కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరించాలి?

ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరించాలి?

ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరించాలి?

“నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని.”​—⁠1 కొరింథీయులు 11:​23.

యెహోవా అద్వితీయ కుమారుడు అక్కడున్నాడు. ‘ఆయన శోధనలలో ఆయనతో కూడ నిలిచి యున్న’ 11 మంది కూడా అక్కడున్నారు. (లూకా 22:​28) అది సా.శ. 33వ సంవత్సరం, మార్చి 31, గురువారం రాత్రి. యెరూషలేము పైన నీలాంబరంలో నిండు చంద్రుడు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాడు. యేసుక్రీస్తు, ఆయన అపొస్తలులు ఇప్పుడే పస్కా పండగ వేడుకను ముగించారు. నమ్మకద్రోహి అయిన యూదా ఇస్కరియోతు బయటకు పంపించబడ్డాడు, కానీ మిగతా వాళ్ళు వెళ్ళిపోవలసిన సమయం కాదది. ఎందుకు? ఎందుకంటే యేసు ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైనదొకటి చేయనున్నాడు. ఏమిటది?

2 సువార్త రచయిత మత్తయి అక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఆయననే చెప్పనిద్దాం. ఆయనిలా వ్రాశాడు: “యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి​—⁠మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి​—⁠దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.” (మత్తయి 26:​26-28) ఆ సంఘటన ఒకేసారి జరిగిందా? దాని భావమేమిటి? అది నేడు మనకేమైనా భావాన్ని కలిగివుందా?

“దీనిని చేయు[డి]”

3 యేసుక్రీస్తు సా.శ. 33, నీసాను 14 రాత్రి తీసుకున్న చర్య, ఆయన జీవితంలో కేవలం యాదృచ్ఛికంగా జరిగిన చర్య కాదు. అపొస్తలుడైన పౌలు కొరింథులోని అభిషిక్త క్రైస్తవులకు వ్రాస్తున్నప్పుడు దాని గురించి చర్చించాడు, అక్కడ ఆ ఆచరణ 20 ఏండ్ల తర్వాత కూడా ఇంకా పాటించబడుతోంది. పౌలు సా.శ. 33లో యేసు మరియు 11 మంది అపొస్తలులతో లేకున్నా, ఆ సందర్భంలో ఏమి జరిగిందన్నది ఆయన తప్పకుండా కొందరు అపొస్తలుల ద్వారానే తెలుసుకున్నాడు. అంతేకాదు పౌలు ప్రేరేపిత దివ్యజ్ఞానం ద్వారా ఆ సంఘటన గురించిన వివరాల ధ్రువీకరణ పొందాడని రుజువవుతోంది. పౌలు ఇలా అన్నాడు: “నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి​—⁠యిది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని​—⁠యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.”​—⁠1 కొరింథీయులు 11:​23-25.

4 “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయు[డి]” అని యేసు ఆజ్ఞాపించాడని సువార్త రచయిత లూకా ధృవీకరిస్తున్నాడు. (లూకా 22:​19) ఈ మాటలు “నన్ను స్మృతికి తెచ్చుకోవడానికి ఇది చెయ్యండి” (టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌), “నా జ్ఞాపకార్థం యిది చెయ్యండి” (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అని కూడా అనువదించబడ్డాయి. వాస్తవానికి ఈ ఆచరణ తరచూ యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణగానే సూచించబడుతుంది. పౌలు దీన్ని “ప్రభువు రాత్రి భోజనము” అని కూడా అంటున్నాడు, ఇది రాత్రిపూట ప్రారంభించబడింది కాబట్టి ఆ పేరు సముచితమైనదే. (1 కొరింథీయులు 11:​20) ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించాలని క్రైస్తవులకు ఆజ్ఞాపించబడింది. ఇంతకూ ఈ ఆచరణ ఎందుకు ప్రారంభించబడింది?

ఇది ఎందుకు ప్రారంభించబడింది?

5 ఈ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించబడడానికి గల ఒక కారణంలో యేసు మరణం ద్వారా సాధ్యం చేయబడిన ఒక సంకల్పం ఉంది. ఆయన తన పరలోకపు తండ్రి సర్వాధిపత్యాన్ని ఉన్నతపరిచేవాడిగా మరణించాడు. క్రీస్తు ఆ విధంగా, మానవులు కేవలం స్వలాభాపేక్షలతోనే దేవుణ్ణి ఆరాధిస్తారని తప్పుగా ఆరోపించిన అపవాదియైన సాతానును అబద్ధికుడిగా రుజువు చేశాడు. (యోబు 2:​1-5) యేసు విశ్వసనీయునిగా మరణించడం, ఈ ఆరోపణ తప్పని రుజువుచేసి యెహోవా హృదయాన్ని సంతోషపరచింది.​—⁠సామెతలు 27:11.

6 ప్రభువు రాత్రి భోజనపు ఆచరణ ప్రారంభించడానికి మరొక కారణం ఏమిటంటే యేసు పరిపూర్ణుడైన, పాపరహిత మానవునిగా మరణించడం ద్వారా ‘తన ప్రాణాన్ని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఇచ్చాడు’ అని మనకు జ్ఞాపకం చేయడానికే. (మత్తయి 20:​28) మొదటి మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, అతడు పరిపూర్ణ మానవ జీవితాన్ని, దాని ఉత్తరాపేక్షలన్నింటినీ కోల్పోయాడు. అయినా యేసు ఇలా అన్నాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:​16) నిజమే “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” (రోమీయులు 6:​23) ప్రభువు రాత్రి భోజనపు ఆచరణ, యేసు బలి మరణానికి సంబంధించి యెహోవా ఆయన కుమారుడు చూపించిన గొప్ప ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రేమకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో కదా!

దీన్ని ఎప్పుడు ఆచరించాలి?

7 ప్రభువు రాత్రి భోజనం గురించి పౌలు ఇలా చెప్పాడు: “మీరు ఎంత తరచుగా ఈ రొట్టెను తిని, యీ పాత్ర లోనిది త్రాగుతారో ప్రభువు వచ్చేంతవరకు అంత తరచుగా ఆయన మరణాన్ని ప్రచురిస్తారు.” (1 కొరింథీయులు 11:​26, NW) అభిషిక్త క్రైస్తవుల్లోని ప్రతి ఒక్కరూ తాము చనిపోయేంత వరకు జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకుంటారు. ఆ విధంగా వారు యేసు విమోచన క్రయధన బలి ద్వారా దేవుడు చేసిన ఏర్పాటుపై తమ విశ్వాసాన్ని యెహోవా ఎదుట, లోకం ఎదుట మళ్ళీ మళ్ళీ ప్రకటిస్తారు.

8 అభిషిక్త క్రైస్తవులు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను ఎప్పటి వరకు ఆచరిస్తారు? “ప్రభువు వచ్చేంతవరకు” అని పౌలు చెప్పాడు, దానర్థం యేసు తన “ప్రత్యక్షత” కాలంలో తన అభిషిక్త అనుచరులను పునరుత్థానం చేసి పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చేంతవరకు అలా ఆచరిస్తూనే ఉండాలన్నది సుస్పష్టం. (1 థెస్సలొనీకయులు 4:​14-17, NW) యేసు విశ్వసనీయులైన తన 11 మంది అపొస్తలులతో అన్న మాటలకు అది అనుగుణంగా ఉంది: “నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.”​—⁠యోహాను 14:⁠3.

9 యేసు జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించినప్పుడు ఆయన పాత్రలోని ద్రాక్షారసాన్ని సూచించి తన అపొస్తలులతో ఇలా అన్నాడు: “నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా[ను].” (మార్కు 14:​25) యేసు పరలోకములో అక్షరార్థంగా ద్రాక్షారసము తాగడు కాబట్టి, కొన్నిసార్లు ద్రాక్షారసము ద్వారా సూచించబడే సంతోషం గురించి మాట్లాడుతున్నాడన్నది స్పష్టం. (కీర్తన 104:​15; ప్రసంగి 10:​19) రాజ్యంలో కలిసి ఉండడమనేది సంతోషకరమైన అనుభవం, దానికోసం ఆయనా ఆయన అడుగుజాడల్లో నడుచుకొన్న అనుచరులూ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.​—⁠రోమీయులు 8:23; 2 కొరింథీయులు 5:2.

10 యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడమనేది నెలకు ఒకసారా, వారానికి ఒకసారా లేక ప్రతి రోజా? ఏదీ కాదు. యేసు ప్రభువు రాత్రి భోజనాన్ని ప్రారంభించిందీ ఆయన మరణించిందీ పస్కా పండుగరోజే, అది ఇశ్రాయేలీయులు సా.శ.పూ. 1513లో ఐగుప్తు దాసత్వం నుండి పొందిన విడుదలకు “జ్ఞాపకార్థం[గా]” ఆచరించబడే రోజు. (నిర్గమకాండము 12:​14) పస్కా పండుగ, యూదుల నీసాను నెలలో 14వ తేదీన సంవత్సరానికి ఒక్కసారే జరుపుకోబడేది. (నిర్గమకాండము 12:​1-6; లేవీయకాండము 23:⁠5) వారు పస్కా పండుగను ఎంత తరచుగా జ్ఞాపకం చేసుకునేవారో అంత తరచుగా మాత్రమే యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని అది సూచిస్తోంది, అంటే నెలకు ఒకసారో వారానికి ఒకసారో ప్రతీ రోజో కాక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆచరించాలి.

11 అలాగైతే జ్ఞాపకార్థ ఆచరణను ప్రతి సంవత్సరం నీసాను 14న ఆచరించడమే సబబు. ఒక గ్రంథం ఇలా చెబుతోంది: “ఆసియా మైనరులోని క్రైస్తవులు ఎల్లప్పుడూ నీసాను 14న పాస్కా [ప్రభువు రాత్రి భోజనం] వేడుక చేసుకునే అలవాటును బట్టి క్వార్టోడెసిమన్స్‌ [‘పద్నాల్గవ దినాన్ని ఆచరించేవారు’] అని పిలువబడ్డారు. ఆ తేదీ శుక్రవారమే రావచ్చు లేక వారంలోని ఏ రోజైనా రావచ్చు.”​—⁠ద న్యూ షఫర్‌సోక్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రెలీజియస్‌ నాలెడ్జ్‌, వాల్యూమ్‌ IV, 44వ పేజీ.

12 క్వార్టోడెసిమన్స్‌ “క్రీస్తు మాదిరిని అనుసరించడాన్ని ధర్మశాస్త్ర విధిని ఆచరించడమని భావించేవారు” గనుకనే వారు జ్ఞాపకార్థ ఆచరణను నీసాను 14న చేసుకునేవారని, సా.శ. రెండవ శతాబ్దంలోని అలవాటు గురించి వ్యాఖ్యానిస్తూ జె. ఎల్‌. వోన్‌ మోషేయిమ్‌ అనే చరిత్రకారుడు అంటున్నాడు. మరొక చరిత్రకారుడు ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ఆసియాలోని క్వార్టోడెసిమన్స్‌ చర్చీల్లో ఆచరించబడేవి ఎల్లప్పుడూ యెరూషలేములోని చర్చిలోలాగే ఉండేవి. 2వ శతాబ్దంలో ఈ చర్చీలు పాస్కా దినమైన నీసాను 14న క్రీస్తు మరణం ద్వారా అమలులోకి వచ్చిన విమోచనను జ్ఞాపకం చేసుకున్నారు.”​—⁠స్టడియ పట్రిస్టిక, వాల్యూమ్‌ V, 1962, 8వ పేజీ.

రొట్టె ప్రాధాన్యత

13 యేసు జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించినప్పుడు “యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, [అపొస్తలులకిచ్చాడు].” (మార్కు 14:​22) ఆ సందర్భంలో అందుబాటులో ఉన్న రొట్టె, పస్కా పండుగ కోసం ఉపయోగించబడే రొట్టె వంటిదే. (నిర్గమకాండము 13:6-10) అది పులియని పిండితో చేసిన రొట్టె కాబట్టి సన్నగా, పెళుసుగా ఉండి పంచడానికి దాన్ని విరువవలసి వచ్చేది. యేసు వేలమంది కోసం అద్భుతమైన రీతిలో రొట్టెలను అధికం చేసినప్పుడు అవి కూడా పెళుసుగా ఉన్నాయి, ఎందుకంటే పంచిపెట్టగలిగేలా ఆయన వాటిని విరిచాడు. (మత్తయి 14:​19; 15:​36) దీన్నిబట్టి జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె విరిచే చర్యకు ఎలాంటి విశేష భావం లేదని తెలుస్తోంది.

14 జ్ఞాపకార్థ ఆచరణ ప్రారంభించేటప్పుడు ఉపయోగించబడిన రొట్టె గురించి యేసు “యిది మీకొరకైన నా శరీరము” అని అన్నాడు. (1 కొరింథీయులు 11:​24; మార్కు 14:​22) ఆ రొట్టె పులియని పిండితో చేసింది కాబట్టి అది తగినదే. ఎందుకు? ఎందుకంటే పులిసిన పిండి చెడుతనాన్ని, దుష్టత్వాన్ని, పాపాన్ని సూచిస్తుంది. (1 కొరింథీయులు 5:​6-8) పులియని పిండితో చేసిన రొట్టె యేసు పరిపూర్ణమైన, పాపరహితమైన మానవ శరీరానికి ప్రతిరూపంగా ఉంది, అది యుక్తంగానే విమోచన క్రయధన బలిగా అర్పించబడింది. (హెబ్రీయులు 7:​26; 10:​5-10) యెహోవాసాక్షులు దీన్ని దృష్టిలో ఉంచుకొని జ్ఞాపకార్థ ఆచరణలో పులియని రొట్టెను ఉపయోగించడం ద్వారా, యేసు మాదిరినే అనుసరిస్తారు. కొన్ని సందర్భాల్లో వారు ఉల్లిపాయలు, గుడ్లు వంటి అదనపు పదార్థాలు లేకుండా పస్కా పండగ సమయాల్లో యూదులు ఉపయోగించే పలచని పులియని రొట్టెలను ఉపయోగిస్తారు. లేదా ఏమీ కలపని పిండి (లభ్యమైతే గోధుమ పిండి) తీసుకొని దాంట్లో కాసిన్ని నీళ్లు కలిపి పులియని రొట్టెలను చేయవచ్చు. పిండిని పలుచగా వత్తి కొద్దిగా నూనె పూసి మూకుడుపైన తడిలేకుండా, పెళుసుగా అయ్యేంతవరకు కాల్చవచ్చు.

ద్రాక్షారసం ప్రాధాన్యత

15 పులియని రొట్టెను అందించిన తర్వాత, యేసు గిన్నె పట్టుకొని “కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి [అపొస్తలుల] కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. . . . ఇది నిబంధన విషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము” అని తెలియజేశాడు. (మార్కు 14:​23, 24) ఆ గిన్నెలో ఏముంది? పులియబెట్టిన ద్రాక్షారసము ఉంది, పులియబెట్టని తాజా ద్రాక్ష పళ్ళరసం కాదు. లేఖనాలు ద్రాక్షారసము గురించి ప్రస్తావించినప్పుడు దానర్థం పులియబెట్టని తాజా ద్రాక్ష పళ్ళరసం అని కాదు. ఉదాహరణకు యేసు చెప్పినట్లుగా, “పాత తిత్తు[లు]” పిగిలిపోయేలా చేసేది పులియబెట్టిన ద్రాక్షారసమే గానీ తాజా ద్రాక్ష పళ్ళరసం కాదు. వివాహ విందులో యేసు అద్భుతరీతిలో నీటిని మంచి ద్రాక్షారసముగా మార్చినప్పుడు, విందు ప్రధాని ఇలా అన్నాడు: “ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నా[వు].” (మత్తయి 9:​17; యోహాను 2:10) పస్కా పండగ ఆచరించేటప్పుడు ద్రాక్షారసము త్రాగేవారు కాబట్టి క్రీస్తు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించేటప్పుడు దాన్ని ఉపయోగించాడు.

16 గిన్నెలో ఉన్నది యేసు చిందించిన రక్తాన్ని సూచిస్తుంది, దానికి ప్రతిరూపంగా ఎర్ర ద్రాక్షారసము మాత్రమే సరైన చిహ్నం. “ఇది నిబంధన విషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము” అని స్వయంగా ఆయనే అన్నాడు. అపొస్తలుడైన పేతురు, “పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు [అభిషిక్త క్రైస్తవులు] విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా” అని వ్రాశాడు.​—⁠1 పేతురు 1:​18, 19.

17 యేసు జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించినప్పుడు ఎర్ర ద్రాక్షారసాన్నే ఉపయోగించాడనడంలో సందేహం లేదు. అయితే నేడు లభించే ఎర్ర ద్రాక్షారసాల్లో కొన్ని ఆమోదకరమైనవి కావు, ఎందుకంటే వాటిలో మద్యము, బ్రాందీ లేదా ఓషధులు, మసాలా దినుసులు కలిపి ఘాటుగా ఉండేలా తయారు చేస్తారు. యేసు రక్తం విమోచన క్రయధనం చెల్లించడానికి సంపూర్ణంగా తగినది, దానిలో వేరే ఏదీ కలపాల్సిన అవసరం లేదు. కాబట్టి అలా అదనపు పదార్థాలు కలిపి చేసే పోర్ట్‌, షెర్రీ, వెర్‌మావుత్‌ వంటివి తగినవి కావు. జ్ఞాపకార్థ ఆచరణ గిన్నెలో తియ్యదనమూ ఘాటూ లేని ఎర్ర ద్రాక్షారసము ఉండాలి. ఇంట్లో తయారు చేసే తియ్యదనంలేని ఎర్ర ద్రాక్షారసము ఉపయోగించవచ్చు, ఎర్ర బర్గండీ, క్లారెట్‌ వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు.

18 యేసు ఈ భోజనాన్ని ప్రారంభిస్తున్నప్పుడు చిహ్నాలను తన అక్షరార్థ శరీరంగా, రక్తంగా మార్చే అద్భుతం వంటిదేమీ చేయలేదు. మనుష్య మాంసం తినడం, రక్తం తాగడం నరభక్షణ అవుతుంది, దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లు అవుతుంది. (ఆదికాండము 9:​3, 4; లేవీయకాండము 17:​10) యేసు ఆ రాత్రి తన సంపూర్ణ శరీరంతో, తన పూర్తి రక్తంతో ఉన్నాడు. ఆయన శరీరం పరిపూర్ణమైన బలిగా అర్పించబడింది, యూదుల దినమైన నీసాను 14వ తేదీన​—⁠మరుసటి మధ్యాహ్నం​—⁠ఆయన రక్తం చిందించబడింది. కాబట్టి జ్ఞాపకార్థపు రొట్టె, ద్రాక్షారసము సూచనార్థకమైనవి, అవి క్రీస్తు శరీరానికి రక్తానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. *

జ్ఞాపకార్థ ఆచరణ​—⁠ఒక సహవాస భోజనం

19 యేసు జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించినప్పుడు ఆయన తన నమ్మకస్థులైన అపొస్తలులను ఒకే గిన్నెలోనుండి తాగమన్నాడు. మత్తయి సువార్త ఇలా చెబుతోంది: “[యేసు] గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి​—⁠దీనిలోనిది మీరందరు త్రాగుడి.” (మత్తయి 26:​27) చాలా గిన్నెలు కాకుండా కేవలం ఒకే “గిన్నె” ఉపయోగించడం ద్వారా ఎటువంటి సమస్యా రాలేదు, ఆ సందర్భంలో కేవలం 11 మందే ఉన్నారు కాబట్టి బహుశా ఒకే బల్ల దగ్గర ఉండి ఆ గిన్నెను ఒకరి నుండి ఒకరికి సులభంగా అందించుకొని ఉండవచ్చు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రభువు రాత్రి భోజనం కోసం యెహోవాసాక్షుల 94,000 సంఘాల్లో లక్షలాది మంది సమకూడతారు. ఈ ఆచరణ కోసం ఒకే రాత్రి సమావేశమయ్యే అందరికీ కేవలం ఒకే గిన్నె ఉపయోగించే అవకాశం లేదు. పెద్ద పెద్ద సంఘాల్లో అవి ప్రేక్షకులందరికీ సముచితమైన సమయంలో అందించబడేందుకని, ఒకటి కంటే ఎక్కువ గిన్నెలను ఉపయోగిస్తూ ఆ గిన్నెలు యేసు బలి రక్తాన్ని సూచిస్తున్నాయనే సూత్రాన్ని పాటిస్తారు. అదే విధంగా రొట్టె కోసం ఒకటి కంటే ఎక్కువ పళ్ళెములను ఉపయోగించవచ్చు. గిన్నె లేక గ్లాసు ఫలానా ఆకృతిలో ఉండాలని లేఖనాల్లో సూచించబడలేదు. అయితే గిన్నె, పళ్ళెము సందర్భానికి తగిన విధంగా గౌరవప్రదంగా ఉండాలి. గ్లాసులో నింపే ద్రాక్షారసము అది అందించేటప్పుడు ఒలికిపోయేంత నిండుగా నింపకుండా ఉండడం మంచిది.

20 రొట్టె ఉన్న పళ్ళాలు, ద్రాక్షారసము ఉన్న గ్లాసులు ఒకటి కంటే ఎక్కువ ఉపయోగించబడినప్పటికీ, జ్ఞాపకార్థ ఆచరణ మాత్రం ఒకే సహవాస భోజనం. ప్రాచీన ఇశ్రాయేలులో ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధస్థలముకు ఒక జంతువును తీసుకువచ్చి అక్కడ దాన్ని వధించడం ద్వారా సహవాస భోజనాన్ని అర్పించేవాడు. ఆ జంతువులోని కొంత భాగం బలిపీఠంపైన కాల్చబడేది, ఒక భాగం విధి నిర్వహణలో ఉన్న యాజకుడికి, మరొక భాగం యాజకత్వంలోనున్న అహరోను కుమారులకు ఇవ్వబడేది, వారితోపాటు అర్పించే వ్యక్తి ఆయన కుటుంబసభ్యులు కూడా ఆ భోజనంలో పాలు పుచ్చుకునేవారు. (లేవీయకాండము 3:​1-16; 7:​28-36) * కాబట్టి జ్ఞాపకార్థ ఆచరణ కూడా ఒక సహవాస భోజనం వంటిదే, ఎందుకంటే దాంట్లో కూడా కలిసి పాలు పుచ్చుకోవడం ఉంది.

21 సహవాస భోజనంలో ఈ ఏర్పాటుకు మూలకర్తగా యెహోవా కూడా పాలు పుచ్చుకుంటాడు. అర్పించబడిన బలిగా యేసు, కలిసి పాలు పుచ్చుకునే సహవాసులుగా అభిషిక్త క్రైస్తవులు చిహ్నాలను తీసుకుంటారు. యెహోవా బల్ల వద్ద కలిసి తినడం అనేది అందులో పాల్గొంటున్నవారు ఆయనతో సమాధానంగా ఉండడాన్ని సూచిస్తుంది. అందుకు తగినవిధంగానే పౌలు ఇలా వ్రాశాడు: “మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయేగదా?​—⁠మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా? మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.”​—⁠1 కొరింథీయులు 10:​16, 17.

22 యెహోవాసాక్షుల్లో కేవలం ప్రభువు రాత్రి భోజనం మాత్రమే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే మతపరమైన ఆచరణ. ఇది సబబైనదే, ఎందుకంటే “నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయు[డి]” అని యేసు తన అనుచరులను ఆజ్ఞాపించాడు. జ్ఞాపకార్థ ఆచరణలో మనం యెహోవా సర్వాధిపత్యాన్ని ఉన్నతపరచిన యేసు మరణాన్ని స్మరణకు తెచ్చుకుంటాం. మనం గమనించినట్లుగా ఈ సహవాస భోజనంలోని రొట్టె క్రీస్తు బలిగా అర్పించిన మానవ శరీరాన్ని, ద్రాక్షారసము ఆయన చిందించిన రక్తాన్ని సూచిస్తాయి. అయినా ఈ సూచనార్థక రొట్టె, ద్రాక్షారసాలను చాలా తక్కువమంది తీసుకుంటారు. ఎందుకలా? వాటిని తీసుకోని లక్షలాది మందికి ఈ జ్ఞాపకార్థ ఆచరణకు నిజమైన భావమేమైనా ఉందా? వాస్తవానికి ఈ ప్రభువు రాత్రి భోజనం మీకు ఏ భావాన్ని కలిగివుండాలి?

[అధస్సూచీలు]

^ పేరా 25 యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) 2వ సంపుటిలోని 271వ పేజీ చూడండి.

^ పేరా 28 ప్రాథమిక హీబ్రూ భాషలోని “సహవాస బలి” అనే పదబంధం తెలుగు బైబిలులో “సమాధానబలి” అని అనువదించబడింది.

మీ జవాబులేమిటి?

• ప్రభువు రాత్రి భోజనాన్ని యేసు ఎందుకు ప్రారంభించాడు?

• జ్ఞాపకార్థ ఆచరణను ఎంత తరచుగా చెయ్యాలి?

• జ్ఞాపకార్థ ఆచరణలోని పులియని రొట్టె ప్రాధాన్యత ఏమిటి?

• జ్ఞాపకార్థ ఆచరణలోని ద్రాక్షారసము దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. సా.శ. 33లో పస్కా పండగరోజు రాత్రి యేసు ఏమి చేశాడు?

3. యేసు సా.శ. 33, నీసాను 14 రాత్రి చేసినది ఎందుకు విశేషమైనది?

4. క్రైస్తవులు ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరించాలి?

5, 6. (ఎ) యేసు జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించడానికి గల ఒక కారణం ఏమిటి? (బి) ప్రభువు రాత్రి భోజనపు ఆచరణను ప్రారంభించడానికి గల మరో కారణాన్ని చెప్పండి.

7. అభిషిక్త క్రైస్తవులు జ్ఞాపకార్థ ఆచరణలో “తరచుగా” ఎలా పాల్గొంటారు?

8. అభిషిక్త క్రైస్తవులు ప్రభువు రాత్రి భోజనాన్ని ఎంత కాలం ఆచరించాలి?

9. మార్కు 14:⁠25వ వచనంలో నమోదైన యేసు మాటలకు అర్థమేమిటి?

10. జ్ఞాపకార్థ ఆచరణను ఎంత తరచుగా చెయ్యాలి?

11, 12. జ్ఞాపకార్థ ఆచరణ తొలి స్మారకోత్సవాల గురించి చరిత్ర ఏమి తెలియజేస్తోంది?

13. ప్రభువు రాత్రి భోజనాన్ని ప్రారంభించేటప్పుడు యేసు ఎలాంటి రొట్టెను ఉపయోగించాడు?

14. (ఎ) జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె పులియనిదై ఉండడం ఎందుకు సముచితం? (బి) ప్రభువు రాత్రి భోజనానికి ఉపయోగించేందుకు ఎలాంటి రొట్టెను తీసుకురావచ్చు లేక చేయవచ్చు?

15. క్రీస్తు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించినప్పుడు ఉపయోగించిన గిన్నెలో ఏముంది?

16, 17. జ్ఞాపకార్థ ఆచరణకు ఎలాంటి ద్రాక్షారసము తగినది, ఎందుకు?

18. యేసు జ్ఞాపకార్థపు రొట్టె, ద్రాక్షారసము విషయంలో అద్భుతం ఎందుకు చేయలేదు?

19. ప్రభువు రాత్రి భోజనపు ఆచరణలో ఒకటి కంటే ఎక్కువ పళ్ళాలు, గ్లాసులు ఎందుకు ఉపయోగించవచ్చు?

20, 21. జ్ఞాపకార్థ ఆచరణ ఒక సహవాస భోజనమని ఎందుకు చెప్పవచ్చు?

22. జ్ఞాపకార్థ ఆచరణ గురించిన ఏ ప్రశ్నలను మనం పరిశీలించవలసి ఉంది?

[15వ పేజీలోని చిత్రం]

ప్రభువు రాత్రి భోజనాన్ని యేసు ప్రారంభించాడు