కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె పట్టుదలకు ప్రతిఫలం లభించింది

ఆమె పట్టుదలకు ప్రతిఫలం లభించింది

ఆమె పట్టుదలకు ప్రతిఫలం లభించింది

తమ ప్రియమైనవారు దేవుని సంకల్పాల గురించి తెలుసుకొని తద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపాలని యథార్థ హృదయులనేకులు కోరుకుంటారు. ఎవరైనా దేవునికి సమర్పించుకున్నారంటే వారు ఆ జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోవడానికి ఇతరులు​—⁠యౌవనులు, వృద్ధులు​—⁠తమ మంచి ప్రవర్తన ద్వారా వారికి సహాయపడి ఉంటారు. మెక్సికోలో ఉన్న కేయారీమ్‌ అనే యౌవనస్థురాలి విషయంలో కూడా అలాగే జరిగింది, ఆమె యెహోవాసాక్షుల ప్రత్యేకదిన సమావేశంలో ఈ చిన్న లిఖిత సందేశాన్ని సహోదరులకు అందజేసింది:

“నేను నా సంతోషాన్ని ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దానికి కారణమేమిటో చెప్పనివ్వండి. పద్దెనిమిది సంవత్సరాల క్రితం, నేనింకా జన్మించక ముందు, నా తల్లిదండ్రులు సత్యాన్ని తెలుసుకున్నారు. మొదట మా అమ్మ, ఆ తర్వాత కొంతకాలానికి మా తమ్ముడు, నేను ఆధ్యాత్మిక ప్రగతి సాధించాము. మా నాన్నగారు కూడా జీవమార్గంలోకి రావాలని మేము ముగ్గురం కలిసి యెహోవాకు ప్రార్థించేవాళ్ళం. పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి, ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన దినం. మా నాన్నగారు బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఎంతో ఎదురుచూసిన ఈ గడియలు రాకముందే అంతం తీసుకురానందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు యెహోవా!”

గడిచిన సంవత్సరాల్లో ఈ యౌవనస్థురాలి కుటుంబం 1 పేతురు 3:1, 2 వచనాల్లోని సూత్రాలను తమ మనస్సులలో ముద్రించుకొని ఉండవచ్చు, అక్కడ మనమిలా చదువుతాము: “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” యౌవనస్థురాలైన కేయారీమ్‌ “నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము” అని చెబుతున్న ద్వితీయోపదేశకాండము 5:16లోని మాటలను తప్పక అన్వయించుకొని ఉంటుంది. అలాంటి సూత్రాలను అన్వయించుకోవడమూ ఓర్పుతో యెహోవా కోసం ఎదురు చూడడమూ కేయారీమ్‌కు ఆమె కుటుంబానికి ఖచ్చితంగా ఆశీర్వాదాలను తీసుకువచ్చాయి.