పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ఒక వ్యక్తి తనపై బలాత్కారం చేయబడే ప్రమాదమున్నప్పుడు కేకలు వేయాలని బైబిలు ఎందుకు చెబుతోంది?
క్రూరమైన బలాత్కారానికి తాము స్వయంగా గురికాని వ్యక్తులెవ్వరూ, అది ఒకరి జీవితాన్ని ఎంతగా నాశనం చేయగలదో ఎన్నటికీ నిజంగా అర్థం చేసుకోలేరు. బాధితురాలికి ఆ అనుభవం ఎంతటి భయాన్ని కలిగిస్తుందంటే, ఆమె ఇక తన మిగతా జీవితమంతా దాని గురించి బాధపడవచ్చు. * కొన్ని సంవత్సరాల క్రితం, బలత్కరించబడిన ఒక క్రైస్తవ యువతి ఇలా చెబుతోంది: “ఆ రాత్రి నేను అనుభవించిన అపరిమితమైన భయాన్ని, అప్పటి నుండి నేను అధిగమించవలసి వస్తున్న ఉద్వేగాన్ని నేను మాటల్లో వర్ణించలేను.” చాలామంది ఈ భయంకరమైన విషయం గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడరన్నది అర్థం చేసుకోదగినదే. అయితే ఈ దుష్టలోకంలో బలత్కరించబడే ప్రమాదముందన్నది ఒక వాస్తవం.
గతంలో జరిగిన కొన్ని బలాత్కారాల గురించి, బలాత్కారం చేయడానికి జరిగిన ప్రయత్నాల గురించి వివరించడానికి బైబిలు సిగ్గుపడడం లేదు. (ఆదికాండము 19:4-11; 34:1-7; 2 సమూయేలు 13:1-14) అయితే బలాత్కారం చేయబడే ప్రమాదం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమి చెయ్యాలనే విషయంలో కూడా అది ఉపదేశాన్నిస్తుంది. ఈ విషయం గురించి ధర్మశాస్త్రము ఏమి చెబుతుందో ద్వితీయోపదేశకాండము 22:23-27 వచనాల్లో ఉంది. ఈ వచనాల్లో రెండు సందర్భాల గురించి చెప్పబడింది. మొదటి సందర్భంలో, ఒక వ్యక్తి ఊరిలో యౌవన స్త్రీని చూసి ఆమెతో శయనించాడు. అయినప్పటికీ, ఆ స్త్రీ కేకలు వేయలేదు లేదా సహాయం కోసం అరవలేదు. కాబట్టి, ఆమె “ఊరిలో కేకలు వేయకయున్నందున” ఆమె అపరాధి అన్న నిర్ణయానికి వచ్చారు. ఆమె కేకలు వేసినట్లైతే, దగ్గర్లో ఉన్న ప్రజలు ఆమెను రక్షించేందుకు రాగలిగి ఉండేవారు. రెండవ సందర్భంలో, ఒక వ్యక్తి పొలములో యౌవన స్త్రీని చూసి “ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనిం[చాడు].” ఆత్మరక్షణ కోసం ఆ స్త్రీ “కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.” మొదటి సందర్భంలోని స్త్రీకి భిన్నంగా, ఈ స్త్రీ బలాత్కారం చేసే వ్యక్తి చర్యలను అంగీకరించలేదన్నది స్పష్టమౌతోంది. ఆమె సహాయం కోసం కేకలు వేస్తూ అతనిని తీవ్రంగా నిరోధించింది కానీ అతను ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమె కేకలు వేయడం, ఆ పని ఆమెకు ఇష్టంలేదని నిరూపించింది; ఆమె నిరపరాధి.
నేడు క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రము క్రింద లేకపోయినప్పటికీ అందులో ప్రస్తావించబడిన సూత్రాలు వారికి నడిపింపునిస్తాయి. నిరోధించడం, సహాయం కోసం కేకలు వేయడం యొక్క ప్రాముఖ్యతను పైన పేర్కొన్న నివేదిక ఉన్నతపరుస్తోంది. బలాత్కారం చేయబడే ప్రమాదం ఉన్నప్పుడు కేకలు వేయడం నేడు కూడా తెలివైన పనిగా దృష్టించబడుతోంది. ఒక నేర నిరోధక నిపుణుడు ఇలా నివేదించాడు: “దాడిచేయబడినప్పుడు, ఒక స్త్రీ ఉపయోగించగల అత్యుత్తమమైన ఆయుధం గట్టిగా అరవడమే.” ఒక స్త్రీ కేకలు వేస్తే అది ఇతరులను ఆకర్షిస్తుంది అప్పుడు వారామెకు సహాయం చేయగలుగుతారు లేదా ఆమెపై దాడిచేస్తున్న వ్యక్తిని భయపెట్టి అతను ఆమెను వదిలివెళ్ళిపోయేలా చేస్తుంది. బలత్కరించబడిన ఒక క్రైస్తవ యువతి ఇలా చెబుతోంది: “నేను నా శక్తినంతా ఉపయోగించి అరిచాను, అతను దూరంగా జరిగిపోయాడు. అతను మళ్ళీ నా వైపుకు వచ్చినప్పుడు నేను అరిచి పరుగెత్తడం ప్రారంభించాను. ‘ఒక బలమైన వ్యక్తి బలాత్కారం చేసే ఉద్దేశంతో నన్ను పట్టుకున్నప్పుడు కేకలు వేయడం ఎలా సహాయపడగలదు?’ అని గతంలో నేను తరచూ ఆలోచించేదాన్ని. కానీ అది నిజంగా పనిచేస్తుందని నేను ఇప్పుడు నేర్చుకున్నాను!”
ఒక స్త్రీ లొంగదీసుకోబడి బలాత్కారం చేయబడిన విషాదకరమైన సందర్భంలో కూడా, ఆమె చేసే ప్రయత్నమూ సహాయం కోసం కేకలు వేయడమూ వ్యర్థమైనవి కాదు. దానికి భిన్నంగా, తనపై దాడిచేస్తున్న వ్యక్తిని నిరోధించడానికి ఆమెకు సాధ్యమైనదంతా ఆమె చేసిందని అవి నిరూపిస్తాయి. (ద్వితీయోపదేశకాండము 22:26) బలాత్కారం చేయబడినప్పటికీ ఆమె నిర్మలమైన మనస్సాక్షిని, ఆత్మగౌరవాన్ని, దేవుని దృష్టిలో ఇప్పటికీ పరిశుద్ధంగానే ఉన్నానన్న నిశ్చయతను కలిగివుండవచ్చు. ఈ భయంకరమైన అనుభవం ఆమెకు భావోద్రేక గాయాలను కలుగజేయవచ్చు, కానీ దాడిని తప్పించుకోవడానికి తాను చేయగలిగిందంతా తాను చేశానని తెలుసుకోవడం ఆమె క్రమంగా కోలుకోవడానికి ఎంతో సహాయపడుతుంది.
ద్వితీయోపదేశకాండము 22:23-27 వచనాల అన్వయింపును అర్థం చేసుకునేటప్పుడు, ఈ క్లుప్తమైన నివేదికలో మనకు ఎదురవ్వగల అవకాశమున్న పరిస్థితులన్నీ చేర్చబడలేదని మనం గ్రహించాలి. ఉదాహరణకు, దాడిచేయబడిన స్త్రీ మూగదైతే, ఆమె స్పృహ తప్పిపోతే, భయంతో బిగుసుకుపోతే లేదా చెయ్యి అడ్డుపెట్టడం ద్వారా నోటికి టేప్ వేయడం ద్వారా ఆమె అరవకుండా నివారించబడే సందర్భాల వంటివాటి గురించి అది వ్యాఖ్యానించడం లేదు. అయినప్పటికీ యెహోవా మానవుల ఉద్దేశాలతో పాటు అన్ని విషయాలను గ్రహించగలడు కాబట్టి, ఇలాంటి సందర్భాల్లో ఆయన అవగాహనతో, న్యాయంగా వ్యవహరిస్తాడు ఎందుకంటే “ఆయన చర్యలన్నియు న్యాయములు.” (ద్వితీయోపదేశకాండము 32:4) ఒకానొక సంఘటనలో నిజంగా ఏమి జరిగిందో, దాడిచేసే వ్యక్తిని నిరోధించడానికి బాధితురాలు ఎలా కృషి చేసిందో ఆయనకు తెలుసు. కాబట్టి, కేకలు వేయడానికి సాధ్యమవ్వకపోయినా, ఆ పరిస్థితుల్లో తాను చేయగలిగినదంతా చేసిన స్త్రీ ఆ విషయాన్ని యెహోవా చేతుల్లో వదిలివేయవచ్చు.—కీర్తన 55:22; 1 పేతురు 5:7.
అలా చేసిన తర్వాత కూడా, బలాత్కారం చేయబడిన క్రైస్తవ స్త్రీలు తదేకంగా అపరాధ భావాలతో బాధపడుతున్నారు. జరిగినదాని గురించి ఆలోచించినప్పుడు, ఆ సంఘటన జరగకుండా ఆపడానికి వారు ఇంకా ఎక్కువ ప్రయత్నించవలసిందని వారికనిపిస్తుంది. అయితే, అలాంటి బాధితులు తమనుతాము నిందించుకునే బదులు యెహోవాకు ప్రార్థించి, ఆయన సహాయాన్ని అడిగి, ఆయన విస్తారమైన ప్రేమపూర్వక దయయందు దృఢవిశ్వాసముంచాలి.—నిర్గమకాండము 34:6; కీర్తన 86:5.
కాబట్టి, బలాత్కారితో జరిగిన పోరాటంవల్ల కలిగిన భావోద్రేక గాయాలతో ప్రస్తుతం బాధపడుతున్న క్రైస్తవ స్త్రీలు, తాము అనుభవిస్తున్న బాధాకరమైన భావాలను యెహోవా పూర్తిగా అర్థంచేసుకుంటాడన్న నమ్మకంతో ఉండవచ్చు. దేవుని వాక్యం వారికిలా హామీ ఇస్తుంది: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్తన 34:18) ఆ సంఘటన తర్వాత వారు అనుభవించే బాధతో వ్యవహరించేందుకు, క్రైస్తవ సంఘంలోని తోటి విశ్వాసుల నిజమైన శ్రద్ధను, దయతో కూడిన మద్దతును స్వీకరించడం మరింతగా దోహదపడగలదు. (యోబు 29:12; 1 థెస్సలొనీకయులు 5:14) అంతేకాకుండా, ప్రోత్సాహకరమైన ఆలోచనల మీద అవధానం నిలపడానికి బాధితులు వ్యక్తిగతంగా కృషి చేస్తే వారు “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము”ను పొందడానికి అది సహాయపడుతుంది.—ఫిలిప్పీయులు 4:6-9.
[అధస్సూచి]
^ పేరా 3 ఈ ఆర్టికల్ బాధితులైన స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పటికీ చర్చించబడిన సూత్రాలు బలాత్కారానికి గురయ్యే ప్రమాదమున్న పురుషులకు కూడా అన్వయిస్తాయి.