కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉద్యోగ భద్రతా సంతృప్తీ ప్రమాదంలో ఉన్నాయి

ఉద్యోగ భద్రతా సంతృప్తీ ప్రమాదంలో ఉన్నాయి

ఉద్యోగ భద్రతా సంతృప్తీ ప్రమాదంలో ఉన్నాయి

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం, “పనిచేసే హక్కు” మానవులందరికీ ప్రాథమికమైనది. అయితే ఆ హక్కును ఎల్లప్పుడూ వినియోగించుకోవచ్చన్న భరోసా లేదు. ఎందుకంటే ఉద్యోగ భద్రత అనేక విషయాలపై​—⁠స్థానిక ఆర్థిక పరిస్థితుల నుండి ప్రపంచ మార్కెట్‌ స్థితిగతుల వరకు ఎన్నో విషయాలపై​—⁠ఆధారపడి ఉంటుంది. ఉద్యోగాలు పోయినప్పుడు లేదా పోయే ప్రమాదం ఉన్నప్పుడు తరచూ ప్రదర్శనలు, అల్లర్లు, సమ్మెలు జరుగుతుంటాయి. చాలా కొద్ది దేశాల్లో అలా జరగదు. “పని” అనే పదం కూడా “ఎప్పటిలానే తీవ్రమైన భావోద్వేగాలను ఉత్పన్నం చేయగలుగుతుంది” అని ఒక రచయిత అంటున్నాడు.

ఎన్నో కారణాల వల్ల మనందరికీ పని చాలా ప్రాముఖ్యం. అది మనకు ఆదాయాన్నివ్వడమే కాక, మన మానసిక భావోద్వేగ సంక్షేమానికి సహాయపడుతుంది. సమాజంలో ఫలవంతమైన వ్యక్తిగా ఉండాలనే, జీవితానికి ఒక సంకల్పం ఉండాలనే మానవుని కోరికను పని సంతృప్తిపరుస్తుంది. అది మనలో కొంత ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. అందుకే కొందరు తమ అవసరాలు తీర్చుకోవడానికి సమృద్ధిగా డబ్బు ఉన్నప్పటికీ లేదా తాము ఉద్యోగ విరమణ పొందడానికి అర్హులైనప్పటికీ ఉద్యోగంలో కొనసాగడానికే ఇష్టపడతారు. అవును పని ఎంత ప్రాముఖ్యమంటే, అందరికీ సరిపడా పని లేకపోతే అది సాధారణంగా గంభీరమైన సామాజిక సమస్యలకు దారితీస్తుంది.

మరోవైపు ఉద్యోగం ఉన్నప్పటికీ ఆ ఉద్యోగంలో ఎన్నో ఒత్తిళ్ళను ఎదుర్కోవడం వల్ల తమ ఉద్యోగంలో సంతృప్తిని కోల్పోయిన ప్రజలున్నారు. ఉదాహరణకు నేడు పోటీ స్వభావం అధికంగావున్న మార్కెట్‌లో అనేక సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకున్నాయి. మిగతా ఉద్యోగులపై అది అధిక బాధ్యతను ఉంచడం వల్ల వారు అదనపు పని చేయవలసి రావచ్చు.

జీవితాన్ని మరింత సులభం చేసి, పనిని మరింత సమర్థవంతం చేయవలసిన ఆధునిక సాంకేతిక విజ్ఞానం, నిజానికి ఉద్యోగస్థలంలోని ఒత్తిళ్ళను అధికం చేసింది. ఉదాహరణకు కంప్యూటర్లు, ఫాక్స్‌ మెషీన్‌లు, ఇంటర్నెట్‌లు ఉద్యోగస్థులు తమ పనివేళల తర్వాత మిగిలిన పనిని ఇంటికి తీసుకువెళ్ళగలిగేలా చేస్తున్నాయి. తద్వారా ఇంటికీ ఆఫీసుకూ మధ్య వున్న తేడా అస్పష్టమవుతోంది. తన సంస్థ తనకిచ్చిన పేజర్‌, సెల్‌ ఫోను తన మెడకు తగిలించిన అదృశ్యమైన గొలుసుల వంటివనీ తన యజమాని అవసరమైనప్పుడల్లా ఒక కుక్కను లాగినట్లు వాటితో తనను లాగుతాడనీ ఒక ఉద్యోగి భావిస్తున్నాడు.

అతివేగంగా మారిపోతున్న ఆర్థిక, ఉద్యోగ వాతావరణంలో, ఉద్యోగ విరమణ పొందాల్సిన సమయం రాకముందే తాము నిష్క్రియులుగా దృష్టించబడతామనే భయం చాలామంది వయోజనుల్లో అధికమవుతోంది. ఈ విషయంలో మానవ హక్కుల మాజీ కమీషనర్‌ క్రిస్‌ సిడొటి ఇలా అన్నారు: “మీ వయస్సు 40 సంవత్సరాలలోపు ఉండకపోతే, మీరు కంప్యూటర్లతో కొత్త సాంకేతిక విజ్ఞానంతో వ్యవహరించలేరనే స్థిరమైన అభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోంది.” కాబట్టి ఒకప్పుడు తమ జీవితంలోని అత్యంత ఫలవంతమైన కాలంలోవున్న ప్రతిభగల పనివారిగా దృష్టించబడినవారే నేడు ఉపయోగకరంగా ఉండలేనంతటి వృద్ధులుగా దృష్టించబడుతున్నారు. ఎంతటి విషాదకరమైన విషయం!

సాధారణంగా పనిలో నీతి నియమాలను పాటించడం, సంస్థలపట్ల విశ్వసనీయత ఇటీవలి సంవత్సరాలలో తీవ్రంగా దిగజారిపోవడం అర్థం చేసుకోదగినదే. “స్టాక్‌ మార్కెట్‌ ధరలలో స్వల్పమైన తేడా కనిపించగానే సంస్థలు తమ ఉద్యోగస్థులను పనిలోనుండి తీసివేసినప్పుడు, ఆ సంస్థలకు విశ్వసనీయంగా ఉండాలనేది ఏమంత ప్రాముఖ్యం కాని విషయమైపోతోంది. మీరు పనిచేయక తప్పదు, అయితే అది కేవలం మీ వ్యక్తిగత సంక్షేమం కోసం మాత్రమే, సంస్థ సంక్షేమం కోసం కాదు” అని ఫ్రెంచి పత్రిక లిబరేషన్‌ చెబుతోంది.

ఈ సమస్యలు పెరిగిపోతున్నప్పటికీ పని చేయవలసిన మానవ ప్రాథమిక అవసరం అలాగే ఉంది. కాబట్టి అతివేగంగా మారిపోతున్న మన కాలంలో, ఒక వ్యక్తి ఉద్యోగం గురించి సమతుల్యమైన దృక్కోణాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు, అదే సమయంలో ఉద్యోగంలో భద్రతా భావాన్నీ సంతృప్తినీ ఎలా కాపాడుకోవచ్చు?

[3వ పేజీలోని చిత్రం]

ఆధునిక సాంకేతిక విజ్ఞానం, ఉద్యోగస్థలంలో ఒత్తిడిని అధికం చేసి ఉండవచ్చు