కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

దేవునికి చేసిన మ్రొక్కుబడులకు అన్ని సందర్భాలలోను కట్టుబడివుండాలా?

లేఖనాల ప్రకారం, మ్రొక్కుబడి అనేది ఒక పని చేస్తాననో, ఏదైనా అర్పిస్తాననో, ఒక కార్యకలాపంలో పాల్గొంటాననో లేదా ఒక స్థానం వహిస్తాననో, లేదా చట్టబద్ధం కాని నిర్దిష్టమైనవాటికి దూరంగా ఉంటాననో దేవునితో చేసే గంభీరమైన వాగ్దానం. బైబిల్లో ఉన్న మ్రొక్కుబడుల వృత్తాంతాలు షరతుతో కూడినవి, దేవుడు మొదట ఏదైనా చేస్తే దాని తర్వాత ఫలానాది చేస్తాననే వాగ్దానం వాటిలో ఉంది. ఉదాహరణకు, ప్రవక్తయైన సమూయేలు తల్లి హన్నా “సైన్యముల కధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినము లన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను.” (1 సమూయేలు 1:​11) మ్రొక్కుకోవడం అనేది ఇష్టపూర్వకంగా చేసేదని కూడా బైబిలు తెలియజేస్తోంది. అయితే లేఖనాధారిత మ్రొక్కుబడులకు ఎంత మేరకు కట్టుబడి ఉండాలి?

“నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము” అని ప్రాచీన ఇశ్రాయేలు రాజు సొలొమోను అంటున్నాడు. అంతేకాదు, “నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు” అని కూడా ఆయన అంటున్నాడు. (ప్రసంగి 5:​4, 5) మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఇలా చెబుతోంది: “నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.” (ద్వితీయోపదేశకాండము 23:​21) దీన్నిబట్టి దేవునికి మ్రొక్కుబడి చేయడమనేది గంభీరమైన విషయమని స్పష్టమవుతోంది. అది ఒక మంచి కారణాన్నిబట్టే చేయాలి, తాను మ్రొక్కుబడిలో ఏమి వాగ్దానం చేశాడో దాన్ని చెల్లించే విషయంలో తన సామర్థ్యం గురించి ఆ వ్యక్తికి ఎలాంటి సందేహం ఉండకూడదు. లేని పక్షంలో ఆయన మ్రొక్కుబడి చేయకపోవడమే మంచిది. అయితే ఒకసారి మ్రొక్కుబడి చేశామంటే ఇక వాటన్నిటికీ కట్టుబడి ఉండాల్సిందేనా?

ఒక వ్యక్తి తాను మ్రొక్కుబడిగా చెల్లిస్తానని చెప్పిన తర్వాత అది దేవుని చిత్తానికి అనుగుణమైనది కాదని తెలిస్తే అప్పుడెలా? ఒకవేళ ఆ మ్రొక్కుబడి ఏ విధంగానైనా సత్యారాధనతో లైంగిక దుర్నీతిని జతచేసేదైతే ఎలా? (ద్వితీయోపదేశకాండము 23:​18) నిస్సందేహంగా అలాంటి మ్రొక్కుబడికి కట్టుబడి ఉండనవసరం లేదు. అంతేకాదు మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక స్త్రీ చేసిన మ్రొక్కుబడిని ఆమె తండ్రి గానీ ఆమె భర్త గానీ రద్దు చేయవచ్చు.​—⁠సంఖ్యాకాండము 30:​3-15.

ఒక వ్యక్తి పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉంటానని మ్రొక్కుబడి చేసి ఇప్పుడు సందిగ్ధావస్థలో పడిన విషయాన్ని కూడా పరిశీలించండి. ఆయన చేసిన మ్రొక్కుబడి ఆయనను ఎలాంటి స్థానానికి చేర్చిందంటే, ఆ మ్రొక్కుబడిని చెల్లించడంలో తను నైతికతకు సంబంధించిన దైవిక ప్రమాణాలను ఉల్లంఘిస్తానేమో అని భావించే స్థితికి వచ్చాడు. అప్పుడు కూడా ఆయన తన మ్రొక్కుబడిని చెల్లించడానికి గట్టి ప్రయత్నం చేయాలా? అలాంటి పరిస్థితుల్లో ఆయన తన మ్రొక్కుబడిని విరమించుకోవడం ద్వారా, తనను తాను లైంగిక దుర్నీతి నుండి కాపాడుకొని, మ్రొక్కుబడిని చెల్లించనందుకు దేవుని కరుణ కోసం ప్రాధేయపడుతూ క్షమించమని వేడుకోవడం ఉత్తమం కాదా? ఆ విషయంలో కేవలం ఆయన మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆయన కోసం వేరే ఏ మానవుడూ నిర్ణయం తీసుకోలేడు.

ఒక వ్యక్తి మ్రొక్కుబడి చేసిన తర్వాత అది తొందరపాటుతో చేసినట్లు గ్రహిస్తే అప్పుడెలా? అప్పుడు కూడా ఆయన ఆ మ్రొక్కుబడిని చెల్లించడానికి ప్రయత్నించాలా? యెఫ్తా దేవునికి తాను చేసుకున్న మ్రొక్కుబడిని చెల్లించడం అంత సులభమేమీ కాలేదు, అయినా ఆయన దాన్ని ఇష్టపూర్వకంగానే చెల్లించాడు. (న్యాయాధిపతులు 11:​30-40) మ్రొక్కుబడి చెల్లించడంలో ఒక వ్యక్తి విఫలుడైనప్పుడు అది దేవునికి “కోపము పుట్టించి” ఆ వ్యక్తి సాధించినదాన్ని వ్యర్థం చేయవచ్చు. (ప్రసంగి 5:⁠6) మ్రొక్కుబడికి తగినంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడం దేవుని అనుగ్రహాన్ని కోల్పోయేలా చేసే అవకాశముంది.

యేసుక్రీస్తు “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది” అని అన్నాడు. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 5:​37) కాబట్టి ఒక క్రైస్తవుడు దేవునికి చేసుకున్న మ్రొక్కుబడులను చెల్లించడం గురించి మాత్రమే కాక దేవునితోను, మనుష్యులతోను చేసుకున్న వాగ్దానాలన్నింటిలో కూడా నమ్మదగిన వ్యక్తిగా ఉండేందుకు ఆసక్తి కలిగివుండాలి. మొదట మంచిదిగా అనిపించిన ఒక వ్యక్తితో చేసుకున్న ఒప్పందం, నిశిత పరిశీలన తర్వాత అది మూర్ఖమైనదని తెలిసిన సంకట పరిస్థితిలో ఏం చేయాలి? అలాంటి విషయాలను ఆయన తేలికగా తీసుకోకూడదు. కృషితో కూడిన చర్చల ఫలితంగా అవతలి వ్యక్తి తమ ఒప్పందం నుండి ఈయనను విముక్తి చేయడానికి నిర్ణయించుకోవచ్చు.​—⁠కీర్తన 15:⁠4; సామెతలు 6:⁠2, 3.

మ్రొక్కుబడుల విషయంలోను ఇతర అన్ని విషయాల్లోను మనం ప్రధానంగా దేని గురించి ఆసక్తి కలిగి ఉండాలి? యెహోవా దేవునితో మంచి సంబంధాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించుదాం.

[30, 31వ పేజీలోని చిత్రాలు]

హన్నా తన మ్రొక్కుబడిని చెల్లించడానికి వెనకాడలేదు

[30, 31వ పేజీలోని చిత్రాలు]

యెఫ్తాకు కష్టమైనా తన మ్రొక్కుబడిని చెల్లించాడు