కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాధలనుభవిస్తున్న వారికి ఓదార్పు

బాధలనుభవిస్తున్న వారికి ఓదార్పు

బాధలనుభవిస్తున్న వారికి ఓదార్పు

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడనే ప్రశ్న అనేక మంది తత్త్వవేత్తలకు, వేదాంతులకు ఎన్నో శతాబ్దాల నుండి సవాలుగా నిలిచింది. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి బాధలకు ఆయనే బాధ్యుడు అని కొందరు నొక్కి చెప్పారు. రెండవ శతాబ్దపు ఒక అప్రమాణిక గ్రంథమైన ద క్లెమంటైన్‌ హోమిలీస్‌ రచయిత, దేవుడు ఈ ప్రపంచాన్ని రెండు చేతులతో ఏలుతున్నాడు, తన “ఎడమ చేయి” అయిన అపవాది ద్వారా బాధలను దుఃఖాన్ని కలుగజేస్తాడు, తన “కుడి చేయి” అయిన యేసు ద్వారా రక్షించి ఆశీర్వదిస్తాడు అని నొక్కిచెప్పాడు.

కొంతమంది, బాధలకు కారణం దేవుడు కాకపోయినప్పటికీ ఆయన వాటిని అనుమతించగలడన్న విషయాన్ని అంగీకరించలేక, అసలు బాధలున్నాయన్న విషయాన్నే తిరస్కరించడాన్ని ఎంపిక చేసుకున్నారు. “దుష్టత్వం కేవలం ఒక ఊహ మాత్రమే, దానికి నిజమైన ఆధారమంటూ ఏమీలేదు. పాపము, అనారోగ్యము, మరణము వంటివి ఉనికిలోనే లేవని అర్థం చేసుకుంటే అవి మటుమాయమవుతాయి” అని మేరీ బేకర్‌ ఎడీ వ్రాసింది.​—⁠సైన్స్‌ అండ్‌ హెల్త్‌ విత్‌ కీ టు ద స్క్రిప్చర్స్‌.

చరిత్రలోని విషాద ఘటనల కారణంగా, ప్రత్యేకించి మొదటి ప్రపంచ యుద్ధం నుండి మన కాలం వరకు జరిగిన ఘటనల ఫలితంగా అనేకమంది, దేవుడు అసలు బాధలను నిరోధించలేకపోతున్నాడు అనే నిర్ణయానికి వచ్చేశారు. “సర్వశక్తిమంతుడు అనే పదాన్ని దేవునికి తగిన లక్షణంగా ఇంతకు ముందు ఉపయోగించినంత సులభంగా ఇకపైన ఉపయోగించడానికి వీల్లేకుండా హోలోకాస్ట్‌ (నాజీల మారణహోమం) చేసిందని నేను అభిప్రాయపడుతున్నాను” అని యూదా విద్వాంసుడు డేవిడ్‌ వుల్ఫ్‌ సిల్వర్‌మాన్‌ వ్రాశాడు. “ఒకవేళ దేవుణ్ణి ఏదో ఒక విధంగా అర్థం చేసుకోగలగాలంటే, ఉనికిలో ఉన్న దుష్టత్వానికి సమన్వయంగా ఆయన మంచితనం ఉండాలి, అది కేవలం ఆయన సర్వశక్తిమంతుడు కానట్లయితేనే అలా ఉంటుంది” అని కూడా ఆయన వ్రాశాడు.

అయితే, ఏదో ఒక రూపంలో బాధలకు దేవుడే బాధ్యుడు, బాధలు కేవలం మన ఊహా జనితం లేదా దేవుడు బాధలను నిరోధించలేకపోతున్నాడు వంటి అభిప్రాయాలు బాధలనుభవిస్తున్న వారిని ఏ మాత్రం ఓదార్చవు. అంతకంటే ముఖ్యంగా అలాంటి అభిప్రాయాలు న్యాయవంతుడు, అధిక బలముగలవాడు, ప్రేమాస్వరూపి అని బైబిలు వెల్లడిచేస్తున్న దేవుని లక్షణాలకు పూర్తిగా విరుద్ధమైనవి. (యోబు 34:​10, 12; యిర్మీయా 32:​17; 1 యోహాను 4:⁠8) అలాంటప్పుడు, బాధలనుమతించడానికి గల కారణం గురించి బైబిలు ఏమని చెబుతోంది?

బాధలు ఎలా ప్రారంభమయ్యాయి?

దేవుడు మానవులను బాధలనుభవించడానికి సృష్టించలేదు. బదులుగా, ఆయన మొదటి మానవ దంపతులైన ఆదాము, హవ్వలకు పరిపూర్ణమైన మనస్సులను శరీరాలను అనుగ్రహించాడు, వారి నివాస గృహముగా ఆహ్లాదకరమైన తోటను సిద్ధపరిచి అర్థవంతమైన, సంతృప్తికరమైన పనిని వారికి నియామకంగా ఇచ్చాడు. (ఆదికాండము 1:​27, 28, 31; 2:⁠8) అయితే దేవుని పరిపాలనను, మంచి చెడులను నిర్ణయించే విషయంలో ఆయనకున్న హక్కును గుర్తించడం పైనే వారి నిరంతర సంతోషం ఆధారపడి ఉంది. ఆ దైవాజ్ఞ “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష[ము]” అని పిలువబడే చెట్టు ద్వారా సూచించబడింది. (ఆదికాండము 2:​17) ఆ వృక్ష ఫలమును తినకూడదనే ఆజ్ఞను ఆదాము, హవ్వలు పాటించడం ద్వారా దేవునికి తమ విధేయతను వ్యక్తం చేయగలిగేవారు. *

విషాదకరంగా, దేవునికి విధేయత చూపడంలో ఆదాము, హవ్వలు విఫలులయ్యారు. తిరుగుబాటుదారుడైన ఒక ఆత్మ ప్రాణి, ఆ తర్వాత అపవాదియగు సాతానుగా గుర్తించబడిన ప్రాణి, దేవునికి విధేయతగా ఉండడం హవ్వకు శ్రేయస్కరం కాదని ఆమెను నమ్మించాడు. వాస్తవానికి దేవుడు, ఆమె ఎంతో కోరుకోదగిన స్వేచ్ఛను, ఏది మంచో ఏది చెడో స్వయంగా ఎంపిక చేసుకునే హక్కును ఆమెకు కాకుండా చేస్తున్నాడని చెప్పాడు. ఆమె ఆ వృక్షఫలాన్ని తింటే ‘ఆమె కన్నులు తెరవబడతాయనీ, మంచి చెడ్డలను ఎరిగిన దేవతవలె ఉంటుందనీ’ సాతాను వాదించాడు. (ఆదికాండము 3:​1-6; ప్రకటన 12:⁠9) స్వేచ్ఛ లభిస్తుందన్న ఆశకొద్దీ మోసపోయిన హవ్వ, నిషేధించబడిన ఫలాన్ని తిన్నది, ఆ వెంటనే ఆదాము కూడా తిన్నాడు.

అదే రోజు ఆదాము, హవ్వలు తమ తిరుగుబాటుకు ఫలితాన్ని అనుభవించడం ప్రారంభించారు. దేవుని పరిపాలనను తిరస్కరించడం వల్ల, దేవునికి విధేయత చూపించడం ద్వారా లభించే కాపుదలను, ఆశీర్వాదాలను వారు కోల్పోయారు. దేవుడు పరదైసు నుండి వారిని వెళ్ళగొట్టి, “నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు” అని ఆదాముతో అన్నాడు. (ఆదికాండము 3:​17, 19) ఆదాము హవ్వలు అనారోగ్యాన్ని, బాధలను, వృద్ధాప్యాన్ని చివరికి మరణాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విధంగా బాధలనేవి మానవ జీవితంలో ఒక భాగమయ్యాయి.​—⁠ఆదికాండము 5:​29.

వివాదాన్ని పరిష్కరించడం

‘దేవుడు, ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని పట్టించుకోకుండా వదిలేయవచ్చు కదా!’ అని ఎవరైనా అడుగుతుండవచ్చు. అలా వదిలెయ్యడం సబబు కాదు, ఎందుకంటే ఆయన అలా చేస్తే, అది బహుశా భవిష్యత్తులో తిరుగుబాటుదారులను ప్రోత్సహిస్తూ ఇంకా తీవ్రమైన బాధలకు దారితీస్తూ ఆయన అధికారానికున్న విలువను ఇంకా తక్కువచేసి ఉండేది. (ప్రసంగి 8:​11) అంతేగాక, అలాంటి అవిధేయతను పట్టించుకోకుండా వదిలేస్తే దేవుడు తప్పు చేసినవారిని సమర్థించినట్లయ్యేది. బైబిలు రచయిత మోషే, “ఆయన [దేవుని] కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు” అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 32:⁠4) ఆయన తన సహజమైన సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తించాలంటే, ఆదాము హవ్వలు తమ అవిధేయతకు పర్యవసానంగా బాధలు అనుభవించేందుకు దేవుడు అనుమతించాల్సిందే.

దేవుడు మొదటి మానవ జంటను, వారితో తిరుగుబాటు చేయించిన అదృశ్య ప్రేరకుడైన సాతానును వెంటనే ఎందుకు నాశనం చేయలేదు? అలా చేయగలిగే శక్తి ఆయనకుంది. ఆయనలా చేస్తే ఆదాము హవ్వలు బాధలకు మరణానికి గురయ్యే సంతానానికి జన్మనిచ్చేవారే కాదు. కానీ అలాంటి దైవిక శక్తి ప్రదర్శన తెలివైన తన ప్రాణులపై దేవునికున్న అధికారం న్యాయమైనది అని అది రుజువు చేసేది కాదు. అంతేకాదు, సంతానం కలగకుండా ఆదాము హవ్వలు మరణించినట్లయితే, పరిపూర్ణులైన వారి సంతానంతో భూమిని నింపాలనే దేవుని సంకల్పం విఫలమైనట్లు కూడా అది సూచించేది. (ఆదికాండము 1:​28) అంతేకాదు, “దేవుడు మనిషికాడు, . . . ఏదైనా చేస్తానని యెహోవా చెబితే ఆయన అలా చేస్తాడు. యెహోవా ఒక వాగ్దానం చేస్తే, ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.”​—⁠సంఖ్యాకాండము 23:​19, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

తన పరిపూర్ణమైన జ్ఞానముతో, యెహోవా దేవుడు తిరుగుబాటును కొంతకాలం వరకు అనుమతించాలని నిర్ణయించుకున్నాడు. తిరుగుబాటుదారులు దేవుని నుండి స్వతంత్రంగా ఉండడం వల్ల కలిగే పర్యవసానాలను అనుభవించడానికి కావలసినంత అవకాశం లభించింది. మానవాళికి దేవుని మార్గదర్శక ఆవశ్యకతనూ మానవుల పరిపాలనకన్నా సాతాను పరిపాలనకన్నా దేవుని పరిపాలనే ఉన్నతమైనదన్న విషయాన్నీ చరిత్ర స్పష్టం చేస్తోంది. అదే సమయంలో, దేవుడు భూమి గురించిన తన తొలి సంకల్ప నెరవేర్పును ఖాయపరుచుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నాడు. ఒక “సంతానము” లేదా “వారసుడు” వస్తాడని, ‘సాతాను తలమీద కొట్టి’ అతని తిరుగుబాటును దాని వల్ల కలిగిన హానికరమైన ప్రభావాలను శాశ్వతంగా నిర్మూలిస్తాడని ఆయన వాగ్దానం చేశాడు.​—⁠ఆదికాండము 3:​15.

యేసుక్రీస్తే ఆ వాగ్దాన సంతానం. “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను” అని 1 యోహాను 3:8లో మనం చదువుతాం. ఆదాము పిల్లలు వారసత్వంగా పొందిన పాప మరణాల నుండి వారిని విమోచించేందుకు యేసు తన పరిపూర్ణ మానవ జీవితాన్ని విమోచన క్రయధనముగా చెల్లించడం ద్వారా లయపరచాడు. (యోహాను 1:​29; 1 తిమోతి 2:​5, 6) ఎవరైతే యేసు బలిపై నిజంగా విశ్వాసముంచుతారో వారు బాధల నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారని వాగ్దానం చేయబడింది. (యోహాను 3:​16; ప్రకటన 7:​17) ఇది ఎప్పుడు జరుగుతుంది?

బాధలకు అంతం

దేవుని అధికారాన్ని తిరస్కరించడం వల్ల వర్ణనాతీతమైన బాధలు ఎదురయ్యాయి. అలాంటప్పుడు, మానవ బాధలను అంతం చేసి భూమి పట్ల తన తొలి సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేవుడు తన అధికారాన్ని ఒక ప్రత్యేకమైన విధంగా ఉపయోగించాలనుకోవడం సముచితమే. ఈ దైవిక ఏర్పాటును గురించి యేసు తన అనుచరులకు ప్రార్థన నేర్పిస్తున్న సందర్భంలో ప్రస్తావించాడు: “పరలోకమందున్న మా తండ్రీ, . . . నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (ఇటాలిక్కులు మావి.)​—⁠మత్తయి 6:​9, 10.

మానవులు తమను తాము పరిపాలించుకోవడం ద్వారా పరిశీలించుకోవడానికి దేవుడు అనుమతించిన సమయం దాదాపు పూర్తికానుంది. బైబిలు ప్రవచన నెరవేర్పుగా, ఆయన రాజ్యము 1914లో పరలోకంలో స్థాపించబడింది, యేసుక్రీస్తు దానికి రాజు. * అతి త్వరలోనే, అది మానవ ప్రభుత్వాలన్నింటినీ పగులగొట్టి నిర్మూలం చేస్తుంది.​—⁠దానియేలు 2:​44.

యేసు తన స్వల్పకాలిక భూ పరిచర్య సమయంలోనే, దేవుని పరిపాలన పునఃస్థాపించడం వల్ల మానవాళికి కలిగే ఆశీర్వాదాల గురించిన ఛాయను చూపించాడు. మానవ సమాజంలో పేదవారి పట్ల, పక్షపాతానికి గురైనవారి పట్ల యేసు సానుభూతి చూపించాడనే రుజువులను సువార్త వృత్తాంతాలు చూపిస్తున్నాయి. ఆయన రోగగ్రస్థులను స్వస్థపరిచాడు, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడమేకాక చనిపోయినవారిని పునరుత్థానం కూడా చేశాడు. ప్రకృతి శక్తులు కూడా ఆయన మాటను శిరసావహించాయి. (మత్తయి 11:⁠5; మార్కు 4:​37-39; లూకా 9:​11-16) యేసు విధేయులైన మానవులందరి ప్రయోజనం కోసం తన విమోచన క్రయధన బలి ప్రక్షాళనా ప్రభావాన్ని ఉపయోగించినప్పుడు ఇంకా ఏమి నెరవేరుస్తాడో ఊహించండి! క్రీస్తు పరిపాలన ద్వారా దేవుడు “వారి [మానవాళి] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు” అని బైబిలు వాగ్దానం చేస్తోంది.​—⁠ప్రకటన 21:⁠4.

బాధలనుభవిస్తున్నవారికి ఓదార్పు

మన ప్రేమగల, సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడనీ త్వరలోనే మానవాళిని విమోచిస్తాడనీ తెలుసుకోవడం ఎంతటి ప్రోత్సాహకరమైన విషయం! సాధారణంగా, చాలా అనారోగ్యంతో ఉన్న ఒక రోగి తనను స్వస్థపరిచే చికిత్స ఎంత బాధాకరమైనదైనా దానికి అంగీకరిస్తాడు. అదే విధంగా, దేవుడు విషయాలతో వ్యవహరించే విధానం శాశ్వతమైన ఆశీర్వాదాలను తెస్తుందని మనం గ్రహిస్తే, ఆ పరిజ్ఞానం మనకు తాత్కాలికంగా ఎదురయ్యే కష్టమెటువంటిదైనా మనల్ని బలపరచగలదు.

దీని ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించిన రికార్డూ, బైబిలు వాగ్దానాల నుండి ఓదార్పు పొందడం నేర్చుకున్నాడు. ఆయన, “నా భార్య మరణించిన తర్వాత, నేను అందరికీ దూరంగా ఉండాలని బాగా కోరుకున్నాను, కానీ అలా చేయడం వల్ల నా భార్య తిరిగి రాదు, బదులుగా నా మానసిక స్థితి మరింత దిగజారిపోతుందన్న విషయాన్ని నేను త్వరలోనే గ్రహించాను” అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడంలోను, ఇతరులతో బైబిలు సందేశాన్ని పంచుకోవడంలోను కొనసాగాడు. “ప్రేమపూర్వకమైన యెహోవా మద్దతును నేను అనుభవిస్తూ చాలా చిన్నవి అనిపించే విషయాల్లో కూడా నా ప్రార్థనలకు ఆయనెలా సమాధానమిచ్చాడో గ్రహించినప్పుడు నేనాయనకు సన్నిహితమయ్యాను. నేను ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనటువంటి ఘోరమైన పరీక్షను సహించడానికి నాకు దోహదపడింది, ఖచ్చితంగా దేవుని ప్రేమను గురించిన ఈ అవగాహనే” అని రికార్డూ అంటున్నాడు. “నాకు నా భార్య ఇప్పటికీ బాగా జ్ఞాపకం వస్తుంది, కానీ యెహోవా జరగడానికి అనుమతించినదేదీ మనకు శాశ్వతమైన హానిని కలిగించలేదని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అని ఆయన అంగీకరిస్తున్నాడు.

రికార్డూతోపాటు ఇతర లక్షలాది మందిలాగే మీరు కూడా, ప్రస్తుతం మానవాళి అనుభవిస్తున్న బాధలు ‘మరువబడి జ్ఞాపకమునకు రాని’ సమయం కోసం పరితపిస్తున్నారా? (యెషయా 65:⁠17) “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి” అన్న బైబిలు సలహాను మీరు అనుసరించినట్లయితే, దేవుని రాజ్యం ద్వారా కలిగే ఆశీర్వాదాలు మీకు అందుబాటులోనే ఉంటాయన్న నమ్మకంతో ఉండండి.​—⁠యెషయా 55:⁠6.

అలా చేయడానికి మీకు సహాయపడేందుకు, దేవుని వాక్యాన్ని చదవడాన్ని, జాగ్రత్తగా అధ్యయనం చేయడాన్ని మీ జీవితంలో ప్రముఖ విషయాలుగా చేసుకోండి. దేవుణ్ణి, ఆయన పంపించిన యేసుక్రీస్తును బాగా తెలుసుకోండి. దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి కృషి చేయండి, తద్వారా ఆయన సర్వాధిపత్యానికి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారని చూపించండి. అలాంటి జీవన సరళి, ఇప్పుడు మీరు పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తున్నా మీకు గొప్ప సంతోషాన్ని తెస్తుంది. భవిష్యత్తులో, బాధలు లేని లోకంలో జీవితం అనుభవించేలా చేస్తుంది.​—⁠యోహాను 17:⁠3.

[అధస్సూచీలు]

^ పేరా 7 ద జెరూసలేం బైబిలు ఆదికాండము 2:17వ వచనపు అధస్సూచిలో, “మంచి చెడ్డల తెలివి” అనేదానికి “ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించుకొని దాని ప్రకారం ప్రవర్తించే శక్తి, పూర్తి నైతిక స్వతంత్రత కోసం చేసే వాదన, దానితో మానవుడు తాను సృష్టించబడ్డాననే తన స్థితిని గుర్తించడానికి నిరాకరిస్తాడు. దేవుని సర్వాధిపత్యంపై జరిగిన దాడే మొదటి పాపము” అని వివరణనిస్తోంది.

^ పేరా 17 1914కు సంబంధించిన బైబిలు ప్రవచనాన్ని గురించిన సవివరమైన చర్చ కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 10, 11 అధ్యాయాలు చూడండి.

[6, 7వ పేజీలోని బాక్సు]

బాధలను మనమెలా ఎదుర్కోవచ్చు?

“మీ చింత యావత్తు ఆయన [వుని] మీద వేయుడి.” (1 పేతురు 5:⁠7) మనం గానీ మన ప్రియమైనవారు గానీ బాధలను సహిస్తున్నప్పుడు అస్పష్టమైన భావాలు, కోపం, వదిలేయబడినటువంటి భావన కలగడం సర్వసాధారణం. అయినా, యెహోవా మన భావాలను అర్థం చేసుకుంటాడన్న నమ్మకంతో ఉండండి. (నిర్గమకాండము 3:⁠7; యెషయా 63:⁠9) విశ్వసనీయులైన పూర్వీకుల వలే మనం కూడా మన హృదయాలను విప్పి మన సందేహాలను, చింతలను ఆయనకు తెలియజేయవచ్చు. (నిర్గమకాండము 5:​22; యోబు 10:​1-3; యిర్మీయా 14:​19; హబక్కూకు 1:​13) ఆయనేదో అద్భుతం చేసి మన కష్టాలను తీసివేయకపోవచ్చు, కానీ ఆయన మన హృదయపూర్వక ప్రార్థనలకు ప్రతిస్పందనగా, మనం ఆ పరిస్థితులతో వ్యవహరించడానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు.​—⁠యాకోబు 1:⁠5, 6.

“మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.” (1 పేతురు 4:​12) ఇక్కడ పేతురు హింస గురించి మాట్లాడుతున్నాడు, అయినప్పటికీ ఆయన మాటలు ఒక విశ్వాసి అనుభవించే ఏ బాధకైనా సమానంగా సరిగ్గానే వర్తిస్తాయి. మానవులు జీవితంలోని ప్రాథమిక అవసరాల కొరత, అనారోగ్యం, ప్రియులైనవారి మరణం వంటి వాటి కారణంగా బాధపడతారు. బైబిలు, మనలో ప్రతి ఒక్కరు ‘కాలవశానికీ అనూహ్య సంఘటనలకూ’ గురవుతారని చెబుతోంది. (ప్రసంగి 9:⁠11, NW) అలాంటివి ప్రస్తుత మానవ జీవితంలో ఒక భాగం. ఈ అవగాహన మనకు బాధలు, దురవస్థ ఎదురైనప్పుడు వాటితో వ్యవహరించేందుకు సహాయపడుతుంది. (1 పేతురు 5:⁠9) అన్నింటి కంటే ముఖ్యంగా, “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి” అన్న హామీని జ్ఞాపకం చేసుకోవడం ప్రత్యేకించి ఓదార్పుకు మూలంగా ఉంటుంది.​—⁠కీర్తన 34:15; సామెతలు 15:3; 1 పేతురు 3:12.

“నిరీక్షణగలవారై సంతోషించ [డి].” (రోమీయులు 12:​12) గతంలో మనం అనుభవించిన సంతోషాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవడానికి బదులు, బాధలన్నింటిని అంతం చేస్తానన్న దేవుని వాగ్దానాన్ని మననం చేసుకోవచ్చు. (ప్రసంగి 7:​10) సహేతుకమైన ఈ వాగ్దానం, ఒక శిరస్త్రాణం తలను కాపాడినట్లు మనల్ని కాపాడుతుంది. నిరీక్షణ, జీవితంలో ఎదురయ్యే దెబ్బలు ఏమంత బలంగా తగలకుండా కాపాడుతూ అవి మన మానసిక, భావోద్రేక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి హానికలిగించకుండా భద్రత చేకూరుస్తుంది.​—⁠1 థెస్సలొనీకయులు 5:⁠8.

[5వ పేజీలోని చిత్రం]

ఆదాము హవ్వలు దేవుని పరిపాలనను తిరస్కరించారు

[7వ పేజీలోని చిత్రం]

బాధలు లేని లోకాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు