కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి”

“దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి”

“నా యొద్దకు రండి;నేను మీకు విశ్రాంతి కలుగజేతును”

“దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి”

“మేము చెప్పేది వినడానికీ, మాలో నూతనోత్తేజాన్ని నింపే బైబిలు వచనాలను మాతో పంచుకోవడానికీ మీరెప్పుడూ సుముఖంగా ఉంటారు.”​—⁠పమీలా.

“మా అందరి తరఫున మీరు చేసే వాటన్నింటికీ కృతజ్ఞతలు. అది మాపై ఎంతో గమనార్హమైన ప్రభావం చూపింది.”​—⁠రాబర్ట్‌.

పమీలా, రాబర్ట్‌లు తమ తమ సంఘాల్లోని క్రైస్తవ పెద్దలకు కృతజ్ఞతాపూర్వకమైన ఈ మాటలను వ్రాయడానికి కదిలించబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని సేవకుల్లోని ఇతరులు కూడా “దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కా[స్తున్న]” వారినుండి తాము నిరంతరం పొందుతున్న మద్దతుకు, సంరక్షణకు కృతజ్ఞతగా ఉన్నారు. (1 పేతురు 5:⁠2) నిజంగానే యెహోవా ప్రజలు తమ తరఫున పెద్దలు చేసే అనేక పనులకు, వాటిని చేసే విధానానికి కృతజ్ఞులై ఉన్నారు.

‘చెయ్యాల్సింది ఎంతో ఉంది’

క్రైస్తవ పెద్దలకు అనేక బాధ్యతలు అప్పగించబడ్డాయి. (లూకా 12:​48) వారు సంఘ కూటాలకు ప్రసంగాలను సిద్ధం చేస్తారు, దేవుని రాజ్య సువార్తను బహిరంగంగా ప్రకటించడంలో భాగం వహిస్తారు. వారి విధుల్లో తోటి విశ్వాసులతో కాపరి సందర్శనాలు చేయడం కూడా ఉంది. ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరమున్న వయసు పైబడినవారి కోసం, ఇతరుల కోసం పెద్దలు సమయాన్ని కేటాయిస్తారు. ఇవన్నీ తమ సొంత కుటుంబాల ఆధ్యాత్మిక, భౌతిక సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకుండానే చేస్తారు. (యోబు 29:​12-15; 1 తిమోతి 3:​4, 5; 5:⁠8) కొందరు పెద్దలు రాజ్య మందిరాలను నిర్మించడానికి సహాయం చేస్తుంటారు. కొందరు ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో లేదా రోగులను సందర్శించే గ్రూపుల్లో సభ్యులుగా సేవ చేస్తున్నారు. అనేకమంది ప్రాంతీయ, జిల్లా సమావేశాల్లో స్వచ్ఛంద సేవ చేస్తుంటారు. అవును, పెద్దలు “ప్రభువు కార్యాభివృద్ధిలో చెయ్యాల్సింది ఎంతో ఉంది.” (1 కొరింథీయులు 15:​58, NW) అలా కష్టపడి పనిచేసే పెద్దలు తమకు అప్పగించబడిన వారిచేత ఉన్నతమైనవారిగా ఎంచబడడంలో ఆశ్చర్యమేమీ లేదు!​—⁠1 థెస్సలొనీకయులు 5:​12, 13.

తమ తోటి క్రైస్తవులను ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఇండ్లలో లేదా ఇతర స్థలాల్లో క్రమంగా సందర్శించే పెద్దలు ప్రోత్సాహానికి ఒక మూలాధారం. “పెద్దల ప్రేమపూర్వకమైన మద్దతు, ప్రోత్సాహమే గనుక పొందకపోయినట్లయితే నేను నేడు ఒక పూర్తికాల సేవకుడిగా యెహోవా సేవలో ఉండేవాడినే కాదు” అని తండ్రిలేని కుటుంబంలో పెరిగిన థామస్‌ చెబుతున్నాడు. తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లో పెరిగిన అనేకమంది యౌవనులు, పెద్దలు తమపై చూపించిన శ్రద్ధ తాము దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడిందని ఒప్పుకుంటున్నారు.

కాపరి సందర్శనాలు ఎంతో విలువైనవని సంఘంలోని వయోజనులు కూడా ప్రశంసించారు. 80వ పడిలో ఉన్న ఒక మిషనరీ జంటను ఇద్దరు పెద్దలు సందర్శించిన తర్వాత, వారు “ఎంతో ఆదరంతో మీరు చేసిన సందర్శానికి మేము మా కృతజ్ఞతను తెలియజేయాలనుకుంటున్నాము. మీరు వెళ్ళిన తర్వాత, మీరు మాతో చర్చించిన లేఖనాలను మేము మళ్ళీ చదువుకున్నాము. మీ ప్రోత్సాహకరమైన మాటలను మేము ఎన్నటికీ మరచిపోలేము” అని వ్రాశారు. 70 ఏండ్ల ఒక విధవరాలు “నేను సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తున్నాను, ఆయన మీ ఇద్దరినీ మా ఇంటికి పంపించాడు. మీ సందర్శనం యెహోవా నుండి నేను పొందిన ఆశీర్వాదం!” అని పెద్దలకు వ్రాసింది. మీ సంఘంలోని పెద్దల సందర్శనం ద్వారా మీరు ఇటీవల ప్రయోజనం పొందారా? తమ సంరక్షణలో ఉన్న మందను కాయడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను మనమందరం తప్పకుండా ప్రశంసిస్తాం!

దేవుణ్ణి, క్రీస్తును అనుకరించే కాపరులు

యెహోవా ప్రేమగల కాపరి. (కీర్తన 23:​1-4; యిర్మీయా 31:​10; 1 పేతురు 2:​25) యేసుక్రీస్తు కూడా ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కాపరి. వాస్తవానికి ఆయన “మంచి కాపరి,” “గొప్ప కాపరి,” “ప్రధాన కాపరి” అని పిలువబడ్డాడు. (యోహాను 10:​11; హెబ్రీయులు 13:​20, 21; 1 పేతురు 5:⁠4) తన శిష్యులవ్వాలని కోరుకున్న వారితో యేసు ఎలా వ్యవహరించాడు? ఆయన వారిని “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని సాదరంగా ఆహ్వానించాడు.​—⁠మత్తయి 11:​28.

అదేవిధంగా పెద్దలు నేడు మందకు విశ్రాంతి కలుగజేసేందుకు సంరక్షణనిచ్చేందుకు ఒక మూలాధారంగా ఉండడానికి కృషి చేస్తారు. అలాంటి పురుషులు ‘గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉంటారు ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉంటారు.’ (యెషయా 32:⁠2) అలాంటి దయగల సంరక్షకులు నూతనోత్తేజాన్ని ఇస్తారు, మంద గౌరవాన్ని, దేవుని ఆమోదాన్ని పొందుతారు.​—⁠ఫిలిప్పీయులు 2:​29, 30; 1 తిమోతి 5:​17.

వారి భార్యల నుండి విలువైన మద్దతు

దేవుని ప్రజలు క్రైస్తవ పెద్దల పట్లా ఆ పెద్దలకు వారి భార్యలు ఇచ్చే ప్రేమపూర్వకమైన మద్దతు పట్లా కృతజ్ఞులై ఉంటారు. అలా మద్దతునిచ్చే స్త్రీలు తమ వైపు నుండి తరచూ త్యాగం చేయాల్సివస్తుంది. కొన్నిసార్లు, తమ భర్తలు సంఘ విషయాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు లేదా కాపరి సందర్శనాలు చేసేటప్పుడు తాము ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు, సంఘంలో వెంటనే పరిష్కరించవలసిన సమస్య ఏదైనా తలెత్తినప్పుడు, తాము చాలా జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళికను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. “కూటాలకు సిద్ధపడుతూ లేదా కాపరి సందర్శనాలు చేస్తూ నా భర్త ఎంత బిజీగా ఉన్నాడో చూసినప్పుడు ఆయన యెహోవా పని చేస్తున్నాడనే విషయాన్ని నేను మనసులో ఉంచుకొని ఆయనకు మద్దతునిచ్చేందుకు నాకు సాధ్యమైనంత నేను చేస్తాను” అని మిషేల్‌ చెబుతోంది.

ఒక సంఘ పెద్ద భార్య అయిన షెరిల్‌ కూడా “సంఘంలోని సహోదర సహోదరీలకు పెద్దలతో మాట్లాడాల్సిన అవసరముంటుందని నాకు తెలుసు, వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నా భర్తను కలుసుకోవడానికి రాగలిగేలా వారు భావించాలని నేను కోరుకుంటున్నాను” అని పేర్కొంది. మిషెల్‌, షెరిల్‌ లాంటి మద్దతునిచ్చే స్త్రీలు, తమ భర్తలు దేవుని గొఱ్ఱెలను శ్రద్ధగా చూసుకోగలిగేందుకు ఇష్టపూర్వకంగా త్యాగాలు చేస్తారు. మద్దతునిచ్చే వారి స్ఫూర్తికి పెద్దల భార్యలు ప్రశంసించబడుతున్నారు.

అయినా, బిజీగా ఉండే ఒక పెద్ద తన భార్యాపిల్లల ఆధ్యాత్మిక అవసరాలను, ఇతర అవసరాలను నిర్లక్ష్యం చేయకూడదు. వివాహితుడైన ఒక పెద్ద “నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై” ఉండాలి. (తీతు 1:⁠6) క్రైస్తవ అధ్యక్షుల నుండి బైబిలు కోరుతున్న విధానంలో ఆయన తన కుటుంబంపై శ్రద్ధ చూపించాలి.​—⁠1 తిమోతి 3:​1-7.

బిజీగా ఉండే ఒక పెద్దకు మద్దతునిచ్చే భార్య అమూల్యమైనది! ఆలోచనాపరులైన వివాహిత పెద్దలు అలాగే భావిస్తారు. అది సరిగ్గా “[మంచి] భార్య దొరికినవానికి మేలు దొరికెను” అని బైబిలు చెబుతున్నట్లే ఉంది. (సామెతలు 18:22) అలాంటి పెద్దలు తమ భార్యలకు తమ హృదయపూర్వక కృతజ్ఞతను మాటల్లోనూ చర్యల్లోనూ చూపిస్తారు. హృదయపూర్వక ప్రార్థన, ఇద్దరూ కలిసి చేసే ఆహ్లాదకరమైన అధ్యయనాలతోపాటు ఈ క్రైస్తవ వివాహిత జంటలు, సముద్రతీరాన నడవడానికి, చెట్ల మధ్య నడవడానికి లేదా పార్కులో వాహ్యాళికి సమయాన్ని కేటాయించుకుంటారు. అవును పెద్దలు తమ భార్యలపై ప్రేమపూర్వక శ్రద్ధను చూపించడంలో ఆనందిస్తారు.​—⁠1 పేతురు 3:⁠7.

దేవుని మందను నిస్వార్థంతో కాసే పెద్దలు, యెహోవా ప్రజలకు ఆధ్యాత్మిక నూతనోత్తేజాన్నిచ్చే ఒక మూలాధారం. వారు నిజంగా ‘మనుష్యుల్లోని ఈవులు,’ సంఘానికి ఆశీర్వాదం!​—⁠ఎఫెసీయులు 4:​8, 11-13.