కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ప్రకటన 20:8 ప్రకారం, చివరి పరీక్షలో సాతానుచే తప్పుదారి పట్టించబడే ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారనే ముగింపుకు మనం చేరుకోవాలా?

ప్రకటన 20:​8, మెస్సీయా రాజ్యం యొక్క వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో భూమ్మీద నివసించే ప్రజలపై సాతాను చేసే చివరి దాడిని వర్ణిస్తుంది. సాతాను గురించి మాట్లాడుతూ ఆ వచనం ఇలా చెబుతోంది: “భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.”

వైజ్ఞానిక పద్ధతుల్లోనూ ఉపకరణాల్లోనూ ఎంతో పురోభివృద్ధి జరిగినప్పటికీ “సముద్రపు ఇసుక” తెలియని పరిమాణంగానే లేదా తెలియని సంఖ్యగానే ఉండిపోయింది. కాబట్టి, ఆ పదబంధం, తెలియని, అనిశ్చయమైన సంఖ్యను సూచిస్తోందని చెప్పవచ్చు. కానీ అది అపారమైన, అపరిమితమైన, చివరికి అంతులేని సంఖ్యను సూచిస్తుందా లేక తెలియనిదే అయినా చాలాపెద్ద సంఖ్యను, లేదా చెప్పుకోదగినంత పెద్ద సంఖ్యను సూచిస్తుందా?

బైబిలులో, “సముద్రపు ఇసుక” అనే పదబంధం అనేక విధాలుగా ఉపయోగించబడింది. ఉదాహరణకు, ఆదికాండము 41:49 లో మనమిలా చదువుతాము: “యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్యమాయెను గనుక కొలుచుట మానివేసెను.” ఇక్కడ అది కొలవలేనంతటిదన్న విషయం నొక్కిచెప్పబడుతోంది. అలాగే, యెహోవా ఇలా అన్నాడు: “ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుకరేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును . . . లెక్కింప లేనంతగా నేను విస్తరింపజేయుదును.” ఆకాశనక్షత్రములు, సముద్రపు ఇసుక లెక్కించలేనివన్న విషయం ఎంత ఖచ్చితమో యెహోవా దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడన్నది కూడా అంతే ఖచ్చితం.​—⁠యిర్మీయా 33:​22.

తరచూ “సముద్రపు ఇసుక” అనే పదబంధం, చెప్పుకోదగినంత పెద్ద పరిమాణం లేదా సైజు గల దేన్నైనా సూచిస్తుంది. మిక్మషులో సమకూడిన, “సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన” ఫిలిష్తీయుల సైన్యాన్ని బట్టి గిల్గాలులో ఉన్న ఇశ్రాయేలీయులు చాలా భయపడిపోయారు. (1 సమూయేలు 13:​5, 6; న్యాయాధిపతులు 7:​12) “సొలొమోనుకు దేవుడు మిక్కిలి జ్ఞానాన్ని ప్రసాదించాడు. సొలొమోను అనేక విషయాలను సూక్ష్మంగా గమనించేవాడు. అతని జ్ఞానము సముద్రతీరానగల ఇసుకలా అనంతం.” (1 రాజులు 4:​29, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌, అధస్సూచి) ఈ రెండు సందర్భాల్లోనూ దేని గురించి ప్రస్తావించబడిందో అది పెద్ద మొత్తమే అయినా అది పరిమితమైన మొత్తమే.

“సముద్రపు ఇసుక,” ఎంత పెద్ద మొత్తం అన్నది సూచించకుండానే కేవలం తెలియని సంఖ్యను కూడా సూచించగలదు. యెహోవా అబ్రాహాముకు ఇలా చెప్పాడు: “నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను.” (ఆదికాండము 22:​17) ఈ వాగ్దానాన్ని అబ్రాహాము మనవడైన యాకోబుకు చెబుతూ ‘భూమిమీద ఇసుక రేణువులు’ అనే పదబంధాన్ని యెహోవా ఉపయోగించాడు, దాని గురించి యాకోబు మళ్ళీ చెబుతూ “సముద్రపు ఇసుక” అన్నాడు. (ఆదికాండము 28:14; 32:​12) అయితే చివరికి తేలిందేమిటంటే, యేసుక్రీస్తు కాకుండా, అబ్రాహాము “సంతానము” 1,44,000 మంది మాత్రమే, వారినే యేసు “చిన్న మందా” అని పిలిచాడు.​—⁠లూకా 12:​32; గలతీయులు 3:​16, 29; ప్రకటన 7:⁠4; 14:⁠1, 3.

ఈ ఉదాహరణల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? “సముద్రపు ఇసుక” అన్న వ్యక్తీకరణ ఎల్లప్పుడూ లెక్కింపజాలని, అంతులేని సంఖ్యను సూచించదు; లేక ఎల్లప్పుడూ ఏదో అపారమైనదాన్ని గానీ అపరిమితమైనదాన్ని గానీ వర్ణించడానికి ఉపయోగించబడదు. తరచూ అది తెలియని సంఖ్యే అయినప్పటికీ గమనార్హమైన సంఖ్యను సూచిస్తుంది. కాబట్టి, దేవుని ప్రజలపై సాతాను చేయబోయే చివరి దాడిలో అతనికి మద్దతునిచ్చే తిరుగుబాటుదారుల గుంపు అపారమైనది కాదుగానీ చెప్పుకోదగినంత పెద్దదిగా, ప్రమాదకరంగా ఉండగలిగేంత పెద్దదిగా ఉంటుందని నమ్మడం యుక్తమైనది. అయితే, ఆ సంఖ్య ప్రస్తుతం మనకు తెలియదు.