నా జీవితాన్ని మార్చివేసిన చిన్న లిఖిత సందేశం
జీవిత కథ
నా జీవితాన్ని మార్చివేసిన చిన్న లిఖిత సందేశం
ఇరేన్ హోక్స్‌టెన్‌బాక్ చెప్పినది
అది 1972లో ఒక మంగళవారం సాయంకాలం జరిగిన సంఘటన. నాకప్పుడు పదహారేళ్ళు, నేను నా తల్లిదండ్రులతోపాటు నెదర్లాండ్స్‌లోని బ్రాబాంట్ ప్రాంతంలో ఉన్న ఇండ్‌హోవెన్ నగరంలో ఒక మతసంబంధమైన కూటానికి హాజరయ్యాను. నాకు చాలా భయంగా అనిపించింది. నేను అక్కడకాకుండా మరెక్కడైనా ఉంటే బావుండుననుకున్నాను. అప్పుడు ఇద్దరు యువతులు ఒక చిన్న కాగితం ముక్కను నా చేతికిచ్చారు, అందులో “ప్రియమైన ఇరేన్, మేము నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాము” అని వ్రాసి ఉంది. వారిచ్చిన ఆ చిన్న లిఖిత సందేశం నా జీవితాన్ని ఎంతగా మార్చివేస్తుందో నేనప్పుడు గ్రహించలేదు. ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పడానికి ముందు, నేను నా గతం గురించి కొంత చెబుతాను.
నేను ఇండోనేషియాలోని బెలిటుంగ్ ద్వీపంలో జన్మించాను. ఆ ఉష్ణమండల ద్వీపంలో నేను విన్న కొన్ని శబ్దాలు నాకు ఇంకా గుర్తున్నాయి—గాలికి ఊగే ఈతాకుల చిరుసవ్వడి, దగ్గర్లోని నది గలగలలు, మా ఇంటి పరిసరాల్లోని చిన్నపిల్లల కేరింతలు, మా ఇంట్లోని సంగీతం. అయితే నా నాలుగవ ఏట 1960లో, మా కుటుంబం ఇండోనేషియా నుండి నెదర్లాండ్స్‌కు వలస వచ్చింది. మేము ఓడలో సుదీర్ఘ ప్రయాణం చేశాము, నాతోపాటు ప్రయాణించిన నాకిష్టమైన బొమ్మ చేసే శబ్దం నాకు ప్రత్యేకంగా గుర్తుంది, అది డోలు వాయించే చిన్న జోకర్ బొమ్మ. ఏడేళ్ళ వయస్సులో వచ్చిన ఒక వ్యాధి కారణంగా నేను వినికిడి శక్తిని కోల్పోయాను, ఇక అప్పటి నుండి నా చుట్టూ ఎటువంటి శబ్దాలవుతున్నా నేను వినలేను. నాకు మిగిలినవల్లా ఆ జ్ఞాపకాలే.
చెవుడుతో ఎదగడం
నా తల్లిదండ్రులు చూపించే ప్రేమపూర్వకమైన శ్రద్ధ కారణంగా, నేను మొదట్లో చెవిటితనం యొక్క పర్యవసానాలను
పూర్తిగా గ్రహించలేదు. చిన్నపిల్లగా నేను, నాకున్న పెద్ద హియరింగ్ ఎయిడ్ అంటే సరదాపడేదాన్ని, అయితే అది నాకంత ఉపయోగకరంగా ఉండేది కాదు. ఇరుగుపొరుగు పిల్లలు నాతో సంభాషించడానికి, చాక్‌పీస్‌తో అన్ని విషయాలు ఫుట్‌పాత్ మీద వ్రాసేవారు, నేను నా స్వరాన్ని వినలేకపోయినా వాళ్ళకు సమాధానం చెప్పేదాన్ని.నేను ఎదుగుతుండగా, నా చుట్టూ ఉన్న ప్రజలందరిలా నేను లేనని గ్రహించాను. నా చెవిటితనం మూలంగా కొందరు నన్ను గేలి చేస్తున్నారనీ కొందరు నన్ను వాళ్ళతో చేర్చుకోకుండా దూరంగా ఉంచుతున్నారనీ గమనించడం మొదలుపెట్టాను. నేను ఒంటరితనంతో ఏకాకినైపోయినట్లు భావించనారంభించాను. చెవిటిదానిగా ఉండడమంటే ఏమిటో గ్రహించసాగాను, నేను ఎదుగుతున్న కొద్దీ వినగల ప్రజల ప్రపంచమంటే భయం ఎక్కువయ్యింది.
చెవిటివారి కోసం నిర్వహించబడే ప్రత్యేక పాఠశాలకు నేను హాజరవ్వడానికి వీలుగా, నా తల్లిదండ్రులు మా మొత్తం కుటుంబాన్ని లిమ్‌బర్గ్ ప్రాంతంలోని ఒక గ్రామం నుండి ఇండ్‌హోవెన్ నగరానికి తీసుకువచ్చారు. అక్కడ, మా నాన్నగారు క్రొత్త ఉద్యోగం కోసం అన్వేషించారు, మా అక్కలు తమ్ముడు క్రొత్త పాఠశాలకు వెళ్ళారు. నా కోసం వాళ్ళు చేసుకున్న సర్దుబాట్లన్నిటికీ నేను కృతజ్ఞురాలిని. పాఠశాలలో, స్వరాన్ని సవరించుకోవడం, మరింత స్పష్టంగా మాట్లాడం నాకు నేర్పించారు. అక్కడి టీచర్లు సంజ్ఞా భాషను నేర్పించకపోయినప్పటికీ సంజ్ఞలు చేయడం నా తోటి విద్యార్థులు నాకు నేర్పించారు.
నా లోకంలో నేను జీవించడం
నేను ఎదుగుతుండగా, నా తల్లిదండ్రులు నాతో సంభాషించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసేవారు, కానీ చాలా విషయాలు నాకర్థమయ్యేవి కావు. ఉదాహరణకు, నా తల్లిదండ్రులు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్నారని నాకు మొదట్లో అర్థం కాలేదు. కానీ ఒక రోజు మా కుటుంబం, చాలామంది కుర్చీలపై కూర్చొని ఉన్న ఒక స్థలానికి వెళ్ళడం నాకు గుర్తుంది. వాళ్ళంతా ముందుకు చూస్తున్నారు, కొన్నిసార్లు చప్పట్లు కొట్టారు, మధ్య మధ్యలో లేచి నిలబడ్డారు—కానీ వాళ్ళలా ఎందుకు చేశారో నాకు తెలియదు. నేను వెళ్ళింది యెహోవాసాక్షుల సమావేశానికని చాలాకాలం తర్వాత తెలుసుకున్నాను. నా తల్లిదండ్రులు ఇండ్‌హోవెన్ నగరంలో ఒక చిన్న హాలుకు కూడా నన్ను తీసుకెళ్తుండేవారు. అక్కడందరూ మంచివాళ్ళే ఉన్నట్లు, మా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నట్లు నాకనిపించింది కాబట్టి ఇక్కడ బాగానే ఉందని అనుకున్నాను, కానీ మేము పదే పదే అక్కడికెందుకు వెళ్ళేవాళ్ళమో నాకు తెలియదు. ఆ చిన్న హాలు యెహోవాసాక్షుల రాజ్యమందిరమని నాకిప్పుడు తెలుసు.
విచారకరంగా, ఆ కూటాల్లో జరుగుతున్న కార్యక్రమాన్ని సంజ్ఞల ద్వారా నాకు తెలియజేసేవారెవరూ అక్కడ లేరు. అక్కడున్నవారు నాకు సహాయం చేయాలని ఎంతో కోరుకున్నారు గానీ నా చెవిటితనంతో ఎలా వ్యవహరించాలో వారికి తెలియలేదని నేనిప్పుడు గ్రహిస్తున్నాను. ఈ కూటాల్లో, నేను ఒంటరిదానిగా భావించేదాన్ని, ‘నేను ఇక్కడికి వచ్చే బదులు స్కూలుకు వెళ్ళినా బావుండేది’ అనుకునేదాన్ని. సరిగ్గా నాలో అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడే, ఇద్దరు యువతులు నేను ఉపోద్ఘాతంలో పేర్కొన్న లిఖిత సందేశాన్ని ఒక కాగితం మీద రాసి నాకిచ్చారు. అది, నన్ను నా ఒంటరి లోకం నుండి విడుదల చేసిన అమూల్యమైన స్నేహబంధానికి నడిపించబడుతుందని నాకేమాత్రం తెలియదు.
అమూల్యమైన స్నేహబంధాన్ని పెంపొందించుకోవడం
నాకు ఆ లిఖిత సందేశాన్ని రాసిచ్చినవారి పేర్లు కోలెట్, హార్మీన్. వాళ్ళకప్పుడు ఇరవై ఏళ్ళపైనే ఉంటాయి. వాళ్ళు నేను వెళుతున్న యెహోవాసాక్షుల సంఘంలో క్రమపయినీర్లుగా లేదా పూర్తికాల పరిచారకులుగా సేవ చేయడానికి వచ్చారని ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. కోలెట్‌కు, హార్మీన్‌కు సంజ్ఞా భాష నిజంగా తెలియకపోయినా వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను వారి పెదవుల కదలికల ద్వారా వాళ్ళేమి చెబుతున్నారో గ్రహించేదాన్ని, ఆ విధంగా మేము చాలా చక్కగా సంభాషించుకునేవాళ్ళం.
నాతో బైబిలు అధ్యయనం చేస్తామని కోలెట్, హార్మీన్ అడిగినప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు, అయితే వాళ్ళిద్దరూ అంతకన్నా ఎక్కువే చేశారు. రాజ్యమందిరంలో జరిగే కూటాలను నాకు సంజ్ఞల ద్వారా తెలియజేయడానికీ నేను సంఘంలోని ఇతరులతో సహవాసం చేయడానికీ వాళ్ళు ఎంతో కృషి చేశారు. నేను ప్రకటనా పనిలో ఉపయోగించేందుకు బైబిలు సందేశాలను నాతో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని విద్యార్థి ప్రసంగాలను
సిద్ధపడడంలో కూడా వాళ్ళు నాకు సహాయం చేసేవారు. ఒక్కసారి ఊహించండి, వినే సామర్థ్యంగల ప్రజల గుంపు ఎదుట కూడా ప్రసంగించేంతటి ధైర్యం ఇప్పుడు నాకుంది!అంతేగాక కోలెట్, హార్మీన్ నేను తమపై నమ్మకముంచవచ్చని భావించేలా చేశారు. వాళ్ళు ఎంతో సహనంతో నేను చెప్పేది వినేవాళ్ళు. మేము తరచూ నా పొరపాట్ల గురించి నవ్వుకునేవాళ్ళం, అయినప్పటికీ వాళ్ళు నన్ను ఎప్పుడూ గేలి చేయలేదు; నేను తమతో ఉండడం ఇబ్బందిగానూ భావించలేదు. పైగా వాళ్ళు నా భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు, నేను తమతో సమానమన్నట్లు నాతో వ్యవహరించేవారు. స్నేహశీలురైన ఈ అమ్మాయిలు నాకొక అందమైన బహుమానాన్నిచ్చారు—అదే వారి ప్రేమ, స్నేహం.
మరింత ప్రాముఖ్యంగా, నేను మన దేవుడైన యెహోవా నమ్మదగిన స్నేహితుడని తెలుసుకోవాలని కోలెట్, హార్మీన్ నాకు బోధించారు. నేను రాజ్యమందిరంలో కూర్చుని ఉండడాన్ని యెహోవా చూశాడనీ చెవిటితనం వల్ల నేను ఎదుర్కొనే సమస్యలను ఆయన అర్థం చేసుకున్నాడనీ వారు వివరించారు. యెహోవా పట్ల మాకున్న ప్రేమ, మా ముగ్గురినీ మంచి స్నేహితులుగా చేసినందుకు నేనెంత కృతజ్ఞురాలినో! యెహోవాకు నాపట్ల ఉన్న శ్రద్ధను బట్టి నేనెంతో కదిలించబడ్డాను, ఆయన మీదున్న ప్రేమతో నేను 1975 జూలైలో నా సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా ఆయనకు సూచించాను.
ఒక ప్రత్యేకమైన స్నేహితుని వెంట
ఆ తర్వాతి సంవత్సరాల్లో, నేను ఇంకా చాలామంది సహోదర సహోదరీలతో పరిచయం పెంచుకున్నాను. ఒక సహోదరుడు నాకు చాలా ప్రత్యేకమైన స్నేహితుడయ్యాడు, 1980లో మేము పెళ్ళి చేసుకున్నాము. ఆ తర్వాత కొంతకాలానికి నేను పయినీరు సేవ ప్రారంభించాను, 1994లో నేనూ నా భర్త హారీ డచ్ సంజ్ఞా భాషా క్షేత్రంలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేసే నియామకాన్ని అందుకున్నాము. ఆ తర్వాతి సంవత్సరం, నాకో సవాలుదాయకమైన నియామకం లభించింది, అదేమిటంటే, వినే సామర్థ్యమున్న నా భర్త సహాయ ప్రయాణ పైవిచారణకర్తగా వివిధ సంఘాలను సందర్శిస్తుంటే ఆయన వెంట వెళ్ళడం.
నేనెలా నెట్టుకొస్తున్నానంటే, మేము మొదటిసారి ఒక సంఘాన్ని సందర్శించినప్పుడు, నేను వెంటనే వీలైనంత ఎక్కువమంది సహోదరసహోదరీల దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను చెవిటిదాన్నని వాళ్ళకు చెప్పి, నాతో మాట్లాడేటప్పుడు నావైపు చూడమనీ నాతో మెల్లగా మాట్లాడమనీ వారిని అడుగుతాను. సంఘ కూటాల్లో కూడా ప్రశ్న అడిగిన వెంటనే సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఆ వారంలో కూటాల్లోనూ క్షేత్రసేవలోనూ జరిగే విషయాలను నాకు సంజ్ఞల ద్వారా తెలియజేయడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా అని కూడా అడుగుతాను.
ఈ పద్ధతి ఎంత బాగా పనిచేస్తోందంటే, కొన్నిసార్లు నా సహోదరసహోదరీలు నేను వినలేనన్న విషయాన్నే మరిచిపోతారు, దానితో తమాషా సంఘటనలు జరుగుతుంటాయి. ఉదాహరణకు, నేను పట్టణంలో నడిచి వెళ్ళడం చూసి నన్ను పలకరించడానికి తమ కారు హారన్ మోగించినా నేను ప్రతిస్పందించలేదని వాళ్ళు నాకు చెబుతుంటారు.
కొన్నిసార్లు నేను కూడా నా పరిమితులను మరిచిపోతుంటాను, ఎలాగంటే నేను ఏదైనా రహస్యంగా నా భర్త చెవిలో చెప్పాలనుకున్నప్పుడు అలా జరుగుతుంటుంది. నేను “గుసగుసగా” చెప్పాలనుకున్నది చాలా బిగ్గరగా వినిపించిందని, ఆయన ముఖం ఎర్రగా కందిపోయినప్పుడు గానీ నాకర్థం కాదు.పిల్లలు అనుకోని రీతుల్లో సహాయం చేస్తారు. ఒక సంఘంలో, మేము మొదటిసారి సందర్శిస్తున్నప్పుడు రాజ్యమందిరంలోని కొందరు నాతో మాట్లాడడానికి కాస్త సంకోచిస్తున్నారని తొమ్మిదేళ్ళ ఒకబ్బాయి గమనించి దాని గురించి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి, నా చెయ్యి పట్టుకొని రాజ్యమందిరంలో మధ్యన నిలబెట్టి, “నేను ఇరేన్‌ను మీకు పరిచయం చేయనా, ఈమెకు చెవుడు” అని బిగ్గరగా చెప్పాడు. అక్కడున్నవారు నా దగ్గరికి వచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారు.
నేను సర్క్యూట్ పనిలో నా భర్త వెంట వెళ్తుండగా నాకు ఇంకా ఎక్కువమంది స్నేహితులవుతున్నారు. నేను ఒంటరితనంతో బాధపడిన ఆ జీవితానికీ ఇప్పుడున్న ఈ జీవితానికీ ఎంత తేడా! కోలెట్, హార్మీన్ ఆ చిన్న కాగితం ముక్కను నా చేతిలో పెట్టిన ఆ సాయంకాలం నుండి, నేను స్నేహబంధానికున్న శక్తిని చవిచూశాను, నాకెంతో ప్రత్యేకమైన వారిగా అయిన ప్రజలను కలుసుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా, నేను యెహోవాను తెలుసుకున్నాను, ఆయన నా స్నేహితులందరిలోకి అత్యంత అమూల్యమైనవాడు. (రోమీయులు 8:38, 39) ఆ చిన్న లిఖిత సందేశం నా జీవితాన్ని ఎంతగా మార్చివేసిందో కదా!
[24వ పేజీలోని చిత్రం]
నాకిష్టమైన బొమ్మ చేసే శబ్దం నాకింకా గుర్తుంది
[25వ పేజీలోని చిత్రాలు]
పరిచర్యలో, నా భర్త హారీతో