కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమాజంగా కూడడం మానకండి

సమాజంగా కూడడం మానకండి

సమాజంగా కూడడం మానకండి

“కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు . . . ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని లేఖనాలు చెబుతున్నాయి. (హెబ్రీయులు 10:​24, 25) ‘ప్రేమచూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవడానికి’ సత్యారాధకులు ఒక ఆరాధనాస్థలంలో సమకూడవలసిన అవసరం ఉందన్నది స్పష్టమవుతుంది.​—⁠హెబ్రీయులు 10:​24, 25.

మన సామాన్య శకంలోని మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు పైన ప్రస్తావించబడిన మాటలను వ్రాస్తున్నప్పుడు, యెరూషలేములోవున్న ఒక అద్భుతమైన ఆలయం యూదులకు ఆరాధనాస్థలంగా ఉండేది. సమాజమందిరాలు కూడా ఉండేవి. యేసు ‘యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను బోధించాడు.’​—⁠యోహాను 18:20.

ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి సమకూడి రమ్మని క్రైస్తవులకు ఉద్బోధించినప్పుడు పౌలు మనస్సులో ఏ విధమైన సమావేశ స్థలాలు ఉన్నాయి? క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన పెద్ద పెద్ద మతపరమైన భవనాలకు, యెరూషలేములోని ఆలయ ఏర్పాటులో ఏదైనా పూర్వనిదర్శనం ఉందా? క్రైస్తవులము అని చెప్పుకునే వారు ఆకర్షణీయమైన పెద్ద పెద్ద మతపరమైన భవనాలను ఉపయోగించడం ఎప్పుడు ప్రారంభించారు?

‘దేవుని నామమునకు మందిరము’

దేవుణ్ణి ఆరాధించడానికి ఒక స్థలం గురించిన తొలి నిర్దేశాలు బైబిలు పుస్తకమైన నిర్గమకాండములో ఉన్నాయి. యెహోవా దేవుడు తాను ఎంపిక చేసుకున్న ప్రజలకు​—⁠ఇశ్రాయేలీయులకు​—⁠“మందిరము” లేక “ప్రత్యక్షపు గుడారము” నిర్మించమని ఆదేశించాడు. నిబంధన మందసము, వివిధ పరిశుద్ధ ఉపకరణములు అక్కడ ఉంచబడాలి. సా.శ.పూ. 1512 లో మందిర నిర్మాణం పూర్తైనప్పుడు “యెహోవా తేజస్సు మందిరమును నింపెను.” మోసుకుని తీసుకువెళ్ళడానికి వీలైన ఆ గుడారము, తనను సమీపించడానికి దేవుడు చేసిన ఏర్పాటులో నాలుగు శతాబ్దాలకంటే ఎక్కువకాలం వరకూ ప్రధాన పాత్ర వహించింది. (నిర్గమకాండము 25-27 అధ్యాయాలు;40:33-38) బైబిలు ఈ గుడారమును “యెహోవా మందిరము,” “యెహోవా గృహము” అని కూడా పేర్కొంటుంది.​—⁠1 సమూయేలు 1:9, 24, NW.

తర్వాత, దావీదు యెరూషలేములో రాజుగా ఉన్నప్పుడు, యెహోవా మహిమ కోసం శాశ్వతమైన మందిరం నిర్మించాలని తనకున్న బలమైన కోరికను వ్యక్తం చేశాడు. అయితే, దావీదు ఎన్నో యుద్ధాలు చేసిన యుద్ధవీరుడు కాబట్టి యెహోవా అతనికి “నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు” అని చెప్పాడు. బదులుగా, ఆలయాన్ని నిర్మించడానికి దావీదు కుమారుడైన సొలొమోనును ఆయన ఎంపిక చేసుకున్నాడు. (1 దినవృత్తాంతములు 22:​6-10) ఏడున్నర సంవత్సరాల నిర్మాణ కాలం తర్వాత సా.శ.పూ. 1026 లో సొలొమోను ఆలయాన్ని ప్రతిష్ఠాపించాడు. “నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును” అని చెబుతూ యెహోవా ఆ మందిరాన్ని ఆమోదించాడు. (1 రాజులు 9:⁠3) ఇశ్రాయేలీయులు నమ్మకంగా ఉన్నంత కాలం, యెహోవా తన అనుగ్రహాన్ని ఆ మందిరంపై ఉంచుతాడు. అయితే, వారు సరైనది చేయడంనుండి వైదొలగిపోతే, యెహోవా ఆ స్థలం పైనుండి తన అనుగ్రహాన్ని తీసివేస్తాడు, ఆ “దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది.”​—⁠1 రాజులు 9:​4-9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; 2 దినవృత్తాంతములు 7:16, 19, 20.

కొంతకాలానికి ఇశ్రాయేలీయులు నిజంగానే సత్యారాధన నుండి వైదొలగిపోయారు. (2 రాజులు 21:​1-5) కాబట్టి “ఆయన [యెహోవా] వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు . . . దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చి వేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. . . . వారు అక్కడనే యుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.” బైబిలు ప్రకారం ఇది సా.శ.పూ. 607 లో జరిగింది.​—⁠2 దినవృత్తాంతములు 36:15-21; యిర్మీయా 52:12-14.

యెషయా ప్రవక్త ప్రవచించినట్లు, బబులోను అధికారం నుండి యూదులను విడిపించడానికి దేవుడు పర్షియా రాజైన కోరెషును ఉపయోగించుకున్నాడు. (యెషయా 45:⁠1) పరవాసంలో 70 సంవత్సరాలు గడిపిన తర్వాత, వారు ఆలయాన్ని తిరిగి కట్టడానికి సా.శ.పూ. 537వ సంవత్సరంలో యెరూషలేముకు తిరిగి వచ్చారు. (ఎజ్రా 1:1-6; 2:1, 2; యిర్మీయా 29:​10) నిర్మాణ పనిలో అంతరాయాలు కలిగి, చివరకు సా.శ.పూ. 515 లో ఆలయం పూర్తి చేయబడింది, దేవుని స్వచ్ఛారాధన తిరిగి ప్రారంభించబడింది. ఆ ఆలయం సొలొమోను కట్టించిన ఆలయం అంతటి మహిమాన్వితమైనది కాకపోయినా, ఆ నిర్మాణం 600 సంవత్సరాల వరకూ నిలిచింది. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనను అలక్ష్యం చేయడంతో ఈ ఆలయం కూడా పాడైపోయింది. యేసుక్రీస్తు భూమ్మీదకు వచ్చినప్పుడు, ఆలయం హేరోదు రాజు ద్వారా క్రమంగా పునర్నిర్మించబడే ప్రక్రియలో ఉంది. ఈ ఆలయానికి ఏమి సంభవించనైవుంది?

‘రాతిమీద రాయి ఒకటైనను నిలిచియుండదు’

యెరూషలేములోని ఆలయాన్ని సూచిస్తూ యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: ‘రాతిమీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడును.’ (మత్తయి 24:​1, 2) ఆ మాటలను నిజం చేస్తూ, శతాబ్దాలుగా దేవుని ఆరాధనకు కేంద్ర స్థానంగా గుర్తించబడిన ఆ స్థలం సా.శ. 70వ సంవత్సరంలో యూదుల తిరుగుబాటును అణచివేయడానికి వచ్చిన రోమన్‌ దళాల ద్వారా నాశనం చేయబడింది. * ఆ ఆలయం ఎన్నడూ తిరిగి నిర్మించబడలేదు. ఏడవ శతాబ్దంలో, ఆ స్థలంలో డోమ్‌ ఆఫ్‌ ద రాక్‌ అనబడే ముస్లిం ఆరాధన మందిరం నిర్మించబడింది, యూదుల మునుపటి ఆరాధనాస్థలంలో అది ఇప్పటికీ ఉంది.

యేసు అనుచరులకు ఆరాధనా ఏర్పాటు ఏమై ఉండబోతుంది? యూదామత నేపథ్యం నుండి వచ్చిన తొలి క్రైస్తవులు, త్వరలోనే నాశనం చేయబడే ఆలయంలో దేవుణ్ణి ఆరాధించడం కొనసాగిస్తారా? యూదేతర క్రైస్తవులు దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తారు? క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన మతపరమైన భవనాలు ఆలయానికి బదులుగా ఉపయోగించబడతాయా? యేసు ఒక సమరయ స్త్రీతో జరిపిన సంభాషణ, ఈ విషయంలో మనకు అవగాహనను ఇస్తుంది.

సమరయులు శతాబ్దాలుగా, సమరయలోవున్న గెరీజీము కొండపైగల పెద్ద ఆలయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ‘మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారు’ అని యేసుతో ఆ సమరయ స్త్రీ అన్నది. సమాధానం చెబుతూ యేసు ఇలా అన్నాడు: “అమ్మా ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము.” యెహోవా ఆరాధనలో ఒక అక్షరార్థమైన ఆలయం ఇక అవసరం ఉండదు, ఎందుకంటే యేసు ఇలా వివరించాడు: “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలె[ను].” (యోహాను 4:​20, 21, 24) ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు ఏథెన్సువాసులకు ఇలా చెప్పాడు: “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.”​—⁠అపొస్తలుల కార్యములు 17:24.

క్రైస్తవ పూర్వ శకానికి సంబంధించిన ఆలయ ఏర్పాటుకు, క్రైస్తవమత సామ్రాజ్యపు మతపరమైన భవనాలకు ఎటువంటి సంబంధం లేదన్నది స్పష్టం. మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఇటువంటి భవనాలను నిర్మించడానికి ఏ కారణమూ లేదు. అయితే, అపొస్తలులు మరణించిన తర్వాత, ముందే ప్రవచించబడినట్లు సత్య బోధల నుండి ప్రక్కకు మళ్ళడం అంటే మతభ్రష్టత్వం ప్రారంభమయ్యింది. (అపొస్తలుల కార్యములు 20:​29, 30) సా.శ. 313 లో రోమన్‌ చక్రవర్తి కాన్‌స్టన్‌టైన్‌ క్రైస్తవమతానికి మారాడని చెప్పబడుతున్న దానికి ఎన్నో సంవత్సరాల పూర్వమే, క్రైస్తవులము అని చెప్పుకునేవారు యేసు బోధించిన విషయాల నుండి ప్రక్కకు మళ్ళడం ప్రారంభించారు.

కాన్‌స్టన్‌టైన్‌ “క్రైస్తవత్వాన్ని” అన్యమతమైన రోమన్‌ మతంతో కలవడానికి మద్దతునిచ్చాడు. ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెబుతోంది: “కాన్‌స్టన్‌టైన్‌ తానే స్వయంగా రోమ్‌లో మూడు మహత్తరమైన క్రైస్తవ బాసిలికాల నిర్మాణానికి ఆదేశాలను ఇచ్చాడు: సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా, సెయింట్‌ పౌలో ఫ్యోరి లి మ్యూరా బాసిలికా, సెయింట్‌ గ్యోవాన్ని ఇన్‌ లాటెరాన్‌ బాసిలికా. ఆయన . . . సిలువ ఆకారంలో ఉండే భవన నిర్మాణపు ప్రణాళిక తయారుచేశాడు. మధ్య యుగాలన్నింటిలోనూ పశ్చిమ యూరప్‌లోని చర్చీలన్నింటికీ ఆ ప్రణాళికే ప్రమాణంగా తయారయ్యింది.” రోమ్‌లో పునర్నిర్మించబడిన సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా ఇప్పటికీ రోమన్‌ క్యాథలిక్‌ చర్చికి కేంద్ర స్థానంగా పరిగణించబడుతుంది.

“క్రైస్తవ పూర్వ [అన్యమత] రోమ్‌నుండి కొన్ని మతపరమైన ఆచారాలను, ఆరాధనా విధానాలను చర్చీ స్వీకరించింది” అని చరిత్రకారుడైన విల్‌ డ్యూరంట్‌ చెబుతున్నాడు. వీటిలో “బాసిలికా భవన నిర్మాణశైలి” కూడా చేరివుంది. 10వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకూ, చర్చీలు మరియు కెథడ్రిల్‌లను నిర్మించడం అధికమయ్యింది, వాటి నిర్మాణశైలికి ఎంతో అవధానం ఇవ్వబడేది. ప్రస్తుతం కళాత్మకమైన స్మారకచిహ్నాలుగా పరిగణించబడుతున్న క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన మతపరమైన భవనాలు అనేకం ఆ సమయంలోనే నిర్మించబడ్డాయి.

చర్చీలో ఆరాధించడం ద్వారా ప్రజలు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక నూతనోత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతారా? “నాకైతే, మతంలో అన్నింటికంటే ఎక్కువ విసుగు పుట్టించేది, అలసట కలిగించేది చర్చే. మాస్‌ అనేది నా నిజమైన అవసరాలను తీర్చడానికి ఏమీ చేయని ఒక అర్థరహితమైన, మళ్ళీ మళ్ళీ జరిగే లాంఛనం. మాస్‌ అయిపోయిందంటే హాయిగా ఉండేది” అని బ్రెజిల్‌కు చెందిన ఫ్రాన్సిస్కో అంటున్నాడు. అయితే, నిజమైన విశ్వాసులకు సమకూడమని ఆజ్ఞాపించబడింది. వారు కూడుకోవడానికి ఏ ఏర్పాటును అనుసరించాలి?

“వారి యింట ఉన్న సంఘము”

మొదటి శతాబ్దపు విశ్వాసులు ఎలా కూడుకునేవారో పరిశీలించడం ద్వారా, క్రైస్తవులు ఏ విధంగా సమకూడుకోవాలో తెలుస్తుంది. వారు సాధారణంగా వ్యక్తిగత గృహాలలో కూడుకొనేవారు అని లేఖనాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. . . . మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.” (రోమీయులు 16:3-5; కొలొస్సయులు 4:​14, 15; ఫిలేమోను 1, 2) సంఘం అనే పదానికి మూలపదమైన గ్రీకు పదాన్ని (ఎక్లీసియా) కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ వంటి కొన్ని ఆంగ్ల అనువాదాల్లో “చర్చీ” అని అనువదించడం జరిగింది. అయితే ఆ పదం ఒక భవనాన్ని కాదు కానీ ఒకే సంకల్పం కోసం సమకూడుకున్న ప్రజల గుంపును సూచిస్తుంది. (అపొస్తలుల కార్యములు 8:1; 13:⁠1) నిజక్రైస్తవులు చేసే ఆరాధనకు ఆడంబరంగా అలంకరించబడిన మతపరమైన భవనాలు అవసరం లేదు.

తొలి క్రైస్తవ సంఘాలలో కూటాలు ఎలా నిర్వహించబడేవి? శిష్యుడైన యాకోబు క్రైస్తవ కూటాన్ని సూచించడానికి, సినగోగిన్‌ (సమాజమందిరం) అనే గ్రీకు పదబంధాన్ని ఉపయోగించాడు. (యాకోబు 2:⁠2) ఈ గ్రీకు పదానికి “దగ్గరకు తీసుకురావడం” అని అర్థం, ఈ పదం ఎక్లీసియా అనే పదానికి మారుగా కూడా ఉపయోగించబడుతుంది. అయితే, కాలక్రమేణా “సమాజమందిరము” అనే పదం సమావేశం నిర్వహించబడే స్థలం లేదా భవనం అన్న అర్థాన్ని సంతరించుకుంది. తొలి యూదా క్రైస్తవులకు సమాజమందిరంలో ఏమి జరిగేదో తెలుసు. *

యూదులు తమ వార్షిక పండుగల కోసం యెరూషలేములోని ఆలయంలో సమకూడేవారు, సమాజమందిరాలు యెహోవా గురించి నేర్చుకోవడానికీ ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవడానికీ స్థానిక ప్రదేశాలుగా ఉపయోగపడేవి. సమాజమందిరాలలో ప్రార్థన చేయడం, లేఖనాలను చదవడం, లేఖనాలను గురించిన వివరమైన చర్చలు జరపడం, ఉపదేశించడం ఉండేవి. పౌలు, అతనితో ఉన్న ఇతరులు అంతియొకయలోని సమాజమందిరానికి వెళ్ళినప్పుడు, “సమాజమందిరపు అధికారులు—సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.” (అపొస్తలుల కార్యములు 13:​15) తొలి యూదా క్రైస్తవులు వ్యక్తిగత గృహాలలో సమకూడినప్పుడు, తమ కూటాలను లేఖనానుసారంగా ఉపదేశాత్మకమైనవిగానూ ఆధ్యాత్మికంగా ప్రోత్సాహకరమైనవిగానూ చేస్తూ నిస్సందేహంగా అదే విధానాన్ని అనుకరించి ఉంటారు.

ప్రోత్సహించడానికి సంఘాలు

తొలి క్రైస్తవులలాగే, నేడు యెహోవాసాక్షులు బైబిలు నుండి ఉపదేశం పొందడానికీ ఆరోగ్యకరమైన సహవాసాన్ని ఆనందించడానికీ నిరాడంబరమైన ఆరాధనాస్థలాలలో కూడుకుంటారు. ఎన్నో సంవత్సరాల వరకూ వారు కేవలం వ్యక్తిగత గృహాలలోనే కలుసుకున్నారు, ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అలాగే చేస్తున్నారు. కానీ ఇప్పుడు 90,000 కంటే ఎక్కువ సంఘాలు తయారయ్యాయి, వారు ప్రధానంగా కూడుకునే స్థలాలను రాజ్య మందిరాలు అని పిలుస్తారు. ఈ భవనాలు ఆడంబరంగా ఉండవు, చూడడానికి చర్చీల్లా ఉండవు. ఈ భవనాలు, 100 నుండి 200 మంది ప్రజలున్న సంఘాలు దేవుని వాక్యాన్ని వినడానికీ దానినుండి నేర్చుకోవడానికీ వారపు కూటాలకు హాజరవ్వడాన్ని సాధ్యపరిచే ఆచరణాత్మకమైన నిరాడంబరమైన భవనాలు.

యెహోవాసాక్షుల సంఘాల్లో చాలామట్టుకు వారానికి మూడు సార్లు కలుసుకుంటాయి. ఒక కూటం ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయంపై బహిరంగ ప్రసంగం. దాని తర్వాత కావలికోట పత్రికను ఆధారం చేసుకుని ఒక బైబిలు అంశాన్ని లేదా ప్రవచనాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. బైబిలు సందేశాన్ని అందించడంలో శిక్షణనివ్వడానికి తయారుచేయబడిన పాఠశాల మరో కూటం. దాని తర్వాత, క్రైస్తవ పరిచర్య కోసం ఆచరణాత్మకమైన సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా కేటాయించబడిన కూటం జరుగుతుంది. వారానికి ఒకసారి, సాక్షులు బైబిలు అధ్యయనం కోసం చిన్న గుంపులుగా వ్యక్తిగత గృహాలలో కలుసుకుంటారు. ఈ కూటాలన్నింటికీ ప్రజలందరూ హాజరవ్వవచ్చు. చందాలు ఎన్నడూ వసూలు చేయబడవు.

ముందు ప్రస్తావించబడిన ఫ్రాన్సిస్కో, రాజ్య మందిరంలోని కూటాలు అత్యంత ప్రయోజనకరమైనవని తెలుసుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను సందర్శించిన మొదటి స్థలం, నగరానికి కేంద్ర స్థానంలో ఉన్న సౌకర్యవంతమైన భవనం. నేను ఒక అనుకూలమైన అభిప్రాయంతో ఆ హాలు నుండి బయటకు వచ్చాను. హాజరైనవారు స్నేహపూర్వకంగా ఉన్నారు, నేను వారి మధ్యవున్న ప్రేమను గ్రహించగలిగాను. నేను మళ్ళీ ఆ హాలుకు వెళ్ళడానికి ఆత్రుతగా ఎదురుచూశాను. నిజానికి, అప్పటినుండి నేను ఒక్క కూటం కూడా మిస్సవ్వలేదు. ఈ క్రైస్తవ కూటాలు ఆసక్తికరంగా ఉంటాయి, అవి నా ఆధ్యాత్మిక అవసరాన్ని తీరుస్తాయి. నేను ఏదో ఒక కారణాన నిరుత్సాహంగా ఉన్నప్పటికీ, తప్పకుండా నేను ప్రోత్సహించబడతాను అనే నమ్మకంతో రాజ్య మందిరానికి వెళతాను”

బైబిలు విద్య, ప్రోత్సాహకరమైన సహవాసం, దేవుణ్ణి స్తుతించే అవకాశం, ఇవన్నీ యెహోవాసాక్షుల క్రైస్తవ కూటాలలో మీ కోసం వేచివున్నాయి. మీ ఇంటికి దగ్గర్లో ఉన్న రాజ్య మందిరానికి హాజరవ్వమని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. హాజరైనందుకు మీరు తప్పక సంతోషిస్తారు.

[అధస్సూచీలు]

^ పేరా 11 ఆలయాన్ని రోమన్‌లు పూర్తిగా నాశనం చేశారు. యూదులు ఎంతో దూరంనుండి ప్రార్థించడానికి వచ్చే వేయిలింగ్‌ గోడ, ఆ ఆలయంలో భాగం కాదు. అది కేవలం ఆలయ ఆవరణ గోడలో ఒక భాగం.

^ పేరా 20 70 సంవత్సరాలు బబులోనులో పరవాసులుగా ఉన్న కాలంలో ఆలయం లేనప్పుడు లేదా పరవాసం నుండి తిరిగి వచ్చిన వెంటనే ఆలయం పునర్నిర్మించబడుతుండగా సమాజమందిరాలు స్థాపించబడ్డాయి అనడానికి అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మొదటి శతాబ్దానికల్లా, పాలస్తీనాలోని ప్రతి పట్టణానికి ఒక సమాజమందిరం ఉండేది, పెద్ద నగరాలలో ఒకటి కన్నా ఎక్కువ సమాజమందిరాలు ఉండేవి.

[4, 5వ పేజీలోని చిత్రాలు]

గుడారము, ఆ తర్వాత మందిరాలు, యెహోవా ఆరాధనకు చక్కని కేంద్ర స్థానాలుగా ఉపయోగపడ్డాయి

[6వ పేజీలోని చిత్రం]

రోములోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా

[7వ పేజీలోని చిత్రం]

తొలి క్రైస్తవులు వ్యక్తిగత గృహాలలో సమకూడేవారు

[8, 9వ పేజీలోని చిత్రాలు]

యెహోవాసాక్షులు వ్యక్తిగత గృహాలలో, రాజ్య మందిరాలలో క్రైస్తవ కూటాలను జరుపుకొంటారు