కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బోధకులుగా మనల్ని సిద్ధం చేసే వ్యక్తిగత అధ్యయనం

బోధకులుగా మనల్ని సిద్ధం చేసే వ్యక్తిగత అధ్యయనం

బోధకులుగా మనల్ని సిద్ధం చేసే వ్యక్తిగత అధ్యయనం

“నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము. నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము.”​1 తిమోతి 4:15, 16.

1. సమయం విషయంలో వ్యక్తిగత అధ్యయనం విషయంలో ఏది వాస్తవం?

“ప్రతిదానికి సమయము కలదు” అని బైబిలు ప్రసంగి 3:1 లో చెబుతోంది. వ్యక్తిగత అధ్యయనం విషయంలో కూడా అది వాస్తవం. సమయమూ స్థలమూ సరైనవి కాకపోతే, ఆధ్యాత్మిక విషయాల మీద మనసు కేంద్రీకరించడం కష్టమవుతుందని చాలా మంది కనుగొంటారు. ఉదాహరణకు, రోజంతా చాలా కష్టపడి పనిచేసి రాత్రికి సుష్టుగా భోజనం చేసిన తర్వాత, ముఖ్యంగా టీవీ ముందు మీకిష్టమైన పడక కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని ఉన్నప్పుడు మీకు అధ్యయనం చేయాలనిపిస్తుందా? అలా అనిపించే అవకాశం లేదు. మరి పరిష్కార మార్గమేమిటి? మన ప్రయత్నాల నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే, మనం ఎప్పుడు, ఎక్కడ అధ్యయనం చేయాలో ఎంపిక చేసుకోవాలన్నది స్పష్టం.

2. సాధారణంగా వ్యక్తిగత అధ్యయనానికి ఏది మంచి సమయం?

2 తాము సాధారణంగా చాలా చురుగ్గా ఉండే సమయమైన ఉదయం పూట అదీ పెందలకడనే అయితే, అది అధ్యయనానికి సముచితమైన సమయమని చాలా మంది గ్రహిస్తారు. కొందరు మధ్యాహ్నపు విరామ సమయాన్ని కొద్దిసేపు అధ్యయనం చేయడానికి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు చర్చించబోతున్న ఉదాహరణల్లో, ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఎంపిక చేసుకున్న సమయాలను గమనించండి. ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు, “నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము” అని వ్రాశాడు. (కీర్తన 143:⁠8) ప్రవక్తయైన యెషయా కూడా ఇలాంటి మెప్పుదలను వ్యక్తం చేస్తూ, “అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టిం[చుచున్నాడు]” అని వ్రాశాడు. మనం అధ్యయనం చేయవలసిందీ యెహోవా ఎదుట మన భావాలను వ్యక్తం చేయవలసిందీ మన మెదడు చురుగ్గా ఉన్నప్పుడే. అది ఏ సమయమైనా కావచ్చు.​—⁠యెషయా 50:​4, 5; కీర్తన 5:⁠3; 88:⁠13.

3. ఫలప్రదమైన అధ్యయనానికి కోరదగిన పరిస్థితులేవి?

3 ఫలప్రదమైన అధ్యయనం చేయడానికి గుర్తుంచుకోవలసిన మరొక విషయమేమిటంటే, అత్యంత సుఖప్రదమైన కుర్చీలో గానీ సోఫాలో గానీ కూర్చోవడానికి ఎంపిక చేసుకోకూడదు. అలాంటివాటిలో కూర్చుంటే మనస్సును చురుగ్గా ఉంచుకోలేము. మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, మన మనస్సు ప్రేరేపించబడాలి, శారీరకంగా మరీ ఎక్కువ సుఖప్రదమైన దాంట్లో కూర్చుంటే దాని ఫలితం ప్రతికూలంగా ఉంటుంది. ఇంకాస్త ప్రశాంతమైన స్థలాలు, శ్రద్ధ మళ్ళించేవేమీ లేని స్థలాలు కూడా అధ్యయనానికీ, ధ్యానానికీ కోరదగినవే. రేడియో, టీవీ, పిల్లలు మీ అవధానాన్ని ప్రక్కకు మళ్ళిస్తున్నప్పుడు అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తే పెద్ద ప్రయోజనాలేమీ ఉండవు. యేసు ధ్యానించాలనుకున్నప్పుడు, ప్రశాంతమైన ఒక చోటికి వెళ్ళాడు. ప్రార్థన కోసం ఏకాంతమైన స్థలం చూసుకోవడానికున్న విలువను గురించి కూడా ఆయన మాట్లాడాడు.​—⁠మత్తయి 6:⁠6; 14:​13; మార్కు 6:​30-32.

జవాబు చెప్పడానికి మనల్ని సిద్ధం చేసే వ్యక్తిగత అధ్యయనం

4, 5. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ ఏయే విధాల్లో ఆచరణాత్మక సహాయాన్నిస్తుంది?

4 ఒక విషయంలోకి లోతుగా త్రవ్వేందుకు, ముఖ్యంగా ఎవరైనా నిష్కపటంగా వేసిన ప్రశ్నల జవాబు కోసం త్రవ్వేందుకు వివిధ బైబిలు అవగాహనా సహాయకాలను ఉపయోగించినప్పుడు వ్యక్తిగత అధ్యయనం సంతృప్తికరంగా ఉంటుంది. (1 తిమోతి 1:​3, 4; 2 తిమోతి 2:​23) ప్రారంభంలో చాలా మంది క్రొత్తవాళ్ళు, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? * బ్రోషుర్‌ను అధ్యయనం చేస్తున్నారు. అదిప్పుడు 261 భాషల్లో లభ్యమవుతోంది. ఆ ప్రచురణ చాలా సరళమైనదే అయినా విషయాలను ఖచ్చితంగా చెబుతుంది, అది పూర్తిగా బైబిలు ఆధారితమైనది. అది సత్యారాధనకు దేవుడు కోరుతున్న విషయాలేమిటో త్వరగా గ్రహించేందుకు పాఠకులకు సహాయపడుతుంది. అయినప్పటికీ, అది చిన్న పుస్తకం కాబట్టి, అందులో ఒక్కో విషయాన్ని విశదంగా చర్చించడం వీలుకాదు. మీరు చర్చిస్తున్న కొన్ని బైబిలు విషయాల గురించి మీ బైబిలు విద్యార్థి గంభీరమైన ప్రశ్నలను వేస్తే, వాటికి జవాబులను కనుగొనేందుకు ఆయనకు సహాయం చేసే మరింత బైబిలు సమాచారాన్ని మీరెలా కనుగొనవచ్చు?

5 తమ భాషలో సీడీ-రామ్‌పై వాచ్‌టవర్‌ లైబ్రరీ అందుబాటులో ఉన్నవారు, వివిధ విషయాల మీద విస్తృతమైన సమాచారాన్ని కంప్యూటర్‌లో సులభంగా చూడవచ్చు. అయితే ఈ పరికరం అందుబాటులో లేని వారి సంగతి ఏమిటి? మన అవగాహనను పెంచుకొని, ప్రత్యేకించి ఎవరైనా, దేవుడు ఎవరు, యేసు నిజంగా ఎలా ఉండేవాడు? వంటి ప్రశ్నలను అడిగినప్పుడు ఇంకా సవివరంగా జవాబులను ఎలా ఇవ్వచ్చో తెలుసుకోవడానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని రెండు చర్చాంశాలను మనం పరిశీలిద్దాం.​—⁠నిర్గమకాండము 5:⁠2; లూకా 9:​18-20; 1 పేతురు 3:⁠15, 16.

దేవుడెవరు?

6, 7. (ఎ) దేవుణ్ణి గురించి ఏ ప్రశ్న తలెత్తుతుంది? (బి) ఒక పాదిరి తన ప్రసంగంలో ప్రాముఖ్యమైన ఏ విషయాన్ని వదిలిపెట్టేశాడు?

6 దేవుడెవరు? అనే ప్రాముఖ్యమైన ప్రశ్నకు దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లోని 2వ పాఠం సమాధానమిస్తోంది. ఇది ప్రాథమిక విషయం. ఎందుకంటే, ఒక వ్యక్తికి సత్య దేవుడు ఎవరో తెలియకపోతే లేదా ఆయన ఉనికినే సందేహిస్తుంటే అతడు ఆయనను ఆరాధించలేడు. (రోమీయులు 1:​19, 20; హెబ్రీయులు 11:⁠6) అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు దేవుడు ఎవరు అనే విషయంలో వందలాది భావనలున్నాయి. (1 కొరింథీయులు 8:​4-6) దేవుడు ఎవరన్న ప్రశ్నకు ఒక్కో తత్త్వశాస్త్రం ఒక్కో జవాబునిస్తుంది. క్రైస్తవమత సామ్రాజ్యంలో, అధిక శాతం మతాలు దేవుణ్ణి ఒక త్రిత్వంగా దృష్టిస్తున్నాయి. అమెరికాలోని ప్రముఖ పాదిరి, “దేవుడు మీకు తెలుసా?” అన్న ప్రసంగాన్నిచ్చాడు. ఆయన తన ప్రసంగంలో హీబ్రూ లేఖనాలను అనేకసార్లు ఉటంకించినప్పటికీ, కనీసం ఒక్కసారైనా దేవుని పేరును పేర్కొనలేదు. అవును, ఆయన ఉపయోగించిన బైబిలు అనువాదంలో యెహోవా అని గానీ యాహ్వే అని గానీ లేకుండా ద్వంద్వార్థాలుగల పదం, పేరును సూచించని “ప్రభువు” అనే పదం ఉపయోగించబడింది.

7 ఆయన “వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలిసికొనుటను గూర్చి [హీబ్రూలో, “యెహోవాను తెలిసికొనుటను గూర్చి”] బోధింపనక్కర లేదు. అల్పులు అధికులు ఎల్లరు నన్ను తెలిసికొందురు. . . . ఇవి ప్రభువైన నా పలుకులు” అని చెబుతున్న యిర్మీయా 31:​33, 34 (పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) వచనాలను ఎత్తిచెప్పినప్పుడు ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పకుండా తప్పిపోయాడో కదా. ఆయన ఉపయోగించిన అనువాదములో దేవుని విశిష్ట నామమైన యెహోవా అనే పేరు లేదు.​—⁠కీర్తన 103:1, 2.

8. దేవుని నామాన్ని ఉపయోగించడం యొక్క ప్రాధాన్యతను ఏది స్పష్టంగా చూపిస్తుంది?

8 “యెహోవా మా ప్రభువా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది!” అని చెబుతూ యెహోవా పేరును ఉపయోగించడం ఎందుకు అంత ప్రాముఖ్యమో కీర్తన 8:​9 స్పష్టం చేస్తోంది! దాన్ని దీనితో పోల్చండి: “మా దేవుడైన ప్రభూ! నీ మహత్త్యము భూమి యందంతట చూపట్టుచున్నది.” (కీర్తన 8:⁠8; పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము) అయినప్పటికీ, ముందు ఆర్టికల్‌లో చెప్పినట్లు దేవుని వాక్యం మనకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి మనం అనుమతిస్తే, మనం “దేవుని గూర్చిన విజ్ఞానము” పొందగలము. అయితే దేవుని నామ ప్రాధాన్యతకు సంబంధించి మనకున్న ప్రశ్నలకు వెంటనే జవాబివ్వగల బైబిలు అధ్యయన సహాయకారి ఏది?​—⁠సామెతలు 2:1-6.

9. (ఎ) దేవుని పేరును ఉపయోగించడం యొక్క ప్రాధాన్యతను వివరించేందుకు మనకు ఏ ప్రచురణ సహాయపడగలదు? (బి) చాలా మంది అనువాదకులు దేవుని నామానికి గౌరవం చూపించడంలో ఎలా విఫలులయ్యారు?

9మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని చూడవచ్చు. అది 131 భాషల్లోకి అనువదించబడింది. * “దేవుడు​—⁠ఆయనెవరు?” అనే నాలుగవ అధ్యాయం (పేజీలు 41-44, పేరాలు 18-24) హీబ్రూ టెట్రగ్రామటన్‌ (గ్రీకు అర్థం “నాలుగు అక్షరాలు”) ప్రాచీన హీబ్రూ పాఠ్యభాగంలో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుందని స్పష్టంగా చూపిస్తుంది. అయినప్పటికీ యూదామతంలోని అలాగే క్రైస్తవ మతసామ్రాజ్యంలోని నాయకులూ అనువాదకులూ తమ అత్యధిక బైబిలు అనువాదాల్లో నుండి దానిని కావాలని తీసివేశారు. * వాళ్ళు దేవుని నామాన్ని ఒప్పుకోవడానికి నిరాకరిస్తే, తమకు దేవుడు తెలుసనీ ఆయనతో తమకు అంగీకృత సంబంధముందనీ వాళ్ళు ఎలా చెప్పగలరు? ఆయన నిజమైన నామము, ఆయన సంకల్పాలు ఏమిటన్నదాని గురించీ ఆయన ఎవరన్న దాని గురించీ అర్థం చేసుకునే అవకాశాన్నిస్తుంది. దేవుని పేరే ఉపయోగించకపోతే, యేసు చెప్పిన మాదిరి ప్రార్థనలో భాగమైన “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అన్న మాటలకు ఏమి విలువ ఉంటుంది?​—⁠మత్తయి 6:​9, 10; యోహాను 5:​43; 17:⁠6.

యేసుక్రీస్తు ఎవరు?

10. యేసు జీవితాన్ని గురించీ పరిచర్య గురించీ సంపూర్ణంగా తెలుసుకోగల మార్గాలు ఏమిటి?

10దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌లో 3వ పాఠానికి “యేసు క్రీస్తు ఎవరు?” అనే శీర్షిక ఉంది. యేసు గురించీ, ఆయన ఆరంభం గురించీ, భూమ్మీదకు ఆయన రావడంలో గల ఉద్దేశం గురించీ కేవలం ఆరు పేరాల్లో అది క్లుప్తంగా చెబుతుంది. అయితే, మీకు ఆయన జీవితాన్ని గురించిన సంపూర్ణ వృత్తాంతం కావాలంటే​—⁠సువార్త వృత్తాంతాల తర్వాత​—⁠జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని మించినది లేదు. ఈ పుస్తకం 111 భాషల్లో లభ్యమవుతోంది. * ఈ పుస్తకం క్రీస్తు జీవితం గురించిన ఆయన బోధల గురించిన వృత్తాంతాన్ని నాలుగు సువార్తల ఆధారంగా కాలక్రమానుసారంగా సంపూర్ణంగా తెలుపుతుంది. దానిలోని 133 అధ్యాయాలు యేసు జీవితంలోను పరిచర్యలోను జరిగిన సంఘటనలను చర్చిస్తున్నాయి. విభిన్న కోణంలో విశ్లేషించేందుకు, మీరు అంతర్దృష్టి (ఆంగ్లం) 2వ సంపుటిలో “యేసుక్రీస్తు” అనే శీర్షిక క్రింద చూడవచ్చు.

11. (ఎ) యేసును గురించిన తమ విశ్వాసం విషయంలో యెహోవాసాక్షులను భిన్నమైనవారిగా చేసేదేమిటి? (బి) త్రిత్వ సిద్ధాంతం తప్పని స్పష్టంగా చూపించే కొన్ని బైబిలు లేఖనాలు ఏవి, ఈ విషయంలో ఏ ప్రచురణ సహాయకరంగా ఉంటుంది?

11 యేసు “దేవుని పుత్రుడు” అలాగే “కుమారుడైన దేవుడు” కూడానా కాదా అన్నదే క్రైస్తవమత సామ్రాజ్యంలో ఆయనను గురించిన వివాదాంశం, మరో మాటలో చెప్పాలంటే, త్రిత్వమే ఆ వివాదాంశం, క్యాటసిజమ్‌ ఆఫ్‌ ద క్యాథలిక్‌ చర్చ్‌ ఆ త్రిత్వాన్ని “క్రైస్తవ విశ్వాసంలోని ప్రధాన మర్మం” అని పిలుస్తుంది. యెహోవాసాక్షులు, క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతాలకు భిన్నంగా, యేసు దేవుని చేత సృష్టించబడ్డాడే కానీ ఆయన దేవుడు కాదు అని నమ్ముతారు. ఈ విషయంపై చక్కని చర్చ త్రిత్వమును మీరు నమ్మవలయునా? బ్రోషుర్‌లో లభ్యమవుతుంది. ఇది 95 భాషల్లోకి అనువదించబడింది. * ఈ బ్రోషుర్‌లో, త్రిత్వ సిద్ధాంతం తప్పని రుజువు చేసేందుకు ఉపయోగించిన అనేక లేఖనాల్లో మార్కు 13:⁠32; 1 కొరింథీయులు 15:24, 28 ఉన్నాయి.

12. ఇంకా ఏ ప్రశ్న గురించి మనం ఆలోచించాలి?

12 బైబిలు సత్యం తెలియని వాళ్ళు ఖచ్చితమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు వాళ్ళకు సహాయపడాలన్న ఉద్దేశంతో మనం వ్యక్తిగతంగా అధ్యయనం చేయగల విధానాలను చూపించడానికి దేవుని గురించీ యేసుక్రీస్తు గురించీ పైన చేసిన చర్చలు సహాయపడతాయి. (యోహాను 17:⁠3) అయితే అనేక సంవత్సరాలుగా క్రైస్తవ సంఘంతో సహవసిస్తున్న వారి విషయం ఏమిటి? వాళ్ళు బైబిలు పరిజ్ఞానాన్ని సమకూర్చుకొని ఉన్నారు కనుక, యెహోవా వాక్యపు వ్యక్తిగత అధ్యయనం మీద మనసు కేంద్రీకరించవలసిన అవసరం వాళ్ళకు ఇప్పటికీ ఉందా?

ఎందుకు ‘జాగ్రత్త కలిగివుండాలి’?

13. వ్యక్తిగత అధ్యయనం గురించి కొందరికి ఎలాంటి తప్పు దృక్పథం ఉండవచ్చు?

13 అనేక సంవత్సరాలుగా సంఘ సభ్యులుగా ఉన్న కొందరు, యెహోవాసాక్షులుగా తాము మొదటి కొద్ది సంవత్సరాల్లో సంపాదించిన బైబిలు పరిజ్ఞానం మీద మాత్రమే ఆధారపడే అలవాటు అలవరుచుకుని ఉండవచ్చు. “క్రొత్త వాళ్ళు అధ్యయనం చేయవలసినంతగా నేను అధ్యయనం చేయవలసిన అవసరం లేదు. అంతెందుకు, ఇన్ని సంవత్సరాలుగా నేను బైబిలును బైబిలు ప్రచురణలను ఎన్నోసార్లు చదివాను” అని తర్కించడం చాలా సులభం. అలా అనుకుంటే, “నేను ఇప్పుడు భోజనం విషయంలో అంత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం నిజానికి లేదు, గతంలో నేను ఎన్నిసార్లు భోంచేయలేదు” అని అనుకున్నట్లుగా ఉంటుంది. మన శరీరం ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే బాగా వండిన పోషకాహారం ద్వారా పోషించబడడం అవసరమని మనకు తెలుసు. మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్నీ బలాన్నీ కాపాడుకునేందుకు ఆధ్యాత్మిక పోషణ ఇంకా ఎంత ఎక్కువ అవసరం!​—⁠హెబ్రీయులు 5:12-14.

14. మన గురించి మనం ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండవలసిన అవసరం ఎందుకుంది?

14 కాబట్టి మనమందరము ఎంతోకాలం నుండి బైబిలు విద్యార్థులుగా ఉన్నవారమైనా క్రొత్తవారమైనా సరే అపొస్తలుడైన పౌలు, “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు” అని అప్పటికే పరిణతి చెందిన బాధ్యతాయుత పైవిచారణకర్తయైన తిమోతికిచ్చిన ఉపదేశాన్ని పాటించడం అవసరం. (1 తిమోతి 4:16) మనం పౌలు సలహాకు ఎందుకు అవధానమివ్వాలి? “అపవాది తంత్రముల”కు “ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముల”కు వ్యతిరేకంగా మనం పోరాడవలసి ఉందని కూడా పౌలు చెప్పాడని గుర్తుంచుకోండి. అపవాది, “ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. ఆ ‘ఎవరో’ మనలో ఎవరైనా కావచ్చు. మనం స్వయంతృప్తితో ప్రమాదం గుర్తించకుండా ఉండడమే, మనలను అతడు మ్రింగడానికి చూసే అవకాశం కావచ్చు.​—⁠ఎఫెసీయులు 6:11, 12; 1 పేతురు 5:⁠8.

15. మనకు ఎటువంటి ఆధ్యాత్మిక కవచముంది, దానిని మనమెలా కాపాడుకోగలము?

15 అయితే, మనకు ఎటువంటి రక్షణ కవచం ఉంది? “మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. (ఎఫెసీయులు 6:​13) ఆధ్యాత్మిక సర్వాంగకవచం ఎంత ఉపయోగకరంగా ఉంటుందన్నది, అది మొదట్లో ఎలా ఉందన్నదాని మీదే కాక, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చే ఆ సంపూర్ణ సర్వాంగకవచంలో దేవుని వాక్యపు తాజా పరిజ్ఞానం కూడా తప్పకుండా చేరివుండాలి. యెహోవా తన వాక్యం ద్వారా, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా వెల్లడి చేసిన సత్యపు అవగాహనను ఎప్పటికప్పుడు పొందడం యొక్క ప్రాధాన్యతను అది చూపిస్తుంది. మన ఆధ్యాత్మిక కవచాన్ని కాపాడుకోవడానికి బైబిలునూ బైబిలు ప్రచురణలనూ క్రమంగా వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం ఆవశ్యకము.​—⁠మత్తయి 24:45-47; ఎఫెసీయులు 6:​14, 15.

16. మన “విశ్వాసమను డాలు” సరిగా పనిచేస్తోందా లేదా అన్నది రూఢిపర్చుకోవడానికి మనమేమి చేయగలము?

16 “విశ్వాసమను డాలు” మన సంరక్షక కవచంలో ఒక అత్యావశ్యకమైన భాగమని పౌలు నొక్కి చెబుతున్నాడు. దానితో నిందారోపణలు, విశ్వాస భ్రష్టమైన బోధనలు అనే సాతాను అగ్ని బాణములను త్రిప్పికొట్టడం, ఆర్పడం చేయగలుగుతాము. (ఎఫెసీయులు 6:​16) కాబట్టి మన విశ్వాసమనే డాలు ఎంత బలంగా ఉంది, దాన్ని కాపాడుకోవడానికీ మరింత బలపర్చుకోవడానికీ తీసుకోవలసిన చర్యలు ఏమిటి అన్నవి పరిశీలించుకోవడం అవసరం. ఉదాహరణకు, ‘కావలికోటను ఉపయోగించుకుంటూ చేసే వారపు బైబిలు అధ్యయనానికి నేను ఎలా సిద్ధపడుతున్నాను? బాగా ఆలోచించుకున్న జవాబులను కూటాల్లో చెప్పడం ద్వారా ‘ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకోవడానికి’ తగినంతగా అధ్యయనం చేశానా? ఉల్లేఖించబడక కేవలం ఉదహరించబడిన లేఖనాలను బైబిలు తెరిచి చూస్తానా? కూటాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా నేను ఇతరులను ప్రోత్సహిస్తానా?’ అని మీరు ప్రశ్నించుకోవచ్చు. మన ఆధ్యాత్మిక ఆహారం బలమైనది, మనం దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందాలంటే దాన్ని చక్కగా జీర్ణించుకోవడం అవసరం.​—⁠హెబ్రీయులు 5:14; 10:⁠24, 25.

17. (ఎ) మన ఆధ్యాత్మికతను క్షీణింపజేయడానికి సాతాను ఎలాంటి విషాన్ని ఉపయోగిస్తున్నాడు? (బి) సాతాను విషానికి విరుగుడు ఏమిటి?

17 సాతానుకు అపరిపూర్ణ మానవుల బలహీనతలు తెలుసు, అతని తంత్రములు మోసపూరితమైనవి. తన దుష్ట ప్రభావాన్ని వ్యాపింపజేసేందుకు అతడు ఉపయోగించే మార్గాల్లో ఒకటి టీవీలోను ఇంటర్‌నెట్‌లోను వీడియోల్లోను ముద్రిత ప్రచురణల్లోను అశ్లీల సమాచారమూ చిత్రాలూ సులభంగా లభ్యమయ్యేలా చేయడం. కొందరు క్రైస్తవులు, బలహీనమైన తమ రక్షణ కవచాల్లోకి ఈ విషం చొచ్చుకుపోయేందుకు అనుమతించారు, అది వాళ్ళు తమకు సంఘంలో ఉన్న ఆధిక్యతలను కోల్పోయేందుకూ ఇంకా తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనేందుకూ కూడా దారితీసింది. (ఎఫెసీయులు 4:​17-19) సాతాను ఆధ్యాత్మిక విషానికి విరుగుడు ఏమిటి? మనం మన వ్యక్తిగత క్రమ బైబిలు అధ్యయనాన్నీ, మన క్రైస్తవ కూటాలనూ, దేవుడిచ్చే సర్వాంగకవచాన్నీ నిర్లక్ష్యం చేయకుండా ఉండడమే. ఇవన్నీ కలిసి మనం తప్పొప్పులను గ్రహించే సామర్థ్యాన్నీ, దేవుడు ద్వేషించేవాటిని ద్వేషించే సామర్థ్యాన్ని మనకిస్తాయి.​—⁠కీర్తన 97:10; రోమీయులు 12:⁠9.

18. మన ఆధ్యాత్మిక పోరాటంలో “ఆత్మ ఖడ్గము” మనకు ఎలా సహాయపడగలదు?

18 మనం మన క్రమ బైబిలు అధ్యయన అలవాట్లను కాపాడుకుంటే, దేవుని వాక్యపు ఖచ్చితమైన పరిజ్ఞానం ఇచ్చే దృఢమైన సంరక్షక కవచాన్ని కలిగివుండడమే కాక, ‘దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము’ ద్వారా విజయవంతంగా ఎదురుదాడి చేయగలుగుతాము. దేవుని వాక్యం “సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (ఎఫెసీయులు 6:⁠17; హెబ్రీయులు 4:​12) మనం ఆ ‘ఖడ్గము’ను ఉపయోగించడంలో నిపుణులమైతే, మనకు శోధనలు ఎదురైనప్పుడు, హానిరహితమైనదిగా లేదా చివరికి ఆకర్షణీయమైనదిగా కనిపించే దాన్ని స్పష్టంగా గుర్తించి, అది దుష్టుని ప్రాణాంతకమైన వల అని వెల్లడి చేయగలుగుతాము. మనకున్న బైబిలు పరిజ్ఞానము, అవగాహన దుష్టమైన దానిని తృణీకరించి, మంచి చేయడానికి మనకు సహాయపడుతుంది. ‘నా ఖడ్గం ఆశ్రయించదగినదిగా ఉందా లేక తుప్పుపట్టి ఉందా? మనం చేసే ఎదురుదాడిని బలపర్చగల బైబిలు వచనాలను జ్ఞాపకం చేసుకోవడం నాకు కష్టమవుతోందా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం మనకందరికీ ఉంది. మనమందరమూ మంచి వ్యక్తిగత బైబిలు అధ్యయన అలవాట్లను కాపాడుకొంటూ, తద్వారా అపవాదిని ఎదిరించుదాం.​—⁠ఎఫెసీయులు 4:22-24.

19. మనం వ్యక్తిగత అధ్యయనంలో పూర్తిగా నిమగ్నమయితే మనకు వచ్చే ప్రయోజనాలు ఏవి?

19 “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని పౌలు వ్రాశాడు. పౌలు తిమోతికి వ్రాసిన ఈ మాటలకు మనం అవధానం ఇస్తే, మనం మన సొంత ఆధ్యాత్మికతను బలపర్చుకోగలము, మన పరిచర్యను మరింత ఫలప్రదం చేసుకోగలము. ఆధ్యాత్మిక పెద్దలూ పరిచర్య సేవకులూ సంఘానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండగలరు, మనమందరమూ విశ్వాసంలో దృఢంగా ఉండగలము.​—⁠2 తిమోతి 3:​16, 17; మత్తయి 7:24-27.

[అధస్సూచీలు]

^ పేరా 4 సాధారణంగా క్రొత్తగా ఆసక్తి చూపించిన వ్యక్తి, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను అధ్యయనం చేసిన తర్వాత నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని అధ్యయనం చేస్తాడు. ఈ రెండింటినీ యెహోవాసాక్షులే ప్రచురించారు. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నవాటిని తొలగించేందుకు ఇక్కడ ఇవ్వబడిన సూచనలు సహాయపతాయి.

^ పేరా 9 యెహోవాసాక్షులు ప్రచురించినది. లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) తమ భాషలో ఉన్నవారు రెండవ సంపుటిలో “యెహోవా” అనే శీర్షిక క్రింద చూడవచ్చు.

^ పేరా 9 అనేక స్పానిష్‌, కాటలోనియన్‌ అనువాదాలు గమనార్హమైన మినహాయింపులు, ఎందుకంటే అవి హీబ్రూ టెట్రగ్రామటన్‌ను “యావే,” “యాహ్వే,” “జేవే,” “కేయోవా” అని అనువదించాయి.

^ పేరా 10 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 11 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• ఫలప్రదమైన వ్యక్తిగత అధ్యయనానికి దోహదపడే పరిస్థితులు ఏవి?

• దేవుని పేరు విషయంలో చాలా మంది బైబిలు అనువాదకులు ఏ పొరపాటు చేశారు?

• త్రిత్వం అనే బోధ తప్పని చూపించేందుకు మీరు ఉపయోగించే బైబిలు వచనాలు ఏవి?

• మనం ఎన్నో సంవత్సరాలుగా నిజక్రైస్తవులుగా ఉన్నప్పటికీ సాతాను తంత్రాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏమి చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[19వ పేజీలోని చిత్రాలు]

వ్యక్తిగత అధ్యయనం ఫలప్రదంగా ఉండాలంటే, మీ శ్రద్ధ మళ్ళించేవి అంతగా లేని సరైన స్థలం అవసరం

[23వ పేజీలోని చిత్రాలు]

మీ “ఖడ్గము” ఆశ్రయించదగినదిగా ఉందా లేక తుప్పుపట్టి ఉందా?