సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి మనకేమి సహాయం చేయగలదు?
సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి మనకేమి సహాయం చేయగలదు?
ఒక వార్తాపత్రికకు నాటక విమర్శకుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఒక నాటకాన్ని చూడడానికి వెళ్ళాడు. ఆ నాటకం ఆయనకంతగా నచ్చలేదు, ఆ తర్వాత ఆయన, “ఒకవేళ మీకు అనాసక్తమైన నాటకమే కావాలనుకుంటే మీరు తప్పకుండా ఈ నాటకాన్ని చూడండి” అని వ్రాశాడు. ఆ నాటకం గురించి ప్రచారం చేస్తున్నవాళ్ళు ఒక వ్యాపారప్రకటనలో ఈ విమర్శకుడు వ్రాసిన సమీక్ష నుండి ఎత్తివ్రాయబడిన వాక్యం ప్రచురించారు. ఎత్తివ్రాయబడిన ఆ వాక్యం ఇలా ఉంది: “మీరు తప్పకుండా ఈ నాటకాన్ని చూడండి!” ఆ వ్యాపారప్రకటన, విమర్శకుని మాటలనే పొల్లుపోకుండా ఎత్తివ్రాసింది, కానీ అది ఆ మాటలను పూర్వాపర సందర్భంలోనుండి విడదీసి చెప్పడం ద్వారా ఆయన ఉద్దేశాన్ని పూర్తిగా మార్చివేసింది.
ఆ ఉదాహరణ, ఒక వాక్యం యొక్క పూర్వాపర సందర్భం ఎంత ప్రాముఖ్యమైనదై ఉండగలదన్న విషయాన్ని సోదాహరణంగా తెలియజేస్తుంది. యేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించడంలో సాతాను లేఖన భావాన్ని మార్చివేసినట్లుగానే, పదాలను పూర్వాపర సందర్భం నుండి విడదీసి చెప్పడం వాటి భావాన్ని మార్చివేయగలదు. (మత్తయి 4:1-11) మరోవైపున, ఒక వాక్యం యొక్క పూర్వాపర సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవడం, దాని భావాన్ని మరింత ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఈ కారణాన్ని బట్టి, మనమొక బైబిలు వచనాన్ని చదివేటప్పుడు, రచయిత దేని గురించి మాట్లాడుతున్నాడనేది చక్కగా అర్థం చేసుకోవడానికి ఆ వచన పూర్వాపర సందర్భాన్ని చూడడం ఎల్లప్పుడూ జ్ఞానయుక్తమైనది.
సరిగా ఉపదేశించండి
ఒక నిఘంటువు, పూర్వాపర సందర్భాన్ని “ఒక నిర్దిష్టమైన పదానికి లేదా వాక్యసముదాయానికి ముందు లేక వెనక ఉండి తరచూ దాని భావాన్ని ప్రభావితం చేయగల ఒక లిఖిత లేక మౌఖిక వ్యాఖ్యానంలోని భాగాలు” అని నిర్వచిస్తోంది. పూర్వాపర సందర్భం అంటే “ఒక ప్రత్యేకమైన సంఘటన, స్థితి వంటి వాటికి సంబంధించిన పరిస్థితుల లేదా వాస్తవాల సముదాయం” కూడా కావచ్చు. ఈ భావంలో, పూర్వాపర 2 తిమోతి 2:15) దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి, మనం దాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ఆ తర్వాత దాన్ని ఇతరులకు నిజాయితీగా, ఖచ్చితంగా వివరించవలసిన అవసరం ఉంది. అలా చేయడానికి, బైబిలు గ్రంథకర్త అయిన యెహోవాపట్ల మనకున్న గౌరవం మనల్ని పురికొల్పుతుంది, ఈ విషయంలో పూర్వాపర సందర్భాన్ని పరిశీలించడం ప్రాముఖ్యమైన సహాయకంగా ఉంటుంది.
సందర్భం అనే పదానికి నేపథ్యం అనే పదం పర్యాయపదంగా ఉంటుంది. ప్రత్యేకించి, “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము” అని అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినదాని దృష్ట్యా, ఒక లేఖనం యొక్క పూర్వాపర సందర్భాన్ని పరిశీలించడం ప్రాముఖ్యం. (రెండవ తిమోతి యొక్క నేపథ్యం
ఉదాహరణకు, బైబిలులోని రెండవ తిమోతి పుస్తకాన్ని పరిశీలిద్దాము. * మన పరిశీలనను ప్రారంభించడానికి, ఈ పుస్తక పూర్వరంగం ఏమిటనేది మనం తెలుసుకోవచ్చు. రెండవ తిమోతి పుస్తకాన్ని ఎవరు వ్రాశారు? ఎప్పుడు వ్రాశారు? ఏ పరిస్థితుల్లో వ్రాశారు? ఆ తర్వాత మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ఈ పుస్తకం పేరులో కనిపించే “తిమోతి” పరిస్థితేమిటి? ఈ పుస్తకంలోని సమాచారం ఆయనకెందుకు అవసరమైంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకం పట్ల మనకున్న మెప్పును ఎంతగానో అధికం చేసి దాని నుండి నేడు మనమెలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకునేందుకు సహాయం చేస్తాయి.
రెండవ తిమోతి, అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన పత్రిక అని ప్రారంభ వచనాలు సూచిస్తున్నాయి. పౌలు సువార్త నిమిత్తం బంధకములలో ఉన్నప్పుడు ఆయన దాన్ని వ్రాసినట్లు ఇతర వచనాలు తెలియజేస్తున్నాయి. అనేకులచే విడనాడబడిన పౌలు తన అంతం సమీపించిందని భావించాడు. (2 తిమోతి 1:15-17; 2:8-10; 4:6-8) కాబట్టి, తాను రోములో రెండవసారి నిర్బంధించబడి ఉన్నప్పుడు, బహుశా సా.శ. 65లో ఆయన ఈ పుస్తకాన్ని వ్రాసి ఉండవచ్చు. ఆ తర్వాత, నీరో ఆయనకు మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది.
రెండవ తిమోతి నేపథ్యం అది. అయితే పౌలు తన సొంత సమస్యల గురించి ఫిర్యాదు చేయడానికి తిమోతికి వ్రాయలేదన్నది గమనించదగిన విషయం. బదులుగా, తిమోతికి రానున్న కష్టకాలాల గురించి ఆయన తిమోతిని హెచ్చరించాడు, అవధానాన్ని మళ్ళించేవాటిని నిరోధించమనీ “బలవంతు[డిగా]” కమ్మనీ తానిచ్చిన ఉపదేశాలను ఇతరులకు అందజేయమనీ ఆయన తన స్నేహితుడ్ని ప్రోత్సహించాడు. ఆ ఇతరులు మరితరులకు సహాయం చేయడానికి తగిన విధంగా సిద్ధపడతారు. (2 తిమోతి 2:1-7) కష్టసమయాల్లో సహితం ఇతరుల పట్ల నిస్వార్థమైన శ్రద్ధ చూపించడంలో ఎంత చక్కని మాదిరి! నేడు మనకు ఎంత చక్కని ఉపదేశం!
పౌలు తిమోతిని “ప్రియకుమారుడ”ని పిలిచాడు. (2 తిమోతి 1:1) ఈ యౌవనస్థుడు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో తరచూ పౌలు నమ్మకమైన సహచరునిగా ప్రస్తావించబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 16:1-5; రోమీయులు 16:21; 1 కొరింథీయులు 4:17) పౌలు తిమోతికి ఈ పత్రిక వ్రాసే సమయానికి, తిమోతి తన 30వ పడిలో ఉన్నట్లు అనిపిస్తోంది—అయినా యౌవనుడిగా పరిగణించబడ్డాడు. (1 తిమోతి 4:11, 12) అయినప్పటికీ ఆయనకు నమ్మకత్వం విషయంలో అప్పటికే అద్భుతమైన చరిత్ర—దాదాపు 14 సంవత్సరాలపాటు ‘పౌలుతోకూడ సేవ’ చేశాడన్న చరిత్ర—ఉంది. (ఫిలిప్పీయులు 2:19-22) తిమోతి సాపేక్షికంగా యౌవనస్థుడే అయినా, “మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని” విశ్వాసం, సహనం వంటి ప్రాముఖ్యమైన విషయాలపై మనసు నిలపమని ఇతర పెద్దలకు ఉపదేశించే బాధ్యతను పౌలు ఆయనకు అప్పగించాడు. (2 తిమోతి 2:14) సంఘ పైవిచారణకర్తలను, పరిచర్య సేవకులను నియమించే పనులను నిర్వహించడానికి కూడా తిమోతికి అధికారం ఇవ్వబడింది. (1 తిమోతి 5:22) అయితే ఆయన తనకున్న అధికారాన్ని ఉపయోగించడంలో కాస్త సంశయిస్తుండి ఉండవచ్చు.—2 తిమోతి 1:6, 7.
యౌవనుడైన ఈ పెద్ద, కొన్ని గంభీరమైన సవాళ్ళనెదుర్కొన్నాడు. ఒక సవాలేమిటంటే హుమెనైయు, ఫిలేతు అనే ఇద్దరు వ్యక్తులు “పునరుత్థానము గతించె[ను]” అని బోధిస్తూ “కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.” (2 తిమోతి 2:17, 18) ఆధ్యాత్మిక పునరుత్థానం మాత్రమే ఉందనీ క్రైస్తవులు అప్పటికే దాన్ని పొందారనీ వారు విశ్వసించినట్లు తెలుస్తోంది. క్రైస్తవులు తమ పాపముల చేత చచ్చినవారై ఉండగా దేవుని ఆత్మ మూలంగా తిరిగి బ్రతికించబడ్డారన్న పౌలు వ్యాఖ్యానాన్ని వారు దాని పూర్వాపర సందర్భంలో నుండి విడదీసి, ఎత్తిచెప్పి ఉండవచ్చు. (ఎఫెసీయులు 2:1-6) అలాంటి మతభ్రష్టుల ప్రభావం అధికమవుతుందని పౌలు హెచ్చరించాడు. ఆయనిలా వ్రాశాడు: “ఎందుకనగా జనులు హితబోధను సహింపక, . . . సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.” (2 తిమోతి 4:3, 4) పౌలు ముందుగా చేసిన ఆ హెచ్చరిక, అపొస్తలుడిచ్చిన ఉపదేశాన్ని తిమోతి లక్ష్యపెట్టడం ఆవశ్యకమని చూపించింది.
నేడు ఆ పుస్తకానికున్న విలువ
పైన పేర్కొన్నదాని నుండి, కనీసం ఈ క్రింది కారణాలను బట్టి పౌలు రెండవ తిమోతి పత్రికను వ్రాసి ఉంటాడని మనం గ్రహిస్తాము: (1) తన మరణం సమీపించిందని ఆయనకు తెలుసు, తిమోతికి మద్దతునిచ్చేందుకు తాను ఉండని సమయం కోసం తిమోతిని సిద్ధపర్చడానికి ఆయన ప్రయత్నించాడు. (2) తిమోతి తన పర్యవేక్షణ క్రిందనున్న సంఘాలను మతభ్రష్టత్వం నుండి ఇతర హానికరమైన ప్రభావాల నుండి కాపాడేందుకు తిమోతిని సిద్ధం చేయాలని ఆయన కోరుకున్నాడు. (3) యెహోవా సేవలో నిమగ్నమై ఉండే విషయంలోనూ అబద్ధ బోధలకు వ్యతిరేకంగా తాను వహించిన స్థానానికి సంబంధించిన ప్రేరేపిత లేఖనాల ఖచ్చితమైన జ్ఞానంపై ఆధారపడే విషయంలోనూ తిమోతిని ప్రోత్సహించాలని ఆయన కోరుకున్నాడు.
ఈ పూర్వరంగాన్ని అర్థం చేసుకోవడం, రెండవ తిమోతి మనకు మరింత అర్థవంతమైనదయ్యేలా చేస్తుంది. నేడు కూడా, తమ సొంత తలంపులను ప్రవేశపెడుతూ మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి ఇష్టపడే హుమెనైయు, ఫిలేతు వంటి మతభ్రష్టులున్నారు. అంతేగాక, పౌలు ప్రవచించిన “అపాయకరమైన కాలములు” ఇప్పుడున్నాయి. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు” అని పౌలు చేసిన హెచ్చరికలోని సత్యాన్ని చాలామంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. (2 తిమోతి 3:1, 12) మనమెలా స్థిరంగా నిలబడవచ్చు? తిమోతి వలె మనం కూడా, అనేక సంవత్సరాలుగా యెహోవా సేవ చేస్తున్నవారిచ్చే ఉపదేశాన్ని లక్ష్యపెట్టవలసిన అవసరం ఉంది. వ్యక్తిగత అధ్యయనం, ప్రార్థన, క్రైస్తవ సహవాసం వంటివాటి ద్వారా, యెహోవా కృప ద్వారా మనం ‘బలవంతులం’ కావచ్చు. అంతేగాక, ఖచ్చితమైన జ్ఞానానికున్న శక్తి మీదున్న దృఢ విశ్వాసంతో, “హితవాక్యప్రమాణమును గైకొనుము” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని మనం లక్ష్యపెట్టవచ్చు.—2 తిమోతి 1:13.
“హితవాక్యప్రమాణము”
పౌలు మాట్లాడిన ‘హితవాక్యములు’ ఏవి? నిజ క్రైస్తవ సిద్ధాంతాన్ని సూచించడానికి ఆయన ఆ పదాన్ని ఉపయోగించాడు. పౌలు తాను తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ‘హితవాక్యములు’ ప్రాథమికంగా “ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హితవాక్యముల”ని వివరించాడు. (1 తిమోతి 6:3) హితవాక్యప్రమాణమును గైకొనడం ఒకరు సరైన మనస్సును, ప్రేమపూర్వకమైన వైఖరిని, ఇతరుల పట్ల శ్రద్ధను కలిగి ఉండేలా చేస్తుంది. యేసు పరిచర్య, బోధలు బైబిలంతటిలో ఉన్న ఇతర బోధలన్నిటితోకీ అనుగుణంగా ఉన్నాయి కాబట్టి, ‘హితవాక్యములు’ అనే పదం బైబిలు బోధలన్నిటిని కూడా సూచించవచ్చు.
హితవాక్యప్రమాణము అనేది క్రైస్తవ పెద్దలందరికిలాగే తిమోతికి ‘అప్పగించబడిన మంచి పదార్థము,’ దాన్ని వాళ్ళు కాపాడాలి. (2 తిమోతి 1:13, 14) తిమోతి ‘వాక్యమును ప్రకటిస్తూ సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశిస్తూ ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ’ ఉండవలసింది. (2 తిమోతి 4:2) తిమోతి కాలంలో మతభ్రష్ట బోధలు వ్యాప్తి చెందాయని మనం గ్రహించినప్పుడు, హితవాక్యములను బోధించవలసిన ఆవశ్యకతను పౌలు ఎందుకు నొక్కి చెప్పాడో మనం అర్థం చేసుకుంటాము. తిమోతి చక్కని బోధనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ దీర్ఘశాంతముతో ‘ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పడం’ ద్వారా మందను కాపాడవలసి ఉంటుందని కూడా మనం అర్థం చేసుకుంటాము.
తిమోతి వాక్యాన్ని ఎవరికి ప్రకటించాలి? ఒక పెద్దగా తిమోతి, వాక్యాన్ని క్రైస్తవ సంఘంలో ప్రకటించాలని పూర్వాపర సందర్భం సూచిస్తోంది. వ్యతిరేకులు తీసుకువచ్చిన ఒత్తిళ్ళ దృష్ట్యా, తిమోతి తన ఆధ్యాత్మిక సమతుల్యాన్ని కాపాడుకొని, మానవ తత్వాలను వ్యక్తిగత తలంపులను లేదా వ్యర్థమైన ఊహలను కాక దేవుని 2 తిమోతి 1:6-8; 2:1-3, 23-26; 3:14, 15) అయితే పౌలు ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా, పౌలు మతభ్రష్టత్వానికి ఒక అడ్డుగోడగా ఉన్నట్లే తిమోతి కూడా ఉంటాడు.—అపొస్తలుల కార్యములు 20:25-32.
వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించవలసి ఉంది. నిజమే దీని వల్ల, చెడ్డ తలంపులు గల కొందరి నుండి వ్యతిరేకత రావచ్చు. (వాక్యాన్ని ప్రకటించడం గురించి పౌలు చెప్పిన మాటలు సంఘం వెలుపల ప్రకటించడానికి కూడా అన్వయిస్తాయా? అవును, పూర్వాపర సందర్భం చూపిస్తున్నట్లుగా, అన్వయిస్తాయి. “అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము” అని కూడా పౌలు చెబుతున్నాడు. (2 తిమోతి 4:5) సువార్త ప్రకటించడం—అవిశ్వాసులకు రక్షణ సువార్త ప్రకటించడం—క్రైస్తవ పరిచర్యకు అత్యంత ఆవశ్యకమైనది. (మత్తయి 24:14; 28:19, 20) “అసమయమందు” కూడా దేవుని వాక్యం సంఘంలో ప్రకటించబడుతున్నట్లుగానే కష్టభరితమైన పరిస్థితుల్లో సహితం మనం సంఘం వెలుపలి వారికి వాక్యాన్ని ప్రకటించడంలో పట్టుదల కలిగివుంటాము.—1 థెస్సలొనీకయులు 1:6.
మన ప్రకటనకు, బోధనకు అంతటికీ ఆధారం దేవుని ప్రేరేపిత వాక్యమే. బైబిలుపై మనకు పూర్తి నమ్మకం ఉంది. “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని పౌలు తిమోతికి చెప్పాడు. (2 తిమోతి 3:16, 17) ఆ మాటలు బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని చూపించడానికి తరచూ సముచితంగానే ఎత్తి చెప్పబడతాయి. అయితే వాటిని వ్రాయడంలో పౌలు ఉద్దేశమేమిటి?
సంఘంలో ‘ఖండించవలసిన, తప్పు దిద్దవలసిన, నీతియందు శిక్షచేయవలసిన’ బాధ్యతగల ఒక పెద్దతో పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి, తిమోతి తనకు బాల్యం నుండి ఉపదేశించబడిన ప్రేరేపిత వాక్య జ్ఞానాన్ని నమ్మాలని పౌలు ఆయనకు గుర్తు చేస్తున్నాడు. తిమోతి వలే పెద్దలు కొన్నిసార్లు తప్పిదస్థులను ఖండించాలి లేదా గద్దించాలి. అలా చేస్తుండగా వాళ్ళకు ఎప్పుడూ బైబిలు మీద దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాక, లేఖనాలు దేవునిచే ప్రేరేపించబడినవి కాబట్టి, వాటి ఆధారంగా గద్దించడం నిజానికి దేవుడు గద్దిస్తున్నట్లే అవుతుంది. బైబిలు ఆధారిత గద్దింపులను నిరాకరించేవారెవరైనా, మానవ తలంపులను కాదు గానీ స్వయంగా యెహోవా నుండి వచ్చే ప్రేరేపిత ఉపదేశాన్నే నిరాకరిస్తున్నట్లవుతుంది.
రెండవ తిమోతి పుస్తకంలో దైవిక జ్ఞానం ఎంత పుష్కలంగా ఉందోకదా! దాని పూర్వాపర సందర్భాన్ని పరిగణలోకి తీసుకుంటూ దాని ఉపదేశాన్ని పరిశీలించడం ఇంకెంత అర్థవంతంగా ఉంటుందో కదా! ఈ ఆర్టికల్‌లో, రెండవ తిమోతి పుస్తకంలో ఉన్న అద్భుతమైన ప్రేరేపిత సమాచారాన్ని మనం క్లుప్తంగా సమీక్షించామంతే, కానీ బైబిలులో మనం చదివేదాని పూర్వాపర సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవడం ఎంత సహాయకరంగా ఉంటుందనేది చూపించడానికి ఇది చాలు. మనం నిజంగా ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశిస్తున్నామని’ నిశ్చయపర్చుకోవడానికి అది దోహదపడుతుంది.
[అధస్సూచీలు]
^ పేరా 7 అదనపు సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) రెండవ సంపుటి, 1105-8 పేజీలను చూడండి.
[27వ పేజీలోని చిత్రం]
సంఘాలను సంరక్షించడానికి తిమోతిని సిద్ధపరచాలని పౌలు కోరుకున్నాడు
[30వ పేజీలోని చిత్రం]
ప్రేరేపిత వాక్య జ్ఞానమును విశ్వసించమని పౌలు తిమోతికి గుర్తు చేశాడు