కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏకమనస్కులై సేవిస్తుండండి

ఏకమనస్కులై సేవిస్తుండండి

ఏకమనస్కులై సేవిస్తుండండి

“అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల [“స్వచ్ఛమైన భాష,” NW] నిచ్చెదను.”​—⁠జెఫన్యా 3:9.

1. నేడు జెఫన్యా 3:9వ వచనం నెరవేర్పుగా ఏమి జరుగుతోంది?

భూవ్యాప్తంగా మాట్లాడే భాషలు దాదాపు 6,000 ఉన్నాయి. వీటితో పాటు వివిధ మాండలిక భాషలు లేదా భాషా సమాజాలు కూడా ఉన్నాయి. పూర్తి విభిన్న భాషలైన అంహరిక్‌, చైనా భాషలను ప్రజలు మాట్లాడగలుగుతున్నప్పటికీ దేవుడు నిజంగా గమనార్హమైనదొకటి చేశాడు. ఆయన అన్ని ప్రాంతాల్లోని మానవులూ ఒకే ఒక్క స్వచ్ఛమైన భాషను నేర్చుకొని మాట్లాడగలిగేలా చేశాడు. అది జెఫన్యా ప్రవక్త ద్వారా, “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు [యెహోవా దేవుడనైన] నేను వారికి పవిత్రమైన పెదవుల [స్వచ్ఛమైన భాష, NW] నిచ్చెదను” అని చేసిన ఒక వాగ్దానానికి నెరవేర్పుగా జరుగుతోంది.​—⁠జెఫన్యా 3:9.

2. “స్వచ్ఛమైన భాష” అంటే ఏమిటి, అది దేన్ని సాధ్యమయ్యేలా చేసింది?

2 “స్వచ్ఛమైన భాష” అనేది దేవుని గురించిన సత్యం, అది ఆయన వాక్యమైన బైబిల్లో ఉంది. ప్రత్యేకించి అది యెహోవా నామమును మహిమపరిచేది, ఆయన సర్వాధిపత్యాన్ని ఉన్నతపరిచేది, మానవాళికి ఆశీర్వాదాలు తెచ్చేది అయిన దేవుని రాజ్యం గురించిన సత్యం. (మత్తయి 6:​9, 10) ఈ భూమ్మీద ఆధ్యాత్మిక కలుషితంలేని ఏకైక భాషగా స్వచ్ఛమైన భాషను అన్ని దేశాల వారు అన్ని జాతుల వారు మాట్లాడుతున్నారు. ఆ భాష వారు యెహోవాను “యేకమనస్కులై” సేవించేలా చేస్తుంది. ఆ విధంగా వారు ఐక్యంగా, లేదా “ఒకే ప్రజగా కూడి” ఆయనను ఆరాధిస్తారు.​—⁠ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

పక్షపాతానికి తావు లేదు

3. యెహోవాను ఐక్యంగా సేవించగలిగేందుకు ఏమి దోహదపడుతోంది?

3 మనలో ఉన్నటువంటి విభిన్న భాషల సమైక్యతకు క్రైస్తవులుగా మనమెంతో సంతోషిస్తాము. మనం రాజ్య సువార్తను అనేక మానవ భాషల్లో ప్రకటిస్తున్నప్పటికీ దేవుణ్ణి ఐక్యంగా సేవిస్తున్నాం. (కీర్తన 133:⁠1) మనం భూమ్మీద ఎక్కడ నివసిస్తున్నా, యెహోవాను స్తుతించడానికి ఒకే స్వచ్ఛమైన భాషను మాట్లాడుతున్నాం కాబట్టి దేవుణ్ణి ఐక్యంగా సేవించడం మనకు సాధ్యమవుతోంది.

4. దేవుని ప్రజల మధ్య పక్షపాతం ఎందుకు ఉండకూడదు?

4 దేవుని ప్రజల మధ్య పక్షపాతం ఉండకూడదు. అపొస్తలుడైన పేతురు సా.శ. 36 లో అన్యుడైన శతాధిపతియగు కొర్నేలి ఇంటివద్ద ప్రకటించినప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు, ఆయనిలా అనడానికి కదిలించబడ్డాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:​34, 35) అది నిజం కాబట్టి క్రైస్తవ సంఘంలో పక్షపాతానికి, వేర్వేరు గుంపులకు, స్వజనాభిమానానికి తావులేదు.

5. సంఘంలో గుంపులు ఏర్పడేలా చేయడం ఎందుకు తప్పవుతుంది?

5 ఒక కాలేజీ విద్యార్థిని తను రాజ్య మందిరాన్ని సందర్శించిన సందర్భం గురించి ఇలా చెబుతోంది: “సాధారణంగా చర్చీలు ఒక ప్రత్యేక జాతి సభ్యులను గానీ వర్గ సభ్యులను గానీ ఆకర్షిస్తాయి. . . . కాని యెహోవాసాక్షులు ప్రత్యేక గుంపులుగా కాకుండా అందరూ కలిసి కూర్చున్నారు.” అయినా, ప్రాచీన కొరింథు సంఘంలోని సభ్యులు కొందరు వర్గాలను ఏర్పరచడం ప్రారంభించారు. ఆ విధంగా వారు అభిప్రాయ భేదాలు తలెత్తేలా చేయడం ద్వారా, ఐక్యతకు, శాంతికి దోహదపడే దేవుని ఆత్మను వ్యతిరేకించారు. (గలతీయులు 5:​22) మనం సంఘంలో గుంపులు ఏర్పడడానికి కారకులమైనట్లైతే మనం ఆత్మ నడిపింపుకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లే అవుతుంది. కాబట్టి, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్పిన మాటలను మన మనస్సుల్లో ఉంచుకుందాం: “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.” (1 కొరింథీయులు 1:​10) పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో కూడా ఐక్యత గురించి నొక్కి చెప్పాడు.​—⁠ఎఫెసీయులు 4:1-6, 16.

6, 7. యాకోబు స్వజనాభిమానం గురించి చెప్పిన హితవు ఏమిటి, ఆయన మాటలు మనకు ఎలా వర్తిస్తాయి?

6 క్రైస్తవులు నిష్పక్షపాతంగా ఉండడం ఎల్లప్పుడూ ఆవశ్యకమే. (రోమీయులు 2:​11, 12) మొదటి శతాబ్దపు సంఘంలోని కొందరు, ధనవంతుల పట్ల స్వజనాభిమానం చూపిస్తున్నందువల్ల శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి​—⁠నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో​—⁠నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన యెడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసినవారగుదురు కారా?”​—⁠యాకోబు 2:​1-4.

7 బంగారపు ఉంగరాలను, ప్రశస్త వస్త్రములను ధరించిన ధనవంతులైన అవిశ్వాసులు, మురికి బట్టలను ధరించిన బీద అవిశ్వాసులు క్రైస్తవ కూటాలకు వచ్చినప్పుడు ధనవంతులతో ప్రత్యేకంగా వ్యవహరించడం జరిగింది. వారిని “మంచి స్థలమందు” కూర్చొమ్మని, బీదవారిని నిలబడమని లేదా నేలమీద ఒకరి పాదముల వద్ద కూర్చొమ్మని చెప్పారు. కాని దేవుడు పక్షపాతం లేకుండా ధనవంతులకు బీదవారికి యేసు విమోచన క్రయధన బలిని ఒకేవిధంగా ఏర్పాటు చేశాడు. (యోబు 34:​19; 2 కొరింథీయులు 5:​14) మనం యెహోవాను సంతోషపరచాలనుకుంటే, ఆయనను ఏకమనస్సుతో సేవించాలనుకుంటే మనం స్వజనాభిమానం చూపించడం గానీ మన “లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడ[డం]” గానీ చేయకూడదు.​—⁠యూదా 4, 16.

సణగకుండా ఉండండి

8. ఇశ్రాయేలీయులు సణిగినందుకు ఏమి జరిగింది?

8 మన ఐక్యతను కాపాడుకోవడానికి, దేవుని కృప మనపై ఎల్లప్పుడూ ఉండడానికి మనం పౌలు సలహాను పాటించాలి: “సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.” (ఫిలిప్పీయులు 2:​14, 15) ఐగుప్తు చెరనుండి విముక్తి పొందిన అవిశ్వాస ఇశ్రాయేలీయులు మోషే, అహరోనులపై సణిగారు ఆ విధంగా వారు యెహోవా దేవునికే విరోధముగా సణిగారు. ఆ కారణంగా, విశ్వసనీయులైన కాలేబు, యెహోషువ, లేవీయులు తప్ప 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారందరూ వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయారు, ఇశ్రాయేలీయులు అరణ్యంలో చేసిన 40 సంవత్సరాల ప్రయాణంలో వారందరూ మరణించారు. (సంఖ్యాకాండము 14:​2, 3, 26-30; 1 కొరింథీయులు 10:​10) సణుగుడుకు వారు చెల్లించిన మూల్యం ఎంత గొప్పదో కదా!

9. మిర్యాము తన సణుగుడు కారణంగా ఏమి అనుభవించింది?

9 సణిగే మొత్తం జనాంగానికి ఏమవుతుందో అది చూపిస్తోంది. మరి సణిగే వ్యక్తుల విషయమేమిటి? మోషే సహోదరి మిర్యాము, సహోదరుడు అహరోను “మోషేచేత మాత్రమే యెహోవా పలికించెనా? ఆయన మా చేతను పలికింపలేదా?” అని సణిగారు. ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “యెహోవా ఆ మాటవినెను.” (సంఖ్యాకాండము 12:​1-3) దాని ఫలితం? ఈ ఫిర్యాదు విషయంలో ప్రముఖ పాత్ర వహించిన మిర్యాము దేవుని చేత అవమానించబడింది. ఎలా? ఆమె కుష్ఠుతో బాధపడుతూ శుద్ధి అయ్యేంతవరకు పాళెము వెలుపల ఏడు దినములు ఉండాల్సివచ్చింది.​—⁠సంఖ్యాకాండము 12:​9-15.

10, 11. సణగడాన్ని నిరోధించకపోతే ఫలితమెలా ఉంటుంది? వివరించండి.

10 సణగడం అనేది జరుగుతున్న ఒక తప్పు గురించి కేవలం ఫిర్యాదు చేయడం మాత్రమే కాదు. ఎప్పుడూ సణిగేవారు తమ భావాలకు లేదా తమ స్థానానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, దేవుని వైపు కాకుండా తమపైకే శ్రద్ధను రాబట్టుకుంటారు. దీన్ని నిరోధించకపోతే అది ఆధ్యాత్మిక సహోదరుల మధ్య భేదాభిప్రాయాలకు దారి తీస్తుంది, యెహోవాను ఏకమనస్సుతో సేవించే వారి ప్రయత్నాలను ఆటంకపరుస్తుంది. ఎందుకంటే సణిగేవారు, ఇతరులు తమపై సానుభూతి చూపిస్తారని ఆశిస్తూ ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూనే ఉంటారనడంలో సందేహం లేదు.

11 ఉదాహరణకు, ఒకానొక సంఘంలోని పెద్ద, తన నియామకాలను నిర్వహించే విధానం గురించి లేదా ఆయన తన విధులను నిర్వహించడం గురించి ఎవరైనా ఒక వ్యక్తి విమర్శిస్తుండవచ్చు. ఆ ఫిర్యాదులను వింటే మనం కూడా ఆ వ్యక్తిలాగే ఆలోచించడం ప్రారంభిస్తాం. మన మనస్సులో అసంతృప్తి విత్తనాలు విత్తబడక ముందు, ఆ పెద్ద నిర్వహించే కార్యకలాపాలు మనకు చిరాకు కలిగించి ఉండకపోవచ్చు కాని ఇప్పుడు మనకు చిరాకు కలిగిస్తాయి. చివరికి ఆ పెద్ద చేసేది ఏది కూడా మన కంటికి మంచిగా కనిపించదు, అప్పుడు మనం కూడా ఆయన గురించి ఫిర్యాదు చేయడం ఆరంభిస్తాం. ఇలాంటి ప్రవర్తన యెహోవా ప్రజల సంఘానికి తగినది కాదు.

12. దేవునితో మనకున్న సంబంధంపై సణుగుడు ఎలాంటి ప్రభావాన్ని చూపించగలదు?

12 దేవుని మందను కాయడం తమ కర్తవ్యంగా గల మనుష్యులపైన సణగడం దూషణకు దారితీసే అవకాశముంది. అలా సణగడం లేదా వారిని నిందించడం యెహోవాతో మనకున్న సంబంధంపై హానికరమైన ప్రభావాన్ని చూపించే అవకాశముంది. (నిర్గమకాండము 22:​28) పశ్చాత్తాపం చూపించని దూషకులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. (1 కొరింథీయులు 5:​11; 6:​10) “ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించు” వారి గురించి లేదా సంఘంలో బాధ్యత గల వారిని దూషించు వారి గురించి శిష్యుడైన యూదా వ్రాశాడు. (యూదా 8) ఆ దూషకులకు దేవుని అంగీకారం లేదు, మనం బుద్ధిగా వారి దుష్ట నడవడికి దూరంగా ఉందాం.

13. అన్ని ఫిర్యాదులు అభ్యంతరకరమైనవి ఎందుకు కాదు?

13 అయితే అన్ని ఫిర్యాదులు దేవునికి కోపం తెప్పించవు. ఆయన సొదొమ గొమొఱ్ఱాల గురించిన “మొర”ను నిర్లక్ష్యం చేయలేదు కానీ ఆ దుష్ట పట్టణాలను నాశనం చేశాడు. (ఆదికాండము 18:​20, 21; 19:​24, 25) సా.శ. 33 లో పెంతెకొస్తు తర్వాత కొద్దికాలానికి యెరూషలేములో “అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.” తత్ఫలితంగా ఆహారము పంచిపెట్టే “పనికి” “మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను” నియమించడం ద్వారా “పండ్రెండుగురు అపొస్తలులు” పరిస్థితిని చక్కదిద్దారు. (అపొస్తలుల కార్యములు 6:​1-6) ప్రస్తుత దిన పెద్దలు సహేతుకమైన ఫిర్యాదులను ‘వినకుండా చెవులను మూసుకోకూడదు.’ (సామెతలు 21:​13) తోటి ఆరాధకులను విమర్శించడానికి బదులు వారిని ప్రోత్సహించడం, దృఢపరచడం పెద్దల విధి.​—⁠1 కొరింథీయులు 8:⁠1.

14. సణుగుడుకు దూరంగా ఉండేందుకు ముఖ్యంగా ఏ లక్షణం అవసరం?

14 ఫిర్యాదు చేసే గుణం ఆధ్యాత్మికంగా అనారోగ్యకరమైనది కాబట్టి మనమందరం సణుగుడుకు దూరంగా ఉండాలి. అలాంటి వైఖరి మన ఐక్యతను భంగపరుస్తుంది. దానికి బదులుగా మనలో ప్రేమను ఫలింపచేసేందుకు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను అనుమతిద్దాం. (గలతీయులు 5:​22) ‘ప్రేమించుమను ప్రాముఖ్యమైన ఆజ్ఞను’ పాటించడం యెహోవాను ఏకమనస్సుతో సేవించేందుకు సహాయపడుతుంది.​—⁠యాకోబు 2:⁠8; 1 కొరింథీయులు 13:​4-8; 1 పేతురు 4:⁠8.

కొండెములు చెప్పకుండా జాగ్రత్తపడండి

15. ఊసుపోని కబుర్లకు, కొండెములకు మధ్యనున్న వ్యత్యాసాన్ని మీరెలా చూపిస్తారు?

15 సణుగుడు హానికరమైన ఊసుపోని కబుర్లకు దారి తీస్తుంది కాబట్టి మనం ఏమంటున్నామో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఊసుపోని కబుర్లు అనేవి ప్రజల గురించిన వారి వ్యవహారాల గురించిన వ్యర్థ ప్రసంగం. అయితే కొండెము అనేది మరొక వ్యక్తి పేరును పాడు చేయాలనే ఉద్దేశంతో చెప్పబడే తప్పుడు సమాచారం. అలాంటి మాటలు దురుద్దేశంతో కూడినవి, దుష్టమైనవి. ఆ కారణంగానే దేవుడు ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు.”​—⁠లేవీయకాండము 19:​16.

16. ఊసుపోని కబుర్లు చెప్పే కొందరి గురించి పౌలు ఏమన్నాడు, ఆయన సలహా మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి?

16 వ్యర్థ ప్రసంగం కొండెములకు దారి తీయవచ్చు. కాబట్టి, అలాంటి ఊసుపోని కబుర్లు చెప్పేవారిని పౌలు బాహాటంగా గద్దించాడు. సంఘం నుండి సహాయాన్ని పొందడానికి అర్హులైన విధవరాండ్ర గురించి ప్రస్తావించిన తర్వాత ఆయన విధవరాండ్ర గురించి ప్రస్తావించాడు, వారు “ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును పరులజోలికి పోవువారునగుటకును” నేర్చుకున్నవారు. (1 తిమోతి 5:​11-15) ఒక క్రైస్తవ స్త్రీ కొండెములకు దారితీసేలా మాట్లాడే బలహీనత తనలో ఉందని గ్రహిస్తే, ఆమె “మాన్యులై కొండెములు చెప్పనివారు”నై ఉండాలని పౌలు ఇచ్చిన సలహాను పాటించడం మంచిది. (1 తిమోతి 3:​11) క్రైస్తవ పురుషులు హానికరమైన ఊసుపోని కబుర్లు చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.​—⁠సామెతలు 10:​19.

తీర్పు తీర్చకండి

17, 18. (ఎ) మన తోటి సహోదరునిపై తీర్పు తీర్చడం గురించి యేసు ఏమని అన్నాడు? (బి) తీర్పు తీర్చే విషయంలో యేసు మాటలను మనమెలా అన్వయించుకోవచ్చు?

17 మనం ఎవరిపైనా కొండెములు చెప్పనప్పటికీ, మనం ఇతరులపై తీర్పు తీర్చకుండా ఉండేందుకు గట్టిగా కృషి చేయాల్సిరావచ్చు. యేసు అలాంటి స్ఫూర్తిని ఖండిస్తూ ఇలా అన్నాడు: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు సహోదరుని చూచి​—⁠నీ కంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? వేషధారీ, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.”​—⁠మత్తయి 7:​1-5.

18 అలంకారిక “దూలము” కారణంగా మనలో సరైన తీర్పు తీర్చే శక్తి సన్నగిల్లినప్పుడు, మనం మన సహోదరునికి సహాయం చేయాలనుకొంటూ ఆయన కంటిలోనుండి అతి చిన్నదైన “నలుసును” తియ్యాలని అనుకోకూడదు. వాస్తవానికి దేవుడు ఎంతటి కరుణ గలవాడో మనం నిజంగా గ్రహిస్తే, మనం మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలపై తీర్పు తీర్చాలని అనుకోము. వారిని మన పరలోకపు తండ్రి అర్థం చేసుకున్నంత చక్కగా మనం కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ విషయమై “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు” అని యేసు మనల్ని హెచ్చరించడంలో ఆశ్చర్యమేమీ లేదు. దేవుడు అన్యాయమైనవిగా పరిగణించే తీర్పులను తీర్చకుండా మనల్ని మన అపరిపూర్ణతల గురించిన యథార్థమైన అవగాహనే ఆపాలి.

బలహీనులే అయినా గౌరవనీయులు

19. తోటి విశ్వాసులను మనమెలా దృష్టించాలి?

19 మనం మన తోటి విశ్వాసులతో ఏక మనస్కులమై దేవుణ్ణి సేవించాలని కృత నిశ్చయం చేసుకుంటే, మనం తీర్పు తీర్చకుండా ఉండడం మాత్రమే కాదు, వారిని గౌరవించడంలో కూడా ముందుంటాం. (రోమీయులు 12:​10) వాస్తవానికి, మనం మన సొంత ప్రయోజనం గురించి కాకుండా వారి ప్రయోజనం కోసం ప్రయత్నిస్తాం, వారి తరఫున చిన్న చిన్న పనులను సంతోషంగా చేస్తాం. (యోహాను 13:​12-17; 1 కొరింథీయులు 10:​24) అలాంటి చక్కని స్ఫూర్తిని మనమెలా కాపాడుకోవచ్చు? ప్రతీ విశ్వాసి యెహోవాకు అమూల్యమైన వ్యక్తేననే విషయాన్ని, శరీరంలోని ప్రతి అవయవం ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి ఉంటుందో అలాగే మనకు కూడా ఒకరితో ఒకరికి అవసరం ఉంటుందనే విషయాన్ని మనసులో పెట్టుకోవడం ద్వారా మనం ఆ స్ఫూర్తిని కాపాడుకోవచ్చు.​—⁠1 కొరింథీయులు 12:​14-27.

20, 21. రెండవ తిమోతి 2:​20, 21 లోని మాటలు మనకు ఏ భావాన్ని కలిగి ఉన్నాయి?

20 క్రైస్తవులు పరిచర్య అనే ఘనమైన ఐశ్వర్యముతో నింపబడిన బలహీనమైన మట్టి పాత్రలేనని ఒప్పుకోవలసిందే. (2 కొరింథీయులు 4:⁠7) యెహోవాకు స్తుతి కలిగే విధంగా మనం పవిత్రమైన ఈ కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటే, మనం ఆయన ఎదుటా ఆయన కుమారుని ఎదుటా మాననీయమైన స్థానాన్ని కాపాడుకోవాలి. నైతికంగా, ఆధ్యాత్మికంగా కల్మషం లేకుండా ఉండడం ద్వారా మాత్రమే మనం దేవునికి ఉపయోగపడే ఘననీయమైన ఒక పాత్రలా ఉండగలుగుతాం. ఈ విషయంలో పౌలు ఇలా వ్రాశాడు: “గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.”​—⁠2 తిమోతి 2:20, 21.

21 దేవుడు కోరేవాటికి అనుగుణంగా ప్రవర్తించనివారు ‘ఘనహీనతకు వినియోగించబడే పాత్రలు.’ కానీ, దేవుని మార్గంలో నడిస్తే మనం యెహోవా ‘వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన, లేదా ప్రత్యేకంగా ఉంచబడిన ఘనత నిమిత్తమైన పాత్రల’ వలె ఉంటాం. కాబట్టి మనమిలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నేను “ఘనతకు” వినియోగించబడే పాత్రనేనా? తోటి విశ్వాసులపై నేను మంచి ప్రభావాన్నే చూపిస్తున్నానా? తోటి ఆరాధకులతో ఏకమనస్సుతో పనిచేసే సంఘంలోని సభ్యుడనేనా?’

ఏకమనస్కులై సేవిస్తూనే ఉండండి

22. క్రైస్తవ సంఘాన్ని దేనితో పోల్చవచ్చు?

22 క్రైస్తవ సంఘ ఏర్పాటు కుటుంబం వంటిది. ఆ కుటుంబంలోని ప్రతి సభ్యుడు యెహోవాను ఆరాధిస్తే అక్కడ ప్రేమపూర్వకమైన, సహాయకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఒక కుటుంబం విభిన్న వ్యక్తిత్వాలుగల వివిధ వ్యక్తులతో ఏర్పడవచ్చు, కానీ ప్రతి ఒక్కరికీ గౌరవపూర్వకమైన స్థానముంటుంది. సంఘంలోని పరిస్థితీ అలాంటిదే. మనం అందరం విభిన్నమైనవారం, అపరిపూర్ణులం అయినా దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా తనవైపు మళ్ళించుకున్నాడు. (యోహాను 6:​44; 14:⁠6) యెహోవా, యేసు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం కూడా ఐక్యతగల ఒక కుటుంబంలా ఒకరిపట్ల ఒకరం మన ప్రేమను చూపించుకోవాలి.​—⁠1 యోహాను 4:​7-11.

23. మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఏమి చేయాలనే కృత నిశ్చయతతో ఉండాలి?

23 కుటుంబంవంటి క్రైస్తవ సంఘం, యథార్థత ఉంటుందని మనం సరిగ్గానే ఆశించగల స్థలం. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన [“యథార్థమైన,” NW] చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.” (1 తిమోతి 2:⁠8) ఆ విధంగా పౌలు యథార్థతను, క్రైస్తవులు కూడుకొనే “ప్రతిస్థలమందు” చేసే బహిరంగ ప్రార్థనతో ముడిపెట్టాడు. యథార్థవంతులైన పురుషులు మాత్రమే సంఘం తరఫున బహిరంగ ప్రార్థన చేయాలి. మనం అందరం దేవుని పట్ల మాత్రమే కాక ఒకరి పట్ల ఒకరు యథార్థంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడన్నది నిస్సంశయం. (ప్రసంగి 12:​13, 14) కాబట్టి శరీరంలోని అవయవాల వలే ఒకరికొకరం అనుగుణంగా కలిసి పనిచేయడానికి కృత నిశ్చయతతో ఉందాం. యెహోవా ఆరాధకుల కుటుంబంలోని భాగంగా కూడా మనం ఐక్యంగా సేవ చేద్దాం. వీటన్నింటికంటే ముఖ్యంగా మనకు ఒకరితో ఒకరికి అవసరముందని, మనం ఏకమనస్కులమై యెహోవాను సేవిస్తుంటే ఆయన అంగీకారాన్ని ఆశీర్వాదాలను అనుభవిస్తామని గుర్తుంచుకుందాం.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవా ప్రజలు ఏకమనస్కులై సేవించడానికి వారికి ఏమి దోహదపడుతోంది?

• క్రైస్తవులు పక్షపాతం లేకుండా ఎందుకు ఉంటారు?

• సణగడంలో తప్పేముంది?

• తోటి విశ్వాసులను ఎందుకు గౌరవించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

‘దేవుడు పక్షపాతి కాడు’ అని పేతురు గ్రహించాడు

[16వ పేజీలోని చిత్రం]

దేవుడు మిర్యామును ఎందుకు అవమానపరిచాడో మీకు తెలుసా?

[18వ పేజీలోని చిత్రం]

యథార్థవంతులైన క్రైస్తవులు ఏకమనస్సుతో యెహోవాను సంతోషంగా సేవిస్తారు