కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శరణార్థి శిబిరంలో జీవితం

శరణార్థి శిబిరంలో జీవితం

శరణార్థి శిబిరంలో జీవితం

“శ రణార్థి శిబిరం” అనే మాట వినగానే మీ మనస్సులో ఏమి మెదులుతుంది? మీరెప్పుడైనా దాన్ని సందర్శించారా? అదెలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?

ఇది వ్రాసే సమయానికి, టాంజానియాకు పడమటి భాగంలో 13 వేర్వేరు శరణార్థి శిబిరాలు స్థాపించబడ్డాయి. అంతర్యుద్ధాల వల్ల చెల్లాచెదురై, ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 5,00,000 మంది శరణార్థులకు, శరణార్థుల ఐక్యరాజ్య సమితి ఉన్నత కమీషనర్‌ (UNHCR) సహకారంతో టాంజానియా ప్రభుత్వం సహాయం అందించింది. శిబిరంలో జీవితం ఎలా ఉంటుంది?

శిబిరాన్ని చేరుకోవడం

కాండీడ అనే ఒక యౌవనురాలు తన కుటుంబంతో పాటు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి చేరుకున్నప్పుడు ఏమి జరిగిందో ఇలా చెబుతోంది: “వారు మాకొక గుర్తింపు నంబరున్న రేషన్‌ కార్డు ఇచ్చి మమ్మల్ని నీయరుగుసు శరణార్థి శిబిరానికి పంపించారు. మాకక్కడ ప్లాటు నంబరు వీధి నంబరు ఇచ్చారు. అక్కడ మేము ఒక చిన్న సొంత ఇల్లు కట్టుకోవడానికి కావలసిన చెట్లను గడ్డిని ఎక్కడ నుండి కొట్టుకొని తెచ్చుకోవాలో మాకు చూపించారు. మేము మట్టి ఇటుకలను తయారుచేసుకున్నాం. UNHCR వాళ్ళు పైకప్పు మీద పరవడానికి ప్లాస్టిక్‌ షీటు ఇచ్చారు. అది చాలా కష్టమైన పని, అయినా మాకంటూ ఒక చిన్న ఇల్లు తయారయ్యేసరికి మేము ఆనందించాం.”

రేషన్‌ కార్డును ప్రతీ రెండవ బుధవారం ఉపయోగించేవాళ్ళం. “క్యాంటిన్‌ దగ్గర UNHCR వాళ్ళు పంచే ప్రాథమిక ఆహారపదార్థాల కోసం మేము వరుసగా నిలబడేవాళ్ళం” అని కూడా కాండీడ చెప్పింది.

ఒక వ్యక్తికి ప్రతిదినం లభించే ఆహారం ఏమిటి?

“మాలో ప్రతి ఒక్కరికీ దాదాపు 3 కప్పుల మక్కపిండి, ఒక కప్పు బటాణీలు, 20 గ్రాముల సోయా చిక్కుళ్ళ పిండి, 2 చెంచాల వంటనూనె, 10 గ్రాముల ఉప్పు. అప్పుడప్పుడు ఒక సబ్బు కూడా లభిస్తుంది, అది ఒక నెలపాటు వస్తుంది.”

పరిశుభ్రమైన నీటి సంగతి ఏమిటి? నీళ్ళు దొరుకుతాయా? రీజీకీ అనే ఒక యౌవనురాలు ఇలా చెబుతోంది: “దగ్గర్లో ఉన్న నదుల నుండి పైపుల ద్వారా పెద్ద పెద్ద రిజర్వాయర్లలో నీటిని సమకూరుస్తారు. ఆ నీళ్ళను ప్రతీ శిబిరంలో ఉన్న అనేక నీళ్ళ కుళాయిల్లోకి వదిలేముందు క్లోరైన్‌ కలుపుతారు. అయినా మేము అనారోగ్యానికి గురవకుండా ఉండేందుకు ఆ నీటిని తాగే ముందు కాగబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ కుళాయిల దగ్గర నీళ్ళు పట్టుకోవడం, బట్టలు ఉతుక్కోవడంతోనే తరచూ మా దినమంతా గడిచిపోతుంది. అంతా చేస్తే మాకు రోజుకు కేవలం ఒకటిన్నర బకెట్టు నీళ్ళు మాత్రమే దొరుకుతాయి.”

మీరు ఏదైనా ఒక శిబిరానికి వెళ్ళినట్లయితే అక్కడ శిశు మందిరాలు, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు చూడవచ్చు. కొన్నిచోట్ల వయోజన విద్య ఉండడం కూడా మీరు చూడవచ్చు. రక్షణ భద్రతల కోసం శిబిరం బయటే ఒక పోలీసు స్టేషను, ఒక ప్రభుత్వ కార్యాలయము ఉంటాయి. చిన్న చిన్న దుకాణాలతో కూడిన ఒక పెద్ద మార్కెట్టు కూడా ఉంటుంది, అక్కడ శరణార్థులకు కూరగాయలు, పండ్లు, చేపలు, కోళ్ళతో సహా ఇతర ప్రాథమిక ఆహారపదార్థాలు లభిస్తాయి. స్థానిక నివాసులు కొందరు వ్యాపారం చేయడానికి ఆ మార్కెట్టుకు వస్తారు. ఇంతకూ శరణార్థులు ఏదైనా కొనుక్కోవాలంటే వారికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? కొంతమంది ఒక చిన్న తోటలో కూరగాయలు పండించి వాటిని మార్కెట్టులో అమ్ముకుంటారు. మరికొందరు తమకు దొరికే పిండి లేదా బటాణీలలో కొంత అమ్ముకుంటారు, కాస్త మాంసం లేదా పండ్లు కొనుక్కోవడానికి వాళ్ళలా చేస్తారు. అవును ఒక శిబిరం, శిబిరంలా కాకుండా ఒక పెద్ద గ్రామంలా కనబడుతుండవచ్చు. మార్కెట్టు దగ్గర కొందరు తమ స్వదేశంలో ఉన్నట్లే హాయిగా నవ్వుతూ కనబడడం సర్వసాధారణం.

మీరొక ఆసుపత్రి దగ్గర ఆగినట్లయితే, శిబిరంలో సాధారణ చికిత్స కోసం కొన్ని చికిత్సా కేంద్రాలు ఉన్నాయనీ అత్యవసర లేదా తీవ్రమైన కేసులను ఆసుపత్రికి పంపిస్తారనీ అక్కడి డాక్టర్లలో ఒకరు మీతో చెబుతుండవచ్చు. ప్రసూతి విభాగం, ప్రసవ గది ఆసుపత్రిలో ముఖ్యమైనవనడం సహేతుకమే. 48,000 మంది శరణార్థులుండే ఒక శిబిరంలో నెలకు దాదాపు 250 జననాలు చోటుచేసుకుంటుండవచ్చు.

ఆధ్యాత్మికంగా మంచి పోషణ

విశ్వవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు టాంజానియాలోని తమ ఆధ్యాత్మిక సహోదరుల గురించి తెలుసుకోవాలని ఆత్రపడుతుండవచ్చు. అక్కడ దాదాపు 1,200 మంది సహోదర సహోదరీలు, 14 సంఘాలుగా, 3 గుంపులుగా వ్యవస్థీకరించబడి ఉన్నారు. వారక్కడ ఎలా ఉంటున్నారు?

ఈ సమర్పిత క్రైస్తవులు చేసిన పనులలో మొదటిది ఏమిటంటే వాళ్ళు ఆ శిబిరాలకు చేరుకోగానే రాజ్యమందిరం కట్టుకోవడానికి తమకొక స్థలమిమ్మని అడగడం. ఇది శరణార్థి ప్రజలు యెహోవాసాక్షులను కలుసుకోవడానికీ వారి కూటాలకు హాజరుకావడానికీ వీలయ్యేలా చేస్తుంది. లుగుఫు శిబిరంలో మొత్తం 659 మంది చురుకైన క్రైస్తవులుగల 7 సంఘాలున్నాయి. ఆదివారపు కూటాల్లో ఈ 7 సంఘాల్లో దాదాపు 1,700 మంది హాజరవుతారు.

అన్ని శిబిరాల్లోని సాక్షులు పెద్ద పెద్ద క్రైస్తవ సమావేశాల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. లుగుఫు శిబిరంలో మొదటిసారి జిల్లా సమావేశం జరిగినప్పుడు 2,363 మంది హాజరయ్యారు. సమావేశ స్థలం బయటే బాప్తిస్మం కోసం సాక్షులు ఒక నీటి మడుగును నిర్మించారు. భూమిలో ఒక గొయ్యి తవ్వి దాంట్లో నీరు నిలిచి ఉండేందుకు దాని లోపల చుట్టూ ప్లాస్టిక్‌ షీటు అమర్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరానున్న ఒక నది నుండి సహోదరులు సైకిళ్ళ మీద నీళ్ళు తెచ్చి దాన్ని నింపారు. ఒక ట్రిప్పుకు అయిదు గ్యాలన్ల చొప్పున చాలా ట్రిప్పులు వేయవలసి వచ్చింది. బాప్తిస్మం పొందేవారు బాప్తిస్మానికి అనుగుణమైన దుస్తులను ధరించి పంక్తులలో నిలబడ్డారు. మొత్తం 56 మంది నీటి బాప్తిస్మాన్ని పొందారు. సమావేశంలో ఒక పూర్తికాల సేవకునితో జరిపిన ఇంటర్వ్యూలో ఆయన తాను 40 మందితో బైబిలు అధ్యయనాలు నిర్వహించానని చెప్పాడు. ఆయన విద్యార్థుల్లో నలుగురు ఆ సమావేశంలో బాప్తిస్మం పొందారు.

యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం, ప్రయాణ పైవిచారణకర్తల ద్వారా క్రమంగా సందర్శనాలను ఏర్పాటు చేసింది. వారిలోని ఒక ప్రయాణ పైవిచారణకర్త ఇలా అన్నాడు: “మన సహోదరులకు పరిచర్యలో అత్యంతాసక్తి ఉంది. ప్రకటించడానికి వారికి చాలా పెద్ద క్షేత్రం ఉంది, ఒక సంఘంలో ప్రతి సాక్షి పరిచర్యలో నెలకు దాదాపు 34 గంటలు గడుపుతాడు. చాలామంది ఆసక్తిగలవారితో అయిదు లేక అంతకంటే ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. ఒక పయినీరు [పూర్తికాల సేవకురాలు] ఇంతకంటే మంచి క్షేత్రం ఇంకెక్కడా ఉండదని చెప్పింది. శిబిరాల్లోని ప్రజలు మన ప్రచురణలను బట్టి ఎంతో సంతోషిస్తారు.”

బైబిలు సాహిత్యం శిబిరాలకు ఎలా చేరుకుంటుంది? బ్రాంచి దాన్ని టాంగాన్యిక సరస్సు తీరానికి తూర్పునవున్న కిగోమా వరకు రైలు ద్వారా పంపిస్తుంది. అక్కడ సహోదరులు ప్రచురణలు అందుకొని ఆయా సంఘాలకు చేరవేసే ఏర్పాట్లు చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఒక ట్రక్కును కిరాయికి తీసుకొని తామే స్వయంగా ఆ సాహిత్యాలను అన్ని శిబిరాలకు చేరవేస్తారు. దీని కోసం, సరిగాలేని రోడ్లపై దాదాపు మూడు నాలుగు రోజులు ప్రయాణించవలసి ఉంటుంది.

భౌతిక సహాయం

ప్రత్యేకంగా ఫ్రాన్స్‌, బెల్జియం, స్విట్జర్లాండుల్లోని యెహోవాసాక్షులు ఈ శిబిరాల్లోని శరణార్థులకు సహాయం చేయడంలో తోడ్పడుతున్నారు. కొందరు హోంశాఖ నుండి, UNHCR నుండి అనుమతి తీసుకొని టాంజానియాలోని శిబిరాలను సందర్శించారు. యూరపులోని సాక్షులు టన్నుల కొలది సోయా చిక్కుడు పాలను, బట్టలను, బూట్లను, పాఠశాల పుస్తకాలను, సబ్బులను సమీకరించారు. ఈ వస్తువులన్నీ, “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అనే బైబిలు సూత్రానికి అనుగుణంగా శరణార్థులందరికీ పంపిణీ చేసేందుకు వారు విరాళంగా ఇచ్చారు.​—⁠గలతీయులు 6:10.

అనేకమంది శరణార్థుల సహాయార్థం చేయబడిన ఈ మానవసేవా ప్రయత్నాలు ఎన్నో సత్ఫలితాలను తీసుకువచ్చాయి. ఒక శిబిరంలోని శరణార్థుల కమ్యూనిటీ కమిటీ ఇలా కృతజ్ఞతను తెలియజేసింది: “మీ సంస్థ మూడుసార్లు చేసిన మానవ సేవా చర్యలకు మా కమ్యూనిటీ అంతటి తరఫున మేము కృతజ్ఞతలు తెలపడాన్ని గౌరవార్థంగా భావిస్తున్నాం. . . . మీరు పంపిన బట్టలు అవసరంలో ఉన్న 12,654 మంది స్త్రీపురుషులకు, శిశువులతో సహా పిల్లలకు కూడా బట్వాడా చేయబడ్డాయి. మూయోవోజీ శరణార్థి శిబిరంలో ప్రస్తుతం 37,000 మంది నివసిస్తున్నారు. మొత్తం 12,654 మందికి అంటే ఇక్కడి జనాభాలోని 34.2 శాతం మందికి సహాయం అందింది.”

మరొక శిబిరంలో 12,382 మంది శరణార్థులలో ప్రతి ఒక్కరికీ మూడు కట్టుబట్టలు ఇవ్వబడ్డాయి. మరొక శిబిరం శిశుమందిరాల్లో, ప్రాథమిక పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో ఉపయోగించబడేందుకు వేలాది పాఠశాల పుస్తకాలను అందుకుంది. ఒక ప్రాంతంలోని UNHCR గణాంకాల ఆఫీసరు ఒకాయన ఇలా వ్యాఖ్యానించాడు: “శరణార్థి శిబిరాల్లోని ప్రజల అనేక అవసరాలకు [సరిపడేన్ని] విరాళాలు అందుకున్నందుకు మేమెంతో కృతజ్ఞులం. ఇటీవలే అందుకున్న సరుకుల్లో 5 కంటైనర్ల పాఠశాల పుస్తకాలు ఉన్నాయి, వాటిని మా కమ్యూనిటీ శాఖలు శరణార్థులందరికీ పంపిణీ చేశాయి. . . . చాలా కృతజ్ఞతలు.”

అలా చేయబడిన సహాయంపై స్థానిక వార్తాపత్రికలు కూడా వ్యాఖ్యానించాయి. సండే న్యూస్‌ అనే పత్రికలో 2001, మే 20న ఒక పతాక శీర్షిక ఇలా ఉంది: “టాంజానియాలోని శరణార్థులకు బట్టలు వస్తున్నాయి.” దాని 2002, ఫిబ్రవరి 10వ తేదీ సంపాదకీయంలో ఇలా వ్యాఖ్యానించబడింది: “విరాళానికి శరణార్థి కమ్యూనిటీ కృతజ్ఞతగా ఉంది, ఎందుకంటే బట్టలు సరిగా లేవని పాఠశాలకు వెళ్ళడం మానేసిన కొందరు పిల్లలు ఇప్పుడు క్రమంగా తరగతులకు హాజరవుతున్నారు.”

నిర్బంధంలో ఉన్నప్పటికీ బయటపడే మార్గం లేకపోలేదు

అనేక మంది శరణార్థులకు శిబిరాల్లోని కొత్త జీవనశైలికి అలవాటు పడేందుకు కనీసం ఒక సంవత్సరం పడుతుంది. వాళ్ళు చాలా నిరాడంబరంగా జీవిస్తారు. ఈ శిబిరాల్లోని యెహోవాసాక్షులు తమ సమయాన్ని ఎక్కువగా, దేవుని వాక్యమైన బైబిలు నుండి ఓదార్పుకరమైన సువార్తను తమ పొరుగునున్న శరణార్థులతో పంచుకోవడంలోనే గడుపుతున్నారు. నూతన లోకంలో అందరూ “తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు, జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు” అని వారు చెబుతారు. అప్పుడు అందరూ “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవామాట యిచ్చియున్నాడు.” దేవుని ఆశీర్వాదాలతో ఈ లోకం శరణార్థి శిబిరాల్లేని లోకమవుతుందన్నది సుస్పష్టం.​—⁠మీకా 4:​3, 4; కీర్తన 46:⁠9.

[8వ పేజీలోని చిత్రం]

నుడుతా శిబిరంలోని ఇండ్లు

[10వ పేజీలోని చిత్రాలు]

లుకోలి రాజ్య మందిరం (కుడివైపు) లుగుఫులో బాప్తిస్మం (క్రింద)

[10వ పేజీలోని చిత్రం]

లుగుఫు శిబిరంలో జిల్లా సమావేశం