మనకందరికీ అవసరమైనది ప్రశంస
మనకందరికీ అవసరమైనది ప్రశంస
చిన్నపాపకు అది చాలా మంచి రోజు. వేరే సందర్భాల్లో ఆమెకు దిద్దుబాటు అవసరమే అయినా ప్రత్యేకంగా ఆ రోజున ఆమె చాలా బుద్ధిగా ప్రవర్తించింది. అయితే ఆ రాత్రి ఆ పాపను నిద్రపుచ్చుతున్నప్పుడు ఆ పాప వెక్కుతూ ఏడుస్తుండడం ఆమె తల్లి విన్నది. ఏమైందని అడిగినప్పుడు, కన్నీళ్ళతో వెక్కిళ్ళ మధ్యన ఆ పాప ఇలా అడిగింది: “ఈ రోజు నేను బుద్ధిగా ప్రవర్తించలేదా?”
ఆ ప్రశ్న తల్లి గుండెల్లో గునపంలా దిగింది. ఆమె ఎప్పుడూ తన కూతుర్ని వెంటనే సరిదిద్దేది. కానీ ఇప్పుడు, బుద్ధిగా ప్రవర్తించడానికి తన చిన్నారి కూతురు చేస్తున్న కృషిని గమనించి కూడా తల్లి మెచ్చుకోలుగా ఒక్క మాట కూడా పలుకలేదు.
ప్రశంస, ఓదార్పు అవసరమైంది కేవలం చిన్నపాపలకు మాత్రమే కాదు. మనకందరికీ సలహా, దిద్దుబాటు ఎంత అవసరమో ప్రశంస కూడా అంతే అవసరం.
హృదయపూర్వకమైన ప్రశంసను అందుకున్నప్పుడు మనమెలా భావిస్తాము? అది మన హృదయాన్ని ఉత్తేజపర్చి మనకు ఆనందాన్నివ్వదా? బహుశా మనల్ని గమనించేవారున్నారనీ మనమంటే శ్రద్ధ చూపేవారున్నారనీ మనం భావిస్తాం. కృషికి తగిన ఫలితం లభించిందని అది మనకు హామీ ఇస్తుంది, భవిష్యత్తులో మళ్ళీ తీవ్రంగా కృషి చేయడానికి అది మనల్ని పురికొల్పుతుంది. యథార్థమైన ప్రశంస, కాస్త సమయం వెచ్చించి ప్రోత్సాహకరమైనదేదైనా మనకు చెప్పిన వ్యక్తి వైపుకు మనల్ని ఆకర్షిస్తుందంటే అందులో ఆశ్చర్యం లేదు.—సామెతలు 15:23.
ప్రశంసించవలసిన అవసరాన్ని యేసుక్రీస్తు గ్రహించాడు. తలాంతులను గురించిన ఉపమానంలో, (స్వయంగా యేసునే సూచిస్తున్న) యజమాని నమ్మకమైన ఇద్దరు దాసులనూ “భళా, నమ్మకమైన మంచి దాసుడా” అంటూ వాత్సల్యపూరితంగా ప్రశంసిస్తాడు. ఎంతటి హృదయోత్తేజకరమైనది! ఆ ఇద్దరు దాసులు చాలా భిన్నమైన సామర్థ్యాలను కలిగివున్నప్పటికీ భిన్నమైన సాఫల్యాలను సాధించినప్పటికీ ఇద్దరికీ సమానమైన ప్రశంస లభిస్తుంది.—మత్తయి 25:19-23.
కాబట్టి మనం ఆ చిన్నపాప తల్లిని జ్ఞాపకం ఉంచుకుందాము. ఇతరులు కన్నీటి పర్యంతం అయ్యేంత వరకూ మనం ప్రశంసించకుండా ఉండనవసరం లేదు. బదులుగా మనం ప్రశంసించడానికి అవకాశాల కోసం ఖచ్చితంగా ఎదురు చూడడాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నిజానికి, అవకాశం లభించిన ప్రతిసారీ యథార్థంగా ప్రశంసించడానికి మనకు తగిన కారణం ఉంది.