కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లల హృదయాల్ని అవకాశానికి వదిలేయకండి!

మీ పిల్లల హృదయాల్ని అవకాశానికి వదిలేయకండి!

మీ పిల్లల హృదయాల్ని అవకాశానికి వదిలేయకండి!

నిపుణుడైన కుమ్మరి చేతుల్లో, విలువలేని మట్టిముద్ద అందమైన పాత్రగా రూపాంతరం చెందగలదు. అలాంటి నైపుణ్యం చాలా కొద్దిమంది పనివారికి మాత్రమే ఉంటుంది. సహస్రాబ్దాలుగా సమాజం కప్పులు, ప్లేట్లు, వంటపాత్రలు, జాడీలు, అలంకరణ వస్తువుల కోసం కుమ్మరివాళ్ళపై ఆధారపడింది.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లల గుణాన్ని, వ్యక్తిత్వాన్ని చక్కగా తీర్చిదిద్దడం ద్వారా సమాజానికి ఎనలేని మేలు చేయవచ్చు. బైబిలు మనలో ప్రతి ఒక్కరినీ జిగటమంటితో పోలుస్తోంది, తమ పిల్లలనే “జిగటమంటి”ని మలిచే ప్రాముఖ్యమైన పనిని దేవుడు తల్లిదండ్రులకు అప్పగించాడు. (యోబు 33:6; ఆదికాండము 18:​19) అందమైన మట్టిపాత్రను రూపుదిద్దినట్లే పిల్లలను బాధ్యతాయుతులైన, సమతుల్యతగల పెద్దవారిగా తీర్చిదిద్దడం అంత సులభమైన పని కాదు. అలాంటి రూపాంతరం కేవలం యాదృచ్ఛికంగా జరగదు.

మన పిల్లల హృదయాలను మలిచే శక్తులు ఎన్నో పనిచేస్తున్నాయి. విచారకరంగా, ఈ శక్తుల్లో కొన్ని నాశనకరమైనవి. కాబట్టి వివేకవంతులైన తల్లిదండ్రులు పిల్లల హృదయాల్ని అవకాశానికి వదిలేసే బదులు, పిల్లలు ‘పెద్దవారైనప్పుడు దానినుండి తొలగిపోరు’ అనే నమ్మకంతో వాళ్ళు “నడువవలసిన త్రోవను” గూర్చి వాళ్ళకు తర్ఫీదునిస్తారు.​—⁠సామెతలు 22:⁠6.

పిల్లల్ని పెంచడమనే సుదీర్ఘమైన ఉత్తేజభరితమైన కార్యక్రమంలో, పిల్లల హృదయాల్ని భయపెట్టే ప్రతికూల ప్రభావాలను దూరంగా తరిమేయడానికి వివేకవంతులైన క్రైస్తవ తల్లిదండ్రులు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. వారు పిల్లలకు “క్రైస్తవ పెంపకానికి సంబంధించిన ఉపదేశాన్ని, దిద్దుబాటును” ఇస్తూ ఓపికతో పెంచుతుండగా వారి ప్రేమ సంపూర్ణంగా పరీక్షించబడుతుంది. (ఎఫెసీయులు 6:​4, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) తల్లిదండ్రులు ఈ పనిని ఎంత త్వరగా ప్రారంభిస్తే అది వారికి అంత సులభంగా ఉంటుంది.

త్వరగా ప్రారంభించడం

ఏదైనా రూపంలోకి మలచగలిగేంత మెత్తగా, అదే సమయంలో మలిచి రూపుదిద్దాక ఆ రూపాన్ని అలాగే కాపాడుకోగలిగేంత దృఢంగా ఉన్న బంకమట్టిని ఉపయోగించడానికే కుమ్మరివాళ్ళు ఇష్టపడతారు. బంకమట్టిని శుద్ధీకరించిన తర్వాత, వారు దాన్ని ఆరు నెలల లోపలే ఉపయోగించాలనుకుంటారు. అదే విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల హృదయాల్ని మలచడం ప్రారంభించడానికి సరైన సమయం, వారి హృదయం విషయాలను శీఘ్రంగా గ్రహించగల స్థితిలోనూ సులభంగా మలచబడే స్థితిలోనూ ఉన్నప్పుడే.

ఎనిమిది నెలల వయస్సుకల్లా, పిల్లలు తమ స్వభాషా శబ్దాలను గుర్తించగలుగుతారని, తల్లిదండ్రులతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటారని, గ్రహణ నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటారని, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడం మొదలు పెడతారని పిల్లల నిపుణులు చెబుతున్నారు. వాళ్ళ హృదయాన్ని మలచడం ప్రారంభించడానికి శ్రేష్ఠమైన సమయం వాళ్ళు చిన్నవయస్సులో ఉన్నప్పుడే. తిమోతి వలే మీ పిల్లలు “పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి” తెలుసుకోగలిగితే వాళ్ళకెంత ప్రయోజనం చేకూరుతుందో కదా!​—⁠2 తిమోతి 3:​14, 15. *

పసిపిల్లలు సహజంగానే తమ తల్లిదండ్రులను అనుకరిస్తారు. శబ్దాలను, పదాలను, కదలికలను అనుకరించడమే గాక వారు తమ తల్లిదండ్రులు ప్రేమ, దయ, కనికరం వంటి లక్షణాలు ప్రదర్శించడాన్ని చూసినప్పుడు వాటిని కూడా నేర్చుకుంటారు. మనం మన పిల్లలకు యెహోవా కట్టడల ప్రకారం తర్ఫీదివ్వాలనుకుంటే, దేవుని ఆజ్ఞలు మొట్టమొదట మన హృదయాల్లో ఉండాలి. దేవుని కట్టడల పట్ల ఉన్న అలాంటి ఎనలేని కృతజ్ఞత, తల్లిదండ్రులు తమ పిల్లలతో యెహోవా గురించి ఆయన వాక్యం గురించి క్రమంగా మాట్లాడేలా వారిని కదిలిస్తుంది. “నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను” అని బైబిలు ఉద్బోధిస్తోంది. (ద్వితీయోపదేశకాండము 6:​6, 7) తమ చిన్న పిల్లలిద్దరి విషయంలో తాము దీన్ని ఎలా చేస్తున్నారో ఫ్రాన్సిస్‌కో, రోసా వివరిస్తున్నారు. *

“అనుదిన సంభాషణలతో పాటు, మేము మా పిల్లల్లో ఒకొక్కరితో ప్రతి రోజు కనీసం 15 నిమిషాలైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తాము. మేమేదైనా సమస్యను గుర్తించినప్పుడు మరింత సమయాన్ని వెచ్చిస్తాము​—⁠సమస్యలు నిజంగానే తలెత్తుతుంటాయి. ఉదాహరణకు, ఇటీవల ఐదేళ్ళ మా అబ్బాయి స్కూలు నుండి ఇంటికి వచ్చి, తాను యెహోవాను విశ్వసించడం లేదని చెప్పాడు. వాడి క్లాస్‌మేట్లలో ఒకరు వాడిని హేళన చేసి, దేవుడు లేడని అన్నట్లు మాకు తెలిసింది.”

పిల్లలు తమ సృష్టికర్తలో విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవలసి ఉందని ఆ తల్లిదండ్రులు గ్రహించారు. దేవుని సృష్టిపట్ల వారికి సహజంగా ఉండే ఆకర్షణ ఆధారంగా అలాంటి విశ్వాసాన్ని వృద్ధి చేయవచ్చు. ఏదైనా జంతువును ముట్టుకోవాలని, అడవి పువ్వులు కోసుకోవాలని, సముద్ర తీరాన ఇసుకలో ఆడుకోవాలని పిల్లలు ఎంత ఇష్టపడతారో కదా! సృష్టికి సృష్టికర్తకు మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించడానికి తల్లిదండ్రులు వారికి సహాయం చేయవచ్చు. (కీర్తన 100:3; 104:​24, 25) యెహోవా సృష్టిపట్ల వారు పెంపొందించుకునే భయంతో కూడిన భక్తిభావం, గౌరవం వారి మిగతా జీవితమంతటిలోనూ అలాగే ఉండిపోవచ్చు. (కీర్తన 111:​2, 10) పిల్లలు అలాంటి గ్రహింపుతోపాటు దేవుడ్ని ప్రీతిపర్చాలనే కోరికను, ఆయనకు అప్రీతికరమైనది చేయకూడదనే భయాన్ని వృద్ధిచేసుకుంటారు. ఇది, ‘చెడుతనమునుండి తొలగిపోయేలా’ వాళ్ళను పురికొల్పుతుంది.​—⁠సామెతలు 16:⁠6.

చాలామంది చిన్న పిల్లలు ఎంతో కుతూహలం కలిగివుండి త్వరగా నేర్చుకోగలిగినప్పటికీ విధేయత చూపించడం వారికంత సులభం కాకపోవచ్చు. (కీర్తన 51:⁠5) కొన్నిసార్లు వారు తామనుకున్నది సాధించుకోవాలనీ అంతా తాము కోరుకున్నట్లే జరగాలనీ పట్టుబడుతుండవచ్చు. ఈ లక్షణాలు బలంగా నాటుకుపోకుండా నిరోధించాలంటే తల్లిదండ్రులకు దృఢత్వం, సహనం, క్రమశిక్షణ అవసరం. (ఎఫెసీయులు 6:⁠4) ఐదుగురు పిల్లల్ని విజయవంతంగా పెంచి పెద్దచేసిన ఫిల్లీస్‌, పాల్‌ అదే చేశారు.

ఫిల్లీస్‌ ఇలా గుర్తు చేసుకుంటోంది: “ప్రతి బిడ్డ వ్యక్తిత్వమూ ఎంతో భిన్నంగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు తమదే నెగ్గాలనేవారు. అప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉండేది, అయినా చివరికి వాళ్ళు మేము ‘కుదరదు’ అన్నప్పుడు దాన్ని అంగీకరించడం నేర్చుకున్నారు.” ఆమె భర్తయైన పాల్‌ ఇలా అంటున్నాడు: “వాళ్ళకు అర్థం చేసుకునేంత వయస్సు ఉన్నప్పుడు, మేము తీసుకున్న నిర్ణయాలకు కారణమేమిటో తరచూ మేము వాళ్ళకు వివరించేవాళ్ళము. మేము ఎల్లప్పుడూ దయగానే వ్యవహరించడానికి ప్రయత్నించినప్పటికీ దేవుడు మాకిచ్చిన అధికారాన్ని గౌరవించడం వాళ్ళకు నేర్పించాము.”

పిల్లల తొలి సంవత్సరాలు వాళ్ళకు సమస్యలను తీసుకు రావచ్చు, అయితే పరిపక్వతకు ఎదగని హృదయం అనేక కొత్త సమస్యలను ఎదుర్కొనే యౌవన సంవత్సరాల్లో అసలైన సవాలు తలెత్తుతుందని చాలామంది తల్లిదండ్రులు గ్రహిస్తారు.

యౌవనస్థుల హృదయాల్ని చేరడం

బంకమట్టి ఎండిపోక ముందే కుమ్మరి దాన్ని మలచడం ప్రారంభించాలి. తనకు మరింత సమయం కావాలనుకుంటే అతడు మట్టిని తడిగా, మలచదగినదిగా ఉంచుకునేందుకు దానికి నీళ్ళు కలుపుతుండవచ్చు. అదే విధంగా తల్లిదండ్రులు యౌవనస్థులైన తమ పిల్లల హృదయం మొండిగా తయారుకాకుండా చూడడానికి తీవ్రంగా కృషి చేయాలి. అయితే వారు ఉపయోగించవలసిన ప్రాథమిక ఉపకరణం బైబిలే, దానితో వారు ‘ఉపదేశించవచ్చు, ఖండించవచ్చు, ప్రతి సత్కార్యానికి వాళ్ళను పూర్ణముగా సిద్ధం చేయవచ్చు.’​—⁠2 తిమోతి 3:​14-17.

అయితే యౌవనస్థులు, తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల నడిపింపును స్వీకరించినంత సులభంగా ఇప్పుడు స్వీకరించకపోవచ్చు. యౌవనస్థులు తమ తోటివారు చెప్పేవాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించవచ్చు, కాబట్టి ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా తమ తల్లిదండ్రులతో సంభాషించడాన్ని వారు తగ్గించవచ్చు. తల్లిదండ్రుల, పిల్లల పాత్రలు క్రొత్త దశలోకి ప్రవేశిస్తుండగా అది మరింత సహనం, నైపుణ్యం చూపించవలసిన సమయమై ఉంటుంది. యౌవనస్థులు తమలో జరుగుతున్న శారీరక, భావోద్వేగ మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకోవాలి. వాళ్ళు తమ మిగతా జీవితాన్నంతటినీ ప్రభావితం చేయగల నిర్ణయాలను తీసుకోవడం, లక్ష్యాలను ఏర్పరచుకోవడం ప్రారంభించాలి. (2 తిమోతి 2:​22) కష్టభరితమైన ఈ సమయమంతటిలోనూ వాళ్ళు తమ హృదయంపై నాశనకరమైన ప్రభావాన్ని చూపగల ఒక శక్తితో వ్యవహరించవలసి ఉంటుంది, అదే తోటివారి ఒత్తిడి.

అలాంటి ఒత్తిడి, ఎప్పుడో గానీ సులభంగా గుర్తించగలిగే ఒక్క సంఘటనలో బయటపడదు. సాధారణంగా అది, బలహీనపరిచే అనేక వ్యాఖ్యానాల్లో లేదా సందర్భాల్లో వ్యక్తపర్చబడుతుంది. ఇవి చాలామందికి బలహీనతగా ఉండేదానిపై, అంటే ఇతర యౌవనస్థులచే తాము నిరాకరించబడతామేమోనని వారిలో అంతర్గతంగావుండే భయంపై దాడి చేస్తాయి. యౌవనస్థులు తమకు తాము ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుకోవడమనే లక్షణంతో పోరాడుతూ ఇతరులచే అంగీకరించబడాలనే కోరికతో, ఇతర యౌవనస్థులు సమర్థించే “లోకములో ఉన్నవాటి[ని]” ఆమోదించడం ప్రారంభించవచ్చు.​—⁠1 యోహాను 2:15-17; రోమీయులు 12:⁠2.

విషయాలను మరింత క్లిష్టం చేస్తూ అపరిపూర్ణ హృదయపు సహజ కోరికలు తమ తోటివారి ప్రభావాన్ని మరింత అధికం చేయవచ్చు. “సంతోషించు,” “నీకిష్టం వచ్చినట్లు చెయ్యి” వంటి మాటలు చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు. మారియ తన అనుభవాన్ని ఇలా గుర్తుతెచ్చుకుంటోంది: “పర్యవసానాలు ఎలా ఉన్నప్పటికీ అన్ని ఆనందాలనూ పొందే హక్కు యౌవనస్థులకు ఉందని విశ్వసించే నాతోటి యౌవనస్థులు చెప్పినదాన్ని నేను విన్నాను. స్కూల్లోని నా స్నేహితులు చేసిందే నేను కూడా చేయాలనే కోరికతో నేను చాలా గంభీరమైన సమస్యలో దాదాపు చిక్కుకుపోయాను.” యౌవనస్థులైన మీ పిల్లలు అలాంటి ఒత్తిడిని అధిగమించడానికి సహాయం చేయాలని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటుండవచ్చు, అయితే మీరెలా సహాయం చేయవచ్చు?

మీరు వాళ్ళ గురించి శ్రద్ధ కలిగివున్నారని మీ మాటల ద్వారా, చర్యల ద్వారా వాళ్ళకు హామీ ఇవ్వండి. విషయాల గురించి వాళ్ళెలా భావిస్తున్నారనేది తెలుసుకోవడానికి కృషి చేయండి, వాళ్ళ సమస్యల్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి, ఆ సమస్యలు మీరు పాఠశాలలో ఎదుర్కొన్న సమస్యల కన్నా ఎంతో కష్టతరమైనవై ఉండవచ్చు. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మీ పిల్లలు మిమ్మల్ని తాము నమ్మదగిన వ్యక్తిగా దృష్టించాలి. (సామెతలు 20:⁠5) వాళ్ళ శరీర కదలికలు వ్యక్తం చేస్తున్న భావాలను బట్టి లేదా వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళు బాధపడుతున్నారా లేక అయోమయంలో ఉన్నారా అన్నది మీరు గమనించవచ్చు. వాళ్ళు చేస్తున్న నిశ్శబ్ద రోదనకు ప్రతిస్పందించి, వారికి ‘ఆదరణనివ్వండి.’​—⁠కొలొస్సయులు 2:⁠1.

అయితే సరైనదాని విషయంలో స్థిరంగా ఉండడం ప్రాముఖ్యమే. తమకు, తమ పిల్లలకు మధ్య అప్పుడప్పుడు ఇష్టాయిష్టాలకు సంబంధించిన పోరాటం జరుగుతున్నట్లు తల్లిదండ్రులకు అనిపించవచ్చు, కానీ తల్లిదండ్రులు తమ నిర్ణయానికి సరైన ఆధారం ఉన్నప్పుడు వెనుకాడనవసరం లేదు. మరో వైపున, ప్రేమపూర్వక క్రమశిక్షణనివ్వాలో వద్దో, ఒకవేళ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలో నిర్ణయించుకునే ముందు పరిస్థితి మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చూసుకోండి.​—⁠సామెతలు 18:​13.

సంఘం నుండి కూడా సమస్యలు తలెత్తవచ్చు

మట్టిపాత్ర పూర్తిగా సిద్ధమైనట్లు కనిపించవచ్చు, కానీ దాన్ని కొలిమిలో కాల్చకపోతే అది ఏ విధమైన ద్రవాలను పోయడానికి రూపొందించబడిందో వాటినే పోసినా పాడైపోవచ్చు. శ్రమలను, కష్టాలను బైబిలు అలాంటి కాల్చే ప్రక్రియతో పోలుస్తోంది, ఎందుకంటే మనం నిజంగా ఎలాంటి వ్యక్తులమో అవే చూపిస్తాయి. అయితే బైబిలు మన విశ్వాసానికి సంబంధించిన శ్రమల గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నప్పటికీ ఇతర శ్రమలకు కూడా అది వర్తిస్తుంది. (యాకోబు 1:​2-4) ఆశ్చర్యకరంగా, యౌవనస్థులు ఎదుర్కొనే కొన్ని కష్టతరమైన శ్రమలు సంఘం నుండే రావచ్చు.

యౌవనస్థులైన మీ పిల్లలు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగానే ఉన్నట్లు మీకు కనిపించినా, లోపల వాళ్ళు విభాగిత హృదయంతో పోరాడుతుండవచ్చు. (1 రాజులు 18:​21) ఉదాహరణకు, మగన్‌ రాజ్యమందిరానికి వస్తున్న ఇతర యౌవనస్థుల లోకసంబంధమైన తలంపులను ఎదుర్కోవలసి వచ్చింది:

“క్రైస్తవత్వమంటే బోరుకొట్టేదనీ ఆనందంగా ఉండడానికి అవాంతరమనీ భావించే యౌవనస్థుల ప్రభావానికి నేను గురయ్యాను. వారిలా చెప్పేవారు: ‘నాకు 18 ఏళ్ళు రాగానే సత్యం వదిలి వెళ్ళిపోతాను,’ లేదా ‘నేను సత్యాన్ని వదిలి వెళ్ళాలని ఎంతో ఎదురు చూస్తున్నాను.’ ఇలాంటి ధోరణికి విరుద్ధమైన భావాలను వ్యక్తంచేసే యౌవనస్థులను పరిశుద్ధులని పిలుస్తూ వారిని తమతో చేర్చుకునేవారు కాదు.”

చెడు దృక్పథం గలవారు ఒకరో ఇద్దరో ఉన్నా చాలు మిగతా అందరినీ పాడు చేయడానికి. ఒక గుంపులోని వ్యక్తులు సాధారణంగా ఎక్కువమంది ఏది చేస్తే అదే చేస్తారు. మూర్ఖత్వం, మొండిధైర్యం జ్ఞానాన్నీ సభ్యతనూ అణచివేస్తుండవచ్చు. క్రైస్తవ యౌవనస్థులు ఒక గుంపును అనుసరించినందుకు సమస్యల్లో చిక్కుకున్న అనేక దుఃఖకరమైన సంఘటనలు అనేక దేశాల్లో జరిగాయి.

యౌవనస్థులు ఆనందకరమైన సహవాసాన్ని కొంతమేరకు అనుభవించవలసిన అవసరత ఉందన్నది నిజమే. తల్లిదండ్రులుగా మీరు దాన్ని ఎలా అందజేయవచ్చు? వారి వినోదం గురించి గంభీరంగా ఆలోచించండి, కుటుంబమంతా కలిసి లేదా పెద్దవారూ పిల్లలూ ఉన్న గుంపుతో కలిసి చేసేలా ఆసక్తికరమైన కార్యకలాపాల గురించి పథకం వేయండి. మీ పిల్లల స్నేహితులతో పరిచయం ఏర్పరచుకోండి. వాళ్ళను భోజనానికి పిలవండి, లేదా వారితో ఒక సాయంకాలం గడపండి. (రోమీయులు 12:​13) మీ పిల్లలు ఏదైనా సంగీత వాయిద్యాన్నో మరో భాషనో ఏదైనా కళనో నేర్చుకోవడమనే ఆరోగ్యవంతమైన కార్యక్రమాన్ని చేపట్టేలా వాళ్ళను ప్రోత్సహించండి. చాలామేరకు వాళ్ళు ఆ పనిని ఇంట్లోని సురక్షితమైన వాతావరణంలోనే చేయగలుగుతారు.

విద్యాభ్యాసం కాపుదలనివ్వగలదు

యౌవనస్థుల విద్యాభ్యాసం వాళ్ళు వినోదానికి కేవలం అవసరమైనంత ప్రాముఖ్యతనే ఇవ్వడానికి కూడా సహాయం చేయగలదు. ఒక పెద్ద పాఠశాలలో 20 సంవత్సరాలపాటు కార్య నిర్వాహకురాలిగా ఉన్న లోలీ ఇలా చెబుతోంది: “చాలామంది యువ సాక్షులు విద్యాభ్యాసం చేయడం నేను చూశాను. చాలామంది తమ ప్రవర్తన విషయంలో ప్రశంసార్హులుగా ఉండేవారు గానీ కొందరు ఇతర విద్యార్థుల నుండి ఏమాత్రం భిన్నంగా ఉండేవారు కాదు. మంచి మాదిరిగా ఉన్నవారు ఎప్పుడూ తమ చదువులో ఆసక్తి కనబరిచినవారే. తమ పిల్లల విద్యాభివృద్ధిలో చురుగ్గా ఆసక్తి చూపించమని, వారి ఉపాధ్యాయుల గురించి తెలుసుకోమని, మంచి పేరు ప్రాముఖ్యమైనదని తమ పిల్లల్ని ఒప్పించమని నేను తల్లిదండ్రులకు గట్టిగా చెబుతాను. నిజమే కొందరు చాలా బాగా చదువుకుంటారు, అయితే సంతృప్తికరమైన ఒక స్థాయికి చేరుకుని తమ ఉపాధ్యాయుల గౌరవాన్ని సంపాదించుకోవడం మాత్రం అందరికీ సాధ్యమే.”

అలాంటి విద్యాభ్యాసం యౌవనస్థులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించడానికి కూడా దోహదపడుతుంది. అది వాళ్ళకు మంచి అధ్యయన అలవాట్లను, మానసిక క్రమశిక్షణను, బాధ్యతాయుతంగా ఉండడాన్ని బోధించగలదు. చక్కగా చదివే సామర్థ్యం, తలంపులను గ్రహించే సామర్థ్యం, వాళ్ళు దేవుని వాక్య విద్యార్థులుగా, బోధకులుగా శ్రేష్ఠమైనవారిగా ఉండడానికి వాళ్ళను నిస్సందేహంగా ప్రోత్సహిస్తుంది. (నెహెమ్యా 8:⁠8) హోమ్‌వర్క్‌ చేసుకోవడం, ఆధ్యాత్మిక అధ్యయనాలు చేయడం వినోదాన్ని సరైన స్థానంలో ఉంచడానికి వాళ్ళకు సహాయం చేయగలవు.

మీకు, యెహోవాకు ఘనత కలగడానికి కారణం

ప్రాచీన గ్రీస్‌లో అనేక పూల కుండీల మీద కుమ్మరి సంతకం, దాన్ని అలంకరించిన వ్యక్తి సంతకం ఉండేవి. అదేవిధంగా, కుటుంబంలో కూడా పిల్లలను మలిచేవారు సాధారణంగా ఇద్దరుంటారు. తల్లి, తండ్రి ఇద్దరూ పిల్లల హృదయాన్ని మలచడంలో భాగం వహిస్తారు, అలంకారికంగా చెప్పాలంటే మీ పిల్లలపై మీ ఇద్దరి “సంతకాలు” ఉంటాయి. విజయవంతమైన కుమ్మరిలా, మరియు/లేదా దాన్ని అలంకరించిన వ్యక్తిలా మీరు యౌవనస్థులను విలువైన, సుందరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి చేసిన పనిని బట్టి గర్వించవచ్చు.​—⁠సామెతలు 23:​24, 25.

ఈ ఘనమైన పని విజయం ఎక్కువమేరకు, మీరు మీ పిల్లల హృదయాల్ని ఎంత మేరకు మలిచారనేదానిపై ఆధారపడి ఉంటుంది. “వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు” అని మీరు చెప్పగలరని ఆశిస్తున్నాము. (కీర్తన 37:​31) పిల్లల హృదయాలు అవకాశానికి వదిలేయలేనంత ప్రాముఖ్యమైనవి.

[అధస్సూచీలు]

^ పేరా 8 కొంతమంది తల్లిదండ్రులు తమ పసిబిడ్డలకు బైబిలు చదివి వినిపిస్తారు. ఉపశమింపజేసే స్వరం, ఆనందకరమైన ఈ అనుభవం, పిల్లల్లో తమ మిగతా జీవితమంతటిలో చదవడం పట్ల ఇష్టాన్ని పెంపొందింపజేయవచ్చు.

^ పేరా 9 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.