కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వచ్ఛందంగా ఇవ్వడం సంతోషాన్నిస్తుంది

స్వచ్ఛందంగా ఇవ్వడం సంతోషాన్నిస్తుంది

స్వచ్ఛందంగా ఇవ్వడం సంతోషాన్నిస్తుంది

ఈశాన్య బ్రెజిల్‌లోని ఒక కుగ్రామంలో నివసించే జనీవల్‌, ఒక హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేయగా వచ్చిన చాలీచాలని జీతంతో తన భార్యాపిల్లలను పోషించేవాడు. తనకు కష్టంగా ఉన్నప్పటికీ, జనీవల్‌ హృదయపూర్వకంగా దశమభాగాన్ని చెల్లించేవాడు. జరిగినదాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన తన కడుపు పట్టుకుని ఇలా అన్నాడు: “కొన్నిసార్లు నా కుటుంబం ఆకలితో ఉండేది, అయినప్పటికీ నేను ఎలాంటి త్యాగం చేయవలసి వచ్చినా దేవునికి నాకున్న దాంట్లో ఉత్తమమైనది ఇవ్వాలని నేను అనుకునేవాడిని.”

తన ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత కూడా జనీవల్‌ దశమభాగాన్ని చెల్లించాడు. పెద్ద మొత్తంలో డబ్బు విరాళంగా ఇవ్వడం ద్వారా దేవుణ్ణి పరీక్షించమని ప్రీస్టు ఆయనకు ఉద్బోధించాడు. దేవుడు తప్పకుండా దీవెనలు కుమ్మరిస్తాడని ఆ ప్రీస్టు హామీ ఇచ్చాడు. కాబట్టి, జనీవల్‌ తన ఇంటిని అమ్మి, వచ్చే డబ్బును చర్చీకి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు.

ఇంత హృదయపూర్వకంగా ఇచ్చేది జనీవల్‌ ఒక్కడే కాదు. నిరుపేదలైన అనేకమంది దశమభాగాన్ని విధిగా చెల్లిస్తారు ఎందుకంటే, దశమభాగాన్ని చెల్లించడమనేది లేఖనాధారిత బాధ్యత అని వారి చర్చీలు వారికి బోధించాయి. అది నిజమేనా?

దశమభాగం, ధర్మశాస్త్రం

దశమభాగాన్ని చెల్లించాలనే ఆజ్ఞ, యెహోవా దేవుడు 3,500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం క్రితం ప్రాచీన ఇశ్రాయేలీయుల్లోని 12 గోత్రాలకు ఇచ్చిన ధర్మశాస్త్రములో ఒక భాగం. లేవీయులు గుడారములో చేస్తున్న సేవలకు మద్దతుగా భూఫలములు వృక్షఫలములు వంటివాటిలో దశమభాగం, పశువుల మందలు పెరిగినప్పుడు ఆ పెరుగుదలలోని దశమభాగం ఇవ్వాలని ఆ ధర్మశాస్త్రంలో ఆదేశించబడింది.​—⁠లేవీయకాండము 27:​30, 32; సంఖ్యాకాండము 18:​21, 24.

ధర్మశాస్త్రమును అనుసరించడం “కఠినమైనది కాదు” అని యెహోవా ఇశ్రాయేలీయులకు హామీ ఇచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 30:​11) వారు నమ్మకంగా యెహోవా ఆజ్ఞలను​—⁠దశమభాగాన్ని చెల్లించడంతో పాటు​—⁠పాటించినంత కాలం, వారి పంటలు బాగా పండుతాయని ఆయన వాగ్దానం చేశాడు. ఆహార కొరత ఏర్పడినప్పుడు ఉపయోగించుకునేందుకుగానూ అదనంగా వార్షిక దశమభాగం క్రమంగా వసూలుచేయబడేది. సాధారణంగా, మతపరమైన పండుగల కోసం జనాంగం అంతా కలుసుకున్నప్పుడు అది ఉపయోగించబడేది. అలా “పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును” తృప్తిపొందేవారు.​—⁠ద్వితీయోపదేశకాండము 14:28, 29; 28:1, 2, 11-14.

దశమభాగం చెల్లించకపోతే ఈ శిక్ష విధించబడుతుంది అని ధర్మశాస్త్రము ప్రత్యేకించి ఏమీ చెప్పడంలేదు, కానీ ప్రతీ ఇశ్రాయేలీయునికీ, దశమభాగం చెల్లించడం ద్వారా సత్యారాధనకు మద్దతునివ్వాలనే బలమైన నైతిక బాధ్యత ఉండేది. నిజానికి, మలాకీ కాలంలో దశమభాగం చెల్లించడాన్ని నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలీయులు ‘పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక తనయొద్ద దొంగిలిరి’ అని యెహోవా నిందించాడు. (మలాకీ 3:⁠8) దశమభాగాన్ని చెల్లించని క్రైస్తవులు కూడా అలా దొంగిలిస్తున్నారని చెప్పవచ్చా?

మనం ఆ విషయాన్ని పరిశీలిద్దాం. సాధారణంగా ఒక దేశానికి సంబంధించిన నియమాలు మరో దేశంలో చెల్లవు. ఉదాహరణకు వాహనాలను రోడ్డుకు ఎడమవైపు నడిపించమని డ్రైవర్లను బద్ధులను చేసే బ్రిటన్‌లోని నియమం ఫ్రాన్సులోని డ్రైవర్లకు అన్వయించదు. అదే విధంగా, దశమభాగాన్ని చెల్లించాలి అనే ఆజ్ఞ, దేవునికీ ఇశ్రాయేలు జనాంగానికీ మధ్య మాత్రమే ఉన్న నిబంధనలో ఒక భాగం. (నిర్గమకాండము 19:3-8; కీర్తన 147:​19, 20) కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఆ ఆజ్ఞ ఇవ్వబడింది.

అంతేకాకుండా, దేవుడు ఎన్నటికీ మారడు అన్నది వాస్తవమే అయినప్పటికీ, ఆయన మననుండి కోరే విషయాలు కొన్నిసార్లు మాత్రం మారతాయి. (మలాకీ 3:⁠6) సా.శ. 33వ సంవత్సరంలో యేసు బలి మరణం, ధర్మశాస్త్రాన్నీ దానితోపాటు ‘పదియవవంతును పుచ్చుకోవాలనే ఆజ్ఞను’ ‘తుడిచివేసింది,’ లేక ‘కొట్టివేసింది’ అని బైబిలు సూటిగా చెబుతోంది.​—⁠హెబ్రీయులు 7:​5, 18, 19; కొలొస్సయులు 2:​13-15; ఎఫెసీయులు 2:13-15.

క్రైస్తవులుగా ఇవ్వడం

అయినప్పటికీ, సత్యారాధనకు మద్దతునివ్వడానికి విరాళాల అవసరం ఉండేది. ‘భూదిగంతముల వరకును సాక్షులైయుండుడి’ అని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (అపొస్తలుల కార్యములు 1:⁠8) విశ్వాసుల సంఖ్య పెరిగిన కొద్దీ, క్రైస్తవ బోధకులూ పైవిచారణకర్తలూ సంఘాలను సందర్శించి వాటిని బలపర్చవలసిన అవసరం కూడా పెరిగింది. విధవరాండ్ర, అనాథల, అవసరంలో ఉన్న ఇతరుల విషయంలో శ్రద్ధ చూపించవలసి ఉండేది. వీటన్నింటికీ అయ్యే ఖర్చును మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా భరించారు?

దాదాపు సా.శ. 55వ సంవత్సరంలో, యూదయలోని బీద సంఘం తరపున యూరప్‌లోనూ ఆసియా మైనర్‌లోనూ ఉన్న యూదేతర క్రైస్తవులను అభ్యర్థించడం జరిగింది. అపొస్తలుడైన పౌలు కొరింథులోని సంఘానికి తాను వ్రాసిన ఉత్తరాలలో “పరిశుద్ధులకొరకైన చందా” ఎలా వ్యవస్థీకరించబడిందో వర్ణించాడు. (1 కొరింథీయులు 16:⁠1) పౌలు మాటలు, క్రైస్తవులు ఎలా ఇవ్వాలి అన్నదాని గురించి ఏమి వెల్లడిచేస్తున్నాయో తెలుసుకొని మీరు ఆశ్చర్యపోవచ్చు.

తోటి విశ్వాసులు ఇచ్చేలా ఒప్పింపజేయడానికి అపొస్తలుడైన పౌలు వారిని ఒత్తిడి చెయ్యలేదు. నిజానికి, ‘బహు శ్రమవలన పరీక్షింపబడుతున్న’ “నిరుపేదలైన” మాసిదోనియ క్రైస్తవులు, ‘ఈ కృప [“దయతో ఇవ్వడమనే ఆధిక్యత,” NW] విషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా ఆయనను వేడుకుంటూ’ ఉండవలసి వచ్చింది.​—⁠2 కొరింథీయులు 8:​1-4.

నిజమే, మాసిదోనియలోని ఉదారస్వభావంగల తమ సహోదరులను అనుకరించమని ధనవంతులైన కొరింథీయులను పౌలు ప్రోత్సహించాడు. ఆయన ‘ఆజ్ఞలను జారీచేయడానికి మొగ్గు చూపే బదులుగా కోరడాన్ని, సూచించడాన్ని, ప్రోత్సహించడాన్ని లేదా అభ్యర్థించడాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇవ్వమని కొరింథీయులను బలవంతపెడితే, అప్పుడు వారు ఇచ్చేది స్వచ్ఛందంగా హృదయపూర్వకంగా ఉండదు’ అని ఒక రెఫరెన్సు గ్రంథం వ్యాఖ్యానించింది. “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” కానీ ‘సణుగుకొనుచు బలవంతముగా’ ఇచ్చేవానిని కాదు అని పౌలుకు తెలుసు.​—⁠2 కొరింథీయులు 9:⁠7.

తోటి క్రైస్తవులపట్ల ఉన్న యథార్థమైన ప్రేమతోపాటు సమృద్ధిగా ఉన్న విశ్వాసమూ, జ్ఞానమూ స్వచ్ఛందంగా ఇచ్చేలా కొరింథీయులను కదిలించి ఉంటాయి.​—⁠2 కొరింథీయులు 8:⁠7, 8.

“తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము”

ఇంత మొత్తమనీ లేదా ఇంత శాతమనీ నిర్దిష్టంగా చెప్పే బదులు, పౌలు “తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి” అని మాత్రమే సలహా ఇచ్చాడు. (ఇటాలిక్కులు మావి; 1 కొరింథీయులు 16:​2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కొరింథీయులు ప్రణాళిక వేసుకొని క్రమంగా కొంత డబ్బును ప్రక్కకు తీసి పెట్టడం ద్వారా, పౌలు వచ్చినప్పుడు సణుగుకోకుండా లేదా భావోద్రేకమైన ప్రేరణవల్ల ఇవ్వడానికి ఒత్తిడి చేయబడినట్లు భావించేవారు కాదు. ప్రతి క్రైస్తవునికీ, తాను ఎంత ఇవ్వాలో నిర్ణయించుకునే విషయం వ్యక్తిగతమైనది, తాను ‘తన హృదయములో నిశ్చయించుకొనేది.’​—⁠2 కొరింథీయులు 9:⁠5, 7.

సమృద్ధిగా పంట కోయాలంటే కొరింథీయులు సమృద్ధిగా విత్తాలి. వారు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని ఎక్కడా సూచించబడలేదు. ‘మీకు భారముగా ఉండవలెనని ఇది చెప్పుటలేదు’ అని పౌలు వారికి హామీ ఇచ్చాడు. “శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చిన” విరాళములు “ప్రీతికరమవును.” (2 కొరింథీయులు 8:​12, 13; 9:⁠6) తర్వాత వ్రాసిన ఒక ఉత్తరంలో అపొస్తలుడైన పౌలు ఈ హెచ్చరికను ఇచ్చాడు: “ఎవడైనను . . . తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:⁠8) ఈ సూత్రాన్ని ఉల్లంఘించి ఇవ్వాలని పౌలు ప్రోత్సహించలేదు.

అవసరంలోవున్న ‘పరిశుద్ధులకొరకు చందాలు’ వసూలు చేయడాన్ని పౌలు పర్యవేక్షించాడన్నది గమనార్హం. పౌలు లేక ఇతర అపొస్తలులు తమ సొంత పరిచర్యకు ఆర్థిక మద్దతును సమకూర్చుకోవడానికి చందా సేకరణను వ్యవస్థీకరించినట్లు దశమభాగాలు వసూలు చేసినట్లు మనం లేఖనాలలో ఎక్కడా చదవము. (అపొస్తలుల కార్యములు 3:⁠6) సంఘాలు తనకు పంపించే బహుమానాలు స్వీకరించేందుకు పౌలు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండేవాడు. అయితే ఆయన తన సహోదరులపై “భారము” మోపడాన్ని మనఃపూర్వకంగా నివారించాడు.​—⁠1 థెస్సలొనీకయులు 2:⁠9; ఫిలిప్పీయులు 4:​15-18.

నేడు స్వచ్ఛందంగా ఇవ్వడం

మొదటి శతాబ్దంలో, క్రీస్తు అనుచరులు స్వచ్ఛందంగా ఇవ్వడాన్ని అలవాటు చేసుకున్నారు కానీ దశమభాగం చెల్లించడాన్ని కాదన్నది స్పష్టం. అయితే, సువార్త ప్రకటనా పనికి ఆర్థిక మద్దతు ఇవ్వడానికీ అవసరంలో ఉన్న క్రైస్తవులను చూసుకోవడానికీ ఇప్పటికీ ఆ మార్గం ప్రభావవంతమైనదేనా అని మీరు అనుకుంటుండవచ్చు.

ఈ క్రింది విషయాలను పరిగణలోనికి తీసుకోండి. 1879వ సంవత్సరంలో ఈ పత్రిక సంపాదకులు, “మద్దతు కోసం ఎన్నడూ మానవులను యాచించము, అర్థించము” అని బహిరంగంగా ప్రకటించారు. ఆ నిర్ణయం, బైబిలు సత్యాన్ని వ్యాపింపజేయడానికి యెహోవాసాక్షులు చేస్తున్న కృషిని ఆటంకపరిచిందా?

ప్రస్తుతం సాక్షులు బైబిళ్ళను, క్రైస్తవ పుస్తకాలను, ఇతర ప్రచురణలను 235 దేశాలలో పంచిపెడుతున్నారు. బైబిలు విద్యా పత్రిక అయిన కావలికోట మొదట్లో ఒక్క భాషలో ముద్రించబడి ప్రతి నెలా 6,000 కాపీలు పంచిపెట్టబడేవి. తర్వాత అది 146 భాషల్లో, 2,40,00,000 ప్రతుల కంటే ఎక్కువ ప్రతులు ముద్రించబడే పక్ష పత్రికగా తయారయ్యింది. భూగోళవ్యాప్తంగా తమ బైబిలు విద్యా పనిని వ్యవస్థీకరించుకోవడానికి, సాక్షులు 110 దేశాలలో కార్యనిర్వాహక బ్రాంచీలను నిర్మించుకున్నారు లేదా సంపాదించుకున్నారు. అంతేకాకుండా, మరింత బైబిలు ఉపదేశాన్ని పొందాలన్న ఆసక్తి చూపించేవారు కూర్చొని వినడానికి స్థానికంగా వేలాది రాజ్యమందిరాలను, పెద్ద సమావేశ హాళ్ళను నిర్మించారు.

ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, యెహోవాసాక్షులు తమ తోటి విశ్వాసుల భౌతిక అవసరాలను నిర్లక్ష్యం చేయరు. తమ సహోదరులు యుద్ధాల, భూకంపాల, అనావృష్టుల, తుఫానుల ప్రభావాల వల్ల బాధపడినప్పుడు, యెహోవాసాక్షులు మందులు, ఆహారం, వస్త్రాలు, అవసరమైన ఇతర వస్తువులను తక్షణమే అందజేస్తారు. క్రైస్తవుల్లోని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఇచ్చిన విరాళాలు, సంఘాలు ఇచ్చిన విరాళాలు ఆ పనులకు ఆర్థిక మద్దతును అందిస్తాయి.

విరాళాలను స్వచ్ఛందంగా ఇవ్వడమనేది ప్రభావవంతంగా ఉండడమే కాక, ముందు ప్రస్తావించబడిన జనీవల్‌ లాంటి బీదవారి మీద నుండి భారాన్ని తీసివేస్తుంది. సంతోషకరంగా, జనీవల్‌ తన ఇంటిని అమ్మడానికి ముందే, యెహోవాసాక్షి, పూర్తికాల సేవకురాలు అయిన మారియా అతనిని సందర్శించింది. “ఆమెతో జరిగిన సంభాషణ, నా కుటుంబాన్ని అనవసరమైన కష్టాలనుండి కాపాడింది” అని జనీవల్‌ గుర్తుచేసుకుంటున్నాడు.

దేవుని పని దశమభాగాలపై ఆధారపడిలేదు అని జనీవల్‌ తెలుసుకున్నాడు. నిజానికి, లేఖనాధారితంగా మనం ఇప్పుడు దశమభాగాన్ని చెల్లించవలసిన అవసరం లేదు. క్రైస్తవులు ఉదారంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించబడతారనీ, ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వవలసిన బాధ్యత వారికి లేదనీ ఆయన తెలుసుకున్నాడు.

స్వచ్ఛందంగా ఇవ్వడాన్ని అలవాటు చేసుకోవడం జనీవల్‌కు నిజమైన సంతోషాన్ని తెచ్చింది. ఆయన దాన్నిలా వ్యక్తపరుస్తున్నాడు: “నేను 10 శాతం ఇవ్వవచ్చు ఇవ్వలేకపోవచ్చు, కానీ నేను ఇస్తున్న విరాళాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను, యెహోవా కూడా సంతోషంగా ఉన్నాడని నాకు నమ్మకం ఉంది.”

[6వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

తొలి చర్చీ ఫాదర్‌లు దశమభాగం చెల్లించమని బోధించారా?

“మన మధ్య ఉన్న సంపన్నులు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారు . . . ధనవంతులైనవారు, ఇవ్వడానికి ఇష్టపడేవారు, తమకు ఎంత తగినది అనిపిస్తే అంతే ఇస్తారు.”​—⁠ద ఫస్ట్‌ అపాలజీ, జస్టిన్‌ మార్టిర్‌, ఇంచుమించు సా.శ. 150.

“యూదులు నిజంగానే తమ సరుకులలోని దశమభాగాన్ని దేవునికి సమర్పించారు, కానీ క్రైస్తవులు, . . . తన దగ్గరున్న దాన్నంతటినీ దేవుని కానుకపెట్టెలో వేసిన పేద విధవరాలివలే, దేవుని సంకల్పాల కోసం తమ ఆస్తినంతటినీ ప్రక్కకు తీసిపెట్టారు.”​—⁠ఎగెయిన్‌స్ట్‌ హెరిసీస్‌, ఐరీనీయస్‌, ఇంచుమించు సా.శ. 180.

“మావద్ద కానుకపెట్టె ఉంది, కానీ తనకంటూ ఒక ధర కలిగిన మతంవలే ఆ పెట్టె రక్షణను కొనుక్కొనేందుకు చెల్లించబడిన డబ్బుతో తయారుచేయబడినది కాదు. నెలకు ఒకసారి, ప్రతి ఒక్కరూ తాము ఇష్టపడితే ఆ కానుక పెట్టెలో కొంత విరాళం వేస్తారు. అయితే అలా వేయడం ఒక వ్యక్తికి సంతోషాన్నిస్తేనే, ఆయన అలా ఇవ్వగలిగితేనే ఇవ్వాలి. బలవంతమేమీ లేదు, ప్రతీది స్వచ్ఛందంగానే వేయబడుతుంది.”​—⁠అపాలజీ, టెర్టూలియన్‌, ఇంచుమించు సా.శ. 197.

“చర్చీ విస్తరించి, వేర్వేరు సంస్థలు నెలకొన్నప్పుడు, మతగురువులకు సరిపడేంత శాశ్వతమైన ఆర్థిక మద్దతును ఏర్పాటు చేసుకోవడానికి నియమాలు చేయవలసిన అవసరం ఏర్పడింది. దశమభాగాలను చెల్లించడం అనే నియయం ధర్మశాస్త్రము నుండి తీసుకోబడింది . . . ఈ విషయంలో మొట్టమొదటిసారి తీసుకున్న ఖచ్చితమైన శాసనం, 567 లో టూర్స్‌ నగరంలో కూడుకున్న బిషప్పుల ఉత్తరంలోనూ 585 లో జరిగిన కౌన్సిల్‌ ఆఫ్‌ మాకన్‌ చేసిన నియమాల్లోనూ ఉన్నట్లు కనిపిస్తుంది.”​—⁠ద క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా.

[చిత్రసౌజన్యం]

నాణెం, పైన ఎడమవైపున: Pictorial Archive (Near Eastern History) Est.

[4, 5వ పేజీలోని చిత్రం]

స్వచ్ఛందంగా ఇవ్వడం సంతోషాన్ని తెస్తుంది

[7వ పేజీలోని చిత్రాలు]

స్వచ్ఛంద విరాళాలు ప్రకటనా పనికి, అత్యవసర పరిస్థితులలో సహాయం చేయడానికి, రాజ్యమందిరాలు నిర్మించడానికి ఆర్థిక మద్దతునిస్తాయి