కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

“మీరు ఎంత తరచుగా ఈ రొట్టెను తిని, యీ పాత్ర లోనిది త్రాగుతారో” అని పౌలు అన్నప్పుడు ఆయన ఉద్దేశమేమిటి?

యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ ప్రారంభాన్ని సూచిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “మీరు ఎంత తరచుగా ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగుతారో ప్రభువు వచ్చేంతవరకు అంత తరచుగా ఆయన మరణాన్ని ప్రచురిస్తారు.” (1 కొరింథీయులు 11:​25, 26, NW) పౌలు మాటల్లోని “ఎంత తరచుగా” అనే పదం, క్రీస్తు మరణాన్ని తరచుగా అంటే చాలాసార్లు సంస్మరణం చేసుకోవాలనే భావాన్ని సూచిస్తోందని కొందరనుకుంటారు. ఆ కారణంగానే వారు సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువసార్లు సంస్మరణం చేసుకుంటారు. నిజానికి పౌలు ఉద్దేశం అదేనా?

యేసు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించి ఇప్పటికి దాదాపు 2,000 సంవత్సరాలు అవుతోంది. దాన్ని బట్టి, సా.శ. 33వ సంవత్సరం నుండి జ్ఞాపకార్థ ఆచరణను సంవత్సరానికి ఒక్కసారే జరుపుకున్నా, అది తరచుగా ఆచరించినట్లే అవుతుంది. అయితే, 1 కొరింథీయులు 11:​25, 26 వచనాలున్న ప్రకరణంలో పౌలు చర్చిస్తున్నది ఎంత తరచుగా ఆచరించాలన్నది కాదు గానీ దానిని ఎలా ఆచరించాలన్నది చర్చిస్తున్నాడు. ప్రాచీన గ్రీకులో ఆయన “అనేక పర్యాయాలు” లేదా “వెంటవెంటనే” అనే అర్థాన్నిచ్చే పోలాకిస్‌ అనే పదానికి బదులుగా ఆయన “ఎంత తరచుగా అయితే అంత తరచుగా” అనే అర్థాన్నిచ్చే హోసాకిస్‌ అనే పదాన్ని ఉపయోగించాడు, అది “ఎప్పుడైతే అప్పుడు,” “అలా చేసిన ప్రతీసారి” అనే అర్థాలున్న జాతీయం. వాస్తవానికి, ‘మీరు దీన్ని చేసిన ప్రతీసారి, ప్రభువు మరణాన్ని ప్రకటిస్తారు’ అని పౌలు అంటున్నాడు. *

అలాంటప్పుడు, యేసు మరణ జ్ఞాపకార్థాన్ని ఎంత తరచుగా సంస్మరణం చేసుకోవాలి? సంవత్సరానికి కేవలం ఒక్కసారే ఆచరించడం సముచితంగా ఉంటుంది. అదే నిజంగా ఒక సంస్మరణ, సాధారణంగా సంస్మరణలను ప్రతియేటా ఒక్కసారి మాత్రమే ఆచరిస్తారు. అంతేగాక, యేసు మరణించింది యూదుల పస్కా పండుగ రోజున, అది సంవత్సరానికి ఒక్కసారే జరుపుకుంటారు. మొదటి పస్కా బలి ఐగుప్తులోని ఇశ్రాయేలీయుల మొదటి సంతానాన్ని కాపాడి, బానిసత్వం నుండి ఆ జనాంగపు విడుదలకు మార్గాన్ని తెరిచినట్లే, యేసు బలి మరణం ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు జీవాన్ని పొందడానికి మార్గాన్ని తెరిచింది, అందుకే పౌలు యేసును “క్రీస్తు అను మన పస్కా పశువు” అని సముచితంగానే సంబోధించాడు. (1 కొరింథీయులు 5:⁠7; గలతీయులు 6:​16) ఏటేటా జరుపుకునే యూదుల పస్కా పండుగ సందర్భం, యేసు మరణ జ్ఞాపకార్థాన్ని సంవత్సరానికి కేవలం ఒక్కసారే ఆచరించాలనడానికి అదనపు రుజువు.

అంతేకాదు పౌలు, యేసు మరణాన్ని యూదులు ఏటేటా జరుపుకునే మరో పండగైన “ప్రాయశ్చిత్తార్థ దినము”తో కూడా జతచేశాడు. హెబ్రీయులు 9:​25, 26 వచనాల్లో “ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము [ప్రాయశ్చిత్తార్థ దినమున] తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన [యేసు] అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. . . . అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణచేయుటకై యొక్కసారే ప్రత్యక్షపరచబడెను” అని మనం చదువుతాం. ఏటేటా ప్రాయశ్చిత్తార్థ దినమున ఇచ్చే బలి స్థానంలోకి యేసు బలి వచ్చింది, కాబట్టి ఆయన మరణ జ్ఞాపకార్థాన్ని ఏటేటా ఆచరించడమే సరైనది. అంతకంటే ఎక్కువసార్లు ఆచరించాలనడానికి లేఖనాధార తర్కమేదీ లేదు.

దీనికి అనుగుణంగానే, జాన్‌ లారెన్స్‌ వాన్‌ మోషేయిమ్‌ అనే చరిత్రకారుడు, ఆసియా మైనరులోని రెండవ శతాబ్దపు క్రైస్తవులు యేసు మరణ జ్ఞాపకార్థాన్ని “యూదుల మొదటి నెల [నీసాను] పదునాలుగవ దినమున” అలవాటుగా ఆచరించేవారు అని నివేదిస్తున్నాడు. దాని తర్వాతి సంవత్సరాల్లోనే, క్రైస్తవ మత సామ్రాజ్యంలో అది సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ఆచరించే అలవాటుగా మారింది.

[అధస్సూచి]

^ పేరా 4 దీనితో, 1 సమూయేలు 1:​3, 7 వచనాల్లోని వృత్తాంతాన్ని పోల్చి చూడండి. అక్కడ “పోవునప్పుడెల్ల” (ఆధునిక హీబ్రూ అనువాదంలో “ఎంత తరచుగా”) అనే పదం “ఏటేట” లేదా సంవత్సరానికి ఒక్కసారి జరిగే సంఘటనలను, అంటే ఎల్కానా తన ఇద్దరు భార్యలతో షిలోహులోని మందిరానికి వెళ్ళే సంఘటనలను సూచిస్తోంది.