కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులకు పరస్పరం అవసరం ఉంటుంది

క్రైస్తవులకు పరస్పరం అవసరం ఉంటుంది

క్రైస్తవులకు పరస్పరం అవసరం ఉంటుంది

“మనము ఒకరికొకరము అవయవములై యున్నాము”​—⁠ఎఫెసీయులు 4:​25.

1. మానవ శరీరం గురించి ఒక ఎన్‌సైక్లోపీడియా ఏమని చెబుతోంది?

మానవ శరీరం ఒక అద్భుతమైన సృష్టి! ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా “మానవ శరీరం ఇంతవరకు నిర్మించబడినవాటిలోకెల్లా అత్యంత అద్భుతమైన యంత్రమని ప్రజలు కొన్నిసార్లు అంటారు. అయితే మానవ శరీరం ఎంత మాత్రం యంత్రం కాదు. కానీ దాన్ని ఒక యంత్రంతో అనేక విధాలుగా పోల్చవచ్చు. ఒక యంత్రంలాగే శరీరం అనేక భాగాలతో రూపొందించబడింది. శరీరంలోని ఒక్కొక్క భాగం, యంత్రంలోని ఒక్కొక్క భాగంలాగే ప్రత్యేక పనులను నిర్వహిస్తుంది. అయితే అన్ని భాగాలు కలిసి పని చేస్తాయి, ఆ విధంగా శరీరం గానీ యంత్రం గానీ మృదువుగా పనిచేస్తుంది” అని చెబుతోంది.

2. మానవ శరీరం, క్రైస్తవ సంఘం ఏ రీతిలో ఒకే విధంగా ఉన్నాయి?

2 అవును, మానవ శరీరంలో అనేక భాగాలు లేక అవయవాలు ఉన్నాయి, ప్రతీ ఒక్కటి ఏదో ఒక అవసరాన్ని తీరుస్తుంది. ఒక్క రక్తనాళం గానీ కండరం గానీ లేక శరీరంలోని ఏ ఇతర అవయవం గానీ వ్యర్థమైనది కాదు. అదే విధంగా, క్రైస్తవ సంఘంలోని ప్రతి ఒక్కరూ సంఘ ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం, అందం కోసం ఎంతో కొంత తోడ్పడే అవకాశముంది. (1 కొరింథీయులు 12:​14-26) సంఘంలోని ఒక సభ్యుడు తాను ఇతరులకంటే గొప్పవాడినని గానీ తాను అంత ప్రాముఖ్యమైన వ్యక్తిని కాదని గానీ భావించకూడదు.​—⁠రోమీయులు 12:⁠3.

3. క్రైస్తవులకు పరస్పరం అవసరం ఉంటుందని ఎఫెసీయులు 4:​25 ఎలా సూచిస్తోంది?

3 మానవ శరీరంలోని అవయవాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నట్లే, క్రైస్తవులకు పరస్పరం అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు ఆత్మాభిషిక్తులైన తన తోటి విశ్వాసులతో, “మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను” అని అన్నాడు. (ఎఫెసీయులు 4:​25) వారు ‘ఒకరికొకరు అవయవములై’ ఉన్నారు కాబట్టి “క్రీస్తు శరీరము”లో అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు సభ్యుల మధ్య సత్యమైన సంభాషణ, పూర్తి సహకారము ఉన్నాయి. అవును, వారిలోని ప్రతి ఒక్కరు మిగతా అందరికీ చెందినవారు. (ఎఫెసీయులు 4:​11-13) సత్యవంతులు, సహకరించేవారు అయిన భూనిరీక్షణగల క్రైస్తవులు వారితో సంతోషంగా ఏకమయ్యారు.

4. కొత్తవారికి ఏ యే విధాలుగా సహాయం చేయవచ్చు?

4 భూపరదైసులో జీవించాలని నిరీక్షించే వేలాదిమంది ప్రతి సంవత్సరం బాప్తిస్మం తీసుకుంటున్నారు. వారు ‘సంపూర్ణులవడానికి’ సంఘంలోని ఇతర సభ్యులు సంతోషంగా సహాయం చేస్తారు. (హెబ్రీయులు 6:​1-3) ఈ సహాయంలో లేఖనాధారిత ప్రశ్నలకు జవాబివ్వడం లేదా పరిచర్యలో ఆచరణాత్మకమైన మద్దతునివ్వడం ఉండవచ్చు. క్రైస్తవ కూటాల్లో క్రమంగా పాల్గొనడం ద్వారా మనం మాదిరికరంగా ఉంటూ కొత్తవారికి సహాయపడవచ్చు. ఆపత్కాలాల్లో ప్రోత్సాహాన్ని లేదా ఊరడింపును కూడా ఇవ్వవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:​14, 15) ఇతరులు “సత్యమును అనుసరించి నడుచుకొ”నేలా సహాయం చేయడానికి మనం మార్గాలు వెదకాలి. (3 యోహాను 4) మనం చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా, సత్యంలో ఇప్పుడిప్పుడే నడవడం ఆరంభించినా లేక ఇప్పటికే సంవత్సరాలుగా నడుస్తున్నా మన తోటి విశ్వాసుల ఆధ్యాత్మిక శ్రేయస్సును వృద్ధి చేసేందుకు మనం తోడ్పడవచ్చు, వారికి మన అవసరముంది.

అవసరమైన సహాయాన్ని వారు చేశారు

5. అకుల, ప్రిస్కిల్లలు పౌలుకు సహాయకులుగా ఎలా నిరూపించుకున్నారు?

5 తోటి విశ్వాసులకు సహాయం చేయడంలో సంతృప్తి పొందేవారిలో క్రైస్తవ వివాహిత జంటలు ఉన్నాయి. ఉదాహరణకు, అకుల ఆయన భార్య ప్రిస్కిల్ల పౌలుకు సహాయం చేశారు. వారు ఆయనను తమ ఇంటికి ఆహ్వానించారు, డేరాలు కుట్టేవారిగా ఆయనతో కలిసి పనిచేశారు, కొరింథులోని కొత్త సంఘాన్ని బలపరచడంలోను ఆయనకు సహాయం చేశారు. (అపొస్తలుల కార్యములు 18:​1-4) వెల్లడికాని ఒకానొక రీతిలో, వారు పౌలును కాపాడడానికి చివరికి తమ ప్రాణాలకు కూడా తెగించారు. పౌలు రోములోని క్రైస్తవులతో “క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి . . . నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులైయున్నారు” అని అన్నప్పుడు వీరు రోములోనే నివసిస్తున్నారు. (రోమీయులు 16:​3, 4) అకుల, ప్రిస్కిల్లల వలే ఆధునిక దిన క్రైస్తవులు కొందరు సంఘాలను బలపరుస్తూ తోటి ఆరాధకులకు అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు. కొన్నిసార్లయితే దేవుని ఇతర సేవకులు హింసించేవారి క్రూరత్వానికి గురికాకుండా లేదా వారి చేతుల్లో మరణించకుండా వారిని కాపాడడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.

6. అపొల్లో ఎలాంటి సహాయాన్ని పొందాడు?

6 అకుల, ప్రిస్కిల్లలు లేఖనాల్లో ప్రవీణుడైన క్రైస్తవుడగు అపొల్లోకు కూడా సహాయం చేశారు. ఆయన అప్పుడు ఎఫెసులోని వాసులకు యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నాడు. అపొల్లోకు ఆ సమయంలో ధర్మశాస్త్ర నిబంధనకు విరుద్ధమైన పాప ప్రాయశ్చిత్తానికి సూచనగా యోహాను ఇచ్చే బాప్తిస్మం గురించి మాత్రమే తెలుసు. ఆ నేపథ్యంలో అపొల్లోకు సహాయం చేయవలసిన అవసరముందని గ్రహించిన అకుల, ప్రిస్కిల్లలు “దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదప[రిచారు].” బహుశా నీటిలో పూర్తిగా మునగడం ద్వారా, కుమ్మరించబడే పరిశుద్ధాత్మను స్వీకరించడం ద్వారా కూడా క్రైస్తవ బాప్తిస్మం తీసుకోవచ్చని వారు ఆయనకు వివరించి ఉండవచ్చు. అపొల్లో దాన్ని చక్కగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన అకయలో దేవుని ‘కృపచేత విశ్వసించినవారికి చాలా సహాయము చేశాడు. యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించాడు.’ (అపొస్తలుల కార్యములు 18:​24-28) తోటి ఆరాధకులు చేసే వ్యాఖ్యానాలు దేవుని వాక్యంపై మన అవగాహనను పెంపొందించుకునేందుకు తరచూ సహాయపడగలవు. ఈ విషయంలో కూడా మనకు పరస్పరం అవసరం ఉంటుంది.

భౌతిక సహాయాన్ని అందించడం

7. తమ తోటి క్రైస్తవులకు భౌతికపరమైన సహాయం అవసరమైనప్పుడు ఫిలిప్పీయులు ఎలా ప్రతిస్పందించారు?

7 ఫిలిప్పీలోని క్రైస్తవ సంఘ సభ్యులకు పౌలు అంటే ఎంతో ప్రేమ, అందుకే ఆయన థెస్సలొనీకలో ఉన్నప్పుడు ఆయనకు అవసరమైన వస్తువులను పంపించారు. (ఫిలిప్పీయులు 4:​15, 16) యెరూషలేములోని సహోదరులకు భౌతిక సహాయం అవసరమైనప్పుడు ఫిలిప్పీయులకది తమ తాహతుకు మించిన పనే అయినప్పటికీ విరాళమివ్వడానికి వారు తమ సంసిద్ధతను చూపించారు. పౌలు ఫిలిప్పీలోని తన సహోదర సహోదరీల చక్కని స్ఫూర్తిని ఎంతో ప్రశంసిస్తూ, ఇతర విశ్వాసులకు వారిని ఒక మాదిరిగా పేర్కొన్నాడు.​—⁠2 కొరింథీయులు 8:​1-6.

8. ఎపఫ్రొదితు ఎలాంటి స్ఫూర్తిని చూపించాడు?

8 పౌలు చెరలో ఉన్నప్పుడు, ఫిలిప్పీయులు కేవలం వస్తుపరమైన బహుమతులను మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత దూత ఎపఫ్రొదితును కూడా పంపించారు. “నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు [ఎపఫ్రొదితు] తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పనినిమిత్తము చావునకు సిద్ధమైయుండెను” అని పౌలు అన్నాడు. (ఫిలిప్పీయులు 2:​25-30; 4:​18) ఎపఫ్రొదితు ఒక పెద్దా లేక పరిచర్య సేవకుడా అన్నది మనకు తెలియదు. ఏది ఏమైనా, ఆయన స్వయం త్యాగ స్ఫూర్తిగలవాడు, ఉపకారి అయిన క్రైస్తవుడు, పౌలుకు ఆయన నిజంగా అవసరమయ్యాడు. మీ సంఘంలో ఎపఫ్రొదితు వంటి వారెవరైనా ఉన్నారా?

వారు ‘బలపరిచే సహాయకులు’

9. అరిస్తార్కులో మనకు కనిపించే ఉదాహరణ ఏమిటి?

9 అకుల, ప్రిస్కిల్ల, ఎపఫ్రొదితు వంటి ప్రేమగల సహోదర సహోదరీలు ఏ సంఘంలోనైనా ఎంతో ప్రశంసించబడతారు. మన తోటి ఆరాధకులు కొందరు మొదటి శతాబ్దపు క్రైస్తవుడైన అరిస్తార్కు వంటి వారు కావచ్చు. ఆయనేకాక ఇతరులు కూడా “బలపరిచే సహాయం”గా, బహుశా ఉపశమనానికి ఒక ఆధారంగా లేదా మౌలిక విషయాల్లో ఆచరణాత్మక విషయాల్లో తోడ్పాటుగా ఉన్నారు. (కొలొస్సయులు 4:​10, 11, NW) పౌలుకు సహకరించడం ద్వారా అరిస్తార్కు అవసర సమాయాల్లో ఒక మంచి స్నేహితుడిగా నిరూపించుకున్నాడు. సామెతలు 17:17 లో “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును” అని పేర్కొనబడినటువంటి వ్యక్తి ఆయన. మనం అందరం కూడా “బలపరిచే సహాయం”గా ఉండేందుకు కృషి చేయవద్దా? ప్రత్యేకించి దుస్థితిలో ఉన్నవారికి మన చేయూతనివ్వాలి.

10. క్రైస్తవ పెద్దల కోసం పేతురు ఎలాంటి మాదిరిని ఉంచాడు?

10 ప్రత్యేకించి క్రైస్తవ పెద్దలు తమ ఆధ్యాత్మిక సహోదర సహోదరీలకు సహాయకులుగా ఉండాలి. క్రీస్తు అపొస్తలుడైన పేతురుకు “నీ సహోదరులను స్థిరపరచు” అని చెప్పాడు. (లూకా 22:​32) పేతురు ప్రత్యేకించి యేసు పునరుత్థానమైన తర్వాత బలమైన, బండలాంటి లక్షణాలను కనబరిచాడు కాబట్టి అలా చేయగలిగాడు. పెద్దలారా, మీరు కూడా మీ సహోదరులను ఇష్టపూర్వకంగా, మృదువుగా స్థిరపరచడానికి అన్ని విధాలుగా కృషి చేయండి, ఎందుకంటే మీ తోటి విశ్వాసులకు మీ అవసరముంది.​—⁠అపొస్తలుల కార్యములు 20:​28-30; 1 పేతురు 5:2, 3.

11. తిమోతి స్ఫూర్తిని పరిశీలించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

11 పౌలు తోటి పర్యాటకుడైన తిమోతి ఒక పెద్ద, ఆయన ఇతర క్రైస్తవుల మీద అత్యంత ఆసక్తిని చూపించాడు. ఆయనకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ సంపూర్ణ హృదయంతో విశ్వాసాన్ని చూపించాడు, ఆయన ‘సువార్త వ్యాపకము నిమిత్తము పౌలుతో సేవ చేశాడు.’ అందుకే “మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు” అని అపొస్తలుడు ఫిలిప్పీయులతో అనగలిగాడు. (ఫిలిప్పీయులు 2:20, 22; 1 తిమోతి 5:23; 2 తిమోతి 1:​3-5) తిమోతి చూపించినటువంటి స్ఫూర్తిని చూపించడం ద్వారా తోటి యెహోవా ఆరాధకులకు మనమొక ఆశీర్వాదంగా ఉండగలుగుతాం. నిజమే, మనం మన సొంత లోపాలను, వివిధ పరీక్షలను సహించాలి, అయినప్పటికీ మనం కూడా దృఢమైన విశ్వాసాన్ని మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీల పట్ల ప్రేమపూర్వక శ్రద్ధను చూపించవచ్చు. వారికి మన అవసముందన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

ఇతరులను శ్రద్ధగా చూసుకున్న స్త్రీలు

12. దొర్కా మాదిరి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

12 ఇతరులను శ్రద్ధగా చూసుకున్న దైవభక్తి గల స్త్రీలలో దొర్కా ఉంది. ఆమె చనిపోయినప్పుడు శిష్యులు పేతురును పిలిపించి ఆయనను ఒక మేడగదిలోనికి తీసుకువెళ్ళారు. అక్కడ “విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతనియెదుట నిలిచిరి.” దొర్కా తిరిగి సజీవురాలుగా చేయబడింది, ఆమె ఆ తర్వాత కూడా “సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా” చేస్తూ కొనసాగిందనడంలో సందేహం లేదు. ప్రస్తుత దిన క్రైస్తవ సంఘంలోనూ దొర్కా వంటి స్త్రీలు ఉన్నారు, వారు అవసరంలో ఉన్నవారి కోసం బట్టలు కుట్టిస్తుండవచ్చు లేదా ప్రేమపూర్వకమైన ఇతర పనులను చేస్తుండవచ్చు. వారు చేసే మంచి పనులు ముఖ్యంగా రాజ్యానికి సంబంధించిన పనులను పురోగమింపజేసేవాటికి, శిష్యులను చేసే పనికి సంబంధించినవి అనడంలో సందేహం లేదు.​—⁠అపొస్తలుల కార్యములు 9:​36-42; మత్తయి 6:​33; 28:​19, 20.

13. లూదియ ఇతరుల పట్ల ఎలా శ్రద్ధ చూపించింది?

13 లూదియ అనే భక్తురాలు ఇతరుల పట్ల శ్రద్ధ చూపించింది. ఆమె తుయతైర పట్టణస్థురాలు, దాదాపు సా.శ. 50 లో పౌలు ఫిలిప్పీలో ప్రకటించినప్పుడు ఆమె అక్కడే నివసిస్తోంది. లూదియ బహుశా యూదా మత ప్రవిష్టురాలు కావచ్చు, అయితే అక్కడ కేవలం కొందరు యూదులు ఉండి ఉండవచ్చు కానీ సమాజ మందిరం లేదు. అపొస్తలుడు వారికి సువార్తను ప్రకటించినప్పుడు ఆమెతోపాటు ఇతర భక్తురాండ్రు ఆరాధన కోసం ఒక నదీతీరాన సమకూడారు. ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “ప్రభువు ఆమె [లూదియ] హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె​—⁠నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.” (అపొస్తలుల కార్యములు 16:​12-15) లూదియ ఇతరుల కోసం మంచి పనులు చేయాలని కోరుకుంది కాబట్టి, ఆమె పౌలును అతని సహవాసులను తన ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒప్పించగలిగింది. నేడు క్రైస్తవులు దయతో ప్రేమతో అలాంటి ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనం ఎంత ప్రశంసించాలి!​—⁠రోమీయులు 12:​13; 1 పేతురు 4:⁠9.

యౌవనులారా మాకు మీ అవసరం కూడా ఉంది

14. యేసుక్రీస్తు చిన్నపిల్లలతో ఎలా వ్యవహరించాడు?

14 క్రైస్తవ సంఘం దయా వాత్సల్యంగల దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో ఆరంభించబడింది. ఆయన ప్రేమా సానుభూతీ చూపేవాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చే ప్రజలు సౌకర్యవంతంగా ఉన్నట్లు భావించేవారు. ఒక సందర్భంలో కొందరు తమ పిల్లలను యేసు దగ్గరకు తీసుకువస్తుంటే, ఆయన శిష్యులు వారిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. కానీ యేసు “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే. చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింప[డు]” అని అన్నాడు. (మార్కు 10:​13-15) రాజ్య ఆశీర్వాదాలు పొందాలంటే మనం చిన్నపిల్లల్లాగే నమ్రతతోను, నేర్చుకొనే అభిలాషతోను ఉండాలి. యేసు చిన్నపిల్లలను ఎత్తుకొని వారిని ఆశీర్వదించడం ద్వారా వారిపై తన ప్రేమను చూపించాడు. (మార్కు 10:​16) చిన్నలారా నేడు మీ విషయమేమిటి? సంఘంలో మీరు ప్రేమించబడతారని సంఘానికి మీ అవసరముందని నమ్మకముంచండి.

15. లూకా 2:​40-52 లో యేసు జీవితం గురించిన ఏయే సంఘటనలు నమోదు చేయబడ్డాయి, చిన్నపిల్లల కోసం ఆయన ఎలాంటి మాదిరిని ఉంచాడు?

15 యేసు తన చిన్నతనంలోనే దేవునిపైనా లేఖనాలపైనా తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆయనకు 12 ఏండ్ల వయస్సున్నప్పుడు ఆయనా ఆయన తల్లిదండ్రులు యోసేపు మరియలు పస్కా పండుగను ఆచరించడానికి తమ స్వగ్రామమైన నజరేతు నుండి యెరూషలేముకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో యేసు తల్లిదండ్రులు, తమతోపాటు ప్రయాణిస్తున్న గుంపులో యేసు లేడని గ్రహించారు. వారు చివరికి ఆయన దేవాలయంలో కూర్చొని యూదా బోధకులు చెప్పేది వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండడాన్ని చూశారు. యోసేపు మరియలు తనను కనుగొనలేకపోయారని తెలిసిన యేసు ఆశ్చర్యంతో “నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా” అని అడిగాడు. ఆయన తన తల్లిదండ్రులతో ఇంటికి తిరిగివచ్చి వారికి లోబడివుంటూ జ్ఞానమందును, వయస్సునందును వర్ధిల్లాడు. (లూకా 2:​40-52) మన చిన్నపిల్లలకు యేసు ఎంత చక్కని మాదిరిని ఉంచాడో కదా! వారు తమ తల్లిదండ్రులకు లోబడివుండాలి ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి కలిగివుండాలి.​—⁠ద్వితీయోపదేశకాండము 5:​16; ఎఫెసీయులు 6:​1-3.

16. (ఎ) యేసు దేవాలయం దగ్గర సాక్ష్యమిస్తున్నప్పుడు కొందరు పిల్లలు ఏమని కేకలు వేశారు? (బి) చిన్నపిల్లలకు నేడు ఎలాంటి గొప్ప సదవకాశం ఉంది?

16 ఒక బాలుడిగా లేక బాలికగా మీరు మీ స్కూల్లోను, మీ తల్లిదండ్రులతో కలిసి చేసే ఇంటింటి సేవలోను యెహోవా గురించి సాక్ష్యమిస్తుండవచ్చు. (యెషయా 43:​10-12; అపొస్తలుల కార్యములు 20:​20, 21) యేసు మరణించడానికి కొద్దికాలం ముందు దేవాలయం దగ్గర సాక్ష్యమిస్తూ ఆయన ప్రజలను స్వస్థపరుస్తున్నప్పుడు, కొందరు చిన్నపిల్లలు “దావీదు కుమారునికి జయము” అని కేకలు వేశారు, దానికి ప్రధానయాజకులును శాస్త్రులును కోపముతో మండిపడి “వీరు చెప్పుచున్నది వినుచున్నావా?” అని తమ అసమ్మతిని ప్రకటించారు. అందుకు యేసు “వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా?” అని వారికి జవాబిచ్చాడు. (మత్తయి 21:​15-17) సంఘంలోని బాలబాలికల్లారా, ఆ పిల్లల్లాగే దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి కీర్తించే గొప్ప సదవకాశం మీకూ ఉంది. రాజ్య ప్రచారకులుగా మాతో కలిసి పని చేయడానికి మాకు మీరు కావాలి, మీ అవసరం ఉంది.

శ్రమలకు గురైనప్పుడు

17, 18. (ఎ) పౌలు యూదయలోని క్రైస్తవుల కోసం విరాళాలను ఎందుకు సమకూర్చాడు? (బి) యూదయలోని విశ్వాసుల కోసం సేకరించబడిన విరాళాలు యూదా మరియు యూదేతర క్రైస్తవులపై ఎలాంటి ప్రభావం చూపించాయి?

17 మన పరిస్థితులు ఎలా ఉన్నా, అవసరంలో ఉన్న తోటి క్రైస్తవులకు సహాయం చేయడానికి ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. (యోహాను 13:​34, 35; యాకోబు 2:​14-17) పౌలు యూదయలోని సహోదర సహోదరీల కోసం అకయ, గలతీయ, మాసిదోనియ, ఆసియా జిల్లాల నుండి విరాళాలను సేకరించడానికి ఆయనను కదిలించింది వారి మీద ఉన్న ప్రేమే. యెరూషలేములోని శిష్యులు హింస, సమాజంలో అల్లకల్లోలం, కరవు అనుభవించినందుకే కాబోలు పౌలు “శ్రమలతో కూడిన గొప్ప పోరాటము,” “బాధలను,” “ఆస్తి కోలుపోవుటకు” అనే పదాలను వాడాడు. (హెబ్రీయులు 10:​32-34; అపొస్తలుల కార్యములు 11:27-12:⁠1) ఆ కారణంగానే పౌలు యూదయలోని బీద క్రైస్తవుల కోసం ఒక సహాయనిధిని సేకరించడంలో బాధ్యత వహించాడు.⁠—⁠1 కొరింథీయులు 16:​1-3; 2 కొరింథీయులు 8:⁠1-4, 13-15; 9:⁠1, 2, 7.

18 యూదయలోని పరిశుద్ధుల కోసం సమకూర్చబడిన స్వచ్ఛంద విరాళాలు, యెహోవా యొక్క యూదా ఆరాధకులకు యూదేతర ఆరాధకులకు మధ్య సహోదర బంధం ఉందనడానికి నిదర్శనం. అలా విరాళాలు అందజేయడం, యూదేతర క్రైస్తవులు యూదయలోని తోటి ఆరాధకుల నుండి తాము పొందిన ఆధ్యాత్మిక సంపదల పట్ల తమ కృతజ్ఞతను తెలియజేయడానికి కూడా దోహదపడింది. ఆ విధంగా వారు భౌతికమైన వాటిని, ఆధ్యాత్మికమైన వాటిని రెండింటినీ పంచుకున్నారు. (రోమీయులు 15:​26, 27) నేడు అవసరంలో ఉన్న తోటి విశ్వాసులకు ఇచ్చే విరాళాలు కూడా స్వచ్ఛందంగా ఇవ్వబడినవే, ప్రేమచే పురికొల్పబడినవే. (మార్కు 12:​28-31) ఈ విషయంలో కూడా మనకు పరస్పరం అవసరం ఉంటుంది, ఆ విధంగా ‘తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాకుండా’ సమానముగా ఉంటుంది.​—⁠2 కొరింథీయులు 8:​14, 15.

19, 20. విపత్తులు సంభవించినప్పుడు యెహోవాసాక్షులు ఎలా సహాయం చేస్తారో చూపించేందుకు ఒక ఉదాహరణ ఇవ్వండి.

19 క్రైస్తవులకు పరస్పరం అవసరం ఉంటుందని గ్రహించడం వల్ల, మన విశ్వాసమును బట్టి సహోదర సహోదరీలైన వారికి సహాయం చేయడానికి మనం వెంటనే ముందుకు వస్తాం. ఉదాహరణకు, 2001 తొలి భాగంలో విధ్వంసకరమైన భూకంపాల వల్ల, విరిగిపడిన కొండ చరియల వల్ల ఎల్‌సాల్వడార్‌లో ఏమి జరిగిందో గమనించండి. ఒక నివేదిక ఇలా తెలియజేసింది: “ఎల్‌సాల్వడార్‌లోని అన్ని భాగాల్లోని సహోదరులు సహాయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. గ్వాటిమాల, అమెరికా, కెనడాల నుండి సహోదరులు మాకు సహాయం చేయడానికి వచ్చారు . . . త్వరలోనే 500లకు పైగా ఇండ్లు, 3 ఆకర్షణీయమైన రాజ్యమందిరాలు నిర్మించబడ్డాయి. స్వయంత్యాగ స్ఫూర్తి గల ఈ సహోదరులు కష్టపడి పనిచేసిన తీరు, వారి పరస్పర సహకారం ద్వారా గొప్ప సాక్ష్యం ఇవ్వబడింది.”

20 దక్షిణాఫ్రికా నుండి ఒక నివేదిక ఇలా తెలియజేస్తోంది: “మొజాంబిక్‌లోని అత్యధిక భాగాలను ధ్వంసం చేసిన భయంకరమైన వరదల మూలంగా మన క్రైస్తవ సహోదరులు కూడా అనేకమంది నష్టపోయారు. వారి అవసరాలను చాలావరకు తీర్చేందుకు మొజాంబిక్‌లోని బ్రాంచి ఏర్పాటు చేసింది. కానీ బ్రాంచిలోని సహోదరులు, అవసరంలో ఉన్న సహోదరుల కోసం పాత బట్టలు మంచివి పంపించమని కోరారు. మేము మొజాంబిక్‌లోని సహోదరుల కోసం 40 అడుగుల కంటైనర్‌ నిండా బట్టలు సేకరించాం.” అవును, ఈ విధాలుగా కూడా మనకు పరస్పరం అవసరం ఉంటుంది.

21. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

21 మొదట పేర్కొన్నట్లుగా, శరీరంలోని అన్ని భాగాలు ముఖ్యమైనవే. క్రైస్తవ సంఘం విషయంలో కూడా అంతే. దానిలోని సభ్యులందరికీ పరస్పరం అవసరం ఉంటుంది. వారు కూడా ఐక్యంగా సేవ చేస్తుండాలి. దీన్ని సాధ్యం చేసే కొన్ని అంశాలను తరువాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది.

మీరెలా జవాబిస్తారు?

• మానవ శరీరానికి, క్రైస్తవ సంఘానికి మధ్య ఎలాంటి పోలిక ఉంది?

• తోటి విశ్వాసులకు భౌతికపరమైన సహాయం అవసరమైనప్పుడు తొలి క్రైస్తవులు ఎలా స్పందించారు?

• క్రైస్తవులకు పరస్పరం అవసరం ఉంటుందని, పరస్పరం సహాయం చేసుకుంటారని చూపిస్తున్న లేఖనాధార ఉదాహరణలు కొన్ని ఏవి?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

అకుల ప్రిస్కిల్లలు ఇతరుల పట్ల శ్రద్ధ చూపించారు

[12వ పేజీలోని చిత్రాలు]

యెహోవా ప్రజలు పరస్పరం సహాయం చేసుకుంటారు, ఇతరులు శ్రమలకు గురైనప్పుడు వారికి కూడా సహాయం చేస్తారు