కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు బ్రెజిల్‌లో రాజ్య సందేశాన్ని “వింటున్నారు”

వారు బ్రెజిల్‌లో రాజ్య సందేశాన్ని “వింటున్నారు”

రాజ్య ప్రచారకుల నివేదిక

వారు బ్రెజిల్‌లో రాజ్య సందేశాన్ని “వింటున్నారు”

చెవిటివారికి రాజ్య సువార్తను ప్రకటించడానికి, బ్రెజిల్‌లోని యెహోవాసాక్షుల్లో అనేకులు బ్రెజీలియన్‌ సంజ్ఞా భాషను నేర్చుకోవడమనే క్లిష్టమైన నియామకాన్ని చేపట్టారు. క్రింద ఇవ్వబడిన అనుభవాలు స్పష్టపరుస్తున్నట్లు వారి కృషి అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తోంది.

సావో పౌలోకు చెందిన ఈవా * అనే ఒక చెవిటామె, తన ముగ్గురు పిల్లలతోపాటు మరో చెవిటాయనతో కలిసి జీవించడం ప్రారంభించిన తర్వాత సంజ్ఞా భాషను నేర్చుకోవడం మొదలుపెట్టింది. చెవిటివారైన కొంతమంది సాక్షులు ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఈవాను, ఆమె స్నేహితుడ్ని కలిసి రాజ్యమందిరంలో కూటానికి హాజరవమని ఆహ్వానించారు. అది ఏదో సాంఘిక కార్యక్రమం అనుకొని దానికి హాజరవడానికి వారు అంగీకరించారు.

ఈవాకు సంజ్ఞా భాష అంత బాగా రాదు కాబట్టి కూటంలో చెప్పబడినది ఆమెకు అంతగా అర్థం కాలేదు. ఆ తర్వాత కొంతమంది సాక్షులు వారిని ఫలహారం తినడానికి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రోషుర్‌లోని చిత్రాలను చూపిస్తూ వారు, భవిష్యత్‌ భూపరదైసు గురించిన దేవుని వాగ్దానం గురించి వివరించారు. ఈవాకు తాను నేర్చుకొన్న సమాచారం నచ్చింది, ఆమె కూటాలకు క్రమంగా హాజరవడం ప్రారంభించింది.

ఆ తర్వాత కొద్దికాలానికే, బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడానికి ఈవా తన స్నేహితుడిని వదిలేసింది. తన కుటుంబం నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆమె ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడంలో కొనసాగి 1955లో బాప్తిస్మం తీసుకుంది. ఆరు నెలల తర్వాత ఈవా పయినీరుగా లేక పూర్తికాల రాజ్య ప్రచారకురాలిగా సేవచేయడం ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె నలుగురు చెవిటివారు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేసింది.

కార్లోస్‌ జన్మతః చెవిటివాడు. బాల్యం నుండి ఆయన మాదకద్రవ్యాలకు, అనైతికతకు, దొంగతనాలకు బానిసైపోయాడు. ప్రతిపక్ష ముఠా సభ్యుల బెదిరింపులకు భయపడి ఆయన సావో పౌలోకు పారిపోయి అక్కడ జ్వాన్‌తో కొంతకాలం నివసించాడు. జ్వాన్‌ కూడా కార్లోస్‌లాగే చెవిటివాడు, ఆయన కూడా అనైతిక జీవితాన్నే గడిపేవాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత కార్లోస్‌ రాజ్య సందేశాన్ని తెలుసుకున్నాడు, దానితో ఆయన తన జీవితాన్ని బైబిలుకు అనుగుణంగా మార్చుకొని తన వివాహాన్ని చట్టబద్ధం చేసుకున్నాడు. లేఖనాధారంగా అర్హుడైన తర్వాత కార్లోస్‌ యెహోవాకు తాను చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాడు. అదే సమయంలో కార్లోస్‌కు తెలియకుండా జ్వాన్‌ కూడా సువార్తను తెలుసుకున్నాడు, ఆయన కూడా తన జీవితంలో గొప్ప మార్పులు చేసుకున్నాడు. మతపరమైన ప్రతిమలు ఉపయోగించడాన్ని యెహోవా అంగీకరించడని తెలుసుకున్న తర్వాత జ్వాన్‌ తాను సమకూర్చుకున్న “పరిశుద్ధుల” ప్రతిమలను పారేశాడు. జ్వాన్‌ తన పాత జీవిత విధానాన్ని వదిలేసి ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడు.

కార్లోస్‌, జ్వాన్‌ రాజ్యమందిరంలో ఒకరినొకరు కలుసుకొని తమ తమ జీవితాల్లో తాము చేసుకున్న మార్పులను బట్టి ఎంతో సంతోషించారు! ప్రస్తుతం వారిద్దరు బాధ్యతగల కుటుంబ శిరస్సులు, అత్యంత ఆసక్తిగల రాజ్య ప్రచారకులు.

బ్రెజిల్‌లో ప్రస్తుతం 30 సంజ్ఞా భాషా సంఘాలు, 154 గుంపులున్నాయి, వాటిలో ఉన్న 2,500 మంది ప్రచారకులలో 1,500 మంది చెవిటివారే. బ్రెజిల్‌లో 2001వ సంవత్సరంలో చెవిటివారి కోసం నిర్వహించబడిన “దేవుని వాక్యాన్ని బోధించేవారు” జిల్లా సమావేశాలకు 3,000 కంటే ఎక్కువమంది హాజరయ్యారు, 36 మంది బాప్తిస్మం తీసుకున్నారు. యెహోవా ఆశీర్వాదంతో, ఇంకా ఎంతోమంది చెవిటివారు రాజ్య సందేశాన్ని అంగీకరిస్తారని ఆశిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 4 పేర్లు మార్చబడ్డాయి.