కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేవుడా, ఎందుకిలా జరగనిచ్చావ్‌?’

‘దేవుడా, ఎందుకిలా జరగనిచ్చావ్‌?’

దేవుడా, ఎందుకిలా జరగనిచ్చావ్‌?’

తన భార్య మారియతో కలిసి డాక్టర్‌ కోసం వేచివుండే గదిలో కూర్చోవడం రికార్డూకు ఇంకా గుర్తుంది. * అప్పుడే వచ్చిన మారియ వైద్య పరీక్షల ఫలితాలను చదివేందుకు వారిద్దరిలో ఎవ్వరికీ ధైర్యం చాలడంలేదు. చివరికి రికార్డూ ఆ కవరు తెరిచాడు, వారిద్దరూ ఆ రిపోర్టులోని వైద్య పరిభాషను అమితాసక్తితో ఆత్రంగా చూశారు. దాంట్లోని “క్యాన్సర్‌” అన్న పదాన్ని వారు గమనించారు, ఆ పద భావాన్ని పూర్తిగా గ్రహించగానే ఇద్దరూ ఏడవడం మొదలెట్టారు.

“డాక్టర్‌ చాలా మంచివాడు, కానీ పరిస్థితి తీవ్రతను ఆయన స్పష్టంగా గ్రహించాడు, ఆ కారణంగానే ఆయన దేవునిపై నమ్మకముంచండి అని మాకు పదే పదే చెప్పాడు.”

రేడియేషన్‌ ట్రీట్‌మెంట్‌ ప్రారంభించడానికి ముందు, మారియ తన కుడి పాదంలోని కదలికలను అదుపు చేసుకోలేకపోవడాన్ని ఆమె డాక్టర్‌ గమనించాడు. ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో క్యాన్సర్‌ ఆమె మెదడుకు కూడా వ్యాపించిందని తేలింది. ట్రీట్‌మెంట్‌ ఆరంభించిన కేవలం వారం రోజులకే, రేడియేషన్‌ ఆపేశారు. మారియ కోమాలోకి జారుకుని, ఆ తర్వాత రెండు నెలలకు మరణించింది. “ఆమె, బాధల నుండి విముక్తి పొందినందుకు నాకు ఆనందమే అనిపించినప్పటికీ ఆమె నాకు ఎంత తరచుగా జ్ఞాపకం వచ్చేదంటే నేను కూడా చనిపోతే బాగుండునని కోరుకునే వాడిని, తరచూ, ‘ఎందుకిలా జరగనిచ్చావ్‌?’ అని దేవుణ్ణి నేను నిలదీసేవాడిని.”

విషాదానికి గురైనప్పుడు ప్రశ్నలు తలెత్తుతాయి

ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది రికార్డూలాగే బాధలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అనేక సందర్భాల్లో, బాధలకు గురయ్యేది ఎక్కువగా అమాయకులే. మానవాళిని పట్టిపీడిస్తున్న తీవ్రమైన సాయుధ పోరాటాల వల్ల కలుగుతున్న హృదయం బద్దలయ్యే దుఃఖం గురించి ఆలోచించండి. లేదా మానభంగాలకు గురైన బాధితులు, అత్యాచారపు కోరల్లో చిక్కిన పిల్లలు, కౌటుంబిక దౌర్జన్యాలతోపాటు ఇతర మానవ దురాగతాలకు గురైన అసంఖ్యాకులైన అమాయకులు అనుభవించిన బాధ గురించి ఆలోచించండి. చరిత్రంతటా స్త్రీ పురుషులు ఒకరికొకరు చేసుకుంటున్న అన్యాయాలకు, బాధలకు హద్దుల్లేకుండా పోతున్నట్లు అనిపిస్తోంది. (ప్రసంగి 4:​1-3) మరోవైపు ప్రకృతి వైపరీత్యాలకు లేదా భావోద్వేగపరమైన, మానసికపరమైన, శారీరక సంబంధమైన వ్యాధులకు గురైన బాధితుల తీవ్రమైన దుఃఖం. ఈ నేపథ్యంలో, “ఇలాంటి బాధలను దేవుడెందుకు అనుమతిస్తున్నాడు?” అని అనేకమంది అడగడం మనల్ని ఎంత మాత్రం ఆశ్చర్యపరచదు.

బాధలను ఎదుర్కోవడమనేది మత విశ్వాసులకు కూడా సులభమైన విషయమేమీ కాదు. ప్రేమగల, సర్వశక్తిమంతుడైన దేవుడు మానవ బాధలను అనుమతించడానికి కారణమేమై ఉంటుందో అని మీరు కూడా ఆశ్చర్యపోతుండవచ్చు. కలవరపరిచే ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన, సత్యసంధమైన జవాబును తెలుసుకోవడం మన మనశ్శాంతికి, దేవునితో మనకున్న సంబంధానికి చాలా ప్రాముఖ్యం. అలాంటి జవాబును బైబిలు అందజేస్తోంది. అదేమి చెబుతోందో తర్వాతి ఆర్టికల్‌లో దయచేసి పరిశీలించండి.

[అధస్సూచి]

^ పేరా 2 పేర్లు మార్చబడినవి.

[3వ పేజీలోని చిత్రాలు]

దేవునిపై నమ్మకముంచండి అని డాక్టర్‌ మాకు పదే పదే చెప్పాడు