కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్న రాజ్యమందిరాలు

ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్న రాజ్యమందిరాలు

రా జ్య ప్ర చా ర కు ల ని వే ది క

ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్న రాజ్యమందిరాలు

యేసుక్రీస్తు తన శిష్యులకు బహిరంగ పరిచర్యలో శిక్షణనిస్తున్నప్పుడు, “మేడలమీద ప్రకటించుడి” అని వారిని ప్రోత్సహించాడు. (మత్తయి 10:​27) అవును వారు తమ క్రైస్తవ పరిచర్యను బహిరంగంగా అందరికీ కనిపించే విధంగా నిర్వర్తించాలి. ఈ సూత్రాన్ని అన్వయించుకుంటూనే యెహోవాసాక్షుల కార్యకలాపాలు బహిరంగంగా జరుగుతాయి. ఇలా బహిరంగంగా ప్రకటించడం సాక్షులు వ్యతిరేకతను అధిగమించి, అందరి అనుగ్రహపూర్వకమైన అవధానాన్నీ చూరగొనడానికి దోహదపడింది.

యెహోవాసాక్షుల సంఘ కూటాలకు ప్రజలందరూ హాజరు కావచ్చు కానీ కొందరు దురభిమానం మూలంగా రాజ్యమందిరంలోకి ప్రవేశించడానికి వెనుకాడతారు. ఫిన్‌లాండ్‌లో కూడా పరిస్థితి అలాగే ఉంది. మరితరులు క్రొత్త స్థలాలకు వెళ్ళడానికి సంకోచిస్తారు. ఒక క్రొత్త రాజ్యమందిరం నిర్మించబడినప్పుడు లేదా ఉన్న రాజ్యమందిరమే పునర్నవీకరించబడినప్పుడు సాధారణంగా దాన్ని చూడడానికి అందరూ ఆహ్వానించబడతారు. ఇరుగుపొరుగువారు రాజ్యమందిరాన్ని సందర్శించి యెహోవాసాక్షుల కార్యకలాపాలతో పరిచయం ఏర్పరచుకోవడానికి వారిని ఆహ్వానించేందుకు ప్రత్యేక ప్రయత్నం జరుగుతుంది.

ఒక ప్రాంతంలో, సాక్షులు తమ క్రొత్త రాజ్యమందిరాన్ని చూడడానికి అందరినీ ఆహ్వానిస్తున్న రోజుననే పత్రికా ప్రచార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. పెద్ద వయస్సుగల ఒక వ్యక్తిని ఇద్దరు సాక్షులు కలిశారు, ఆయన కావలికోట, తేజరిల్లు! పత్రికలు చదివి ఆనందించానని వారికి చెప్పాడు. రాజ్యమందిరాన్ని చూడడానికి రమ్మని సహోదరులు ఆయనను ఆహ్వానించి తాము వెంటబెట్టుకుని తీసుకువెళతామని కూడా చెప్పారు. వారితో రావడం తనకిష్టమేనని ఆ వ్యక్తి అన్నాడు. వారి సంభాషణ వింటున్న ఆయన భార్య, “నేనూ వస్తున్నాను” అంటూ కేకేసింది.

రాజ్యమందిరంలోకి ప్రవేశించిన తర్వాత, ఆ వ్యక్తి చుట్టూ చూసి, “ఇది అసలు నల్లగానే లేదు. ఇక్కడెంతో చక్కగా ప్రకాశవంతంగా ఉంది. రాజ్యమందిరం నల్లగా ఉంటుందని నాకు చెప్పారే” అన్నాడు. ఆ జంట కొద్దిసేపు అక్కడే ఉండి, అక్కడ ప్రదర్శించబడిన సాహిత్యం కొంత తమకు కావాలని అడిగారు.

ఒక సంఘం తమ రాజ్యమందిర సమర్పణా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడానికి స్థానిక వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వాలని అనుకుంది. ఆ కార్యక్రమాన్ని గురించిన ప్రకటనను అందుకున్న తర్వాత ఆ పత్రిక ముఖ్య సంపాదకురాలు, ఈ విషయంపై ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుందని సూచించింది. సహోదరులు దానికి అంగీకరించారు, కొద్దికాలం తర్వాత యెహోవాసాక్షుల స్థానిక సంఘ కార్యకలాపాలను, సమర్పణ కార్యక్రమాన్ని వివరించే చక్కని అరపేజీ వ్యాసం వార్తాపత్రికలో కనిపించింది.

ఆ వ్యాసం ప్రచురించబడిన తర్వాత, వృద్ధురాలైన ఒక సాక్షి తన పొరుగింటావిడను కలిసినప్పుడు ఆ స్త్రీ “ఈ రోజు వార్తాపత్రికలో యెహోవాసాక్షుల గురించి ఒక అద్భుతమైన వ్యాసం వచ్చింది” అంటూ ఆ సహోదరికి చెప్పింది. దానితో సహోదరి ఆమెకు సాక్ష్యమిచ్చి, ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు అనే బ్రోషుర్‌ను ఇవ్వగలిగింది.

క్రొత్త రాజ్య మందిరాల సమర్పణ కార్యక్రమాలకు ఇతరులను ఆహ్వానించడం వంటి ఏర్పాట్లు యెహోవాసాక్షుల గురించి ఉన్న దురభిప్రాయాలను తొలగించడమే గాక కూటాలకు హాజరుకమ్మని ఎక్కువమంది ప్రజలను ఆహ్వానించడానికి ప్రచారకులకు ప్రేరణనిచ్చింది. అవును, ఫిన్‌లాండ్‌తో సహా అనేక దేశాల్లో, యెహోవాసాక్షుల రాజ్యమందిరాలు ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్నాయని ప్రజలు తెలుసుకున్నారు.