కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు జనన వివరాల నుండి పాఠాలు

యేసు జనన వివరాల నుండి పాఠాలు

యేసు జనన వివరాల నుండి పాఠాలు

యేసు జననానికి సంబంధించిన సంఘటనలకు లక్షలాదిమంది ఆకర్షితులయ్యారు. ఈ విషయం క్రిస్మస్‌ సమయంలో ప్రపంచం నలుమూలలా ప్రదర్శించబడే క్రీస్తు జననానికి సంబంధించిన అసంఖ్యాకమైన చిత్రపటాలను, నాటకాలను చూస్తే అవగతమవుతుంది. యేసు జననానికి సంబంధించిన సంఘటనలు ఆకర్షణీయమైనవే అయినప్పటికీ అవి బైబిల్లో నమోదు చేయబడింది ప్రజల మనోరంజనం కోసం కాదు. బదులుగా అవి ఉపదేశించడానికి, తప్పు దిద్దడానికి దేవుని ప్రేరణవలన కలిగిన లేఖనాల్లో ఒక భాగం.​—⁠2 తిమోతి 3:​16, 17.

యేసు జన్మ దినమును క్రైస్తవులు వేడుకగా చేసుకోవాలని దేవుడు కోరుకున్నట్లయితే, ఖచ్చితమైన తేదీ బైబిల్లో లభ్యమయ్యేది. దాంట్లో ఆ తేదీ ఉందా మరి? 19వ శతాబ్దపు బైబిలు విద్వాంసుడు అల్బర్ట్‌ బార్నస్‌, గొఱ్ఱెల కాపరులు తమ మందలను రాత్రిపూట కాపలా కాస్తూ ఆరుబయట ఉండే కాలంలో యేసు జన్మించాడని ప్రస్తావించిన తర్వాత, “అది చలికాలం, ప్రత్యేకించి బేత్లెహేము సమీపంలోని ఎత్తైన, పర్వత ప్రాంతాల్లోనైతే మరీ చల్లగా ఉంటుంది, కాబట్టి మన రక్షకుడు డిసెంబరు 25కు ముందే జన్మించాడన్నది విస్పష్టం. [యేసు] జనన సమయాన్ని దేవుడు గుప్తంగా ఉంచాడు. . . . ఆ సమయాన్ని తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం కూడా కాదు, అది ప్రాముఖ్యమైనదే అయితే దేవుడు ఆ తేదీ నమోదయ్యేలా చేసి దాన్ని భద్రపరిచి ఉండేవాడు” అని ముగించాడు.

దానికి భిన్నంగా, సువార్త రచయితలు నలుగురూ యేసు మరణించిన రోజు గురించి మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది వసంత కాలంలో వచ్చే యూదుల నెల నీసాను 14న జరిగే పస్కా పండుగ రోజున సంభవించింది. అంతేకాదు, యేసు తన సంస్మరణగా ఆ రోజును జ్ఞాపకం చేసుకొమ్మని తన అనుచరులకు ప్రత్యేకంగా ఆజ్ఞాపించాడు. (లూకా 22:​19) యేసు పుట్టినరోజే గానీ నిజానికి వేరే ఏ వ్యక్తి పుట్టినరోజే గానీ వేడుకగా చేసుకొమ్మనే ఆజ్ఞ బైబిల్లో లేనే లేదు. విచారకరంగా, యేసు పుట్టిన తేదీని గురించిన వివాదాలు, ఆ సమయంలో సంభవించిన అతి ప్రాముఖ్యమైన సంఘటనలను కప్పివేసే అవకాశముంది.

తల్లిదండ్రులు దేవుని చేత ఎంపిక చేసుకోబడ్డారు

దేవుడు తన కుమారుణ్ణి పెంచడానికి ఇశ్రాయేలులోని వేలాది కుటుంబాల్లో నుండి ఎటువంటి తల్లిదండ్రులను ఎంపిక చేసుకున్నాడు? ధనసంపదలు, హోదా వంటి వాటిని ఆయన ప్రాముఖ్యమైనవిగా ఎంచాడా? లేదు. బదులుగా, తల్లిదండ్రుల ఆధ్యాత్మిక లక్షణాలను యెహోవా పరిగణలోకి తీసుకున్నాడు. లూకా 1:​46-55 లో నమోదు చేయబడిన మరియ స్తుతి పాటను పరిశీలించండి, తాను మెస్సీయాకు తల్లి కాబోయే ఆధిక్యత గురించి విన్న తర్వాత ఆమె ఆ పాట పాడింది. ఇతర విషయాలతో పాటు ఆమె “నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను” అని అన్నది. ఆమె నమ్రతతో తనను తాను “దీనస్థితి”లో ఉన్న ఒక యెహోవా దాసురాలిగా భావించింది. అంతకంటే ముఖ్యంగా ఆమె పాటలోని మనోహరమైన మాటలు, ఆమె లేఖనాల గురించి మంచి పరిజ్ఞానం గల ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అని వెల్లడి చేస్తున్నాయి. ఆమె పాపభరిత ఆదాము సంతానమే అయినప్పటికీ, దేవుని కుమారునికి భూలోకపు తల్లిగా ఉండడానికి ఆమెను ఎంపిక చేసుకోవడం సరైనది.

యేసు పెంపుడు తండ్రి అయిన మరియ భర్త విషయం ఏమిటి? యోసేపు వడ్రంగి పనిలో మంచి పరిజ్ఞానమున్న వ్యక్తి. ఆయన తన చేతులతో కష్టపడి పని చేయడానికి ఇష్టపడడం వల్లనే అయిదుగురు కుమారులు, కనీసం ఇద్దరు కుమార్తెలు ఉన్న కుటుంబాన్ని పోషించగలిగాడు. (మత్తయి 13:​55, 56) యోసేపు ధనవంతుడు కాదు. మరియ తన తొలిచూలు మగబిడ్డను దేవాలయానికి తీసుకువెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు, యోసేపు బలిగా సమర్పించడానికి గొఱ్ఱెపిల్లను తీసుకువెళ్ళలేకపోతున్నందుకు నిరాశచెందివుండవచ్చు. దానికి బదులుగా వారు పేదల కోసమున్న రాయితీని ఉపయోగించుకోవాల్సి వచ్చింది. బాలెంత గురించి దేవుని ధర్మశాస్త్రం ఇలా చెబుతోంది: “ఆమె గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును.”​—⁠లేవీయకాండము 12:8; లూకా 2:22-24.

యోసేపు ‘నీతిమంతుడు’ అని బైబిలు చెబుతోంది. (మత్తయి 1:​19) ఉదాహరణకు ఆయన కన్యకయైన తన భార్య యేసుకు జన్మనిచ్చేంత వరకు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. యేసు నిజమైన తండ్రి ఎవరనేదాని గురించి అపార్థాలేమీ తలెత్తకుండా ఇది నిరోధించింది. కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకే ఇంట్లో ఉంటూ సన్నిహిత సంబంధాలకు దూరంగా ఉండడం అంత సులభమేమీ అయ్యుండకపోవచ్చు. కానీ వారిద్దరూ దేవుని కుమారుణ్ణి పెంచడానికి తమను ఎంపిక చేసుకోవడం ద్వారా తమకివ్వబడిన ఆధిక్యతను విలువైనదిగా ఎంచారన్నది అది వ్యక్తం చేసింది.​—⁠మత్తయి 1:​24, 25.

మరియలాగే యోసేపు కూడా ఆధ్యాత్మిక వ్యక్తి. ఆయన ప్రతి సంవత్సరం పస్కాపండుగకు హాజరయ్యేందుకు తన పనిని ఆపివేసి కుటుంబాన్ని తీసుకొని నజరేతు నుండి యెరూషలేము వరకు మూడు రోజుల ప్రయాణం చేసేవాడు. (లూకా 2:​41) యోసేపు, దేవుని వాక్యం చదివి వివరించబడే స్థానిక సమాజ మందిరంలో వారం వారం ఆరాధనలో పాల్గోనే అలవాటును కూడా బాలుడైన యేసుకు నేర్పించి ఉంటాడు. (లూకా 2:​51; 4:​16) దీన్నిబట్టి, దేవుడు తన కుమారుని కోసం భూలోకపు తల్లిగా, పెంపుడు తండ్రిగా సరైన వారినే ఎంపిక చేసుకున్నాడనడంలో సందేహం లేదు.

అల్పులైన కాపరులకు ఘనమైన ఆశీర్వాదం

తొమ్మిది మాసాల గర్భవతి అయిన తన భార్యకు కష్టమే అయినప్పటికీ యోసేపు, కైసరు ఆజ్ఞ మేరకు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి తన పూర్వీకుల పట్టణానికి బయలుదేరాడు. ఈ జంట బేత్లెహేముకు చేరుకునేసరికి, జనంతో కిక్కిరిసిపోయి ఉన్న ఆ పట్టణంలో వారికి వసతి స్థలం దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో వారు పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది, అక్కడే యేసు జన్మించడం ఒక పశువుల మేతతొట్టిలో పడుకోబెట్టబడడం జరిగింది. ఈ జననం నిజంగా దేవుని చిత్తమేననే ధ్రువీకరణతో వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వినయులైన ఆ తల్లిదండ్రుల కోసం యెహోవా ఒక ఏర్పాటు చేశాడు. ఆయన ఆ జంటను దృఢపరచడానికి బేత్లెహేము నుండి ప్రముఖస్థానంలో ఉన్న పెద్దల ప్రతినిధినేమైనా పంపించాడా? లేదు. బదులుగా, తమ మందలను కాపలా కాస్తూ రాత్రుళ్ళు బయట గడుపుతూ కష్టపడి పనిచేసే గొఱ్ఱెల కాపర్లకు యెహోవా దేవుడు ఆ విషయాన్ని వెల్లడి చేశాడు.

దేవదూత ప్రత్యక్షమై వారిని బేత్లెహేముకు వెళ్ళమని, అక్కడ అప్పుడే జన్మించిన మెస్సీయా “యొకతొట్టిలో పండుకొని” కనబడతాడని చెప్పాడు. అణకువ గల ఈ మనుష్యులకు మెస్సీయా పశువుల పాకలో ఉంటాడనే మాట దిగ్భ్రాంతి గానీ ఇబ్బంది గానీ కలిగించిందా? ఎంతమాత్రం కలిగించలేదు! వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ మందలను వదిలేసి బేత్లెహేముకు బయలుదేరారు. వారికి అక్కడ యేసు కనిపించగానే, దేవదూత చెప్పిన విషయాన్ని యోసేపు, మరియలకు తెలియజేశారు. అన్నీ దేవుడు సంకల్పించిన దానికి అనుగుణంగానే జరుగుతున్నాయని అది ఆ దంపతుల విశ్వాసాన్ని బలపరిచిందన్నది నిస్సంశయం. “ఆ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.” (లూకా 2:​8-20) అవును, దేవునిపై భయభక్తులు గల గొఱ్ఱెల కాపరులకు ఆ సంగతులను వెల్లడి చేయడంలో కూడా యెహోవా సరైన ఎంపికనే చేసుకున్నాడు.

యెహోవా అనుగ్రహాన్ని అనుభవించాలంటే మనం ఎలాంటి ప్రజలమై ఉండాలో పైన చెప్పిన దాని నుండి తెలుసుకున్నాం. మనం హోదా కోసం గానీ ధనసంపదల కోసం గానీ తాపత్రయపడవలసిన అవసరం లేదు. బదులుగా మనం యోసేపు, మరియ, గొఱ్ఱెల కాపరులవలె దేవునికి విధేయులై ఉండాలి, భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనిస్తూ దేవునిపై మనకున్న ప్రేమను రుజువుపరుచుకోవాలి. నిజంగానే, యేసు జన్మించిన సమయంలో సంభవించిన సంఘటనల వివరాలను ధ్యానించడం ద్వారా నేర్చుకోవాల్సిన చక్కని పాఠాలు ఉన్నాయి.

[7వ పేజీలోని చిత్రం]

మరియ రెండు గువ్వలను సమర్పించడం ఏమి సూచిస్తోంది?

[7వ పేజీలోని చిత్రం]

యేసు జననం గురించి వెల్లడి చేయడానికి దేవుడు అణకువగల కొందరు గొఱ్ఱెల కాపరులను ఎంపిక చేసుకున్నాడు