కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేము మా నియామకాన్ని అంటిపెట్టుకుని ఉన్నాము

మేము మా నియామకాన్ని అంటిపెట్టుకుని ఉన్నాము

జీ వి త క థ

మేము మా నియామకాన్ని అంటిపెట్టుకుని ఉన్నాము

హెర్మన్‌ బ్రూడర్‌ చెప్పినది

ఎంపిక చేసుకోవడానికి నా ఎదుట ఉన్నది చాలా సరళమైన విషయం: ఫ్రెంచ్‌ విదేశీ సేనలో ఐదు సంవత్సరాలు సేవ చేయడం లేదా మొరొక్కో చెరసాలలో ఖైదీగా ఉండడం. నేను ఈ విపద్దశకు ఎలా చేరుకున్నానో వివరిస్తానుండండి.

నేను 1911 లో జర్మనీలోని ఒప్పెనావులో జన్మించాను, ఆ తర్వాత మూడు సంవత్సరాలకు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. నా తల్లిదండ్రులైన జోసెఫ్‌ బ్రూడర్‌ ఫ్రీడా బ్రూడర్‌లకు మొత్తం 17 మంది సంతానం. నేను 13వ వాడిని.

మా స్వంత పట్టణంలోని ప్రధాన వీధి గుండా సైనిక దళం కవాతు చేసుకుంటూ వెళ్ళడాన్ని చూసిన చిన్న నాటి సంఘటన నాకు గుర్తుంది. వాళ్ళు చక్కగా కదం తొక్కుతూ నడుస్తుంటే ఆ శబ్దం నన్నెంతో ఆకర్షించింది, దానితో నేను సంగీతం వాయించే వాళ్ళ వెనకాలే రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను, సరిగ్గా అప్పుడే మా నాన్నగారు సైనిక దుస్తులు ధరించిన ఇతర పురుషులతో పాటు రైలు ఎక్కడానికి వెళ్తున్నారు. రైలు వెళ్ళిపోగానే ప్లాట్‌ఫారమ్‌ మీదున్న కొంతమంది స్త్రీలు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి, మా ప్రీస్టు చర్చిలో పెద్ద ప్రసంగం ఇచ్చాడు, పితృదేశాన్ని కాపాడడంలో మరణించిన నలుగురు వ్యక్తుల పేర్లను ఆయన చదివాడు. “వారిప్పుడు పరలోకంలో ఉన్నారు” అని ఆయన వివరించాడు. నా దగ్గర నిలబడి ఉన్న ఒక స్త్రీ స్పృహ తప్పి పడిపోయింది.

రష్యన్‌ యుద్ధరంగంలో పోరాడుతున్నప్పుడు నాన్నగారికి టైఫాయిడ్‌ జ్వరం వచ్చింది. ఆయన చాలా బలహీనమైపోయి ఇంటికి వచ్చారు, దానితో దాదాపు వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. “సమాధుల తోట ప్రక్కనున్న మందిరానికి వెళ్ళి పరలోక ప్రార్థన 50 సార్లు, హెయిల్‌ మేరీ 50 సార్లు చెప్పు, అప్పుడు మీ నాన్నగారు కోలుకుంటారు” అని ప్రీస్టు చెప్పాడు. నేను ఆయన చెప్పినట్లే చేశాను గానీ మరునాడు నాన్నగారు చనిపోయారు. లేతప్రాయంలోని పిల్లవాడికి కూడా యుద్ధం చాలా భయంకరమైన అనుభవమే.

నేను సత్యం తెలుసుకోవడం

రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో జర్మనీలో పని దొరకడం చాలా కష్టంగా ఉంది. అయితే నేను 1928 లో పాఠశాల విద్య ముగించిన తర్వాత, స్విట్జర్లాండ్‌లోని బేసల్‌లో తోటమాలిగా ఉద్యోగం సంపాదించుకోగలిగాను.

నాన్నగారిలా నేను కూడా చాలా నిష్ఠగల క్యాథలిక్‌ను. భారతదేశంలో కపుచిన్‌ సన్యాసిగా సేవ చేయాలన్నది నా లక్ష్యం. అప్పటికే యెహోవాసాక్షి అయిన మా తమ్ముడు రిచర్డ్‌ ఈ ప్రణాళికల గురించి విని, నేను మనస్సు మార్చుకునేలా చేయడానికి స్విట్జర్లాండ్‌కు ప్రత్యేకంగా ప్రయాణించి వచ్చాడు. మనుష్యులను ప్రాముఖ్యంగా పాదిరీలను నమ్ముకోవడంలోని ప్రమాదం గురించి నన్ను హెచ్చరించాడు, బైబిలు చదివి దాన్ని మాత్రమే నమ్మమని నన్ను ప్రోత్సహించాడు. దాని విషయంలో నాకు సందేహాలు ఉన్నా, నేను ఒక క్రొత్త నిబంధన సంపాదించి చదవడం మొదలుపెట్టాను. నాకున్న అనేక నమ్మకాలు బైబిలు బోధలకు అనుగుణంగా లేవని నాకు క్రమక్రమంగా స్పష్టమయ్యింది.

నేను 1933 లో ఒక ఆదివారం జర్మనీలో రిచర్డ్‌ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఒక వివాహిత జంటకు పరిచయం చేశాడు, వాళ్ళు యెహోవాసాక్షులు. నేను బైబిలు చదువుతున్నానని తెలుసుకుని వాళ్ళు సంక్షోభం (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని నాకిచ్చారు. * నేను ఆ పుస్తకాన్ని చదవడం ముగించేసరికి దాదాపు మధ్యరాత్రి అయ్యింది. నేను సత్యం తెలుసుకున్నానని గ్రహించాను!

బేసల్‌లోని యెహోవాసాక్షులు నాకు లేఖనాల్లో అధ్యయనాలు * (ఆంగ్లం) అనే రెండు సంపుటులతోపాటు పత్రికలు, ఇతర ప్రచురణలు ఇచ్చారు. చదువుతున్నదాన్ని బట్టి ప్రభావితమై నేను స్థానిక ప్రీస్టు దగ్గరికి వెళ్ళి చర్చి రిజిస్టరు నుండి నా పేరు తొలగించమని అడిగాను. ప్రీస్టుకు చాలా కోపం వచ్చింది, నేను నా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నానని నన్ను హెచ్చరించాడు. వాస్తవానికి, నేను నా విశ్వాసాన్ని ఎంతమాత్రం కోల్పోలేదు. నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా నిజమైన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడం మొదలుపెట్టాను.

ఆ వారాంతం బేసల్‌లోని సహోదరులు సరిహద్దు దాటి ఫ్రాన్స్‌లోకి వెళ్ళి ప్రకటించడానికి పథకాలు వేస్తున్నారు. నేను ఈ మధ్యనే సంఘంతో సహవసించడం ప్రారంభించాను కాబట్టి నేను దానికి ఆహ్వానించబడడం లేదని ఒక సహోదరుడు నాకు దయాపూర్వకంగా వివరించాడు. అయినా నేను వెనుక తీయకుండా, ప్రకటించడం మొదలుపెట్టాలని నాకున్న కృతనిశ్చయాన్ని వెల్లడి చేశాను. మరో పెద్దతో సంప్రదించిన తర్వాత, ఆయన నాకు స్విట్జర్లాండ్‌లో ఒక క్షేత్రాన్నిచ్చాడు. ఆదివారం ఉదయాన్నే నేను 4 పుస్తకాలు, 28 పత్రికలు, 20 బ్రోషుర్‌లు సంచిలో పెట్టుకుని సైకిలు తీసుకుని బేసల్‌కు దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామానికి బయలుదేరాను. నేను అక్కడికి చేరుకునే సరికి గ్రామస్థులు చాలామంది చర్చిలో ఉన్నారు. అయినా గానీ 11 గంటలకల్లా నా సంచి ఖాళీ అయిపోయింది.

నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానని సహోదరులకు చెప్పినప్పుడు, వాళ్ళు నాతో ఎంతో హృదయపూర్వకంగా మాట్లాడి, సత్యాన్ని గురించి వాళ్ళు నన్ను చాలా లోతైన ప్రశ్నలు అడిగారు. యెహోవాపట్ల ఆయన సంస్థపట్ల వారికున్న ఆసక్తిని వారు చూపిస్తున్న విశ్వసనీయతను బట్టి నేను ముగ్ధుడినయ్యాను. అది చలికాలం కావడంతో ఒక సహోదరుడు నాకు ఒక పెద్ద యొక్క ఇంట్లోని స్నానాల తొట్టిలో బాప్తిస్మం ఇచ్చాడు. వర్ణనాతీతమైన ఆనందాన్ని, గొప్ప అంతర్గత బలాన్ని పొందిన భావన నాకు ఇప్పటికీ గుర్తుంది. అది 1934 నాటి మాట.

రాజ్య వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం

1936 లో యెహోవాసాక్షులు స్విట్జర్లాండ్‌లో కాస్త స్థలం కొన్నారని నేను విన్నాను. నేను తోటమాలిగా పనిచేస్తానని చెప్పాను. బెర్న్‌ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ష్టెఫ్ఫీస్‌బర్గ్‌లో ఉన్న రాజ్య వ్యవసాయ క్షేత్రంలో పని చేయడానికి ఆహ్వానించబడడంతో నాకెంతో ఆనందం కలిగింది. సాధ్యమైనప్పుడల్లా నేను అక్కడ పని చేస్తున్న ఇతరులకు వారి పనుల్లో సహాయం చేసేవాడిని. సహకరించే స్ఫూర్తి కలిగివుండడం యొక్క ప్రాముఖ్యతను బేతేలు నాకు నేర్పింది.

నేను బేతేలులో సేవ చేసిన సంవత్సరాల్లోని ఉన్నతాంశం 1936 లో సహోదరుడు రూథర్‌ఫోర్డ్‌ ఆ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం. మేము పండిస్తున్న టమాటాల పరిమాణాన్ని చూసి, పొలాలు ఫలవంతంగా ఉండడాన్ని చూసి ఆయన చిరునవ్వు నవ్వి తన సంతృప్తిని వ్యక్తపరిచాడు. ఆయనెంత ప్రేమగల సహోదరుడో!

నేను వ్యవసాయ క్షేత్రంలో సేవ చేయడం మొదలుపెట్టి మూడు సంవత్సరాల కొన్ని నెలలు దాటినప్పుడు, అమెరికాలోని యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ఉత్తరాన్ని ఉదయకాల ఫలహార సమయంలో చదివి వినిపించడం జరిగింది. ఆ ఉత్తరం ప్రకటనా పని యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పి, విదేశాల్లో పయినీర్లుగా సేవ చేయడానికి ఇష్టపడేవారికి ఆహ్వానాన్ని అందించింది. నేను ఏ మాత్రం సంకోచించకుండా స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళాను. నాకు 1939 లో నియామకం ఇవ్వబడింది​—⁠అది బ్రెజిల్‌లో!

ఆ సమయంలో నేను రాజ్య వ్యవసాయ క్షేత్రానికి దగ్గర్లో ఉన్న టూన్‌ సంఘంలో కూటాలకు హాజరవుతున్నాను. ఆదివారాల్లో, మేము ఒక గుంపుగా ఆల్ప్స్‌కు వెళ్ళి ప్రకటనా పని చేసేవాళ్ళం, టూన్‌ నుండి సైకిళ్ళ మీద అక్కడికి వెళ్ళడానికి రెండు గంటలు పడుతుంది. మార్గరీటా ష్టైనర్‌ కూడా ఆ గుంపులో ఉండేది. హఠాత్తుగా నాకొక తలంపు వచ్చింది: యేసు తన శిష్యులను ఇద్దరిద్దరినిగా పంపలేదూ? నాకు బ్రెజిల్‌కు నియామకం లభించిందని నేను సరదాగా మార్గరీటాతో అన్నప్పుడు, అవసరం ఎక్కువగా ఉన్న చోట సేవ చేయడానికి తనకున్న ఇష్టాన్ని ఆమె వ్యక్తపరిచింది. మేము 1939, జూలై 31న పెళ్ళి చేసుకున్నాము.

అనుకోని అడ్డంకు

మేము 1939 ఆగస్టు చివరి భాగంలో ఫ్రాన్స్‌లోని ల హావ్రె నుండి బ్రెజిల్‌లోని సాంటోస్‌కు ఓడలో బయల్దేరాము. డబుల్‌ బెర్తులన్నీ అయిపోవడంతో మేము విడి విడి కేబిన్‌లలో ప్రయాణించాల్సి వచ్చింది. మేము ప్రయాణిస్తుండగా, గ్రేట్‌ బ్రిటన్‌ ఫ్రాన్స్‌లు జర్మనీపై యుద్ధం ప్రకటించాయన్న వార్త అందింది. ఆ గుంపులోని 30 మంది జర్మన్‌ ప్రయాణీకులు జర్మనీ జాతీయ గీతం ఆలపించారు. దానితో క్యాప్టెన్‌కు విపరీతమైన కోపం వచ్చి, ఆయన ఓడను మొరొక్కోలోని సాఫీ వైపుకు తీసుకువెళ్ళాడు. జర్మనీకి చెందిన ప్రయాణ కాగితాలున్నవారు దిగిపోవడానికి ఐదు నిమిషాలు ఇవ్వబడ్డాయంతే. ఆ ప్రయాణీకుల్లో మేమూ ఉన్నాము.

మమ్మల్ని ఒక రోజంతా పోలీసు స్టేషన్‌లో ఉంచేశారు, ఆ తర్వాత కిక్కిరిసిపోయిన ఒక పాత డొక్కు బస్సులో మమ్మల్ని దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరకెక్‌ దగ్గరున్న చెరసాలకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాతి రోజులు కష్టాలతోనే గడిచాయి. మమ్మల్ని ఉంచిన జైలు గదులు కిక్కిరిసిపోయి చీకటిగా ఉండేవి. అందరూ ఉపయోగించుకునే మరుగుదొడ్డి అంటే నేలలో చేయబడిన గొయ్యి ఎప్పుడూ నిండిపోయేది. నిద్రపోవడానికి మాకు ఒకొక్కరికి అపరిశుభ్రంగా ఉన్న ఒక గోనె సంచి ఇచ్చేవారు, రాత్రులు ఎలుకలు మా కాళ్ళ పిక్కల్ని కొరికేసేవి. రోజుకు రెండుసార్లు తుప్పు పట్టిన ఒక పాత్రలో ఆహారం ఇవ్వబడేది.

ఫ్రెంచ్‌ విదేశీ సేనలో ఐదు సంవత్సరాలు పని చేయడానికి ఒప్పుకుంటే నేను విడుదల చేయబడతానని ఒక సైనికాధికారి నాకు వివరించాడు. నేను నిరాకరించడంతో, నల్లని రంధ్రం అని మాత్రం వర్ణించబడగల దానిలో 24 గంటలు ఉండవలసిన శిక్ష నాకు విధించబడింది. ఈ సమయంలో చాలా భాగం నేను ప్రార్థన చేస్తూ గడిపాను.

ఎనిమిది రోజుల తర్వాత, చెరసాల అధికారులు నేను మళ్ళీ మార్గరీటాను చూడడానికి అనుమతించారు. ఆమె చిక్కి శల్యమైపోయింది, ఏమాత్రం అదుపు చేయలేనంతగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను ప్రోత్సహించడానికి నేను చేయగలిగినదంతా చేశాను. మమ్మల్ని ఇంటరాగేట్‌ చేసి రైలులో కాసాబ్లాంకాకు పంపారు, అక్కడ మార్గరీటా విడుదల చేయబడింది. నన్ను దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్‌ ల్యాటీ (ఇప్పుడు కెనిట్రా) వద్దనున్న చెరసాల క్యాంపుకు పంపారు. స్విట్జర్లాండ్‌కు తిరిగి వెళ్ళిపోమని స్విస్‌ దౌత్యవేత్త మార్గరీటాకు సలహా ఇచ్చాడు కానీ ఆమె నాపట్ల నమ్మకంగా ఉండి, నన్ను వదిలి వెళ్ళిపోవడానికి నిరాకరించింది. నేను పోర్ట్‌ ల్యాటీలో ఉన్న రెండు నెలల్లోనూ ఆమె నన్ను చూడడానికి నాకు ఆహారం తీసుకొని ప్రతీరోజు కాసాబ్లాంకా నుండి వచ్చేది.

ఒక సంవత్సరం ముందు, యెహోవాసాక్షులు నాజీ పరిపాలనలో భాగం వహించకపోవడాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి క్రోయిట్స్‌సూగ్‌ గేగన్‌ డాస్‌ క్రిస్టన్‌టూమ్‌ (క్రైస్తవత్వానికి వ్యతిరేకమైన క్రూసేడ్‌) అనే పుస్తకాన్ని సాక్షులు విడుదల చేశారు. నేను చెరసాల క్యాంపులో ఉండగా, బెర్న్‌లో ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం, మేము నాజీలము కాదని నిరూపించడానికి ఆ పుస్తకాన్ని ఫ్రెంచి అధికారులకు పంపిస్తూ ఒక ఉత్తరం వ్రాశారు. ప్రభుత్వ అధికారులను కలిసి, మా నిర్దోషిత్వాన్ని గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ మార్గరీటా కూడా ఈ విషయంలో చాలా ప్రశంసనీయమైన పని చేసింది. చివరికి, 1939 చివరలో, మేము మొరొక్కో వదిలి వెళ్ళడానికి అనుమతి లభించింది.

బ్రెజిల్‌కు బయలుదేరిన తర్వాత, జర్మనీకి చెందిన జలాంతర్గాములు అట్లాంటిక్‌లోని ఓడ మార్గాలపై దాడి చేస్తున్నాయనీ వారికి మేము ప్రధాన గురిగా ఉన్నామనీ తెలిసింది. మా ఓడ జామైక్‌ అనే వర్తకపు ఓడ అయినప్పటికీ దాని ముందు భాగంలోనూ వెనుక భాగంలోనూ తుపాకులు ఎక్కుపెట్టబడ్డాయి. పగటి వేళలో క్యాప్టెన్‌ వంకరటింకర మార్గంలో వెళ్తూ నిరంతరాయంగా కాల్పులు జరిపాడు. రాత్రుల్లో జర్మనీవారు మమ్మల్ని గుర్తించకుండా ఉండడానికి పూర్తి అంధకారంలో ఉండేవారం. చివరికి 1940 ఫిబ్రవరి 6న అంటే యూరప్‌ నుండి బయలుదేరిన ఐదు నెలల కంటే ఎక్కువ కాలం తర్వాత బ్రెజిల్‌లోని సాంటోస్‌ ఓడరేవు చేరుకుని ఎంత ఊరట చెందామో!

మళ్ళీ చెరసాలకు

ప్రకటనాపని చేయడానికి మాకివ్వబడిన మొదటి నియామకం మోంటీనగ్రూ, అది దక్షిణ బ్రెజిల్‌ రాష్ట్రమైన రియో గ్రాండె డు సుల్‌లోని ఒక పట్టణం. మా రాక గురించి చర్చి అధికారులకు తెలియజేయబడి ఉండవచ్చు. మేము రెండు గంటలపాటు ప్రకటించిన తర్వాత, పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి బైబిలు ప్రసంగాలున్న ఫోనోగ్రాఫ్‌ రికార్డులను మా దగ్గరున్న సాహిత్యాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నారు, మేము మొరొక్కోలో కొని తెచ్చుకున్న ఒంటెతోలు సంచీలను కూడా వాళ్ళు తీసేసుకున్నారు. మేము పోలీసు స్టేషన్‌కు వెళ్ళేసరికి జర్మను భాష మాట్లాడే ఒక మత పరిచారకుడు, ఒక ప్రీస్టు మా కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పోలీసు ఉన్నతాధికారి తాను స్వాధీనం చేసుకున్న గ్రామఫోన్‌పై సహోదరుడు రూథర్‌ఫోర్డ్‌ ప్రసంగాలను వినిపించినప్పుడు వారు విన్నారు. సహోదరుడు రూథర్‌ఫోర్డ్‌ విషయాన్ని చాలా నిక్కచ్చిగా సూటిగా చెప్పాడు! వాటికన్‌ గురించి ప్రస్తావించబడిన భాగం వచ్చేసరికి, ప్రీస్టు ముఖం కందిపోయింది, ఆయన వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు.

సాంటా మారియా బిషప్పు విజ్ఞప్తి మేరకు పోలీసులు మమ్మల్ని రాజధాని నగరమైన పోర్టో ఎలెగ్రేకు పంపారు. మార్గరీటా త్వరలోనే విడుదల చేయబడింది, ఆమె స్విస్‌ కాన్సులేట్‌ సహాయాన్ని అర్థించింది. ఆమె స్విట్జర్లాండ్‌కు తిరిగి వెళ్ళిపోవడం మంచిదని కాన్సులేట్‌ సలహా ఇచ్చింది. మరోసారి, నన్ను వదిలి వెళ్ళడానికి ఆమె నిరాకరించింది. మార్గరీటా ఎప్పుడూ ఎంతో నమ్మకమైన సహచరిణిగా ఉంది. ముప్ఫై రోజుల తర్వాత నన్ను ఇంటరాగేట్‌ చేసి విడుదల చేశారు. పోలీసులు మా ఎదుట ఒక ఎంపికను ఉంచారు: పది రోజుల్లో దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం లేదా “పర్యవసానాలను అనుభవించడం.” ప్రధాన కార్యాలయ సూచన మేరకు మేము రియో డీ జనైరోకు వెళ్ళిపోయాము.

“దయచేసి ఈ కార్డును చదవండి”

బ్రెజిల్‌లో ప్రకటనా పని చేయడానికి ఈ అననుకూలమైన పరిస్థితుల్లో మేము చేరుకున్నప్పటికీ ఎంత ఆనందాన్ని పొందామో! ఎంతైనా మేము సజీవంగా ఉన్నాం, మా సంచుల నిండా సాహిత్యం ఉంది, ప్రకటించడానికి మాకు మొత్తం రియో డీ జనైరో అంతా ఉంది. కానీ పోర్చుగీసు భాష అంతగా రాని మేము ఎలా ప్రకటిస్తాము? ఒక సాక్ష్యమిచ్చే కార్డు సహాయంతో మేము ఆ పని చేయాలి. ప్రకటనాపనిలో ఉపయోగించడానికి మేము నేర్చుకున్న మొదటి పోర్చుగీసు వాక్యం “పోర్‌ ఫేవోర్‌, లేయా ఎస్టె కార్టావో” (“దయచేసి ఈ కార్డును చదవండి.”) దానితో ఎంతటి విజయం లభించిందో! ఒక్క నెలలోనే మేము 1,000 కంటే ఎక్కువ పుస్తకాలు పంచిపెట్టాము. మేము అందించిన బైబిలు సాహిత్యాన్ని తీసుకున్న అనేకులు ఆ తర్వాత సత్యాన్ని స్వీకరించారు. యథార్థంగా చెప్పాలంటే, మేమెన్నటికీ ఇవ్వలేనంతటి ప్రభావవంతమైన సాక్ష్యాన్ని మన ప్రచురణలే ఇచ్చాయి. మన ప్రచురణలు ఆసక్తిగల వారి చేతుల్లోకి వెళ్ళేలా చూడడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ఇది నాకు సహాయం చేసింది.

ఆ సమయంలో రియో డీ జనైరో బ్రెజిల్‌కు రాజధానిగా ఉంది, మా సందేశాన్ని ప్రత్యేకించి ప్రభుత్వ భవనాల్లోనివారు చక్కగా వినేవారు. ఆర్థిక మంత్రికి, సాయుధ బలగాల మంత్రికి స్వయంగా సాక్ష్యమిచ్చే విశేషమైన అవకాశం నాకు లభించింది. ఈ సందర్భాల్లో, యెహోవా ఆత్మ పనిచేస్తోందనడానికి స్పష్టమైన నిదర్శనాన్ని నేను చూశాను.

ఒకసారి రియో మధ్యన ఒక కూడలిలో ప్రకటిస్తున్నప్పుడు, నేను ప్యాలెస్‌ ఆఫ్‌ జస్టిస్‌లోకి ప్రవేశించాను. ఎలాగో నేను ఒక గదిలోకి ప్రవేశించాను అందులో అందరూ నల్లని వస్త్రాలు ధరించివున్నారు, అక్కడ అంత్యక్రియలకు సంబంధించి ఏదో జరుగుతున్నట్లుగా నాకనిపించింది. కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను నా సాక్ష్యపు కార్డును ఆయనకిచ్చాను. అవి అంత్యక్రియలేమీ కాదు. నిజానికి నేను అక్కడ విచారించబడుతున్న ఒక కోర్టు కేసుకు అంతరాయం కలిగించాను, నేను మాట్లాడింది న్యాయమూర్తితో. ఆయన నవ్వి, ఏ చర్యా తీసుకోవద్దని గార్డులకు సైగ చేశాడు. ఆయన పిల్లలు * (ఆంగ్లం) అనే పుస్తకాన్ని మర్యాదపూర్వకంగా తీసుకుని, చందా ఇచ్చాడు. బయటికి వచ్చేస్తుండగా, గార్డుల్లో ఒకరు తలుపు మీద రాసివున్న ఒక విషయం వైపుకు నా దృష్టిని మళ్ళించాడు. అక్కడిలా ఉంది: ప్రోయిబీడా ఆ ఎంట్రాడా డ పెసోవాస్‌ ఎస్ట్రాన్యాస్‌ (అధికారం లేని వ్యక్తులు ప్రవేశించేందుకు అనుమతించబడరు).

చాలా ఫలవంతమైన మరో ప్రాంతం ఓడరేవు. ఒక సందర్భంలో, తిరిగి సముద్రంలోకి వెళ్ళబోతున్న ఒక నావికుడ్ని నేను కలిశాను, ఆయన ప్రచురణలు తీసుకున్నాడు. ఆ తర్వాత, మేము ఆయనను సమావేశంలో కలిశాము. ఆయన కుటుంబమంతా సత్యాన్ని స్వీకరించింది, ఆయన కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నాడు. అది మాకెంతో సంతోషం కలిగించింది.

అయితే, అంతా సాఫీగానే ఏమీ సాగిపోలేదు. మా ఆరునెలల వీసా ఎక్స్‌పైర్‌ అయిపోయింది, మమ్మల్ని ఆ దేశం నుండి పంపివేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. మా పరిస్థితి గురించి ప్రధాన కార్యాలయానికి వ్రాసిన తర్వాత, సహోదరుడు రూథర్‌ఫోర్డ్‌ నుండి మాకు ఒక ప్రేమపూర్వకమైన ఉత్తరం అందింది, మమ్మల్ని కొనసాగమని ప్రోత్సహిస్తూ మేము ఎలా ముందుకు సాగాలో ఆయన సూచించాడు. బ్రెజిల్‌లో ఉండాలన్నది మా కోరిక, ఒక న్యాయవాది సహాయంతో మేము చివరికి 1945 లో శాశ్వత వీసాను సంపాదించుకున్నాము.

దీర్ఘకాల నియామకం

అయితే, దానికి ముందు, 1941 లో మా కుమారుడు జోనాతాన్‌, 1943 లో రూత్‌, 1945 లో ఎస్తెర్‌ జన్మించారు. పెరుగుతున్న మా కుటుంబ అవసరాల గురించి శ్రద్ధ వహించడానికి, నేను ఉద్యోగం చేయవలసి వచ్చింది. మా మూడో సంతానం జన్మించే వరకూ మార్గరీటా పూర్తికాల ప్రకటనా పనిలో కొనసాగింది.

మొదటి నుండి మేము నగర కూడలిల్లోనూ రైల్వే స్టేషన్లలోనూ వీధుల్లోనూ వ్యాపార ప్రాంతాల్లోనూ ప్రకటించడంలో ఒక కుటుంబంగా కలిసి పని చేశాము. శనివారం సాయంత్రాల్లో మేము కావలికోట, తేజరిల్లు! ప్రతులను కలిసి పంచిపెట్టేవాళ్ళము, ఇవి ప్రత్యేకంగా ఆనందభరితమైన సందర్భాలు.

ఇంట్లో, ప్రతి బిడ్డకు తాను నిర్వర్తించవలసిన పనులు ఉండేవి. జోనాతాన్‌ స్టవ్‌, వంటగది శుభ్రం చేయాలి. అమ్మాయిలు ఫ్రిజ్‌ శుభ్రం చేసి, పెరడంతా ఊడ్చి, మా బూట్లు పాలిష్‌ చేసేవారు. ఇది వారు సంస్థీకరణనూ చొరవతీసుకోవడాన్నీ నేర్చుకొనేందుకు సహాయపడింది. నేడు మా పిల్లలు కష్టపడి పని చేస్తారు, తమ ఇళ్ళ గురించి వస్తువుల గురించి చక్కగా శ్రద్ధ తీసుకుంటారు, అది నాకు మార్గరీటాకు ఎంతో ఆనందాన్నిస్తుంది.

కూటాల్లో పిల్లలు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని కూడా మేము అపేక్షించేవాళ్ళము. కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు వాళ్ళు ఒక గ్లాసుడు నీళ్ళు త్రాగి, బాత్రూమ్‌కు వెళ్ళివచ్చేవారు. కూటం జరిగేటప్పుడు, జోనాతాన్‌ నా ఎడమవైపున, రూత్‌ నా కుడివైపున, ఆ తర్వాత మార్గరీటా, ఆమె కుడివైపున ఎస్తెర్‌ ఇలా కూర్చునేవాళ్ళం. ఇది వారు తమ అవధానాన్ని కేంద్రీకరించడానికి, లేతప్రాయం నుండి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడానికి వారికి సహాయం చేసింది.

యెహోవా మా కృషిని ఆశీర్వదించాడు. మా పిల్లలందరూ నమ్మకంగా యెహోవా సేవ చేయడంలో కొనసాగుతున్నారు, ప్రకటనా పనిలో ఆనందంగా భాగం వహిస్తున్నారు. జోనాతాన్‌ ప్రస్తుతం, రియో డీ జనైరోలోని నొవూ మేర్‌ సంఘంలో పెద్దగా సేవ చేస్తున్నాడు.

1970 కల్లా మా పిల్లలంతా పెళ్ళిళ్లు చేసుకుని విడిగా కాపురాలు పెట్టారు, దానితో మార్గరీటా నేను అవసరం ఎక్కువగా ఉన్న చోట సేవ చేయడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. మేము మొదట మీనస్‌ గెర్యాస్‌ రాష్ట్రంలోని పోసూస్‌ డీ కల్డస్‌కు వెళ్ళాము, అప్పుడక్కడ 19 మంది రాజ్య ప్రచారకుల చిన్న గుంపు ఉంది. వారు కూటాలు జరుపుకునే స్థలాన్ని చూసి నేను మొదట చాలా బాధపడ్డాను, అది నేలమాళిగలో ఉన్న గది, దానికి కిటికీలు లేవు, చాలా పాడైపోయిన స్థితిలో ఉంది. వెంటనే, మేము మరింత అనువైన రాజ్యమందిరం కోసం వెదకడం మొదలు పెట్టాము, త్వరలోనే చక్కని స్థలంలో, ఆకర్షణీయమైన భవనాన్ని కనుగొన్నాము. దానితో ఎంత తేడానో! నాలుగున్నర సంవత్సరాల తర్వాత, ప్రచారకుల సంఖ్య 155కి చేరుకుంది. మేము 1989 లో రియో డీ జనైరోలోని ఆరారూమాకు వెళ్ళాము, అక్కడ తొమ్మిది సంవత్సరాలపాటు సేవ చేశాము. ఆ సమయంలో మేము రెండు క్రొత్త సంఘాలు ఏర్పడడాన్ని చూశాము.

మా నియామకానికి కట్టుబడి ఉన్నందుకు ప్రతిఫలాన్ని పొందాము

1998 లో, ఆరోగ్య సమస్యలు, పిల్లలకు దగ్గరగా ఉండాలన్న కోరిక, మేము రియో డీ జనైరోలోని సావో గోన్‌సాలూకు వెళ్ళేలా చేశాయి. అక్కడ నేనిప్పటికీ సంఘ పెద్దగా సేవచేస్తున్నాను. ప్రకటనా పనిలో క్రమంగా భాగం వహించడానికి మేము చేయగలిగిందంతా చేస్తాము. దగ్గరలో ఉన్న సూపర్‌మార్కెట్‌లో సాక్ష్యమివ్వడం మార్గరీటాకు ఇష్టం, సంఘం దయతో మా ఇంటికి దగ్గర్లో మాకు కాస్త క్షేత్రాన్ని ఇచ్చింది, మా ఆరోగ్యం అనుమతించినంత మేరకు ప్రకటించడాన్ని అది మాకు సులభతరం చేస్తుంది.

మార్గరీటా, నేనూ ఇప్పటికి 60 కంటే ఎక్కువ సంవత్సరాల నుండి యెహోవా సమర్పిత సేవకులముగా ఉన్నాము. “ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని” మేము వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. (రోమీయులు 8:​38, 39) దేవుని అందమైన సృష్టములతో నిండివుండే పరిపూర్ణమైన భూమిపై నిత్యజీవాన్ని పొందే అద్భుతమైన నిరీక్షణగల “వేరే గొఱ్ఱెల”ను సమకూర్చడాన్ని చూడడం ఎంతటి ఆనందాన్ని కలిగించిందో! (యోహాను 10:​16) మేము 1940 లో రియో డీ జనైరోకు వెళ్ళినప్పుడు, అక్కడ 28మంది ప్రచారకులతో కేవలం ఒక్క సంఘం ఉంది. నేడు అక్కడ 250 సంఘాలున్నాయి, 20,000 కంటే ఎక్కువమంది రాజ్య ప్రచారకులున్నారు.

మేము యూరప్‌లోవున్న మా కుటుంబాల వద్దకు తిరిగి వెళ్ళిపోగల అవకాశాలు ఎన్నో వచ్చాయి. కానీ యెహోవా నుండి మాకు నియామకం లభించింది బ్రెజిల్‌లో. మేము దాన్ని అంటిపెట్టుకుని ఉన్నందుకు ఎంతగా సంతోషిస్తున్నామో!

[అధస్సూచీలు]

^ పేరా 11 యెహోవాసాక్షులు ప్రచురించినవి, కాని ఇప్పుడు ముద్రించబడడం లేదు.

^ పేరా 12 యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు ముద్రించబడడం లేదు.

^ పేరా 33 యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు ముద్రించబడడం లేదు.

[21వ పేజీలోని చిత్రం]

1930ల చివరిభాగంలో, స్విట్జర్లాండ్‌లోని ష్టెఫ్ఫీస్‌బర్గ్‌లో రాజ్య వ్యవసాయ క్షేత్రం వద్ద (నేను ఎడమవైపు చివరన ఉన్నాను)

[23వ పేజీలోని చిత్రం]

1939 లో, మా వివాహానికి కొంతకాలం ముందు

[23వ పేజీలోని చిత్రం]

1940లలో కాసాబ్లాంకా

[23వ పేజీలోని చిత్రం]

ఒక కుటుంబంగా కలిసి ప్రకటించడం

[24వ పేజీలోని చిత్రం]

నేడు పరిచర్యలో క్రమంగా పాల్గొనడం