కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యారాధన మద్దతుదారులు నాడు, నేడు

సత్యారాధన మద్దతుదారులు నాడు, నేడు

సత్యారాధన మద్దతుదారులు నాడు, నేడు

ప్రాచీన యెరూషలేము నగరాన్ని గురించి యేడ్చిన వ్యక్తి పేరు మీకు జ్ఞాపకముందా? ‘యేసు’ అని మీరు చెప్పవచ్చు​—⁠అవును నిజంగానే యేసు యేడ్చాడు. (లూకా 19:​28, 41) అయితే, యేసు ఈ భూమ్మీదికి రావడానికి ముందు శతాబ్దాల క్రితం మరో నమ్మకమైన దేవుని సేవకుడు యెరూషలేము గురించి యేడ్చాడు. ఆయన పేరు నెహెమ్యా.​—⁠నెహెమ్యా 1:3, 4.

నెహెమ్యా యెరూషలేము గురించి దుఃఖించి యేడ్చేలా చేసినదేమిటి? ఆయన ఆ నగర ప్రయోజనార్థం ఆ నగర వాసుల ప్రయోజనార్థం ఏమి చేశాడు? ఆయన మాదిరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? దానికి సమాధానం కోసం, ఆయన కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను మనం సమీక్షిద్దాము.

బలమైన భావాలున్న, నిర్ణాయక చర్యలు తీసుకునే వ్యక్తి

నెహెమ్యా యెరూషలేముకు అధికారిగా నియమించబడ్డాడు, కానీ దానికి ముందు ఆయన షూషను నగరంలోని పారసీకుల ఆస్థానంలో ఉన్నతాధికారిగా ఉన్నాడు. అయినప్పటికీ, ఆయననుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితం, ఎంతో దూరాన యెరూషలేములో ఉన్న యూదులైన తన సహోదరుల సంక్షేమం పట్ల ఆయనకున్న శ్రద్ధను తగ్గించలేదు. వాస్తవానికి, యెరూషలేము నుండి వచ్చిన యూదుల బృందమొకటి షూషను నగరాన్ని సందర్శించినప్పుడు ఆయన చేసిన మొదటి పని ‘చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి,

యెరూషలేమును గూర్చి వారినడగడం.’ (నెహెమ్యా 1:⁠2) యెరూషలేము నివాసులు “బహుగా శ్రమను” పొందుతున్నారని, నగర ప్రాకారము “పడద్రోయబడినది” అని సందర్శకులు తెలియజేసినప్పుడు, నెహెమ్యా “కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము” ఉన్నాడు. ఆ తర్వాత ఆయన హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ తన బాధను యెహోవాకు తెలియజేశాడు. (నెహెమ్యా 1:​3-11) నెహెమ్యా ఎందుకంత బాధపడ్డాడు? ఎందుకంటే భూమ్మీద యెహోవా ఆరాధనకు యెరూషలేము కేంద్రంగా ఉంది, అంతేగాక అది నిర్లక్ష్యం చేయబడింది. (1 రాజులు 11:​36) అంతేగాక, నగరం అలాంటి దురవస్థలో ఉండడం దాని నివాసుల దుర్భరమైన ఆధ్యాత్మిక స్థితిని ప్రతిబింబిస్తోంది.​—⁠నెహెమ్యా 1:6, 7.

యెరూషలేమంటే నెహెమ్యాకున్న శ్రద్ధ, అక్కడ నివసిస్తున్న యూదులపట్ల ఆయనకున్న ప్రేమ ఆయన తనను తాను వారి కోసం అర్పించుకునేలా ఆయనను ప్రోత్సహించాయి. పారసీక రాజు, తన విధుల నుండి సెలవు తీసుకుని వెళ్ళడానికి నెహెమ్యాను అనుమతించిన వెంటనే ఆయన యెరూషలేముకు చేయబోయే సుదీర్ఘ ప్రయాణం గురించి ప్రణాళిక వేసుకోవడం ప్రారంభించాడు. (నెహెమ్యా 2:​5, 6) అవసరమైన మరమ్మతు పనికి మద్దతుగా ఆయన తన శక్తిని, సమయాన్ని, నైపుణ్యాలను వెచ్చించాలని కోరుకున్నాడు. ఆయన అక్కడికి చేరుకున్న కొద్ది రోజుల్లోనే యెరూషలేము ప్రాకారము నంతటినీ బాగు చేసేందుకు అప్పటికే ఆయన దగ్గర ప్రణాళిక ఉంది.​—⁠నెహెమ్యా 2:​11-18.

ప్రాకారమును బాగు చేసే భారీ కార్యాన్ని నెహెమ్యా అనేక కుటుంబాలకు పంచి ఇచ్చాడు, అందరూ చేదోడు వాదోడుగా పని చేశారు. * ఒక్కొక్కరు ఒక్కో “భాగమును” బాగుచేయడానికి 40 కంటే ఎక్కువ గుంపులు నియమించబడ్డారు. ఫలితం? తమ పిల్లలను వెంటబెట్టుకుని వచ్చిన తల్లిదండ్రులతో సహా అంతమంది పనివారు తమ సమయాన్ని, శక్తిని వెచ్చించడంతో తలకుమించిన పనిగా తోచినది సాధించ శక్యమైన పనిగా మారింది. (నెహెమ్యా 3:​11, 12, 19, 20) చురుగ్గా పని చేసిన రెండు నెలల్లో మొత్తం ప్రాకారమంతా బాగు చేయబడింది! బాగు చేసే పనిని వ్యతిరేకించిన వారు సహితం “ఈ పని మా దేవునివలన జరిగినదని” అంగీకరించేలా బలవంతం చేయబడ్డారని నెహెమ్యా వ్రాశాడు.​—⁠నెహెమ్యా 6:​15, 16.

గుర్తుంచుకోవలసిన ఒక ఉదాహరణ

నెహెమ్యా తన సమయాన్ని సంస్థాగత నైపుణ్యాలనే గాక ఇంకా ఎంతో విరాళంగా చెల్లించాడు. ఆయన సత్యారాధనకు మద్దతునివ్వడానికి తన వస్తుసంపదలను కూడా వెచ్చించాడు. యూదులైన తన సహోదరులను దాసత్వం నుండి విడిపించడానికి ఆయన తన సొంత డబ్బును ఉపయోగించాడు. ఆయన వడ్డీ తీసుకోకుండా డబ్బు అప్పు ఇచ్చాడు. అధిపతిగా ఆయనకు డబ్బు వసూలు చేసే అధికారం ఉన్నా ఆయన యూదులపై ఎన్నడూ ‘భారము మోపలేదు.’ బదులుగా, “చుట్టునున్న అన్య జనులలోనుండి వచ్చినవారు గాక . . . నూట ఏబదిమంది” కోసం ఆయన తన ఇంటి ద్వారాలు తెరిచి ఉంచాడు. ఆయన ప్రతి రోజు తన అతిథుల కోసం ‘ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱెలను, కోళ్లను’ సిద్ధము చేయించేవాడు. అంతేగాక, ప్రతి పదిరోజులకొకసారి “నానావిధమైన ద్రాక్షారసములను” తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేశాడు.​—⁠నెహెమ్యా 5:​8, 10, 14-18.

నాటి, నేటి దేవుని సేవకులందరి కోసం నెహెమ్యా ఉదారత విషయంలో ఎంత చక్కని మాదిరి ఉంచాడో కదా! ధైర్యశాలి అయిన ఈ దేవుని సేవకుడు సత్యారాధనను పెంపొందింపజేయడానికి పనివారికి మద్దతునిచ్చేందుకు తన వస్తుసంపదలను ఇష్టపూర్వకంగా ఉపయోగించాడు. సముచితంగానే, ఆయన యెహోవాను ఇలా అడగగలిగాడు: “నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము.” (నెహెమ్యా 5:​19) ఖచ్చితంగా యెహోవా అదే చేస్తాడు.​—⁠హెబ్రీయులు 6:​10.

నెహెమ్యా మాదిరి నేడు అనుసరించబడుతోంది

యెహోవా ప్రజలు నేడు సత్యారాధన పక్షాన అదే విధమైన వాత్సల్యపూరితమైన భావాలను, చర్య తీసుకోవాలనే ఇష్టాన్ని, స్వయంత్యాగపూరిత దృక్పథాన్ని ప్రదర్శించడం చూస్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తోటి విశ్వాసులు కష్టాలనుభవిస్తున్నారని విన్నప్పుడు వారి సంక్షేమం గురించి మనం ఎంతో చింతిస్తాము. (రోమీయులు 12:​15) నెహెమ్యా వలే మనం, విశ్వాసంలో మనకు సహోదరులైనవారు కష్టాలనుభవిస్తుంటే వారికి మద్దతునివ్వమని యెహోవాకు ప్రార్థిస్తూ ఆయననిలా వేడుకుంటాము: “యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకిం[చుము].”​—⁠నెహెమ్యా 1:11; కొలొస్సయులు 4:⁠2-4.

అయితే, మన క్రైస్తవ సహోదరుల ఆధ్యాత్మిక, శారీరక సంక్షేమాన్ని గురించి, సత్యారాధన పెంపొందింపజేయబడడం గురించి మనకున్న శ్రద్ధ కేవలం మన భావాలనే ప్రభావితం చేయదు. అది మనం చర్య తీసుకోవడానికి కూడా మనల్ని కదిలిస్తుంది. తమ పరిస్థితులు అనుమతించేవారు తమ ఇళ్ళల్లోని సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకుని, నెహెమ్యా వలే, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఇతర స్థలాలకు వెళ్ళేలా ప్రేమ వారిని పురికొల్పింది. అలాంటి స్వచ్ఛంద సేవకులు ప్రపంచంలోని కొన్ని భాగాల్లో ఎదుర్కొనే అంత సౌకర్యవంతంకాని జీవన పరిస్థితుల మూలంగా నిరుత్సాహపడకుండా అక్కడ తమ క్రైస్తవ సహోదరులతో భుజాలు కలిపి పనిచేస్తూ సత్యారాధన పెంపొందడానికి మద్దతునిస్తారు. వారు చూపించే స్వయం త్యాగపూరిత స్ఫూర్తి నిజంగా ప్రశంసనీయమైనది.

ఇంటికి దగ్గర్లో మన వంతు మనం చేయడం

మనలో చాలామందిమి మరో స్థలానికి వెళ్ళలేమన్నది అర్థం చేసుకోదగినదే. మనం మన ఇంటికి దగ్గర్లోనే సత్యారాధనకు మద్దతునిస్తాము. అది కూడా నెహెమ్యా గ్రంథంలో సోదాహరణంగా తెలియజేయబడింది. బాగు చేసే పనిలో భాగం వహించిన కొంతమంది నమ్మకమైన కుటుంబాల గురించి నెహెమ్యా జతచేస్తున్న వివరాన్ని గమనించండి. ఆయనిలా వ్రాశాడు: “తన యింటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేసెను, . . . తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అనువారు బాగుచేసిరి; . . . వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.” (ఇటాలిక్కులు మావి.) (నెహెమ్యా 3:​10, 23, 28-30) తమ ఇంటికి దగ్గర్లో ప్రాకారమును బాగు చేయడంలో భాగం వహించడం ద్వారా ఆ పురుషులు, వారి కుటుంబాలు సత్యారాధనను పెంపొందింపజేయడానికి ఎంతగానో దోహదపడ్డారు.

నేడు మనలో చాలామందిమి వివిధ రకాలుగా మన స్వంత సమాజాల్లో సత్యారాధనకు మద్దతునిస్తాము. మనం రాజ్య మందిర నిర్మాణ ప్రాజెక్టుల్లో, దుర్ఘటన ఉపశమన కార్యక్రమాల్లో, మరింత ప్రాముఖ్యంగా రాజ్య ప్రకటన పనిలో భాగం వహిస్తాము. అంతేగాక, మనం నిర్మాణపనిలో గానీ ఉపశమన కార్యక్రమాల్లో గానీ వ్యక్తిగతంగా భాగం వహించగలిగినా లేకపోయినా, నెహెమ్యా తన కాలంలో ఉదారతతో చేసినట్లుగానే మనం మన వస్తుసంపదలతో సత్యారాధనకు మద్దతునివ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటాము.​—⁠“స్వచ్ఛందంగా ఇవ్వడం యొక్క లక్షణాలు” అనే బాక్సు చూడండి.

పెరుగుతున్న మన ముద్రణా కార్యకలాపాలకు, పునరావాస కార్యక్రమాలకు, భూవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఇతర సేవలకు అవసరమైన డబ్బును సమకూర్చడం కొన్నిసార్లు తలకుమించినదిగా అనిపిస్తుంది. అయితే, యెరూషలేము యొక్క భారీ ప్రాకారాన్ని బాగుచేయడమనే కార్యం కూడా తలకుమించినదిగానే అనిపించిందని గుర్తు తెచ్చుకోండి. (నెహెమ్యా 4:​10) అయినా, ఈ పనిని సుముఖత గల అనేక కుటుంబాలకు కొంత కొంత కేటాయించబడింది కాబట్టి ఆ కార్యాన్ని సాధించడం సాధ్యమైంది. అదే విధంగా నేడు, మన ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైన అనేక వనరులను సమకూర్చుకోవడం, మనలో ప్రతి ఒక్కరం ఆ పనిలో కొంత భాగం గురించి శ్రద్ధ వహించడంలో కొనసాగితే మనకు తలకు మించినది కాదు.

“ప్రపంచవ్యాప్త పనికోసం విరాళాలు ఇవ్వడానికి కొంతమంది ఎన్నుకునే పద్ధతులు” అనే బాక్సు, రాజ్య పనికి ఆర్థిక మద్దతునివ్వడానికి వివిధ మార్గాల గురించి చూపిస్తుంది. గత సంవత్సరంలో, దేవుని ప్రజల్లో అనేకులు అలాంటి మద్దతునిచ్చారు, స్వచ్ఛందంగా ఇవ్వడమనే ఈ పనిలో భాగం వహించడానికి ఎవరెవరి హృదయాలైతే వారిని పురికొల్పాయో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి యెహోవాసాక్షుల పరిపాలక సభ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రపంచమంతటా సత్యారాధనను పెంపొందింపజేయడానికి తన ప్రజలు హృదయపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలపై కుమ్మరించిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మనం యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అవును, గత సంవత్సరాల్లో యెహోవా హస్తము మనల్ని ఎలా నడిపించిందో ఆలోచిస్తే, మనం నెహెమ్యా పలికిన ఈ మాటలను ప్రతిధ్వనింపజేయాలనుకుంటాము, ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఇలా అన్నాడు: “నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము.”​—⁠నెహెమ్యా 2:​18.

[అధస్సూచి]

^ పేరా 8 యూదులలో కొందరు ప్రముఖులు అంటే “జనుల అధికారులు” ఆ పనిలో భాగం వహించడానికి నిరాకరించినప్పటికీ వారు మినహాయింపు మాత్రమేనని నెహెమ్యా 3:5 చెబుతోంది. యాజకులు, బంగారపు పనివారు, ఔషధజ్ఞానులు, అధిపతులు, వర్తకులు వంటి వివిధ పూర్వరంగాలకు చెందిన ప్రజలందరూ ఈ పనికి మద్దతునిచ్చారు.​—⁠1, 8, 9, 32 వచనాలు.

[28, 29వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

ప్రపంచవ్యాప్త పనికోసం విరాళాలు

ఇవ్వడానికి కొంతమంది ఎన్నుకునే పద్ధతులు

అనేకమంది, “ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు​—⁠మత్తయి 24:14” అని వ్రాయబడి ఉన్న చందా పెట్టెలలో వేయడానికి కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడతారు లేదా తమ బడ్జెట్‌లో దాన్ని చేరుస్తారు.

ప్రతినెలా సంఘాలు ఈ మొత్తాలను యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి గానీ లేదా స్థానిక బ్రాంచి కార్యాలయానికి గానీ పంపిస్తాయి. డబ్బు రూపంలోని స్వచ్ఛంద విరాళాలను నేరుగా The Watch Tower Bible and Tract Society of India, G-37, South Avenue, Santacruz, Mumbai 400 054కి గానీ మీదేశంలో జరిగే సేవను పర్యవేక్షించే బ్రాంచి కార్యాలయానికి గానీ పంపించవచ్చు. ఆభరణాలను ఇతర విలువైన వాటిని సహితం విరాళంగా ఇవ్వవచ్చు. వీటితో పాటు వీటిని విరాళంగా ఇస్తున్నామని ఖచ్చితంగా తెలియజేసే క్లుప్తమైన లేఖను కూడా జతచేయాలి.

ప్రణాళిక వేసుకుని ఇవ్వడం

ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనార్థం విరాళాలివ్వడంలో, నేరుగా డబ్బునే కానుకగా ఇవ్వడం మరియు షరతు మీద ఇచ్చే విరాళాలే కాక, వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో:

భీమా:

జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ ప్లాన్‌కు లబ్దిదారుగా జెహోవాస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలను, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మరణానంతరం లేదా ఒక ట్రస్టుగా జెహోవాస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌కి చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

షేర్లు మరియు బాండ్లు: షేర్లను మరియు బాండ్లను పూర్తిగా కానుక రూపంలో జెహోవాస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌కి విరాళంగా ఇవ్వవచ్చు.

స్థలాలు: అమ్మదగిన స్థలాలను పూర్తిగా ఒక బహుమానంగా లేక ఆమె/అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో జెహోవాస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌కి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకముందు మీదేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా జెహోవాస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్టు అగ్రిమెంట్‌ లబ్దిదారుగా జెహోవాస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ ఇండియా పేరు వ్రాయవచ్చు.

అలా ట్రస్టును లబ్దిదారుగా పేర్కొంటూ వీలునామా వ్రాసేటప్పుడు దయచేసి ఇండియన్‌ సక్సెషన్‌ యాక్ట్‌, 1925 లోని సెక్షన్‌ 118ని గమనించండి, “సోదరుని లేదా సోదరి కుమారుడు లేదా కుమార్తె ఉన్న వ్యక్తి, తన మరణానికి పన్నెండు నెలల ముందు వీలునామా వ్రాస్తేనే గాని, మతపరమైన లేదా ధార్మిక అవసరాల కోసం ఆస్తిని ఇచ్చే ఎటువంటి అధికారం ఆయనకు ఉండదు. అంతేకాదు, సజీవంగా ఉన్న వ్యక్తుల వీలునామాల సంరక్షణ కోసం చట్టం ఏర్పాటుచేసిన స్థలంలో ఆ వీలునామాని ఉంచిన పక్షంలోనే అది చెల్లుతుంది.”

మీరు మీ వీలునామాలో లబ్దిదారుగా జెహోవాస్‌ విట్నెసెస్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్ట్‌ పేరును వ్రాయాలనుకుంటే, వీలునామాలో సొసైటీ పూర్తి పేరును, చిరునామాను దయచేసి వ్రాయండి:

Jehovah’s Witnesses of India

927/1, Addevishwanathapura,

Rajanukunte, Bangalore 561 203,

Karnataka.

[30వ పేజీలోని బాక్సు]

స్వచ్ఛందంగా ఇవ్వడం యొక్క లక్షణాలు

అపొస్తలుడైన పౌలు తాను కొరింథీయులకు వ్రాసిన పత్రికల్లో స్వచ్ఛందంగా ఇవ్వడాన్ని గురించిన మూడు విశేషమైన లక్షణాల గురించి ప్రస్తావించాడు. (1) డబ్బు పోగుచేయడం గురించి వ్రాసేటప్పుడు, పౌలు ఇలా ఉపదేశించాడు: “ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును . . . తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.” (1 కొరింథీయులు 16:⁠2బి) కాబట్టి, ఇవ్వడానికి ముందుగా పథకం వేసుకోవలసిన అవసరం ఉంటుంది, అదీ క్రమానుసారంగా చేయవలసి ఉంటుంది. (2) ప్రతి వ్యక్తి “తాను వర్ధిల్లిన కొలది” ఇవ్వాలని కూడా పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 16:2ఎ) వేరే మాటల్లో చెప్పాలంటే, స్వచ్ఛందంగా ఇవ్వడంలో భాగం వహించాలని కోరుకునే వ్యక్తి తన శక్తికి తగినట్లు ఇవ్వవచ్చు. ఒక క్రైస్తవుడు చాలా తక్కువే సంపాదించుకుంటూ తత్ఫలితంగా కొద్ది మొత్తమే చందాగా ఇవ్వగలిగినా యెహోవా దాన్ని విలువైనదిగా ఎంచుతాడు. (లూకా 21:​1-4) (3) పౌలు ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:⁠7) యథార్థ క్రైస్తవులు హృదయపూర్వకంగా అంటే ఉత్సాహంగా ఇస్తారు.

[26వ పేజీలోని చిత్రాలు]

నెహెమ్యా బలమైన భావాలున్న, నిర్ణాయక చర్యలు తీసుకునే వ్యక్తి

[30వ పేజీలోని చిత్రాలు]

స్వచ్ఛంద విరాళాలు ముద్రణా కార్యకలాపాలకు, పునరావాస కార్యక్రమాలకు, రాజ్య మందిరాల నిర్మాణానికి, భూ వ్యాప్తంగా ఇతర ప్రయోజనకరమైన సేవలకు మద్దతునిస్తాయి