పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ఒక క్రైస్తవుడు బైబిలు మీద చెయ్యి పెట్టి నిజమే చెబుతానని న్యాయస్థానంలో ప్రమాణం చేయడం బైబిలు సూత్రాలకు అనుగుణమైనదేనా?
ఈ విషయంలో ప్రతి వ్యక్తి స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. (గలతీయులు 6:5) అయితే, న్యాయస్థానంలో నిజం చెప్పేందుకు ప్రమాణం చేయడాన్ని బైబిలు నిషేధించడం లేదు.
ప్రమాణం చేయడమనేది ఎంతో కాలంగా వాడుకలో ఉంది. ఉదాహరణకు ప్రాచీన కాలాల్లో, గ్రీసు దేశస్థులు ప్రమాణం చేసేటప్పుడు ఒక చెయ్యిని ఆకాశం వైపుకు ఎత్తేవారు లేదా బలిపీఠాన్ని ముట్టుకునేవారు. ఒక రోమీయుడు నిజం చెప్పడానికి ప్రమాణం చేసేటప్పుడు, తన చేతిలో ఒక రాయి పట్టుకుని ఇలా అనేవాడు: “నేను ఉద్దేశపూర్వకంగా మోసంచేస్తే, బృహస్పతి [దేవుడు] నగరాన్ని దాని కోటను రక్షిస్తాడు, కానీ నేను ఈ రాయిని విసిరివేసినట్లే నా జీవితంలో నుండి అన్ని మంచి విషయాలను విసిరివేయును గాక.”—సైక్లోపీడియా ఆఫ్ బిబ్లికల్, థియోలాజికల్, అండ్ ఎక్లిసియాస్టికల్ లిటరేచర్, జాన్ మెక్లింటాక్ మరియు జేమ్స్ స్ట్రాంగ్, సంపుటి VII, 260వ పేజీ.
ఇలాంటి విషయాలు, మానవులను గమనిస్తూ ఉండే దేవుడు ఉన్నాడనీ ఆయనకు వారు లెక్క అప్పజెప్పాలనీ గుర్తించేందుకు మానవజాతికున్న సుముఖతను సూచించాయి. ప్రాచీన కాలాలనుండి, తాము చెబుతున్నదీ చేస్తున్నదీ యెహోవాకు తెలుసని ఆయన సత్యారాధకులు గ్రహించారు. (సామెతలు 5:21; 15:3) వారు దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా లేదా ఆయన గమనిస్తుండగా ప్రమాణాలు చేసేవారు. ఉదాహరణకు బోయజు, దావీదు, సొలొమోను, సిద్కియా అలాగే చేశారు. (రూతు 3:13; 2 సమూయేలు 3:35; 1 రాజులు 2:23, 24; యిర్మీయా 38:16) ఇతరులు తమను ప్రమాణం చేయమని కోరేందుకు కూడా సత్య దేవుని ఆరాధకులు అనుమతించేవారు. అబ్రాహాము, యేసుక్రీస్తుల విషయంలో అలాగే జరిగింది.—ఆదికాండము 21:22-24; మత్తయి 26:63, 64.
యెహోవా ఎదుట ప్రమాణం చేసే వ్యక్తి కొన్నిసార్లు తన చెయ్యి పైకెత్తేవాడు. అబ్రాము (అబ్రాహాము) సొదొమ రాజుకు ఇలా చెప్పాడు: “ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.” (ఆదికాండము 14:22) ప్రవక్తయైన దానియేలుతో మాట్లాడుతున్న దేవదూత “తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకొ[న్నాడు].” (దానియేలు 12:7) దేవుడు కూడా ప్రమాణం చేసేటప్పుడు సూచనార్థకంగా తన చెయ్యిని పైకెత్తినట్లు ప్రస్తావించబడింది.—ద్వితీయోపదేశకాండము 32:42; యెషయా 62:7.
ప్రమాణం చేయడానికి లేఖనాధారిత అభ్యంతరం ఏమీ లేదు. అయితే ఒక క్రైస్తవుడు తాను చెప్పే ప్రతీ వాక్యానికి మద్దతుగా ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. “మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను” అని యేసు చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 5:33-37) శిష్యుడైన యాకోబు కూడా అలాంటి విషయాన్నే చెప్పాడు. “ఒట్టు పెట్టుకొన” వద్దని చెప్పినప్పుడు, స్వల్పమైన విషయాలకు సంబంధించి ప్రమాణం చేయడం గురించి ఆయన హెచ్చరించాడు. (యాకోబు 5:12) యేసు గానీ యాకోబు గానీ న్యాయస్థానంలో నిజం చెప్పేందుకు ప్రమాణం చేయడం తప్పని చెప్పలేదు.
తన సాక్ష్యం నిజమేనని ప్రమాణం చేయమని న్యాయస్థానంలో ఒక క్రైస్తవుడిని కోరితే అప్పుడెలా? తాను అలా ప్రమాణం చేయవచ్చని ఆయనకు అనిపించవచ్చు. దానికి బదులుగా తాను అబద్ధం చెప్పడం లేదని సత్యనిష్ఠా ప్రకటన (మనస్సాక్షిపూర్వకంగా తాను ప్రమాణం చేయలేను అనుకునే వ్యక్తి చేసే ప్రకటన) చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వబడవచ్చు.—గలతీయులు 1:20.
న్యాయస్థానపు పద్ధతుల్లో ప్రమాణం చేసేటప్పుడు చెయ్యి ఎత్తడం లేక చెయ్యిని బైబిలు మీద పెట్టడం ఉంటే, ఒక క్రైస్తవుడు అలా చేయడాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రమాణం చేసేటప్పుడు అలా చేసిన వ్యక్తులకు సంబంధించిన లేఖనాధారిత ఉదాహరణలను మనస్సులో ఉంచుకొని ఆయన అలా చేయవచ్చు. ఒక క్రైస్తవుడు ప్రమాణం చేసేటప్పుడు చెయ్యి ఎత్తడం లేక చెయ్యిని బైబిలు మీద పెట్టడం కంటే ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నిజం చెప్పేందుకు తాను దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నానని ఆయన గుర్తుపెట్టుకోవడమే. ఇలాంటి ప్రమాణం గంభీరమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో అడగబడిన ప్రశ్నకు తాను సమాధానం చెప్పవచ్చు లేదా ఆ ప్రశ్నకు తాను ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ఒక క్రైస్తవుడు భావిస్తే, తాను సత్యం చెప్పేందుకు ప్రమాణం చేశానని ఆయన గుర్తుంచుకోవాలి, క్రైస్తవులు ఎల్లప్పుడూ సత్యమే చెప్పాలని కోరుకుంటారు.