కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యెషయా 30:⁠20వ వచనం, యెహోవా ఎదురుగా ఉన్నట్లు “నీవు కన్నులార నీ మహోపదేశకుణ్ణి చూచెదవు” అని చెబుతుండగా, 21వ వచనం ఆయన మాటలు “వెనుకనుండి” వస్తున్నట్లు ఎందుకు చెబుతోంది?

యెషయా 30:20, 21 వచనాల్లో ఇలా చదువుతాం: “ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు [“మహోపదేశకుడు,” NW] దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను [“మహోపదేశకుణ్ణి,” NW] చూచెదవు మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను​—⁠ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.”

ఈ వచనాలను అక్షరార్థంగా తీసుకుంటే, వాటిని చదివే వ్యక్తి తన ఎదురుగా మహోపదేశకుడైన యెహోవాను చూస్తాడు కానీ ఆయన స్వరం వెనుకనుండి వింటాడు. అయితే ఆ మాటలు సూచనార్థకమైనవి కాబట్టి వాటిని సూచనార్థకంగానే అర్థం చేసుకోవాలి.

20వ వచనంలోని మాటలు, ఒక సేవకుడు తన యజమాని చెప్పే సూచనల ప్రకారం ఆయనను సేవించడానికి సంసిద్ధంగా ఉన్న దృశ్యాన్ని మనకు జ్ఞప్తికి తెస్తాయి. తన యజమాని చిత్తాన్ని తెలిపే సూచనను గ్రహించేందుకు ఆయన చేతిని జాగ్రత్తగా గమనించే ఒక సేవకుడిలా, యెహోవా ప్రజలు తమ అవధానాన్ని యెహోవా తన భూసంస్థ ద్వారా క్రమంగా ఇస్తున్న బైబిలు ఆధారిత సూచనలపై కేంద్రీకరిస్తారు. (కీర్తన 123:​1, 2) అవును “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా యెహోవా ఏమి సూచించినప్పటికీ వాళ్ళు దాని గురించి అప్రమత్తంగా ఉంటూ ఆయన నిర్దేశించినదాని ప్రకారం చర్యలు తీసుకుంటారు.​—⁠మత్తయి 24:​45-47.

మరి ఆయన సేవకులు వెనుకనుండి వింటారనే మాట దేన్ని సూచిస్తోంది? వెనుకనుండి వచ్చే స్వరం గతంలో దేవుడు మాట్లాడిన మాటలని, ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ మనకు అర్థమయ్యేలా చేస్తున్న తన లిఖిత వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడని భావించడం సహేతుకమే. (లూకా 12:​42) దేవుని ఆధునిక దిన సేవకులు బాగా కష్టపడి బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, ‘నమ్మకమైన గృహనిర్వాహకుడైన’ “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” సిద్ధం చేస్తున్న ప్రచురణల సహాయంతో దాని సూత్రాలను తమ జీవితంలో అన్వయించుకోవడం ద్వారా ఆయన స్వరాన్ని వింటారు. ఆ మహోపదేశకుడు సమయోచితంగా ఇచ్చే నిర్దేశం కోసం ఎదురు చూడడం ద్వారా, దాని విషయంలో అప్రమత్తంగా ఉండడం ద్వారా, శతాబ్దాల క్రితం వ్రాయబడిన దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆయన సేవకులు సూచనార్థకంగా ఆయనను తమ కన్నులారా చూస్తారు, వెనుకనుండి ఆయన స్వరాన్ని వింటారు.​—⁠రోమీయులు 15:⁠4.