‘మెలకువగా నుండుడి’!
‘మెలకువగా నుండుడి’!
“ను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండు[డి].”—మార్కు 13:37.
క్వాన్ తన విలువైన వస్తువులను ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన వాటిని తన పరుపు క్రింద పెట్టుకున్నాడు—ఆయన అభిప్రాయం ప్రకారం ఇంట్లో అదే సురక్షితమైన స్థలం. అయితే ఒక రోజు రాత్రి ఆయనా ఆయన భార్యా నిద్రపోతుండగా ఒక దొంగ వాళ్ళ పడకగదిలోకి ప్రవేశించాడు. సరిగ్గా ఎక్కడ వెతకాలన్నది తెలిసినవాడిలాగే ఆ దొంగ పరుపు క్రింది నుండి విలువైన వస్తువులన్నీ తీసుకోవడమే గాక పరుపు ప్రక్కనున్న ఒక బల్ల సొరుగులో క్వాన్ పెట్టుకున్న డబ్బు కూడా తీసుకుపోయాడు. మరునాడు ఉదయం, దొంగతనం జరిగిందని క్వాన్‌కు తెలిసింది. నిద్రపోతున్న వ్యక్తి తన సంపదలను కాపాడుకోలేడని తాను ఎంతో క్షోభతో నేర్చుకోవాల్సివచ్చిన పాఠాన్ని ఆయనంత త్వరగా మరిచిపోలేడు.
2 ఆధ్యాత్మిక విషయాలకు కూడా ఇది వర్తిస్తుంది. మనం నిద్రలోకి జారుకుంటే మన నిరీక్షణను, విశ్వాసాన్ని కాపాడుకోలేము. అందుకే పౌలు, “ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము” అని ఉద్బోధించాడు. (1 థెస్సలొనీకయులు 5:6) మెలకువగా ఉండడం ఎంత ఆవశ్యకమైనదో చూపించడానికి యేసు, దొంగను గురించిన ఉపమానాన్ని ఉపయోగించాడు. యేసు తాను న్యాయాధిపతిగా రావడానికి దారితీసే సంఘటనలను వర్ణించిన తర్వాత ఇలా హెచ్చరించాడు: “కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.” (మత్తయి 24:42-44) దొంగ తాను ఎప్పుడు వచ్చేది చాటింపేమీ వేయడు. ఎవరూ ఊహించని సమయంలో రావాలనుకుంటాడు. అలాగే, యేసు చెప్పినట్లుగా ఈ విధానాంతం ‘మనమనుకొనని గడియలో’ వస్తుంది.
“మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి”
3 లూకా సువార్తలో వ్రాయబడివున్న మాటల్లో యేసు క్రైస్తవులను, వివాహానికి వెళ్ళిన తమ యజమాని తిరిగి రావడం కోసం ఎదురుచూస్తున్న దాసులతో పోల్చాడు. ఆయన తిరిగి వచ్చేసరికి తాము మెలకువగా ఉండి ఆయనకు ఆహ్వానం పలికేలా వారు అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా, “మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును” అని యేసు అన్నాడు. (లూకా 12:40) అనేక సంవత్సరాలుగా యెహోవా సేవ చేస్తున్న కొందరు మనం జీవిస్తున్న కాలానికి సంబంధించి అత్యవసర భావాన్ని కోల్పోతుండవచ్చు. అంతం ఎప్పుడో చాలా కాలానికి వస్తుందనే ముగింపుకు కూడా వారు చేరుకోవచ్చు. కానీ అలాంటి ఆలోచనా విధానం మన అవధానాన్ని ఆధ్యాత్మిక విషయాల మీద నుండి వస్తుసంపదలను సంపాదించుకోవాలనే లక్ష్యాల మీదకు మళ్ళించగలదు, అలాంటి లక్ష్యాలు మనం ఆధ్యాత్మికంగా నిద్రమత్తులోకి జారుకునేలా చేయగలవు.—లూకా 8:14; 21:34, 35.
4 యేసు ఉపమానం నుండి మనం మరో పాఠాన్ని నేర్చుకోవచ్చు. తమ యజమాని ఏ గడియలో వస్తాడనేది దాసులకు తెలియకపోయినప్పటికీ ఏ రాత్రిన వస్తాడనేది మాత్రం వాళ్ళకు తెలుసని స్పష్టమవుతోంది. తమ యజమాని మరేదో రాత్రి వస్తాడని వాళ్ళు భావిస్తే రాత్రంతా మెలకువగా ఉండడం వాళ్ళకు కష్టమయ్యేది. కానీ ఏ రాత్రి వస్తాడన్నది వాళ్ళకు తెలుసు, అది వారు మెలకువగా ఉండడానికి బలమైన ప్రేరణనిచ్చింది. దాదాపు అదే విధంగా, మనం అంత్యకాలములో జీవిస్తున్నామని బైబిలు ప్రవచనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి; అయితే ఆ అంతం ఏ రోజున లేదా ఏ గడియలో వస్తుందన్నది అవి మనకు తెలియజేయడం లేదు. (మత్తయి 24:36) అంతం వస్తుందన్న మన నమ్మకం మనం మెలకువగా ఉండేందుకు సహాయం చేస్తుంది, కానీ యెహోవా దినం నిజంగానే చాలా దగ్గరలో ఉందన్న దృఢ నమ్మకం మనకుంటే, అది మనం మెలకువగా ఉండడానికి మరింత బలమైన ప్రేరణనిస్తుంది.—జెఫన్యా 1:14.
5 పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఇలా ఉద్బోధించాడు: “మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి.” (1 కొరింథీయులు 16:13) అవును, మెలకువగా ఉండడం మనం క్రైస్తవ విశ్వాసంలో స్థిరంగా ఉండడంతో జతచేయబడింది. మనమెలా మెలకువగా ఉండవచ్చు? దేవుని వాక్యం గురించిన లోతైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా. (2 తిమోతి 3:14, 15) మంచి వ్యక్తిగత అధ్యయన అలవాట్లు, కూటాలకు క్రమంగా వెళ్ళడం మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి సహాయం చేస్తాయి. యెహోవా దినం సమీపంలో ఉందన్న విషయాన్ని మనస్సులో ఉంచుకోవడం మన విశ్వాసానికి ప్రాముఖ్యమైన అంశం. మనం ఈ విధానాంతానికి సమీపంలో ఉన్నామనే లేఖనాధారిత నిదర్శనాన్ని అప్పుడప్పుడూ పరిశీలించుకోవడం, రాబోయే ఆ అంతానికి సంబంధించిన ప్రాముఖ్యమైన సత్యాలను మరిచిపోకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది. * బైబిలు ప్రవచనాలను నెరవేరుస్తూ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ సంఘటనలను గమనించడం కూడా మంచిది. జర్మనీలోని ఒక సహోదరుడు ఇలా వ్రాశాడు: “యుద్ధాలు, భూకంపాలు, హింస, మన గ్రహం కలుషితం చేయబడడం వంటి వాటిని గురించిన వార్తలను చూసినప్పుడల్లా అంతం సమీపంలో ఉందన్న నమ్మకం నాలో మరింత ధృఢపడుతుంది.”
6 మెలకువగా ఉండమని యేసు తన అనుచరులకు ఉద్బోధించిన మరో వృత్తాంతం మనకు మార్కు 13వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ అధ్యాయం ప్రకారం యేసు వారి పరిస్థితిని, దేశాంతరము వెళ్ళిన తమ యజమాని కోసం వేచివున్న ద్వారపాలకుని పరిస్థితితో పోలుస్తున్నాడు. తమ యజమాని తిరిగివచ్చే గడియ గురించి ద్వారపాలకుడికి తెలియదు. ఆయన మెలకువగా ఉండాలి అంతే. యజమాని రాగల నాలుగు జాముల గురించి యేసు ప్రస్తావించాడు. నాలుగవ జాము ఉదయం దాదాపు మూడు గంటల నుండి సూర్యోదయం వరకు ఉంటుంది. చివరి జాములో, ద్వారపాలకుడికి సులభంగా నిద్రమత్తు కమ్ముకురావచ్చు. ఒక శత్రువును అతడు ఊహించని సమయంలో పట్టుకోవడానికి తెల్లవారు జాము చాలా శ్రేష్ఠమైన సమయంగా సైనికులు పరిగణిస్తారని నివేదించబడింది. అదే విధంగా, ఈ అంత్యదినాల చివరి భాగంలో అంటే మన చుట్టూ ఉన్న లోకం ఆధ్యాత్మిక భావంలో హాయిగా నిద్రపోతున్న సమయంలో, మెలకువగా ఉండడానికి మనం ఎంతో తీవ్రంగా కష్టపడాల్సి రావచ్చు. (రోమీయులు 13:11, 12) అందుకే యేసు తన ఉపమానంలో పదే పదే ఇలా ఉద్బోధిస్తున్నాడు: ‘జాగ్రత్తపడుడి; మెలకువగా నుండుడి . . . మీరు మెలకువగా నుండుడి . . . నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడి.’—మార్కు 13:32-37.
7 యేసు తన పరిచర్యలోనూ తాను పునరుత్థానం చేయబడిన తర్వాతా మెలకువగా ఉండమని అనేకసార్లు ఉద్బోధించాడు. వాస్తవానికి, లేఖనాలు ఈ విధానాంతం గురించి ప్రస్తావించిన దాదాపు ప్రతీసారి మెలకువగా ఉండమని లేదా జాగరూకులై ఉండమని మనకు హెచ్చరిక చేయబడింది. * (లూకా 12:38, 40; ప్రకటన 3:2; 16:14-16) ఆధ్యాత్మిక నిద్రమత్తు ఎంతో వాస్తవమైన ప్రమాదమని స్పష్టమవుతోంది. మనకందరికీ ఆ హెచ్చరికలు అవసరం!—1 కొరింథీయులు 10:12; 1 థెస్సలొనీకయులు 5:2, 6.
మెలకువగా ఉండలేకపోయిన ముగ్గురు అపొస్తలులు
8 మెలకువగా ఉండడానికి మంచి ఉద్దేశాలు ఉండడం కంటే ఎక్కువే అవసరమని పేతురు, యాకోబు, యోహాను అనే వారి ఉదాహరణల్లో మనం చూడవచ్చు. వీరు యేసును విశ్వసనీయంగా అనుసరించి, ఆయనపట్ల ప్రగాఢమైన ప్రేమగల ముగ్గురు ఆధ్యాత్మిక వ్యక్తులు. అయినప్పటికీ సా.శ. 33 నీసాను 14 రాత్రి వారు మెలకువగా ఉండలేకపోయారు. ఈ ముగ్గురు అపొస్తలులు తాము పస్కా పండుగ జరుపుకున్న మేడగదిని వదిలి యేసుతోపాటు గెత్సేమనే తోటకు వచ్చారు. అక్కడ యేసు, “మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండు[డి]” అని వారితో అన్నాడు. (మత్తయి 26:38) యేసు మూడుసార్లు తన పరలోక తండ్రికి తీవ్రంగా ప్రార్థించాడు, మూడుసార్లు ఆయన తన స్నేహితులవద్దకు తిరిగి వచ్చినప్పుడు వారు ప్రతిసారి నిద్రపోతూనే ఉన్నారు.—మత్తయి 26:40, 43, 45.
9 నమ్మకస్థులైన ఈ పురుషులు యేసుకు ఆ రాత్రి ఎందుకు ఆశాభంగం కలిగించారు? శారీరక అలసట ఒక కారణం. రాత్రి చాలా పొద్దుపోయింది బహుశా మధ్యరాత్రి తర్వాత కావచ్చు, అందుకే నిద్రతో “వారి కన్నులు భారముగా” ఉన్నాయి. (మత్తయి 26:43) అయినా యేసు, “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన[ము]” అని అన్నాడు.—మత్తయి 26:41.
10 ఎంతో ప్రత్యేకమైన ఆ రాత్రి యేసు కూడా నిస్సందేహంగా చాలా అలసిపోయి ఉండవచ్చు. అయితే ఆయన నిద్రపోయే బదులు తాను స్వేచ్ఛగా ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆ గడియలను ప్రార్థనలో గడిపాడు. కొన్నిరోజుల ముందు ఆయన, “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండు[డి]” అని చెబుతూ ప్రార్థించమని తన అనుచరులకు ఉద్బోధించాడు. (లూకా 21:36; ఎఫెసీయులు 6:18) మనం యేసు ఇచ్చిన ఉపదేశాన్ని లక్ష్యపెట్టి, ప్రార్థన విషయంలో ఆయన చక్కని మాదిరిని అనుసరిస్తే, యెహోవాకు మనం చేసే హృదయపూర్వక విజ్ఞాపనలు మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడానికి మనకు సహాయం చేస్తాయి.
11 తాను త్వరలోనే నిర్బంధించబడి, మరణదండనకు గురవుతానని యేసుకు అర్థమయ్యింది, ఆయన శిష్యులకు ఈ విషయం ఆ సమయంలో అర్థంకాలేదు. ఆయన శ్రమలు, హింసా కొయ్యపై వేదనభరితమైన ముగింపుకు చేరుకుంటాయి. ఈ విషయాల గురించి యేసు తన అపొస్తలులను హెచ్చరించాడు, కానీ ఆయనేమి చెబుతున్నాడో వారికి అర్థంకాలేదు. ఆ కారణంగానే, ఆయన మెలకువగా ఉండి ప్రార్థిస్తుంటే వారు నిద్రలోకి జారుకున్నారు. (మార్కు 14:27-31; లూకా 22:15-18) అపొస్తలుల శరీరంలాగే మన శరీరం కూడా బలహీనమైనది, మనకు కూడా ఇంకా తెలియని విషయాలు ఉన్నాయి. అయినప్పటికీ మనం జీవిస్తున్న ఈ కాలాల అత్యవసర భావాన్ని గుర్తించకపోతే, మనం ఆధ్యాత్మిక భావంలో నిద్రలోకి జారుకునే అవకాశముంది. కేవలం అప్రమత్తంగా ఉండడం ద్వారా మాత్రమే మనం మెలకువగా ఉండవచ్చు.
ప్రాముఖ్యమైన మూడు లక్షణాలు
12 మనం మన అత్యవసర భావాన్ని ఎలా కాపాడుకోవచ్చు? మనం ప్రార్థనా ప్రాముఖ్యతను, యెహోవా దినాన్ని మనస్సులో ఉంచుకోవలసిన అవసరాన్ని ఇప్పటికే చూశాము. వాటితోపాటు, మనం అలవరుచుకోవలసిన మూడు ప్రాముఖ్యమైన లక్షణాలను పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.” (1 థెస్సలొనీకయులు 5:8) మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండడంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిర్వహించే పాత్రలను మనం క్లుప్తంగా పరిశీలిద్దాం.
13 యెహోవా ఉనికిలో ఉన్నాడనీ, “తన్ను వెదకువారికి ఫలము దయచేయు” వాడవుతాడనీ మనకు అచంచలమైన విశ్వాసం ఉండాలి. (హెబ్రీయులు 11:6) అంతం గురించి యేసు చెప్పిన ప్రవచనం యొక్క తొలి, మొదటి శతాబ్దపు నెరవేర్పు, మన కాలంలో జరిగే గొప్ప నెరవేర్పుకు సంబంధించి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మన విశ్వాసం, ‘ఆ [ప్రవచన] విషయము తప్పక జరుగును, జాగుచేయక వచ్చును’ అనే నిశ్చయతతో మనం యెహోవా దినం కోసం ఆత్రుతతో ఎదురుచూసేందుకు సహాయం చేస్తుంది.—హబక్కూకు 2:3.
14 మన ఖచ్చితమైన నిరీక్షణ, దేవుని వాగ్దానాల నిర్దిష్టమైన నెరవేర్పు కోసం మనం వేచి ఉండవలసి వచ్చినప్పటికీ కష్టాలు సహించడానికి మనకు సహాయం చేసే “ఆత్మకు లంగరువలె” ఉంది. (హెబ్రీయులు 6:17-19) మార్గరేట్ అనే ఆత్మాభిషిక్త సహోదరి 70 సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకుంది, ఇప్పుడు 90వ పడిలో ఉన్న ఆమె ఇలా ఒప్పుకుంటోంది: “1963లో నా భర్త క్యాన్సరుతో మరణిస్తుండగా, వెంటనే అంతం వస్తే బాగుంటుందని నేను భావించాను. నేను కేవలం నా సొంత ఆసక్తుల గురించే ముఖ్యంగా ఆలోచించానని ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పని ఎంతమేరకు విస్తరిస్తుందో ఆ సమయంలో మాకేమాత్రం అవగాహన లేదు. ఇప్పుడు కూడా, ఈ మధ్యనే పని ప్రారంభమవుతున్న స్థలాలు ఇంకా అనేకం ఉన్నాయి. కాబట్టి యెహోవా సహనం వహించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.” అపొస్తలుడైన పౌలు మనకిలా హామీ ఇస్తున్నాడు: ‘ఓర్పు అంగీకృత స్థితిని, అంగీకృత స్థితి నిరీక్షణను కలుగజేయును, నిరీక్షణ మనలను నిరాశపరచదు.’—రోమీయులు 5:3-5, NW.
1 కొరింథీయులు 13:13) ప్రేమ మనం సహించేలా చేసి, మెలకువగా ఉండడానికి సహాయం చేస్తుంది. “[ప్రేమ] అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.”—1 కొరింథీయులు 13:7, 8.
15 క్రైస్తవ ప్రేమ ఒక విశేషమైన లక్షణం, ఎందుకంటే మనం చేసే వాటన్నింటికీ అదే ప్రాథమిక ప్రేరణ. యెహోవా కాలపట్టిక ఏదైనప్పటికీ ఆయనను మనం ప్రేమిస్తున్నాము గనుక మనమాయన సేవ చేస్తాము. పొరుగువారి పట్ల మనకున్న ప్రేమ రాజ్య సువార్త ప్రకటించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, మనం ఇంకా ఎంతకాలం ప్రకటించాలన్నది దేవుని చిత్తమైనా సరే, మనం వెళ్ళిన ఇండ్లకే మళ్ళీ అనేకసార్లు వెళ్ళవలసి వచ్చినా సరే మనం ప్రకటిస్తూనే ఉంటాం. పౌలు వ్రాసినట్లుగా, “కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.” (“నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము”
16 మనం అంత్యదినముల చివరి భాగములో ఉన్నామని ప్రపంచ సంఘటనలు నిరంతరం గుర్తుచేస్తున్న ప్రాముఖ్యమైన కాలాల్లో మనం జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1-5) ఇది మందకొడిగా ఉండవలసిన సమయం కాదు గానీ ‘మనకు కలిగినదానిని గట్టిగా పట్టుకోవలసిన’ సమయం. (ప్రకటన 3:11) “ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండ”డం ద్వారా, విశ్వాసాన్ని నిరీక్షణను ప్రేమను వృద్ధి చేసుకోవడం ద్వారా, పరీక్షా సమయానికి మనం సిద్ధంగా ఉన్నామని నిరూపించుకుంటాము. (1 పేతురు 4:7) ప్రభువు కార్యములో మనం చేయవలసింది ఇంకా ఎంతో ఉంది. దైవభక్తికి సంబంధించిన కార్యాలలో నిమగ్నమై ఉండడం మనం పూర్తిగా మెలకువగా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.—2 పేతురు 3:11, 12.
17 “యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది” అని యిర్మీయా వ్రాశాడు. (విలాపవాక్యములు 3:24-26) మనలో కొంతమందిమి కేవలం కొంతకాలం నుండే ఎదురు చూస్తున్నాము. మరి కొందరు యెహోవా రక్షణను చూడడానికి ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నారు. అయితే, ముందున్న అనంతకాల జీవితంతో పోల్చి చూస్తే ఎదురు చూసే ఈ సమయం ఎంత అల్పమైనదో కదా! (2 కొరింథీయులు 4:16-18) మనం యెహోవా నియమిత కాలం కోసం ఎదురు చూస్తుండగా అత్యావశ్యకమైన క్రైస్తవ లక్షణాలను వృద్ధి చేసుకోవచ్చు, యెహోవా సహనాన్ని సద్వినియోగం చేసుకొని సత్యాన్ని హత్తుకోవడానికి ఇతరులకు సహాయం చేయవచ్చు. కాబట్టి మనమందరం మెలకువగా ఉందాం. యెహోవాను అనుకరిస్తూ సహనంతో ఉందాం, ఆయన మనకిచ్చిన నిరీక్షణను బట్టి కృతజ్ఞతతో ఉందాం. మనం నమ్మకంగా అప్రమత్తంగా ఉంటూ నిత్యజీవ నిరీక్షణను గట్టిగా పట్టుకొని ఉందాం. అప్పుడు ఈ ప్రవచనార్థక వాగ్దానాలు మనకు తప్పక అన్వయిస్తాయి: “భూమిని స్వతంత్రించుకొనునట్లు [యెహోవా] నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.”—కీర్తన 37:34.
[అధస్సూచీలు]
^ పేరా 8 మనం “అంత్యదినముల”లో జీవిస్తున్నామని రుజువుచేసే ఆరు నిదర్శనాలను సమీక్షించడం సహాయకరంగా ఉండవచ్చు, ఇవి 2000, జనవరి 15, కావలికోటలోని 12, 13 పేజీలలో ఉన్నాయి.—2 తిమోతి 3:1.
^ పేరా 10 ‘మెలకువగా ఉండుడి’ అని అనువదించబడిన గ్రీకు క్రియాపదం గురించి మాట్లాడుతూ నిఘంటుకారుడైన డబ్ల్యూ. ఇ. వైన్, ‘నిద్రను దూరంగా తరిమేయడం’ అన్నది దాని అక్షరార్థ భావమని వివరిస్తున్నాడు, అది “కేవలం మెలకువగా ఉండడాన్ని మాత్రమే కాదు గానీ ఏదైనా ఒక విషయం గురించి ఆతురతగలవారిలో ఉండే అప్రమత్తతను కూడా వ్యక్తపరుస్తుంది.”
మీరెలా సమాధానమిస్తారు?
• ఈ విధానాంతం సమీపంలో ఉందనే మన విశ్వాసాన్ని మనమెలా బలపరుచుకోవచ్చు?
• పేతురు, యాకోబు, యోహాను ఉదాహరణల నుండి ఏమి నేర్చుకోవచ్చు?
• ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండడానికి ఏ మూడు లక్షణాలు మనకు సహాయం చేస్తాయి?
• ఇది ఎందుకు ‘మనకు కలిగినదానిని గట్టిగా పట్టుకోవలసిన’ సమయం?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) ఒక వ్యక్తి తన సంపదలను కాపాడుకునే విషయంలో ఏ పాఠం నేర్చుకున్నాడు? (బి) ఒక దొంగ గురించి యేసు చెప్పిన ఉపమానం నుండి, మెలకువగా ఉండే విషయంలో మనమేమి నేర్చుకోవచ్చు?
3. వివాహానికి వెళ్ళిన తమ యజమాని రాక కోసం ఎదురుచూస్తున్న దాసుల ఉపమానాన్ని ఉపయోగిస్తూ మెలకువగా ఉండడంలోని ప్రాముఖ్యతను యేసు ఎలా చూపించాడు?
4. మెలకువగా ఉండడానికి ఏ నమ్మకం మనకు ప్రేరణనిస్తుంది, యేసు దాన్ని ఎలా చూపించాడు?
5. “మెలకువగా ఉండుడి” అని పౌలు చేసిన ఉద్బోధకు మనమెలా ప్రతిస్పందించవచ్చు?
6. కాలం గడుస్తుండగా ఆధ్యాత్మిక అప్రమత్తతను కోల్పోయే వైఖరిని యేసు సోదాహరణంగా ఎలా తెలియజేశాడు?
7. వాస్తవమైన ఏ ప్రమాదం పొంచివుంది, దీని దృష్ట్యా మనం బైబిలులో ఏ ప్రోత్సాహం గురించి తరచూ చదువుతాము?
8. గెత్సేమనే తోటలో, మెలకువగా ఉండమని యేసు చేసిన విజ్ఞప్తికి ఆయన అపొస్తలుల్లోని ముగ్గురు ఎలా ప్రతిస్పందించారు?
9. అపొస్తలుల నిద్రమత్తుకు కారణం ఏమై ఉండవచ్చు?
10, 11. (ఎ) యేసు అలిసిపోయినప్పటికీ గెత్సేమనే తోటలో ఆయన మెలకువగా ఉండడానికి ఆయనకేమి సహాయం చేసింది? (బి) మెలకువగా ఉండమని యేసు చెప్పినప్పుడు ముగ్గురు అపొస్తలులకు జరిగిన దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
12. మనం మెలకువగా ఉండే విషయంతో పౌలు ఏ మూడు లక్షణాలను జతచేశాడు?
13. మనం అప్రమత్తంగా ఉండడంలో విశ్వాసం ఏ పాత్ర వహిస్తుంది?
14. మనం మెలకువగా ఉండాలంటే నిరీక్షణ ఏవిధంగా ముఖ్యం?
15. మనం చాలాకాలం నుండి వేచి ఉన్నట్లు అనిపించినా ప్రేమ మనల్ని ఎలా ప్రేరేపిస్తుంది?
16. మందకొడిగా ఉండే బదులు, మనం ఏ దృక్పథాన్ని వృద్ధి చేసుకోవాలి?
17. (ఎ) అప్పుడప్పుడూ ఎదురయ్యే నిరాశలు మనల్నెందుకు నిరుత్సాహపరచకూడదు? (21వ పేజీలోని బాక్సు చూడండి.) (బి) యెహోవాను మనం ఎలా అనుకరించవచ్చు, అలా చేసే వారి కోసం ఏ ఆశీర్వాదం వేచి ఉంది?
[21వ పేజీలోని బాక్సు/చిత్రం]
“కనిపెట్టుకొనువాడు ధన్యుడు.”—దానియేలు 12:12
తాను కాపలా కాస్తున్న ఆవరణలోకి ఒక దొంగ ప్రవేశించాలని చూస్తున్నాడని కాపలాదారుడికి అనుమానం వచ్చిందనుకోండి. దొంగ రాకడను సూచించే శబ్దం ఏదైనా వినిపిస్తుందేమోనని ఆయన రాత్రివేళ చాలా జాగ్రత్తగా వింటుంటాడు. గంట గంటకూ తనకు సాధ్యమైనంత మేరకు చెవులు రిక్కించి వింటూ కళ్ళు చిట్లించుకొని చూస్తుంటాడు. గాలికి చెట్లు కదిలే శబ్దమైనా లేదా పిల్లి ఏదైనా పడేసిన శబ్దమైనా అది ఆయనను ఎలా మోసగించగలదో అర్థం చేసుకోవచ్చు.—లూకా 12:39, 40.
‘మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తున్నవారికి’ అటువంటిదే జరుగవచ్చు. (1 కొరింథీయులు 1:7) యేసు తాను పునరుత్థానం చేయబడిన వెంటనే ‘ఇశ్రాయేలుకు రాజ్యమును మరల అనుగ్రహిస్తాడని’ అపొస్తలులు తలంచారు. (అపొస్తలుల కార్యములు 1:6) సంవత్సరాల తర్వాత, యేసు ప్రత్యక్షత భవిష్యత్తులో ఎప్పుడో జరుగనున్నదని థెస్సలొనీకలోని క్రైస్తవులకు గుర్తు చేయవలసి వచ్చింది. (2 థెస్సలొనీకయులు 2:3, 8) అయినా యెహోవా దినాన్ని గురించిన విఫలమైన నిరీక్షణలు, యేసు తొలి అనుచరులు జీవానికి నడిపించే మార్గాన్ని విడనాడేలా చేయలేదు.—మత్తయి 7:13, 14.
మనకాలంలో, ఈ విధానపు అంతం రావడం ఆలస్యమవుతున్నట్లు అనిపించడంవల్ల కలిగే నిరాశ, మనం అప్రమత్తంగా ఉండడాన్ని మానుకునేలా చేయకూడదు. అప్రమత్తంగా ఉన్న కాపలాదారుడు వేరే శబ్దాలను బట్టి మోసగించబడవచ్చు, అయినా అతడు కాపలా కాస్తూనే ఉండాలి! అది అతని పని. క్రైస్తవుల విషయం కూడా అంతే.
[18వ పేజీలోని చిత్రం]
యెహోవా దినం సమీపిస్తోందని మీకు దృఢ నమ్మకం ఉందా?
[19వ పేజీలోని చిత్రాలు]
మెలకువగా ఉండడానికి కూటాలు, ప్రార్థన, మంచి అధ్యయన అలవాట్లు మనకు సహాయం చేస్తాయి
[22వ పేజీలోని చిత్రం]
మార్గరేట్‌లా మనం సహనంతో ఉండి చురుగ్గా మెలకువగా ఉందాము