కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు సువార్తలో నిజంగా విశ్వాసం ఉందా?

మీకు సువార్తలో నిజంగా విశ్వాసం ఉందా?

మీకు సువార్తలో నిజంగా విశ్వాసం ఉందా?

“దేవునిరాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ము[డి].” ​—⁠మార్కు 1:​15.

అది సా.శ. 30వ సంవత్సరం. యేసుక్రీస్తు గలిలయలో తన విశేషమైన పరిచర్యను ప్రారంభించాడు. ఆయన ‘దేవుని సువార్త ప్రకటిస్తూ, కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి’ అని చెప్పినప్పుడు చాలామంది గలిలయులు పురికొల్పబడ్డారు.​—⁠మార్కు 1:​14, 15.

2 యేసు తన పరిచర్యను ప్రారంభించడానికీ ప్రజలు తమకు దేవుని అనుగ్రహం లభించే నిర్ణయం తీసుకోవడానికీ ‘కాలము సంపూర్ణమైంది.’ (లూకా 12:​54-56) యేసు నియమిత రాజుగా వారి మధ్యనే ఉన్నాడు కాబట్టి ‘దేవుని రాజ్యము సమీపించింది.’ ఆయన చేసిన ప్రకటనా పని నీతి హృదయులు పశ్చాత్తాపపడేలా వారిని పురికొల్పింది. అయితే “సువార్త”లో విశ్వాసముందని వారెలా చూపించారు, మనమెలా చూపించవచ్చు?

3 యేసులాగే అపొస్తలుడైన పేతురు కూడా ప్రజలను పశ్చాత్తాపపడమని ఉద్బోధించాడు. సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెరూషలేములోని యూదులనుద్దేశించి మాట్లాడుతూ పేతురు ఇలా అన్నాడు: “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.” ఆ తర్వాత వేలాదిమంది పశ్చాత్తాపపడి, బాప్తిస్మం తీసుకుని, యేసు అనుచరులయ్యారు. (అపొస్తలుల కార్యములు 2:38, 41; 4:⁠4) సా.శ. 36లో, పశ్చాత్తాపం చెందిన అన్యులు కూడా అలాంటి చర్యలే తీసుకున్నారు. (అపొస్తలుల కార్యములు 10:​1-48) మన కాలంలో సువార్తపట్ల విశ్వాసం వేలాదిమంది తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, దేవునికి సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకొనేలా వారిని పురికొల్పుతోంది. వారు రక్షణ సువార్తను అంగీకరించి, యేసు విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచుతున్నారు. అంతేగాక వారు నీతిని అనుసరిస్తూ దేవుని రాజ్యం పక్షం వహించారు.

4 కానీ విశ్వాసం అంటే ఏమిటి? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.” (హెబ్రీయులు 11:⁠1) మన విశ్వాసం, దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేసినవన్నీ ఇప్పటికే నెరవేరాయన్నంత నిశ్చయతను మనకు కలిగిస్తుంది. అది, ఒక నిర్దిష్టమైన ఆస్తి మనదని నిరూపించే ఆధారపత్రం మనదగ్గరున్నట్లే ఉంటుంది. విశ్వాసమంటే, ఒక “రుజువు” లేదా అదృశ్యమైన వాటిని గురించిన దృఢ నమ్మకానికి సాక్ష్యాధారం కూడా. అలాంటి విషయాలను మనం చూడకపోయినప్పటికీ అవి వాస్తవాలని మన మానసిక గ్రహణశక్తి, కృతజ్ఞత నిండిన హృదయం మనల్ని ఒప్పిస్తాయి.​—⁠2 కొరింథీయులు 5:6; ఎఫెసీయులు 1:​17-19.

మనకు విశ్వాసం అవసరం!

5 మనం ఆధ్యాత్మిక అవసరతతో జన్మించాము గానీ విశ్వాసంతో జన్మించలేదు. వాస్తవానికి “విశ్వాసము అందరికి లేదు.” (2 థెస్సలొనీకయులు 3:⁠2) అయితే, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి క్రైస్తవులకు విశ్వాసం అవసరం. (హెబ్రీయులు 6:​11, 12) విశ్వాసానికి సంబంధించిన అనేక ఉదాహరణలను పేర్కొన్న తర్వాత పౌలు ఇలా వ్రాశాడు: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.” (హెబ్రీయులు 12:​1, 2) “సుళువుగా చిక్కులబెట్టు పాపము” అంటే ఏమిటి? అది విశ్వాసలేమి, చివరికి ఒకప్పుడున్న విశ్వాసాన్ని కోల్పోవడం కూడా. బలమైన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మనం “యేసువైపు చూచుచు” ఆయన మాదిరిని అనుసరించాలి. అంతేగాక మనం అనైతికతను నిరాకరించాలి, శరీరకార్యాలతో పోరాడాలి, వస్తుసంపదలను సమకూర్చుకోవడాన్ని, లోకసంబంధమైన తత్వాలను, లేఖనవిరుద్ధమైన ఆచారాలను విసర్జించాలి. (గలతీయులు 5:19-21; కొలొస్సయులు 2:8; 1 తిమోతి 6:9, 10; యూదా 3, 4) అంతేగాక, దేవుడు మనతో ఉన్నాడనీ ఆయన వాక్యంలోని ఉపదేశం నిజంగా పనిచేస్తుందనీ మనం విశ్వసించాలి.

6 మనం మన స్వంత నిశ్చయతతో మనలో విశ్వాసాన్ని ఉత్పన్నం చేసుకోలేము. విశ్వాసం దేవుని పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి యొక్క ఫలంలో ఒక భాగం. (గలతీయులు 5:⁠22) అయితే మన విశ్వాసాన్ని బలపరచుకోవలసిన అవసరం ఏర్పడితే అప్పుడెలా? యేసు ఇలా అన్నాడు: “మీరు . . . మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు[ను].” (లూకా 11:​12, 13) అవును, మనం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిద్దాం, ఎందుకంటే అది మనం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సహితం దేవుని చిత్తాన్ని చేయడానికి అవసరమైన విశ్వాసాన్ని మనలో ఉత్పన్నం చేయగలదు.​—⁠ఎఫెసీయులు 3:​20, 21.

7 మరింత ఎక్కువ విశ్వాసం కోసం ప్రార్థించడం సరైనదే. యేసు ఒక పిల్లవానిలో నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టే ముందు, ఆ పిల్లవాని తండ్రి, “నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయు[ము]” అని వేడుకున్నాడు. (మార్కు 9:​24) “మా విశ్వాసము వృద్ధిపొందించు[ము]” అని యేసు శిష్యులు అన్నారు. (లూకా 17:⁠5) కాబట్టి, మనం విశ్వాసం కోసం ప్రార్థిస్తూ అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని దృఢనమ్మకం కలిగి ఉందాము.​—⁠1 యోహాను 5:​14.

దేవుని వాక్యంలో విశ్వాసముంచడం చాలా ప్రాముఖ్యం

8 యేసు తాను బలిగా మరణించడానికి కొంతకాలం ముందు తన అనుచరులతో ఇలా అన్నాడు: “మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.” (యోహాను 14:⁠1) క్రైస్తవులుగా మనకు దేవునిపైనా, ఆయన కుమారునిపైనా విశ్వాసం ఉంది. అయితే దేవుని వాక్యం సంగతేమిటి? అది మనకు లభ్యం కాగల సర్వశ్రేష్ఠమైన ఉపదేశాన్ని నిర్దేశాన్ని ఇస్తుందన్న సంపూర్ణ నమ్మకంతో మనం దాన్ని అధ్యయనం చేసి దాన్ని అన్వయించుకుంటే అది మనకు ప్రయోజనం చేకూరే విధంగా మన జీవితాల్లో శక్తివంతమైన ప్రభావాన్ని చూపించగలదు.​—⁠హెబ్రీయులు 4:12.

9 అపరిపూర్ణ మానవులముగా మన జీవితం సమస్యలతో నిండివుంది. అయితే, దేవుని వాక్యంలో విశ్వాసం నిజంగా మనకు సహాయం చేయగలదు. (యోబు 14:⁠1) ఉదాహరణకు, మనకు ఒక నిర్దిష్టమైన కష్టంతో ఎలా వ్యవహరించాలో తెలియలేదనుకోండి. దేవుని వాక్యం మనకు ఈ ఉపదేశాన్ని ఇస్తోంది: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.”​—⁠యాకోబు 1:​5-8.

10 మనకు జ్ఞానము కొదువగా ఉన్నందున మనం దానికోసం ప్రార్థిస్తే యెహోవా దేవుడు మనల్నేమీ గద్దించడు, బదులుగా మనం ఆ కష్టాన్ని సరైన విధంగా దృష్టించడానికి సహాయం చేస్తాడు. తోటి విశ్వాసుల ద్వారా గానీ మనం బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు గానీ సహాయకరమైన లేఖనాలు మన అవధానానికి తీసుకురాబడవచ్చు. లేదా మరే విధంగానైనా మనం యెహోవా పరిశుద్ధాత్మచే నడిపించబడవచ్చు. మనం ‘ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో అడుగుతూ’ ఉంటే మన పరలోక తండ్రి శ్రమలను సహించడానికి కావలసిన జ్ఞానాన్ని మనకిస్తాడు. మనం గాలికి ఎగిరిపడే సముద్ర తరంగాల్లా ఉంటే దేవుని నుండి ఏమైనా దొరుకుతుందని ఎదురు చూడలేము. ఎందుకు? ఎందుకంటే మనం ప్రార్థనలో గానీ మరితర విధాల్లో గానీ చివరికి విశ్వాసంతో ఉండడంలో గానీ అనిశ్చితంగా, అస్థిరంగా ఉండి ఉండవచ్చని దాని భావం. కాబట్టి మనం దేవుని వాక్యంలో, అదిచ్చే నడిపింపులో దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది సహాయాన్ని, నడిపింపును ఎలా ఇస్తుందనే దాని గురించి మనం కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాము.

విశ్వాసం, జీవనాధారం

11 మనం ఇప్పుడు పేదరికాన్ని అనుభవిస్తుంటే ఎలా? యెహోవా మన అనుదిన అవసరాల గురించి శ్రద్ధ తీసుకుంటాడని, ఆయనను ప్రేమించేవారందరికి చివరికి అన్నీ సమృద్ధిగా లభించేలా చేస్తాడని దేవుని వాక్యంలో విశ్వాసం మనకు ఖచ్చితమైన నిరీక్షణను ఇస్తుంది. (కీర్తన 72:16; లూకా 11:​2, 3) కరువు సమయంలో యెహోవా తన ప్రవక్త అయిన ఏలీయాకు ఆహారాన్ని ఎలా అందించాడనేదాన్ని పరిశీలించడం ప్రోత్సాహకరంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత, దేవుడు అద్భుతమైన రీతిలో పిండిని, నూనెను సరఫరా చేశాడు. అది ఒక స్త్రీని, ఆమె కుమారుడిని, ఏలీయాను సజీవంగా ఉంచింది. (1 రాజులు 17:​2-16) బబులోను యెరూషలేమును ముట్టడిస్తున్నప్పుడు కూడా యిర్మీయా ప్రవక్తకు యెహోవా అలాగే ఆహారాన్ని అందించాడు. (యిర్మీయా 37:​21) యిర్మీయాకు, ఏలీయాకు ఆహారం తక్కువగా ఉన్నప్పటికీ యెహోవా వారి గురించి శ్రద్ధ తీసుకున్నాడు. నేడు తనపై విశ్వాసముంచేవారి విషయంలో కూడా ఆయన అలాగే చేస్తాడు.​—⁠మత్తయి 6:11, 25-34.

12 విశ్వాసం ఉండడంతోపాటు బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం, వస్తుపరంగా మనల్ని సంపన్నులను చేయదు గానీ కనీసావసరాలు తీర్చుకునేందుకు అవసరమైనదాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేస్తుంది. సోదాహరణంగా చెప్పాలంటే: మనం నిజాయితీగా, సమర్థులముగా, కష్టపడి పనిచేసేవారముగా ఉండాలని బైబిలు మనకు ఉపదేశిస్తోంది. (సామెతలు 22:29; ప్రసంగి 5:18, 19; 2 కొరింథీయులు 8:​21) మంచి పనివాడన్న పేరుకుండే విలువను మనం ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు. మంచి ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో సహితం, నిజాయితీపరులైన, సమర్థులైన, కష్టపడి పనిచేసేవారికి ఇతరులకన్నా మంచి అవకాశాలే లభిస్తాయి. వస్తుపరంగా చూస్తే అలాంటి పనివారికి కొంచెమే ఉన్నప్పటికీ సాధారణంగా వారికి కనీసావసరాలు తీరతాయి, తాము స్వయంగా సంపాదించుకుని తింటున్నామనే సంతృప్తి ఉంటుంది.​—⁠2 థెస్సలొనీకయులు 3:​11, 12.

విశ్వాసం దుఃఖాన్ని సహించడానికి మనకు సహాయం చేస్తుంది

13 మనం ప్రేమించే వారెవరైనా మరణిస్తే సహజంగానే దుఃఖపడతామని దేవుని వాక్యం వాస్తవికంగా చూపిస్తోంది. నమ్మకమైన పితరుడు అబ్రాహాము తన ప్రియమైన భార్య శారా మరణించినప్పుడు దుఃఖించాడు. (ఆదికాండము 23:⁠2) దావీదు తన కుమారుడు అబ్షాలోము చనిపోయాడని విన్నప్పుడు ఎంతో దుఃఖించాడు. (2 సమూయేలు 18:​33) పరిపూర్ణ మానవుడైన యేసు కూడా తన స్నేహితుడు లాజరు మరణించినప్పుడు దుఃఖించాడు. (యోహాను 11:​35, 36) ప్రియమైనవారెవరైనా మరణించినప్పుడు మనం తట్టుకోలేనంతటి దుఃఖాన్ని అనుభవిస్తాము, కానీ దేవుని వాక్యంలోని వాగ్దానాలపై మనకున్న విశ్వాసం అలాంటి దుఃఖాన్ని సహించడానికి మనకు సహాయం చేస్తుంది.

14 ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని నేను దేవునియందు నిరీక్షణయుంచియున్నాను,’ అని పౌలు అన్నాడు. (అపొస్తలుల కార్యములు 24:​14, 15) అనేకానేకులను తిరిగి జీవానికి తీసుకువచ్చేందుకు దేవుడు చేసిన ఏర్పాటుపై మనకు విశ్వాసం ఉండాలి. (యోహాను 5:​28, 29) వారిలో అబ్రాహాము శారా, ఇస్సాకు రిబ్కా, యాకోబు లేయా ఉంటారు, వారందరూ దేవుని నూతన లోకంలోకి పునరుత్థానం చేయబడేందుకు ఎదురు చూస్తూ ఇప్పుడు మరణమందు నిద్రిస్తున్నారు. (ఆదికాండము 49:​29-32) మన ప్రియమైనవారు భూమిపై జీవించడానికి మరణ నిద్ర నుండి మేల్కొల్పబడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా! (ప్రకటన 20:​11-15) ఈ మధ్యకాలంలో, విశ్వాసం మనకున్న దుఃఖాన్నంతటినీ నిర్మూలించదు గానీ వియోగాన్ని సహించడానికి మనకు సహాయం చేసే దేవునికి మనల్ని సన్నిహితంగా ఉంచుతుంది.​—⁠కీర్తన 121:1-3; 2 కొరింథీయులు 1:⁠3.

విశ్వాసం కృంగినవారిని బలపరుస్తుంది

15 విశ్వాసం ఉన్నవారు సహితం కృంగుదలకు గురికావచ్చని కూడా దేవుని వాక్యం చూపిస్తోంది. యోబుకు తీవ్రమైన పరీక్షలు ఎదురైనప్పుడు, తనను దేవుడు విడిచిపెట్టాడని ఆయన భావించాడు. (యోబు 29:​2-5) యెరూషలేము, దాని గోడల శిథిలావస్థ నెహెమ్యాను విచారంతో నింపేసింది. (నెహెమ్యా 2:​1-3) యేసును నిరాకరించిన తర్వాత పేతురు ఎంతగా కృంగిపోయాడంటే ఆయన “సంతాపపడి యే[డ్చాడు].” (లూకా 22:​62) “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి,” అని పౌలు థెస్సలొనీక సంఘంలోని తోటి విశ్వాసులకు ఉద్బోధించాడు. (1 థెస్సలొనీకయులు 5:​14) కాబట్టి నేడు విశ్వాసం ఉన్నవారు కృంగిపోవడం విచిత్రమేమీ కాదు. అయితే కృంగుదలను ఎదుర్కోవడానికి మనమేమి చేయవచ్చు?

16 మనం ఎన్నో గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాము కాబట్టి మనం కృంగుదలకు గురవుతుండవచ్చు. వాటిని దురవస్థగా దృష్టించే బదులు, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా మనం ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు. అలా చేయడం, మన కృంగుదలను తగ్గించుకోవడానికి సహాయపడవచ్చు. సమతుల్యంగా పనిచేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా సహాయకరంగా ఉండవచ్చు. ఒక విషయం మాత్రం ఖచ్చితం: దేవునిపైనా ఆయన వాక్యంలోనూ విశ్వాసం ఉంచడం ఆధ్యాత్మిక సంక్షేమాన్ని పెంపొందింపజేస్తుంది ఎందుకంటే అది, ఆయన మన గురించి నిజంగా శ్రద్ధ కలిగివున్నాడన్న మన దృఢనమ్మకాన్ని ఇంకా బలపరుస్తుంది.

17 పేతురు మనకు ఓదార్పునిచ్చే ఈ హామీనిస్తున్నాడు: “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” (1 పేతురు 5:​6, 7) కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు, క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు.” (కీర్తన 145:​14) ఈ హామీలు దేవుని వాక్యంలో ఉన్నాయి కాబట్టి మనం వాటిని విశ్వసించాలి. కృంగుదల కొనసాగవచ్చు అయినా, మనం చింతనంతటినీ ప్రేమగల మన పరలోకపు తండ్రిపై వేయవచ్చునని తెలుసుకోవడం విశ్వాసాన్ని ఎంతగా బలపరుస్తుందో కదా!

విశ్వాసం, ఇతర శ్రమలు

18 మనం గానీ మనకు ప్రియమైన వారు గానీ తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు మనం మన విశ్వాసం విషయంలో పెద్ద పరీక్షను ఎదుర్కొంటుండవచ్చు. ఎపఫ్రొదితు, తిమోతి, త్రోఫిము వంటి వారికి అద్భుతరీతిలో స్వస్థతలు జరిగినట్లేమీ బైబిలు నివేదించకపోయినప్పటికీ వారు సహించడానికి యెహోవా సహాయం చేశాడన్నదానిలో ఎటువంటి సందేహం లేదు. (ఫిలిప్పీయులు 2:25-30; 1 తిమోతి 5:23; 2 తిమోతి 4:​20) అంతేగాక, ‘బీదలను కటాక్షించువాని’ గురించి కీర్తనకర్త ఇలా పాడాడు: “రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.” (కీర్తన 41:​1-3) అనారోగ్యంతో బాధపడుతున్న తోటి విశ్వాసులను ఓదార్చడానికి కీర్తనకర్త మాటలు మనకెలా సహాయం చేయవచ్చు?

19 ఆధ్యాత్మిక సహాయాన్నివ్వడానికి ఒక మార్గం అనారోగ్యంతో బాధపడుతున్న వారికోసం ప్రార్థించడం, వారితో కలిసి ప్రార్థించడం. నేడు అద్భుతమైన స్వస్థతలు జరగాలని విజ్ఞప్తి చేయకపోయినప్పటికీ వారికున్న వ్యాధిని ఓర్చుకోవడానికి కావలసిన శక్తిని, బలహీనమైన అలాంటి సమయాలను సహించడానికి కావలసిన ఆధ్యాత్మిక బలాన్ని ఇవ్వమని మనం దేవుణ్ణి అడుగవచ్చు. యెహోవా వారిని బలపరుస్తాడు, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును” చెప్పని సమయంకోసం ఎదురు చూడడం ద్వారా వారి విశ్వాసం బలపర్చబడుతుంది. (యెషయా 33:​24) పునరుత్థానం చేయబడిన యేసుక్రీస్తు ద్వారా, దేవుని రాజ్యం ద్వారా విధేయులైన మానవజాతి పాపమరణాల నుండి వ్యాధి నుండి శాశ్వత విముక్తిని పొందుతుందని తెలుసుకోవడంలో ఎంతటి ఓదార్పు లభిస్తుందో కదా! ఈ మహత్తరమైన నిరీక్షణలను బట్టి మనం ‘మన సంకటములన్నిటిని కుదిర్చే’ యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తాము.​—⁠కీర్తన 103:1-3; ప్రకటన 21:​1-5.

20 ఆరోగ్యం, బలం క్షీణించిపోయే “దుర్దినముల”ను సహించడానికి కూడా విశ్వాసం మనకు సహాయం చేయగలదు. (ప్రసంగి 12:​1-7) కాబట్టి మనమధ్యనున్న వయోజనులు, “నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే . . . వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము; నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము” అని పాడిన వయోజనుడైన కీర్తనకర్తలా ప్రార్థించవచ్చు. (కీర్తన 71:​5, 9) యెహోవా మద్దతు అవసరమని కీర్తనకర్త భావించాడు, దేవుని సేవలో వృద్ధులైన మన తోటి క్రైస్తవులనేకులు కూడా అలాగే భావిస్తారు. వారు తమ విశ్వాసాన్ని బట్టి యెహోవా నిత్య బాహువుల విఫలంకాని మద్దతు విషయమై నిశ్చయతతో ఉండవచ్చు.​—⁠ద్వితీయోపదేశకాండము 33:27.

దేవుని వాక్యంలో విశ్వాసాన్ని కాపాడుకోండి

21 సువార్తలోనూ దేవుని వాక్యమంతటిలోనూ మనకున్న విశ్వాసం యెహోవాకు మరింత సన్నిహితం కావడానికి మనకు సహాయం చేస్తుంది. (యాకోబు 4:⁠8) నిజమే, ఆయన మన సర్వోన్నతమైన ప్రభువు, కానీ ఆయన మన సృష్టికర్త, తండ్రి కూడా. (యెషయా 64:8; మత్తయి 6:​9, 10; అపొస్తలుల కార్యములు 4:​24) “నీవు నా తండ్రివి నా దేవుడవు. నా రక్షణ దుర్గము” అని కీర్తనకర్త ఆలపించాడు. (కీర్తన 89:​26) మనం యెహోవాయందు ఆయన ప్రేరేపిత వాక్యమందు విశ్వాసముంచితే మనం కూడా ఆయనను ‘మన రక్షణ దుర్గముగా’ పరిగణించుకోవచ్చు. ఎంతటి హృదయోత్తేజకరమైన ఆధిక్యతో కదా!

22 ఆత్మాభిషిక్త క్రైస్తవులకూ భూనిరీక్షణగల వారి సహవాసులకూ యెహోవా తండ్రియై ఉన్నాడు. (రోమీయులు 8:​15) మన పరలోక తండ్రియందు మనకున్న విశ్వాసం మనల్ని ఎన్నడూ నిరుత్సాహపర్చదు. దావీదు ఇలా అన్నాడు: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” (కీర్తన 27:​10) అంతేగాక, ‘యెహోవా తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను విడనాడడు’ అనే హామీ మనకు ఇవ్వబడింది.​—⁠1 సమూయేలు 12:​22.

23 అయితే యెహోవాతో శాశ్వత సంబంధాన్ని కలిగివుండాలంటే మనకు సువార్తలో విశ్వాసం ఉండాలి, లేఖనాలను దేవుని వాక్యంగా అంగీకరించాలి​—⁠లేఖనాలు నిజంగా దేవుని వాక్యమే. (1 థెస్సలొనీకయులు 2:​13) యెహోవాయందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగివుండి, ఆయన వాక్యం మన త్రోవకు వెలుగై ఉండడానికి అనుమతించాలి. (కీర్తన 119:105; సామెతలు 3:​5, 6) ఆయన కనికరం, దయ, మద్దతు వంటివాటి మీద నమ్మకంతో ఆయనకు ప్రార్థించినప్పుడు మన విశ్వాసం అధికమవుతుంది.

24 మనల్ని మనం దేవునికి శాశ్వతంగా సమర్పించుకోవడానికి విశ్వాసం మనల్ని కదిలించింది. బలమైన విశ్వాసముండి మనం మరణించినా, పునరుత్థాన నిరీక్షణతో మనం ఆయన సమర్పిత సేవకులముగానే ఉంటాము. అవును, “మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము.” (రోమీయులు 14:⁠8) దేవుని వాక్యంలో మన నమ్మకాన్ని కాపాడుకుంటూ సువార్తలో విశ్వాసం కలిగివుండడానికి ఆ ఓదార్పుకరమైన తలంపును మన హృదయంలో ఉంచుకుందాము.

మీరెలా జవాబిస్తారు?

• విశ్వాసం అంటే ఏమిటి, మనకు ఈ లక్షణం ఎందుకవసరం?

• సువార్తలోనూ దేవుని వాక్యమంతటిలోనూ మనం విశ్వాసాన్నుంచడం ఎందుకు ప్రాముఖ్యం?

• వివిధ కష్టాలను సహించడానికి విశ్వాసం మనకెలా సహాయం చేస్తుంది?

• విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనకేది దోహదపడుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మార్కు 1:14, 15 వచనాలను మీరెలా వివరిస్తారు?

3. ప్రజలు ఏమి చేయడం ద్వారా తమకు సువార్తలో విశ్వాసముందని చూపించారు?

4. విశ్వాసం అంటే ఏమిటి?

5. విశ్వాసం ఎందుకంత ప్రాముఖ్యమైనది?

6, 7. విశ్వాసం కోసం ప్రార్థించడం ఎందుకు సరైనది?

8. దేవుని వాక్యంలో విశ్వాసముంచడం మనకెలా సహాయం చేయగలదు?

9, 10. యాకోబు 1:5-8 వచనాల్లో విశ్వాసం గురించి చెప్పబడినదాన్ని మీరెలా వివరిస్తారు?

11. దేవుని వాక్యంలో విశ్వాసముంచితే, మన అనుదిన అవసరాల గురించి అది మనకు ఏ హామీ ఇస్తుంది?

12. కనీసావసరాలు తీర్చుకునేందుకు అవసరమైనదాన్ని సంపాదించుకోవడానికి విశ్వాసం ఎలా సహాయం చేస్తుంది?

13, 14. దుఃఖాన్ని సహించడానికి విశ్వాసం మనకెలా సహాయం చేస్తుంది?

15, 16. (ఎ) విశ్వాసం ఉన్నవారు కూడా కృంగిపోవడం విచిత్రమైనదేమీ కాదని మనమెందుకు చెప్పవచ్చు? (బి) కృంగుదలను ఎదుర్కోవడానికి ఏమి చేయవచ్చు?

17. యెహోవా మన గురించి శ్రద్ధ కలిగివున్నాడని మనకెలా తెలుసు?

18, 19. అనారోగ్యాన్ని సహించడానికి, అనారోగ్యంతో బాధపడుతున్న తోటి విశ్వాసులను ఓదార్చడానికి విశ్వాసం మనకెలా సహాయం చేస్తుంది?

20. వృద్ధాప్యపు “దుర్దినముల”లో విశ్వాసం మనకు కాపుదలనిస్తుందని ఎందుకు చెప్పవచ్చు?

21, 22. మనకు విశ్వాసముంటే, అది దేవునితో మనకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

23. యెహోవాతో శాశ్వత సంబంధాన్ని కాపాడుకోవడానికి ఏమి అవసరం?

24. రోమీయులు 14:8లో ఏ ఓదార్పుకరమైన తలంపు తెలియజేయబడింది?

[12వ పేజీలోని చిత్రాలు]

యిర్మీయాకు, ఏలీయాకు విశ్వాసం ఉన్నందువల్లే యెహోవా వారిని బలపర్చాడు

[13వ పేజీలోని చిత్రాలు]

 యీబుకు, పేతురుకు, నెహెమ్యాకు దృఢమైన విశ్వాసం ఉంది

[15వ పేజీలోని చిత్రాలు]

యెహోవాతో శాశ్వత సంబంధాన్ని ఆనందించడానికి, మనకు సువార్తలో విశ్వాసం ఉండాలి