కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?

మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?

మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?

“విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు.”​—⁠2 కొరింథీయులు 1:24.

తమకు విశ్వాసం ఉండాలని యెహోవా సేవకులకు తెలుసు. వాస్తవానికి, “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము.” (హెబ్రీయులు 11:⁠6) కాబట్టి, మనం జ్ఞానయుక్తంగానే పరిశుద్ధాత్మ కోసమూ దాని ఆశీర్వాదకరమైన ఫలంలో భాగమైన విశ్వాసం కోసమూ ప్రార్థిస్తాం. (లూకా 11:13; గలతీయులు 5:​22) తోటి విశ్వాసుల విశ్వాసాన్ని అనుకరించడం కూడా మనలోవున్న ఈ లక్షణాన్ని బలపర్చగలదు.​—⁠2 తిమోతి 1:​3-5; హెబ్రీయులు 13:⁠7.

2 దేవుని వాక్యం క్రైస్తవులందరి కోసం నిర్దేశించే మార్గాన్ని అనుసరించడంలో మనం కొనసాగితే మన విశ్వాసం మరింత దృఢమవుతుంది. అనుదినం బైబిలు చదవడం ద్వారా, ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ అందజేస్తున్న ప్రచురణల సహాయంతో లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా విశ్వాసం అధికం కాగలదు. (లూకా 12:42-44; యెహోషువ 1:​7, 8) క్రైస్తవ కూటాలకు, సమావేశాలకు క్రమంగా హాజరవడం ద్వారా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరం ప్రోత్సహించబడతాము. (రోమీయులు 1:11, 12; హెబ్రీయులు 10:​24, 25) అంతేగాక, పరిచర్యలో మనం ఇతరులతో మాట్లాడినప్పుడు మన విశ్వాసం బలపర్చబడుతుంది.​—⁠కీర్తన 145:10-13; రోమీయులు 10:11-15.

3 ప్రేమగల క్రైస్తవ పెద్దలు లేఖనాధారిత ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవడానికి సహాయం చేస్తారు. వారికి అపొస్తలుడైన పౌలుకున్నటువంటి మనోవైఖరి ఉంటుంది, ఆయన కొరింథీయులకు ఇలా చెప్పాడు: “మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు.” (2 కొరింథీయులు 1:​23, 24) మరో అనువాదంలో ఇలా ఉంది: “మీ విశ్వాసము దృఢమైనదే. . . . పైగా మేము మీ సంతోషము కొరకే మీతో సహకరించుచున్నాము.” (పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. మన కోసం మరెవరో విశ్వాసం కలిగివుండలేరన్నది, మనం విశ్వసనీయమైన యథార్థవంతులుగా ఉండేలా ఎవరూ చేయలేరన్నది వాస్తవం. ఈ విషయంలో, ‘మన బరువు మనమే భరించుకోవాలి.’​—⁠గలతీయులు 3:11; 6:⁠5.

4 లేఖనాలు, విశ్వాసం గలవారి వృత్తాంతాలతో నిండివున్నాయి. వారు చేసిన విశేషమైన కార్యాల్లో అనేకం మనకు తెలిసి ఉండవచ్చు, కానీ వారు అనుదినం, బహుశా సుదీర్ఘమైన జీవితకాలమంతా చూపించిన విశ్వాసం గురించి మనకు తెలుసా? వారు మనం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ లక్షణాన్ని ఎలా చూపించారనేదాని గురించి ఇప్పుడు ధ్యానించడం మనం మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి సహాయం చేయగలదు.

విశ్వాసం మనకు ధైర్యాన్నిస్తుంది

5 దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. దేవుడు తీర్పు తీర్చే విషయం గురించి హనోకు ధైర్యంగా ప్రవచించాడు. ఆయనిలా అన్నాడు, “ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.” (యూదా 14, 15) అలాంటి మాటలు విన్నప్పుడు దైవభక్తిలేని హనోకు శత్రువులు ఖచ్చితంగా ఆయనను చంపాలనుకున్నారు. అయినా, ఆయన విశ్వాసంతో ధైర్యంగా మాట్లాడాడు, దేవుడు ఆయన జీవితాన్ని ముగించడం ద్వారా ఆయనను “తీసికొనిపోయెను,” అంటే ఆయన మరణ వేదనలు అనుభవించకుండానే మరణంలో నిద్రించేలా చేశాడని స్పష్టమవుతోంది. (ఆదికాండము 5:24; హెబ్రీయులు 11:⁠5) మనం అలాంటి అద్భుతాలను అనుభవించక పోయినప్పటికీ మనం యెహోవా వాక్యాన్ని విశ్వాసంతో, ధైర్యంతో ప్రకటించగలిగేలా ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు.​—⁠అపొస్తలుల కార్యములు 4:​24-31.

6 విశ్వాసమునుబట్టి నోవహు “తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను.” (హెబ్రీయులు 11:7; ఆదికాండము 6:​13-22) నోవహు ‘నీతిని ప్రకటించాడు’ కూడా, ఆయన తన సమకాలీనులకు దేవుని హెచ్చరికను ధైర్యంగా ప్రకటించాడు. (2 పేతురు 2:⁠5) ప్రస్తుత విధానం త్వరలో నాశనం చేయబడుతుందనే దానికి మనం లేఖనాధారిత నిదర్శనాన్ని చూపించినప్పుడు కొందరు అపహాస్యం చేసినట్లే, రానున్న జలప్రళయం గురించి ఆయన చెప్పిన సందేశాన్ని బట్టి వాళ్ళు కూడా అపహాస్యం చేసివుండవచ్చు. (2 పేతురు 3:​3-12) అయితే హనోకు, నోవహు ప్రకటించినట్లుగా, మనం దేవుడిచ్చిన విశ్వాసధైర్యాలతో అలాంటి సందేశాన్ని ప్రకటించగలము.

విశ్వాసం మనకు ఓర్పునిస్తుంది

7 మనకు విశ్వాసం, ఓర్పు ఎంతో అవసరం, ప్రాముఖ్యంగా ఈ దుష్ట విధానాంతం కోసం మనం ఎదురు చూస్తుండగా మనకు అవి ఎంతో అవసరం. ‘విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనేవారిలో’ దైవభయంగల పితరుడైన అబ్రాహాము ఉన్నాడు. (హెబ్రీయులు 6:​11, 12) విశ్వాసం మూలంగా ఆయన ఊరు అనే నగరాన్ని, దానిలో నివసించడం వలన కలిగే ప్రయోజనాలను వదిలి వచ్చి, దేవుడు ఆయనకు వాగ్దానం చేసిన పరాయి దేశంలో పరవాసి అయ్యాడు. ఇస్సాకు, యాకోబు కూడా అదే వాగ్దానానికి వారసులు. అయితే, “వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను . . . విశ్వాసముగలవారై మృతినొందిరి.” విశ్వాసం మూలంగా వారు “మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరు[కున్నారు].” తగినట్లుగానే, దేవుడు “వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచి యున్నాడు.” (హెబ్రీయులు 11:​8-16) అవును, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, దైవభక్తిగల వారి భార్యలు దేవుని పరలోక రాజ్యం కోసం ఓర్పుతో ఎదురు చూశారు, ఆ రాజ్య పరిపాలనలో వారు భూమిపై నివసించడానికి పునరుత్థానం చేయబడతారు.

8 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు విశ్వాసాన్ని కోల్పోలేదు. వాగ్దాన దేశం వారికి స్వాధీనం కాలేదు, అబ్రాహాము సంతానం ద్వారా జనాంగములన్నీ ఆశీర్వదించబడడాన్ని వారు చూడలేదు. (ఆదికాండము 15:5-7; 22:​15-18) శతాబ్దాలు గడిచే వరకూ ‘దేవుడు నిర్మించిన నగరం’ వాస్తవం కాకపోయినప్పటికీ వీరు తమ జీవితమంతా విశ్వాసాన్ని ఓర్పును చూపించడంలో కొనసాగారు. మెస్సీయ రాజ్యం ఇప్పుడు పరలోకంలో ఒక వాస్తవిక రాజ్యం కాబట్టి మనం కూడా ఇప్పుడు ఖచ్చితంగా అలాగే చేయాలి.​—⁠కీర్తన 42:5, 11; 43:⁠5.

విశ్వాసం మనకు అత్యున్నతమైన లక్ష్యాలనిస్తుంది

9 నమ్మకస్థులైన మన పితరులు దిగజారిపోయిన కనానీయుల జీవన విధానాన్ని ఎన్నడూ అవలంబించలేదు, ఎందుకంటే వారికి కనానీయులకు ఉన్నవాటికంటే ఎంతో ఉన్నతమైన లక్ష్యాలు, గమ్యాలు ఉండేవి. అదేవిధంగా విశ్వాసం మనకు ఆధ్యాత్మిక లక్ష్యాలనిస్తుంది, అవి మనం దుష్టుడైన అపవాదియగు సాతాను ఆధీనంలో ఉన్న ప్రపంచంలో భాగమైపోకుండా మనల్ని కాపాడతాయి.​—⁠1 యోహాను 2:​15-17; 5:​19.

10 యాకోబు కుమారుడైన యోసేపు దేవుని నడిపింపుతో ఐగుప్తులో ఆహార సంబంధమైన అధికారిగా పనిచేశాడు కానీ ఆయన లక్ష్యం ఈ లోకంలో గొప్ప వ్యక్తిగా ఉండాలన్నది కాదు. యెహోవా వాగ్దానాల నెరవేర్పు మీద విశ్వాసంతో, 110 సంవత్సరాల యోసేపు, “నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవు[ను]” అని తన సహోదరులతో చెప్పాడు. యోసేపు తనను వాగ్దాన దేశంలో పాతిపెట్టమని కోరాడు. ఆయన మరణించినప్పుడు, ఆయన శవము సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి, ఐగుప్తులో ఒక శవపేటికలో ఉంచబడింది. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుండి విడుదల చేయబడినప్పుడు, ప్రవక్తయైన మోషే యోసేపు ఎముకలు పాతిపెట్టబడేందుకు వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళబడేలా చూశాడు. (ఆదికాండము 50:22-26; నిర్గమకాండము 13:​19) యోసేపు విశ్వాసం, మనం లోకసంబంధమైన కీర్తి కంటే ఎంతో ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవడానికి మనల్ని పురికొల్పాలి.​—⁠1 కొరింథీయులు 7:​29-31.

11 ఐగుప్తు రాజ కుటుంబానికి చెందిన విద్యావంతునిగా మోషే, “అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మే[లు]” అని ఎంచాడు. (హెబ్రీయులు 11:23-26; అపొస్తలుల కార్యములు 7:​20-22) దీని మూలంగా ఆయన లోకసంబంధమైన కీర్తిని, బహుశా వైభవోపేతమైన శవపేటికలో పెట్టబడి ఐగుప్తులోని పేరొందిన స్థలాల్లో ఒకదానిలో ఘనంగా భూస్థాపితం చేయబడే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చి ఉండవచ్చు. ‘దైవజనుడిగా,’ ధర్మశాస్త్ర నిబంధనకు మధ్యవర్తిగా, యెహోవా ప్రవక్తగా, బైబిలు రచయితగా ఉండడమనే ఆధిక్యతతో పోలిస్తే అది ఏమాత్రం విలువగలదై ఉండవచ్చు? (ఎజ్రా 3:⁠2) మీరు కోరుకునేది గౌరవప్రదమైన లౌకిక పురోభివృద్ధినా, లేక విశ్వాసం మీకు అత్యున్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యాలనిచ్చిందా?

విశ్వాసం మూలంగా సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది

12 విశ్వాసం ప్రజలకు అత్యున్నతమైన లక్ష్యాలనే కాదు ఫలదాయకమైన జీవితాన్ని కూడా ఇస్తుంది. యెరికో పట్టణస్థురాలైన రాహాబు వేశ్యగా తన జీవితానికి అర్థం లేదని గ్రహించి ఉండవచ్చు. అయినా ఆమె విశ్వాసం ఆమె జీవితాన్ని ఎంతగా మార్చివేసిందో కదా! ఆమె “[ఇశ్రాయేలు] దూతలను చేర్చుకొని” వారు కనానీయులైన తమ శత్రువుల కన్నుగప్పి తప్పించుకొనిపోగలిగేలా “వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు [విశ్వాస] క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను.” (యాకోబు 2:​24-26) రాహాబు యెహోవాను సత్య దేవునిగా గుర్తించి, వేశ్యగా తన వృత్తిని విడనాడడం ద్వారా విశ్వాసాన్ని కనబరిచింది. (యెహోషువ 2:9-11; హెబ్రీయులు 11:​30, 31) ఆమె యెహోవా సేవకుడ్ని వివాహం చేసుకుంది అవిశ్వాసి అయిన కనానీయుడిని కాదు. (ద్వితీయోపదేశకాండము 7:3, 4; 1 కొరింథీయులు 7:​39) మెస్సీయ పూర్వీకురాలయ్యే గొప్ప ఆధిక్యత రాహాబుకు లభించింది. (1 దినవృత్తాంతములు 2:3-15; రూతు 4:20-22; మత్తయి 1:​5, 6) అనైతిక జీవితాన్ని విడనాడిన కొంతమంది వలే ఆమె మరొక ప్రతిఫలాన్ని కూడా పొందబోతోంది, అదే పరదైసు భూమిపై జీవితాన్ని అనుభవించడానికి పునరుత్థానం చేయబడడం.

13 రాహాబు తన పాపభరితమైన జీవితాన్ని విడనాడిన తర్వాత సరైన ప్రవర్తనతో జీవించడంలో కొనసాగిందని స్పష్టమవుతోంది. అయితే, చాలాకాలం క్రితం దేవునికి సమర్పించుకున్న కొందరు గంభీరమైన పాపం చేశారు. రాజైన దావీదు బత్షెబతో వ్యభిచరించి, ఆమె భర్త యుద్ధంలో మరణించేలా చేసి, తర్వాత ఆమెను తన భార్యగా స్వీకరించాడు. (2 సమూయేలు 11:​1-27) దావీదు ఎంతో వేదనతో పశ్చాత్తాపపడుతూ యెహోవాను ఇలా వేడుకున్నాడు: “నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.” దావీదు దేవుని ఆత్మను కోల్పోలేదు. చేసిన పాపం కారణంగా “విరిగి నలిగిన హృదయమును” యెహోవా తన కనికరంతో అలక్ష్యం చేయడన్న విశ్వాసం ఆయనకు ఉండింది. (కీర్తన 51:11, 17; 103:​10-14) దావీదు, బత్షెబ తమ విశ్వాసాన్ని బట్టి మెస్సీయ వంశంలో ఒక ఫలదాయకమైన స్థానాన్ని పొందారు.​—⁠1 దినవృత్తాంతములు 3:5; మత్తయి 1:6, 16; లూకా 3:​23, 31.

దేవుని హామీతో బలపరచబడిన విశ్వాసం

14 మనం విశ్వాసంతో నడుచుకుంటున్నప్పటికీ మనకు కొన్నిసార్లు దైవిక సహాయం ఉందనే హామీ అవసరం కావచ్చు. “విశ్వాసముద్వారా రాజ్యములను జయించి[న]” వారిలో ఒకడైన గిద్యోను అనే న్యాయాధిపతి అలాగే కోరుకున్నాడు. (హెబ్రీయులు 11:​32, 33) మిద్యానీయులు వారి మిత్ర రాజ్యాలు ఇశ్రాయేలును ముట్టడించినప్పుడు, దేవుని ఆత్మ గిద్యోనును ఆవేశించింది. యెహోవా తనతో ఉన్నాడన్న దానికి హామీని కోరుతూ రాత్రంతా కళ్లమున ఉంచబడిన గొఱ్ఱెబొచ్చుకు సంబంధించిన పరీక్షలను ప్రతిపాదించాడు. మొదటి పరీక్షలో, మంచు కేవలం గొఱ్ఱెబొచ్చు మీద మాత్రమే కురవగా నేలంతా పొడిగా ఉంది. రెండవ పరీక్షలో, సరిగ్గా దానికి భిన్నంగా జరిగింది. ఈ హామీలతో బలపరచబడిన, జాగరూకుడైన గిద్యోను విశ్వాసంతో వ్యవహరించి, ఇశ్రాయేలు శత్రువులపై విజయం సాధించాడు. (న్యాయాధిపతులు 6:33-40; 7:​19-25) ఏదైనా నిర్ణయం తీసుకోవలసి ఉన్నప్పుడు మనం హామీ కావాలని కోరితే దానర్థం మనకు విశ్వాసం కొరవడిందనేమీ కాదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు బైబిలును, క్రైస్తవ ప్రచురణలను సంప్రదించడం ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు కోసం ప్రార్థించడం ద్వారా మనం వాస్తవానికి విశ్వాసాన్ని చూపిస్తాము.​—⁠రోమీయులు 8:​26, 27.

15 న్యాయాధిపతియైన బారాకు విశ్వాసం ప్రోత్సాహం రూపంలో ఇవ్వబడిన హామీతో బలపరచబడింది. కనానీయుడైన యాబీను రాజు అణచివేత నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి చొరవ తీసుకొమ్మని ప్రవక్త్రియైన దెబోరా బారాకును ప్రోత్సహించింది. విశ్వాసంతో, దైవిక మద్దతు ఉందనే హామీతో బారాకు అంతంత మాత్రమే ఆయుధాలున్న 10,000 మంది పురుషులను యుద్ధానికి నడిపించి, సీసెరా ఆధిపత్యం క్రిందనున్న యాబీను గొప్ప సైన్యంపై విజయం సాధించాడు. ఆ విజయాన్ని దెబోరా, బారాకు పాడిన ఉత్తేజభరితమైన పాటతో వేడుక చేసుకున్నారు. (న్యాయాధిపతులు 4:1-5:​31) ఇశ్రాయేలుకు దేవుడు నియమించిన నాయకుడిగా బారాకును చర్య తీసుకొమ్మని దెబోరా ప్రోత్సహించింది, విశ్వాసముద్వారా “అన్యుల సేనలను పారదోలి[న]” యెహోవా సేవకులలో ఆయనొకడు. (హెబ్రీయులు 11:​34) బారాకు విశ్వాసంతో చర్య తీసుకున్నందుకు దేవుడు ఆయనను ఎలా ఆశీర్వదించాడనే దాని గురించి మననం చేసుకోవడం, యెహోవా సేవలో ఏదైనా సవాలుదాయకమైన నియామకాన్ని నెరవేర్చడానికి మనం కాస్త సంకోచిస్తుంటే చర్య తీసుకోవడానికి విశ్వాసం మనల్ని బాగా పురికొల్పగలదు.

విశ్వాసం సమాధానాన్ని పెంపొందింపజేస్తుంది

16 దేవుని సేవలో కష్టభరితమైన నియామకాలను నెరవేర్చడానికి విశ్వాసం మనకు సహాయం చేసే విధంగానే, అది శాంతి సమాధానాలను నెలకొల్పడానికి కూడా దోహదపడుతుంది. వయోజనుడైన అబ్రాహాము పశువుల కాపరులకు, ఆయన అన్న కుమారుడు చిన్నవాడయిన లోతు పశువుల కాపరులకు మధ్య కలహం పుట్టి వారు వేరుపడాల్సివచ్చినప్పుడు, లోతు మంచి మేత భూములను ఎంపిక చేసుకోవడానికి అబ్రాహాము అనుమతించాడు. (ఆదికాండము 13:​7-12) ఈ సమస్యను పరిష్కరించడంలో దేవుని సహాయం కోసం అబ్రాహాము విశ్వాసంతో ప్రార్థించి ఉండవచ్చు. తనకు సంబంధించిన విషయాలకే ప్రాధాన్యతనిచ్చుకునే బదులు, ఆయన సమాధానకరంగా పరిస్థితులను చక్కబెట్టాడు. మనకు మన క్రైస్తవ సహోదరునితో ఏదైనా వివాదం తలెత్తితే, ప్రేమపూర్వక శ్రద్ధ చూపించడంలో అబ్రాహాము ఉంచిన మాదిరిని మనస్సులో ఉంచుకొని మనం విశ్వాసంతో ప్రార్థించి, ‘సమాధానమును వెదకి దాని వెంటాడదాము.’​—⁠1 పేతురు 3:​10-12.

17 విశ్వాసంతో క్రైస్తవ సూత్రాలను అన్వయించుకోవడం సమాధానాన్ని పెంపొందింపజేయడానికి మనకెలా సహాయం చేయగలదో పరిశీలించండి. పౌలు తన రెండవ మిషనరీ యాత్రను ప్రారంభించబోతుండగా, కుప్రలోని ఆసియా మైనరులోని సంఘాలను పునర్దర్శిద్దామన్న ప్రతిపాదనకు బర్నబా అంగీకరించాడు. అయితే బర్నబా తన సమీపజ్ఞాతియైన మార్కును తనతో తీసుకువెళ్ళాలని కోరుకున్నాడు. మార్కు పంఫూలియలో తమతోపాటు రాకుండా విడిచిపెట్టాడని పౌలు దానికి నిరాకరించాడు. “తీవ్రమైన వాదము” కలిగింది, దానితో వారు విడిపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళితే, పౌలు సీలను తన సహవాసిగా తీసుకొని “సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము” చేశాడు. (అపొస్తలుల కార్యములు 15:​36-41) కొంతకాలానికి, వారి మధ్య ఏర్పడిన ఆ అగాధం పూడ్చబడింది, ఎందుకంటే మార్కు రోములో పౌలుతో ఉన్నాడు, అపొస్తలుడు ఆయన గురించి అనుకూలంగా మాట్లాడాడు. (కొలొస్సయులు 4:10; ఫిలేమోను 23, 24) దాదాపు సా.శ. 65లో పౌలు రోములోని చెరసాలలో ఉన్నప్పుడు, ఆయన తిమోతికి ఇలా చెప్పాడు: “మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు.” (2 తిమోతి 4:​11) పౌలు బర్నబాతోనూ మార్కుతోనూ తన సంబంధం విషయమై విశ్వాసంతో ప్రార్థించి ఉంటాడని స్పష్టమవుతోంది, దాని మూలంగానే “దేవుని సమాధానము”తో సంబంధంగల శాంతి వారి మధ్యన నెలకొన్నది.​—⁠ఫిలిప్పీయులు 4:6, 7.

18 అపరిపూర్ణులం కాబట్టి “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము.” (యాకోబు 3:⁠2) ఇద్దరు క్రైస్తవ స్త్రీల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు వారి గురించి పౌలు, “ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. . . . ఆ స్త్రీలు సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయు[ము]” అని వ్రాశాడు. (ఫిలిప్పీయులు 4:​2, 3) దైవభక్తిగల ఈ స్త్రీలు మత్తయి 5:23, 24 వచనాల్లో ఉన్నటువంటి ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా సమాధానకరమైన విధంగా తమ సమస్యను పరిష్కరించుకొని ఉండవచ్చు. విశ్వాసంతో లేఖన సూత్రాలను అన్వయించుకోవడం, నేడు సమాధానాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఎంతగానో దోహదపడగలదు.

విశ్వాసం మనం సహించడానికి సహాయం చేస్తుంది

19 విశ్వాసంతో మనం క్లిష్టపరిస్థితులను కూడా సహించవచ్చు. బాప్తిస్మం పొందిన మన కుటుంబ సభ్యులొకరు అవిశ్వాసిని వివాహం చేసుకోవడం ద్వారా దేవునికి అవిధేయత చూపించినందుకు మనం వేదన పడుతుండవచ్చు. (1 కొరింథీయులు 7:​39) ఇస్సాకు, రిబ్కా తమ కుమారుడైన ఏశావు దైవభక్తిలేని స్త్రీలను వివాహం చేసుకున్నందుకు ఎంతో బాధపడ్డారు. “హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజన[ము]” అని రిబ్కా అనేంతగా హిత్తీయులైన ఆయన భార్యలు వారికి “మనోవేదన కలుగజేసిరి.” (ఆదికాండము 26:34, 35; 27:​46) అయినప్పటికీ ఈ కష్టభరితమైన పరిస్థితి ఇస్సాకు, రిబ్కా తమ విశ్వాసాన్ని కోల్పోయేలా చేయలేదు. కష్టభరితమైన పరిస్థితులు మనకు ఒక సవాలుగా తయారైనప్పుడు మనం దృఢ విశ్వాసాన్ని కాపాడుకుందాము.

20 వృద్ధ విధవరాలైన నయోమి యూదురాలు, యూదాలోని కొంతమంది స్త్రీలు మెస్సీయకు పితరులు కాగలవారికి జన్మనిచ్చే అవకాశముందని ఆమెకు తెలుసు. ఆమె కుమారులు పిల్లలు లేకుండా చనిపోవడమేగాక ఆమెకు కూడా పిల్లలు పుట్టే వయస్సు దాటిపోయింది కాబట్టి తన కుటుంబం మెస్సీయ వంశంలో భాగమయ్యే అవకాశాలు వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ విధవరాలైన ఆమె కోడలు రూతు వయోజనుడైన బోయజుకు భార్య అయ్యి, ఆయనకొక కుమారుడ్ని కని మెస్సీయ అయిన యేసుకు పూర్వీకురాలైంది! (ఆదికాండము 49:10, 33; రూతు 1:3-5; 4:13-22; మత్తయి 1:​1, 5) నయోమికి, రూతుకు ఉన్న విశ్వాసం వారు తమ కష్టపరిస్థితిని అధిగమించేలా చేసి వారికి సంతోషాన్ని తీసుకువచ్చింది. కష్టపరిస్థితుల్లో మనం మన విశ్వాసాన్ని కాపాడుకుంటే మనకు కూడా గొప్ప సంతోషం కలుగుతుంది.

21 రేపు ఎవరికి ఏమి సంభవిస్తుందో మనకు తెలియకపోయినప్పటికీ విశ్వాసంతో మనం ఏ సవాలునైనా ఎదుర్కోవచ్చు. విశ్వాసం మనకు ధైర్యాన్ని, ఓర్పును ఇస్తుంది. అది మనకు అత్యున్నతమైన లక్ష్యాలను, సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది. విశ్వాసం మనకు ఇతరులతో ఉన్న సంబంధంపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది, కష్టపరిస్థితిని తట్టుకుని నిలుస్తుంది. కాబట్టి మనం “ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై” ఉందాము. (హెబ్రీయులు 10:​39) మన ప్రేమగల దేవుడైన యెహోవా ఇచ్చే బలంతో, ఆయనకు మహిమ కలిగే విధంగా, దృఢ విశ్వాసంతో కొనసాగుదాము.

మీరెలా జవాబిస్తారు?

• విశ్వాసం మనల్ని ధైర్యవంతులను చేయగలదనడానికి ఏ లేఖనాధారిత నిదర్శనం ఉంది?

• విశ్వాసం మనకు ఫలదాయకమైన జీవితాన్నిస్తుందని మనమెందుకు చెప్పవచ్చు?

• విశ్వాసం సమాధానాన్ని ఎలా పెంపొందింపజేస్తుంది?

• కష్టపరిస్థితులను సహించడానికి విశ్వాసం మనకు సహాయం చేస్తుందనడానికి ఏ నిదర్శనం ఉంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మనకు విశ్వాసం ఎందుకుండాలి, అదెలా దృఢమవుతుంది?

3. విశ్వాసం విషయంలో, ప్రేమగల క్రైస్తవ పెద్దల నుండి మనకే సహాయం లభిస్తుంది?

4. నమ్మకమైన దేవుని సేవకుల లేఖన వృత్తాంతాలు మన విశ్వాసం బలపడడానికి ఎలా సహాయం చేయగలవు?

5. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించేందుకు విశ్వాసం మనల్ని బలపరుస్తుందనడానికి ఏ లేఖనాధారిత సాక్ష్యాధారం ఉంది?

6. దేవుడిచ్చిన విశ్వాసధైర్యాలు నోవహుకు ఎలా సహాయం చేశాయి?

7. అబ్రాహాము మరితరులు విశ్వాసాన్ని ఓర్పును ఎలా కనబరిచారు?

8. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో సహితం ఓర్పును, విశ్వాసాన్ని చూపించారు?

9. విశ్వాసం మన లక్ష్యాలపై ఏ ప్రభావాన్ని చూపిస్తుంది?

10. యోసేపు లోకసంబంధమైన కీర్తి కంటే ఎంతో ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాడని మనకెలా తెలుసు?

11. మోషే తనకు ఆధ్యాత్మిక లక్ష్యాలున్నాయని ఏ విధంగా చూపించాడు?

12. రాహాబు జీవితంపై విశ్వాసం ఏ ప్రభావాన్ని చూపించింది?

13. బత్షెబ విషయంలో దావీదు ఏ పాపం చేశాడు, కానీ ఆయన ఎలాంటి వైఖరిని చూపించాడు?

14. గిద్యోను ఏ యే హామీలను పొందాడు, ఇది మన విశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేయగలదు?

15. బారాకు విశ్వాసం గురించి మననం చేసుకోవడం మనకెలా సహాయపడుతుంది?

16. లోతుతో సమాధానపడడంలో అబ్రాహాము ఎలాంటి మంచి మాదిరిని ఉంచాడు?

17. పౌలు, బర్నబా, మార్కు, వీరి ముగ్గురి మధ్య ఏర్పడిన అగాధం శాంతియుతంగా పూడ్చబడిందని మనమెందుకు చెప్పవచ్చు?

18. యువొదియ, సుంటుకే విషయంలో బహుశా ఏమి జరిగి ఉండవచ్చు?

19. కష్టభరితమైన ఏ పరిస్థితి ఇస్సాకు, రిబ్కా తమ విశ్వాసాన్ని కోల్పోయేలా చేయలేదు?

20. రూతు, నయోమి విశ్వాసం విషయంలో ఎలాంటి మాదిరులుగా ఉన్నారు?

21. విశ్వాసం మనకేమి చేస్తుంది, మన కృత నిశ్చయం ఏమైవుండాలి?

[16వ పేజీలోని చిత్రాలు]

విశ్వాసం యెహోవా సందేశాలను ప్రకటించడానికి నోవహుకు, హనోకుకు కావలసిన ధైర్యాన్నిచ్చింది

[17వ పేజీలోని చిత్రాలు]

మోషేకున్నటువంటి విశ్వాసం ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకోవడానికి మనల్ని పురికొల్పుతుంది

[18వ పేజీలోని చిత్రాలు]

 వుని సహాయం గురించిన హామీ బారాకు, దెబోరా, గిద్యోనుల విశ్వాసాన్ని బలపరచింది