కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి నైతిక ప్రమాణాలను ప్రోత్సహించే ప్రయత్నాలు

మంచి నైతిక ప్రమాణాలను ప్రోత్సహించే ప్రయత్నాలు

మంచి నైతిక ప్రమాణాలను ప్రోత్సహించే ప్రయత్నాలు

2001వ సంవత్సరాంతంలో రేడియో మొజాంబిక్‌ వారి జాతీయ ప్రసారాన్ని వింటున్న ప్రజలు ఈ ప్రకటనను విన్నారు:

“రిపబ్లిక్‌ అధ్యక్షుడు మపుటోలోని యెహోవాసాక్షుల బ్రాంచిని సందర్శించారు. కుటుంబాల్లోనూ, వయోజన విద్యా బోధనలోనూ అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా మంచి నైతిక ప్రమాణాలను ప్రోత్సహించే తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయమని మత సంబంధమైన ఈ సంస్థను ఆయన ప్రోత్సహించారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది ఈ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారు. అధ్యక్షుడు షీస్సానూ చెప్పినట్లు ఇలాంటి కార్యక్రమాలు ప్రశంసనీయమైనవి, ఈ దేశం ఇప్పటికీ ఎదుర్కొంటున్న విద్యాభ్యాస సమస్యలను పరిష్కరించే విషయంలో ఇవి సమాజానికి ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమాలు.”

అధ్యక్షుడి ప్రసంగం నుండి తీసుకొన్న ఈ భాగంతో ఆ ప్రకటన ఇంకా ఇలా కొనసాగింది: “అక్షరాస్యతపై ఆసక్తి కనబరుస్తున్న అనేకమందిని చూడడం మనకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అక్షరాస్యులను అధికం చేయడానికి సాధారణ పౌరులు మనకు సహాయం చేస్తారని మనకిది చూపిస్తోంది. కాబట్టి యెహోవాసాక్షులు తమ అక్షరాస్యత కార్యక్రమాలను, ఏ భాషలోనైనా సరే, తీవ్రం చేయాలని నేను వారిని ప్రోత్సహిస్తున్నాను. నిజానికి ప్రాముఖ్యమైన విషయమేమిటంటే అక్షరాస్యత ఉండాలి, ప్రజలు మరింత సులభంగా పరస్పరం సంభాషించుకోగలగాలి, విద్య నేర్పించడంలో భవిష్యత్తులో ఇంకా భారీ ఎత్తున పాల్గొనాలి.”

మొజాంబిక్‌లోని యెహోవాసాక్షులు, ప్రజలు దేవుని వాక్యాన్ని స్వయంగా చదవగలిగేలా వారిని చేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 850 ప్రాంతాల్లో అక్షరాస్యత తరగతులను నిర్వహిస్తున్నారు. వాటితోపాటు ప్రతివారం సుమారు 50,000 ఉచిత గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 235 దేశాల్లో జరుగుతున్న బైబిలు బోధనా కార్యక్రమంలోని భాగమే. (మత్తయి 24:​14) మీరు కూడా ఈ కార్యక్రమం నుండి ప్రయోజనం పొందవచ్చు. దయచేసి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను కలుసుకోవడానికి సంకోచించకండి.