కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి’

‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి’

‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి’

“అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి.”​1 పేతురు 2:​17.

1, 2. (ఎ) యెహోవాసాక్షుల గురించి ఒక వార్తాపత్రిక విలేఖరి ఏ వ్యాఖ్యానం చేశాడు? (బి) యెహోవాసాక్షులు ప్రవర్తన విషయంలో ఎందుకు ఉన్నత ప్రమాణాలను కాపాడుకోవడానికి కృషి చేస్తారు?

కొన్ని సంవత్సరాల క్రితం, అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న అమరిల్లోలో ఒక వార్తాపత్రికకు విలేఖరిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆ ప్రాంతంలోని వివిధ చర్చీలను సందర్శించి తాను కనుగొన్న విషయాలను నివేదించాడు. ఒక గుంపు చాలా విశేషమైనవారిగా ఆయన మనస్సులో నిలిచిపోయారు. ఆయనిలా అన్నాడు: “నేను మూడు సంవత్సరాలపాటు అమరిల్లో సివిక్‌ సెంటర్‌లో యెహోవాసాక్షుల వార్షిక సమావేశాలకు హాజరయ్యాను. నేను వారితో సహవసించినప్పుడు, వారిలో ఏ ఒక్కరూ సిగరెట్టు వెలిగించుకోవడం గానీ బీరు క్యాన్‌ తెరవడం గానీ అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం గానీ నేనెప్పుడూ చూడలేదు. నేనింత వరకు కలిసిన వారిలోకెల్లా వీరు ఎంతో పరిశుభ్రంగా, మర్యాదగా ప్రవర్తిస్తూ చక్కని వస్త్రాలు ధరించే, మంచి స్వభావంగల ప్రజలు.” యెహోవాసాక్షుల గురించి ఇటువంటి వ్యాఖ్యానాలు తరచూ ముద్రించబడ్డాయి. వారికున్న విశ్వాసాన్నే కలిగిలేని ప్రజలచే సాక్షులు తరచూ ఎందుకు శ్లాఘించబడుతున్నారు?

2 సాధారణంగా, దేవుని ప్రజలు తమ మంచి ప్రవర్తనను బట్టి శ్లాఘించబడతారు. ప్రమాణాలు సాధారణంగా దిగజారిపోతుంటే, యెహోవాసాక్షులు ప్రవర్తనకు సంబంధించిన ఉన్నత ప్రమాణాలు పాటించడాన్ని తమ బాధ్యతగా, తమ ఆరాధనలో ఒక భాగంగా దృష్టిస్తారు. తమ చర్యలు యెహోవా గురించి, తమ క్రైస్తవ సహోదరుల గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడానికి దోహదపడతాయనీ తమ మంచి ప్రవర్తన తాము ప్రకటించే సత్యాన్ని సిఫారసు చేస్తుందనీ వారికి తెలుసు. (యోహాను 15:8; తీతు 2:​7, 8) కాబట్టి, మనం మన మంచి ప్రవర్తనను ఎలా కాపాడుకోవచ్చో తద్వారా యెహోవా యొక్క ఆయన సాక్షుల యొక్క మంచి పేరును ఎలా ఉన్నతపర్చవచ్చో, అలా చేయడం ద్వారా మనకు మనం ఎలా ప్రయోజనం చేకూర్చుకోవచ్చో చూద్దాము.

క్రైస్తవ కుటుంబం

3. క్రైస్తవ కుటుంబాలు దేని నుండి కాపాడబడవలసిన అవసరం ఉంది?

3 కుటుంబంలో మన ప్రవర్తనను పరిశీలించండి. గేర్‌హార్డ్‌ బజీర్‌ మరియు ఎర్వీన్‌ కె. షోయిక్‌లు వ్రాసిన డీ నోయిన్‌ ఇంక్విజిటోర్న్‌: రెలీజ్యోన్స్‌ఫ్రైహైట్‌ అంట్‌ గ్లాబన్‌స్నీట్‌ (ద న్యూ ఇంక్విజిటర్స్‌: ఫ్రీడమ్‌ ఆఫ్‌ రిలీజియన్‌ అండ్‌ రిలీజియస్‌ ఎన్వీ) అనే పుస్తకం ఇలా పేర్కొన్నది: “[యెహోవాసాక్షుల] దృష్టిలో కుటుంబం ప్రత్యేకంగా కాపాడబడవలసినది.” ఆ వ్యాఖ్యానం సత్యమైనది, నేడు అనేక ఉచ్చుల నుండి కుటుంబం కాపాడబడవలసి ఉంది. “తల్లిదండ్రులకు అవిధేయు”లైన పిల్లలున్నారు, “అనురాగరహితులు” లేదా “అజితేంద్రియులు” అయిన పెద్దవారున్నారు. (2 తిమోతి 3:​2, 3) కుటుంబాలు వివాహిత జతను హింసించే స్థలాలుగా ఉన్నాయి; తల్లిదండ్రులు తమ పిల్లలను అన్ని విధాలుగా వేధిస్తారు; పిల్లలు తిరుగుబాటు చేస్తారు, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి లైంగిక దుర్నీతికి పాల్పడతారు, లేదా ఇంట్లో నుండి పారిపోతారు. ఇదంతా “లోకాత్మ” యొక్క నాశనకరమైన ప్రభావపు ఫలితమే. (ఎఫెసీయులు 2:​1, 2 NW) ఆ ఆత్మ నుండి మనం మన కుటుంబాలను కాపాడవలసిన అవసరం ఉంది. ఎలా? కుటుంబ సభ్యుల కోసం యెహోవా ఇస్తున్న ఉపదేశాన్ని నిర్దేశాన్ని లక్ష్యపెట్టడం ద్వారా కాపాడవచ్చు.

4. క్రైస్తవ కుటుంబ సభ్యుల్లో ఒకరి పట్ల ఒకరికి ఏ బాధ్యతలున్నాయి?

4 తమకు ఒకరి పట్ల ఒకరికి భావోద్రేక, ఆధ్యాత్మిక, శారీరక బాధ్యతలున్నాయని క్రైస్తవ దంపతులు గుర్తిస్తారు. (1 కొరింథీయులు 7:3-5; ఎఫెసీయులు 5:21-23; 1 పేతురు 3:⁠7) క్రైస్తవ తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల గంభీరమైన బాధ్యతలున్నాయి. (సామెతలు 22:6; 2 కొరింథీయులు 12:14; ఎఫెసీయులు 6:⁠4) క్రైస్తవ గృహాల్లోని పిల్లలు పెద్దవారవుతుండగా, వారు తమకు కూడా బాధ్యతలున్నాయని తెలుసుకుంటారు. (సామెతలు 1:8, 9; 23:22; ఎఫెసీయులు 6:1; 1 తిమోతి 5:​3, 4, 8) కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడానికి కృషి, నిశ్చయత, ప్రేమ, స్వయంత్యాగపూరిత స్ఫూర్తి అవసరం. అయితే, దేవుడు తమకిచ్చిన బాధ్యతలను కుటుంబంలోని సభ్యులందరూ ఎంత మేరకు నెరవేరిస్తే, అంత మేరకు వారు ఒకరికొకరూ అలాగే సంఘానికీ ఒక ఆశీర్వాదంగా ఉంటారు. అంతకంటే ముఖ్యంగా, వారు కుటుంబ ఆరంభకుడైన యెహోవా దేవుడ్ని ఘనపరుస్తారు.​—⁠ఆదికాండము 1:27, 28; ఎఫెసీయులు 3:​15-18.

క్రైస్తవ సహోదరత్వం

5. తోటి క్రైస్తవులతో సహవసించడం ద్వారా మనం ఏ ఆశీర్వాదాలను పొందుతాము?

5 క్రైస్తవులముగా మనకు సంఘంలో తోటి విశ్వాసుల ఎడల చివరికి, ‘లోకమందున్న మన సహోదరులందరి’ ఎడల కూడా బాధ్యతలున్నాయి. (1 పేతురు 5:⁠9) మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంఘంతో మన సంబంధం ఆవశ్యకమైనది. మనం తోటి క్రైస్తవులతో సహవసించినప్పుడు, బలపర్చే వారి సహవాసాన్ని అలాగే ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేసే పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం ఆనందిస్తాము. (మత్తయి 24:​45-47) మనకు సమస్యలుంటే, లేఖనాధారిత సూత్రాలపై ఆధారపడిన చక్కని ఉపదేశం కోసం మనం మన సహోదరుల వద్దకు వెళ్ళవచ్చు. (సామెతలు 17:17; ప్రసంగి 4:9; యాకోబు 5:​13-18) మనం అవసరంలో ఉన్నప్పుడు మన సహోదరులు మనల్ని ఎడబాయరు. దేవుని సంస్థలో భాగమై ఉండడం ఎంతటి ఆశీర్వాదమో కదా!

6. ఇతర క్రైస్తవుల ఎడల మనకు బాధ్యతలున్నాయని పౌలు ఎలా చూపించాడు?

6 అయితే, మనం సంఘంలో ఉన్నది కేవలం పొందడానికే కాదు; మనం కూడా ఇవ్వాలి. నిజానికి యేసు ఇలా చెప్పాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:​35) అపొస్తలుడైన పౌలు, “వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని వ్రాసినప్పుడు, ఇచ్చేస్ఫూర్తిని ఉన్నతపరిచాడు.​—⁠హెబ్రీయులు 10:​23-25.

7, 8. సంఘంలోనూ, ఇతర దేశాల్లో ఉన్న క్రైస్తవుల ఎడలా మనం ఇచ్చేస్ఫూర్తిని ఎలా చూపిస్తాము?

7 సంఘంలో కూటాలు జరిగేటప్పుడు మనం వ్యాఖ్యానించినా లేదా కార్యక్రమంలో మరితర విధాలుగా భాగం వహించినా మనం ‘మన నిరీక్షణను ఒప్పుకొంటాము.’ ఆ ప్రయత్నాలు మన సహోదరులను తప్పక ప్రోత్సహిస్తాయి. కూటాలకు ముందు కూటాలు ముగిసిన తర్వాత వారితో సంభాషించడం ద్వారా కూడా మనం వారిని ప్రోత్సహిస్తాము. ఆ సమయంలోనే మనం బలహీనులకు ఊతనివ్వవచ్చు, ధైర్యము చెడినవారిని ధైర్యపర్చవచ్చు, అనారోగ్యం గలవారిని ఓదార్చవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:​14) ఇవ్వడంలో భాగమైన ఇటువంటి పనుల్లో యథార్థ క్రైస్తవులు ఎంతో ఉదారత చూపిస్తారు, అందుకే మన కూటాలకు మొదటిసారి హాజరైనవారు మన మధ్యనున్న ప్రేమను చూసి ఎంతో ప్రభావితులవుతారు.​—⁠కీర్తన 37:21; యోహాను 15:12; 1 కొరింథీయులు 14:25.

8 అయితే మన ప్రేమ మన సంఘానికి మాత్రమే పరిమితం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరుల సహవాసానికంతటికీ వ్యాపిస్తుంది. ఉదాహరణకు, రాజ్య మందిర నిధి కోసం ప్రతి రాజ్య మందిరంలోనూ ఒక చందా పెట్టె ఉంటుంది. మన రాజ్య మందిరం మంచి స్థితిలోనే ఉండవచ్చు, కానీ ఇతర దేశాల్లో ఉన్న వేలాదిమంది తోటి క్రైస్తవులకు కూడుకోవడానికి తగిన స్థలం లేదని మనకు తెలుసు. అలాంటి వారు మనకు వ్యక్తిగతంగా తెలియకపోయినా, రాజ్య మందిర నిధి కోసం మనం చందా వేసినప్పుడు వారి పట్ల ప్రేమ చూపిస్తాము.

9. యెహోవాసాక్షులు ఏ ప్రాథమిక కారణాన్ని బట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటారు?

9 యెహోవాసాక్షులు ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకుంటారు? ఎందుకంటే అలా చేయమని యేసు వారికి ఆజ్ఞాపించాడు. (యోహాను 15:​17) వారి మధ్యన ఒకరి ఎడల ఒకరికున్న ప్రేమ, వ్యక్తిగతంగానూ అలాగే ఒక గుంపుగా వారందరిపైనా దేవుని ఆత్మ పని చేస్తోందనడానికి నిదర్శనం. ప్రేమ ‘ఆత్మఫలం’లో ఒక భాగం. (గలతీయులు 5:​22-24) యెహోవాసాక్షులు బైబిలు అధ్యయనం చేస్తూ క్రైస్తవ కూటాలకు హాజరవుతూ ఎడతెగక దేవునికి ప్రార్థించినప్పుడు, ‘అనేకుల ప్రేమ చల్లారిపోయిన’ ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ ప్రేమించడం వారికి సహజంగా అలవడుతుంది.​—⁠మత్తయి 24:​12.

మన చుట్టూ ఉన్న ప్రపంచంతో వ్యవహరించడం

10. మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మనకు ఏ బాధ్యత ఉంది?

10 ‘మన నిరీక్షణను ఒప్పుకోవడం’ గురించి పౌలు చేసిన ప్రస్తావన మరో బాధ్యత గురించి మనకు గుర్తు చేస్తుంది. అలా ఒప్పుకోవడంలో, ఇంకా మన క్రైస్తవ సహోదరులుగా తయారుకాని వారికి సువార్త ప్రకటించే పని కూడా ఇమిడి ఉంది. (మత్తయి 24:14; 28:19, 20; రోమీయులు 10:​9, 10, 13-15) అలాంటి ప్రకటనా పని ఇచ్చేస్ఫూర్తిని చూపించే మరో చర్య. దానిలో భాగం వహించడానికి సమయం, శక్తి, సిద్ధపాటు, శిక్షణ, వ్యక్తిగత వనరులను ఉపయోగించడం అవసరం. అయితే పౌలు ఇలా కూడా వ్రాశాడు: “గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కానివారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను. కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.” (రోమీయులు 1:​14, 15) పౌలు వలే మనం కూడా ఈ ‘ఋణాన్ని’ తీర్చుకునేటప్పుడు లోభత్వాన్ని చూపించకుండా ఉందాము.

11. లోకంతో మన సంబంధాన్ని ఏ రెండు లేఖనాధారిత సూత్రాలు నిర్దేశిస్తాయి, అయినప్పటికీ మనమేమి గుర్తిస్తాము?

11 తోటి విశ్వాసులు కాని వారి పట్ల మనకు ఇతర బాధ్యతలేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అయితే “లోకమంతయు దుష్టుని యందున్నదని” మనం గుర్తిస్తాము. (1 యోహాను 5:​19) యేసు తన శిష్యుల గురించి, “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని చెప్పాడని మనకు తెలుసు. అయినప్పటికీ మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, దానిలోనే జీవనోపాధి సంపాదించుకుంటున్నాము, దాని నుండి సేవలు అందుకుంటున్నాము. (యోహాను 17:​11, 15, 16) కాబట్టి మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో బాధ్యతలున్నాయి. అవేమిటి? అపొస్తలుడైన పేతురు ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. యెరూషలేము నాశనం చేయబడడానికి కొంచెం ముందు, ఆయన ఆసియా మైనరులోని క్రైస్తవులకు ఒక పత్రిక వ్రాశాడు, ఆ పత్రికలోని ఒక భాగం లోకంతో సమతుల్యమైన సంబంధాన్ని కలిగివుండడానికి మనకు సహాయం చేస్తుంది.

12. క్రైస్తవులు ఏ విధంగా “పరదేశులును యాత్రికులునై యున్నారు,” వారు వేటికి దూరంగా ఉండాలి?

12 మొదటగా, పేతురు ఇలా చెప్పాడు: ‘ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించమని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.’ (1 పేతురు 2:​11 12) నిజ క్రైస్తవులు ఆధ్యాత్మిక భావంలో “పరదేశులును యాత్రికులునై యున్నా[రు]” ఎందుకంటే వారి జీవితాల్లో నిజంగా ప్రధానమైనది నిత్యజీవ నిరీక్షణ​—⁠ఆత్మాభిషిక్తులు పరలోకంలో, “వేరే గొఱ్ఱెలు” భవిష్యత్‌ భూపరదైసులో నివసిస్తారు. (యోహాను 10:16; ఫిలిప్పీయులు 3:20, 21; హెబ్రీయులు 11:13; ప్రకటన 7:​9, 14-17) అయితే శరీరాశలేమిటి? వీటిలో, ధనవంతులై ఉండాలనే ఆశ, పేరుపొందాలనే కోరిక, అవినీతికరమైన లైంగిక కోరికలు, “అసూయ” మరియు “ధనాపేక్ష” అని వర్ణించబడిన ఆశలు ఉన్నాయి.​—⁠కొలొస్సయులు 3:5; 1 తిమోతి 6:4, 9; 1 యోహాను 2:15, 16.

13. శారీరక కోరికలు ఎలా ‘మన ఆత్మకు విరోధముగా పోరాడతాయి?’

13 అలాంటి కోరికలు నిజంగానే ‘మన ఆత్మకు విరోధముగా పోరాడతాయి.’ అవి దేవునితో మన సంబంధాన్ని హరించివేసి, తద్వారా మన క్రైస్తవ నిరీక్షణను (మన “ఆత్మ”ను లేదా జీవాన్ని) ప్రమాదంలో పడవేస్తాయి. ఉదాహరణకు, మనం అనైతిక విషయాల్లో ఆసక్తి పెంచుకుంటే, మనల్ని మనం “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా” ఎలా సమర్పించుకోగలము? మనం వస్తుదాయక ఉరిలో పడిపోతే, ఎలా ‘రాజ్యమును మొదట వెదుకుతాము’? (రోమీయులు 12:1, 2; మత్తయి 6:33; 1 తిమోతి 6:​17-19) మోషే మాదిరిని అనుసరించడం అంటే ఈ లోక ఆకర్షణలను నిరాకరించి మన జీవితాల్లో యెహోవా సేవకు మొదటి స్థానమివ్వడం సర్వశ్రేష్ఠమైన మార్గం. (మత్తయి 6:19, 20; హెబ్రీయులు 11:​24-26) లోకంతో సమతుల్యమైన సంబంధాన్ని కాపాడుకోవడానికి అది ఒక ముఖ్యమైన కీలకం.

‘మంచి ప్రవర్తన గలవారై ఉండండి’

14. క్రైస్తవులముగా మనం ఎందుకు మంచి ప్రవర్తనను కాపాడుకోవడానికి కృషి చేస్తాము?

14 పేతురు వ్రాసిన ఈ తర్వాతి మాటల్లో మరో ఆవశ్యకమైన నిర్దేశాన్ని కనుగొనవచ్చు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (1 పేతురు 2:​12) క్రైస్తవులముగా మనం మాదిరికరంగా ఉండడానికి కృషి చేస్తాము. పాఠశాలలో మనం శ్రద్ధగా చదువుకుంటాము. మన పనిస్థలంలో, మన యజమాని నిర్హేతుకంగా ఉన్నట్లనిపించినా, మనం నిజాయితీగా, శ్రమించి పనిచేస్తాము. మతసంబంధంగా విభాగింపబడిన కుటుంబాల్లో విశ్వాసి అయిన భర్త లేక భార్య క్రైస్తవ సూత్రాలను అనుసరించడానికి ప్రత్యేక ప్రయత్నం చేస్తారు. అది ఎల్లప్పుడూ అంత సులభం కాదు గానీ మన మాదిరికరమైన ప్రవర్తన యెహోవాకు సంతోషం కలిగించడమే కాక సాక్షులు కానివారిపై తరచూ మంచి ప్రభావాన్ని చూపిస్తుందని మనకు తెలుసు.​—⁠1 పేతురు 2:18-20; 3:⁠1, 2.

15. యెహోవాసాక్షుల ఉన్నత ప్రవర్తనా ప్రమాణాలు విస్తృతంగా గుర్తించబడ్డాయని మనకెలా తెలుసు?

15 మాదిరికరమైన ప్రమాణాలను కాపాడుకోవడంలో యెహోవాసాక్షుల్లో అనేకమంది సాధిస్తున్న విజయం, గత సంవత్సరాల్లో వారి గురించి ప్రచురించబడిన వ్యాఖ్యానాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు, ఇటలీకి చెందిన ఈల్‌ టెంపో అనే వార్తాపత్రిక ఇలా నివేదించింది: “యెహోవాసాక్షులను తమ సహోద్యోగులుగా కలిగివున్న ప్రజలు వారిని నిజాయితీగల పనివారిగా వర్ణిస్తున్నారు, వారు తమ విశ్వాసం గురించి ఎంత దృఢనమ్మకం కలిగివున్నారంటే ఆ విశ్వాసమంటే వారికి వెర్రి వ్యామోహమేమో అనిపిస్తుంది అని కూడా వారి గురించి వ్యాఖ్యానించడం జరిగింది; అయితే వారు తమ నైతిక యథార్థతను బట్టి గౌరవాన్ని పొందడానికి అర్హులు.” అర్జెంటీనాలోని బ్యూనోస్‌ ఎయిర్స్‌కు చెందిన హెరాల్డ్‌ అనే వార్తాపత్రిక ఇలా చెప్పింది: “గడిచిన సంవత్సరాల్లో యెహోవాసాక్షులు తాము కష్టపడి పనిచేసేవారమనీ గంభీరమైనవారమనీ పొదుపుచేసేవారమనీ దైవభయంగల పౌరులమనీ నిరూపించుకున్నారు.” సెర్గీ ఈవాన్‌యెన్క్‌ అనే రష్యన్‌ పండితుడు ఇలా పేర్కొన్నాడు: “యెహోవాసాక్షులు చట్టానికి సంపూర్ణంగా లోబడి ఉండే ప్రజలనీ ప్రాముఖ్యంగా పన్నులు కట్టడం విషయంలో వారు చూపించే నిష్టతో కూడిన దృక్పథాన్ని బట్టీ వారు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందారు.” జింబాబ్వేలో యెహోవాసాక్షులు తమ సమావేశం కోసం ఉపయోగించుకున్న వసతుల మేనేజర్‌ ఇలా అన్నాడు: “కొంతమంది సాక్షులు కాగితాలు ఏరడాన్ని, మూత్రశాలలను శుభ్రపర్చడాన్ని చూశాను. ప్రదర్శన స్థలాలు ముందటి కన్నా శుభ్రంగా ఉంచబడ్డాయి. మీ యౌవనస్థులు సూత్రానుసారంగా నడుచుకుంటారు. మొత్తం ప్రపంచమంతా యెహోవాసాక్షులతో నిండివుండాలని నేను కోరుకుంటున్నాను.”

క్రైస్తవ విధేయత

16. లౌకిక అధికారులతో మన సంబంధం ఏమిటి, ఎందుకు?

16 పేతురు లౌకిక అధికారులతో మన సంబంధం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తనగలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.” (1 పేతురు 2:​13-15) క్రమబద్ధమైన ప్రభుత్వం నుండి పొందిన ప్రయోజనాల నిమిత్తం మనం కృతజ్ఞులమై ఉన్నాము, పేతురు మాటలచే నిర్దేశించబడి, మనం దాని కట్టడలకు విధేయులమై పన్నులు చెల్లిస్తాము. చట్టాన్ని ఉల్లంఘించేవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలకు దేవుడిచ్చిన హక్కును మనం గుర్తించినప్పటికీ మనం లౌకిక అధికారులకు లోబడి ఉండడానికి ముఖ్య కారణం “ప్రభువు నిమిత్తమై” చేయాలన్నదే. అది దేవుని చిత్తము. అంతేగాక, తప్పు చేసినందుకు శిక్షించబడడం ద్వారా యెహోవా నామముపైకి అవమానం తీసుకురావాలని మనం కోరుకోము.​—⁠రోమీయులు 13:1, 3-7; తీతు 3:​1, 2; 1 పేతురు 3:​17.

17. ‘మూర్ఖులు’ మనల్ని వ్యతిరేకించినప్పుడు, మనం దేని గురించి దృఢనమ్మకం కలిగి ఉండవచ్చు?

17 విచారకరంగా, అధికారంలో ఉన్న కొంతమంది ‘మూర్ఖులు’ మనల్ని హింసిస్తారు లేదా రకరకాలుగా మనల్ని వ్యతిరేకిస్తారు; అంటే మనకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పడం ద్వారా మనపై అపవాదులు వేయడం ద్వారా మన పేరు పాడుచేయడానికి ప్రయత్నించే గుంపుల ప్రచారాన్ని ప్రోత్సహించడం వంటివి చేస్తారు. అయినా, యెహోవా నిర్ణీత సమయంలో వారి అబద్ధాలు బయల్పర్చబడ్డాయి, ‘అజ్ఞానపు మాటలు’ పలికే వారి నోళ్ళు మూయబడ్డాయి. ఎవరు నిజం చెబుతున్నారన్నదాన్ని క్రైస్తవ ప్రవర్తన విషయంలో మనకున్న పేరు స్పష్టం చేస్తుంది. అందుకే నిజాయితీపరులైన ప్రభుత్వ అధికారులు తరచూ మనల్ని మంచి చేసేవారిగా ప్రశంసిస్తారు.​—⁠రోమీయులు 13:​3, 4; తీతు 2:7, 8.

దేవుని దాసులు

18. క్రైస్తవులముగా మనం ఏ యే విధాలుగా మనకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేయడాన్ని నివారించవచ్చు?

18 పేతురు ఇప్పుడిలా హెచ్చరిస్తున్నాడు: “స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి.” (1 పేతురు 2:16; గలతీయులు 5:​13) నేడు, బైబిలు సత్యాన్ని గురించి మనకున్న జ్ఞానము, అబద్ధ మత బోధల నుండి మనల్ని స్వతంత్రులను చేస్తుంది. (యోహాను 8:​32) అంతేగాక మనకు స్వేచ్ఛా చిత్తం ఉంది, మనం ఎంపికలు చేసుకోవచ్చు. అయినా, మనం మనకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేయము. సహవాసులను, వస్త్రధారణను, శిరోజాలంకరణను, వినోదాన్ని చివరికి ఆహార పానీయాలను ఎంపిక చేసుకునేటప్పుడు, నిజ క్రైస్తవులు తమను తాము సంతోషపర్చుకోకుండా తాము దేవునికి దాసులమని గుర్తుంచుకుంటారు. మనం మన శారీరక కోరికలకు లేదా ఈ లోకంలోని వేలంవెర్రి వ్యామోహాలకు ధోరణులకు దాసులమై ఉండే బదులు యెహోవా సేవ చేయడానికి ఎంపిక చేసుకుంటాము.​—⁠గలతీయులు 5:​23, 24; 2 తిమోతి 2:22; తీతు 2:11, 12.

19-21. (ఎ) లౌకిక అధికార స్థానాల్లో ఉన్న వారిని మనమెలా దృష్టిస్తాము? (బి) ‘సహోదరుల పట్ల ప్రేమను’ కొందరు ఎలా చూపించారు? (సి) మనకున్న అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యత ఏమిటి?

19 పేతురు ఇంకా ఇలా అంటున్నాడు: “అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.” (1 పేతురు 2:​17) మానవులు వివిధ అధికార స్థానాలను ఆక్రమించడానికి యెహోవా దేవుడు అనుమతిస్తాడు గనుక, మనం ఆ వ్యక్తులకు తగిన గౌరవాన్ని చూపిస్తాము. మనం మన పరిచర్యను శాంతియుతంగానూ దైవభక్తితోనూ కొనసాగించడానికి అనుమతించాలని మనం వారి గురించి ప్రార్థన కూడా చేస్తాము. (1 తిమోతి 2:​1-4) అయితే, అదే సమయంలో, మనం ‘సహోదరులను ప్రేమిస్తాము.’ మనం ఎల్లప్పుడూ మన క్రైస్తవ సహోదరులకు మంచే గానీ హాని కలిగే పని చేయము.

20 ఉదాహరణకు, ఆఫ్రికాలోని ఒక దేశము జాతి హింసల మూలంగా విభాగింపబడినప్పుడు, యెహోవాసాక్షుల క్రైస్తవ ప్రవర్తన అందరికీ స్పష్టంగా కనిపించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన రెఫోర్‌మీర్టె ప్రెస్సె అనే వార్తాపత్రిక ఇలా నివేదించింది: “1995 లో, ఆఫ్రికన్‌ రైట్స్‌ అనే సంస్థ . . . యెహోవాసాక్షులు తప్ప అన్ని చర్చీల వాళ్ళు [సంఘర్షణల్లో] పాల్గొన్నట్లు నిరూపించగలిగింది.” ఆ దుఃఖకరమైన సంఘటనలను గురించిన వార్తలు బయటి ప్రపంచానికి చేరినప్పుడు, యూరప్‌లోని యెహోవాసాక్షులు ఆ ప్రాంతంలో ఉన్న తమ సహోదరుల కోసం మరితరుల కోసం వెంటనే ఆహారాన్ని, వైద్య సహాయాన్ని పంపించారు. (గలతీయులు 6:​10) “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము” అని చెబుతున్న సామెతలు 3:⁠27 లోని మాటలను వారు లక్ష్యపెట్టారు.

21 అయితే మనం లౌకిక అధికారులను గౌరవించవలసిన దానికంటే, చివరికి మన సహోదరులను ప్రేమించవలసిన దానికంటే మరింత ప్రాముఖ్యమైన బాధ్యత ఒకటి ఉంది. అదేమిటి? “దేవునికి భయపడుడి” అని పేతురు చెప్పాడు. మనం ఏ మానవులకన్నా కూడా యెహోవాకు ఎక్కువగా రుణపడి ఉన్నాము. అదెలా నిజం? దేవుని ఎడల మనకున్న బాధ్యతలను లౌకిక అధికారులపట్ల మనకున్న బాధ్యతలతో ఎలా సమతూకపర్చవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడతాయి.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

• కుటుంబంలో క్రైస్తవులకు ఏ బాధ్యత ఉంది?

• సంఘంలో మనం ఇచ్చేస్ఫూర్తిని ఎలా చూపించవచ్చు?

• మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మనకు ఏ బాధ్యత ఉంది?

• ప్రవర్తన విషయంలో ఉన్నత ప్రమాణాలను కాపాడుకోవడం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ కుటుంబం ఎలా గొప్ప ఆనందానికి మూలం కాగలదు?

[10వ పేజీలోని చిత్రాలు]

యెహోవాసాక్షులు ఒకరిపట్ల ఒకరు ఎందుకు ప్రేమను చూపించుకుంటారు?

[10వ పేజీలోని చిత్రాలు]

మనకు వ్యక్తిగతంగా తెలియకపోయినా మనం మన సహోదరుల పట్ల ప్రేమను చూపించగలమా?