కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంత్యదినాల్లో తటస్థంగా ఉంటున్న క్రైస్తవులు

అంత్యదినాల్లో తటస్థంగా ఉంటున్న క్రైస్తవులు

అంత్యదినాల్లో తటస్థంగా ఉంటున్న క్రైస్తవులు

“నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.”​యోహాను 17:​16.

1, 2. తన అనుచరులకు ఈ లోకంతో ఉండే సంబంధం గురించి యేసు ఏమి చెప్పాడు, ఆయన మాటలు ఏ ప్రశ్నలను ఉత్పన్నం చేస్తున్నాయి?

యేసు పరిపూర్ణుడైన మానవునిగా తన జీవితంలోని చివరి రాత్రి, తన శిష్యులు వినగలిగేలా సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన, నిజ క్రైస్తవులందరి జీవితాలను వర్ణించగల ఒక విషయాన్ని పేర్కొన్నాడు. తన అనుచరుల గురించి మాట్లాడుతూ ఆయనిలా అన్నాడు: “వారికి నీ వాక్యమిచ్చి యున్నాను, నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.”​—⁠యోహాను 17:​14-16.

2 తన అనుచరులు లోకసంబంధులై ఉండరని యేసు రెండుసార్లు అన్నాడు. అంతేగాక, అలా లోకం నుండి వేరుగా ఉండడం ఒత్తిళ్ళను తీసుకువస్తుంది అంటే లోకం వారిని ద్వేషిస్తుంది. అయినా, క్రైస్తవులు చింతించవలసిన అవసరం లేదు; యెహోవా వారికి కాపుదల నిస్తాడు. (సామెతలు 18:10; మత్తయి 24:​9, 13) యేసు మాటల దృష్ట్యా, మనం ఇలా అడగవచ్చు: ‘నిజ క్రైస్తవులు ఎందుకు లోకసంబంధులు కారు? లోకసంబంధులు కాకుండా ఉండడమంటే ఏమిటి? లోకం క్రైస్తవులను ద్వేషిస్తుంటే, వారు లోకాన్ని ఎలా దృష్టిస్తారు? ప్రాముఖ్యంగా వారు లోక ప్రభుత్వాలను ఎలా దృష్టిస్తారు?’ ఈ ప్రశ్నలకు లేఖనాధారిత సమాధానాలు మన అందరిపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి అవి మనకు ప్రాముఖ్యమైనవి.

“మనము దేవుని సంబంధుల[ము]”

3. (ఎ) మనల్ని లోకం నుండి వేరు చేసేదేమిటి? (బి) లోకం “దుష్టుని యందున్న[ది]” అనడానికిగల నిదర్శనమేమిటి?

3 మనం ఈ లోక సంబంధులము కాకపోవడానికి ఒక కారణం యెహోవాతో మనకున్న సన్నిహిత సంబంధం. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.” (1 యోహాను 5:​19) లోకాన్ని గురించి యోహాను పలికిన మాటలు సత్యమైవున్నాయన్నది స్పష్టం. నేడు ఎంతగానో ప్రబలి ఉన్న యుద్ధాలు, నేరము, క్రూరత్వము, అణచివేత, వంచన, లైంగిక దుర్నీతి దేవుని ప్రభావానికి కాదు గానీ సాతాను ప్రభావానికి నిదర్శనంగా ఉన్నాయి. (యోహాను 12:31; 2 కొరింథీయులు 4:4; ఎఫెసీయులు 6:​12) ఒక వ్యక్తి యెహోవాసాక్షి అయినప్పుడు ఆయన అలాంటి తప్పుడు అలవాట్లను కలిగివుండడు లేదా వాటిని ఆమోదించడు, దానితో ఆయన ఈ లోకసంబంధి కాకుండా ఉంటాడు.​—⁠రోమీయులు 12:2; 13:12-14; 1 కొరింథీయులు 6:9-11; 1 యోహాను 3:​10-12.

4. మనం యెహోవాకు చెందుతామని మనం ఏ యే విధాలుగా చూపిస్తాము?

4 లోకానికి భిన్నంగా, క్రైస్తవులు ‘దేవుని సంబంధులై’ ఉంటారని యోహాను అన్నాడు. తమను తాము యెహోవాకు సమర్పించుకునే వారందరూ ఆయనకు చెందుతారు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము.” (రోమీయులు 14:8; కీర్తన 116:​15) మనం యెహోవాకు చెందుతాము కాబట్టి, మనం ఆయనకు అనితర భక్తిని చెల్లిస్తాము. (నిర్గమకాండము 20:​4-6) కాబట్టి, ఒక నిజ క్రైస్తవుడు తన జీవితాన్ని ఏదో లౌకికపరమైన లక్ష్యానికి అంకితం చేసుకోడు. ఆయన జాతీయ చిహ్నాలను గౌరవించినప్పటికీ, చర్యల ద్వారాగానీ తన హృదయంలోగానీ వాటిని ఆరాధించడు. ఆయన క్రీడాకారులనుగానీ ఇతర ఆధునిక విగ్రహాలనుగానీ ఎంతమాత్రం ఆరాధించడు. అయితే తమకిష్టం వచ్చినట్లు చేసుకునేందుకు ఇతరులకున్న హక్కును ఆయన గౌరవిస్తాడు కానీ ఆయన మాత్రం కేవలం సృష్టికర్తనే ఆరాధిస్తాడు. (మత్తయి 4:10; ప్రకటన 19:​10) ఇది కూడా ఆయనను లోకం నుండి వేరు చేస్తుంది.

“నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు”

5, 6. దేవుని రాజ్యానికి లోబడి ఉండడం మనల్ని ఎలా లోకం నుండి వేరు చేస్తుంది?

5 క్రైస్తవులు క్రీస్తు యేసు అనుచరులు, దేవుని రాజ్య పౌరులు, ఇది కూడా వారిని ఈ లోకసంబంధులు కాకుండా చేస్తుంది. యేసు పొంతి పిలాతు ఎదుట విచారించబడుతున్నప్పుడు ఇలా అన్నాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కా[దు].” (యోహాను 18:​36) యెహోవా నామము పరిశుద్ధపర్చబడేందుకు ఆయన సర్వోన్నతాధిపత్యం రుజువుపర్చబడేందుకు, ఆయన చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు ఈ భూమ్మీద కూడా జరిగేలా చేసేందుకు తోడ్పడే మాధ్యమం రాజ్యమే. (మత్తయి 6:​9, 10) యేసు తన పరిచర్య అంతటిలోనూ రాజ్య సువార్తను ప్రకటించాడు, తన అనుచరులు విధానాంతము వరకు దానినిగూర్చి ప్రకటిస్తారని ఆయన అన్నాడు. (మత్తయి 4:23; 24:​14) “ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు[ను]” అని చెబుతున్న ప్రకటన 11:15 లోని ప్రవచనార్థకమైన మాటలు 1914 లో నెరవేరాయి. త్వరలోనే ఒకరోజు ఆ పరలోక రాజ్యము మానవజాతిని పరిపాలించే ఏకైక రాజ్యం అవుతుంది. (దానియేలు 2:​44) ఒకానొక సమయంలో, చివరికి లౌకిక పాలకులు సహితం దాని అధికారాన్ని గుర్తించేలా బలవంతం చేయబడతారు.​—⁠కీర్తన 2:​6-12.

6 దీనినంతటినీ మనస్సులో ఉంచుకుని నిజ క్రైస్తవులు నేడు దేవుని రాజ్యానికి లోబడి ఉంటూ ‘దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి’ అని యేసు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరిస్తారు. (మత్తయి 6:​33) అది వారిని తాము నివసిస్తున్న దేశంపట్ల నమ్మకద్రోహానికి పాల్పడేలా చేయదు గానీ అది వారిని లోకం నుండి ఆధ్యాత్మికంగా వేరు చేస్తుంది. మొదటి శతాబ్దంలోలాగే నేడు కూడా క్రైస్తవులకున్న ప్రధానమైన పని ‘దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమివ్వడమే.’ (అపొస్తలుల కార్యములు 28:​23) దేవుడిచ్చిన ఆ పనిని ఆటంకపరిచే హక్కు ఏ మానవ ప్రభుత్వానికీ లేదు.

7. నిజ క్రైస్తవులు ఎందుకు తటస్థంగా ఉంటారు, వారు దాన్ని ఎలా చూపించారు?

7 తాము యెహోవాకు చెందుతామన్నదానికీ, యేసు అనుచరులమన్నదానికీ దేవుని రాజ్య పౌరులమన్నదానికీ పొందికగా, యెహోవాసాక్షులు 20, 21వ శతాబ్దాల్లో జాతీయ అంతర్జాతీయ వివాదాల్లో తటస్థంగా ఉన్నారు. వారు ఏ పక్షమూ వహించలేదు, ఎవరిపైకీ ఆయుధాలు ఎత్తలేదు, లౌకికపరమైన ఏ లక్ష్యం కోసమూ ప్రచారం చేయలేదు. అత్యధికమైన వ్యతిరేకత సమయంలో తమ విశ్వాసాన్ని విశేషమైన విధంగా ప్రదర్శిస్తూ వారు 1934 లో జర్మనీలోని నాజీ పాలకులకు వ్యక్తం చేయబడిన ఈ సూత్రాలను అనుసరించారు: “మాకు రాజకీయ వ్యవహారాల్లో ఏ విధమైన ఆసక్తీ లేదు కానీ క్రీస్తు రాజుగా ఉన్న దేవుని రాజ్యానికి మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకున్నాము. మేమెవరికీ ఏ కీడూ ఏ హానీ చేయము. సమాధానంగా ఉంటూ అవకాశం లభించినప్పుడల్లా అందరికీ మంచి చేయడంలో ఆనందాన్ని పొందుతాము.”

క్రీస్తుకు రాయబారులు, దూతలు

8, 9. యెహోవాసాక్షులు నేడు ఏ విధంగా రాయబారులుగా, దూతలుగా ఉన్నారు, ఇది రాజ్యాలతో వారి సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

8 “దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై” ఉన్నామని పౌలు తన గురించి, తన తోటి అభిషిక్త క్రైస్తవుల గురించి చెప్పాడు. (2 కొరింథీయులు 5:20; ఎఫెసీయులు 6:​20) 1914 నుండి, ఆత్మాభిషిక్త క్రైస్తవులను దేవుని రాజ్య రాయబారులుగా పిలవడం సముచితమే, వారు ఆ రాజ్య ‘కుమారులై’ ఉన్నారు. (మత్తయి 13:​38, అధస్సూచి; ఫిలిప్పీయులు 3:20; ప్రకటన 5:​9, 10) అంతేగాక, అభిషిక్త కుమారులకు తమ రాయబార సంబంధమైన పనిలో మద్దతునివ్వడానికి యెహోవా భూ నిరీక్షణగల క్రైస్తవులను అంటే అన్ని జనాంగాల నుండి “వేరే గొఱ్ఱెల”కు చెందిన ‘ఒక గొప్ప సమూహమును’ సమకూర్చాడు. (యోహాను 10:​16; ప్రకటన 7:9) ఈ “వేరే గొఱ్ఱెల”ను దేవుని రాజ్య “దూతలు”గా పిలువవచ్చు.

9 ఒక రాయబారి ఆయన సిబ్బంది తాము సేవ చేస్తున్న దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలాగే, క్రైస్తవులు ఈ లోక రాజ్యాల రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉంటారు. వారు ఏ జాతీయ, జాతి సంబంధిత, సామాజిక, లేదా ఆర్థిక గుంపు పక్షమూ వహించరు లేదా వాటి వ్యతిరేక పక్షమూ వహించరు. (అపొస్తలుల కార్యములు 10:​34, 35) బదులుగా, వారు ‘అందరికీ మేలు చేస్తారు.’ (గలతీయులు 6:​10) యెహోవాసాక్షులు తటస్థంగా ఉంటారు కాబట్టి, వారు ఏదో జాతి సంబంధిత, జాతీయ, లేదా తెగసంబంధిత విభజనకు వ్యతిరేక పక్షంతో సహవసిస్తారని ఆరోపిస్తూ వారి సందేశాన్ని న్యాయంగా ఎవరూ నిరాకరించలేరు.

ప్రేమచే గుర్తించబడతారు

10. ఒక క్రైస్తవుడికి ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది?

10 పైన పేర్కొనబడిన కారణాలను బట్టే కాక క్రైస్తవులు ఇతర క్రైస్తవులతో తమకున్న సంబంధాన్ని బట్టి కూడా లోక వ్యవహారాల్లో తటస్థంగా ఉంటారు. యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు[రు].” (యోహాను 13:​35) సహోదర ప్రేమ క్రైస్తవులుగా ఉండడానికి కీలకం. (1 యోహాను 3:​14) ఒక క్రైస్తవునికి ఇతర క్రైస్తవులతో ఉండే సంబంధం చాలా సన్నిహితమైనది, అది ఆయనకు యెహోవాతోనూ యేసుతోనూ ఉన్న సంబంధం లాంటిదే. ఆయన ప్రేమ కేవలం స్థానిక సంఘంలోని వారికి మాత్రమే పరిమితమై ఉండదు. అది “లోకంలోని [తన] సహోదరుల యావత్‌ సహవాసానికి” విస్తరిస్తుంది.​—⁠1 పేతురు 5:​9, NW.

11. యెహోవాసాక్షుల పద్ధతి, వారిలో ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమచే ఎలా ప్రభావితం చేయబడింది?

11 “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును” అని చెబుతున్న యెషయా 2:4 లోని మాటలను నేడు యెహోవాసాక్షులు నెరవేర్చడం ద్వారా తమ సహోదర ప్రేమను ప్రదర్శిస్తున్నారు. యెహోవాచే ఉపదేశించబడిన నిజ క్రైస్తవులు దేవునితోనూ, ఒకరితో ఒకరూ సమాధానంగా ఉంటారు. (యెషయా 54:​13) వారు దేవుడ్ని, తమ సహోదరులను ప్రేమిస్తారు కాబట్టి, ఇతర దేశాల్లోని తమ తోటి క్రైస్తవుల పైకి​—⁠ఆ మాటకొస్తే మరెవరిపైకైనా​—⁠ఆయుధాలు ఎత్తడం వారికి అనూహ్యమైనది. వారి సమాధానము, ఐక్యత వారు చేసే ఆరాధనలో ఒక అత్యావశ్యకమైన భాగం, తమకు నిజంగా దేవుని ఆత్మ ఉందనడానికి ఒక నిదర్శనం. (కీర్తన 133:1; మీకా 2:12; మత్తయి 22:37-39; కొలొస్సయులు 3:​14) “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది” అని తెలుసుకుని వారు ‘సమాధానమును వెదకి దాని వెంటాడుతారు.’​—⁠కీర్తన 34:​14, 15.

క్రైస్తవులు లోకాన్ని దృష్టించే విధానం

12. ఈ లోకంలోని ప్రజలపట్ల యెహోవాకు ఉన్న ఏ దృక్పథాన్ని యెహోవాసాక్షులు అనుకరిస్తారు, ఎలా?

12 యెహోవా ఈ లోకానికి ప్రతికూల తీర్పును ప్రకటించాడు కానీ లోకంలోని ఒక్కొక్క వ్యక్తికీ ఆయన ఇంకా తీర్పు తీర్చలేదు. ఆయన తన నియమిత సమయంలో యేసు ద్వారా దాన్ని చేస్తాడు. (కీర్తన 67:3, 4; మత్తయి 25:31-46; 2 పేతురు 3:​10) ఈ లోగా, ఆయన మానవజాతి పట్ల గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ నిత్యజీవాన్ని పొందే అవకాశాన్ని కలిగి ఉండేలా ఆయన తన అద్వితీయ కుమారుడ్ని కూడా అనుగ్రహించాడు. (యోహాను 3:​16) తరచూ మన ప్రయత్నాలు తిరస్కారానికి గురైనప్పటికీ, రక్షణ కోసం దేవుడు చేసిన ఏర్పాట్ల గురించి ఇతరులకు చెప్పడం ద్వారా క్రైస్తవులముగా మనం దేవుని ప్రేమను అనుకరిస్తాము.

13. లౌకిక పాలకులను మనమెలా దృష్టించాలి?

13 లౌకిక పరిపాలకులను మనం ఎలా దృష్టించాలి? “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి” అని వ్రాసినప్పుడు పౌలు ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. (రోమీయులు 13:​1, 2) సర్వశక్తిమంతుడు అనుమతిస్తున్నందుకే మానవులు అధికారస్థానాల్లో (ఒకరితో ఒకరిని పోలిస్తే ఒకరిది ఉన్నత స్థానం మరొకరిది తక్కువ స్థానం కావచ్చు గానీ యెహోవా కంటే మాత్రం ఎల్లప్పుడూ క్రింది స్థానంలోనే) ‘నియమింపబడి’ ఉన్నారు. ఒక క్రైస్తవుడు లౌకిక అధికారానికి లోబడడం తాను యెహోవాకు విధేయత చూపించడంలో ఒక అంశం కాబట్టి అలా లోబడి ఉంటాడు. అయితే, దేవుడు కోరేవాటికి మానవ ప్రభుత్వం కోరేవాటికి మధ్య వివాదం తలెత్తినప్పుడేమిటి?

దేవుని నియమం, కైసరు నియమం

14, 15. (ఎ) విధేయత చూపించే విషయంలో దానియేలు ఏ విధంగా వివాదాన్ని నివారించగలిగాడు? (బి) విధేయత చూపించే విషయంలో వివాదాన్ని నివారించలేని పరిస్థితిలో ముగ్గురు హెబ్రీయులు ఏమి చేశారు?

14 మానవ ప్రభుత్వాలకు లోబడడానికీ దైవిక అధికారానికి లోబడడానికీ మధ్య సమతుల్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలనే విషయంలో దానియేలు ఆయన ముగ్గురు సహచరులు చక్కని మాదిరిని అందజేశారు. యౌవనస్థులైన ఈ నలుగురు హెబ్రీయులు బబులోనుకు బంధీలుగా తీసుకువెళ్ళబడినప్పుడు, వారు ఆ దేశ నియమాలకు విధేయత చూపించారు. వారు కొంతకాలానికి ప్రత్యేక తర్ఫీదు కోసం ఎంపిక చేయబడ్డారు. దానియేలు ఆ తర్ఫీదు యెహోవా నియమానికి విరుద్ధమైనదై ఉండగలదని గ్రహించి, ఆ విషయాలను చూసుకుంటున్న అధికారితో విషయాన్ని చర్చించాడు. ఫలితంగా, ఆ నలుగురు హెబ్రీయుల మనస్సాక్షులను గౌరవించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. (దానియేలు 1:​8-17) యెహోవాసాక్షులు అనవసరమైన సమస్యలను తప్పించుకోవడానికి తమ స్థానాన్ని గురించి అధికారులకు యుక్తిగా వివరించడంలో దానియేలు మాదిరిని అనుసరిస్తారు.

15 తర్వాత మరో సందర్భంలో, విధేయత చూపించడానికి సంబంధించిన విషయంలో వివాదాన్ని ఎదుర్కోక తప్పలేదు. బబులోను రాజు దూరా మైదానంలో ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి, దాని ప్రారంభోత్సవానికి సమావేశమవ్వమని సంస్థానము మీద విచారణకర్తలుగా ఉన్నవారితో సహా ఉన్నత అధికారులకు ఆజ్ఞాపించాడు. అప్పటికల్లా, దానియేలు ముగ్గురు స్నేహితులు బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించబడ్డారు కాబట్టి ఆ ఆజ్ఞ వారికి కూడా వర్తించింది. ఆ ఏర్పాట్లలో భాగంగా అక్కడ సమకూడి ఉన్నవారందరూ ఆ విగ్రహం ఎదుట సాగిలపడాలి. కానీ ఇది దేవుని నియమానికి విరుద్ధమైనదై ఉంటుందని ఆ హెబ్రీయులకు తెలుసు. (ద్వితీయోపదేశకాండము 5:​8-10) కాబట్టి మిగతా అందరూ సాగిలపడినప్పుడు, వారు నిలబడే ఉండిపోయారు. రాజాజ్ఞకు అవిధేయత చూపించడం మూలంగా వారు ఘోరమైన మరణాన్ని పొందే ప్రమాదంలో పడ్డారు, కేవలం ఒక అద్భుతం మూలంగా మాత్రమే వారి ప్రాణాలు కాపాడబడ్డాయి; కానీ వారు యెహోవాకు అవిధేయత చూపించడం కంటే మరణించడానికే ఎంపిక చేసుకున్నారు.​—⁠దానియేలు 2:49–3:​29.

16, 17. ప్రకటించడాన్ని మానుకోమని అపొస్తలులకు ఆజ్ఞాపించబడినప్పుడు వారెలా ప్రతిస్పందించారు, ఎందుకు?

16 మొదటి శతాబ్దంలో, యేసుక్రీస్తు అపొస్తలులు యెరూషలేములో యూదా నాయకుల ఎదుటకు పిలువబడి, యేసు నామమున ప్రకటించడాన్ని ఆపివేయమని ఆజ్ఞాపించబడ్డారు. వారెలా ప్రతిస్పందించారు? సమస్త జనులను శిష్యులను చేయమని యేసు వారికి నియామకాన్ని ఇచ్చాడు, యూదయకు చెందిన వారు కూడా ఆ సమస్త జనులలో ఒక భాగమే. యెరూషలేములోనూ మిగతా లోకమంతటిలోనూ తనకు సాక్షులుగా ఉండమని కూడా ఆయన వారికి చెప్పాడు. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:⁠8) యేసు ఇచ్చిన ఆజ్ఞలు, వారి పట్ల దేవునికున్న చిత్తానికి ప్రాతినిధ్యం వహిస్తాయని అపొస్తలులకు తెలుసు. (యోహాను 5:30; 8:​28) అందుకే వారు, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా” అన్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 4:19, 20; 5:​29.

17 అపొస్తలులు తిరుగుబాటు ధోరణితో ఏమీ ఉండలేదు. (సామెతలు 24:​21) అయినప్పటికీ, దేవుని చిత్తాన్ని చేయడం మానుకోమని మానవ పాలకులు వారికి చెప్పినప్పుడు, వారు ‘మేము మనుష్యులకు కాదు దేవునికే లోబడాలి’ అని మాత్రం చెప్పగలిగారు. మనం “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించ”వలసి ఉందని యేసు చెప్పాడు. (మార్కు 12:​17) మానవుడు అవిధేయత చూపమని చెప్పినందుకు మనం ఒక దైవిక ఆజ్ఞకు అవిధేయత చూపిస్తే, మనం దేవునికి చెందినదాన్ని మానవునికి ఇస్తున్నట్లే. బదులుగా, మనం కైసరుకు చెల్లించవలసినవన్నీ కైసరుకు చెల్లిస్తాము గానీ మనం యెహోవా సర్వోన్నత అధికారాన్ని గుర్తిస్తాము. ఆయన విశ్వ సర్వాధిపతి, సృష్టికర్త, అధికారానికే మూలం.​—⁠ప్రకటన 4:​10, 11.

మనం స్థిరంగా నిలబడతాము

18, 19. మన సహోదరుల్లో చాలామంది ఏ మాదిరికరమైన స్థానాన్ని వహించారు, వారి మాదిరిని మనం ఎలా అనుసరించవచ్చు?

18 ప్రస్తుతం అధిక సంఖ్యలో లౌకిక ప్రభుత్వాలు యెహోవాసాక్షుల తటస్థ స్థానాన్ని గుర్తిస్తాయి, దానికి మనం కృతజ్ఞులం. అయితే కొన్ని దేశాల్లో, సాక్షులు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇరవయ్యవ శతాబ్దమంతటిలోనే గాక ప్రస్తుత కాలంలో కూడా మన సహోదర సహోదరీల్లో కొందరు చాలా శక్తివంతంగా పోరాడారు, ఆధ్యాత్మిక భావంలో “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము” పోరాడారు.​—⁠1 తిమోతి 6:​12.

19 వారివలే మనం ఎలా స్థిరంగా నిలబడగలం? మొదటగా, మనం వ్యతిరేకత రావడం నిశ్చయమని గుర్తుంచుకోవాలి. మనకు వ్యతిరేకత ఎదురైనప్పుడు మనం కృంగిపోకూడదు లేదా ఆశ్చర్యపోకూడదు. పౌలు తిమోతిని ఇలా హెచ్చరించాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:12; 1 పేతురు 4:​12) సాతాను ప్రభావం రాజ్యమేలే ఈ లోకంలో, మనం వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఎలా ఉంటాము? (ప్రకటన 12:​17) మనం నమ్మకంగా ఉన్నంత వరకూ ‘ఆశ్చర్యపడుచు మనల్ని దూషించేవారు’ కొందరు ఎప్పుడూ ఉండనే ఉంటారు.​—⁠1 పేతురు 4:⁠4.

20. బలపర్చే ఏ సత్యాల గురించి మనకు గుర్తు చేయబడింది?

20 రెండవదిగా, యెహోవా ఆయన దూతలు మనకు మద్దతునిస్తారని మనకు గట్టి నమ్మకం ఉంది. ప్రాచీన కాలానికి చెందిన ఎలీషా చెప్పినట్లుగా, “మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నా[రు].” (2 రాజులు 6:16; కీర్తన 34:⁠7) యెహోవా మంచి కారణంతోనే, వ్యతిరేకుల నుండి ఒత్తిడి కొంతకాలం పాటు కొనసాగడానికి అనుమతిస్తుండవచ్చు. అయినప్పటికీ ఆయన సహించడానికి కావలసిన శక్తిని ఎల్లప్పుడూ మనకిస్తాడు. (యెషయా 41:​9, 10) కొందరు తమ ప్రాణాలు కోల్పోయారు, కాని దాన్ని బట్టి మనమేమీ భయపడిపోము. యేసు ఇలా అన్నాడు: “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో [“గెహెన్నాలో,” NW] నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.” (మత్తయి 10:​16-23, 28) ఈ విధానంలో మనం కేవలం ‘యాత్రికులము’ మాత్రమే. ఇక్కడ మన సమయాన్ని మనం “వాస్తవమైన జీవమును” అంటే దేవుని నూతన లోకంలో నిత్యజీవాన్ని “సంపాదించుకొను నిమిత్తము” ఉపయోగించుకుంటాము. (1 పేతురు 2:11; 1 తిమోతి 6:​18, 19) మనం దేవునికి నమ్మకంగా ఉన్నంత వరకూ ఏ మానవుడూ మనకా ప్రతిఫలం దక్కకుండా చేయలేడు.

21. మనం ఎల్లప్పుడూ ఏమి మనస్సులో ఉంచుకోవాలి?

21 కాబట్టి, యెహోవా దేవునితో మనకున్న అమూల్యమైన సంబంధాన్ని గుర్తుంచుకుందాము. క్రీస్తు అనుచరులుగా, రాజ్య పౌరులుగా ఉండేందుకు మనకున్న ఆశీర్వాదాన్ని మనం ఎల్లప్పుడూ విలువైనదిగా ఎంచుదాము. మనం మన సహోదరులను హృదయపూర్వకంగా ప్రేమిస్తూ వారి నుండి మనం పొందే ప్రేమను బట్టి ఎల్లప్పుడూ సంతోషిద్దాము. అన్నిటికంటే ముఖ్యంగా, “యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము” అని చెబుతున్న కీర్తనకర్త మాటలను లక్ష్యపెడదాము. (కీర్తన 27:14; యెషయా 54:​17) అప్పుడు మనం, మన ముందున్న అసంఖ్యాకులైన క్రైస్తవుల్లాగే ఈ లోక సంబంధులుకాక, తటస్థంగా ఉంటున్న నమ్మకమైన క్రైస్తవులముగా మన నిరీక్షణను దృఢంగా ఉంచుకుని స్థిరంగా నిలబడదాము.

మీరు వివరించగలరా?

• యెహోవాతో మనకున్న సంబంధం, మనల్ని ఈ లోకం నుండి ఎలా వేరు చేస్తుంది?

• దేవుని రాజ్య పౌరులుగా మనం ఈ లోకంలో ఎలా తటస్థ స్థానాన్ని కాపాడుకుంటాము?

• సహోదరులపట్ల ప్రేమ ఏ యే విధాలుగా మనల్ని తటస్థంగా ఉంచుతుంది, లోకం నుండి వేరుగా ఉంచుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్యానికి మనం చూపించే విధేయత ఈ లోకంతో మనకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

[16వ పేజీలోని చిత్రం]

ఒక హూటు ఒక టుట్సీ సంతోషంగా కలిసి పనిచేస్తున్నారు

[17వ పేజీలోని చిత్రం]

యూదులు, అరబ్బువారు అయిన క్రైస్తవ సహోదరులు

[17వ పేజీలోని చిత్రం]

సెర్బియాకు, బోస్నియాకు, క్రొయెషియాకు చెందిన క్రైస్తవులు ఒకరి సహవాసాన్ని మరొకరు ఆనందిస్తున్నారు

[18వ పేజీలోని చిత్రం]

పాలకులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించమని మనకు ఆజ్ఞాపించినప్పుడు తీసుకోవలసిన సరైన చర్య ఏది?