కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు మెలకువగా ఉండండి

మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు మెలకువగా ఉండండి

మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు మెలకువగా ఉండండి

“కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.”​—⁠1 థెస్సలొనీకయులు 5:⁠6.

మన సామాన్య శకములోని మొదటి శతాబ్దంలో పాంపేయీ, హర్కులేనియమ్‌ అనేవి వర్ధిల్లుతున్న రోమా నగరాలు, అవి వెసూవియస్‌ పర్వతం సమీపంలో ఉండేవి. సంపన్నులైన రోమన్లకు అవి ప్రియమైన విశ్రమ స్థలాలు. అక్కడి పోరాట ప్రదర్శనశాలల్లో (ఆంఫిథియేటర్లు) వెయ్యికంటే ఎక్కువమంది ప్రేక్షకులు కూర్చోవచ్చు, పాంపేయీలోనైతే ఒక పెద్ద ప్రదర్శనశాల ఉండేది, దాంట్లో దాదాపు పట్టణంలోని ప్రజలందరూ కూర్చోవచ్చు. పాంపేయీను వెలికితీసినవారు 118 మధుశాలను లెక్కించారు, వాటిలో కొన్ని జూదగృహాలుగా లేదా వేశ్యాగృహాలుగా ఉపయోగించబడేవి. గోడల మీది చిత్రాలు, ఇతర మృత దేహాలు చూపిస్తున్నట్లుగా లైంగిక దుర్నీతి, భౌతికసంపదల వ్యామోహం విస్తృతంగా ఉండేవి.

2 సా.శ. 79 ఆగస్టు 24న వెసూవియస్‌ పర్వతం పేలడం ప్రారంభమైంది. రెండు నగరాలపై పూమైస్‌, బూడిద కురిసిన మొదటి ప్రేలుడు బహుశా ఆ నగరాల్లోని నివాసులు తప్పించుకోకుండా నిరోధించివుండకపోవచ్చునని అగ్ని పర్వతాలను అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. వాస్తవానికి చాలామంది అలా తప్పించుకొని వెళ్ళిపోయుంటారు. అయితే ఇతరులు, అంటే ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసినవారు లేదా హెచ్చరికా సూచనలను నిర్లక్ష్యం చేసినవారు నగరంలోనే ఉండిపోయారు. అప్పుడు, దాదాపు మధ్యరాత్రి సమయంలో విపరీతమైన వేడి వాయువులు, పూమైస్‌, రాళ్ళు పెద్ద మొత్తంలో హర్కులేనియమ్‌ మీద కురిసి ఆ నగరంలో మిగిలివున్న నివాసులందరికి ఊపిరాడకుండా చేశాయి. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే అలాంటి రాళ్ళ వానే పాంపేయీలోని ప్రతి ఒక్కరినీ చంపేసింది. హెచ్చరికా సూచనలను పట్టించుకోకపోవడం వల్ల ఎంత దుఃఖకరమైన పర్యవసానమో కదా!

యూదా విధానాంతం

3 ఈ సంఘటనకు తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన యెరూషలేము నాశనం మానవుల వల్ల జరిగిందే అయినప్పటికీ అది పాంపేయీ, హర్కులేనియమ్‌ నగరాల భీతావహ అంతాన్ని మించిపోయింది. “చరిత్రంతటిలోకి అత్యంత ఘోరమైన ముట్టడుల్లో ఒకటి” అని వర్ణించబడిన ఈ నాశనం పది లక్షలకంటే ఎక్కువమంది యూదుల మరణానికి కారణమైనట్లు నివేదించబడింది. అయితే, పాంపేయీ హర్కులేనియమ్‌ నగరాల్లో జరిగిన నాశనంలా యెరూషలేము నాశనం ఏ హెచ్చరికా లేకుండా ఏమీ జరగలేదు.

4 యేసుక్రీస్తు యెరూషలేము నాశనం గురించి ప్రవచించాడు, దానికి ముందు జరిగే యుద్ధాలు, కరవులు, భూకంపాలు, అన్యాయం వంటి సంఘటనల గురించి కూడా ఆయన ముందుగానే తెలియజేశాడు. ఆ సమయంలో అబద్ధప్రవక్తలు చురుగ్గా పనిచేస్తుంటారు కానీ దేవుని రాజ్య సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతుంది. (మత్తయి 24:​4-7, 11-14) యేసు మాటలు నేడు ప్రధానంగా నెరవేరుతున్నప్పటికీ అప్పట్లో అవి తక్కువస్థాయిలో నెరవేరాయి. యూదయలో కరవు సంభవించిందని చరిత్ర ధృవీకరిస్తోంది. (అపొస్తలుల కార్యములు 11:​28) యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌, నగరం నాశనం చేయబడడానికి ముందు యెరూషలేము ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నివేదిస్తున్నాడు. యెరూషలేము అంతం సమీపించినప్పుడు నిరంతర తిరుగుబాటులు, యూదా రాజకీయవర్గాల మధ్య అంతర్యుద్ధాలు, యూదులు అన్యులు కలిసి నివసిస్తున్న అనేక నగరాల్లో సామూహిక హత్యలు జరిగాయి. అయినప్పటికీ “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” రాజ్య సువార్త ప్రకటించబడుతూనే ఉంది.​—⁠కొలొస్సయులు 1:​23.

5 చివరికి సా.శ. 66లో యూదులు రోమ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. యెరూషలేమును ముట్టడించడానికి సెస్టియస్‌ గాలస్‌ సైన్యంతో వచ్చినప్పుడు, యేసు అనుచరులు ఆయన చెప్పిన ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నారు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.” (లూకా 21:​20, 21) యెరూషలేమును వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చింది​—⁠కానీ ఎలా? అనుకోనిరీతిగా, గాలస్‌ తన సైన్యాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోవడంతో యూదా యెరూషలేములలో ఉన్న క్రైస్తవులకు యేసు మాటలను లక్ష్యపెట్టి కొండలకు పారిపోవడానికి మార్గం సుగమమయ్యింది.​—⁠మత్తయి 24:​15, 16.

6 నాలుగు సంవత్సరాల తర్వాత, ఇంచుమించు పస్కా పండుగ సమయంలో, యూదుల తిరుగుబాటును పూర్తిగా మట్టుబెట్టాలన్న పట్టుదలతో ఉన్న జనరల్‌ టైటస్‌ ఆధ్వర్యంలో రోమా సైన్యాలు తిరిగివచ్చాయి. ఆయన సైన్యం యెరూషలేము “చుట్టు గట్టు కట్టి” తప్పించుకుపోవడం అసాధ్యమయ్యేలా చేసింది. (లూకా 19:​43, 44) యుద్ధం జరిగే ప్రమాదం ఉన్నప్పటికీ యూదులు పస్కా పండుగను ఆచరించడానికి రోమా సామ్రాజ్యమంతటి నుండి యెరూషలేముకు చేరుకున్నారు. అప్పుడు వారు దానిలో చిక్కుకుపోయారు. జోసీఫస్‌ చెబుతున్న దాని ప్రకారం, రోమా ముట్టడిలో మరణించింది చాలామేరకు నిర్భాగ్యులైన ఈ సందర్శకులే. * చివరికి యెరూషలేము వారి చేతికి చిక్కేసరికి, రోమా సామ్రాజ్యంలోని యూదులందరిలో దాదాపు ఏడవవంతు మంది చనిపోయారు. యెరూషలేము, దాని ఆలయం నాశనం చేయబడడంతో యూదా వ్యవస్థ, మోషే ధర్మశాస్త్రంపై ఆధారపడిన మత విధానం అంతమయ్యాయి. *​—⁠మార్కు 13:1, 2.

7 యూదా క్రైస్తవులు సా.శ. 70లో యెరూషలేములోని మిగతా అందరితోపాటు చంపబడి ఉండేవారు లేదా దాసులుగా తీసుకొనిపోబడి ఉండేవారు. అయితే చారిత్రక సాక్ష్యాధారం ప్రకారం, వారు 37 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన యేసు హెచ్చరికను లక్ష్యపెట్టారు. వారు నగరాన్ని వదిలి వెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు.

అపొస్తలులిచ్చిన సమయోచితమైన హెచ్చరికలు

8 నేడు, మరింత విస్తృత పరిధిలో నాశనం రాబోతోంది, అది ఈ విధానానికంతటికీ అంతం తీసుకువస్తుంది. యెరూషలేము నాశనం చేయబడడానికి ఆరు సంవత్సరాల ముందు అపొస్తలుడైన పేతురు మెలకువగా ఉండండి అని ఉపదేశించాడు. అత్యావశ్యకమైన, సమయోచితమైన ఆ ఉపదేశం మన కాలంలోని క్రైస్తవులకు ప్రాముఖ్యంగా అన్వయిస్తుంది. “ప్రభువైన” యేసుక్రీస్తు “ఇచ్చిన ఆజ్ఞను” నిర్లక్ష్యం చేయకుండా ఉండగలిగేలా క్రైస్తవులు తమ “నిర్మలమైన . . . మనస్సులను [“ఆలోచనా సామర్థ్యాలను,” NW]” మేలుకొల్పుకోవాల్సిన అవసరం ఉందని పేతురు గుర్తించాడు. (2 పేతురు 3:​1, 2) అప్రమత్తంగా ఉండమని పేతురు క్రైస్తవులకు ఉద్బోధించినప్పుడు, “జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు” అని కొన్ని రోజుల క్రితం యేసు తన అపొస్తలులకు చెప్పిన విషయం ఆయన మనస్సులో ఉండి ఉండవచ్చు.​—⁠మార్కు 13:​33.

9 “ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను?” అని నేడు కొందరు ఎగతాళిగా అడుగుతారు. (2 పేతురు 3:​3, 4) పరిస్థితులు అసలు ఎన్నటికీ మారవని, ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి అన్నీ ఎలా ఉన్నాయో అలాగే కొనసాగుతాయని వాళ్ళు భావిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. అలాంటి సంశయవాదం ప్రమాదకరమైనది. సందేహాలు, మనం మన సొంత కోరికల్లో ఎక్కువగా నిమగ్నమైపోయేలా చేస్తూ మన అత్యవసర భావాన్ని బలహీనపర్చగలవు. (లూకా 21:​34) అంతేగాక, పేతురు పేర్కొంటున్నట్లుగా అలాంటి అపహాసకులు ఒక ప్రపంచ విధానాన్నంతటినీ నాశనం చేసిన నోవహు కాలంనాటి జలప్రళయాన్ని మరచిపోతారు. ప్రపంచం నిజంగానే మారింది!​—⁠ఆదికాండము 6:13, 17; 2 పేతురు 3:​5, 6.

10 దేవుడు తరచూ వెంటనే ఎందుకు చర్య తీసుకోడో పేతురు తన పాఠకులకు గుర్తు చేయడం ద్వారా వారు సహనాన్ని వృద్ధి చేసుకోవడానికి వారికి సహాయం చేస్తున్నాడు. మొదట పేతురు ఇలా అంటున్నాడు: “ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.” (2 పేతురు 3:⁠8) యెహోవా నిరంతరం జీవించేవుంటాడు కాబట్టి ఆయన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని చర్యతీసుకోవడానికి అత్యంత శ్రేష్ఠమైన సమయాన్ని ఎంపిక చేసుకోగలడు. ఆ తర్వాత, ప్రజలందరూ పశ్చాత్తాపపడాలన్న యెహోవా కోరికను పేతురు పేర్కొంటున్నాడు. దేవుడు త్వరగా చర్య తీసుకుంటే నశించిపోగల అనేకులకు ఆయన సహనం రక్షణనిస్తుంది. (1 తిమోతి 2:3, 4; 2 పేతురు 3:⁠9) అయితే, యెహోవా సహనంగా ఉన్నాడంటే ఆయన ఎన్నటికీ చర్య తీసుకోడని కాదు. “ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును” అని పేతురు చెబుతున్నాడు. (ఇటాలిక్కులు మావి.)​—⁠2 పేతురు 3:​10.

11 పేతురు పోలుస్తున్న విధానం గమనార్హం. దొంగలను పట్టుకోవడం అంత సులభమేమీ కాదు, కానీ అప్పుడప్పుడూ కునికిపాట్లు పడే వ్యక్తి కన్నా రాత్రంతా మెలకువగా ఉండే కాపలాదారుడు దొంగను పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాపలాదారుడు ఎలా మేల్కొని ఉండగలడు? రాత్రంతా కూర్చొని ఉండడం కంటే నడుస్తూ ఉండడం మెలకువగా ఉండేందుకు ఎక్కువ దోహదపడుతుంది. అలాగే, ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండడం క్రైస్తవులుగా మనం మెలకువగా ఉండేందుకు సహాయం చేస్తుంది. అందుకే, ‘పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి’ కలిగివుండడంలో నిమగ్నమై ఉండమని పేతురు ఉద్బోధిస్తున్నాడు. (2 పేతురు 3:​11, 12) అలాంటి కార్యకలాపాలు “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టు”కొని ఉండడంలో కొనసాగడానికి మనకు సహాయం చేస్తాయి. ‘కనిపెట్టుకొని’ ఉండడం అనే అర్థంగల గ్రీక్‌ పదాన్ని అక్షరార్థంగా “వేగంగా కదిలేలా చేయడం” అని అనువదించవచ్చు. నిజమే, మనం యెహోవా కాలపట్టికను మార్చలేము. ఆయన దినం ఆయన నియమించిన గడియలోనే వస్తుంది. అయితే మనం ఆయన సేవలో నిమగ్నమై ఉంటే ఇప్పటి నుండి అప్పటి వరకున్న సమయం చాలా త్వరగా గడిచిపోయినట్లనిపిస్తుంది.​—⁠1 కొరింథీయులు 15:​58.

12 యెహోవా దినపు రాకడ ఆలస్యమవుతోందని భావించే వారెవరైనా, యెహోవా నియమిత సమయం కోసం సహనంతో ఎదురు చూడమని పేతురు ఇచ్చిన ఉపదేశాన్ని లక్ష్యపెట్టాలని ప్రోత్సహించబడుతున్నారు. వాస్తవానికి, దేవుని సహనం అనుమతిస్తున్న అదనపు సమయాన్ని మనం జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, మనం ప్రాముఖ్యమైన క్రైస్తవ లక్షణాలను అలవర్చుకోవడంలో, ఇంకా ఎక్కువమందితో సువార్త పంచుకోవడంలో కొనసాగవచ్చు, ఒకవేళ యెహోవా దినం త్వరగా వచ్చేస్తే అవి సాధ్యం కాకపోవచ్చు. మనం మెలకువగా ఉంటే విధానంతంలో యెహోవా మనల్ని “నిష్కళంకులుగాను నిందారహితులుగాను” కనుగొంటాడు. (2 పేతురు 3:​14, 15) అదెంత గొప్ప ఆశీర్వాదమో కదా!

13 పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రికలో కూడా మెలకువగా ఉండవలసిన అవసరత గురించి మాట్లాడుతున్నాడు. “ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము” అని ఆయన హితబోధ చేస్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:​2, 6) నేడు, ప్రపంచ విధానమంతా నాశనమయ్యే సమయం సమీపిస్తుండగా, మెలకువగా ఉండడం ఎంత అత్యవసరమో కదా! యెహోవా ఆరాధకులు ఆధ్యాత్మిక విషయాల పట్ల అంతగా ఆసక్తి చూపించని లోకంలో జీవిస్తున్నారు, ఇది వారిని ప్రభావితం చేయగలదు. అందుకే పౌలు ఇలా హితబోధ చేస్తున్నాడు: “మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.” (1 థెస్సలొనీకయులు 5:⁠8) దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయడం, కూటాల్లో మన సహోదరులతో క్రమంగా సహవసించడం పౌలు ఇచ్చిన హితబోధను అనుసరించడానికీ మన అత్యవసర భావాన్ని కాపాడుకోవడానికీ మనకు సహాయం చేస్తాయి.​—⁠మత్తయి 16:​1-3.

లక్షలాదిమంది మెలకువగా ఉన్నారు

14 మెలకువగా ఉండమని ఇవ్వబడుతున్న ప్రేరేపిత ప్రోత్సాహాన్ని లక్ష్యపెట్టేవాళ్ళు నేడు అనేకమంది ఉన్నారా? ఉన్నారు. 2002 సేవా సంవత్సరంలో, శిఖరాగ్ర సంఖ్య అయిన 63,04,645 మంది ప్రచారకులు​—⁠2001తో పోల్చి చూస్తే ఇది 3.1 శాతం పెరుగుదల​—⁠దేవుని రాజ్యం గురించి ఇతరులతో మాట్లాడడానికి 1,20,23,81,302 గంటలు వెచ్చించడం ద్వారా తాము ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నామని చూపించారు. వీరికి అలాంటి కార్యకలాపాలు కేవలం సర్వసాధారణమైన విషయాలేమీ కావు. అవి వారి జీవితాల్లో అగ్రస్థానంలో ఉంటాయి. వారిలోని అనేకుల దృక్పథం, ఎల్‌ సాల్వడార్‌లోని ఇడ్వార్డో, నోయెమీ అనే వారి ఉదాహరణలో మనకు కనిపిస్తుంది.

15 కొన్ని సంవత్సరాల క్రితం, “ఈ లోకపు నటన గతించుచున్నది” అని పౌలు చెప్పిన మాటలను ఇడ్వార్డో, నోయెమీ పరిగణలోకి తీసుకున్నారు. (1 కొరింథీయులు 7:​31) వారు తమ జీవితాన్ని నిరాడంబరంగా గడుపుతూ పూర్తికాల పయినీరు సేవను ప్రారంభించారు. సమయం గడుస్తుండగా, వారు అనేక విధాలుగా ఆశీర్వదించబడ్డారు, చివరికి ప్రాంతీయ, జిల్లా పనిలో కూడా భాగం వహించారు. ఇడ్వార్డో, నోయెమీ గంభీరమైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ పూర్తికాల సేవను చేపట్టడానికి వస్తుపరమైన సౌకర్యాలను త్యాగం చేయాలని తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనన్న దృఢ నమ్మకం వారిద్దరికీ ఉంది. ఎల్‌ సాల్వడార్‌లో ఉన్న 29,269 మంది ప్రచారకుల్లోని అనేకులు​—⁠2,454 మంది పయినీర్లతో సహా​—⁠అటువంటి స్వయంత్యాగ స్ఫూర్తినే చూపించారు, అందుకే ఆ దేశంలో గత సంవత్సరం ప్రచారకుల సంఖ్యలో 2 శాతం పెరుగుదల కనిపించింది.

16 కోటె డి ఐవరీలో, ఒక యౌవన క్రైస్తవుడు అదే దృక్పథాన్ని చూపించాడు, ఆయన బ్రాంచి కార్యాలయానికి ఇలా వ్రాశాడు: “నేను పరిచర్య సేవకుడిని. నేను వ్యక్తిగతంగా మంచి మాదిరిని ఉంచడం లేదు కాబట్టి పయినీరు సేవ చేయమని ఇతర సహోదరులకు చెప్పలేను. కాబట్టి నేను మంచి జీతం వస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి స్వయం ఉపాధి కల్పించుకున్నాను, దానితో నేనిప్పుడు పరిచర్యలో ఎక్కువ సమయం గడపగలుగుతున్నాను.” ఈ యువకుడు కోటె డి ఐవరీలో సేవ చేస్తున్న 983 మంది పయినీర్లలో ఒకడయ్యాడు, అక్కడ గత సంవత్సరం 6,701 మంది ప్రచారకులున్నట్లు నివేదించబడింది, అది 5 శాతం పెరుగుదల.

17 అసహనం, దురభిమానం, వివక్షతల కారణంగా బెల్జియంలోని 24,961 మంది రాజ్య ప్రచారకులకు నిరంతరం సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా, వారు ఏ మాత్రం భయపడకుండా అత్యంతాసక్తితో కొనసాగుతున్నారు. పాఠశాలలో నైతిక విలువలకు సంబంధించి జరిగే ఒక తరగతిలో యెహోవాసాక్షులు ఒక తెగకు చెందినవారిగా వర్ణించబడడాన్ని విన్న 16 సంవత్సరాల ఒక సాక్షి, ఈ విషయంలో యెహోవాసాక్షుల దృక్కోణం గురించి తెలియజేయడానికి తనకు అనుమతివ్వమని కోరింది. యెహోవాసాక్షులు​—⁠ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియోను, యెహోవాసాక్షులు​—⁠వారెవరు? అనే బ్రోషుర్‌ను ఉపయోగిస్తూ సాక్షులు నిజంగా ఎవరనేది ఆమె వివరించగలిగింది. ఆ సమాచారాన్ని అందరూ ఎంతో చక్కగా స్వీకరించారు, ఆ తర్వాతి వారం విద్యార్థులకు ఒక పరీక్ష జరిగింది, అందులోని ప్రశ్నలన్నీ యెహోవాసాక్షుల క్రైస్తవ మతానికి సంబంధించినవే.

18 చాలామంది క్రైస్తవులు ఈ అంత్యదినాల్లో గంభీరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయినా వారు తమ ధ్యాస మళ్ళకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అందరికీ తెలిసినట్లుగా అర్జెంటీనాలో ఆర్థిక సమస్యలున్నప్పటికీ గత సంవత్సరం ఆ దేశం 1,26,709 మంది సాక్షుల శిఖరాగ్ర సంఖ్యను నివేదించింది. మొజాంబిక్‌లో ఇప్పటికీ పేదరికం విస్తృతంగా ఉంది. అయినప్పటికీ సాక్ష్యమిచ్చే పనిలో 37,563 మంది పాల్గొంటున్నట్లు నివేదించబడింది, అది 4 శాతం పెరుగుదల. అల్బేనియాలో అనేకులకు జీవితం చాలా కష్టతరంగా ఉంది, అయినా ఆ దేశం 12 శాతం చక్కని అభివృద్ధిని నివేదించింది, ప్రచారకుల సంఖ్య 2,708 మందితో శిఖరాగ్రాన్ని చేరుకుంది. యెహోవా సేవకులు రాజ్య సంబంధిత విషయాలకు మొదటి స్థానాన్నిచ్చినప్పుడు ఏ కష్టపరిస్థితులూ ఆయన ఆత్మను అడ్డగించలేవన్నది సుస్పష్టం.​—⁠మత్తయి 6:​33.

19 ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరంలో నివేదించబడిన 53,09,289 నెలసరి సగటు బైబిలు అధ్యయనాలు, బైబిలు సత్యం కోసం ఆకలితో ఉన్న గొఱ్ఱెవంటివారు ఇంకా చాలామంది ఉన్నారని చూపిస్తున్నాయి. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన 1,55,97,746 మందిలో​—⁠ఇది కూడా క్రొత్త శిఖరాగ్ర సంఖ్యే​—⁠అనేకులు చురుగ్గా యెహోవా సేవ చేయడం ఇంకా ప్రారంభించలేదు. వారు యెహోవాను గురించిన, సహోదరత్వాన్ని గురించిన పరిజ్ఞానములోనూ ప్రేమలోనూ ఎదుగుతూ ఉందురు గాక. “వేరే గొఱ్ఱె”లకు చెందిన ఒక “గొప్ప సమూహము” తమ ఆత్మాభిషిక్త సహోదరులతో కలిసి సృష్టికర్తకు “రాత్రింబగళ్లు ఆయన ఆలయములో” సేవ చేస్తూ ఫలవంతంగా ఉండడాన్ని చూడడం ఉత్తేజకరంగా ఉంటుంది.​—⁠యోహాను 10:16; ప్రకటన 7:9, 15.

లోతు నుండి ఒక పాఠం

20 దేవుని నమ్మకమైన సేవకులు సహితం తమ అత్యవసర భావాన్ని తాత్కాలికంగా కోల్పోయే ప్రమాదముంది. అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు గురించి ఆలోచించండి. ఆయన తనను సందర్శించిన ఇద్దరు దేవదూతల ద్వారా దేవుడు సొదొమ గొమొఱ్ఱాలను నాశనం చేయబోతున్నాడని తెలుసుకున్నాడు. “దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధ”పడుతున్న లోతుకు ఆ వార్త ఆశ్చర్యం కలిగించి ఉండకపోవచ్చు. (2 పేతురు 2:⁠7) అయినా, ఆయనను సొదొమలో నుండి బయటకు తీసుకువెళ్ళడానికి ఆ ఇద్దరు దూతలు వచ్చినప్పుడు, ‘అతడు తడవు చేశాడు.’ దూతలు ఆ పట్టణం నుండి ఆయననూ ఆయన కుటుంబాన్నీ దాదాపు లాక్కువెళ్ళాల్సి వచ్చింది. తదనంతరం, వెనక్కి తిరిగి చూడవద్దని దూతలు ఇచ్చిన హెచ్చరికను లోతు భార్య అలక్ష్యం చేసింది. ఆమె నిర్లక్ష్య వైఖరి ఆమె ప్రాణాలనే బలితీసుకుంది. (ఆదికాండము 19:​14-17, 26) “లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి” అని యేసు హెచ్చరించాడు.​—⁠లూకా 17:32.

21 పాంపేయీ, హర్కులేనియమ్‌ నగరాల్లో జరిగిన నాశనం, యెరూషలేము నాశనానికి సంబంధించిన సంఘటనలు, నోవహు కాలంనాటి జలప్రళయం, లోతు కాలంనాటి నాశనం, ఇవన్నీ కూడా హెచ్చరికలను గంభీరంగా తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను సోదాహరణంగా తెలియజేస్తున్నాయి. యెహోవా సేవకులుగా మనకు అంత్యకాల సూచనల గురించి తెలుసు. (మత్తయి 24:⁠3) మనల్ని మనం అబద్ధ ఆరాధన నుండి వేరు చేసుకున్నాము. (ప్రకటన 18:⁠4) మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లాగే మనం “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టు”కొని ఉండవలసిన అవసరం ఉంది. (2 పేతురు 3:​11, 12) అవును, మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు మనం మెలకువగా ఉండాలి! మెలకువగా ఉండడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎలాంటి లక్షణాలను వృద్ధి చేసుకోవచ్చు? తర్వాతి ఆర్టికల్‌ ఆ విషయాలను పరిశీలిస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 9 మొదటి శతాబ్దంలో, యెరూషలేములో 1,20,000కి మించి నివాసులు ఉండి ఉండకపోవచ్చు. సా.శ. 70వ సంవత్సరంలోని పస్కాపండుగకు యూదా ప్రాంతంలో నివసించే 3,00,000 మంది యెరూషలేముకు ప్రయాణించి వెళ్ళారని యూసీబియస్‌ లెక్కిస్తున్నాడు. మరణించిన మిగతా వారు సామ్రాజ్యంలోని ఇతర భాగాల నుండి వచ్చి ఉండవచ్చు.

^ పేరా 9 అయితే యెహోవా దృక్కోణం నుండి చూస్తే, సా.శ. 33లో మోషే ధర్మశాస్త్రం స్థానంలోకి క్రొత్త నిబంధన వచ్చింది.​—⁠ఎఫెసీయులు 2:15-17.

మీరెలా సమాధానమిస్తారు?

• యెరూషలేము నాశనాన్ని తప్పించుకోవడానికి యూదా క్రైస్తవులకు ఏది సహాయపడింది?

• అపొస్తలులైన పేతురు, పౌలు వ్రాసిన వాటిలోని హితబోధ మనం మెలకువగా ఉండేందుకు ఎలా సహాయం చేస్తుంది?

• పూర్తి మెలకువగా ఉన్నామని నేడు ఎవరు చూపిస్తున్నారు?

• లోతు, ఆయన భార్య వృత్తాంతం నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) పాంపేయీ, హర్కులేనియమ్‌ ఏ విధమైన నగరాలు? (బి) పాంపేయీ, హర్కులేనియమ్‌ నగరాల్లోని అనేకమంది నివాసులు ఏ హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు, దాని పర్యవసానమేమిటి?

3. యెరూషలేము నాశనానికీ పాంపేయీ, హర్కులేనియమ్‌ నగరాల నాశనానికీ ఉన్న సారూప్యత ఏమిటి?

4. విధానాంతం సమీపించిందని తన అనుచరులను హెచ్చరించడానికి యేసు ఏ ప్రవచనార్థక సూచననిచ్చాడు, తొలిసారిగా అది మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరింది?

5, 6. (ఎ) సా.శ. 66లో యేసు పలికిన ఏ ప్రవచనార్థక మాటలు నెరవేరాయి? (బి) సా.శ. 70లో చివరికి యెరూషలేము నాశనం చేయబడినప్పుడు అంత ఎక్కువమంది ఎందుకు మరణించారు?

7. నమ్మకమైన క్రైస్తవులు యెరూషలేము నాశనాన్ని ఎందుకు తప్పించుకోగలిగారు?

8. పేతురు ఏ అవసరాన్ని గుర్తించాడు, యేసు చెప్పిన ఏ మాటలు ఆయన మనస్సులో ఉండి ఉండవచ్చు?

9. (ఎ) కొంతమంది ఎలాంటి ప్రమాదకరమైన దృక్పథాన్ని వృద్ధి చేసుకుంటారు? (బి) సంశయాత్మక దృక్పథం ప్రాముఖ్యంగా ఎందుకు ప్రమాదకరమైనది?

10. అసహనం చూపేవారిగా తయారుకాగల వారిని పేతురు ఏ మాటలతో ప్రోత్సహిస్తున్నాడు?

11. ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి మనకేమి సహాయం చేస్తుంది, అది యెహోవా దినమును “వేగంగా కదిలేలా” చేసినట్లు ఎలా అవుతుంది?

12. యెహోవా సహనం నుండి వ్యక్తిగతంగా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

13. పౌలు థెస్సలొనీకలోని క్రైస్తవులకు వ్రాసిన ఏ మాటలు ప్రాముఖ్యంగా నేడు సముచితమైనవి?

14. మెలకువగా ఉండమని పేతురు ఇచ్చిన ఉపదేశాన్ని నేడు అనేకమంది అనుసరిస్తున్నారని ఏ గణాంకాలు సూచిస్తున్నాయి?

15. ఎల్‌ సాల్వడార్‌కు చెందిన ఏ అనుభవం, అనేకులు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నారని చూపిస్తోంది?

16. కోటె డి ఐవరీలోని ఒక యౌవనస్థుడు ఎలాంటి దృక్పథాన్ని చూపించాడు?

17. బెల్జియంలోని ఒక యువసాక్షి తాను దురభిమానాన్ని బట్టి ఎంతమాత్రమూ భయపడలేదని ఎలా చూపించింది?

18. ఆర్థిక సమస్యలు అర్జెంటీనా, మొజాంబిక్‌ దేశాలలోని ప్రచారకులు యెహోవా సేవ చేయడం మానుకునేలా చేయలేదనడానికి ఏ నిదర్శనముంది?

19. (ఎ) బైబిలు సత్యం కోసం ఆకలితోవున్న గొఱ్ఱెవంటివారు అనేకులున్నారనడానికి నిదర్శనమేమిటి? (బి) యెహోవా సేవకులు ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నారని వార్షిక నివేదికలోని కొన్ని ఏ ఇతర వివరాలు చూపిస్తున్నాయి? (12-15 పేజీల్లో ఉన్న చార్టును చూడండి.)

20. లోతు, ఆయన భార్య ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకుంటాము?

21. మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు మనం మెలకువగా ఉండడం ఎందుకు ఆవశ్యకము?

[12-15వ పేజీలోని చార్టు]

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2002వ సేవా సంవత్సరపు నివేదిక

[9వ పేజీలోని చిత్రం]

సా.శ. 66లో యెరూషలేములోని క్రైస్తవులు యేసు హెచ్చరికను లక్ష్యపెట్టారు

[10వ పేజీలోని చిత్రం]

క్రైస్తవులు చురుగ్గా ఉండడం మెలకువగా ఉండడానికి సహాయం చేస్తుంది