కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక మిషనరీ నియామకం మా గృహంగా మారింది

ఒక మిషనరీ నియామకం మా గృహంగా మారింది

జీ వి త క థ

ఒక మిషనరీ నియామకం మా గృహంగా మారింది

డిక్‌ వాల్డ్రన్‌ చెప్పినది

అది 1953వ సంవత్సరం సెప్టెంబరు నెలలో ఒక ఆదివారం మధ్యాహ్నం. మేము ఆ మధ్యనే ఆగ్నేయ ఆఫ్రికాకు (ప్రస్తుతం నమీబియా) వచ్చాము. మేము వచ్చి దాదాపు వారం రోజులు అయ్యింది, రాజధానియైన విండ్‌హోక్‌లో ఒక బహిరంగ కూటాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆస్ట్రేలియా నుండి ఈ ఆఫ్రికా దేశానికి రావడానికి మమ్మల్ని కదిలించిందేమిటి? ముగ్గురు యువతులతోపాటు నా భార్యా నేను దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి మిషనరీలుగా ఈ దేశానికి వచ్చాము.​—⁠మత్తయి 24:14.

నాజీవితం, భూమ్మీద ఎంతో దూరానవున్న ఆస్ట్రేలియాలో, గమనార్హమైన 1914వ సంవత్సరంలో మొదలయ్యింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభ కాలంలో యౌవనస్థుడిగా ఉన్న నేను, నా కుటుంబాన్ని పోషించడంలో నా వంతు నేను చేయవలసి వచ్చింది. అప్పట్లో ఉద్యోగాలు లేవు, కానీ ఆస్ట్రేలియాలో ఎక్కువగా దొరికే అడవి కుందేళ్ళను పట్టుకోవడానికి నేను ఒక పద్ధతి కనిపెట్టాను. కాబట్టి, కుటుంబానికి కావలసిన ఆహారం కోసం ప్రాముఖ్యంగా నేను సమకూర్చేదాంట్లో కుందేలు మాంసం ఎప్పుడూ ఉండేది.

1939వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి నేను మెల్‌బోర్న్‌ నగరంలో స్ట్రీట్‌కార్లలో, బస్సులలో పనిచేసే ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాను. బస్సులలో దాదాపు 700 మంది షిఫ్టు పద్ధతిలో పనిచేసేవారు. ప్రతీ షిఫ్టులో నేను ఒక క్రొత్త డ్రైవర్‌ను లేక కండక్టర్‌ను కలిసేవాడిని. “మీది ఏ మతం?” అని నేను తరచుగా వారిని అడిగేవాడిని, వారి నమ్మకాలను వివరించమనేవాడిని. నాకు సంతృప్తికరమైన సమాధానాలను ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఒక యెహోవాసాక్షి. దేవునికి భయపడే మనుష్యులు నిరంతరం జీవించబోయే పరదైసు భూమిని గురించిన బైబిలు ఆధారిత సందేశాన్ని ఆయన నాకు వివరించాడు.​—⁠కీర్తన 37:29.

అదేసమయంలో, మా అమ్మ కూడా యెహోవాసాక్షులను కలిసింది. నేను లేట్‌ షిఫ్టు చేసి ఇంటికి వచ్చేసరికి, నా భోజనంతోపాటు కన్సొలేషన్‌ పత్రిక (ఇప్పుడు తేజరిల్లు! అని పిలువబడుతోంది) నా కోసం వేచి ఉండేది. నేను చదివింది నాకు ఆసక్తికరంగా అనిపించేది. కొంతకాలం గడిచిన తర్వాత, ఇదే నిజమైన మతం అన్న ముగింపుకు వచ్చిన నేను సంఘంతో చురుకుగా సహవసించడం ప్రారంభించి 1940వ సంవత్సరం మే నెలలో బాప్తిస్మం తీసుకున్నాను.

మెల్‌బోర్న్‌లో ఒక పయినీరు గృహం ఉండేది. ఆ గృహంలో దాదాపు 25 మంది యెహోవాసాక్షుల పూర్తికాల సేవకులు ఉండేవారు. నేను వారితో కలిసి నివసించడం ప్రారంభించాను. ప్రకటనా పనిలో వారికి ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలను ప్రతిరోజు వినడం వల్ల, నేను కూడా పయినీరు అవ్వాలన్న కోరికను నా హృదయంలో పెంపొందించుకున్నాను. చివరికి, నేను పయినీరు సేవ కోసం దరఖాస్తు నింపాను. నా దరఖాస్తును స్వీకరించి, ఆస్ట్రేలియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవచేయడానికి నన్ను పిలిచారు. అలా నేను బేతేలు కుటుంబ సభ్యుడినయ్యాను.

ఖైదు, నిషేధం

బేతేలులో నా నియామకాలలో ఒకటి, రంపపుమరను నడిపించడం. ఇంధనం కోసం బొగ్గును తయారుచేయడానికి మేము కలపను కోసేవాళ్ళము. బ్రాంచిలో వాహనాల కోసం ఈ ఇంధనం ఉపయోగించబడేది ఎందుకంటే యుద్ధం కారణంగా కొనడానికి ఎక్కువ పెట్రోల్‌ లభించేది కాదు. రంపపుమరలో మొత్తం కలిపి 12 మందిమి పనిచేసేవాళ్ళము. చట్టరీత్యా మేమందరమూ సైన్యంలో చేరవలసిన బాధ్యత మాపై ఉంది. ఎంతోకాలం గడవకముందే, సైన్యంలో చేరడానికి బైబిలు ఆధారితంగా నిరాకరించినందుకు మాకు ఆరునెలల జైలు శిక్ష విధించబడింది. (యెషయా 2:⁠4) మమ్మల్ని లేబర్‌ క్యాంపుకు పంపించారు. వారు మాకు ఏ పని ఇచ్చారు? ఆశ్చర్యకరంగా, మేము బేతేలులో ఏ పని కోసమైతే శిక్షణపొందామో అదే పనిని అంటే కలపను కోసే పనినే మాకిచ్చారు!

కలప కోసే పనిని మేము ఎంత బాగా చేశామంటే చెరసాల గవర్నర్‌ మాకు బైబిలునూ మా బైబిలు ఆధారిత సాహిత్యాన్నీ ఇచ్చాడు. మాకు అలాంటివి ఇవ్వకూడదు అని ఖచ్చితమైన ఆజ్ఞలు ఉన్నప్పటికీ ఆయన మాకిచ్చాడు. ఆ సమయంలోనే నేను మానవ సంబంధాల విషయంలో ఒక ఉపయోగకరమైన పాఠాన్ని నేర్చుకున్నాను. నేను బేతేలులో సేవచేస్తుండగా, ఒక సహోదరునితో నేను అస్సలు సర్దుకోలేకపోయేవాణ్ణి. మా వ్యక్తిత్వాలు పూర్తి భిన్నంగా ఉండేవి. అయితే, జైలుగదిలో నాతోపాటు ఎవరిని ఉంచారని మీరనుకుంటున్నారు? అవును, ఆ సహోదరుణ్ణే. అప్పుడు మేము ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి మాకు చాలా సమయం ఉండేది. ఫలితంగా మేము ఇద్దరం సన్నిహితమైన, ఎప్పటికీ నిలిచిపోయే స్నేహబంధాన్ని పెంపొందించుకున్నాము.

కొద్దికాలం తర్వాత, ఆస్ట్రేలియాలో యెహోవాసాక్షుల పని నిషేధించబడింది. డబ్బంతా స్వాధీనం చేసుకోబడింది, అయితే బేతేలు సహోదరుల వద్ద కేవలం కొంత డబ్బు మాత్రం మిగిలింది. ఒక సందర్భంలో ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: “డిక్‌, నేను పట్టణానికి వెళ్ళి ప్రకటనా పని చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర సరైన బూట్లు లేవు కేవలం పనికివేసుకునే బూట్లు మాత్రమే ఉన్నాయి.” నేను ఆయనకు సహాయం చేయడానికి సంతోషించాను, ఆయన నా బూట్లు వేసుకొని పట్టణానికి వెళ్ళాడు.

తర్వాత, ప్రకటనా పని చేసినందుకు ఆయనను అరెస్టు చేసి చెరసాలలో వేశారన్న వార్త మాకు అందింది. ఆయనకు ఈ చిన్న ఉత్తరం వ్రాయకుండా ఉండలేకపోయాను: “నీకు జరిగిన విషయానికి నేను చింతిస్తున్నాను. నేను నా బూట్లలో లేనందుకు సంతోషిస్తున్నాను.” కానీ త్వరలోనే, నా తటస్థ స్థానాన్ని బట్టి నేను రెండవసారి అరెస్టు చేయబడి చెరసాలలో వేయబడ్డాను. నన్ను విడుదల చేసిన తర్వాత, బేతేలు కుటుంబానికి ఆహారాన్ని సరఫరా చేసే ఫామ్‌ను చూసుకోవడానికి నేను నియమించబడ్డాను. అప్పటికి, మేము కోర్టులో విజయం సాధించాము, యెహోవాసాక్షుల కార్యకలాపాలపై విధించబడిన నిషేధం తీసివేయబడింది.

ఆసక్తిగల సువార్తికురాలితో వివాహం

నేను ఫామ్‌ వద్ద ఉండగా, వివాహం గురించి గంభీరంగా ఆలోచించడం ప్రారంభించాను. యువ పయినీరు సహోదరి అయిన కెరోలీ క్లొగన్‌ను ఇష్టపడ్డాను. కెరోలీ అమ్మమ్మ, వాళ్ళ కుటుంబంలో బైబిలు సందేశం పట్ల ఆసక్తి చూపించిన మొదటి వ్యక్తి. ఆమె చనిపోయే ముందు, కెరోలీ వాళ్ళ అమ్మ వెరాతో ఇలా చెప్పింది: “నీ పిల్లలు దేవుణ్ణి ప్రేమించి ఆయనను సేవించే విధంగా వారిని పెంచు. ఏదో ఒక రోజు మనందరం పరదైసు భూమిపై కలుసుకుంటాము.” ఆ తర్వాత, ఒక పయినీరు సహోదరుడు వెరా ఇంటికి వచ్చి ఇప్పుడు జీవిస్తున్న లక్షలాది మంది మరెన్నడూ మరణించరు (ఆంగ్లం) అనే పత్రికను ఇచ్చినప్పుడు, వెరాకు వాళ్ళ అమ్మ చెప్పిన మాటల భావం అర్థమయ్యింది. మానవజాతి పరదైసు భూమిపై జీవితాన్ని అనుభవించాలన్నది దేవుని సంకల్పమని ఆ చిన్న పుస్తకం వెరాను ఒప్పించింది. (ప్రకటన 21:⁠4) ఆమె 1930ల తొలికాలంలో బాప్తిస్మం తీసుకుంది. తన తల్లి తనను ప్రోత్సహించినట్లుగానే ఆమె తన ముగ్గురు కుమార్తెలకు​—⁠లూసీ, జీన్‌, కెరోలీ​—⁠దేవుని పట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి సహాయపడింది. అయితే, కుటుంబాల్లో ఏమి సంభవించగలదని యేసు హెచ్చరించాడో సరిగ్గా అలాగే కెరోలీ తండ్రి తన కుటుంబపు మత ఆసక్తులను తీవ్రంగా వ్యతిరేకించాడు.​—⁠మత్తయి 10:34-36.

క్లొగన్‌ కుటుంబం సంగీతకళ గల కుటుంబం; పిల్లల్లో ప్రతి ఒక్కరూ ఒక సంగీత వాయిద్యాన్ని వాయించేవారు. కెరోలీ వయొలిన్‌ వాయించేది, 1939వ సంవత్సరంలో 15 సంవత్సరాల వయసున్నప్పుడు, ఆమెకు సంగీతంలో డిప్లొమా బహూకరించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవ్వడం, కెరోలీ తన భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆమె తన జీవితంలో ఏమి చేయాలనేది నిర్ణయించుకోవలసిన సమయం వచ్చింది. ఒకవైపు, సంగీత ప్రపంచంలో తాను ఒక కెరియర్‌ను సంపాదించుకోగల అవకాశం ఉంది. అప్పటికే, మెల్‌బోర్న్‌ సింఫొనీ ఆర్కెస్ట్రాలో వాయించమని ఆమెకు ఆహ్వానం వచ్చింది. మరోవైపు, రాజ్య సందేశాన్ని ప్రకటించే అద్భుతమైన పనికి తన సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది. కొద్ది సమయంపాటు గంభీరంగా ఆలోచించిన తర్వాత, కెరోలీ, ఆమె ఇద్దరు సహోదరీలు 1940వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకుని, పూర్తికాల సువార్త ప్రకటనా పనిని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

కెరోలీ పూర్తికాల సేవ గురించి నిర్ణయించుకున్న కొద్దికాలానికే ఆస్ట్రేలియా బ్రాంచి నుండి వచ్చిన బాధ్యతాయుతుడైన సహోదరుడు లాయిడ్‌ బ్యారీ​—⁠ఈయన తర్వాత యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యునిగా సేవచేశాడు​—⁠ఆమెను కలిశాడు. ఆయన అంతకుముందే మెల్‌బోర్న్‌లో ఒక ప్రసంగం ఇచ్చాడు. ఆయన కెరోలీతో ఇలా అన్నాడు: “నేను బేతేలుకు తిరిగి వెళుతున్నాను. నువ్వు నాతోపాటు ట్రెయిన్‌లో వచ్చి బేతేలు కుటుంబంలో చేరవచ్చు కదా?” కెరోలీ ఇష్టపూర్వకంగా ఆ ఆహ్వానాన్ని స్వీకరించింది.

యుద్ధం జరుగుతున్న సంవత్సరాలలో నిషేధం విధించబడినప్పుడు, ఆస్ట్రేలియాలోని సహోదరులకు బైబిలు ప్రచురణలను సరఫరా చేయడంలో కెరోలీతోపాటు బేతేలు కుటుంబంలోవున్న ఇతర సహోదరీలు ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు. నిజానికి, సహోదరుడు మాల్కమ్‌ వేల్‌ పర్యవేక్షణ క్రింద ప్రచురించే పనిలో అధికశాతం వారే చేసేవారు. నూతన లోకం (ఆంగ్లం), పిల్లలు (ఆంగ్లం) పుస్తకాలు ప్రచురించబడి బౌండ్‌ చేయబడేవి. నిషేధంవున్న రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో కావలికోట పత్రిక యొక్క ఒక్క సంచిక కూడా ప్రచురించబడకుండా లేదు.

పోలీసులనుండి తప్పించుకోవడానికి ప్రింటరీని 15 సార్లు మార్చవలసి వచ్చింది. ఒక స్థలంలో, పైకి వేరే ప్రచురణలు ప్రచురించబడుతున్నట్లుగా కనపడేటట్లు చేసి బిల్డింగ్‌ బేస్‌మెంట్‌లో బైబిలు ప్రచురణలు ప్రచురించబడేవి. ఏదైనా ప్రమాదం సంభవించబోతుందంటే, రిసెప్షన్‌లో కూర్చున్న సహోదరి, క్రింద బేస్‌మెంట్‌లో వినిపించేలా ఒక బెల్‌ నొక్కేది. ఎవరైనా తనిఖీ చేయడం ప్రారంభించే లోపలే సహోదరీలు బైబిలు ప్రచురణలను దాచిపెట్టేసేవారు.

అలా ఒకసారి తనిఖీ చేస్తున్నప్పుడు, ఒక టేబుల్‌ మీద అందరికీ కనబడేటట్లు ఒక కావలికోట పత్రిక ఉందని చూసిన కొంతమంది సహోదరీలు భయపడిపోయారు. పోలీసు లోపలికి వచ్చి, తన బ్రీఫ్‌కేస్‌ను సరిగ్గా కావలికోట పత్రికపై పెట్టి వెదకడం ప్రారంభించాడు. అక్కడ ఏమీ కనపడకపోయేసరికి ఆయన తన బ్రీఫ్‌కేస్‌ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు!

నిషేధం ఎత్తివేయబడి, బ్రాంచి డబ్బు సహోదరులకు తిరిగి ఇచ్చివేయబడిన తర్వాత, సహోదరులలో చాలామందికి ప్రత్యేక పయినీర్లుగా క్షేత్రంలో సేవచేసే అవకాశం ఇవ్వబడింది. ఆ సమయంలోనే కెరోలీ గ్లెన్‌ ఇన్నెస్‌కు వెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. 1948వ సంవత్సరం జనవరి 1వ తేదీన మా వివాహం జరిగిన తర్వాత నేను కూడా ఆమెతోపాటు అక్కడే సేవచేయడం ప్రారంభించాను. మేము ఆ నియామకాన్ని వదిలిపెట్టే సమయానికి, అక్కడ అభివృద్ధి సాధిస్తున్న సంఘం స్థాపించబడింది.

మా తర్వాతి నియామకం, రాక్‌హాంప్టన్‌. అయితే అక్కడ ఉండడానికి మాకు వసతి దొరకలేదు. కాబట్టి, ఆసక్తిగల ఒక వ్యక్తి పొలంలో మేము ఒక టెంట్‌ వేసుకున్నాము. తర్వాతి తొమ్మిది నెలల వరకూ ఆ టెంటే మా గృహం. మేము ఇంకా ఎక్కువకాలం ఆ టెంట్‌లో జీవించేవాళ్ళమేమో, కానీ వర్షాకాలం వచ్చినప్పుడు భయంకరమైన తుఫాను ఆ టెంట్‌ను నాశనం చేసింది, వర్షం నీళ్ళలో ఆ టెంట్‌ కొట్టుకుని పోయింది. *

విదేశీ నియామకానికి మారడం

మేము రాక్‌హాంప్టన్‌లో ఉన్నప్పుడు, మిషనరీ శిక్షణ కోసమైన వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు సంబంధించిన 19వ తరగతికి హాజరవ్వమన్న ఆహ్వానాన్ని మేము అందుకున్నాము. 1952వ సంవత్సరంలో గ్రాడ్యుయేషన్‌ తర్వాత, అప్పట్లో ఆగ్నేయ ఆఫ్రికా అని పిలువబడిన స్థలానికి మేము పంపించబడ్డాము.

క్రైస్తవమత సామ్రాజ్యపు ప్రీస్టులు తాము మా మిషనరీ పని గురించి ఎలా భావిస్తున్నారన్నది మాకు వెంటనే చూపించారు. వరుసగా ఆరు వారాలపాటు ప్రతీ ఆదివారం రోజున, వారు తమ సంఘాలలో బోధల ద్వారా మాకు వ్యతిరేకంగా హెచ్చరించారు. మేము వచ్చినప్పుడు తలుపులు తెరవవద్దని, వారు తమ ప్రజలకు చెప్పారు. మేము బైబిలు చదివి వినిపించడం వారిని తికమక పెడుతుంది కాబట్టి చదవనివ్వవద్దని వారికి చెప్పారు. ఒక ప్రాంతంలో, మేము అనేక ప్రచురణలను అందించాము, కానీ అక్కడి ప్రీస్టు మా వెనుకే ఇంటింటికీ వెళ్ళి వాటిని తీసేసుకున్నాడు. ఒకరోజు మేము ఆ ప్రీస్టు ఇంటిలోని రీడింగ్‌ రూమ్‌లో అతనితో చర్చిస్తున్నప్పుడు, ఆయన దగ్గర మన ప్రచురణలు ఎన్నో ఉండడాన్ని చూశాము.

తర్వాత, స్థానిక అధికారులు కూడా మా కార్యకలాపాల విషయంలో ఆసక్తి చూపడం ప్రారంభించారు. నిస్సందేహంగా ప్రీస్టుల ప్రేరేపణతోనే వారు మాకు కమ్యూనిస్టు సంబంధాలు ఉండగలవని అనుమానించారు. కాబట్టి మా వేలిముద్రలు తీసుకోబడ్డాయి, మేము సందర్శించిన కొంతమంది ప్రజలను ప్రశ్నించడం జరిగింది. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, మా కూటాలకు హాజరయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండేది.

మేము ఆ ప్రాంతంలో నివసించడం ప్రారంభించినప్పటినుండీ, స్థానికంగా ఉన్న ఒవాంబో, హెరేరో, నామా జాతుల ప్రజలకు బైబిలు సందేశాన్ని విస్తరింపజేయాలన్న తీవ్రమైన కోరికను పెంపొందించుకున్నాము. అయితే, అది అంత సులభం కాదు. ఆ రోజుల్లో, ఆగ్నేయ ఆఫ్రికా, జాతి వెలి విధానాన్ని పాటించే దక్షిణాఫ్రికా ప్రభుత్వపు పరిపాలన క్రింద ఉండేది. మేము తెల్లవాళ్ళం కాబట్టి, ప్రభుత్వం అనుమతి లేకుండా నల్లవాళ్ళు జీవించే ప్రాంతాలలో సాక్ష్యమివ్వడానికి అనుమతించబడలేదు. మేము అనుమతి కోసం అనేకసార్లు దరఖాస్తు పెట్టాము కానీ అధికారులు ప్రతీసారి మాకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు.

మా విదేశీ నియామకంలో రెండు సంవత్సరాలు గడిచిన తరువాత, ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. కెరోలీ గర్భవతి అయ్యింది. అక్టోబరు 1955 లో మా కుమార్తె చార్లెట్‌ జన్మించింది. మేము ఇక మిషనరీలుగా కొనసాగలేకపోయినప్పటికీ, నేను పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ఒకటి సంపాదించుకుని కొంతకాలం వరకూ పయినీరుగా కొనసాగగలిగాను.

మా ప్రార్థనలకు సమాధానం

1960వ సంవత్సరంలో మేము మరో సవాలును ఎదుర్కొన్నాము. కెరోలీకి ఇంటినుండి ఒక ఉత్తరం వచ్చింది. తన తల్లికి ఏ మాత్రం వంట్లో బాగోలేదనీ, తను ఇంటికి రాలేకపోతే తన తల్లిని చూసే మరో అవకాశం ఉండకపోవచ్చనీ ఆ ఉత్తరంలో ఉంది. కాబట్టి మేము ఆగ్నేయ ఆఫ్రికాను వదిలి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము. అప్పుడు ఒక సంఘటన జరిగింది​—⁠మేము వెళ్ళిపోవలసిన వారంలోనే, నల్లవాళ్ళు ఉండే ఒక పట్టణమైన కాటుటూరాకు వెళ్ళడానికి అనుమతిస్తూ స్థానిక అధికారుల నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఇప్పుడు మేము ఏమి చేయాలి? ఆ అనుమతిని సాధించడానికి ఏడు సంవత్సరాలు కష్టపడిన తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేయాలా? మేము ప్రారంభించిన పనిని ఇతరులు కొనసాగిస్తారు అని తర్కించడం సులభంగానే ఉండేది. కానీ ఇది మా ప్రార్థనలకు సమాధానమిస్తూ యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం కాదా?

నేను వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను. మేమందరం ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతే, ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి మేము పడిన శ్రమంతా వృధా అయిపోతుందన్న భయంతో నేను ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాతి రోజు, నేను నా ఓడ బుకింగ్‌ను కాన్సిల్‌ చేసుకుని, కెరోలీనూ చార్లెట్‌నూ దీర్ఘకాల సెలవు తీసుకోమని ఆస్ట్రేలియాకు పంపించేశాను.

వారు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయిన తర్వాత, నేను ఆ నల్లజాతివారి పట్టణంలోని నివాసులకు సాక్ష్యమివ్వడం ప్రారంభించాను. వారు చూపిన ఆసక్తి మహత్తరమైనది. కెరోలీ మరియు చార్లెట్‌ తిరిగి వచ్చేసరికి నల్లజాతివారి పట్టణం నుండి అనేకమంది కూటాలకు హాజరవుతున్నారు.

ఈ సమయానికి, నా వద్ద ఒక పాత కారు ఉండేది, దానిలో నేను ఆసక్తిగల వారిని కూటాలకు తీసుకురాగలిగేవాడిని. నేను ప్రతి కూటానికి నాలుగు లేదా అయిదు ట్రిప్పులు చేసేవాడిని. ప్రతీ ట్రిప్పుకు ఏడు, ఎనిమిది లేక తొమ్మిది మందిని తీసుకువచ్చేవాడిని. కారులోంచి చివరి వ్యక్తి దిగిపోయిన తర్వాత, కెరోలీ తమాషాకు “సీటు క్రింద ఇంకెంత మంది ఉన్నారు?” అనేది.

ప్రకటనా పనిలో మరింత ప్రభావవంతంగా ఉండడానికి, నల్లజాతివారికి తమ సొంత భాషలో సాహిత్యం అవసరమయ్యింది. కాబట్టి, నూతనలోకంలో జీవితము అనే కరపత్రం హెరేరో, నామా, డోంగా, క్వనియామా అనే నాలుగు స్థానిక భాషలలోకి అనువదించబడేలా ఏర్పాటు చేసే ఆధిక్యత నాకు లభించింది. ఆ కరపత్రాన్ని అనువదించినవారు, మేము బైబిలు అధ్యయనం చేస్తున్న విద్యావంతులైన వారే. కానీ, ప్రతి వాక్యం సరిగ్గా అనువదించబడిందని నిశ్చయపర్చుకోవడానికి నేను వారితో కూర్చోవలసి వచ్చేది. నామా భాషలో పరిమితమైన పదజాలం మాత్రమే ఉండేది. ఉదాహరణకు, “మొదట్లో ఆదాము పరిపూర్ణమైన మానవుడు” అన్న విషయాన్ని వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అనువాదకుడు తన తల గోక్కుని “పరిపూర్ణుడు” అన్న పదాన్ని నామా భాషలో ఏమంటారో తనకు గుర్తురావడం లేదు అన్నాడు. చివరికి, “ఆ గుర్తు వచ్చింది, మొదట్లో ఆదాము పండిన అత్తిపండులా ఉండేవాడు” అని ఆయన అన్నాడు.

మేము నియమించబడిన దేశంలో సంతృప్తిగా ఉన్నాము

ప్రస్తుతం నమీబియా అని పిలువబడుతున్న ఈ దేశానికి మేము వచ్చి దాదాపు 49 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నల్లజాతివారి నివాస స్థలాలలోకి ప్రవేశించడానికి అనుమతి తీసుకోనవసరం లేదు. ఇప్పుడు నమీబియాను, జాతివిభేదాలు లేని రాజ్యాంగం మీద ఆధారపడిన క్రొత్త ప్రభుత్వం పరిపాలిస్తోంది. నేడు, విండ్‌హోక్‌లో, సౌకర్యవంతమైన రాజ్యమందిరాలలో సమకూడే నాలుగు పెద్ద సంఘాలు ఉన్నాయి.

మేము గిలియడ్‌లో విన్న ఈ మాటల గురించి తరచూ ఆలోచించేవాళ్ళము: “మీ విదేశీ నియామకాన్ని మీ గృహంగా మార్చుకోండి.” యెహోవా దేవుడు తన చిత్తప్రకారం అన్ని విషయాలను మలచిన తీరు చూస్తుంటే, ఈ విదేశం మా గృహం కావాలన్నది ఆయన చిత్తమే అని మాకు నమ్మకం కలుగుతుంది. ఆసక్తికరమైన విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన సహోదరులను మేము ప్రేమిస్తున్నాము. వారి ఆనందాలలో వారితోపాటు నవ్వాము, వారి దుఃఖాలలో వారితోపాటు ఏడ్చాము. మేము మా కారులో కుక్కి కూటాలకు తీసుకునివెళ్ళిన క్రొత్తవాళ్ళలో కొంతమంది ఇప్పుడు తమ తమ సంఘాలలో బలమైన స్తంభాలుగా ఉన్నారు. మేము 1953వ సంవత్సరంలో ఈ విస్తారమైన దేశంలో అడుగుపెట్టినప్పుడు, సువార్తను ప్రకటించే స్థానిక ప్రచారకులు 10 కంటే తక్కువమంది ఉండేవారు. అంత తక్కువమందితో మొదలయిన మా సంఖ్య ఇప్పుడు 1,200 మందికి చేరుకుంది. తన వాగ్దానాన్ని నిజం చేస్తూ, నేనూ ఇతరులూ ‘నాటి, నీళ్లు పోసిన’ చోట యెహోవా వృద్ధి కలుగజేశాడు.​—⁠1 కొరింథీయులు 3:⁠6.

మొదట ఆస్ట్రేలియాలో తర్వాత ఇప్పుడు నమీబియాలో మేము ఎన్నో సంవత్సరాలుగా చేసిన సేవను వెనక్కి తిరిగి చూసుకుంటే, కెరోలీకీ నాకూ ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడూ ఎల్లప్పుడూ ఆయన చిత్తం చేయడానికి యెహోవా మాకు బలాన్నివ్వడంలో కొనసాగుతాడని మేము నిరీక్షిస్తున్నాము, దాని కోసం ప్రార్థిస్తున్నాము.

[అధస్సూచి]

^ పేరా 22 ఈ కష్టమైన నియామకాన్ని వాల్డ్రన్‌ కుటుంబం ఎలా సహించిందనే దాన్ని గురించిన ఒక ఆసక్తికరమైన నివేదిక కావలికోట (ఆంగ్లం), డిసెంబరు 1, 1952, 707-8 పేజీలలో ఉంది. ఆ నివేదికలో వాల్డ్రన్‌ల పేరు ప్రస్తావించబడలేదు.

[26, 27వ పేజీలోని చిత్రం]

ఆస్ట్రేలియాలోని రాక్‌హాంప్టన్‌లో మా నియామకానికి వెళ్ళడం

[27వ పేజీలోని చిత్రం]

గిలియడ్‌ స్కూల్‌కు వెళుతున్నప్పుడు

[28వ పేజీలోని చిత్రం]

నమీబియాలో సాక్ష్యమివ్వడం మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది