కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా దృష్టిలో మన రోజులను విలువైనవిగా ఎలా చేసుకోవచ్చు?

యెహోవా దృష్టిలో మన రోజులను విలువైనవిగా ఎలా చేసుకోవచ్చు?

యెహోవా దృష్టిలో మన రోజులను విలువైనవిగా ఎలా చేసుకోవచ్చు?

“నిన్న సూర్యోదయం, సూర్యాస్తమయాల మధ్య బంగారం లాంటి రెండు గంటలు ఎక్కడో పోయాయి, ఒక్కో దాంట్లో వజ్రాల్లాంటి అరవై నిమిషాలున్నాయి. వాటికోసం ఎలాంటి బహుమానం ప్రకటించలేదు, ఎందుకంటే అవి శాశ్వతంగా పోయాయి!”​—⁠లిడియా హెచ్‌. సిగర్నీ, అమెరికన్‌ గ్రంథకర్త (1791-1865).

మన జీవితానికి కొన్ని రోజులే ఉన్నట్లు, అవి వేగంగా గడిచిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. జీవితపు అల్పాయుష్కత గురించి ఆలోచించిన కీర్తనకర్త దావీదు, “యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది” అని ప్రార్థించడానికి కదిలించబడ్డాడు. దావీదు చింత అంతా తన మాటల ద్వారా చర్యల ద్వారా దేవుణ్ణి సంతోషపరిచేలా జీవించాలన్నదే. ఆయన తాను దేవునిపై ఆధారపడి ఉన్నాననే విషయాన్ని “నిన్నే నేను నమ్ముకొనియున్నాను” అనే మాటల్లో వ్యక్తం చేశాడు. (కీర్తన 39:​4, 5, 7) దాన్ని యెహోవా విన్నాడు. నిజంగానే ఆయన దావీదు కార్యకలాపాలను అంచనా వేసి అందుకు తగిన విధంగా ప్రతిఫలమిచ్చాడు.

రోజులో ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ఉండడం, కార్యకలాపాలతో నిండి ఉండే వేగవంతమైన జీవనగమనంలో పడిపోవడం చాలా సులభం. ఇది మనలో ఒక చింతను కలిగించే అవకాశముంది. ప్రత్యేకించి, చేయాల్సినవీ అనుభవించాల్సినవీ బోలెడన్ని ఉండి సమయం చాలా తక్కువ ఉన్నప్పుడు అలా చింతించే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే మన చింత దేవుని ఆమోదం పొందాలన్న లక్ష్యంతో జీవించాలని కోరుకున్న దావీదుకు ఉన్నటువంటి చింతేనా? యెహోవా మనలో ప్రతి ఒక్కరినీ గమనిస్తాడు, జాగ్రత్తగా పరీక్షిస్తాడు అనే విషయంలో సందేహం లేదు. అది నిజమేనని దాదాపు 3,600 సంవత్సరాల క్రితం, దేవునికి భయపడే యోబు అనే ఒక వ్యక్తి యెహోవా తన కార్యకలాపాలన్నింటినీ గమనించాడని, పరీక్షించాడని అంగీకరించాడు. “ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?” అని యోబు ఆలోచింపజేసే ప్రశ్న వేశాడు. (యోబు 31:​4-6, 14) ఆధ్యాత్మిక విషయాలను మొదటి స్థానంలో పెట్టడం ద్వారా, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన రోజులను దేవుని దృష్టిలో విలువైనవిగా చేసుకునే అవకాశముంది. కాబట్టి మనం ఈ విషయాలను సునిశితంగా పరిశీలిద్దాం.

ఆధ్యాత్మిక విషయాలను ప్రముఖ విషయాలుగా చేసుకోండి

ప్రేరేపిత లేఖనాలు, ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి’ అని చెప్పినప్పుడు ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానమివ్వాలని మనకు సరిగ్గానే ఉద్బోధిస్తున్నాయి. అయితే ఈ శ్రేష్ఠమైన కార్యాలంటే ఏవి? అందులో ‘తెలివి, సకలవిధములైన అనుభవజ్ఞానము’ ఉన్నాయి. (ఫిలిప్పీయులు 1:​9-11) యెహోవా సంకల్పాల గురించిన పరిజ్ఞానాన్ని పొందాలంటే మనం మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానం ఇవ్వడం వల్ల మనకు ప్రతిఫలదాయకమైన, సంతృప్తికరమైన జీవితంపై నమ్మకం కలుగుతుంది.

“ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు” నడుచుకొమ్మని అపొస్తలుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆ పరీక్షలో మన హృదయంలోని ఉద్దేశాల గురించిన, కోరికల గురించిన ఆత్మ పరిశీలన ఉండాలి. “ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి” అని కూడా అపొస్తలుడు అన్నాడు. (ఎఫెసీయులు 5:​10, 17) అయితే యెహోవా దేనిని అంగీకారయోగ్యమైనదిగా దృష్టిస్తాడు? ఒక బైబిలు సామెత, “జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్పచేసినయెడల అది నిన్ను హెచ్చించును” అని జవాబిస్తోంది. (సామెతలు 4:​7, 8) దైవిక జ్ఞానమును సంపాదించుకొని దానికి అనుగుణంగా నడుచుకొనే వ్యక్తిని బట్టి యెహోవా సంతోషిస్తాడు. (సామెతలు 23:​15) ఆ జ్ఞానానికి ఉన్న అందమేమిటంటే, అది తిరిగి తీసుకోబడదు లేదా నిరుపయోగం చేయబడదు. వాస్తవానికి “అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు” కాపాడే రక్షణగా ఉంటుంది.​—⁠సామెతలు 2:​10-15.

అలాంటప్పుడు ఆధ్యాత్మిక విషయాలను తేలికగా తీసుకునే అలవాటేదైనా ఉంటే దాన్ని నిరోధించడం ఎంత మంచిది! మనం యెహోవా పట్ల ఆరోగ్యకరమైన భయాన్ని, ఆయన మాటల పట్ల కృతజ్ఞతా దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. (సామెతలు 23:​17, 18) అలాంటి మనోవైఖరిని జీవితంలో ఎప్పుడైనా అలవరుచుకోవచ్చు కాబట్టి, చిన్నతనంలోనే ఈ చక్కటి మాదిరిని స్థిరపరుచుకొని బైబిలు సూత్రాలను ఒంటబట్టించుకోవడం మంచిది. “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని జ్ఞానియైన సొలొమోను రాజు అంటున్నాడు.​—⁠ప్రసంగి 12:⁠1, 2.

యెహోవా పట్ల కృతజ్ఞతను పెంపొందించుకోవడానికి అత్యంత సన్నిహితమైన మార్గమేమిటంటే ప్రతిరోజు ఆయనకు వ్యక్తిగతంగా ప్రార్థించడం. యెహోవా మీద నమ్మకముంచడంలో ఉన్న ప్రాముఖ్యతను దావీదు గుర్తించాడు, అందుకే ఆయన “యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము” అని వేడుకున్నాడు. (కీర్తన 39:​12) దేవునితో మనకున్న సన్నిహిత సంబంధపు గాఢత మనం కన్నీళ్ళు కార్చేంతగా మన భావోద్వేగాలను స్పృశిస్తుందా? నిజానికి మనం మన మనసులోని సన్నిహిత విషయాల గురించి యెహోవాతో ఎంత ఎక్కువగా మాట్లాడుతామో ఆయన వాక్యాన్ని ఎంత ఎక్కువగా ధ్యానిస్తామో ఆయన మనకు అంత దగ్గరవుతాడు.​—⁠యాకోబు 4:⁠8.

విధేయతను నేర్చుకోండి

తాను దేవునిపై ఆధారపడవలసిన అవసరముందని గుర్తించిన నమ్మకమైన మరొక వ్యక్తి మోషే. జీవితమంతా సమస్యలతో నిండివుందన్న వాస్తవాన్ని దావీదులాగే మోషే కూడా చూడగలిగాడు. ఆ కారణంగానే ‘జ్ఞానహృదయము కలుగునట్లుగా నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము’ అని ఆయన దేవుణ్ణి వేడుకున్నాడు. (కీర్తన 90:​10-12) యెహోవా నియమాలను సూత్రాలను నేర్చుకొని వాటికి అనుగుణంగా జీవించినప్పుడే జ్ఞానహృదయము లభ్యమవుతుంది. మోషే ఈ విషయాన్ని గ్రహించాడు, ఆ తర్వాత ఆయన ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలోకి ప్రవేశించకముందు దేవుని నియమాలను ఆదేశాలను వారికి పదే పదే చెప్పడం ద్వారా ఆ ప్రాముఖ్యమైన సత్యం వారి మనస్సుల్లో ముద్రించుకుపోయేందుకు కృషి చేశాడు. ఇశ్రాయేలీయులను ఏలడానికి యెహోవా ఆ తర్వాత ఎంపిక చేసే ఏ మానవ రాజైనా తన కోసం ధర్మశాస్త్రపు ప్రతిని ఒకదాన్ని వ్రాసుకోవాలి, దాన్ని తన జీవితకాలమంతా ప్రతిరోజు చదవాలి. ఎందుకు? దేవుని భయమంటే ఏమిటో తెలుసుకోవడానికి ఆయన చదవాలి. అది ఆ రాజు విధేయతకు ఒక పరీక్ష వంటిది. అది ఆయన తన సహోదరులపై గర్వించకుండా ఆయనను కాపాడడమేగాక, ఆయన తన రాజ్యంలో దీర్ఘాయుష్మంతుడయ్యేలా కూడా చేస్తుంది. (ద్వితీయోపదేశకాండము 17:​18-20) యెహోవా, దావీదు కుమారుడైన సొలొమోనుతో “నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను” అని చెప్పినప్పుడు ఈ వాగ్దానం మళ్ళీ చెప్పబడింది.​—⁠1 రాజులు 3:​10-14.

విధేయత దేవుని దృష్టిలో చాలా గంభీరమైన విషయం. యెహోవా కోరేవాటిలో, ఆజ్ఞాపించినవాటిలో కొన్ని నిర్దిష్ట భాగాలను అంత ప్రాముఖ్యమైనవి కావన్నట్లుగా మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, అలాంటి వైఖరిని ఆయన నిస్సందేహంగా పరిగణలోకి తీసుకుంటాడు. (సామెతలు 15:⁠3) ఈ అవగాహన, మనం యెహోవా దేవుని నిర్దేశాలన్నింటినీ అత్యంత విలువైనవిగా ఎంచేలా మనల్ని కదిలించాలి, అలా చేయడం ఎల్లప్పుడూ సులభం కాకపోయినా సరే. ఎందుకంటే దేవుని నియమాలను ఆజ్ఞలను పాటించడానికి మనం కృషి చేస్తుండగా సాతాను ‘మనల్ని అభ్యంతరపరచడానికి’ తన శాయశక్తులా ప్రయత్నిస్తుంటాడు.​—⁠1 థెస్సలొనీకయులు 2:​18.

ప్రత్యేకించి ఇది, ఆరాధించడానికీ సహవాసానికీ ఒకచోట కలుసుకోండి అనే లేఖనాధార హితబోధకు విధేయులై ఉండే విషయంలో ప్రాముఖ్యమైనది. (ద్వితీయోపదేశకాండము 31:​12, 13; హెబ్రీయులు 10:​24, 25) కాబట్టి మనం ‘నేను నిజంగా యోగ్యమైనదేదో దాన్నే చేయడానికి కృతంగా నిశ్చయించుకొని అందుకు తగిన కృషి చేస్తున్నానా?’ అని ప్రశ్నించుకోవడం మంచిది. ఆర్థిక భద్రతను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ క్రైస్తవ కూటాల్లోని సహవాసాన్ని, ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే అది యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఆ మేరకు అపొస్తలుడైన పౌలు “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే [యెహోవాయే] చెప్పెను గదా” అని వ్రాశాడు. (హెబ్రీయులు 13:⁠5) యెహోవా ఆజ్ఞలకు మనఃపూర్వకంగా విధేయత చూపించినప్పుడు, అది ఆయన మనల్ని శ్రద్ధగా చూసుకుంటాడని మనం సంపూర్ణంగా నమ్ముతున్నామన్నదాన్ని సూచిస్తుంది.

యేసు విధేయత నేర్చుకున్నాడు ప్రయోజనం పొందాడు. అలాగే మనమూ పొందవచ్చు. (హెబ్రీయులు 5:⁠8) మనం విధేయతను ఎంత ఎక్కువగా అలవరుచుకొంటే విధేయత చూపించడం అంత సులభమవుతుంది, అది చివరికి చిన్న విషయాల్లోనైనా సరే. మన యథార్థత కారణంగా, మనం ఇతరుల నుండి బాధ కలిగించే వైనాన్ని, చివరికి దురుసైన ప్రవర్తనను సహించాల్సి వస్తుందనేది నిజమే. ప్రత్యేకించి అది పని స్థలంలో, స్కూల్లో, లేదా వేర్వేరు మతాలను అనుసరించే కుటుంబ సభ్యులున్న ఇంట్లో కావచ్చు. అయినప్పటికీ, “యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తు[కుంటే]” తాను ‘వారి ప్రాణమునకు వారి దీర్ఘాయుష్షుకు మూలముగా ఉంటాను’ అని యెహోవా ఇశ్రాయేలీయులకు చేసిన ప్రకటనలో మనకు ఓదార్పు లభిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 30:​20) అదే వాగ్దానం మనకూ వర్తిస్తుంది.

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి

సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా యెహోవా దృష్టిలో మన రోజులను విలువైనవిగా చేసుకోవడానికి సహాయపడుతుంది. సమయం డబ్బులా దాచుకోవడానికి వీలయ్యేది కాదు, దాన్ని వెచ్చించవలసిందే లేదంటే దాన్ని నష్టపోతాం. గతించే ప్రతి గంటా శాశ్వతంగా పోయినట్లే. మనం చేపట్టగలిగే వాటికంటే ఎక్కువగా చేయాల్సినవే ఎప్పుడూ ఉంటాయి కాబట్టి, మనం మన సమయాన్ని మన జీవితంలోని లక్ష్యాలను సాధించడానికి సహాయపడే విధంగా వినియోగించుకుంటున్నామా? క్రైస్తవులందరికీ, రాజ్యాన్ని క్రమంగా ప్రకటిస్తూ శిష్యులను చేసే పని ఒక గొప్ప లక్ష్యంగా ఉండాలి.​—⁠మత్తయి 24:​14; 28:​19, 20.

సమయం విలువ బాగా తెలిసినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. దానికి తగినట్లే ఎఫెసీయులు 5:​15, 16 వచనాలు “సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొను[డి]” అని మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది తక్కువ ప్రాముఖ్యమైన విషయాలను వదిలిపెట్టమని సూచిస్తోంది. సమయం వృధా అయ్యే పనులను తగ్గించుకొమ్మని దీనర్ధం. అతిగా టీవీ చూడడం లేదా ఇంటర్‌నెట్‌తో గడపడం, ప్రయోజనకరం కాని లౌకిక సాహిత్యాన్ని అధికంగా చదవడం లేదా వినోద కార్యకలాపాల్లో అధికంగా పాల్గొనడం వంటివి మనల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తాయి. ఇవేగాక, అమితంగా వస్తుసంపదలను కూడబెట్టుకోవడం వల్ల కూడా జ్ఞానహృదయాన్ని సంపాదించుకోవడానికి అవసరమయ్యే సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవడాన్ని సమర్థించేవారు, “స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోకపోయినట్లయితే మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరు” అని అంటున్నారు. లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడానికి వారు ఈ అయిదు ప్రమాణాలను సూచిస్తున్నారు: నిర్దిష్టమైనవి, లెక్కించగలవి, సాధించగలిగేవి, వాస్తవికమైనవి, నియమిత సమయంగలవి.

ఒక విలువైన లక్ష్యమేమిటంటే మన బైబిలు పఠనాన్ని మెరుగుపరుచుకోవడం. మొదటి దశగా మన లక్ష్యాన్ని నిర్దిష్టం చేసుకోవడానికి, మొత్తం బైబిలు చదవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం. తరువాతి దశగా, మన లక్ష్యాన్ని లెక్కించగలిగేలా చేసుకోవడం. ఇలా చేయడం వల్ల మనం మన అభివృద్ధిని పరిశీలించుకోవచ్చు. లక్ష్యాలు మనం కష్టపడి ఎదగడానికి ప్రోత్సహించాలి. అవి సాధించగలిగేవిగానూ వాస్తవికమైనవిగానూ ఉండాలి. వ్యక్తిగత సామర్థ్యాలను, నైపుణ్యాలను, లభ్యమయ్యే సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. తమ లక్ష్యాన్ని సాధించడానికి కొందరికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. చివరిగా, మన లక్ష్యం సమయం నిర్ణయించబడినదై ఉండాలి. దేన్నైనా పూర్తి చేయడానికి ఒక తేదీని నిర్ణయించుకుంటే, ఆ సమయంలోగా దాన్ని పూర్తి చేసేందుకు ఎక్కువగా పురికొల్పబడే అవకాశముంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేలు కుటుంబంలోని సభ్యులందరికీ, బేతేలులోని తమ మొదటి సంవత్సరంలో మొత్తం బైబిలు చదవడం నిర్దిష్ట లక్ష్యంగా ఉంది. అది యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో సేవ చేసేవారికైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని బ్రాంచిల్లోని ఒక దానిలో సేవచేసేవారికైనా అదే లక్ష్యం ఉంది. ప్రయోజనకరమైన బైబిలు పఠనం తమ ఆధ్యాత్మిక ఎదుగుదలకూ తమ ప్రయోజనం కోసం తమకు బోధిస్తున్న యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండడానికీ దోహదపడుతుందని వారికి తెలుసు. (యెషయా 48:​17) క్రమంగా బైబిలు చదవడాన్ని కూడా మన లక్ష్యంగా చేసుకోగలమా?

మన రోజులను విలువైనవిగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే లెక్కించలేనన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. వాటిలో ఒకటేమిటంటే, అది జీవితంలో సంతృప్తిగా ఉండేందుకూ ఒక ఉద్దేశాన్ని కలిగివుండేందుకూ దోహదపడుతుంది. హృదయపూర్వక ప్రార్థనలో యెహోవాతో క్రమంగా మాట్లాడడం ద్వారా మనం ఆయనకు దగ్గరవుతాం. మనం అలా ప్రార్థించడమే ఆయనపై మన నమ్మకాన్ని సూచిస్తుంది. బైబిలును, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” అందిస్తున్న బైబిలు ఆధారిత ప్రచురణలను ప్రతిరోజు చదివినప్పుడు మనం దేవుని మాటలను వినడానికి ఇష్టపడుతున్నామన్నది వ్యక్తమవుతుంది. (మత్తయి 24:​45-47) ఇది మనం జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, సరైన ఎంపికలు చేసుకోవడానికి అవసరమయ్యే జ్ఞానహృదయాన్ని సంపాందించుకునేందుకు సహాయపడుతుంది.​—⁠కీర్తన 1:​1-3.

యెహోవా ఆజ్ఞలను శిరసావహించడానికి మనమెంతో సంతోషిస్తాం, అలా చేయడం మనకు భారమేమీ కాదు. (1 యోహాను 5:⁠3) మనం ప్రతీ రోజును యెహోవా దృష్టిలో విలువైనదిగా చేసుకోవడం ద్వారా, ఆయనతో మన సంబంధాన్ని బలపరుచుకుంటాం. మన తోటి క్రైస్తవులకు మనం ఒక నిజమైన ఆధ్యాత్మిక మద్దతుగా కూడా అవుతాం. అలాంటి చర్యలు యెహోవా దేవుణ్ణి సంతోషపరుస్తాయి. (సామెతలు 27:​11) ఇప్పుడూ నిరంతరమూ యెహోవా ఆమోదాన్ని పొందడం కంటే గొప్ప ప్రతిఫలం మరేదీ లేదు!

[21వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు ఆధ్యాత్మిక విషయాలను చాలా గంభీరంగా తీసుకుంటారు

[22వ పేజీలోని చిత్రాలు]

మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా?

[23వ పేజీలోని చిత్రం]

మనం ప్రతీ రోజును యెహోవా దృష్టిలో విలువైనదిగా చేసుకోవడం ద్వారా ఆయనతో మన సంబంధాన్ని బలపరుచుకుంటాం