కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నా వాక్యమందు నిలిచి” ఉండండి

“నా వాక్యమందు నిలిచి” ఉండండి

“నా వాక్యమందు నిలిచి” ఉండండి

“మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై” ఉందురు.​—⁠యోహాను 8:31.

క్రైస్తవత్వ సంస్థాపకుడైన యేసుక్రీస్తు పరలోకానికి తిరిగి వెళ్ళేటప్పుడు, ఆయన ఈ భూమిపై తాను వ్రాసిన పుస్తకాలనో, తాను నిర్మించిన స్మారక చిహ్నాలనో, తాను సమకూర్చిన ధనాన్నో వదిలివెళ్ళలేదు. అయితే ఆయన శిష్యులతోపాటు, శిష్యులుగా ఉండడానికి అవసరమైన నిర్దిష్టమైన విధులను వదిలివెళ్ళాడు. వాస్తవానికి, తన అనుచరులుగా ఉండాలనుకునే వారు నెరవేర్చవలసిన మూడు ప్రాముఖ్యమైన విధుల గురించి యోహాను సువార్తలో యేసు ప్రస్తావించాడని మనం తెలుసుకుంటాము. ఏమిటా విధులు? వాటిని నెరవేర్చడానికి మనమేమి చేయవచ్చు? నేడు మనం వ్యక్తిగతంగా క్రీస్తు శిష్యులుగా ఉండడానికి అర్హులమని ఎలా నిశ్చయించుకోవచ్చు? *

2 యేసు తన మరణానికి దాదాపు ఆరు నెలల ముందు యెరూషలేముకు వెళ్ళి, వారం రోజులుండే పర్ణశాలల పండుగను ఆచరించడానికి అక్కడ సమకూడిన సమూహాలకు ప్రకటించాడు. ఫలితంగా, సగము పండుగయ్యేసరికి “జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముం[చారు].” ఆ తర్వాత కూడా యేసు ప్రకటించడం కొనసాగించాడు, దానితో పండుగ చివరి దినాన మరోసారి “అనేకు లాయనయందు విశ్వాసముం[చారు].” (యోహాను 7:10, 14, 31, 37; 8:​30) ఆ సమయంలో యేసు తన అవధానాన్ని కొత్తగా విశ్వాసులైన వారివైపుకు మళ్ళించి, శిష్యులుగా ఉండడానికి అవసరమైన ఒక ప్రాముఖ్యమైన విధి గురించి చెప్పాడు, అపొస్తలుడైన యోహాను దాన్నిలా వ్రాశాడు: “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై[యుందురు].” (ఇటాలిక్కులు మావి.)​—⁠యోహాను 8:​31.

3 ఆ మాటలతో యేసు, కొత్తగా శిష్యులైన వారికి విశ్వాసం కొరవడిందనేమీ సూచించడం లేదు. బదులుగా వారు తన వాక్యమందు నిలిచివున్నట్లయితే, అంటే వారు ఒకవేళ సహనం చూపిస్తే, తన నిజమైన శిష్యులయ్యే అవకాశం వారి ఎదుట ఉంటుందని ఆయన సూచిస్తున్నాడు. వారు ఆయన వాక్యాన్ని అంగీకరించారు, కానీ ఇప్పుడు వారు దానిలో కొనసాగవలసిన అవసరం ఉంది. (యోహాను 4:34; హెబ్రీయులు 3:​13-15) వాస్తవానికి యేసు, సహనాన్ని తన అనుచరులు కలిగివుండవలసిన ఎంతో ప్రాముఖ్యమైన లక్షణంగా దృష్టించాడు అందుకే, యోహాను సువార్తలో వ్రాయబడివున్నట్లుగా, ఆయన తాను తన అపొస్తలులతో చివరిసారిగా సంభాషించినప్పుడు, “నన్ను వెంబడించం[డి]” అని రెండుసార్లు ప్రోత్సహించాడు. (యోహాను 21:​19, 22) తొలి క్రైస్తవుల్లో చాలామంది అలాగే చేశారు. (2 యోహాను 4) అయితే సహనంతో కొనసాగడానికి వారికేమి సహాయపడింది?

4 దాదాపు ఏడు దశాబ్దాలపాటు నమ్మకస్థుడైన క్రీస్తు శిష్యుడిగా ఉన్న అపొస్తలుడైన యోహాను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని సూచించాడు. “మీరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు” అంటూ ఆయన విశ్వసనీయులైన క్రైస్తవులను మెచ్చుకున్నాడు. క్రీస్తు యొక్క ఆ శిష్యులు సహించారు లేదా దేవుని వాక్యమందు నిలిచివున్నారు, ఎందుకంటే దేవుని వాక్యం వారిలో నిలిచియున్నది. దానిపట్ల వారికి హృదయపూర్వకమైన మెప్పు ఉంది. (1 యోహాను 2:​14, 24) అలాగే నేడు, ‘అంతమువరకు సహించడానికి’ దేవుని వాక్యం మనలో నిలిచి ఉండేలా నిశ్చయపరచుకోవలసిన అవసరం ఉంది. (మత్తయి 24:​13) అది మనమెలా చేయగలం? దానికి యేసు చెప్పిన ఒక ఉపమానం సమాధానమిస్తుంది.

‘వాక్యం వినడం’

5 విత్తువాని గురించిన ఉపమానాన్ని యేసు చెప్పాడు, అది మత్తయి, మార్కు, లూకా సువార్తలలో వ్రాయబడి ఉంది. (మత్తయి 13:1-9, 18-23; మార్కు 4:1-9, 14-20; లూకా 8:​4-8, 11-15) మీరు ఆ వృత్తాంతాలను చదువుతుండగా, ఒకే రకమైన విత్తనాలు వివిధ రకాల నేలలపై పడి విభిన్నమైన ఫలితాలను ఉత్పన్నం చేయడం ఆ ఉపమానం యొక్క కీలకాంశమని గమనిస్తారు. మొదటిది గట్టి నేల, రెండవది మన్ను లోతుగా లేని నేల, మూడవది ముండ్లపొదలు పెరిగిన నేల. నాలుగవది, మిగతా మూడింటిలా కాక అది “మంచినేల.” యేసు స్వయంగా ఇచ్చిన వివరణ ప్రకారం, విత్తనం దేవుని వాక్యంలో ఉన్న రాజ్య సందేశం, నేల వివిధ హృదయ పరిస్థితులు గల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. వివిధ నేలలచే సూచించబడిన ప్రజలకు కొన్ని విషయాలు ఒకేలా ఉన్నప్పటికీ మంచినేలచే సూచించబడిన వారికి ఒక ప్రత్యేకత ఉంది, అదే వారిని ఇతరుల నుండి భిన్నంగా ఉంచుతుంది.

6 నాలుగు సందర్భాల్లోనూ ప్రజలు ‘వాక్యమును విన్నారు’ అని లూకా 8:12-15 వచనాల్లోని వృత్తాంతం చూపిస్తోంది. అయితే “యోగ్యమైన మంచి మనస్సు” గలవారు, ‘వినడం’ కంటే ఎక్కువే చేస్తారు. వారు “దానిని అవలంబించి ఓపికతో ఫలి[స్తా]రు.” మెత్తగా లోతుగా ఉండే మంచి నేల, విత్తనపు వేర్లు క్రిందికి దిగడానికి అనుమతిస్తుంది, తత్ఫలితంగా విత్తనం మొలకెత్తి ఫలాలను ఉత్పన్నం చేస్తుంది. (లూకా 8:⁠8) అదే విధంగా మంచి మనస్సుగలవారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, దాన్ని విలువైనదిగా ఎంచుతారు, దాన్ని అవలంబిస్తారు. (రోమీయులు 10:10; 2 తిమోతి 2:⁠7) దేవుని వాక్యం వారిలో నిలిచి ఉంటుంది. దాని ఫలితంగా, వారు సహనంతో ఫలాలను ఫలిస్తారు. కాబట్టి క్రీస్తు శిష్యులుగా సహనం చూపించడానికి, దేవుని వాక్యం విలువైనదని గాఢంగా, హృదయపూర్వకంగా గుర్తించడం ఆవశ్యకం. (1 తిమోతి 4:​15) అయితే మనం దేవుని వాక్యంపట్ల అలాంటి హృదయపూర్వకమైన ప్రశంసను ఎలా పెంపొందించుకోవచ్చు?

హృదయ పరిస్థితి, అర్థవంతమైన ధ్యానము

7 యోగ్యమైన మంచి హృదయాన్ని బైబిలు పదే పదే ఏ క్రియతో జతచేస్తుందో గమనించండి. “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును [“ధ్యానించును,” NW].” (సామెతలు 15:​28) “యెహోవా . . . నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.” (ఇటాలిక్కులు మావి.) (కీర్తన 19:​14) “నా హృదయ ధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.” (ఇటాలిక్కులు మావి.)​—⁠కీర్తన 49:⁠3.

8 ఈ బైబిలు రచయితల్లాగే మనం కూడా దేవుని వాక్యం గురించి ఆయన కార్యశీలత గురించి ప్రశంసాపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలి. బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను చదివేటప్పుడు మనం, ప్రకృతి సౌందర్యాన్ని ఏమాత్రం ఆస్వాదించకుండా కేవలం ఫోటోలు తీసుకుంటూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి హడావుడిగా తిరిగే సందర్శకుల్లా ప్రవర్తించకూడదు. బదులుగా, బైబిలు అధ్యయనం చేసేటప్పుడు, లేఖనాలను ఆనందించడానికి సమయం తీసుకోవాలనుకుంటాము. * ప్రశాంతంగా మనం చదివిన దాని గురించి ధ్యానిస్తుండగా, దేవుని వాక్యం మన హృదయంపై ప్రభావం చూపిస్తుంది. అది భావోద్వేగాలను స్పృశించి, మన ఆలోచనా విధానాన్ని మలుస్తుంది. మనం మన అంతరంగ తలంపులను ప్రార్థనలో దేవునితో పంచుకునేలా కూడా అది మనల్ని పురికొల్పుతుంది. తత్ఫలితంగా యెహోవాతో మన సంబంధం బలపర్చబడుతుంది, సవాలుదాయకమైన పరిస్థితుల్లో సహితం యేసును అనుసరించడానికి దేవుని పట్ల మనకున్న ప్రేమ మనల్ని పురికొల్పుతుంది. (మత్తయి 10:​22) మనం అంతం వరకు నమ్మకంగా ఉండాలంటే దేవుడు చెప్పేదాని గురించి ధ్యానించడం ఆవశ్యకమని స్పష్టమవుతోంది.​—⁠లూకా 21:​19.

9 దేవుని వాక్యమనే విత్తనం ఎదగడానికి అడ్డంకులుంటాయని కూడా యేసు ఉపమానం చూపిస్తోంది. కాబట్టి మనం నమ్మకస్థులైన శిష్యులుగా ఉండడానికి, (1) ఉపమానంలో ప్రస్తావించబడిన అననుకూలమైన నేల పరిస్థితులు సూచిస్తున్న అడ్డంకులను గుర్తించాలి, (2) వాటిని సరిచేసుకోవడానికి లేదా నివారించడానికి చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా, మనం మన హృదయం రాజ్య విత్తనాన్ని స్వీకరించే విధంగావుండి ఫలాలు ఫలించేలా నిశ్చయపరచుకుంటాము.

“త్రోవ ప్రక్కన” పడడం అంటే ఇతర విషయాల్లో నిమగ్నమై ఉండడం

10 విత్తనం పడే మొదటి రకమైన నేల “త్రోవ ప్రక్కన,” అక్కడ విత్తనం ‘త్రొక్కబడుతుంది.’ (లూకా 8:⁠5) పంటచేలగుండా వెళ్ళే త్రోవ ప్రక్కనుండే నేల పాదచారులు అటూ ఇటూ తిరగడం వల్ల గట్టిపడి ఉంటుంది. (మార్కు 2:​23) అదేవిధంగా, తమ సమయాన్ని, శక్తిని ఈ లోకపు విస్తృత కార్యకలాపాలకు ఎక్కువగా కేటాయించేవారు దేవుని వాక్యం పట్ల హృదయపూర్వక ప్రశంసను వృద్ధి చేసుకోలేనంతగా తాము ఇతర విషయాల్లో నిమగ్నమైవున్నట్లు తెలుసుకుంటారు. వారు దాన్ని వింటారు, కానీ ధ్యానించరు. దానితో వారి హృదయం ప్రతిస్పందనలేని స్థితిలో ఉండిపోతుంది. దానిపట్ల వారు ప్రేమను వృద్ధి చేసుకోకముందే, వారు “నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమెత్తికొని పోవును.” (లూకా 8:​12) దీన్ని నిరోధించగలమా?

11 హృదయం త్రోవ ప్రక్కనుండే ఫలవంతంకాని నేలలా తయారవకుండా నిరోధించడానికి చేయగలిగింది ఎంతో ఉంది. గట్టిపడిన నేలను దున్ని, ఇక మనుష్యులు దానిపై నడవకుండా ఉంటే నేల మెత్తబడి ఫలవంతమవుతుంది. అదేవిధంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, ధ్యానించడానికి సమయాన్ని వెచ్చిస్తే మన హృదయం మంచి సారవంతమైన నేలగా మారుతుంది. జీవితంలోని సాధారణ విషయాలలో ఎక్కువగా నిమగ్నమవకుండా ఉండడమే దానికి కీలకం. (లూకా 12:​13-15) జీవితంలోని “శ్రేష్ఠమైన కార్యముల” గురించి ధ్యానించడానికి సమయం ఉండేలా నిశ్చయపర్చుకోండి.​—⁠ఫిలిప్పీయులు 1:​9-11.

“రాతినేలన” పడడం అంటే భయపడడం

12 విత్తనం రెండవ రకమైన నేలపై పడినప్పుడు మొదటి సందర్భంలో ఉన్నట్లు అది పైనే ఉండిపోదు. అది వేళ్ళూని మొలకెత్తుతుంది. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ వేడికి ఆ మొలక మాడి ఎండిపోతుంది. అయితే ఈ విశేషమైన వివరణను గమనించండి. మొలక ఎండిపోవడానికి అసలు కారణం ఎండ కాదు. నిజానికి మంచి నేలలో మొలకెత్తే మొక్కపై కూడా ఎండ పడుతుంది, కానీ అది ఎండిపోదు బదులుగా అది చక్కగా పెరుగుతుంది. ఎందుకీ తేడా? “అక్కడ మన్ను లోతుగా ఉండనందున,” “చెమ్మలేనందున” ఈ మొలక ఎండిపోతుందని యేసు వివరిస్తున్నాడు. (మత్తయి 13:5, 6; లూకా 8:⁠6) నేల పైపొర క్రింద ఉండే “రాతినేల,” విత్తనం తగినంత చెమ్మను, స్థిరత్వాన్ని పొందగలిగేలా తన వేర్లను క్రిందికి పంపించకుండా నిరోధిస్తుంది. మన్ను లోతుగా లేనందున మొలక ఎండిపోతుంది.

13 ఉపమానంలోని ఈ భాగం “వాక్యమును సంతోషముగా అంగీకరిం[చి] . . . కొంచెము కాలము” యేసును అత్యంతాసక్తితో అనుసరించే వ్యక్తులను సూచిస్తుంది. (లూకా 8:​13) ‘శ్రమ, హింస’ వంటి తీవ్రమైన ఎండ వేడి తగిలినప్పుడు వారు ఎంతగా భయపడిపోతారంటే వారు తమ ఆనందాన్ని శక్తిని కోల్పోయి క్రీస్తును అనుసరించడం మానేస్తారు. (మత్తయి 13:​21) అయితే వారి భయానికి అంతర్గత కారణం వ్యతిరేకత కాదు. ఎంతైనా క్రీస్తు శిష్యులైన లక్షలాదిమంది వివిధ రకాలైన శ్రమలను సహిస్తూ కూడా నమ్మకంగానే ఉన్నారు. (2 కొరింథీయులు 2:4; 7:⁠5) కొందరు భయపడిపోయి సత్యము నుండి తొలగిపోవడానికి అసలు కారణమేమిటంటే, రాతినేల వంటి వారి హృదయ పరిస్థితి ప్రోత్సాహకరమైన ఆధ్యాత్మిక విషయాల గురించి వారు తగినంతగా ధ్యానించకుండా నిరోధిస్తుంది. తత్ఫలితంగా, యెహోవాపట్ల ఆయన వాక్యంపట్ల వారు వృద్ధి చేసుకునే మెప్పుదల కేవలం అల్పమైనది, వ్యతిరేకతను తట్టుకోలేనంత బలహీనమైనదవుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఒకరు ఎలా నిరోధించుకోవచ్చు?

14 ఒక వ్యక్తి లోతుగా పాతుకుపోయిన విద్వేషం, పైకి కనిపించకుండా ఉండే స్వీయాసక్తి, లేదా అటువంటి కఠినమైనవే కానీ పైకి కనిపించని భావాలు మొదలైన రాళ్ళలాంటి అవరోధాలు తన హృదయంలో స్థిరపడిపోకుండా నిశ్చయపరచుకోవాలి. ఇప్పటికే అలాంటి అవరోధం ఉంటే, దేవుని వాక్యం చూపించే శక్తి దాన్ని తీసివేయగలదు. (యిర్మీయా 23:29; ఎఫెసీయులు 4:22; హెబ్రీయులు 4:​12) ఆ తర్వాత, ప్రార్థనాపూర్వక ధ్యానం ఆ వ్యక్తి హృదయంలో “వాక్యము” లోతుగా ‘నాటబడేలా’ పురికొల్పుతుంది. (యాకోబు 1:​21) ఇది నిరుత్సాహపూరిత సమయాలను ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని, శ్రమలున్నప్పటికీ నమ్మకంగా ఉండడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది.

“ముండ్లపొదల నడుమ” పడడం అంటే విభాగింపబడిన హృదయం

15 ముండ్లపొదలున్న మూడవ రకమైన నేల, ప్రత్యేకంగా మన అవధానాన్ని పొందదగినది ఎందుకంటే అది కొన్ని విషయాల్లో మంచి నేలవంటిదే. మంచి నేలలోలాగే, ముండ్లపొదలున్న నేలపై పడిన విత్తనం వేళ్ళూని మొలకెత్తుతుంది. మొదట్లో, ఈ రెండు రకాల నేలల్లో మొక్క ఎదిగే విషయంలో ఏ తేడా లేదు. అయితే సమయం గడుస్తుండగా, ఆ మొక్క ఎదుగుదలను నిరోధించి దాన్ని అణచివేసే పరిస్థితి ఏర్పడుతుంది. మంచి నేలలా కాకుండా ఈ నేల నిండా ముండ్లపొదలు మొలుస్తాయి. లేత మొక్క ఈ నేల నుండి ఎదుగుతుండగా, ‘దానితోపాటు మొలిచే ముండ్లపొదల’ నుండి దానికి పోటీ ఎదురవుతుంది. కొంతకాలంపాటు రెండు పంటలూ పోషణ కోసం, వెలుగు కోసం, స్థలం కోసం పోటీ పడతాయి కానీ చివరికి ముండ్లపొదలు విజృంభించి, పెరుగుతున్న మొక్కను ‘అణచివేస్తాయి.’​—⁠లూకా 8:⁠7.

16 ఎలాంటి వ్యక్తులు ముండ్లపొదలున్న నేలను పోలివుంటారు? యేసు ఇలా వివరిస్తున్నాడు: “ముండ్లపొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.” (లూకా 8:​14) విత్తబడిన విత్తనము, ముండ్లపొదలు నేలలో ఒకేసారి పెరిగినట్లుగానే, కొంతమంది వ్యక్తులు తమ జీవితంలో దేవుని వాక్యానికీ “ధనభోగముల[కూ]” ఒకే సమయంలో చోటివ్వడానికి ప్రయత్నిస్తారు. దేవుని వాక్య సత్యం వారి హృదయంలో నాటబడుతుంది కానీ వారి అవధానాన్ని పొందడానికి ప్రయత్నించే ఇతర ప్రయాసల నుండి దానికి పోటీ ఎదురవుతుంది. వారి అలంకారిక హృదయం విభాగించబడింది. (లూకా 9:​57-62) ఇది వారు దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా అర్థవంతంగా ధ్యానించడానికి తగినంత సమయాన్ని వెచ్చించకుండా నిరోధిస్తుంది. వారు దేవుని వాక్యాన్ని పూర్తిగా అవలంబించడంలో విఫలమవుతారు, దానితో సహించడానికి కావలసిన హృదయపూర్వకమైన మెప్పుదల వారికి కొరవడుతుంది. మెల్లగా, వారి ఆధ్యాత్మిక ఆసక్తుల స్థానాన్ని ఆధ్యాత్మికేతర విషయాల కోసమైన ప్రయాస ఎంతగా ఆక్రమించుకుంటుందంటే చివరికి వారు పూర్తిగా “అణచివేయ”బడతారు. * యెహోవాను హృదయపూర్వకంగా ప్రేమించని వారికి ఎంత దుఃఖకరమైన అంతమో కదా!​—⁠మత్తయి 6:24; 22:​37.

17 వస్తుసంబంధమైన వాటికంటే ఆధ్యాత్మిక విషయాలకు అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా మనం ఈ లోకంలోని బాధలు, విలాసాలు మనల్ని అణచివేయకుండా తప్పించుకుంటాము. (మత్తయి 6:31-33; లూకా 21:​34-36) బైబిలు చదవడాన్ని, మనం చదివిన దాన్ని ధ్యానించడాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. సాధ్యమైనంత మేరకు మన జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకుంటే ఏకాగ్రతతో ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడానికి మనకు ఎక్కువ సమయం లభిస్తుంది. (1 తిమోతి 6:​6-8) అలా చేసిన దేవుని సేవకులు, ఒక విధంగా చెప్పాలంటే, ఫలించే మొక్కలకు మరింత పోషణను, వెలుగును, స్థలాన్ని ఇచ్చేందుకు ముండ్లపొదలను కూకటివేళ్ళతో పెరికివేసిన వారు యెహోవా ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు. ఇరవై ఆరేళ్ళ సాండ్రా ఇలా అంటోంది: “సత్యంలో నాకు లభించిన ఆశీర్వాదాల గురించి నేను ధ్యానించినప్పుడు, వాటిని పోలిన దేనినీ ఈ లోకం నాకివ్వలేదని నేను గ్రహిస్తాను!”​—⁠కీర్తన 84:11.

18 కాబట్టి మనం యౌవనులమైనా వృద్ధులమైనా దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నంతవరకూ మనం దేవుని వాక్యంలోనే ఉండి క్రీస్తు శిష్యులుగా సహిస్తాము. అందుకే, మన అలంకారిక హృదయపు నేల ఎన్నడూ గట్టిపడిపోకుండా, మన్ను లోతుగా లేని నేలలా తయారవకుండా, ముండ్లపొదలు విపరీతంగా పెరిగిపోకుండా మెత్తగా లోతుగా ఉండేలా నిశ్చయపర్చుకుందాము. ఆ విధంగా, మనం దేవుని వాక్యాన్ని పూర్తిగా అవలంబిస్తూ ‘ఓపికతో ఫలించ’ గలుగుతాము.​—⁠లూకా 8:​15.

[అధస్సూచీలు]

^ పేరా 3 మనం ఈ శీర్షికలో, ఆ మూడు విధుల్లో మొదటిదాన్ని పరిశీలిస్తాం. మిగతా రెండు దీని తర్వాతి ఆర్టికల్‌లలో చర్చించబడతాయి.

^ పేరా 12 ఉదాహరణకు, మీరు చదివిన బైబిల్లోని కొంతభాగాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడానికి, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవచ్చు: ‘ఇది యెహోవా లక్షణాల్లో ఒక్కదాన్నో లేక ఇంకా ఎక్కువో బయలుపరుస్తోందా? బైబిలు చర్చాంశంతో ఇదెలా సంబంధం కలిగివుంది? దీన్ని నేను నా జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు లేదా ఇతరులకు సహాయం చేయడానికి దీన్ని నేనెలా ఉపయోగించవచ్చు?’

^ పేరా 23 యేసు ఉపమానం ఉన్న మూడు సువార్త వృత్తాంతాల ప్రకారం, విత్తనం ఈ లోకంలోని బాధలు, విలాసాలతో అణచివేయబడుతుంది: “ఐహిక విచారములు,” “ధనమోసము,” “ఇతరమైన అపేక్షలు,” “యీ జీవన సంబంధమైన విచారము[లు].”​—⁠మత్తయి 13:22; మార్కు 4:​18, 19; లూకా 8:14; యిర్మీయా 4:3, 4.

మీరెలా సమాధానమిస్తారు?

• మనం ‘యేసు వాక్యములో’ ఎందుకు నిలిచివుండాలి?

• దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉండడానికి మనమెలా అనుమతించవచ్చు?

• యేసు ప్రస్తావించిన నాలుగు రకాల నేలలు ఎలాంటి వ్యక్తులను సూచిస్తున్నాయి?

• దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సమయాన్ని ఎలా సంపాదించుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. (ఎ) యేసు పరలోకానికి తిరిగి వెళ్ళేటప్పుడు, ఆయన భూమిపై ఏమి వదిలివెళ్ళాడు? (బి) మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాము?

2. యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నట్లు శిష్యులుగా ఉండడానికి అవసరమైన, ప్రాముఖ్యమైన ఒక విధి ఏమిటి?

3. ఒకరు “[యేసు] వాక్యమందు నిలిచి” ఉండడానికి అవసరమైన లక్షణమేమిటి?

4. తొలి క్రైస్తవులు సహించడానికి వారికేమి సహాయం చేసింది?

5. (ఎ) యేసు తన ఉపమానాల్లో ఒకదానిలో ఏ యే వివిధ రకాల నేలలను ప్రస్తావించాడు? (బి) యేసు ఉపమానంలోని విత్తనం, నేల దేన్ని సూచిస్తున్నాయి?

6. (ఎ) యేసు ఉపమానంలోని నాలుగవ రకమైన నేల, మిగతా మూడు రకాల నేలలకు ఎలా భిన్నంగా ఉంది, దాని భావమేమిటి? (బి) క్రీస్తు శిష్యులుగా సహనం చూపించడానికి ఏది ఆవశ్యకం?

7. మంచి హృదయానికి సన్నిహితంగా జతచేయబడిన క్రియ ఏది?

8. (ఎ) బైబిలు చదివేటప్పుడు, మనం దేన్ని నివారించాలి, ఏమి చేయాలి? (బి) దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం ద్వారా మనమే ప్రయోజనాలను పొందుతాము? (“సత్యమందు స్థిరపరచబ[డ్డారు]” అనే బాక్సును చేర్చండి.)

9. మన హృదయం దేవుని వాక్యాన్ని అవలంబించే విధంగా ఉండేలా మనమెలా నిశ్చయపరచుకోవచ్చు?

10. యేసు ఉపమానంలోని మొదటి రకమైన నేలను వర్ణించండి, దాని భావాన్ని వివరించండి.

11. మన హృదయం గట్టిపడిన నేలలా తయారవకుండా మనమెలా నిరోధించవచ్చు?

12. యేసు ఉపమానంలో పేర్కొనబడిన రెండవ రకమైన నేలలో మొలిచిన మొలక ఎండిపోవడానికి అసలు కారణం ఏమిటి?

13. ఎలాంటి వ్యక్తులు మన్ను లోతుగా లేని నేలను పోలి ఉన్నారు, వారు అలా ప్రతిస్పందించడానికి అసలు కారణమేమిటి?

14. ఒక వ్యక్తి తన హృదయం మన్ను లోతుగా లేని నేలలా కాకుండా ఉంచుకోవడానికి ఏ చర్యలు తీసుకోవాలి?

15. (ఎ) యేసు పేర్కొన్న మూడవ రకమైన నేల ప్రత్యేకంగా మన అవధానాన్ని పొందడానికి ఎందుకు తగినది? (బి) మూడవ రకమైన నేలకు చివరికి ఏమి జరుగుతుంది, ఎందుకు?

16. (ఎ) ఎలాంటి వ్యక్తులు ముండ్లపొదలున్న నేలను పోలి ఉన్నారు? (బి) మూడు సువార్త వృత్తాంతాల ప్రకారం, ముండ్లపొదలు వేటిని సూచిస్తున్నాయి?​—⁠అధస్సూచి చూడండి.

17. యేసు ఉపమానంలోని అలంకారిక ముండ్లపొదలచే అణచివేయబడకుండా ఉండేందుకు జీవితంలో మనం ఎలాంటి ఎంపికలను చేసుకోవాలి?

18. మనం దేవుని వాక్యంలో నిలిచి ఉండి క్రైస్తవులుగా ఎలా సహించవచ్చు?

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

“సత్యమందు స్థిరపరచబ[డ్డారు]”

ఎంతోకాలంగా క్రీస్తు శిష్యులుగా ఉన్న అనేకులు సంవత్సరాలు గడుస్తుండగా “సత్యమందు స్థిరపరచబ[డ్డారు]” అని నిరూపించుకుంటారు. (2 పేతురు 1:​12) అలా కొనసాగడానికి వారికేమి సహాయం చేస్తుంది? వారు చేసిన కొన్ని వ్యాఖ్యానాలను పరిశీలించండి.

“నేను రాత్రి పడుకునే ముందు బైబిలులోని కొంతభాగం చదువుకొని, ప్రార్థన చేసుకుంటాను. ఆ తర్వాత నేను చదివిన దాని గురించి ఆలోచిస్తాను.”​—⁠జీన్‌, 1939లో బాప్తిస్మం తీసుకుంది.

“ఎంతో ఉన్నతుడైన యెహోవా మనల్ని గాఢంగా ఎలా ప్రేమిస్తాడనే దాని గురించి ధ్యానించడం, నాకు భద్రతాభావాన్ని, విశ్వసనీయంగా ఉండడానికి కావలసిన బలాన్ని ఇస్తుంది.”​—⁠పాట్రీష్య, 1946లో బాప్తిస్మం తీసుకుంది.

“మంచి బైబిలు అధ్యయన అలవాట్లను అంటిపెట్టుకొని ఉండడం ద్వారా, ‘దేవుని మర్మములలో’ నిమగ్నమై ఉండడం ద్వారా నేను కొనసాగగలుగుతున్నాను.”​—⁠1 కొరింథీయులు 2:​10; అన్నా, 1939లో బాప్తిస్మం తీసుకుంది.

“నా హృదయాన్ని, నా ఉద్దేశాలను పరీక్షించుకోవాలనే దృక్కోణంతో నేను బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను చదువుతాను.”​—⁠జెల్డా, 1943లో బాప్తిస్మం తీసుకుంది.

“నేను వ్యాహ్యాళికి వెళుతున్నప్పుడు ప్రార్థనలో యెహోవాతో మాట్లాడుతూ నా మనోభావాలను ఆయనకు తెలిపే సమయాలు నాకెంతో ఇష్టమైన సమయాలు.”​—⁠రాల్ఫ్‌, 1947లో బాప్తిస్మం తీసుకున్నాడు.

“నేను దిన వచనాన్ని పరిశీలించి, బైబిలులో కొంతభాగం చదవడం ద్వారా దినాన్ని ప్రారంభిస్తాను. ఆ దినమంతటిలో ధ్యానించడానికి అది నాకు కొత్త సమాచారాన్నిస్తుంది.”​—⁠మారీ, 1935లో బాప్తిస్మం తీసుకుంది.

“నాకైతే, ఏదైనా బైబిలు పుస్తకం యొక్క ప్రతి వచన చర్చలు నిజమైన టానిక్‌లా పనిచేస్తాయి.”​—⁠డాన్యెల్‌, 1946లో బాప్తిస్మం తీసుకున్నాడు.

మీరు దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడు ధ్యానిస్తారు?​—⁠దానియేలు 6:10; మార్కు 1:35; అపొస్తలుల కార్యములు 10:⁠9.

[13వ పేజీలోని చిత్రం]

ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా మనం ‘ఓపికతో ఫలించ’ వచు