కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆరాధనాస్థలాలు అవి మనకు అవసరమా?

ఆరాధనాస్థలాలు అవి మనకు అవసరమా?

ఆరాధనాస్థలాలు అవి మనకు అవసరమా?

‘రంగురంగుల వస్త్రాలు ధరించి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన వేలాదిమంది యాత్రికులతో, మద్దెల ధ్వనికి లయబద్ధంగా హిస్పానిక్‌ కాలానికి పూర్వపువని చెప్పబడుతున్న నృత్యాలను చేస్తున్న ఆదివాసుల గుంపులతో, పుణ్యక్షేత్రానికి వస్తున్న సమూహంలో నుండి ఎంతో కష్టంతో బాధతో మోకాళ్ళ మీద నడిచివస్తున్న విశ్వాసులతో బాసిలికా (క్రైస్తవ చర్చీగా ఉపయోగించబడే పెద్ద భవనం) ప్రాంగణమూ దాని చుట్టు ప్రక్కల ఉన్న వీధులూ నిండిపోయి ఉన్నాయి.’

2001 డిసెంబరులో ఒక పెద్ద సమూహాన్ని ఎల్‌ ఎకొనొమిస్టా అనే వార్తాపత్రిక పైవిధంగా వర్ణించింది. ఆ సమయంలో దాదాపు 30 లక్షలమంది, గౌడాలూప్‌ కన్యపై తమకున్న విశ్వాసాన్ని ప్రదర్శించడానికి మెక్సికో నగరంలోని బాసిలికాను సందర్శించారు. రోమ్‌లోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా వంటి ఇతర మతపరమైన భవనాలు కూడా వేలాదిమంది సందర్శకులను ఆకర్షిస్తాయి.

దేవుణ్ణి ఆరాధించాలని కోరుకునే అనేకమంది హృదయాల్లో మతపరమైన భవనాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. “చర్చీ అంటే నేను దేవునికి దగ్గరగా ఉండగల ప్రదేశం. అది పవిత్ర స్థలం. చర్చికి వెళ్ళడం ఆత్మను శుద్ధి చేస్తుందని, మాస్‌కు వెళ్ళకపోవడమూ ప్రతీ ఆదివారం కన్ఫెషన్‌కు వెళ్ళకపోవడమూ పాపం అని నేను నమ్మేదాన్ని” అని బ్రెజిల్‌కు చెందిన మారి చెబుతోంది. మెక్సికోకు చెందిన కౌన్స్వేలో ఇలా చెబుతోంది: “చర్చీ నాలో లోతైన భావోద్రేకాన్ని కలుగజేసేది, నేను దాన్ని ఎంతో విలువైనదిగా ఎంచేదాన్ని. నేను చర్చీలో ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నట్లు భావించేదాన్ని.”

కొందరు చర్చీలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చినప్పటికీ, ఆరాధనాస్థలాలుగా అవి అవసరమా అని మరికొందరు సందేహిస్తున్నారు. చర్చీకి హాజరయ్యేవారి సంఖ్య తగ్గిపోయిన విషయం గురించి మాట్లాడుతూ, ఇంగ్లాండ్‌లో క్యాథలిక్‌ ప్రీస్టుగా ఉన్న పీటర్‌ సైబర్ట్‌ ఇలా అంటున్నాడు: “[ప్రజలు] మతంలో తమకిష్టమైన భాగాలను ఎంపిక చేసుకుంటున్నారు. వయోధికులలో చాలామంది క్యాథలిక్కులే, వారు తమ విశ్వాసానికి అనుగుణంగా జీవిస్తున్నారు​—⁠కానీ యౌవనస్థులలో మతం పట్ల నిబద్ధతా భావం లేకుండా పోయింది.” లండన్‌ వార్తాపత్రిక డైలీ టెలిగ్రాఫ్‌, 1998 నవంబరు 20వ తేదీ సంచిక ఇలా వ్యాఖ్యానించింది: “ఇంగ్లాండ్‌లో, 1979వ సంవత్సరం నుండి క్రొత్తగా తెరవబడిన 495 చర్చీలు, తిరిగి కట్టబడిన 150 చర్చీలతో పోల్చితే దాదాపు 1,500 చర్చీలు మూసివేయబడ్డాయి.”

1997వ సంవత్సరంలో, జర్మనీలోని మ్యూనిక్‌కు చెందిన వార్తాపత్రిక స్యూట్‌డోయిష్‌ సైటుంగ్‌ ఇలా నివేదించింది: “చర్చీలు అపార్ట్‌మెంటులుగానూ సినిమా హాళ్ళగానూ మార్చబడుతున్నాయి: విశ్వాసులు చర్చీ కార్యక్రమాలకు హాజరవ్వడంలేదు, ఆరాధనాస్థలాలు వేరే ప్రయోజనాలకు ఉపయోగించబడుతున్నాయి. . . . నెదర్లాండ్స్‌ లేక ఇంగ్లాండ్‌లో సర్వసాధారణమైపోయిన ఈ విషయం ఇప్పుడు జర్మనీలో కూడా జరుగుతోంది.” ఆ పత్రిక ఇంకా ఇలా నివేదించింది: “గత కొద్ది సంవత్సరాలలో జర్మనీలో దాదాపు 30 లేక 40 చర్చీలు గమనార్హంగా అమ్మబడడాన్ని గమనించవచ్చు.”

దేవుణ్ణి ఆరాధించడానికి మతపరమైన భవనాలు నిజంగా అవసరమా? బాసిలికాలకు, ఆడంబరంగా అలంకరించబడిన చర్చీలకు సంబంధించిన ప్రస్తావన లేఖనాల్లో ఉందా? నిజమైన, సజీవమైన దేవుని ఆరాధనకు సంబంధించి ఎటువంటి భవనాలు జతచేయబడ్డాయి? వాటి నుండి, ఆరాధనాస్థలాల అవసరాన్ని గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఆ భవనాల్లో ఏమి జరగాలి?