కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒత్తిడివల్ల ఇవ్వడం బాధ కలిగిస్తుంది

ఒత్తిడివల్ల ఇవ్వడం బాధ కలిగిస్తుంది

ఒత్తిడివల్ల ఇవ్వడం బాధ కలిగిస్తుంది

“మీరు నన్ను భిక్షగాడు అని పిలిచినా నాకు అభ్యంతరం లేదు. నేను యేసు కోసం భిక్షమెత్తుతున్నాను.” ఒక ప్రొటస్టెంట్‌ ప్రీస్టు చెప్పిన ఆ మాటలు, మతపరమైన విరాళాలకు సంబంధించిన వివాదాన్ని ఉన్నతపరుస్తున్నాయి. వ్యవస్థీకరించబడిన మతం, అధిక మొత్తంలో ఆర్థిక సహాయం లభిస్తేనే నిలబడగలదన్నట్లు కనిపిస్తుంది. జీతాలు ఇవ్వబడాలి, ఆలయాలు నిర్మించబడాలి, వాటికి మరమ్మత్తులు చేయించాలి, సువార్తను ప్రకటించడానికి ప్రత్యేక కార్యక్రమాలకు ఆర్థిక మద్దతు కావాలి. వీటన్నింటికీ అవసరమైన డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?

ఆ ప్రశ్నకు అనేక చర్చీలు ఇచ్చే సమాధానం, దశమభాగాన్ని వసూలు చేయడం. * “దశమభాగాన్ని వసూలు చేయడమనేది దేవుడు భూమ్మీద తన రాజ్యానికి ఆర్థిక మద్దతును అందించేందుకు ఏర్పర్చుకున్న ఒక మార్గం. అది, సువార్త ప్రకటించబడడాన్ని సాధ్యపరిచే దేవుని ఆర్థిక వ్యవస్థ” అని సువార్తికుడైన నార్మన్‌ రాబర్ట్‌సన్‌ అంటున్నాడు. ఇవ్వవలసిన బాధ్యత గురించి తన అనుచరులకు గుర్తుచేయడానికి సందేహించకుండా, ఆయన ఇలా నొక్కి చెబుతున్నాడు: ‘దశమభాగాన్ని చెల్లించడం అంటే ఏదో మీరు చేయగలరు కాబట్టే చేసే పని కాదు. అది విధేయతను సూచిస్తుంది. దశమభాగాన్ని చెల్లించకుండా ఉండడం అనేది దేవుని ఆజ్ఞలను స్పష్టంగా ఉల్లంఘించినట్లు అవుతుంది. అది, ఇతరుల డబ్బును సొంత ఖర్చులకు ఉపయోగించడంతో సమానం.’​—⁠దశమభాగం​—⁠ఆర్థిక మద్దతుకు దేవుని ప్రణాళిక (ఆంగ్లం).

ఇవ్వడం అనేది క్రైస్తవ ఆరాధనలో ఒక భాగం అని మీరు అంగీకరించే అవకాశం ఉంది. అయితే, డబ్బు కోసం పదే పదే చేయబడే అభ్యర్థనలు మీకు విసుగు పుట్టించేవిగా బహుశా అభ్యంతరకరంగా కూడా ఉన్నాయా? బ్రెజిల్‌కు చెందిన దైవశాస్త్ర పండితుడు ఈనేస్యూ స్ట్రీడర్‌, చర్చీలు “తమ సంస్థాపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి” దశమభాగాన్ని తమ ఆదాయ వనరుగా చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నాడు, అలాంటి పనులు “చట్టవిరుద్ధమైనవి, భ్రష్టమైనవి, ధర్మశాస్త్ర విరుద్ధమైనవి” అని అంటున్నాడు. దాని ఫలితంగా “నిరుద్యోగులు, విధవరాండ్రు, మురికివాడలలో ఉండేవారు, తర్కబద్ధంగా ఆలోచించే సామర్థ్యం లేనివారు, దేవుడు తమను వదిలివేశాడన్న ముగింపుకు వచ్చి, తమ కుటుంబాలకు తినడానికి ఏమీ మిగలకపోయినా ‘ప్రచారకునికి’ ఎక్కువ డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయబడతారు” అని ఆయన అంటున్నాడు.

‘దశమభాగాన్ని బలవంతంగా వసూలుచేసే చర్చీలు లేఖనాన్ని సరిగ్గా అన్వయిస్తున్నాయా? లేక తమ చర్చి సభ్యుల నుండి బలవంతంగా ధనం తీసుకోవడానికి కొన్ని మతాలు దేవునిపట్ల భయాన్ని నాటుతున్నాయా? కొందరు అంటున్నట్లు, నిజంగా మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడా?’ అని మీరు ఆలోచించవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 3 దశమభాగాన్ని చెల్లించడం అంటే ఒక వ్యక్తి ఆదాయంలో పదవ వంతును చెల్లించడం అని నిర్వచించబడింది.