కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ముగ్గురు జ్ఞానులు” ఎవరు వారు?

“ముగ్గురు జ్ఞానులు” ఎవరు వారు?

“ముగ్గురు జ్ఞానులు” ఎవరు వారు?

యేసు జననానికి సంబంధించిన దృశ్యాలు సాధారణంగా, ఒక పశువుల పాకలోని మేతతొట్టిలో శిశువైన యేసును పడుకోబెట్టినట్లు, నిలువుటంగీలు ధరించిన ముగ్గురు మనుష్యులు తమ ఒంటెలతో అక్కడికి చేరుకున్నట్లు సూచిస్తాయి. ఎంతో శ్రేష్ఠమైన దుస్తులను ధరించిన ఆ సందర్శకులను సాధారణంగా ముగ్గురు జ్ఞానులు అని అంటారు. వారి గురించి బైబిలు ఏమని చెబుతోంది?

బైబిలు ప్రకారం, జ్ఞానులని పిలువబడే ఈ వ్యక్తులు “తూర్పుదేశపు” వారు, అక్కడే వారు యేసు జననం గురించి తెలుసుకున్నారు. (మత్తయి 2:​1, 2, 9) అక్కడి నుండి యూదయకు చేరుకోవడానికి ఈ ముగ్గురు మనుష్యులకు చాలా కాలం పట్టి ఉంటుంది. చివరికి వారు యేసును కనుగొన్నప్పుడు ఆయన అప్పుడే జన్మించిన ఒక పసికందుగా పశువుల పాకలో లేడు. బదులుగా మరియ, “ఆ శిశువు” ఒక ఇంట్లో ఉండడాన్ని వారు చూశారు.​—⁠మత్తయి 2:​10, 11.

బైబిలు ఈ మనుష్యులను మాగీలు (మునీశ్వరులు) లేదా “జ్యోతిష్కులు” అని పిలుస్తోంది, అయితే వారు ఎంతమంది అనేది మాత్రం చెప్పడం లేదు. ది ఆక్స్‌ఫర్డ్‌ కంపానియన్‌ టు ద బైబిల్‌ “ఈ సందర్శకులు నక్షత్రం చేత బేత్లెహేముకు ఆకర్షించబడడంలో ఇంద్రజాలానికి, జ్యోతిష్యానికి మధ్యనున్న సంబంధం వ్యక్తమయ్యింది” అని స్పష్టం చేస్తోంది. బైబిలు అన్ని రకాల ఇంద్రజాలాన్ని, నక్షత్రాల నుండి సమాచారం సేకరించడానికి ప్రయత్నించే బబులోనీయుల అలవాట్లను స్పష్టంగా ఖండిస్తోంది.​—⁠ద్వితీయోపదేశకాండము 18:​10-12; యెషయా 47:​13.

ఆ మనుష్యులకు అందజేయబడిన సమాచారం ఏ మంచికీ దారి తీయలేదు. బదులుగా అది దుష్ట రాజైన హేరోదు అసూయాగ్రహాన్ని రగిల్చింది. తత్ఫలితంగా యోసేపు, మరియ, యేసు ఐగుప్తుకు పారిపోవాల్సి వచ్చింది, బేత్లెహేములో “రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల” మగపిల్లలందరూ చంపబడ్డారు. హేరోదు ఆ జ్యోతిష్కుల నుండి తెలుసుకున్న దాన్నిబట్టి యేసు జన్మించిన సమయాన్ని చాలా జాగ్రత్తగా నిర్ధారించుకున్నాడు. (మత్తయి 2:​16) వారి సందర్శనం వల్ల కలిగిన సమస్యలన్నింటి దృష్ట్యా, వారు చూసిన నక్షత్రమూ “యూదుల రాజుగా పుట్టినవా[ని]” గురించిన సందేశమూ యేసును చంపాలనుకున్న దేవుని శత్రువైన సాతాను నుండి వచ్చినవేననే నిర్ధారణకు రావడం సమంజసమే.​—⁠మత్తయి 2:⁠1, 2.