాదికి చెల్లించబడిన విమోచన క్రయధనం” అని ఆయన భావించాడు.—అడాల్ఫ్ హార్నాక్ రచించిన హిస్టరీ ఆఫ్ డాగ్మా.
ద క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియాను ఎత్తి చెప్పాలంటే, “దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు [విమోచన క్రయధనం అపవాదికి చెల్లించబడిందన్న తలంపు] దైవశాస్త్ర చరిత్రలో ప్రముఖ పాత్ర నిర్వహించింది,” అది చర్చి నమ్మకాల్లో భాగంగా ఉండిపోయింది. ఆగస్టీన్‌తో (సా.శ. నాలుగు-ఐదు శతాబ్దాలు) సహా ఇతర చర్చి ఫాదర్లు విమోచన క్రయధనం సాతానుకు చెల్లించబడిందన్న తలంపును స్వీకరించారు. చివరికి, సా.శ. 12వ శతాబ్దానికల్లా క్యాథలిక్ దైవశాస్త్ర పండితులైన ఆన్‌సెల్మ్ మరియు అబీలార్‌లు క్రీస్తు బలి సాతానుకు కాక దేవునికి అర్పించబడిందన్న ముగింపుకు వచ్చారు.
మధ్యయుగాల్లోని మూఢనమ్మకాలు
క్యాథలిక్ చర్చి సభలు చాలా మట్టుకు సాతాను విషయమై గమనార్హమైన రీతిలో మౌనంగా ఉండిపోయినా, సా.శ. 1215 లో నాలుగవ లాటెరన్ సభ “గంభీరమైన విశ్వాస ప్రకటన” అని న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా వర్ణించినదాన్ని అందించింది. సూత్రం 1 ఇలా పేర్కొంటోంది: “అపవాది, మరితర దయ్యాలు దేవునిచే స్వతస్సిద్ధంగా మంచిగానే సృష్టించబడినా స్వయంకృతంగానే దుష్టులుగా మారారు.” వారు ఎప్పుడూ మానవజాతిని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారని అది జోడించింది. మధ్యయుగాల్లోని అనేకులను ఈ రెండవ తలంపు ఎంతగానో ఆకర్షించింది. వివరింప శక్యంకాని అస్వస్థత, హఠాన్మరణం, లేదా పంటల్లో ఫలసాయం సరిగా ఉండకపోవడం వంటి అసాధారణమైనవిగా అనిపించిన ఏ సంఘటనకైనా వెనుక సాతాను ఉండేవాడు. సా.శ. 1233 లో పోప్ గ్రెగరీ IX మతవిరోధులకు విరుద్ధంగా కొన్ని ఆదేశాలను జారీజేశాడు, అందులో ఒక ఆదేశం అపవాది ఆరాధకులని చెప్పబడుతున్న లూసీఫరియన్‌లకు విరుద్ధంగా ఉంది.
సాతాను లేదా వాడి దయ్యాలు మనుషులను పీడిస్తాయన్న నమ్మకం అనతికాలంలోనే ఒక సామూహిక భయాన్ని—క్షుద్రవిద్యలను మంత్రవిద్యలను గురించిన గొప్ప భీతిని రేకెత్తించింది. 13 నుండి 17వ శతాబ్దం వరకు మంత్రగత్తెల భయం యూరప్ అంతటా వ్యాపించి, యూరప్ వలసదారుల ద్వారా ఉత్తర అమెరికాకు చేరుకుంది. చివరికి ప్రొటస్టెంట్ సంస్కరణదారులైన మార్టిన్ లూథర్, జాన్ కల్విన్‌లు మంత్రగత్తెలను వేటాడడానికి అనుమతినిచ్చారు. యూరప్‌లో మంత్రగత్తెల విచారణలు కేవలం పుకారు పైనా లేదా ద్వేషంతో చేసిన ఆరోపణలపైనే ఆధారపడివుండేవి, అవి క్యాథలిక్ మతవిచారణల్లోను లౌకిక కోర్టుల్లోను విచారించబడేవి. “అపరాధం” ఒప్పించడానికి చిత్రహింసలు పెట్టడం సర్వసాధారణం.
అపరాధులుగా రుజువైన వారిని దహించివేయడం ద్వారా గానీ ఇంగ్లాండులోను, స్కాట్లాండులోను ఉరి తీయడం ద్వారా గానీ మరణశిక్ష అమలుచేసేవారు. బాధితుల సంఖ్య ఎంత అన్నదాని గురించి ద వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “కొందరు చరిత్రకారుల ప్రకారం 1484 నుండి 1782 వరకు క్రైస్తవ చర్చి మంత్రగత్తెలన్న కారణంగా దాదాపు 3,00,000 మంది స్త్రీలను మృత్యువాతకు గురిచేసింది.” ఈ మధ్యయుగపు విషాదకర సంఘటనలకు సాతాను కారణమైతే వాడు ఉపయోగించుకున్న వ్యక్తులు ఎవరు—బాధితులా లేక ఛాందసవాదంతో హింసను ప్రేరేపించిన మతనాయకులా?
ప్రస్తుత నమ్మకం, అపనమ్మకం
18వ శతాబ్దంలో జ్ఞానోదయయుగం అని పిలువబడిన హేతువాదం మొగ్గతొడిగింది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెబుతోంది: “జ్ఞానోదయయుగంలోని తత్వజ్ఞానము, వేదాంతము సాతాను మధ్యయుగాల్లోని ఊహాకల్పిత వ్యక్తియేనని చెబుతూ క్రైస్తవ ఆలోచన నుండి అతడిని నిర్మూలించడానికి కృషిచేశాయి.” రోమన్ క్యాథలిక్ చర్చి దీనికి ప్రతిస్పందించి అపవాదియైన సాతానులో నమ్మకాన్ని మొదటి వాటికన్ సభలో (1869-70) నొక్కిచెప్పి, మళ్ళీ రెండవ వాటికన్ సభలో (1962-65) కాస్త సంకోచిస్తూనే చెప్పింది.
అధికారికంగా చూస్తే, న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా ఒప్పుకుంటున్నట్లుగా “చర్చి దేవదూతల్లోను, దయ్యాల్లోను నమ్మకానికి కట్టుబడివుంది.” అయితే, “చాలామంది క్రైస్తవులు నేడు లోకంలోని దుష్టత్వానికి అపవాదే కారణం అని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని” క్యాథలిక్‌వాదం గురించిన ఫ్రెంచి నిఘంటువైన టేయో ఒప్పుకుంటోంది. ఇటీవలి కాలాల్లో క్యాథలిక్ దైవశాస్త్ర పండితులు అటు అధికారిక క్యాథలిక్ సిద్ధాంతానికి ఇటు ఆధునిక ఆలోచనలకు మధ్య సంతులాన్ని కాపాడుకుంటూ సంశయాత్మకంగా చాలా జాగ్రత్తగా ఈ పరిస్థితితో వ్యవహరిస్తున్నారు. “సాతాను గురించి బైబిలు ఉపయోగించిన భాషను ‘సూచనార్థక భాష’గా తీసుకోవాలే తప్ప అక్షరార్థంగా తీసుకోకూడదని స్వేచ్ఛావాద క్రైస్తవ దైవశాస్త్రం పరిగణిస్తోంది—విశ్వంలోని దుష్టత్వం యొక్క వాస్తవికతను దాని విస్తృతిని వ్యక్తం చేయడానికి ఊహాకల్పిత వ్యక్తీకరణగా అది దృష్టిస్తోంది” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ప్రొటస్టెంటుల విషయానికి వస్తే ఇదే పుస్తకం ఇలా చెబుతోంది: “ఆధునిక స్వేచ్ఛావాద ప్రొటస్టెంటిజమ్ సాతాను ఒక వ్యక్తి అని నమ్మాల్సిన అవసరాన్ని నిరాకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.” కానీ నిజ క్రైస్తవులు సాతాను గురించి బైబిలు చెప్పేదాన్ని “సూచనార్థక భాష”గా పరిగణించాలా?
లేఖనాలేం బోధిస్తున్నాయి?
దుష్టత్వం ఉద్భవం గురించి బైబిలు ఇచ్చే వివరణకన్నా శ్రేష్ఠమైన వివరణ మానవ తత్వజ్ఞానము, దైవశాస్త్రము ఈ రెండూ ఇవ్వలేకపోయాయి. దుష్టత్వం ఉద్భవం గురించీ, ఊహకు కూడా అందనంతగా ఘోరమైన రీతిలో హింసలు ప్రతి సంవత్సరం పెచ్చుపెరిగి పోవడానికిగల కారణం గురించీ అర్థం చేసుకోవడానికి సాతాను విషయంలో లేఖనాలు చెప్పేది చాలా కీలకం.
కొందరిలా అడుగుతారు: ‘దేవుడు మంచివాడైతే, ప్రేమగల సృష్టికర్త అయితే, ఆయన సాతాను లాంటి దుష్ట ఆత్మ ప్రాణిని ఎలా సృష్టించగలిగాడు?’ యెహోవా దేవుని కార్యాలన్నీ పరిపూర్ణమని, ఆయన సృష్టించిన బుద్ధిజీవులన్నింటికీ స్వేచ్ఛా చిత్తం ఉన్నదని బైబిలు ఒక సూత్రాన్ని స్థాపిస్తోంది. (ద్వితీయోపదేశకాండము 30:19; 32:4; యెహోషువ 24:15; 1 రాజులు 18:21) కాబట్టి, సాతానుగా మారిన ఆత్మ ప్రాణి పరిపూర్ణంగా సృష్టించబడివుండాలి, అటుతర్వాత ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకుని నీతి సత్య మార్గాల నుండి వైదొలిగిపోయివుండాలి.—యోహాను 8:44; యాకోబు 1:14, 15.
అనేక విధాల్లో సాతాను చేపట్టిన తిరుగుబాటు మార్గం యెహెజ్కేలు 28:11-19) యెహోవా సర్వాధిపత్యాన్ని లేదా ఆయన సృష్టికర్తృత్వాన్ని సాతాను సవాలు చేయలేదు. ఎలా చేయగలడు, తనను సృష్టించిందే దేవుడు కదా? అయితే, సాతాను యెహోవా తన సర్వాధిపత్యాన్ని ఉపయోగించే విధానాన్ని మాత్రం సవాలు చేశాడు. ఏదెను తోటలో సాతాను, తొలి మానవ దంపతులకు హక్కు ఉన్న దేనినో, తమ సంక్షేమం ఆధారపడివున్న దేనినో దేవుడు అనుభవించకుండా చేస్తున్నాడని పరోక్షంగా నిందారోపణ చేశాడు. (ఆదికాండము 3:1-5) ఆదాము హవ్వలు నీతియుక్తమైన యెహోవా సర్వాధిపత్యానికి విరుద్ధంగా తిరుగుబాటు చేసేలా చేయడంలో కృతకృత్యుడై, వారిపైకి వారి సంతానంపైకి పాపమరణాలు వచ్చేలా చేశాడు. (ఆదికాండము 3:6-19; రోమీయులు 5:12) ఈ విధంగా మానవుల బాధలకు కారణం సాతాను అని బైబిలు చూపిస్తోంది.
“తూరు రాజును” పోలివుంది. ఈయన “సంపూర్ణసౌందర్యము” గలవాడని, ‘నియమింపబడిన దినము మొదలుకొని పాపము ఆయన యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో యథార్థవంతుడుగా’ ఉన్నాడని కావ్యరూపంలో వర్ణించబడ్డాడు. (ఈ తిరుగుబాటులో జలప్రళయానికి కొంతకాలం ముందు ఇతర దేవదూతలు కూడా సాతానుతో జతకలిశారు. వారు నరుల కుమార్తెలతో లైంగిక ఆనందాలను అనుభవించి తృప్తిపొందడానికి మానవ శరీరాలు ధరించారు. (ఆదికాండము 6:1-4) జలప్రళయంలో ఈ తిరుగుబాటుదారులైన దేవదూతలు ఆత్మ సామ్రాజ్యంలోకి మరలిపోయారు, కానీ పరలోకంలో దేవునితో తమ “ప్రధానత్వమును” తిరిగి పొందలేదు. (యూదా 6) వారు ఆధ్యాత్మిక గాఢాంధకార స్థితిలోకి పడద్రోయబడ్డారు. (1 పేతురు 3:19, 20; 2 పేతురు 2:4) వాళ్ళు దయ్యాలయ్యారు, ఇక ఎంతమాత్రము యెహోవా సర్వాధిపత్యం క్రింద సేవచేయక సాతాను ఆధిపత్యం క్రింద జీవిస్తున్నారు. వారు మళ్ళీ మానవ శరీరాలు ధరించలేకపోతున్నారని మనకు అర్థం అవుతోంది, అయినా దయ్యాలు ఇప్పటికీ మానవుల మనశ్శరీరాలపై గొప్ప ప్రభావాన్ని చూపించగలవు, నేడు మనం చూస్తున్న హింసల్లో ఎంతో భాగం వారి కారణంగానే జరుగుతున్నాయనడంలో సందేహం లేదు.—మత్తయి 12:43-45; లూకా 8:27-33.
త్వరలోనే సాతాను పరిపాలన అంతం
లోకంలో నేడు దుష్ట శక్తులు పనిచేస్తున్నాయని స్పష్టంగా కనబడుతోంది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “లోకమంతయు దుష్టుని యందున్న[ది].”—1 యోహాను 5:19.
అయితే అపవాది విధ్వంసాన్ని కలుగజేసేందుకు తనకు ఉన్న “సమయము కొంచెమే” అని ఆ తర్వాత తను నిర్బంధించబడతాడని తెలిసికొని భూమ్మీదికి తీసుకువచ్చే శ్రమలను ఉధృతం చేస్తున్నాడని ఇప్పటికే నెరవేరిన బైబిలు ప్రవచనం చూపిస్తోంది. (ప్రకటన 12:7-12; 20:1-3) సాతాను పరిపాలన అంతమవ్వడంతో ఒక నీతియుక్తమైన నూతన లోకం ప్రారంభమవుతుంది, అక్కడ ఏడ్పైనను, మరణమైనను, వేదనయైనను ‘ఇక ఉండవు.’ అప్పుడు దేవుని చిత్తము “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును.”—ప్రకటన 21:1-4; మత్తయి 6:9, 10.
[4వ పేజీలోని చిత్రాలు]
హింసాపూరిత దేవుడైన నెర్గలును (ఎడమవైపు చివర) బబులోనీయులు నమ్మారు; ప్లేటో (ఎడమ) రెండు పరస్పర విరుద్ధమైన “ఆత్మ”లను నమ్మాడు
[చిత్రసౌజన్యం]
స్థూపాకారంలోని రాయి: Musée du Louvre, Paris; ప్లేటో: National Archaeological Museum, Athens, Greece
[5వ పేజీలోని చిత్రాలు]
ఐరీనియస్, ఆరిజెన్, ఆగస్టీన్‌లు విమోచన క్రయధనం చెల్లించబడింది అపవాదికి అని బోధించారు
[చిత్రసౌజన్యం]
ఆరిజెన్: Culver Pictures; ఆగస్టీన్: From the book Great Men and Famous Women
[6వ పేజీలోని చిత్రం]
మంత్రగత్తెల భయం మూలంగా వేలాదిమంది మృత్యువాతకు గురయ్యారు
[చిత్రసౌజన్యం]
From the book Bildersaal deutscher Geschichte