క్షమాపణ చెప్పడం ఎందుకంత కష్టం?
క్షమాపణ చెప్పడం ఎందుకంత కష్టం?
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర శాసన సభ 2000వ సంవత్సరం జూలైలో ఒక శాసనాన్ని రూపొందించింది, దాని ప్రకారం, తాము కూడా ఇమిడి ఉన్న ఏదైనా దుర్ఘటనలో గాయపడిన వ్యక్తిపట్ల సానుభూతిని వ్యక్తపరిస్తే వారు చట్టబద్ధమైన బాధ్యత నుండి విముక్తులవుతారు. ఆ శాసనం ఎందుకు రూపొందించబడింది? ఎందుకంటే ఒక దుర్ఘటన వల్ల గాయమైనా లేదా నష్టం జరిగినా ఒకవేళ క్షమాపణ చెప్పితే అది తప్పు చేసినట్లు కోర్టులో ఒప్పుకోవడంగా పరిగణించబడుతుందనే భయంతో ప్రజలు తరచూ క్షమాపణ చెప్పడానికి సంకోచిస్తారని గమనించడం జరిగింది. మరో వైపున, చేసిన తప్పుకు వెంటనే క్షమాపణ చెప్పాలని భావించేవారు కలత చెందవచ్చు, దానితో చిన్న దుర్ఘటనే పెద్ద వివాదంగా పరిణమించవచ్చు.
అయితే దుర్ఘటనకు మీ పొరపాటు కారణం కాకపోతే క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. మీరు మాట్లాడే మాటల గురించి జాగ్రత్త వహించడం జ్ఞానయుక్తమైనదై ఉండే సమయాలు ఉండవచ్చు. ఒక పాత సామెత ఇలా చెబుతోంది: “విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.” (సామెతలు 10:19; 27:12) అయినప్పటికీ, మీరు మర్యాదపూర్వకంగా, తోడ్పడేవారిగా ఉండవచ్చు.
అయితే, కోర్టుకు వెళ్ళేంత అవసరం లేనప్పుడు
కూడా చాలామంది ప్రజలు క్షమాపణ చెప్పడం మానేశారన్నది నిజం కాదా? ఇంట్లో ఒక భార్య, ‘నా భర్త ఎన్నడూ దేనికీ క్షమాపణ కోరడు’ అని విలపించవచ్చు. పని స్థలంలో ఒక అగ్ర కార్మికుడు, ‘నా దగ్గర పనిచేసేవాళ్ళు తమ తప్పులను ఒప్పుకోరు, క్షమించమని వారు ఎప్పుడో గానీ అడగరు’ అని ఫిర్యాదు చేస్తుండవచ్చు. స్కూల్లో ఒక టీచరు, ‘“నన్ను క్షమించండి” అని చెప్పేలా పిల్లలకు నేర్పించబడడం లేదు’ అని ఫిర్యాదు చేయవచ్చు.ఒక వ్యక్తి క్షమాపణ చెప్పేందుకు సంకోచించడానికి ఒక కారణం తాను నిరాకరించబడతాననే భయం కావచ్చు. నిరాదరణకు గురవుతానేమోనని భావిస్తూ ఆయన తాను నిజంగా ఎలా భావిస్తున్నాడో వ్యక్తం చేయకపోవచ్చు. గాయపడిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తిని పూర్తిగా తప్పించుకుని తిరుగుతూ రాజీ కుదుర్చుకోవడానికి చాలా కష్టమయ్యేలా చేయవచ్చు.
కొందరు క్షమాపణ చెప్పేందుకు సంకోచించడానికి మరో కారణం ఇతరుల భావాలపట్ల పట్టింపు లేకపోవడం కావచ్చు. ‘క్షమాపణ చెప్పడం నేను ఇప్పటికే చేసిన తప్పునేమీ సరిదిద్దదు కదా’ అని వారు తర్కించవచ్చు. మరితరులు రాగల పర్యవసానాల దృష్ట్యా, క్షమించమని అడగడానికి సంకోచించవచ్చు. ‘నన్ను బాధ్యునిగా ఎంచి, పరిహారం చెల్లించమని అడుగుతారేమో’ అని వారు అనుకోవచ్చు. అయితే, తప్పు ఒప్పుకోవడానికి అతి పెద్ద అడ్డంకు గర్వం. ‘నన్ను క్షమించండి’ అని అడగలేనంతటి గర్విష్ఠి ఒక విధంగా, ‘నా తప్పును ఒప్పుకుని నేను నా గౌరవాన్ని పోగొట్టుకోలేను. అది నా హోదాకు భంగం వాటిల్లుతుంది’ అనే ముగింపుకు చేరుకోవచ్చు.
కారణం ఏదైనా, చాలామందికి క్షమాపణ చెప్పడమంటే చాలా కష్టం. కానీ క్షమాపణ చెప్పడం నిజంగా అవసరమా? క్షమాపణ చెప్పడం వల్ల చేకూరే ప్రయోజనాలేమిటి?
[3వ పేజీలోని చిత్రం]
“నన్ను క్షమించండి అని చెప్పేలా పిల్లలకు నేర్పించబడడం లేదు”
[3వ పేజీలోని చిత్రం]
“నా భర్త ఎన్నడూ క్షమాపణ చెప్పడు”
[3వ పేజీలోని చిత్రం]
“నా దగ్గర పనిచేసేవాళ్ళు తమ తప్పులను ఒప్పుకోరు”