కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య వ్యక్తిగత అధ్యయనాన్ని ఆనందించండి

దేవుని వాక్య వ్యక్తిగత అధ్యయనాన్ని ఆనందించండి

దేవుని వాక్య వ్యక్తిగత అధ్యయనాన్ని ఆనందించండి

“నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.”​కీర్తన 77:⁠12.

1, 2. (ఎ) మనం ధ్యానించడం కోసం ఎందుకు సమయాన్ని కేటాయించాలి? (బి) ధ్యానించడం అంటే ఏమిటి, ఏదైనా ఒక దాని మీద మనస్సు పెట్టడం అంటే ఏమిటి?

యేసుక్రీస్తు శిష్యులుగా మనం, దేవునితో మనకున్న సంబంధం గురించీ ఆయనను సేవించడానికిగల కారణాల గురించీ ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. అయితే, నేడు చాలా మంది ప్రజలు ఎంత బిజీగా ఉంటున్నారంటే, వాళ్ళు ధ్యానించడానికి సమయాన్ని కేటాయించుకోవడంలేదు. ధనార్జనకే ప్రాధాన్యమిస్తూ దానికి సంబంధించిన ఆయా పనుల్లోను, వస్తువుల కొనుగోళ్ళలోను, ఉద్దేశ రహితమైన వినోదాల్లోను తలమునకలవుతుంటారు. మనం అటువంటి నిరర్థకమైన ప్రయత్నాలను చేయకుండా ఎలా జాగ్రత్తపడగలము? మనం ప్రతిరోజూ భోజనమూ నిద్రా వంటి ఆవశ్యక పనుల కోసం నిర్దిష్ట సమయాన్ని కేటాయించినట్లే, యెహోవా కార్యాల గురించీ, ఆయన వ్యవహారాల గురించీ ధ్యానించడానికి ప్రతిరోజూ సమయాన్ని తప్పక కేటాయించుకోవాలి.​—⁠ద్వితీయోపదేశకాండము 8:⁠3; మత్తయి 4:⁠4.

2 మీరు ఎప్పుడైనా ధ్యానించడానికి సమయం తీసుకుంటారా? ధ్యానించడమంటే ఏమిటి? ధ్యానించడం అంటే ఒకరు తమ ఆలోచనలను ఏదైనా ఒక దాని మీద కేంద్రీకరించడం: మననం చేయడం లేదా ఏదైనా ఒక దాని మీద మనస్సు పెట్టడం అని ఒక నిఘంటువు నిర్వచిస్తోంది. ఏదైనా ఒక దాని మీద మనస్సు పెట్టడం అంటే దాని గురించి ఆలోచించడం; మననం చేయడం . . . ముఖ్యంగా ప్రశాంతంగా, గంభీరంగా, లోతుగా ఆలోచించడం లేదా పరిగణనలోకి తీసుకోవడం అని భావం. మనం ఏమి చేయాలని దీనర్థం?

3. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడం నేరుగా దేనితో ముడిపడివుంది?

3 ఒక విషయం ఏమిటంటే, అపొస్తలుడైన పౌలు తన తోటి సేవకుడైన తిమోతికి వ్రాసిన దాని గురించి ఇది మనకు జ్ఞాపకం చేయాలి. “నేను వచ్చేవరకూ . . . చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు. . . . ఆ విషయాలమీద మనసు ఉంచి వాటిని అభ్యాసం చేసుకో, అప్పుడు నీ అభివృద్ధి అందరికీ కనబడుతుంది” అని ఆయనకు వ్రాశాడు. అవును అభివృద్ధీ ప్రగతీ సాధించాలని ఆశించబడింది. అభివృద్ధి సాధించడమనేది అధ్యాత్మిక విషయాలపై మనసును కేంద్రీకరించడంతో నేరుగా ముడిపడివుందని పౌలు మాటలు చూపించాయి. నేడు కూడా అది నిజం. ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడం వల్ల కలిగే సంతృప్తిని మనమూ పొందాలంటే దేవుని వాక్య సంబంధ విషయాలపై ‘మనసు ఉంచడమూ’ వాటిని ‘అభ్యాసం చేసుకోవడమూ’ ఇప్పటికీ తప్పనిసరి.​—⁠1 తిమోతి 4:​13-15, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

4. మీరు క్రమంగా యెహోవా వాక్యం గురించి ఆలోచించడానికి ఏ యే ఉపకరణాలను ఉపయోగించుకోగలరు?

4 మీరు ధ్యానించేందుకు మంచి సమయం ఏదన్నది, మీ మీదా మీ కుటుంబ దినచర్య మీదా ఆధారపడివుంటుంది. చాలా మంది, ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం అనే చిన్నపుస్తకంలోని బైబిలు వచనాన్ని ఉదయాన్నే చదివి దాని గురించి ఆలోచిస్తారు. నిజానికి, ప్రపంచవ్యాప్త బేతేలు గృహాల్లో ఉన్న దాదాపు 20,000 మంది స్వచ్ఛంద సేవకులు ప్రతిరోజు 15 నిమిషాలు దినవచనం చర్చించడంతో తమ దైనందిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజూ బేతేలు కుటుంబంలోని కొందరు మాత్రమే దినవచనాన్ని గురించి వ్యాఖ్యానిస్తారు, మిగతావాళ్ళు చెప్పబడుతున్నదాని గురించి, చదవబడుతున్న దాని గురించి ఆలోచిస్తారు. ఇతర సాక్షులు తాము పనికి వెళ్తున్నప్పుడు దారిలో యెహోవా వాక్యం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు బైబిల్‌, వాచ్‌టవర్‌, అవేక్‌! ఆడియో కేసెట్లను వింటారు. కొన్ని భాషల్లో ఈ కేసెట్లు లభ్యమవుతున్నాయి. చాలా మంది గృహిణులు ఇంటి పనులు చేసుకుంటూ వింటారు. నిజానికి, వీళ్ళు “యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును” అని వ్రాసిన కీర్తనకర్తయైన ఆసాపును అనుకరిస్తున్నారు.​—⁠కీర్తన 77:11, 12.

సరైన దృక్పథం మంచి ఫలితాలను తెస్తుంది

5. మనకు వ్యక్తిగత అధ్యయనం ఎందుకు ప్రాముఖ్యం?

5 టీవీ, వీడియో, కంప్యూటర్ల మన ఆధునిక యుగంలో, చాలా మంది ప్రజలు అంతగా చదవడం లేదు. యెహోవాసాక్షుల విషయంలో అలా జరగకూడదు. నిజానికి, బైబిలును చదవడం, యెహోవాతో పటిష్ఠమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతో కీలకమైనది. వేల సంవత్సరాల క్రితం, మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులకు నాయకుడయ్యాడు. యెహోషువ యెహోవా ఆశీర్వాదాన్ని పొందాలంటే ఆయన స్వయంగా దేవుని వాక్యాన్ని చదవవలసి ఉండింది. (యెహోషువ 1:8; కీర్తన 1:​1, 2) నేటికీ అది కోరబడుతోంది. అయితే, పరిమితమైన విద్యాభ్యాసం మూలంగా కొందరికి చదవడం కష్టంగానో చాలా ప్రయాసతో కూడినదిగానో అనిపించవచ్చు. అలాంటప్పుడు, దేవుని వాక్యాన్ని చదవాలని, అధ్యయనం చేయాలని కోరుకొనేలా మనకు ఏది సహాయపడగలదు? దీనికి జవాబును, సామెతలు 2:​1-6 వచనాల్లో రాజైన సొలొమోను మాటల్లో చూడవచ్చు. దయచేసి మీ బైబిలు తెరిచి ఈ వచనాలను చదవండి. ఆ తర్వాత మనం వాటిని చర్చించవచ్చు.

6. దేవుని గురించిన జ్ఞానం విషయంలో మనం ఎటువంటి దృక్పథాన్ని చూపించాలి?

6 మొదటగా, “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల . . .” అనే ప్రోత్సాహాన్ని మనం అక్కడ కనుగొంటాము. (సామెతలు 2:​1, 2) ఈ మాటల నుండి మనమేమి తెలుసుకుంటాము? దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరి మీదా ఉందని తెలుసుకుంటాము. ‘నీవు నా మాటలను అంగీకరించిన యెడల’ అన్న షరతును గమనించండి. ‘యెడల’ అన్న పదం బాగా నొక్కిచెప్పబడాలి, ఎందుకంటే అధిక సంఖ్యాకులు దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడంలో మనం ఆనందించగలగాలంటే, యెహోవా చెప్పే మాటలను అంగీకరించడానికీ, వాటిని మనం ఏ మాత్రం జారవిడుచుకోవడానికి ఇష్టపడని నిధుల్లా ఎంచడానికీ తప్పక సుముఖత చూపించాలి. మనం దేవుని వాక్యం పట్ల ఉదాసీనతతో వ్యవహరించనారంభించేలా, చివరికి దాన్ని సందేహించేలా చేసేంతగా మన దినచర్య మనలను బిజీగా చేయడానికి గానీ మన శ్రద్ధను మళ్ళించడానికి గానీ మనం ఎన్నడూ అనుమతించకూడదు.​—⁠రోమీయులు 3:3, 4.

7. సాధ్యమైనప్పుడల్లా, మనం క్రైస్తవ కూటాలకు ఎందుకు హాజరవ్వాలి, ఎందుకు చెవియొగ్గి వినాలి?

7 మన క్రైస్తవ కూటాల్లో దేవుని వాక్యం వివరించబడుతున్నప్పుడు, మనం నిజంగా “చెవియొగ్గి” శ్రద్ధగా వింటామా? (ఎఫెసీయులు 4:​20, 21) మనం వివేచనను పొందేందుకు “హృదయపూర్వకముగా” మొగ్గుచూపుతున్నామా? బహుశా ప్రసంగీకుడు మిగతా వాళ్ళందరికన్నా అనుభవజ్ఞుడు కాకపోవచ్చు, కానీ ఆయన దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు మన పూర్తి అవధానానికి ఆయన అర్హుడు. నిజమే, మనం యెహోవా జ్ఞానానికి చెవియొగ్గాలంటే, సాధ్యమైనప్పుడల్లా మనం క్రైస్తవ కూటాలకు తప్పక హాజరవ్వాలి. (సామెతలు 18:⁠1) సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెరూషలేములోని మేడగదిలో జరిగిన కూటానికి ఎవరైనా హాజరవ్వలేకపోయి ఉంటే వారికి ఎంత నిరాశ కలిగివుండేదో ఊహించుకుని చూడండి! ఆ కూటం అంత సంచలనాత్మకంగా మన కూటాలు లేకపోయినప్పటికీ, మన ప్రాథమిక పాఠ్యపుస్తకమైన బైబిలు చర్చించబడుతుంది కాబట్టి మనం చెవియొగ్గి వింటే, చూడమన్నప్పుడు మన బైబిళ్ళను తెరిచి చూసుకుంటుంటే ప్రతి కూటమూ మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలదు.​—⁠అపొస్తలుల కార్యములు 2:1-4; హెబ్రీయులు 10:24, 25.

8, 9. (ఎ) వ్యక్తిగత అధ్యయనం అంటే మనం ఏమి చేయడం అవసరం? (బి) దేవుని జ్ఞానాన్ని గ్రహించడంతో పోల్చితే, బంగారం విలువను గురించి మీరు ఏమని చెబుతారు?

8 “తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల” అన్నవే జ్ఞానియైన రాజు చెప్పిన తర్వాత మాటలు. (సామెతలు 2:⁠3) ఈ మాటల్లో మనకు తెలియజేయబడుతున్న వైఖరి లేదా దృక్పథం ఏమిటి? అవును, ఈ మాటల్లోని దృక్పథం, యెహోవా వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్న హృదయపూర్వక కోరికే! వివేచనను పొందాలి, యెహోవా చిత్తమేమిటో గ్రహించాలన్న దృష్టితో అధ్యయనం చేయడానికి సుముఖత చూపించడమన్న భావం ఈ మాటల్లో అంతర్లీనంగా ఉంది. నిజమే వివేచన పొందేందుకు, ఆయన చిత్తాన్ని గ్రహించేందుకు శ్రమించవలసిన అవసరం ఉంది. ఇది సొలొమోను తర్వాత చెప్పిన మాటల వైపుకు, ఉపమానం వైపుకు మనల్ని తీసుకువెళ్తుంది.​—⁠ఎఫెసీయులు 5:15-17.

9 “వెండిని వెదకినట్లు దాని [తెలివిని] వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల” అంటూ ఆయన కొనసాగిస్తున్నాడు. (సామెతలు 2:⁠4) ఇది, మానవులు గనుల్లో సంపాదించినవాటిని గురించి మనం ఆలోచించేలా చేస్తుంది. ప్రశస్త లోహాలుగా ఎంచబడే వెండి బంగారాల కోసం వాళ్ళు శతాబ్దాల తరబడి అన్వేషించారు. బంగారం కోసం మనుష్యులు హత్యలు చేశారు. మరి కొందరు దాన్ని కనుక్కొనే ప్రయత్నంలో తమ జీవితకాలమంతా గడిపేశారు. అయితే బంగారానికి నిజమైన విలువ ఎంతుందంటారు? మీరు ఎడారిలో దారి తప్పి, దాహంతో చనిపోబోతున్నట్లయితే, మీరు దేన్ని ఎక్కువగా కోరుకుంటారు బంగారం బిస్కెట్‌నా లేక ఒక గ్లాసెడు మంచి నీళ్ళనా? అయినప్పటికీ, కృత్రిమమైన, అస్థిరమైన విలువగల బంగారం కోసం మానవులు ఎంతో ఆసక్తితో శ్రమించారు! * మనం జ్ఞానం కోసం, వివేచన కోసం, దేవుని గురించిన ఆయన చిత్తాన్ని గురించిన గ్రహింపు కోసం ఇంకా ఎంత ఆసక్తితో అన్వేషించాలో కదా! అలా అన్వేషించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?​—⁠కీర్తన 19:​7-10; సామెతలు 3:​13-18.

10. మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తే ఏమి పొందగలుగుతాము?

10 సొలొమోను ప్రసంగం, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును” అంటూ కొనసాగుతోంది. (సామెతలు 2:5) పాపభరిత మానవులమైన మనం, విశ్వ సర్వాధిపతియైన యెహోవా “దేవుని గూర్చిన విజ్ఞానము”ను పొందగలమన్నది ఎంత ఆశ్చర్యకరమైన తలంపు! (కీర్తన 73:28; అపొస్తలుల కార్యములు 4:​24) లోకంలోని తత్త్వవేత్తలు, జ్ఞానులు అని పిలువబడే వారు, జీవాన్ని గురించిన, విశ్వాన్ని గురించిన మర్మాలను అర్థం చేసుకోవడానికి శతాబ్దాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ, వాళ్ళు “దేవుని గూర్చిన విజ్ఞానము”ను పొందలేకపోయారు. ఎందుకని? వేల సంవత్సరాలుగా దేవుని వాక్యమైన బైబిలులో అది అందుబాటులో ఉన్నప్పటికీ, మరీ సరళంగా ఉందంటూ తృణీకరిస్తారు, అలా వారు దాన్ని అంగీకరించలేకపోతారు, గ్రహించలేకపోతారు.​—⁠1 కొరింథీయులు 1:18-21.

11. వ్యక్తిగత అధ్యయనం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

11 “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును” అన్న మరొక ప్రేరణాత్మక విషయాన్ని సొలొమోను ఇక్కడ నొక్కి చెబుతున్నాడు. (సామెతలు 2:⁠6) జ్ఞానాన్నీ తెలివినీ వివేచననూ వెదకడానికి సుముఖత చూపించేవారికి యెహోవా వాటిని ఉచితంగా, ఉదారంగా ఇస్తాడు. దేవుని వాక్యపు వ్యక్తిగత అధ్యయనానికి కృషి, క్రమశిక్షణ, త్యాగం అవసరమైనప్పటికీ దానిని విలువైనదిగా ఎంచడానికి మనకు ప్రతి కారణమూ ఉంది. మనకు కనీసం బైబిలు ముద్రిత ప్రతులున్నాయి, ప్రాచీన కాలాల్లో కొందరు చేతితో నకలు వ్రాసుకొన్నట్లు మనం వ్రాసుకోవలసిన అవసరం లేదు!​—⁠ద్వితీయోపదేశకాండము 17:​18-22.

యెహోవాకు తగినట్లు నడుచుకోవడానికి

12. దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏది మనకు పురికొల్పునిచ్చేదిగా ఉండాలి?

12 మన వ్యక్తిగత అధ్యయనానికి ఏది పురికొల్పునిచ్చేదిగా ఉండాలి? మిగతా వాళ్ళ కన్నా గొప్పగా కనిపించాలన్నదా? అందరికన్నా మించిన జ్ఞానమున్నట్లు ప్రదర్శించాలన్నదా? తద్వారా, సంచార బైబిలు విజ్ఞానసర్వస్వము అన్న పేరు సంపాదించుకోవాలన్నదా? కాదు. క్రైస్తవులుగా మాట్లాడాలి, నడుచుకోవాలి, క్రైస్తవత్వాన్ని ఆచరించాలి, క్రీస్తు చూపించిన సేదదీర్చే స్ఫూర్తితో ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నదే మన లక్ష్యమై ఉండాలి. (మత్తయి 11:​28-30) “జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును” అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించాడు. (1 కొరింథీయులు 8:⁠1) కాబట్టి, మోషే యెహోవాతో, “నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును” అని అన్నప్పుడు కనబరచిన వినయ స్వభావం మనకు ఉండాలి. (నిర్గమకాండము 33:​13) మనం జ్ఞానాన్ని కోరుకోవలసినది దేవుణ్ణి ప్రీతిపర్చేందుకే గానీ, మానవుల ప్రశంసల్ని పొందడానికి కాదు. మనం దేవునికి తగినట్లు నడుచుకునేవారిగా, వినయస్థులైన దేవుని సేవకులుగా ఉండాలని కోరుకుంటాం. మనమా లక్ష్యాన్ని ఎలా సాధించగలము?

13. ఒకరు దేవునికి యోగ్యుడైన సేవకులవ్వాలంటే ఏమి అవసరం?

13 “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము” అని చెబుతూ దేవుణ్ణి ప్రీతిపరచడమెలాగన్న దాని గురించి పౌలు తిమోతికి సలహా ఇచ్చాడు. (2 తిమోతి 2:​15) “సరిగా ఉపదేశించు” అని అనువదించబడిన మాటకు, “వంకరా వంపూ లేకుండా కోయడం” లేదా ‘సరిగ్గా కోయడం’ అనే మూల భావం గల గ్రీకు సంయుక్త క్రియా పదమే మూలపదం. (కింగ్‌డమ్‌ ఇంటర్లీనియర్‌) కొందరి అభిప్రాయం ప్రకారం, ఇది, ఒక దర్జీ బట్టని ఒక మోడల్‌ ప్రకారం కత్తిరించడం, ఒక రైతు పొలంలో చాళ్లు కొట్టడం మొదలైనవాటిని సూచిస్తుంది. ఏదేమైనప్పటికీ, ఫలితం సరిగా ఉండాలి. విషయమేమిటంటే, తాను దేవుని ఎదుట తగినవాడిగా, యోగ్యుడిగా ఉండేందుకు తన బోధా, తన ప్రవర్తనా వాక్యపు సత్యానికి పొందికగా ఉండేలా రూఢిచేసుకునేందుకు తిమోతి తన శాయశక్తులా “జాగ్రత్త”పడవలసి ఉండింది.​—⁠1 తిమోతి 4:⁠16.

14. మన వ్యక్తిగత అధ్యయనం మన మాటలపైనా చేతలపైనా ఎలాంటి ప్రభావం చూపించాలి?

14 ఇదే విషయాన్ని, పౌలు “ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలె[ను]” అని కొలొస్సయిలోని తన తోటి క్రైస్తవులకు ఉద్బోధించినప్పుడు చెప్పాడు. (కొలొస్సయులు 1:⁠9-12) ఇక్కడ పౌలు యెహోవాకు తగినట్లుగా నడుచుకోవడాన్ని, ‘ప్రతి సత్కార్యములో సఫలులవ్వడంతో’ అలాగే ‘దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందడంతో’ ముడిపెడుతున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, మనం యెహోవాను గురించిన పరిజ్ఞానాన్ని ఎంత విలువైనదిగా ఎంచుతామన్నది మాత్రమే కాక, మన మాటల్లోనూ చేతల్లోనూ దేవుని వాక్యాన్ని ఎంతగా ఆచరణలో పెడతామన్నది కూడా ఆయన దృష్టిలో ప్రాముఖ్యమే. (రోమీయులు 2:​21, 22) మనం దేవుణ్ణి ప్రీతిపరచాలనుకుంటే, మన వ్యక్తిగత అధ్యయనం మన ఆలోచనలపైనా, మన ప్రవర్తనపైనా తప్పకుండా ప్రభావం చూపాలి.

15. మన మనస్సునూ ఆలోచనలనూ మనమెలా కాపాడుకోగలం, ఎలా నియంత్రించుకోగలం?

15 నేడు సాతాను, మానసిక పోరాటాన్ని పెంపొందింపజేయడం ద్వారా మన ఆధ్యాత్మికతను ధ్వంసం చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాడు. (రోమీయులు 7:​14-25) కాబట్టి, మనం మన దేవుడైన యెహోవాకు తగినట్లు నడుచుకొనేవారమని నిరూపించుకునేందుకు మన మనస్సును ఆలోచనలను తప్పకుండా కాపాడుకోవాలి, నియంత్రించుకోవాలి. మనకున్న ఆయుధం “దేవుని గూర్చిన జ్ఞానము.” దానికి, “ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరప[ట్టే]” శక్తి వుంది. దేవుని వాక్యానికున్న ఈ శక్తి, మనం స్వార్థాన్నీ, మనస్సులో మెదిలే శరీర సంబంధ తలంపులనూ వదిలించుకోవాలని కోరుకుంటుండగా, మనం అనుదినం బైబిలు అధ్యయనం చేయడంలో శ్రద్ధ వహించేందుకు మరింత కారణాన్ని ఇస్తుంది.​—⁠2 కొరింథీయులు 10:⁠5.

అర్థం చేసుకోవడానికి సహాయకాలు

16. యెహోవా మనకు బోధిస్తుండగా మనమెలా ప్రయోజనం పొందగలం?

16 యెహోవా బోధ ఆధ్యాత్మిక, శారీరక ప్రయోజనాలను తెస్తుంది. అది అనాసక్తమైనదీ ఆచరణాత్మక విలువలేనిదీ అయిన దైవశాస్త్రం కాదు. కాబట్టి, “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును” అని చదువుతాం. (యెషయా 48:​17) యెహోవా ప్రయోజనకరమైన తన మార్గంలో మనలను ఎలా నడిపిస్తాడు? మొదటిగా, ఆయన ప్రేరేపిత వాక్యమైన పరిశుద్ధ బైబిలు మనకుంది. ఇది మన ప్రాథమిక పాఠ్యపుస్తకము, సహాయం కోసం మనం నిరంతరం దాన్నే చూస్తాము. కాబట్టి, క్రైస్తవ కూటాల్లో బైబిలు తెరిచి ఉంచుకుని, చెప్పబడుతున్నదానికి అవధానమివ్వడం మంచిది. అలా చేయడం వల్ల వచ్చే ప్రయోజనకరమైన ఫలితాలను, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో నమోదు చేయబడిన ఐతియొపీయుడైన నపుంసకుణ్ణి గురించిన వృత్తాంతంలో మనం చూడవచ్చు.

17. ఐతియొపీయుడైన నపుంసకుడి విషయంలో ఏమి జరిగింది, అది ఏ విషయాన్ని స్పష్టం చేస్తుంది?

17 ఐతియొపీయుడైన నపుంసకుడు యూదామతాన్ని స్వీకరించినవాడు. ఆయన దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మాడు, ఆయన లేఖనాలను అధ్యయనం చేసేవాడు. ఆయన తన రథంలో ప్రయాణిస్తూ యెషయా పాఠ్యభాగాన్ని చదువుతున్నప్పుడు, ఫిలిప్పు ఆయన రథంతో పాటు పరుగెడుతూ “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అడిగాడు. అందుకు ఆ నపుంసకుడు ఏమని జవాబిచ్చాడు? “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను.” పరిశుద్ధాత్మ చేత పంపించబడిన ఫిలిప్పు అప్పుడు యెషయా గ్రంథాన్ని అర్థం చేసుకునేందుకు ఆ నపుంసకుడికి సహాయం చేశాడు. (అపొస్తలుల కార్యములు 8:​27-35) ఈ వృత్తాంతం ఏ విషయాన్ని స్పష్టం చేస్తుంది? మనం బైబిలును సొంతగా చదువుకుంటే సరిపోదని స్పష్టం చేస్తుంది. మనం యెహోవా వాక్యాన్ని సరైన సమయంలో అర్థం చేసుకునేందుకు మనకు సహాయపడడానికి నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిని ఆయన తన ఆత్మ ద్వారా ఉపయోగిస్తున్నాడు. ఇది ఎలా జరుగుతుంది?​—⁠మత్తయి 24:45-47; లూకా 12:⁠42.

18. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి మనకు ఎలా సహాయం చేయగలదు?

18 దాసుని తరగతి ‘నమ్మకమైనవాడు బుద్ధిమంతుడు’ అని నిర్వచించబడినప్పటికీ, ఆ తరగతి ఎన్నడూ పొరబడనేరదని యేసు చెప్పలేదు. నమ్మకస్థులైన ఈ అభిషిక్త సహోదరుల గుంపు ఇప్పటికీ అపరిపూర్ణులైన క్రైస్తవులతో కూడినదే. వాళ్ళకు ఎంతో మంచి ఉద్దేశాలున్నప్పటికీ మొదటి శతాబ్దంలో కొన్నిసార్లు పొరపాట్లు చేసిన కొందరిలా వాళ్ళూ పొరపాట్లు చేయవచ్చు. (అపొస్తలుల కార్యములు 10:9-15; గలతీయులు 2:​8, 9, 11-14) అయితే, వాళ్ళ లక్ష్యం నిష్కల్మషమైనది, దేవుని వాక్యం మీదా దాని వాగ్దానాల మీదా మనకున్న విశ్వాసాన్ని బలపర్చేందుకు బైబిలు అధ్యయన సహాయకాలను మనకు సరఫరా చేసేందుకు యెహోవా వారిని ఉపయోగిస్తున్నాడు. వ్యక్తిగత అధ్యయనం కోసం ఆ దాసుడు మనకు ముఖ్యంగా ఇచ్చినది ఏమిటంటే న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌. అది ఇప్పుడు, పూర్తిగా గానీ భాగికంగా గానీ 42 భాషల్లో లభ్యమవుతోంది, అనేక ఎడిషన్లలో 11.4 కోట్ల ప్రతులు ముద్రించబడ్డాయి. మనం దీనిని వ్యక్తిగత అధ్యయనంలో ఫలప్రదంగా ఎలా ఉపయోగించగలం?​—⁠2 తిమోతి 3:14-17.

19. న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌​—⁠విత్‌ రెఫరెన్సెస్‌లో మన వ్యక్తిగత అధ్యయనానికి సహాయకరంగా ఉండే కొన్ని ప్రత్యేకతలు ఏవి ఉన్నాయి?

19 ఉదాహరణకు, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌​—⁠విత్‌ రెఫరెన్సెస్‌నే తీసుకోండి. దానిలో క్రాస్‌-రెఫరెన్సుల కాలమ్‌లూ, అధస్సూచులూ, “బైబిల్‌ వర్డ్స్‌ ఇండెక్స్‌డ్‌” రూపంలో ఒక చిన్న అకారాదిపట్టికా, “ఫుట్‌నోట్‌ వర్డ్స్‌ ఇండెక్స్‌డ్‌,” మ్యాప్‌లు చార్టులతో సహా 43 విషయాలను విస్తృతంగా చర్చించే అపెండిక్స్‌ ఉన్నాయి. అనుపమానమైన ఈ బైబిలు అనువాదం కోసం ఉపయోగించబడిన అనేక ఆధారాలను గురించిన వివరణతో ఒక “ఇంట్రడక్షన్‌” (ఉపోద్ఘాతం) కూడా అందులో ఉంది. ఇది మీకు అర్థమయ్యే భాషలో ఉంటే, దానిలోని ఈ ప్రత్యేకతలను క్షుణ్ణంగా తెలుసుకొని, ఉపయోగించుకోండి. ఏది ఏమైనప్పటికీ, మన అధ్యయన కార్యక్రమానికి మూలాధారం బైబిలే, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ అనువాదం దేవుని రాజ్య పరిపాలనను ఉన్నతపరుస్తుంది కాబట్టి అది దేవుని నామాన్ని సముచితమైన విధంగా నొక్కి చెబుతుంది.​—⁠కీర్తన 149:​1-9; దానియేలు 2:​44; మత్తయి 6:⁠9, 10.

20. ఇప్పుడు వ్యక్తిగత అధ్యయనాన్ని గురించిన ఏ ప్రశ్నలకు జవాబు అవసరం?

20 ‘బైబిలును అర్థం చేసుకునేందుకు మనకు ఇంకా ఎలాంటి సహాయం అవసరం? మనం వ్యక్తిగత అధ్యయనం కోసం సమయాన్ని ఎలా కేటాయించుకోగలము? మన అధ్యయనాన్ని మరింత ఫలప్రదంగా ఎలా చేసుకోగలము? మన అధ్యయనం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపించాలి?’ అని మనం ఇప్పుడు ప్రశ్నించవచ్చు. మన క్రైస్తవ అభివృద్ధికి ఆవశ్యక అంశాలైన వీటిని గురించి తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 9 1979 నుండి బంగారం విలువలో ఎన్నో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి, 1980 లో 31 గ్రాముల బంగారం ఖరీదు 850.00 డాలర్లుంటే 1999 లో అది 252.80 డాలర్లకు పడిపోయింది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• ధ్యానించడం అంటే ఏమిటి, మనస్సు పెట్టడం అంటే ఏమిటి?

• దేవుని వాక్య అధ్యయన విషయంలో మనకుండవలసిన దృక్పథం ఏమిటి?

• మన వ్యక్తిగత అధ్యయనంలో మనకు ఏది పురికొల్పునిచ్చేదిగా ఉండాలి?

• బైబిలును అర్థం చేసుకునేందుకు మనకున్న సహాయకాలు ఏవి?

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

ప్రతీరోజు ఉదయం బైబిలు వచనాన్ని గురించి ఆలోచించడం ఆధ్యాత్మికంగా బలపరిచేదిగా ఉంటుందని బేతేలు కుటుంబ సభ్యులు కనుగొంటారు

[15వ పేజీలోని చిత్రాలు]

మనం ప్రయాణం చేసేటప్పుడు బైబిలు టేప్‌లను వినడం ద్వారా విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు

[16వ పేజీలోని చిత్రం]

మానవులు బంగారం సంపాదించుకునేందుకు దీర్ఘకాలం శ్రమించి పని చేశారు. మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ఎంతగా కృషి చేస్తారు?

[చిత్రసౌజన్యం]

Courtesy of California State Parks, 2002

[17వ పేజీలోని చిత్రాలు]

బైబిలు ఒక నిధి, అది నిత్యజీవానికి నడిపించగలదు